Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను సంభాషణలు రాసిన ఆ ఏడు సినిమాలు మాత్రం.. !!’ – బుర్రా సాయి మాధవ్

[ఇటీవల అమెరికాలోని హ్యూష్టన్ నగరంలో జరగిన తెలుగు సాహితీ సదస్సులో సినీ సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ గారి ప్రసంగం గురించి శ్రీ జి. వల్లీశ్వర్ గారి రచన.]

“నేను సంభాషణలు రాసిన ఏడు సినిమాలు – నాకు పరీక్ష పెట్టాయి. వాటన్నింటికీ మనసు పెట్టి రాశాను. అంటే చాలా మనసు పెట్టి రాశాను. ఎంతో ఆశతో రాశాను. వాటిల్లో ప్రతి సినిమా విడుదల అయ్యాక నాకు ఎంత గుర్తింపు వస్తుందో అని చాలా చాలా ఊహించుకున్నాను.. 1994-2012 కాలంలో నేను సంభాషణలు రాసిన ఆ ఏడు సినిమాలూ విడుదల కాలేదు.. నిరాశ.. నిస్పృహ.. ఆర్థిక సమస్యలూ.. అలాంటివన్నీ అనుభవించాను. అయినా నేను సినిమా రంగాన్ని వదిలిపెట్టలేదు. కారణం ఒక్కటే..?”

ఇలా సాయి మాధవ్ చెబుతుంటే హ్యూష్టన్ నగరంలో వంగూరి ఫౌండేషన్, ఆ నగర తెలుగు సాంస్కృతిక సమితి కలిసి నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సులో ప్రతినిధులంతా చెవులు రిక్కించుకుని వింటున్నారు ఈ ఆగష్టు 17న.

సాయి మాధవ్ ఉద్వేగంతో చెబుతున్న ప్రతి మాట ఏ రంగంలో సాహసం చేసేవారికైనా దిక్సూచి వంటిదే. నాటక రంగ నేపథ్యంలోని కుటుంబం లోంచి వచ్చి, నాటకరంగం మీద వెలిగి, సంభాషణల రచయితగా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సంభాషణల రచయితగా తనదంటూ ఒక తొలి ముద్ర వేశారు సాయి మాధవ్. ఆ తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి సినిమాలతో తన ప్రతి అడుగూ బలమైన ముద్ర వేసేలా దూసుకు వెళ్తున్నారు సాయి మాధవ్.  మహానటి, సయెరా నరసింహారెడ్డి, ఖైది నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు వంటి సినిమాలు వారు సంభాషణలు రాసిన ఇతర ప్రముఖ సినిమాలు.

సదస్సులో ప్రతినిధుల్లో అధిక శాతం చేయి తిరిగిన సాహితీవేత్తలే. అందుకే రక రకాల ప్రశ్నలు వేశారు.

“మీరు రాసిన సంభాషణల్ని యధాతథంగా సినిమాలో వాడతారా?.. మధ్యలో మార్చేస్తారా?.. అప్పుడు మీకెలా ఉండేది?.. సంభాషణలు ఏ దశలో మారిపోవచ్చు?.. మీరు చాలా గొప్పగా సినిమా రాసినప్పుడు, ఆ సంభాషణలకు విపరీతంగా గుర్తింపు వచ్చినప్పుడు – ఆ పేరు ఎవరికి వస్తుంది?..”

.. ఈ ప్రశ్నలకు అంతు లేదు కదా!

అయినా సాయి మాధవ్ చాల ఓపిగ్గా, ఉత్సాహంగా జవాబులిచ్చారు.

“సంభాషణల రచయిత ఎంతో గొప్ప సంభాషణ రాశాననుకున్నా, అవి దర్శకుడికి నచ్చాలి, హీరోకి నచ్చాలి, ఒక్కోసారి నిర్మాతకి కూడా.. సెట్ మీదకి వెళ్లాక ఏ కారణం వల్లనయినా ఏ దశలోనయినా మార్పులు చేయమని వాళ్లు అడగవచ్చు. మార్చి రాయాల్సి రావచ్చు.. అప్పుడు నాకు బాధ కలగవచ్చు.. అవును, మొదట్లో బాధ పడే వాడ్ని.. మథన పడేవాడ్ని.. అప్పుడు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతే! అప్పట్నుంచి అలవాటు పడిపోయాను..”

సంభాషణలు బాగుంటే పేరు వచ్చేదెవరికి – అన్న ప్రశ్నకి ఎన్.టి.రామారావు అనుభవం ఒకటి చెప్పారు సాయి మాధవ్:

“రామారావు ప్రముఖ హీరోగా వెలిగిపోతున్న రోజుల్లో ఆయన్ని ఒక జాతీయ పత్రిక ప్రతినిధి అడిగారు: ‘మీరు పలికే సంభాషణలకు ప్రజలు హర్షధ్వానాలు చేస్తుంటారు కదా! కాని ఆ సంభాషణలు రాసింది వేరే వాళ్ళయినప్పటికీ ఆ ఖ్యాతి మీకెందుకు వస్తోంది?’ అప్పుడు రామారావు గారు ఇచ్చిన జవాబు ఇది: ‘తాజ్ మహల్ కట్టింది ఎవరు బ్రదర్? ఇప్పుడు తాజ్ మహల్ గురించి ప్రస్తావన వస్తే ప్రజలు ఎవరిని తలుచుకుంటారు? అది కట్టినవారినా?’.. మీకూ అర్థమయింది కదా!”

తాను ఎన్.టి.రామారావుకి వీరాభిమాని అనీ, అందువల్ల తాను తొమ్మిదేళ్ల వయసులో 1982లో తెనాలిలో ఒక స్నేహితుడి ఫొటో స్టూడియోని ఎన్.టి.ఆర్ తెల్లవారుఝామున 3 గంటలకి ప్రారంభోత్సవం చేస్తుంటే ఆత్రుతగా వెళ్లానని, రామారావు గారు వచ్చి కుర్చీలో కూర్చుంటూనే తన కుడి చెయ్యి – ప్రక్కనే నిలబడ్డ తన భుజం మీద వేశారని, ఆయన అందర్నీ పేరు పేరునా పలకరించి లేచేదాకా తన భుజం మీద చేయి తీయలేదని, కదిల్తే ఎక్కడ ఆయన చేయి తీసేస్తాడో అన్న బెంగతో ఆ చేయి బరువుకి తాను ఎంతో కష్టపడి నిలబడ్డానని.. చెబుతూ, “అయినా ఎన్.టి.ఆర్ స్పర్శించిన ఆ భుజం మీద వేరెవ్వర్నీ నేనింతవరకూ చేయి వేయనివ్వలేదు” అంటూ సాయి మాధవ్ ఆ మధుర స్మృతిలో కొద్ది క్షణాలు మునిగిపోయారు.

“మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంలో ప్రేమ గురించి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు నిర్వచనాల్ని అద్భుతంగా ఇచ్చారు? అది ఎలా సాధ్య పడింది?”

ఈ ప్రశ్నకు నవ్వారు. “అలా చెప్పేస్తారా?.. సందర్భానికి తగినట్లు రాయాలి కాబట్టి రాశాను. అంతే!”

సంభాషణలు రాశారు. స్క్రీన్ ప్లే రాశారు. తరువాత దర్శకత్వం కూడా చేపట్టాలి కదా! మీకు పోటీ ఉండదేమో?

“చేయబోతున్నాను.. త్వరలో దర్శకుడిగా కూడా చూస్తారు.. పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. అలాగే ఇక్కడా ఉంది. కొంతమంది దర్శకులు వాళ్లే కథలు తయారు చేస్తారు. వాళ్లకి స్క్రీన్ ప్లే రాసి పెట్టే బృందం ఉంటుంది.. ఇది కూడా పోటీ రంగమే..”

తనకి జన్మనిచ్చింది, అన్నం పెట్టింది నాటకరంగం అనీ, అందుకే ఇప్పటికీ తాను నాటక రంగంలో కళాకారులకు, నాటక పరిషత్‌లకూ చేయూతనిస్తున్నాననీ ఆయన వివరించారు. వంగూరి చిట్టెన్ రాజుగారి కథల ఆధారంగా జరగబోతున్న నాటకోత్సవాల్లో ఒక నాటకాన్ని తాను స్పాన్సర్ చేస్తున్ననని కూడా ఉత్సాహంగా చెప్పారు.

ఇంతకీ, ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రానికి ముందు ఏడు చిత్రాలకి మాటలు రాసి, ఆ చిత్రాలు విడుదలకి నోచుకోని పరిస్థితుల్లో ఆదాయం లేక, అన్నీ ఖర్చులే కనిపించే రోజుల్లో నిరాశ, నిస్పృహల మధ్య అన్ని సంవత్సరాల పాటు ఎలా ఈ రంగాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారో చెప్పలేదు!

“కారణం ఒక్కటే. నా సామర్ధ్యం మీద నాకు నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా ఒక మంచిరోజు వస్తుంది అన్న నమ్మకం ఉంది. అది అతి విశ్వాసం కాదు, ఆత్మ విశ్వాసం. అదే నన్ను పారిపోకుండా నిలబెట్టింది..”

బుర్రా సాయి మాధవ్ కెరీర్ మనకి ఏం సంకేతమిస్తోంది?

Exit mobile version