Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిలువునీడ

[డా. హిమబిందు గారు రచించిన ‘నిలువునీడ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నిషి నీడ మహాద్భుత దృశ్యం
ఎండ పరిభ్రమమణాన్ననుసరించి
కొన్నిసార్లు పల్చగా
ఇంకొన్నిసార్లు గాఢంగా
కొన్నిసార్లు పొట్టిగా
అప్పుడప్పుడు మరీ పొడుగ్గా
నీడల భాష కుహనా కీర్తిఘోష
ఎంతమందికి అర్థమవుతాయి
ప్రతి పురుషుడి విజయం వెనుక
ఒక స్త్రీ ఉంటుందనేది ఒప్పుకోని నిజం
ప్రతి స్త్రీ గెలుపు వెనుక ఆమె పోరాటమే
ఉంటుందనేది రహస్య వాస్తవం
స్త్రీని నీడగానే ఉంచేస్తూ
ఆ నీడ వెదజల్లే
నిండుప్రకాశంలో కాంతులీనేవాళ్ళు
దన్నయిన అదృశ్య తేజస్సు ఆరిపోతే
అమావాస్యలుగానే అణగారిపోతుంటారు
ఆమె మాత్రం సూర్యునిలా
స్వయంప్రకాశినిగా సాగిపోతూ
విశ్వానికి వెలుగిస్తూనే ఉంటుంది
నీడబలం గురించి వెనుదిరిగి చూడదు
వ్యర్థ ప్రశంసల కోసం వేసట లేదు
ఆమెకి నిలువునీడ ఆమే!
ఆమెని నిలిపే జాడ కూడా ఆమే

Exit mobile version