[‘భాగ్యరేఖ’ సినిమాలోని ‘నీవుండేదా కొండపై నా స్వామీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు మొదలి పద్మ.]
పాట ఒక పరిమళం. మెత్తగా ఊయలలూపే మరువంపు సోయగం. విరివని మీదుగా వీచే సన్నని పిల్లతెమ్మెర. సినీ పాటల పూదోటలో ఇలా అనుభూతి కలిగించే పాటలు ఎన్నో. అందుకేనేమో కొన్ని గీతాలు సినిమా పాటల్లా కాక సంప్రదాయగీతాలు లేదా లలితగీతాలు అనిపిస్తూ హృదయంలో తిష్టవేస్తాయి. కలకాలం నిలిచిపోతాయి. అటువంటి గీతమే ‘భాగ్యరేఖ’ చిత్రంలో కృష్ణశాస్త్రిగారి కలం కురిపించిన ఈ పారిజాతసౌరభం.
పల్లవి:
ఊ.. ఊ.. ఊ..
నీవుండేదా కొండపై నా స్వామీ
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో..
ఏ పూల పూజింతునో..
సుకుమారంగా విరిసి అంతకన్నా సున్నితంగా పరిమళాన్ని కురిపించే పారిజాతాలలానే ఈ గీతం, యీ అక్షరాలు మనసునిండా పారాడతాయి. పల్లవిలోనే చల్లదనం కురిపిస్తూ పలుకరిస్తాయి. మదిని వెన్నెలమయం చేస్తాయి. ముందుగా వచ్చే ఆలాపనే మనల్ని అలౌకికమైన ఆనందపు దారుల్లోకి తీసుకువెళ్తున్న అనుభూతి కలిగిస్తుంది.
కేవలం సందర్భానికి పాట రాయడమే కాక ఆ వెనుక పాత్ర ఔచిత్యాన్ని అక్షరాలలో మేళవిస్తూ సన్నివేశాన్ని పరిపూర్ణం చేయడంలో నాటి రచయితల ప్రతిభ అమూల్యం.
సవతితల్లి పెట్టే బాధలు భరించలేక ఇల్లు విడిచి వచ్చిన నాయికకు అనుకోకుండా పరాయి ఇంట ఆశ్రయం దొరుకుతుంది. వారి ఆత్మీయతలో స్థిమితపడిన హృదయం ఈ విరివనిలో మరింత ఉపశమిస్తుంది. ప్రకృతిలో మమేకమై గానమై పరవశిస్తుంది.
చరణం 1:
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే
ఈ పేదరాలి మనస్సెంతో వేచే
నీ పాదసేవ మహాభాగ్యమీవా
నాపై నీ దయ చూపవా నా స్వామీ..
ఏ ఆడంబరం లేని పారిజాతాలు. అంతకన్నా నిరాడంబర హృదయిని ఈ నాయిక. సౌమ్యంగా, నిదానంగా తోటలో కలియతిరుగుతూ, దేవుని అర్చనకై పూలను కూర్చుకుంటూ ఆలపిస్తుంటే, ముఖంలో భావాలు మరింత విలక్షణంగా కనపడుతూ మనల్ని కట్టిపడేస్తాయి. ఈ భావాన్ని వ్యక్తీకరించడం కన్నా పదేపదే తలపోయడం హాయిగా అనిపిస్తుంది.
చిత్రంలో ఈ పాట తిరుమలేశునిపై భక్తితో గానం చేస్తున్నప్పటికీ, అన్యాపదేశంగా నాయకుని తలపు మనసులో ఉందేమో అనిపిస్తుంది. కారణం అతని పరిచయం అయిన వెంటనే ఈ పాట రావడమే. ఐనా ఆమె ఆలోచనల్లో అతనిపై గౌరవభావమే కానీ మరొకటి కాదని తర్వాతి సంఘటనలో ఆమె వ్యక్తిత్వం స్పష్టం చేస్తుంది.
సుమాలు నిత్యం పూస్తూ దేవుని అర్చనకై వేచి చూస్తున్నట్టే, ఈ పేదరాలి మనసు అంతే ఆర్తిగా ఎదురుచూస్తుంది ఆ స్వామి పాదసేవకోసం. పూల హృదయం ఈ పూబాల హృదయం రెండూ ఒకే విధంగా స్పందిస్తూ మన హృదినీ నిర్మలం చేస్తాయి. సేదతీరుస్తాయి.
చరణం 2:
దూరాననైనా కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడుకొండలపైన వీడైన స్వామీ
నాపై నీ దయ చూపవా నా స్వామీ..
అసలు దర్శనమే అసాధ్యం అనుకున్న సమయాన దూరాన్నుంచయినా చూసే అవకాశమీయమని గాఢంగా చేసే ఈ ప్రార్థన ఆర్ద్రంగా ఉంటుంది. నీ రూపు నాలో అనే ఆ తరువాతి వాక్యం ఆ ఊహను మరింత గాఢతరం చేస్తుంది. మనసులో ముద్రించుకుపోతుంది.
లాలనగా పాడుకునే లాలిపాటలాంటి ఈ భక్తిగీతం, మరోలా ఆలోచిస్తే దైవానికి పసిపాపలాంటి మనసు పాడే జోలపాట అనిపిస్తూ, ఆ దైవమూ నిర్మలమైన ఈ భక్తికి పరవశుడవుతూ కమ్మగా ఆలకిస్తున్న భావన కలిగిస్తుంది. మరో కోణంలో ఉదయారుణ శోభను నింపుకున్న మేలుకొలుపు గీతంలానూ అనిపిస్తుంది.
అక్షరమక్షరంలోనూ పారిజాత కాంతులు పొదువుకున్న ఈ భావాలు బి.ఎన్.రెడ్డి గారు దర్శకత్వం వహించిన ‘భాగ్యరేఖ’ చిత్రం కోసం కృష్ణశాస్త్రిగారి కలం వెదజల్లిన అక్షరసుమాలు. పెండ్యాలగారు స్వరపరిచిన తీరు అచ్చంగా పారిజాత సుమపరాగమే. అటు శాస్త్రీయత ఇటు లాలిత్యం కలబోసుకున్న స్వరపారిజాతం. సుశీలగారి గొంతులోంచి ఆ లేలేత సుమాలంత మెత్తగానూ జాలువారుతుంది. పదానికి పదం తాకితే కందిపోతుందేమో అన్నంత మృదువుగా ఆలపిస్తారు సుశీలగారు.
కనులనిండా తేటతనం, ముగ్ధత్వం నింపుకున్న జమున అభినయం అంతే కోమలంగా, సాత్వికంగా ఉంటుంది. మధ్యలో ఎన్టీ రామారావుగారి హావభావాలు కూడా సున్నితంగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తాయి. అతి సహజంగా సహజమైన వాతావరణంలో చిత్రీకరించిన తీరు హృద్యంగా ఉంటుంది. పాటకు సంబంధించి ప్రతి ఒక్కటీ అపురూపమే.
పాట చివరిలో ఆలాపన కూడా పూలు రాలిన చాలాసేపటి వరకూ గాలినిండా పరుచుకున్న పరిమళంలా మనసునిండా పారాడుతూనే ఉంటుంది. తెల్లవారుజామున ఆరుబయట వెన్నెల్లో ఎదమీద రాలిన సుమాల సవ్వడి యీ గీతం.. మృదుమధురంగా వినిపించే కోవెలలోని జేగంటనాదం.. స్వరతరంగంలా సాగివచ్చే సుమధుర భావావేశం.. కొండపై నుండి అధాటున పుడమిపైకి జారిన యీ దేవకాంచన పుష్పసమీరాన్ని మరోసారి మనసునిండా ఆఘ్రాణిద్దాం..
(ఈ పాటని యూట్యూబ్లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=tSuI0smsYyQ)
