Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిదురపో

[శ్రీ మైనంపాటి గోవింద రావు రచించిన ‘నిదురపో’ అనే కథని అందిస్తున్నాము.]

ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకటే మాట, ఒకటే బాట. వారి పేర్లు శర్మ, శాస్త్రి.

ఒక రోజు వారు సాయంత్రం పూట విహారం చేస్తూ లోక వ్యవహారాలు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

“చూడు శాస్త్రి, మన మహాపురుషుల ఆశయాలు ఎంత గొప్పవోయ్, వాటిని మనం, ఆచరించకపోవటం బాధగా ఉందోయ్” అన్నాడు శర్మ.

“నీకు కూడా శిలా విగ్రహం పెట్టించుకోవాలని కోరిక ఉందా?” అంటూ హాస్యమాడాడు శాస్త్రి.

“నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే నీవు హాస్యమాట్లాడటం బాగులేదోయ్ శాస్త్రి,” కోపంగా అన్నాడు శర్మ.

“లేకపోతే ఏమిటి, ఆశయాలు ఎందుకు ఆచరించడం లేదు? అందరూ ఆచరిస్తున్నారు కాబోతే అమలు చేయటం లేదు” అని చెప్పాడు శాస్త్రి

“ఎందుకు?” అని అడిగాడు శర్మ.

వెంటనే శాస్త్రి, “పిచ్చి శర్మా, గుప్పిట్లో ఉంటేనే రహస్య విలువ, గుప్పిట తిస్తే అంతా శూన్యం. తడిసిన బట్టలు ఎండలో ఆరగానే మడతలు వేసి ఎలా అల్మారాలో పెట్టుకుంటారో, ఆశయాలను నిద్రపోయే ముందు గుండెలో నుంచి తీసి చూసుకొని మరల భద్రముగా అలా గుండెలో పెట్టుకొని హాయిగా నిద్రపోవాలి. అంతేకాని, వాటిని తీసి ప్రదర్శించారో ఇంట్లో అప్పడాలు, వడియాలుగా వేగుతారు, వాకిట్లో తేనేటీగలు ముసురుకొంటాయి, విషపురుగులు కాటేస్తాయి. అంతేగాక ఆశయాలు ఎప్పుడు టాగ్‌‌లైన్ గానే ఉండాలి. ‘పెళ్ళాం’ అనే సినిమా టైటిల్‌కి, ‘లేచిపోయింది’ అనే టాగ్‌లైన్ పెడితే జనాలు ఆ లైన్ చూసి ఆకర్షితులై సినిమా చూస్తారు. ఎందుకు? పెళ్ళాం పేరు కన్నా, లేచిపోయింది అనేది అట్రాక్షన్. ఇది అందరు తెలుసుకొన్న జీవిత సత్యం, నీవు తప్ప. నిగ్రహం లేని ఆశయాలు విగ్రహాలకే పరిమితం” అంటూ నవ్వుతు శాస్త్రి సెలవిచ్చాడు.

“సరే, మన చరిత్ర వైభవం ఎంతో గొప్పదోయ్. చరిత్ర ఇంకా తెలుసుకోవాలని ఈ మధ్య లైబ్రేరికి వెళితే చరిత్ర పుస్తకాలు లేవన్నాడోయ్. మరి విడ్డూరం, లైబ్రరీలో చరిత్ర పుస్తకాలు లేకపోవటమేమిటోయ్?” అని ప్రశ్నించాడు శర్మ.

ఆ మాట వినగానే శర్మ వైపు ఒక పిచ్చి చూపు చూసాడు శాస్త్రి

“ఏమిటోయ్ అలా చూస్తావు?” అన్నాడు శర్మ.

“లేకపోతే ఏమిటి? నీవు వేదాంత సారమే కానీ జీవన సారం తెలుసుకోలేకపోతున్నావ్” అన్నాడు శాస్త్రి.

“జీవన సారమా? అదేమిటి?” అని అడిగాడు శర్మ

“మన చరిత్ర గొప్పదే. ఇప్పుడు మనిషి, చరిత్ర కన్నా గొప్పవాడైనాడు. చిన్న, చితక, ముసలి, ముతక వయస్సు తేడా లేకుండా ప్రతివాడు లైబ్రరీకి పోయి చరిత్ర అంతా తప్పిదాలని అన్వేషణ చేసి, సత్యాన్వేషణ వెలికి తీద్దామని తమకు నచ్చని కాగితాలను చించేస్తు, చివరకు ఇదిగో ఈ రోడ్డుపై గుంతలు పడినట్లు మన చరిత్రకు కన్నాలు పెడుతున్నారు. ఈ గుంతలు పూడ్చేది లేదు, చరిత్ర కన్నాల రహస్యం తెలిసేది లేదు” అని సెలవిచ్చాడు శాస్త్రి. “ఇంకా పుస్తకాలు ఉంచితే చెదలు పట్టిన చరిత్ర అవుతుందేమో అని భయపడి తెప్పించటం మానివేశారు” అన్నాడు.

“ఎందుకు, చరిత్రను పాడుచేస్తున్నారు?” అని అడిగాడు శర్మ.

“మనిషిలో మార్పులు వచ్చాయి. ఇదివరకు వ్యవస్థలో తాను ఒక భాగం అనుకున్నాడు. ఇప్పుడు తానే ఒక వ్యవస్థ అంటున్నాడు. చరిత్ర, వేదాంతం, పురాణాలు తాను చెప్పుట లేదు, తాను చెప్పేదే చరిత్ర, వేదాంతం, పురాణాలు అంటున్నాడు. తెలియకపోయినా తెలుసుకోవాలనే సంచిత భావం లేకుండా తెలుసు అనే సంకుచిత భావన ఎక్కువైపోయింది. ఆ సంకుచితములోనే ఈ చించటం” అన్నాడు శాస్త్రి.

“మరి చరిత్ర తెలుసుకోవటం ఎలా?” ప్రశ్నించాడు శర్మ

“చరిత్ర తెలుసుకోవటానికి పేపర్, పెన్ను ఉంటే చాలు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్రాసుకోవచ్చు. సంక్షేమ పధకాలు, సన్నిహిత్యాలు ఇలా..” అంటూ శాస్త్రి చెప్పబోతుంటే..

“సన్నిహిత్యము అంటే గుర్తు వచ్చింది. సహజీవనంపై నీ అభిప్రాయం ఏమిటోయ్?” అని శర్మ అడిగాడు.

“ప్రస్తుతం సహాపంక్తి భోజనాలు కన్నా, సహజీవనాల గురించే మక్కువ చూపుతున్నారు జనాలు. రాను రాను తల్లెవరో, తండ్రెవరో తెలియదేమో, వారస జాతి అంతా వాముచాటు జాతి అవుతుందేమో అని నా అభిప్రాయం” అని సెలవిచ్చాడు శాస్త్రి.

పొలాల మీదుగా నడుస్తూ, “ఏమిటోయ్ పొలాలన్నీ ఇలా బీడుగా ఉంచారు?” అని శర్మ అడిగాడు.

“అదిగో ఆ సర్వే నెంబరు నుంచి ఆ సర్వే నెంబరు వరకు కనిపిస్తున్న పొలాలలో 12 వరసల జాతీయ రోడ్డుకు, అదిగదిగో ఆ మూల కనిపిస్తుంది, ఆ సర్వే నెంబరులో కనిపిస్తున్న పొలాలలో విమానాశ్రయాలను, ఇంకా మిగిలిన భూమిని రాబోయే రోజులలో వచ్చే ప్రాజెక్ట్ లకు 90 సంవత్సరాల వరకు ఎకరాకు రూ.1/- చొప్పున బడాయి కంపెనీలకు లీజ్ ఇవ్వటానికి ప్రభుత్వం వారు భూమిని తీసుకొన్నారు. అందుకే అవి బీడుగా ఉన్నాయి” అన్నాడు శాస్త్రి.

“ఇవి అన్ని చూసి మనది అభివృద్ధి చెందిన దేశం అందామా? లేక మొదటినుంచి, ఉచిత బస్ వరకు సంక్షేమ పథకాలు ఇంకా ఇస్తునందుకు పేద దేశం అందామా? నాకు అర్థం కావటం లేదోయ్ శాస్త్రి.”

“ఎవరి అభివృద్ధి ఏమో కాని, అభివృధి ఆసరా కోసం వెన్నెముకను అమ్ముతున్నాము. పోను పోను ఆ వెన్నెముకే నిలబడటానికి ఆసరాగా ఏ అభివృద్ధి స్తంభం పట్టుకొని నిలబడాలో?” అంటూ శాస్త్రి సెలవిచ్చాడు.

“ఇలా బీడు పెడితే మనకు బ్రతకటానికి తిండి ఎట్లానయ్యా?” అడిగాడు శర్మ.

“భయపడకు, ప్రక్కనే చైనా ఉందిగా” అని సెలవిచ్చాడు శాస్త్రి.

వారు నడుస్తుంటే వారికీ కొంతమంది కుర్రాళ్ళు తలకు, చేతులకు, కాళ్లకు కట్టు కట్టుకొని ఎదురు పడ్డారు. వారిని చూసి శర్మ, “అదేమిటోయ్, ఆ కుర్రాళ్ళు అలా కట్లు కట్టుకున్నారు? ఆక్సిడెంట్ ఏమైనా జరిగిందా?” అని అడిగాడు.

“చీకటిని పారత్రోలటానికి రాజకీయ మంటలు పెడుతున్నారు కదా? ఆ మంటలే, వెలుగులు అనుకోని కాళ్ళు చేతులు కాల్చుకొని అలా కట్లు కట్టుకొని తిరుగుతున్నారు.”

“మరి వాళ్ళ పెద్దవాళ్ళు ఏమి అనరా?” అని ప్రశ్నించాడు శర్మ.

“పిచ్చి శర్మా, పెద్ద అనే పదము పదకోశం నుంచి ఎప్పుడో తీసివేశారు. ఇప్పుడు సంబంధాలు A.C., Non-A.C. కే పరిమితం.”

“అంటే?”

“పిల్లలు ప్రయోజకులైతే A.C.లో ఉంటారు. పనికిరాకపోతే Non-A.C లో ఉంటారు . వాళ్ళ భవిష్యత్ అలా నిర్ణయించబడింది” అని శాస్త్రి చెప్పాడు.

“చూసావా శాస్త్రి, టమోటాలు కేజి 1/- రూపాయట. ఉల్లిపాయలు కేజీ 5/- రూపాయలట. మిగతావి కూడా మద్దతు ధర లేవని, రైతులు మురుగు కాలువలలో పోస్తున్నారుట. ఎంత విచిత్రం” అన్నాడు శర్మ.

“పిచ్చి శర్మ, చిత్రాలు చేసేది శివ తత్వం. విచిత్రాలు చేసేది రాజకీయ తత్వం. మద్దతు ధర ఎలా ఉంటుందంటే రైతు అమ్ముదాము అంటే ఉదయం ధర కేజీ 1/- రూపాయి; రైతు కొందామంటే సాయంత్రం ధర కేజీ 100/- రూపాయలు. అభివృద్ధి పేరిట వాణిజ్య కరెంటు ఖర్చులు లక్ష రూపాయులైనా మాఫీ చేస్తారు కానీ తినే తిండికి కష్టపడే వారి మనసులను ఖూనీ చేయటానికి ఏ మాత్రం సందేహించరు. రాజకీయం తమ ఓటు బ్యాంక్‌కు తప్ప ఎవరికీ మద్దతు చూపదు. అంతా పారదర్శకమే శర్మాజీ,” అని రాజకీయ గీతా సారాంశాన్ని ఉపదేశించాడు శాస్త్రీజీ.

ఇంతలో శర్మ కాలు జారి బురదలో పడబోయాడు. వెంటనే శాస్త్రి పట్టుకొని, “జాగ్రత్త శర్మ, పారదర్శకమేమో కాని, మనకు ఈ పాచి తప్పదు. జాగ్రత్తగా అడుగులు వేసి నడవడమే తప్ప మనకు ఇంకో దారి లేదు” అన్నాడు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.

***

కనుమూసిన, తెరచిన
కనిపించే నిజమిదేరా
ఇలలో నీతి అంతా నేతి బీరకాయేరా
నిదురపో.. నిదురపో

(సమాప్తం)

Exit mobile version