ఆకుపచ్చని నీడై నిలచిన మా వూరే నా చిన్న తనపు జాడ ఎప్పటికీ
చెరువు వడ్డున ఒంటి కాలిపై తపస్సు చేసే కబోది పక్షుల చెట్టూ చెరువులో అలల అవతల పెద్ద కళ్ళతో కవ్వించిన ఆ తామరలూ కలువలూ దూరంగా మంద్రంగా మోగే గుడిగంటా నా కలల వేదికకు ఎప్పటికప్పుడు రంగులతెరలు కడతాయి ఆనంద సంగీతమూ అమరుస్తాయి
అల్లరి కొంకికర్రతో లాగి తెంపుకున్న కొన్ని దొంగవూహలు నవ్వుల సీమచింతలై వామనకాయలై రాలిపడుతుంటాయి
అంతులేని చల్లని కలలా పారుతూ వచ్చి తనతో కబుర్లాడమని కవ్వించిన ఆ యేరు తలచినపుడల్లా సేదతీర్చి ఎగుడు దిగుడుల జీవితపు ప్రవాహపాఠం చెపుతూంటుంది
మమ్మల్ని సాహసవీరులని చేసేందుకు కొండకొమ్మున నిలిచి పిలిచి పలకరించి మా జేబు సంచులనిండా వజ్రపుతునకల బంకముక్కలను నింపిన ఆ తుమ్మ చెట్టు గాఢమైన బంధాన్ని పెంచుతూ ధైర్యాన్నిచ్చే పెద్దన్నే అవుతుంది
రహస్యంగా కాగితపు పొట్లంలో స్నేహితులు దాచి తెచ్చిన మిఠాయి మాటలు ఎప్పటికీ నోరూరించి నవ్విస్తూ మనసును తీపి చేస్తూ నిలుస్తాయి
ఈ పట్టణపు నడిరోడ్ల రణగొణలమధ్య కృత్రిమంగా చిక్కుకున్న నన్ను పిలుస్తూ ప్రేమగా నిస్సహాయంగా ఇంకా దగ్గరగా ఓదార్చేందుకు చేతులు చాస్తూ మా వూరు.
పుట్టింది 1966 లో గుంటూరులో. విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™