కృత్వా జగామ్ కశ్మీరాన్ తథైవాసో మహీపతిః।
ఆప్లుత్య తీర్థేషు తదా గృధకూటముపాగతమ్॥
శుద్ధ సరస్వతీ రామస్య చైవ సంయోగం యత్ర గచ్ఛతః।
తత్ర స్నాతస్య రామస్య కరౌ శుద్ధి ముపాగతౌః॥
21 మార్లు దేశమంతా తిరిగి క్షత్రియులను సంహరించినందు వల్ల పరశురాముడి చేతులు రక్తంతో నిండిపోయాయి. ఎంత కడిగినా అది పోవడం లేదు. దాంతో అతడు పితృ దేవతలను ప్రార్థించాడు. “నువ్వు శరణువేడినవారిని, భయంతో పారిపోతున్నవారిని వేటాడి మరీ చంపావు. అందువల్ల నీ శరీరం సర్వం పాపమయం అయిపోయింది. కాబట్టి తీర్థయాత్రలు చేయి. పవిత్ర స్థలాల మట్టి స్పర్శతో, తీర్థాలలోని పవిత్ర జలంతో నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. నువ్వు సంపూర్ణంగా పవిత్రమైన తరువాతనే నీ చేతులకు అంటిన రక్తం పోతుంది. నీ రెండు చేతులు రక్తం నుండి పరిశుభ్రమైన తరువాత తపస్సు చేయాలి” అని అతని పూర్వీకులు అన్నారు.
వారి మాటను మన్నించి పరశురాముడు తీర్థయాత్రలు ఆరంభించాడు. పవిత్ర స్థలాలను దర్శించాడు. అలా పవిత్ర తీర్థాలలో నిత్యం స్నానం చేస్తూ కశ్మీరులోని గృధకూటం చేరాడు. శుద్ధ నది, సరస్వతి సంగమంలో స్నానం చేయటంతో సంపూర్ణంగా పవిత్రుడయ్యాడు. తన పాపం సంపూర్ణంగా పరిహారమవటంతో సంతుష్టడయిన రాముడు ఆ ప్రాంతానికి ఒక వరం ఇచ్చాడు. ‘ఈ పవిత్ర సంగమ స్థలంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. వ్యక్తి పవిత్రుడవుతాడు. భృగులోకాలు అతనికి ప్రాప్తిస్తాయి’ అన్నాడు. అలా శత్రువులను సంహరించిన వారంతా ఈ సంగమ స్థలంలో స్నానమాడి పాపాలను పోగొట్టుకుంటారు, ప్రవిత్రులవుతారు.
పథేశ్వర వద్ద ఘోరమైన తపస్సు చేశాడు రాముడు. తరుసో బ్రహ్మసార వద్ద ఉద్భవించిన పుణ్యోదయ నది చేరుకున్నాడు. ఇక్కడ రాముడు తపస్సు చేయటం వల్ల నడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ‘రామప్పద’ అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఒక సంవత్సరం పాటు ఈ ప్రాంతంలో తపస్సు చేసిన రాముడు గృధకూట పర్వత పాదాల వద్ద తపస్సు ప్రారంభించాడు.
రాముడి పాపాలు నశించి అతని హస్తాలు రక్తరహితమయిన ప్రాంతం పుణ్యోదయ నదికి సమీపంలోనే ఉంది. అతడికి దగ్గరలోనే ‘అవంత’ అనే నాగుల రాజు ఉండేవాడు. అక్కడ రాముడు కఠినమైన తపస్సు చేశాడు. అక్కడ శాంఖ్ఞి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
రాముడు అక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆశ్రమస్వామి దర్శనం కోసం వచ్చాడు. ఆశ్రమస్వామికి అర్పించటానికి తనతో పాటు ఒక గోవును కూడా తెచ్చాడు. అయితే ఆశ్రమస్వామిని చేరకముందే దారిలోనే ఆ గోవు మరణించింది. ఇది బ్రాహ్మణుడిని దుఃఖంలో ముంచివేసింది. అతడిలో తీవ్రమైన పశ్చాత్తాపం రగిలింది. దుఃఖించాడు, బాధపడ్డాడు. గోవు శవాన్ని అక్కడే వదిలి విచారిస్తూ, దుఃఖిస్తూ గమ్యం లేకుండా తిరగసాగాడు. అలా తిరుగుతూ అతడు రాముడు తపస్సు చేస్తున్న స్థలానికి వచ్చాడు. రాముడు అతడి దుఃఖానికి కారణం అడిగాడు. ఆ బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పాడు. రాముడు తన దివ్యదృష్టితో చూసి జరిగినదంతా గ్రహించాడు. “ఇందులో నీ తప్పు లేదు. ఒక గంధర్వ కన్య, గోవు రూపం ధరించి నారదుడిని అవమానించింది. దాంతో కోపించిన నారదుడు ఆ కన్యను గోవుగా మారిపొమ్మని శపించాడు. ఆమె తన తప్పు గ్రహించి క్షమించమని వేడుకొంది. ఆమె పశ్చాత్తాపానికి ప్రసన్నుడయిన నారదుడు ఆమె గోవుగా మారిపోయిన తరువాత ఓ బ్రాహ్మణుడు దైవానికి అర్పించేందుకు గోవును తీసుకుని గృధకూట పర్వతానికి వస్తాడని, అక్కడ సంభవించే మరణం వల్ల శాపవిముక్తి అవుతుందని చెప్పాడు. ఫలితంగా ఆ గోవు పర్వతం అధిరోహించే దారిలో మరణించింది. గంధర్వ కన్య శాపవిముక్త అయింది. కాబట్టి గోవు మరణ దోషం నిన్ను తాకదు. గోదానం పుణ్యం నీకు లభిస్తుంది. నువ్వు బాధ పడాల్సిన పని లేదు. కాబట్టి ఆశ్రమానికి వెళ్ళు. స్వామి దర్శనం చేసుకో. స్వామి దర్శనంతోటే నీ పాపాలన్నీ నశిస్తాయి. కానీ ఈ సంఘటన వల్ల నాకు ఒక ఆలోచన స్ఫురించింది. ఆశ్రమస్వామి దర్శనం కోసం వచ్చేవారంతా ఎంతో కష్టపడి కొండను ఎక్కుతారు. స్వామికి అర్పించటం కోసం వెంట తెచ్చే గోవులకు కూడా కొండ ఎక్కటం ఎంతో కష్టంగా ఉంటుంది. వాటిని కష్టపెట్టిన పాపం వల్ల గోదానం వల్ల లభించే పుణ్యం సమసిపోతుంది. అందుకని కొండపైన ఉన్న స్వామి విగ్రహాన్ని కొండక్రిందకు తెచ్చి కొండ పాదం వద్ద ప్రతిష్ఠిస్తాను. ఇందువల్ల భక్తుల కష్టాలు తగ్గుతాయి. భక్తులు దానం ఇచ్చిన పశువులకు కూడా కష్టం తగ్గుతుంది” అన్నాడు. తన సంకల్పం నెరవేరేందుకు భగవంతుడి అనుమతి కోసం తపస్సు ప్రారంభించాడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

