Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ జతలో..

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నీ జతలో..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ఒంటరితనం అంటే భయం ఆకాశ్‌కి!

దేన్నైతే తను ఇష్టపడడం లేదో దానికే దగ్గరవ్వాల్సిన దీన స్థితి అతడిది. భార్య దూరమవడం అతడిని మానసికంగా కృంగదీసింది. గతం గుర్తొస్తే ప్రపంచం లోని చీకటంతా తన ఒక్కడినే వేధిస్తుందా అన్నంత అసహనం దగ్గరవుతుంది. తప్పంతా తనదేనా? దోషి తనేనా? అవును రెండు చేతులు కలిస్తేనేగా శబ్దం అయ్యేది. మరలాంటప్పుడు తప్పంతా తనదే ఎలా అవుతుంది? లోకంలో తనలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురై ఉంటుందా? సిల్లీగా అనిపించినా జీర్ణించుకోలేని వాస్తవం తన జీవితం.

***

సన్నగా కురుస్తున్న వాన జల్లుల్లో తడుస్తూ నడుస్తున్నాడు ఆకాశ్. చుట్టూ అందంగా కదులుతున్న తూనీగలు, వర్షం వల్ల తడిచి పచ్చగా అందంగా మెరుస్తున్న పూల మొక్కలు, చెట్ల వైపు చూస్తూ ప్రకృతి అందాల్ని వీక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు.

అది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే సమయం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆఫీస్‌కి బస్ స్టాప్‌కి అరకిలోమీటరు దూరం. అతడి నయనాలు ఎవరి కోసమో అన్వేషిస్తున్నాయి.

రోజూ అదే వేళకు దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజ్ నుండి వచ్చే రమ్య కోసమే!

కొద్ది సేపట్లోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వస్తుంటే పరుగులాంటి నడకతో వేగంగా బస్ షెల్టర్ లోకి చేరాడు.

‘రమ్య ఇంకా రాలేదా?’ తనలో తనే ప్రశ్నించుకుంటుంటే.. అతడి నయనాల కు సంభ్రమాశ్చర్యాలను పరిచయం చేస్తున్నట్లుగా వచ్చింది రమ్య.

పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న తను తడవడంతో మరింత అందంగా ఆకర్షణీయంగా అగుపిస్తుంటే తనవైపు నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు.

ఆ బస్ స్టాప్‌లో ఎంతో మంది యువతీ యువకులు ఉన్నా అతడి చూపులు మాత్రం తనవైపే ఉంటాయెప్పుడు. రమ్య సైతం తనని ఆకాశ్ గమనించడం గ్రహిస్తున్నా.. ఈ తతంగం రెండు నెలలుగా సాగుతున్నా ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. అతడు మాట్లాడాలని ఏనాడు ప్రయత్నించలేదు.

ఆ రోజెందుకో అతడికి రమ్య తో మాట్లాడాలనిపించింది. కాస్త దగ్గరకి కదిలాడు. తన వైపు చూస్తున్న రమ్యని మరింత సమీపించాడు.

“మీ పేరు?”

నవ్వింది.

అతడు నవ్వాడు.

“మీ పేరు?” అడిగింది.. వీణలేవో మీటినట్లుగా ఆమె స్వరం.

“ఆకాశ్”

“నైస్ నేమ్”

మళ్ళీ తనే.. “రమ్య” అంటూ తన పేరు చెప్పి పరిచయ పూర్వకంగా చేయి ముందుకు చాపింది.

చేతులతో పాటు నయనాలు కలుసుకున్నాయి. అతడి హృదయం ఆనంద రాగాలు ఆలపిస్తుంటే..

“మీకు అభ్యంతరం లేకపోతే.. మీరేం చదువుతున్నరో.. చెబుతారా?”

ఆఫీసులో పదుల సంఖ్యలో ఉండే తోటి వారితో మాట్లడుతున్నప్పుడు కలగని బిడియం తనలో తొంగిచూడడం, తన స్వరం మృదుమధురంగా.. అతడికే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

“ఎంఎస్సీ మ్యాథ్స్”

“మీరేంటి జాబ్ చేస్తున్నారా?”

“హా.. కార్స్ షోరూంలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను”

“మరి కారు కొనుక్కోవచ్చుగా?”

నవ్వాడతను తన ప్రశ్న అమాయకంగా అనిపించింది.

తను పనిచేస్తున్న చోట కారు కొనాలంటే కనీసం యాభై లక్షలైనా కావాలి. తన జీతం గుర్తొచ్చి నవ్వొచ్చింది అతడికి. అతనెందుకు నవ్వుతున్నాడో అర్థం కాకపోయినా అతడితో కలిసి సన్నగా నవ్వింది. అందంగా విచ్చుకున్న తన పెదవుల వైపు, బుగ్గ పై ఎర్రగా కందినప్పుడు ఏర్పడిన సన్నని సొట్ట.. భలే ముద్దొస్తున్న తనవైపు తన్మయంగా చూస్తున్నాడతను.

ఇద్దరూ కలిసి కాఫీ షాప్ వైపు నడిచారు. జీవితంలో మొదటి సారి ఒక అమ్మాయితో కలిసి.. అదీ వర్షంలో ఒకే గొడుగు కింద.. గమ్మత్తుగా ఉందతనికి.

రమ్య సైతం అలాంటి అనుభవాన్నే చవిచూస్తుంది. జోరుగా కురుస్తున్న వర్షం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఇద్దరికి. కాఫీ షాప్‌లో కూర్చుని కబుర్లెన్నో చెప్పుకున్నారు.

ఓ గంట సమయం గడిచింది. ఒకరిని ఒకరు విడవలేక భారంగా కదిలారు.

***

ఆకాశ్ కుర్చీలో కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు. ఇంటి పెరట్లో ఉన్న మొక్కలు వర్షానికి తడుస్తూ అందంగా మెరుస్తుంటే.. అతని గుండెల్లో జ్ఞాపకాలేవో కదులుతున్నాయి.

‘రమ్య’ రూపం కళ్లముందు కదులుతుంది. తమ ఇద్దరి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ గుర్తొచ్చింది.

***

రమ్యతో తన వివాహం జరిగి అప్పటికే ఆరు నెలలు అవుతుంది. తను ఎం.ఎస్సీ. డిస్టెంక్షలో పాస్ అయింది. ఆ రోజు అతడు ఎంతో సంతోషపడ్డాడు. మరుసటి వారమే తనకు ఓ పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. శాలరీ తనకంటే రెట్టింపే.

“రమ్యా! జాబ్ ఇక్కడే అయితే బాగుంటుంది. మన హైదరాబాద్‍౬లో అయితే నాకు ఓకే. కానీ ఇప్పటికిప్పుడు బెంగళూరు అంటే ఎలా?”

“లేదండి. బెంగళూరు మనకు ఎంత దూరం చెప్పండి. అయినా ఓ సంవత్సరం అక్కడ జాబ్ చేస్తాను. తరువాత ఇక్కడ బ్రాంచ్‌కి మార్చుకుంటాను. లేదా ఎవరైనా బెంగళూరు మార్చుకునేవారు ఉంటే నేను ఇక్కడికి మార్చుకుంటాను.అదేం పెద్ద విషయం కాదు. మొదట జాబ్ ఎక్స్‌పీరియన్స్ వస్తే చాలు.తర్వాత ఇక్కడే ఇంకా మంచి జాబ్ వస్తుంది.”

ఆలోచిస్తున్నాడు అతడు.

“ఏమంటారు శ్రీవారు?” అడుగుతుంది తను.

“సరేలే..” అన్నాడతను.

“వాహ్..” అంటూ ప్రేమగా ముద్దిచ్చింది.

అలా అన్నాడే కానీ మనస్సులో చిన్నపాటి ఆందోళన.

రెండు రోజుల తర్వాత..

“నేను జాబ్ కి వెళ్లడం లేదు..”

“ఎందుకో..” అన్నాడు .

చెవిలో గుసగుసగా చెప్పింది..

“అలాగా..” అంటూ తనని ఎత్తుకోబోయాడు.. గాల్లో తిప్పబోయి.. ఆగాడు.

సూటిగా తన వైపు చూస్తూ.. ప్రేమగా.. “ఓహో..” అంటూ హాయిగా నవ్వుకున్నాడు.

వారం రోజుల తర్వాత హాస్పిటల్ కి వెళ్ళడం, తన ప్రెగ్నెన్సీ కన్ఫాం అవ్వడం జరిగింది. అప్పటి నుండి అతడు ఇంట్లోని పనులు తనకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తూ రమ్య మన్ననలు పొందాడు.

శ్రీకర్ పుట్టడం ఆ దంపతుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది.

వాడు పెరిగి పెద్దవుతుంటే.. తను జాబ్ కి వెళ్లి వస్తుంది. ఇంటి పనులు పిల్లవాడి బాధ్యతలు అమ్మ నాన్నలు చూస్తుంటే రెండు చేతులా సంపాదిస్తూ స్వంత అపార్ట్మెంట్ కొని గృహప్రవేశం చేశారు.

ఆ తరువాతే వచ్చింది అసలు చిక్కు..

తన కోరికను రమ్యకు చెప్పాడు ఆకాశ్. ససేమిరా అంది తను.

“మనమిప్పుడు సంతోషంగా ఉన్నాం కదా?”

“ప్లీజ్ ఈ ఒక్క మాట కాదనకు”

“కుదరదు”

రెండు రోజులుగా పలుక్కోలేదు ఇద్దరు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితాల్లో చిన్నపాటి ఘర్షణ. చిలికి చిలికి గాలివాన అయిన చందాన.

“ఇంకొకరు పుడితే.. మన శ్రీకర్ కి తోడుగా ఉంటారు కదా!” పదేపదే ఆకాశ్ అడుగుతున్నా.. రమ్య కాదనడం అతనికి కోపాన్ని తెప్పిస్తుంది.

ఇద్దరి మధ్య రోజురోజుకు తగవులు అవుతున్నాయి.

శ్రీకర్ ని స్కూల్ లో చేర్చారు.

అకారణంగా తనపై చేయి చేసుకున్న భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళింది రమ్య.

***

ఉన్నవిలేనివి తమ మధ్య మాటలు చెప్పేవాళ్ళ మాటలు విన్నారిద్దరు. డైవర్స్ వరకు వెళ్ళింది విషయం. ఫ్యామిలీ కౌన్సిల్ జరిగినా మార్పు రాలేదు ఇద్దరిలో..

తను వర్క్ చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు ఆకాశ్. తను కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ కొనబోతున్నట్లుగా చెప్పడానికి వెళ్ళాడు.

అతడితో మాట్లాడటం ఇష్టం లేదని ప్యూన్ తో కబురు చేసింది. ఎప్పుడైనా పిల్లాడిని చూడడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళేవాడు.

ఈసారి అలాగే వెళితే.. పిల్లాడు స్కూల్ మారాడని తెలిసి బాధపడ్డాడు.

ఎందుకిలా తన జీవితం మార్పు చెందిందో అర్థం కాలేదు అతనికి.

కారణం తన ప్రవర్తన అని మాత్రం అర్థమైనా ఇప్పుడు సరి చేసుకోలేని నిస్సహాయ స్థితి.

***

“రమ్య! అర్జెంట్‌గా బయలుదేరు” తల్లి తొందర పెడుతుంటే హడావిడిగా తల్లితో కలిసి హాస్పిటల్‌కి చేరుకుంది రమ్య.

హాస్పిటల్ దగ్గర అత్తమామలు ఆందోళనగా ఉండటం గమనించింది. వాళ్ళు తనతో మాట్లాడకపోయినా పలకరించే ప్రయత్నం చేసింది.

“అబ్బాయి ఐ సి యు లో ఉన్నాడు. వాడు నడుపుతున్న కారు ని లారీ యాక్సిడెంట్ చేసింది.” అంటున్న అత్తగారి మాటలు వింటూ.. వేగంగా ఐ.సి.యు లోకి నడిచింది.

కళ్లు కదపలేని స్థితిలో ఉన్నాడతను.

“మీరిక వెళ్ళవచ్చు. పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళాలి” అంది నర్స్.

అందరూ బయట కూర్చుని వున్నారు. శ్రీకర్‌ని ఒళ్లో కూర్చోబెట్టుకుని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న రమ్యని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

‘నేనే తప్పు చేశాను.’ పదేపదే అనుకుంది. ‘ఉన్నవి లేనివి ఎవరెవరో అన్న మాటలు విని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను తోడుగా ఉన్నట్లయితే ఈనాడు ఆకాశ్‌కి ఈ స్థితి వచ్చేది కాదు’ అని అనుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.

‘అవును శ్రీకర్ కి తోడుగా ఇంకొకరు ఉంటే బాగుండేది. తనేంటి ఇంతకాలం ఇంత అమాయకంగా, అర్థం చేసుకోకుండా బ్రతికింది? తప్పు తనదే కదా..’ అనుకుంది.

మూడు గంటల తర్వాత డాక్టర్స్ నుండి కబురు వచ్చింది, ప్రాణాపాయ స్థితి లేదని.

కానీ వాళ్ళు చెప్పిన ఓ సంగతి ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది.. జరిగిన యాక్సిడెంట్ లో తలకు తీవ్ర గాయమయింది. విపరీతమైన రక్తస్రావమైంది. అన్నీ సరి చేయగలిగారు..

పురుషాంగం దగ్గరైన గాయం అతని సెక్సువల్ జీవితానికి దూరం చేసే అవకాశం ఉండచ్చునంటూ డాక్టర్ జీవన్ చెప్పిన మాటలు విని స్థాణువై నిలబడింది.

భర్త బ్రతకడం ఆనందమే.. కానీ.. ఊహించలేక పోతుంది.

తామిద్దరం దూరమై సంవత్సరం అవుతుంది. అతడిని కొన్ని వందల, వేల, లక్షల సార్లు తలుచుకుని ఉంటుంది. మారకపోతాడా.. తన మాట నెగ్గక పోతుందా అనే పట్టుదల.

కానీ ఇప్పుడు పిల్లాడికి తోడుగా మరొకరు ఉండాలనిపిస్తుంది. తాము ఎల్లకాలం ఈ భూలోకంలో ఉండలేం. అలాంటప్పుడు శ్రీకర్‍కి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే బాగుంటుంది కదా. డబ్బు, ఆస్తులు ఎప్పుడైనా సంపాదించవచ్చు.

విలపిస్తోంది రమ్య.

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ ఆయ్యాడు ఆకాశ్.

***

భర్తని సంరక్షించుకోవాలని నిర్ణయించుకుంది. తన ప్రేమ అతడిని తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తుందనే నమ్మకాన్ని హృదయాన నింపుకుని సేవ చేస్తోంది. ఇప్పుడంతా కలిసి ఉంటున్నారు.

జాబ్ మానేసి భర్త, పిల్లాడి బాధ్యతలు చూస్తోంది రమ్య.

పూర్తిగా కోలుకున్నాడు ఆకాశ్.

పండు వెన్నెల్లో కూర్చున్నారు ఇద్దరు. చల్లని గాలులు రివ్వున వీస్తున్నాయి. తన మనస్సులో కోరిక చెప్పింది రమ్య.

తనని దగ్గరకు తీసుకున్నాడు ఆకాశ్. సన్నగా వర్షం ప్రారంభమైంది.

‘మనిద్దర్నీ కలిపింది ఈ వర్షమే కదా’ చెవిలో చెప్పాడతను.

ఆమె చిరునవ్వుల సరాగాలు అతడి హృదయాన్ని తాకుతున్నాయి.

దగ్గరవుతున్న అతడిని అల్లుకుపోయింది.

దేవతల దీవెనలు పూల జల్లుల్లా.. వర్షం చినుకులు కురుస్తున్న సమయాన.. పెంట్ హౌస్ లోకి నడిచారిద్దారు. కాసేపు కురిసి ఆగిన వాన, మబ్బులను తప్పించి, చంద్రుడికి, వెన్నెలకి దారిచ్చింది.

అందంగా అలంకరించిన పట్టు మంచం ఆహ్వానిస్తుంటే.. కూర్చున్నారిద్దరూ.

కిటికీ వైపు రమ్య చూపిస్తుంటే.. లేచాడతను. సన్నగా నవ్వింది రమ్య.

తమ మధ్య జరగబోతున్న శృంగార యుద్దాన్ని చూడొద్దంటూ చందమామను తప్పిస్తూ కిటికీలు మూసాడు.

రమ్య హృదయ సామ్రాజ్యానికి తిరిగి రారాజై వెన్నెలలు కురిపిస్తూ సంబరానికి మారుపేరై నిలిచాడు.

***

మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ గారాలుపోతున్న పుత్రిక పల్లవి చిరునవ్వులని ఆస్వాదిస్తూ.. బంధు మిత్రుల ఆశీస్సులు అందుకుంటూ..

శ్రీమతి రమ్య, పుత్రుడు శ్రీకర్‌లను దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్.

Exit mobile version