Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీకు నీవే బలం

[శ్రీ బివిడి ప్రసాదరావు రాసిన ‘నీకు నీవే బలం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఉద్యోగం చేయాలనుకుంటున్నాను.” చెప్పింది భార్య కావ్య.

“చాల్లే. ఉద్యోగాలు బార్లా తెరుచుకొని ఏం లేవ్. ఐనా నీకు ఉద్యోగం ఎందుకు.” గందికయ్యాడు భర్త ప్రభాకర్.

“నాకు చేయాలని ఉంది.” ఖరాఖండయ్యింది కావ్య.

“చాల్లే. నీ మొహంకి ఏ ఉద్యోగం దొరకదు.” చికాకయ్యాడు ప్రభాకర్.

“నా మొహంకి కాదు. నా చదువుకు ఉద్యోగం దొరుకుతోంది.” విసురుగా అంది కావ్య.

“అబ్బో. పీజీలకే టికాన లేదు. నీ బోడి డిగ్రీకి ఉద్యోగమా.” వెటకారమాడేడు ప్రభాకర్.

కావ్య ఏమీ అనలేదు.

“నీకు పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే నీ వాగుడేమిటి.” విసుక్కుంటున్నాడు ప్రభాకర్.

“నేను తెలివితోనే చెప్పుతున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. రేపటి నుండి దానికై బయటికి వెళ్తాను.” చెప్పుతోంది కావ్య.

అసహనమయ్యిపోతున్నాడు ప్రభాకర్.

“పెళ్లికి ముందు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. మీకు చెప్పాను కూడా.”

అడ్డై.. “మీ ఇల్లు గడవక చేసే దానివేమో. ఇక్కడేం లోటు లేదు. నా సంపాదన, నా తండ్రి పెన్షన్ సరిపోతూ.. పొదుపు కూడా అవుతోంది.” రోషంగా చెప్పాడు ప్రభాకర్.

“ఆ పొదుపుకు నాదీ యాడ్ అవుతోంది. మరీ మంచిదేగా.” పట్టు వీడడం లేదు కావ్య.

అదిమి పట్టి వదిలిన స్ప్రింగ్‌లా మంచం మీంచి లేచి కూర్చున్నాడు ప్రభాకర్.

“ఉదయం అత్తగారితో చెప్పాను.” చెప్పుతోంది కావ్య.

అడ్డై.. “ఏమంది. గడ్డి పెట్టిందా.” గమ్మున అడిగాడు ప్రభాకర్.

“లేదు కానీ, ‘నీ మొగుడు నడిగి తగలడు’ అన్నారు.” సూటిగానే మాట్లాడుతోంది కావ్య.

“కదా. అంటే తనకు ససేమిరా ఇష్టం లేదని. ఇక చాలించు.” ఈ మారు ప్రభాకర్ గట్టిగా మాట్లాడేడు.

“ఎందుకు అంత గోల. గదిలో మనిద్దరమేగా ఉన్నది. పైగా నేను మీకు దగ్గరగానే ఉన్నానుగా.” గింజుకుంటుంది కావ్య.

“సరి సరే. సోదాపి పడుకో. నాకు నిద్ర వస్తోంది.” కావ్య కుడి చేతిని పట్టి, మంచం మీదికి లాగబోయాడు ప్రభాకర్.

“వదలండి. మీ సొద మీదే. నాది సోదట సోది.” చిఱ్ఱెక్కిపోతోంది కావ్య.

“సడన్‌గా నీకేమయ్యిందే.” అనేసాడు ప్రభాకర్. కానీ కావ్య చేతిని వదలలేదు.

భర్త పట్టును విదిలించుకుంది కావ్య. తన కుడి చేతిని విసురుగానే తన ఆధీనంలోకి తీసుకుంది.

“నేను చెప్పేది మీకు ఏదీ ఎక్కదు.” రుసరుసలాడుతోంది కావ్య.

“ఎక్కింది కనుకే చెప్పుతున్నా. నువ్వు ఉద్యోగం చెయ్య వద్దు.” చెలరేగబోయాడు ప్రభాకర్.

“హే. తగ్గండి. నేను చెప్పేది ఉద్యోగం విషయమే కాదు.. వరస అబార్షన్స్‌తో నాకు నలతగా ఉంటుందంటున్నా మీరు వినుకుంటున్నారా. ఛ.” ఆగింది కావ్య.

భార్యను చుర చుర చూస్తున్నాడు ప్రభాకర్.

“నా సాధకబాధకాలు వినిపించుకోరు.. పట్టించుకోరు. బయటికి పోవడం, రావడం, తినడం, పక్క ఎక్కి దొర్లడం తప్పా.. మీరు పట్టించుకొనేది ఏమీ లేదు. ఇదేం చోద్యమో. నా కర్మ.” విసుక్కుంటుంది కావ్య.

“నీకు ఇవాళ దెయ్యమేదో పట్టిందే.” అన్నాడు ప్రభాకర్.. పుటుక్కున పక్క మీద పడుకుంటూ.

కావ్య మంచం మీద కూర్చునే ఉంది. భర్తనే చూస్తోంది.

రమారమి రెండు నిముషాల తర్వాత.. “పడుకోక పోతే అలా కొరివిలా తగలడు.” అన్నాడు ప్రభాకర్. ఆ వెంబడే గోడ వైపుకు ఒత్తిగిల్లాడు.

ఆ తర్వాత కావ్య.. ‘మరింత పట్టు బిగించాలి. తప్పదు.’ అనుకుంది. కుదేసినట్టు తన ఒళ్లును మంచం మీదన పడేసింది. తనకు నిద్ర రావడం లేదు. పై కప్పు కేసి చూస్తూ ఉండిపోయింది.  క్రమేణ ఆలోచనల్లోకి నెట్టబడింది.

***

పెళ్లి తర్వాతి తంతులు ముగిసేక.. అత్తారింటికి వచ్చేసింది కావ్య.

తొలి రోజులు.. తన కన్నవారింటి ఎడబాటును విదిలించుకుంటూ అత్తవారింట సక్రమంగా మెసిలే అలవాటు మెల్లి మెల్లిగా చేసుకుంటుంది.

కానీ.. పోను పోను కావ్య హైరానాలు మొదలయ్యాయి.

వంట పనులు.. వాషింగ్ మెషిన్ పనులు.. పని మనిషి నాగాలు చూపుతూ ఆమెను మానిపించేసి తుడవటాలు, తోమడాలు మెల్లి మెల్లిగా కావ్యకు  అత్త ఒప్పచెప్పేసింది.

తోడుగా మామ, మరిది మరియు ఆడపడుచుల వెట్టిచాకిరీలు అదనమయ్యాయి.

కన్నవారింట మెసులు వెసులుబాటులతో తిరిగిన కావ్యకు అత్తవారింట అంటకట్టబడ్డ పనులు భారంగా తోచాయి. భర్తకు నివేదించుకున్నా అతడు నిమ్మకునీరువోయు మచ్చు అవుతున్నాడు.

కావ్య విసిగిపోతోంది. కన్నవారికి విన్నవించుకోలేకపోతోంది.

కాలం గడిచిపోతోంది.

భర్త సొదన దడిదడిన రెండు మార్లు గర్భం దాల్చిన కావ్య.. తన శారీరక, మానసిక అస్తవ్యస్తాలతో గోడకు తగిలిన బంతుల్లా గర్భస్రావాలకు గురయ్యింది.

ఆ మధ్య నుండి కావ్య ఆలోచనల వైపు మొగ్గడం మొదలెట్టింది.

ఆలోచించి ఆలోచించి ఉద్యోగం పేరిటిన బయటికిపోతే తనకు ఈ అవస్థల నుండి వెసులుబాటు లభిస్తోందని తలుస్తోంది. పైగా తన అత్తవారింటి వాళ్లకి తమ దాష్టీకం ఫలితం ఎఱిక పర్చాలని గట్టిగా అనుకుంటోంది.

అందుకై తెగ యత్నిస్తోంది.

ఈ మారు మరింత పట్టు బిగిస్తోంది.

***

నిద్ర నుండి లేస్తూనే.. పక్కన పడినట్టు ఉన్న కావ్యను చూస్తూ.. “ఏంటా వాలకం. నిద్ర పోలేదా.” అడిగాడు ప్రభాకర్.

“నిద్ర పోనిస్తేగా.” అంది కావ్య.

“ఎవరు.”  అడిగాడు ప్రభాకర్.

“మీరే.” టక్కున చెప్పింది కావ్య.

“నేనా.” విస్మయమయ్యాడు ప్రభాకర్.

“మరి. మీరు ఏమీ తేల్చలేదుగా.” నసిగింది కావ్య.

“అరె. చెప్పేసాగా. నీకు ఉద్యోగం వద్దు.” సర్రున చెప్పాడు ప్రభాకర్.

“ప్లీజండీ.” కావ్య ప్లేట్ పిరాయించింది. దువ్వుతూ సాధించ తలచింది.

“కదురదంటే కుదరదు.” మంచం దిగేసాడు ప్రభాకర్.

గది బయటికి పోబోతున్న ప్రభాకర్‌తో.. “మీ అమ్మగారితో మాట్లాడరా.” విన్నవించుకుంటుంది కావ్య.

ప్రభాకర్ ఏమీ అనక గది బయటికి పోయాడు.

రెండు, మూడు నిముషాల తర్వాత.. గది బయటికి వచ్చింది కావ్య.

హాలులోకి వచ్చిన కావ్యను చూస్తూనే.. “ఏమమ్మాయి లేవడం ఆలస్యమయ్యింది. కాఫీ పెట్టి ఇవ్వు. తల భారమైపోతోంది.” కసిరేలా అన్నాడు మామ.

అక్కడే ఉన్న అత్త.. “వెళ్లి వీథి గుమ్మం ముందు కల్లాపు, ముగ్గు పనులు చూడు.” చెప్పింది.

మరిది.. “వదినా అలానే న్యూస్ పేపర్ బయట పడుంటే తెచ్చి పెట్టు.” చెప్పాడు. ఆడపడుచు ఇంకా లేవలేదు.

ప్రభాకర్ బాత్రూంలో ఉన్నాడు.

కావ్య నిదానంగానే ఉంది.

“ఏంటలా ఉండి పోయావు. కదులు. పనులు మొదలెట్టు.” విసురుగా చెప్పింది అత్త.

“నేను పది గంటలకు బయటికి వెళ్తాను.” చెప్పేసింది కావ్య.

అత్త కస్సుమంది. “ఎందుకు.” అంది.

“ఉద్యోగంకై.” నెమ్మదిగానే చెప్పింది కావ్య.

“ఏంటీ. అబ్బాయి ఒప్పుకున్నాడా.” సర్రున అడిగింది అత్త.

మామ ప్రేక్షకుడు మాదిరయ్యాడు.

అప్పుడే అక్కడకు ప్రభాకర్ వచ్చాడు.

“ఏంరా. దీనిని ఉద్యోగంకు పంపుతున్నావా.” అనడుగుతున్న తల్లిని చూస్తూ..

“అబ్బే. అలాంటిదేమీ లేదు.” అన్నాడు ప్రభాకర్.

“మరి ఇదేమో పది గంటలకు ఉద్యోగంకై బయటికి వెళ్తుందట.” చెప్పింది అత్త.

“అదేమీ లేదు. అది కుదరదు.” విసురుగా అనేసాడు ప్రభాకర్.

“లేదు లేదు. నేను ఉద్యోగం చేస్తాను.” నికరంగా చెప్పేసింది కావ్య.

అక్కడి ముగ్గురూ ఒకే మారు విస్మయమయ్యారు కావ్య తీరుకు.

“నేను తప్పక ఉద్యోగం చేస్తాను.” నిబ్బరంగానే ఉంది కావ్య.

“వద్దంటున్నామా.” ఉఱిమి చూస్తోంది అత్త.

“లేదు. నేను ఉద్యోగం చేస్తాను.” నిలకడగా ఉంది కావ్య.

“పిచ్చి పట్టిందా. వద్దంటున్నామా. మొండికేయకు. మీ పెద్దల వరకు పోనీయకు.” చెప్పేడు ప్రభాకర్.

“మీరు యాగీ పెట్టినా.. ఏ పెద్దల వద్ద పెట్టినా.. నేను మాత్రం ఉద్యోగం చేస్తాను. నాదేం తప్పు కాదు. నేను సక్రమంగానే కోరుకుంటున్నాను. ఊపిరి సలపనీయని చాకిరీలు నా వల్ల కాదు. పరిమితి పనులుకు మించి నేను చేయలేను. నాకు వెసులుబాటు కావాలి.”  ఖండితంగా చెప్పేసింది కావ్య.

కావ్య చెప్పింది విన్న ప్రభాకర్ జంకుతున్నాడు.

అంతలోనే.. “నువ్వు ఈ ఇంటి కోడలువి..” మామ కలగ చేసుకుంటున్నాడు.

“నేను స్పృహలోనే ఉన్నాను. నాకు ఎఱికే. నేను ఈ ఇంటి కోడలిని. నేనేం కాని పనిని చేపట్టబోయడం లేదు. అలానే ఇదేం బరితెగింపు కానే కాదు. ఎక్కడైనా, ఎవరికైనా ఇదే నా జవాబు.  నన్ను ఎవరు, ఎందుకు, ఎలా కాదంటారో చూస్తాను. నేను మాత్రం తగ్గను.” చెప్పుతోంది కావ్య.

అప్పటికే అక్కడి ముగ్గురు పెద్దలు మొహాలు చూసుకుంటున్నారు.

“మీ ఇంట వేణ్ణీళ్లకు చన్నీళ్లు మాదిరిగా మారబోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ రీతిన అర్థం చేసుకోవాలి. అవకాశం ఇవ్వండి. కొన్నాళ్ళయ్యినా ఉద్యోగం చేయనీయండి.”  చెప్పింది కావ్య.

“కొన్నాళ్లు అయ్యేక ఉద్యోగం మానేస్తావా.” ట్రాన్స్‌లో ఉన్నట్టు అనేసాడు ప్రభాకర్.

“తొలుత మీకు ఒప్పుకొనే మనసు ఉండాలిగా.” ఎదురీదుతోంది కావ్య.

“నేనేం కఠినాత్ముడును కాను.” తడుముకుంటున్నాడు ప్రభాకర్. భార్యను చూడలేక పోతున్నాడు.

కావ్య నిటారుగా ఉంది.

“ఉద్యోగం దొరకడం మాటలా. వెళ్లు. ప్రయత్నం చేసుకో.” తేలిగ్గా అనేసాడు ప్రభాకర్.

“మరి అత్తగారు ఏమంటారో.” సూటిగా అత్తను చూస్తోంది కావ్య.

అత్త కుదించుకు పోతోంది. కోడలునే చూస్తోంది.

తల్లిని చూస్తూనే.. “మా అమ్మ కానిది ఏమీ కాదు. ముందు ఉద్యోగం సంపాదించుకొని చూపు.” రోషమవుతున్నాడు ప్రభాకర్.

అంతలోనే.. “థాంక్సండీ.” అంది కావ్య. అక్కడ నుండి బాత్రూం వైపుకు కదిలింది నిండుగా.

***

నాలుగు రోజులుగా ఉద్యోగంకై చాలా చోట్లన తిరుగుతోంది కావ్య.

ఒక చోట అవకాశం వచ్చేలా అనిపించినా.. ఆ మేనేజర్ వాటం నచ్చక.. కావ్య అటు మొగ్గలేదు.

విసుగు పడక సర్టిఫికేట్స్‌ను పట్టుకు తిరుగుతూనే ఉంది కావ్య.

కావ్య అదృష్టమో.. కావ్య పట్టుదలో.. కావ్యకు ఓ కాన్వెంట్‌లో టీచర్ పోస్టు లభించింది.

దాంతో కావ్య కుదరయ్యింది.

కానీ.. “కాన్వెంట్ ఉద్యోగమేమిటి. రవ్వంత సంపాదనకు యాతన ఎందుకు. చేరక్కర లేదు.” కలగచేసుకున్నాడు ప్రభాకర్.

“నా సంపాదన ఎంతైనా మంచిదేగా. మీ సంపాదన, మీ నాన్న పెన్షన్ సరిపోగా.. మీరు పొదుపు కూడా చేసుకుంటున్నారుగా. నా సంపాదన బెత్తెడైనా మీ పొదుపు పెరుగుతోందిగా.” సరసరా అనేసింది కావ్య.

“నీ సంపాదనేమి అక్కరలేదు.” ప్రభాకర్ రోషమయ్యాడు.

“సరేలెండి. నేను దాచి పెడతాను. అవసరం అక్కరకు సర్దుబాటవుతోంది.” నిలకడగానే మాట్లాడుతోంది కావ్య.

“అంతే కానీ. ఉద్యోగం వద్దనవు కదూ.” ప్రభాకర్ గింజుకుంటున్నాడు.

మిగతా కుటుంబ సభ్యులు ప్రేక్షకులు మాదిరి అయ్యారు.

“ఉద్యోగం సంపాదించుకో అన్నారుగా. సంపాదించుకున్నాను. రేపటి నుండి వెళ్తాను.” చెప్పేసింది కావ్య.

ఆ వెంబడే..

“మళ్లీ చెప్పుతున్నాను. నాది తప్పే కాదు. నాది బరితెగింపు అంతకంటే కాదు. నాది తప్పు అన్నవాళ్లని నేను ఎదుర్కోగలను.” చెప్పింది.

ప్రభాకర్ విసురుగా బయటికి వెళ్లిపోయాడు. దాంతో మిగతా వారు ఆ ఇంటి హాలు నుండి తలో వైపు జారుకున్నారు.

మర్నాడు నుండి.. ఇంటిన ఉదయం పనులు తనకైనంత మేరకు చక్కదిద్దుతూ.. లంచ్ బాక్స్ కట్టుకొని  ఉద్యోగంకి వెళ్తోంది కావ్య. సాయంకాలం పూట ఇంటి పనుల్లో సాయపడుతోంది.

కాలం కొనసాగిపోతూనే ఉంది.

Exit mobile version