Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ లీల పాడెద దేవా

[ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో, ప్రత్యేక రచనగా కీ.శే. పి. విజయసారధి గారు రచించిన వ్యాసాన్ని పునః ప్రచురిస్తున్నాము.]

పాట అంటే రెండక్షరాల మాట కాదు. పాట అంటే ధ్వని చేసి శబ్దం కాదు. పాట అంటే సంగీత, సాహిత్య గానాల త్రివేణీ సంగమం! ఎన్నో పాటలు తెలుగు చిత్రాల కోసం పురుడు పోసుకున్నాయి. అయినా జాతికి బట్టకట్టిన పాటలు ఎన్ని? పాడిన పాటకు వినే శ్రోత ఉండటం ఎంత ముఖ్యమో శ్రోతను ఆపాట అలరింప చేయడం అంతే ముఖ్యం.!

రంగుల హంగులు, అద్భుతమైన సెట్టింగులు, రమణీయ ప్రకృతి, అందమైన కథానాయకుడు, కథానాయిక, పాటకు నృత్యం పేరిట వారు చేసే కవాతులు ఇవన్ని పాట తెరపై కదలాడుతున్నంత సేపు కళ్లప్పగించి కూర్చోబెట్టగలవు అంతే! హాలులోంచి బయటకు వచ్చాక కూడా ఆ పాట మనవెంట వస్తే, కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అందులోని సంగీత సాహిత్యాలు మనలను వెంటాడుతూ అలరిస్తూ ఉంటే అదే నిజమైన పాట!

రామ్నాథ్ శ్రీనివాస అయ్యంగార్ ఒకరోజు తలంటు స్నానం చేస్తూ ఉండగా ఆయన గురువుగారి ముఖారి రాగకీర్తన “ఎన్నడు కృపగల్గునో” శ్రీనివాసయ్యంగార్ నోట వినిపోదామని తంజావూరు కృష్ణభాగవతార్, శూలమంగళం వైద్యనాధ భాగవతార్ అన్న ప్రసిద్ధ హరికధా భాగవతార్లు వచ్చారుట. ఆయన స్నానాల గదిలోనుండే ఆ కీర్తనను పాడటం మొదలుపెట్టి పక్కవాయిద్యాలు ఏమి లేకుండానే కచేరిలో కూర్చుని ఎలా పాడతారో అలాగే పాడి స్నానం ముగించి వచ్చారుట! ఆ భాగవతార్లు అయ్యంగారి అద్భుతమైన కీర్తన విని పులకించి ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయారట! అలనాటి రంగస్థల నటులు బళ్ళారి రాఘవ, సూరిబాబు మైకులు లేకుండగానే పద్యాలు పాడేవారు. ఎటువంటి వాద్య సహకారాలు లేకుండానే ఒకే ఒక్క తొక్కుడు హార్మోనియం సహకారంతో రఘురామయ్య, పీసపాటి, అబ్బూరి, షణ్ముఖి ఆంజనేయరాజు పాడిన రంగస్థల పద్యాలు విని ఎంతమంది ఆ పద్యాలు పాడటం నేర్చుకోలేదు.!!

ఈ ఉపోద్ఘాతం సాహిత్యంలో, పాడేవారిలో దమ్ము ఉండాలేకానీ పక్కవాయిద్యాలు కొమ్ము కాయకపోయినా పాటను జనరంజకం చేయగలిగిన సంగీత దర్శకుల ఛాయలు ఇంకా మిగిలిన కాలంలో ఉండి, ఆ పాటల మాధుర్యాన్ని ఆస్వాదించ గలుగుతున్న అదృష్టవంతులం మనం అని చెప్పడం కోసమే!

ఒక సన్నాయి, డోలు, ఒకే ఒక గాత్రంతో పాటను సృష్టించడమేగాక ఆపాట పుట్టి అరవై వసంతాలు దాటినా నేటికీ నిత్యనూతనంగా మనలను అలరిస్తున్న ఆ పాట.. యస్.యం.సుబ్బయ్య నాయుడు గారి స్వరరచన, ఆరుద్ర సాహిత్య రచనల సంగమంలో కారుకురుచ్చి అరుణాచలం, యస్.జానకి ఆలపించిన పాట….”నీ లీల పాడెద దేవా”

పాట సందర్భం

పార్తీబన్ మహారాజు తన ఆస్థాన నర్తకి అపరాజిత పట్ల అనురక్తుడై ఆమెకు అపురూపమైన మువ్వలు బహుకరించి రాజ్యపాలనలో ఆమె సహకారం తీసుకుంటుంటాడు. ఒక నర్తకి సామ్రాజ్యపాలన చేయడం ప్రజలకు ఇష్టం లేదని తెలిసి ఆ నర్తకి రాజు బహుకరించిన మువ్వలతో పసిగుడ్డు అమరేంద్రతో రాజ్యం విడచి వెళ్ళిపోతుంది. ఒక మునీశ్వరుడికి అమరేంద్రను, మువ్వలను ఇచ్చి తగిన సమయం వచ్చినపుడు రాజుకు విషయం తెలియచేయమని కన్ను మూస్తుంది. అమరేంద్ర గొప్ప నాదస్వర విద్వాంసుడౌతాడు. కొన్ని పరిస్థితులలో శాంత అనే గాయనీమణికి ఆశ్రయం ఇస్తాడు. వారిద్దరి మధ్య అనురాగం చిగురిస్తుంది. శాంత పరమేశ్వరుని స్తుతించటానికి ఆలాపన ఆరంభించగానే అమరేంద్రుడు తన నాదస్వరంతో శ్రుతి కలుపుతాడు. ఆ పాటే ఈ “నీ లీల పాడెద దేవా..”

నీ లీల పాడెద దేవా.. పాట విశిష్టత

తెలుగు చలన చిత్రాలలోని పాటలలో సింహభాగం మఘలో పుట్టి పుబ్బలో మాసిపోతుంటే ఒక డబ్బింగ్ చిత్రంలోని “నీ లీల పాడెద దేవా” పాట మన మనోమందిరాలలో తిష్టవేసి ఆ రాగ మంజూషను తెరచినప్పుడల్లా రాగమధురిమతో మనకు ఆత్మానందం కలగజేయడం సామాన్యమైన విషయం కాదు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదు. ఈ రాగధారను సృష్టించడంలో శ్రమించిన మహనీయులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం!

ఆరుగాలం శ్రమించి సేద్యం చేసిన రైతుకు పండిన పంట చేతికి వస్తే ఆనందం!. ఎండ అనక వాన అనక రెక్కలు ముక్కలు చేసుకున్న శ్రామికుడికి కూలి డబ్బు చేతికి వస్తే ఆనందం.!! వంశోద్ధారకులు చేతికి అందివచ్చి చేయూతగా నిలిస్తే తల్లితండ్రులకు ఆనందం. ఈ ఆనందాన్ని మాటలలో చెప్పలేము. ఎవరికి వారు అనుభవించి అనుభూతి చెందవలసినదే! సంగీతానందం కూడా అటువంటిందే! శ్రావ్యమైన పాట వింటే కలిగేది ఆనందమైతే.. ఆ పాట కర్ణేంద్రియాల ద్వారా మనసును చేరడం పరమానందం. అలా చేరిన పాట మనసులో తిష్ట వేయడం దేవానందం! కానీ ఈ ప్రక్రియలన్నిటికి కారణభూతులైన సంగీతజ్ఞులు తమ సంగీతంద్వారా పొందేది బ్రహ్మనందం! అది దైవదత్తం! లభించిన సాహిత్యాన్ని స్వర,రాగ, లయాదులతో అలంకరించి అలరింపచేసిన సంగీత దర్శకులు ఎందరో? అందుకే ఆరు, ఏడు దశాబ్దాల క్రితం పాటలను ఈ రోజుకూడా విని మనం అలౌకిక ఆనందం పొందగలుగుతున్నాము అంటే నిస్సందేహంగా అది ఆ పాటల సృష్టికర్తల ఘనతే!

బాపు గారు గీసిన ఎస్. జానకి చిత్రం

సుస్వరం, శుద్ధమైన మనస్సే మూలధతువుగా సద్భక్తి, సంగీత జ్ఞానమే అర్హతలుగా… సంగీత పరమార్ధం “నాదోపాసన” అని భావించిన ఎందరో మహానుభావులు మనకు ఆనందాన్ని కాక ఆత్మానందాన్ని కలిగించే పాటలను అందించారు. ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు సృష్టించినపాటల ద్వారా మనకు ప్రాతఃస్మరణీయులై, మన మనోమందిరాలను రాగరంజితం చేస్తూ ఇప్పటికీ మన తలపులో చిరంజీవులుగా నిలిచారు మన ఈ వారం పాట ద్వారా ప్రతివారం వారిని స్మరించుకుంటూనే ఉన్నాము

ఈ పాట సాహిత్యం ఆరుద్ర గారు అని తెలియచేసాను కదా! ఆరుద్రగారి పరంగా చెప్పాలంటే ఆయన ఈ పాట వ్రాయడానికి పెద్దగా కష్టపడలేదట! కేవలం పాట ఆరంభంగురించి మాత్రమే మధన పడ్డారుట.

యం.వి.రామన్ నిర్మించి, దర్శకత్వం వహించిన “కొంజుం తెలంగై” చిత్రానికి “మురిపించే మువ్వలు” అనువాద చిత్రం. అంటే పాటలోని భావం, పాట బాణీ ముందుగానే అందుబాటులో ఉండటంతో “సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర” వ్రాసిన ఆరుద్రగారికి ఈ పాట అల్లడం శ్రమ అనిపించలేదు. కాకపోతే తమిళపాట “సింగార వేలనే దేవా” అని అరంభమౌతుంది. “సింగార వీధిని రావా..” అని రాయచ్చు. అలా వ్రాస్తే ఆరుద్ర ఎందుకవుతారు? అంతకు పూర్వం విశ్వనాధ సత్యనారాయణగారు “శృంగార వీధి” పేరుతో ఒక చక్కని కావ్యం వ్రాసారు. కాని “శృంగార” అన్న పద ప్రయోగం పండితులకు పంటికింద రాయి అయ్యింది. తెలుగులో శృంగార రాముడు, శృంగార మాధవుడు అన్న పలుకుబడి ఉన్నప్పటికీ “శృంగార- సింగార” పదాలు భోగలాలసతకు చిహ్నంగా భావిస్తారని భక్తి ప్రధానంగా “నీ లీల పాడెద దేవా…” అని వ్రాసారు. తదుపరి పాట అలా నడచి పోయింది.

సంగీత దర్శకులు యస్.యం. సుబ్బయ్య నాయుడు

ద్రవిడ సాంప్రదాయాన్ని త్రికరణశుద్ధిగా పాటించే తమిళులు సంగీతాన్ని అమితంగా ఆరాధిస్తారు. సాంప్రదాయ కీర్తనల పట్ల వారికి ఎనలేని గౌరవం. అందుకే రామభక్తి ప్రాధాన్యమైన త్యాగరాజ కీర్తనలు తమిళ సినిమాలలో నటీనటులపై చిత్రీకరించడానికి దర్శక నిర్మాతలు సాహసించేవారు కాదుగాని శాస్త్రీయ సంగీత విద్వాంసుల ప్రతిభా పాటవాలను సినిమాల ద్వారా ప్రదర్శింప చేయాలని కుతూహలపడేవారు.

అలాపన, కీర్తన, నెర్వల్, తని, స్వరాలు ఇలా విభిన్న ప్రక్రియలతో మూడుగంటలు సాగే సంగీత కచేరి ఇచ్చే తృప్తిని మూడు నిమిషాల పాటతో ఇవ్వాలంటే ఆ సంగీత దర్శకుడు ఎంతటి ఉద్దండుడై ఉండాలి?

అటువంటి సంగీత విద్వాంసులకోసం వెంపర్లాడే దర్శకులకు లభించిన సంగీత సరస్వతి పరప్రసాదం యస్.యం.సుబ్బయ్య నాయుడు. వీరి పూర్తిపేరు సుబ్బురాయలు మునుస్వామి సుబ్బయ్యనాయుడు. వీరి జీవితకాలం 1914-1979. సినిమా పాటలకు సంగీత గౌరవాన్ని తన పాటలతో సాధించిపెట్టిన సుబ్బయ్య నాయుడుగారిని అందరూ సంగీతయ్య అని పిలుచుకునేవారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల చిత్రాల్లో ఎన్నో గొప్ప పాటలు సృష్టించారు. పక్షిరాజా, మెర్క్యూరీ, జూపిటర్, మోడరన్ థియేటర్స్ వంటి సంస్థలకు ఆయన అజరామరమైన సంగీతం అందించారు. దక్షిణభారత సంగీత చరిత్రలో పేరుపొందిన రాధాజయలక్ష్మితో విమల చిత్రంలో అద్భుతమైన పాటలు పాడించారు. ఉత్తర హిందూస్థానంలో ఓ.పి.నయ్యర్ అంటే సంగీతాభిమానులకు ఎంతటి వ్యామోహం ఉందో తమిళనాట సుబ్బయ్య నాయుడుగారికి అంత క్రేజ్ ఉండేది.

శాస్త్రీయ సంగీత గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆ శాస్త్రీయ సంగీతసారాన్ని ఒడుపుగా ఒడిసిపట్టి ఆయన “నీ లీల పాడెద దేవా” పాట స్వరపరిచారు. చిత్రంలోని సన్నివేశానికి తగినట్లుగా నాదస్వర విద్వాంసుడైన కథానాయకుని పాత్రను ప్రతిబింబింపచేస్తూ ఆయన ఈ పాటలో నాదస్వర వాదనను వినిపింపచేయడం ఒక మధురమైన చరిత్ర.

కొసమెరుపు వీరి ప్రియ శిష్యుడైన యం.యస్. విశ్వనాథన్ నాయుడుగారి సతీమణిని తన గురుపత్నిని మాతృమూర్తిగా భావించి ఆమెను తన ఇంటనే ఉంచుకొని ఒక తల్లిని తనయుడు సేవించినట్లు సేవించుకున్నారు.

ఈ పాటలో మరో ప్రధాన విద్వాంసులు.. నాదస్వర విద్వాంసులు కారకురుచి అరుణాచలం.

న నాదేనా వినా గీతం

న నాదేనా వినా స్వరం

అసలు సంగీత జగత్తే నాదాత్మకం. అందుకే ఆలయాలలో పరమాత్ముని సేవకు నాదస్వరం వినియోగిస్తారు.

తమిళనాట భక్తిభావనతో పాటు ఆలయాలు కూడా అధికం. ప్రతి ఆలయంలో మంగళవాద్యాల కోసం నాదస్వర విద్వాంసులు ఉండేవారు. వీరు ఆలయసేవ కోసమే గాక పెళ్ళిళ్ళలో, సంగీత సభలలో తమ విద్వత్తు ప్రదర్శించేవారు. అటువంటి వారిలో కారుకురిచి అరుణాచలం ఒకరు. 1921లో జన్మించిన అరుణాచలం తండ్రికోరికపై కట్టుమల్లి సుబ్బయ్య, విలాతికులం స్వామిగళ్ వద్ద నాదస్వరం నేర్చుకున్నారు. ఒకరోజు ప్రముఖ నాదస్వర విద్వాంసులు రాజారత్నం పిళ్ళై గారి నాదస్వర కచేరికి సహాయకుడిగా వ్యవహరించవలసి వచ్చింది. ఆ కచేరిలో అరుణాచలం ప్రతిభ గమనించిన రాజరత్నం పిళ్ళై ఆయనను తన శిష్యునిగా స్వీకరించారు. ఆ తరువాత కారుకురిచి అరుణాచలం గొప్ప నాదస్వర విద్వాంసుడిగా పేరుపొందారు. కానీ కళాకారుడిగా ఆయనకున్న బలహీనతల వలన 6-4-1964 అంటే తన నలభై మూడవ ఏట మరణించారు.

ఈ పాటలో మరో వాద్య కళాకారుడు డోలు వాయించిన విద్వాంసుడు

భావప్రధానమైన గానానికి, వాద్యానికి శుద్ధమైన గతితో నికరమైన గణితంతో సహకరించేది లయవాద్యం. డోలు, మృదంగం, తబలా వంటి లయవాద్యాలు పాటకు, వాద్యానికి మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూనే పాటను అనుసరిస్తాయి తప్ప పాటను ఆక్రమించవు. అలాగే “నీ లీల పాడెద దేవా..” పాటలో డోలు వాద్యం అద్భుతం!

ఈ పాటను తమిళంలో యస్. జానకితో పాడించారు. యస్. జానకి ఆ రోజులలో ఏ.వి.యం. స్టూడియోలో గాయనిగా నెల జీతంపై పనిచేస్తుంటే చెట్టియార్ అనుమతితో ఈ పాట పాడించారు. ఈ పాట జానకిగారికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. కొన్ని వేల వేదికలపై ఆవిడ ఈ పాట పాడారు. ఈ పాటకోసం ప్రత్యేకంగా నాదస్వర, డోలువాద్య విద్వాంసులను ఏర్పాటు చేసేవారు. ఎలక్ట్రానిక్ వాయిద్య పరికరాలు ప్రాచుర్యం పెరిగి నాదస్వరానికి ప్రత్యామ్నాయం లభించింది కానీ జానకి గళానికి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వేదికపై ఈ పాట పాడటం చాలా చాలా కష్టం. అందుకు కారణం ఈ పాటకు గల విభిన్న తాళ ప్రక్రియ. ఈ పాట లయ ఆదితాళం. కానీ ఈ తాళగతిని చేతులతో తాళం వేసుకుంటూ మరీ పాడాలి! తాళగతి అనుసరణలో ఏ మాత్రం తేడా వచ్చినా స్వరాలు ఎదురు వచ్చి గాయనీమణిని ఇబ్బంది పెడతాయట! అంతేకాదు ఈ పాటలో స్వరాలు కూడా విభిన్న జతులలో సమంలోకి వస్తాయట!

కీ. శే. పి. విజయ సారధి, సునాద వినోదిని.

Exit mobile version