[కస్తూరి మురళీకృష్ణ గారి ‘నిను విడుదల చేస్తాం రామయ్యా!!!’ అనే కథని అందిస్తున్నాము.]
ఎన్నో ఏళ్ళ కల నెరవేరబోతోంది.
ఎంతో ఉద్విగ్నంగా ఉంది. ఆనందంగా వుంది. ఉత్తేజితంగా వుంది.
నా మనోస్థితికి తగ్గట్టుగానే వాతావరణం కూడా అత్యద్భుతంగా ఉంది.
గత కొన్ని వారాలుగా సూర్యుడు భూమితో దోబూచులాడుతున్నాడు. వర్షం పెద్దగా పడటంలేదు కానీ, ముసురు పట్టివుంది. చల్లగాలి చల్ల చల్లగా వీస్తోంది. అందరూ చలి చలి అంటున్నారు కానీ, నాకు మాత్రం తల్లి చల్లని చేయితో నిమురుతున్నట్టుంది.
దీనికి తోడు మేము అడవి ప్రాంతంలో ఘాట్ రోడ్డులో ప్రయాణం చేస్తున్నాము. పాము కూడా ఈ ఘాట్ మెలికలు చూసి కొత్త కోణాలు నేర్చుకుంటుంది.
వర్షాలు పడటంవల్ల, పచ్చదనం పరవళ్ళు త్రొక్కుతోంది.
ఎన్నో ఏళ్ళ కల ఇది.
భారత్‌లో అడుగుపెట్టినప్పటినుంచీ ఎవరేమన్నా నాదొక్కటే మాట, ‘ముందు గుట్టమీద గుడికి వెళ్ళాలి. ఆ తరువాతే ఎటైనా’
నా జీవితం ఈ గుట్ట మీద గుడితో ముడిపడివుంది.
కాలేజీలో ఎడ్యుకేషనల్ టూర్ కోసం వచ్చినప్పుడు ఈ గుడి చూశాను. అప్పుడు రోడ్లు ఇంత చక్కగా లేవు. కొండ ఎక్కేందుకు ఎంతో కష్టపడాల్సివచ్చింది.
కానీ, కొండ ఎక్కిన తరువాత మరో ప్రపంచపు ద్వారాలు తెరచుకున్నట్టనిపించింది.
ఈ ప్రపంచంలో కళను సృష్టించటం, ఆ సృష్టించిన కళను అనుభవించటం తప్పించి జీవితానికి మరో పరమార్థం లేదు అని ఓ తత్త్వవేత్త అన్నాడు. కానీ, కళాకారులకు ప్రేరణ నిచ్చి ప్రజలు జీవితాన్ని సార్ధకం చేసుకునే దారి చూపే కళా సృజనకు ప్రేరణ నిచ్చే ప్రకృతిని సృజించింది భగవంతుడు అని ఎవరికైనా సందేహం వుంటే ఆ సందేహాన్ని పటాపంచలు చేసి, ఇదంతా భగవంతుడి సృజననే అనే దానికి నిరూపణగా వుందీ కొండపైన మందిరం.
నేను నోట మాట రాక నిలచిపోయాను. నా మనసు మనసులో లేదు. నా సర్వేంద్రియాలు తాము భౌతికంగా అనుభవించగల ఆనంద పరిధిని దాటిని ఆనందాన్ని అనుభవించలేక స్తబ్ధమయి, తమలోకి తాము ముడుచుకుపోయిన భావన కలిగింది.
సర్వ ప్రకృతిని తనలో ఇముడ్చుకున్నట్టు గర్భగుడిలో ఉన్న దైవ విగ్రహ సౌందర్యాన్ని చూసి శరీరాన్ని మరచి ఏవేవో లోకాలలో విహరిస్తున్నదెవరని ఆలోచిస్తూ విహరించాను. మాటలలో చెప్పలేని అలౌకికానందాన్ని అనుభవించాను.
దర్శనం అయిన తరువాత నాతో వచ్చిన మిత్రులందరూ, పేకాటలో పడ్డారు. నాకు గదిలో కూర్చోవటం నేరం అనిపించింది.
ఎందుకో, ఆ కొండ మీద ప్రతి అణువూ పవిత్రమన్న భావన కలుగుతోంది. చుట్టూ విరాట్స్వరూప ప్రదర్శనతో ప్రకృతి నిశ్శబ్దంలో అతి నిగూఢమయిన రహస్యాలు జగతిపై విస్తరిస్తున్నట్టనిపిస్తున్నది. ప్రతి పూవు, ప్రతి ఆకు, ప్రతి వృక్షం అనంతకాలంనుంచీ సంగ్రహించిన సర్వ విజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తున్నట్టనిపిస్తున్నది.
వీచేగాలి ఏవేవో రహస్యాలను గుసగుసలతో ప్రకటిస్తున్నట్టుంది. ఆ రహస్యాలను పట్టించుకోకుండా తమ ధోరణిలో తాము తిరుగుతున్న మనుషులను చూసి అప్పుడప్పుడూ అసహనంతో కోపం ప్రదర్శిస్తున్నట్టు వేగంగా, విసురుగా వీస్తున్నది గాలి.
ప్రాకృతిక శబ్దాలలో, నిశ్శబ్దాలలో ఏవేవో స్వరాలు, ఎన్నెన్నో కోటి కోటి యుగాల భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంవేదనలు, ఆశలు, నిరాశలు తరగలు తరగలుగా ఎగసెగసిపడుతున్నట్టనిపించింది.
ఏదో అలవికాని ఆనందం, ఆ ఆనందంతో పాటూ, ఏదో అంతులేని ఆవేదన.. ఒకే సమయంలో విభిన్నమైన భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఎక్కడ ఉన్నానో మరచిపోయాను. ఏదో లోకంలో ఉన్నవాడిలా నడుస్తూ, ఎటు వెళ్తున్నానో తెలియకుండా నడిచాను.
అలా వెళ్తూంటే, అద్భుతమయిన దృశ్యం కనిపించింది.
సాయంత్రం సమయంలో నీలి కొండలు ఒక వైపు, మరోవైపు అస్తమిస్తున్న సూర్యకిరణాల రంగుల్లో తడిసి పులకిస్తూ వంపు తిరిగి కనుమరుగవుతున్న నదినీళ్ళపై మంద్రంగా కదలుతున్న అలలతో ప్రవహిస్తున్న నది..
ఒక్క సారిగా నాకు ఊపిరి అందలేదు. అదే సమయానికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అక్కడే కూలబడిపోయాను.
వెలుగు చీకటిగా ఎప్పుడు మారిందో ఎంత సేపయిందో కూడా గమనించలేదు నేను. ఎంత సేపు అలా కూర్చుండిపోయానో కూడా తెలియదు.
చివరికి పోలీసు వచ్చి వెళ్ళిపొమ్మనటంతో ఈ లోకానికి వచ్చిపడ్డాను.
తిరిగి అందరి దగ్గరకూ వెళ్ళాలనిపించలేదు. గుడిలోకి దారి తీశాను.
ఉదయం గుడిలోకి వెళ్ళటం వేరు. రాత్రి పూట గుడిలో అడుగుపెట్టటం వేరు. ఇంతకుముందు దర్శనం తొందరలో గుడి ఆవరణను, స్థంభాలను, గోడలను సరిగ్గా చూడలేదు. ఇప్పుడు దర్శనం తొందరలేదు, అన్నిటినీ తీరికగా చూస్తూ మెల్లిగా గర్భగుడివైపు వెళ్ళాను.
చీకటిలో, గర్భగుడిలో, చిన్న దీపం వెలుగులో భగవంతుడిని దర్శించటం ఒక మరపురాని అనుభవం..
జీవితాంతం మరపురాని అనుభవం!!! జీవనగతిని నిర్దేశించిన అనుభవం!!!
అసలు నేనెవరో, ఏమిటో, ఎక్కడున్నానో సర్వం మరచిపోయాను. కళ్ళముందు, దీపం వెలుగులో విగ్రహం కనిపిస్తున్నది. హృదయంలో అఖండ జ్యోతి అప్రతిహతంగా వెలుగుతోంది. మనసులో దివ్య జ్యోతి వెలుగులు ప్రసరిస్తున్నది. వీటన్నిటికీ అతీతంగా, లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగినతుది, అలోకంబగు పెంజీకటికవ్వల ఏకాకృతి వెలిగే జ్యోతి వేనవేలరేకలతో వెదజల్లుతున్న వెలుగులో తడిసి ముద్ద అయ్యాను.
అలా ఎంతసేపు దైవ విగ్రహాన్ని, ఆ విగ్రహంనుంచి వెలువడుతూ, హృదయాన్ని, మనసునూ, వీటికతీతమైన ఇంకేదో చైతన్యాన్ని ముంచెత్తుతున్న వెలుగుపాతాన్ని అనుభవిస్తూ కూచుండిపోయానో తెలియదు, చివరికి, పూజారి, తట్టి ‘సమయమైంది. వెళ్ళండి’ అని మృదువుగా అనేవరకూ ‘నేను’ అన్న స్పృహ ‘నాకు’ లేదు.
ఆ క్షణమే నా భవిష్యత్తు నిర్ణయమైపోయింది.
భారతీయ తత్వంలో మంత్రాలు, శ్లోకాలు, ప్రతిపాదనలు, సర్వం, మూడు విభిన్నమైన స్థాయిలలో సత్యం శివం సుందరంలా, సత్ చిత్ ఆనందంలా, భూమి, ఆకాశం, అంతరిక్షంలా, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికంలా.. ఇలా ప్రతీదీ మూడు స్థాయిలలో అధ్యయనం చేయాలని, విశ్లేషించాలని, అర్ధం చేసుకోవాలని, అన్వేషించాలనీ బోధపడింది. నా జీవితం భారతీయ వాఙ్మయాన్ని, పాశ్చాత్య దృష్టితో కాక, భారతీయ దృక్కోణంలోనే విశ్లేషించటానికే అంకితం అనీ ఆక్షణంలో నిర్ణయించుకున్నాను.
మరుసటి రోజు గుడి తెరవకముందే వెళ్ళి నిలబడ్డాను. దాదాపుగా మధ్యాహ్న భోజనం సమయం దాకా గుడిలోనే ఉన్నాను. తరువాత గుడి చుట్టూ తిరిగాను. గుడి గోడలపైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూశాను. ఇప్పుడవన్నీ రాత్రికన్నా భిన్నంగా కనిపిస్తూ, భిన్నమైన ఆలోచనలను కలిగిస్తున్నాయి. మార్మికమైన సందేశాలనిస్తున్నాయి.
అత్యద్భుతమైన రీతిలో జీవం ఉట్టిపడేలా ఉన్న ఆ శిల్పాలు తమలో ఉన్న ఎంతో జ్ఞానాన్ని పంచేందుకు సిద్ధంగా వున్నట్టనిపించింది. ఆనాటి శిల్పులు రాళ్ళపై లిఖించిన కవిత్వాన్ని మార్మిక విజ్ఞానాన్ని అర్థం చేసుకోమని అభ్యర్ధిస్తున్నట్టున్నాయవి. పురాణగాథలు, ఇతిహాసాల శ్లోకాలకు దృశ్య రూపాలు తమవైపు చూసేవారికి అనంతమైన పరిజ్ఞ్నానాన్ని పంచిపెట్టేందుకు ఆత్రపడుతున్నట్టు తోచాయి. కానీ, సాయంత్రం తిరిగి వెళ్ళాల్సిరావటంతో, అతి అయిష్టంగా గుడిని వదలి వెళ్ళాను. వదలేముందు మరోసారి దర్శనం చేసుకున్నాను. వీలయినంత త్వరలో ఎలాంటి తొందరలు లేకుండా, ఒక్కడినే రావాలని అనుకున్నాను.
తిరిగి వచ్చిన తరువాత నేను మామూలుగా వుండలేకపోయాను. అందరితో గతంలోలా కలవలేకపోయాను. మామూలుగా నేను చదివే చదువు యాంత్రికంగా చదివాను.
ప్రపంచం ప్రతి అణువూ ఏదో అద్భుతమైన సత్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తూంటే, దాన్ని విస్మరించి ఏమీ తెలియనట్టు ఉండలేకపోయాను.
పాసయ్యేందుకు అవసరమైనంత చదువు, అవసరమైనంత వరకే చదివాను. మిగతా సమయం అంతా భారతీయ తత్త్వం, వాఙ్మయం చదవటంలో వెచ్చించాను. సంస్కృతం నేర్చుకున్నాను. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వ్యాఖ్యానాలు, మంత్రం, తంత్రం అధ్యయనం చేశాను.
అదేమిటో, మంత్రాలలో ఒదిగివున్న పరమార్థాలు నా కోసమే ఎదురుచూస్తున్నట్టనిపించేది. అర్థం మనసు గ్రహించేది. తత్వశాస్త్రంలోనే పరిశోధన చేశాను.
రిసెర్చ్ జర్నళ్ళలో నా రచనలు దేశవిదేశీయులను ఆకర్షించాయి. విదేశీ యూనివర్సిటీ నుంచి పిలుపొచ్చింది. అలా దేశం వదలి వెళ్ళి మూడు దశాబ్దాలయింది.
అయితే, ఎక్కడ ఉన్నా, ఏంచేస్తున్నా, నా మనసులో, నా కళ్ళల్లో, ఆ రోజు రాత్రి విగ్రహం దగ్గర గడిపిన సమయమే మెదలుతూండేది. మళ్ళోసారి వెళ్ళాలనుకున్న నా కోరిక తీరనేలేదు. ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ పొందాలనివుంది. గుడి గోడలపైన పూర్వీకులు భావితరాల కోసం చిత్రించిన శాస్త్ర పాఠ్యపుస్తకాలను పఠించాలని ఉంది.
చివరికి ఇన్నాళ్ళకు ఆ కల నెరవేరబోతోంది, అదీ, నేను పట్టుబడితే.
దారిలో నాకు అక్కడక్కడా ఏవో పోస్టర్లు కనబడ్డాయి. గుడిని ప్రభుత్వం నుంచి విముక్తం చేయాలనీ, హిందువుల గుళ్ళు హిందూ ధార్మికులే నడపాలనీ. అవి చూసి నాకు నవ్వొచ్చింది. ఏదో ఒక ఇష్యూ కావాలి, గోల చేయాలి, పేరు సంపాదించాలి, ఆ తరువాత రాజకీయాల్లో సంపాదించాలి. అంతే!!
అందరూ ముందు తిరుపతి వెళ్ళాలి అన్నారు. కానీ, తిరుపతి దర్శనానికి ముందు బుక్ చేసుకోవాలి. గంటలు గంటలు క్యూలో నుంచోవాలి అన్నారు. నేను వచ్చిన సమయంలో ఏవో బ్రహ్మోత్సవాలున్నాయని ధర్మ దర్శనం, అంటే, ఎలాంటి టికెట్ లేకుండా చేసే దర్శనం, రద్దు చేశారట. అదీగాక, ఈ సమయంలో తిరుపతిలో వుండేందుకు కూడా కష్టమన్నారు.
“అదేమిటి, ఇంతకుముందులా ఎప్పుడంటే అప్పుడు దర్శనం కుదరదా?” అడిగాను. నేను గత ముప్ఫై ఏళ్ళుగా ఇటువైపు రాకపోవటంతో ఇక్కడేమవుతోందో తెలియదు.
“మన ఏ గుడిలో కూడా దర్శనం అంత సులభం కాదు. చిన్న చిన్న గుళ్ళలో కూడా టికెట్ దర్శనాలున్నాయి. ప్రసాదం అమ్మకాలున్నాయి.” చెప్పాడు నా మిత్రుడు. “అందుకే మేము ఏ గుడికి వెళ్ళాలన్నా కనీసం నెలా రెండు నెలల ముందు పనులు మొదలుపెడతాము” చెప్పారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది.
“మనకు దర్శనం చేసుకోవాలనిపించినప్పుడు గుడికి వెళ్ళటం కుదరదా? భగవంతుడికి భక్తుడికి నడుమ ఇన్ని కఠినమైన అడ్డంకులున్నాయా?” అడిగాను.
“కుదరదు. ఇప్పుడు చూడు నువ్వు వెళ్ళాలనుకుంటున్న గుట్టమీద గుడికి మేమెళ్ళీ ఇరవై ఏళ్ళు దాటివుంటుంది. కానీ, అక్కడ నాకో ఫ్రెండున్నాడు. వాడు సహాయం చేస్తానన్నాడు. అందుకని మీరు వెళ్దామనగానే బయలుదేరాను” రోడ్డు వైపు చూస్తూ చెప్పాడు నా ఫ్రెండు.
ఇంతలో ఘాట్ రోడ్ పూర్తయింది. వాహనాల రద్దీ ఎక్కువయింది. నాలుగు రోడ్ల కూడలిలా, నాలుగువైపులనుంచీ వాహనాలు అక్కడ కలసి ఒకే రోడ్లో ప్రయాణిస్తున్నాయి. అందుకని వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి.
“వాతావరణం బాగుంది కదా, అందుకే రష్ ఎక్కువున్నట్టుంది” అన్నాడు నా ఫ్రెండు.
ఇంతలో పెద్ద సంఖ్యలో రోడ్డు పక్కన వాహనాలు, మనుషులూ ఆగి కనిపించారు.
“ఇంతమంది ఉన్నారిక్కడెందుకు?” ఆడిగాను.
“ఇక్కడొక దేవుడున్నాడు. ఆయన దర్శనం చేసుకోందే ముందుకు వెళ్ళకూడదు” కారును ఓ పక్క పార్క్ చేస్తూ చెప్పాడు.
క్రితంసారి వచ్చినప్పుడీ దేవుడిని దర్శించామో, లేదో, గుర్తుకురావటం లేదు.
ఆలోచిస్తూ క్యూలో నిలబడ్డాను. క్యూ పెద్దగా వుంది.
రకరకాల మనుషులున్నారు. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దేశకాల పరిస్థితుల చర్చలు సాగుతున్నాయి. రాజకీయాల నుంచి, సినిమాల ద్వారా, వ్యక్తిగతాల వరకూ మాటలు వినిపిస్తున్నాయి.
క్యూ నెమ్మదిగా సాగుతున్నది.
సాగుతూ, సాగుతూ, షెడ్ లాంటి దానిలోకి ప్రవేశించింది క్యూ. దూరంగా దైవ విగ్రహం కనిపిస్తున్నది.
షెడ్ గోడలకిరువైపులా, పలు రకాల దేవతల చిత్రపటాలున్నాయి. పురాణగాథల పెయింటింగులున్నాయి.
కానీ, ఎవ్వరి దృష్టి వాటిపైన లేదు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
అక్కడున్న ఎవ్వరికీ తాము దైవ దర్శనంకోసం వచ్చిన భావన ఉన్నట్టులేదు. ఏదో పిక్నిక్కి వచ్చి దారిలో చూడాల్సినదాన్ని చూడటం కోసం క్యూలో నుంచున్నట్టున్నారు తప్ప పవిత్ర భావన లేదు.
కాస్సేపటికి విగ్రహం ముందుకు వెళ్ళేను. పూజారి తీర్థం ఇస్తున్నాడు. తీసుకున్నాను.
విగ్రహం చూడగానే గుర్తుకువచ్చింది.
క్రితంసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విగ్రహం ఒక చెట్టు క్రింద వుండేది. అందరూ ఆగి దండం పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు ప్రదక్షిణకు అవకాశమేలేదు.
“నడవండి. నడవండి”. పూజారి పక్కన యూనిఫారంలో ఉన్నాయన అరిచాడు.
తలవంచుకుని ముందుకు నడిచాను.
‘రాకుండా వుండాల్సిందా?’ ఎందుకో అలా అనిపించింది. ఆ ఆలోచనను అణచివేశాను.
కానీ గతంలో నేను చూసిన దానికీ, ఇప్పుడు కనబడుతున్నదానికీ నడుమ సమన్వయం కుదరటంలేదు.
కారు ముందుకు పోతున్నాకొద్దీ, అసలు గతంలో ఇక్కడికి వచ్చినట్టే అనిపించటంలేదు. ఎటు చూసినా తారు రోడ్లు, వాహనాలు కనిపిస్తున్నాయి. దారికి ఒక పక్క ఆ దారిలో వెళ్తే ఏమేమి వస్తాయో సూచించే బోర్డులున్నాయి.
నాలుగు రోడ్ల కూడలి వచ్చింది.
“ఎటు వెళ్దాం?” అడిగాడు.
మేము ఇంతకు ముందు వచ్చిన సత్రం పేరు చెప్పాను. అక్కడ బోర్డు చూసి ఆ వైపు నడిపాడు కారు.
ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. రోడ్డు పైన వాహనాలు, మనుషులూ, గుంపులు గుంపులుగా..
“ఇదే సత్రం” అంటూ కారు ఆపాడు.
దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నాకు గుర్తున్న సత్రం కాదది. అదొక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లా వుంది.
నా ఫ్రెండ్ దారి తీస్తే నేను అనుసరించాను.
అక్కడ ఎంతో మంది క్యూలో ఉన్నారు.
నేను నిలబడి చుట్టూ చూస్తూంటే, నా ఫ్రెండ్ రిసెప్షన్ వైపు వెళ్ళాడు.
అంతా మారిపోయింది.
క్రితంసారి మేము వచ్చినప్పుడు ఒకే ఫ్లోర్ వుండేది. ప్రశాంతంగా వుండేది. ఇప్పుడంతా గోల గోలగా వుంది.
క్రితంసారి ఈ సత్రంలో భజనలు జరుగుతూండేవి. ఈ సత్రం వెనుకనుంచే నేను నడుస్తూ కొండ అంచుకి వెళ్ళాను. ఇప్పుడు అంతా భవనాలు, మధ్యలో తారు రోడ్లు.. తప్ప కొండలు కనబడటంలేదు. లోయలు కనబడటంలేదు. నది కనబడటంలేదు.
ఇక్కడ లొడలొడ మనుషుల మాటలు. బయట రోడ్ మీద వాహనాల మోతలు.
ఇంతలో ఎవరో నన్ను బయటకు రమ్మని అభ్యర్ధిస్తున్నట్టు చేశాడు. డబ్బులడుగుతాడేమో అనుకుంటూ వెళ్ళాను.
నా చేతిలో ఏవో పాంప్లెట్లు పెట్టాడు.
“సర్, ఈ రాతి దేవుళ్ళు అసలయిన దేవుళ్ళు కారు. రాతిలో దేవుడుంటాడా ఎక్కడయినా? అసలయిన దేవుడు..”, ఇంకా ఏదో చెప్పబోతూంటే, పాంప్లెట్లు అతని చేతిలోనే కుక్కి లోపలకు వచ్చేశాను.
ఎందుకో మనసు పాడయిపోయింది. మత మార్పిళ్ళ గురించి తెలుసు. నా మిత్రులే ఎందరో పరాయి మతం తీసుకున్న వారున్నారు. కానీ, ఇలా ప్రత్యక్షంగా ఎవ్వరూ మతం విషయం ప్రస్తావించలేదు. ఎవరి మతం వారిది. మతం మారటం వ్యక్తిగతం. అంతే.. కానీ, ఎందుకో చేదయిపోయింది నోరు.
కాస్సేపటికి ముఖం వ్రేలాడేసుకుని వచ్చాడు నా మిత్రుడు.
“ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు వచ్చే వీలులేదట. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడ గదులివ్వరట.” నీరసంగా చెప్పాడు.
“అందరికీ నెట్ గురించి తెలియదుకదా? వారి సంగతేమిటి?” అడిగాను.
“నెట్ రాకపోతే, వేరే చోట వెతుక్కోవాలి. ఇక్కడికి మాత్రం రాకూడదట” చెప్పాడు.
ఇద్దరం బయటకు నడిచాము.
అక్కడ పలు రకాల సత్రాలున్నాయి. అన్నీ ఫుల్. ముందే బుక్ చేసుకోవాలంటున్నారు. కొన్ని సత్రాలలో ఖాళీలున్నాయి. కానీ, అవి ఆయా కులాల వారికే ఇస్తారట.
“ఇంకా కులం ఏమిటి? అందరమూ మనుషులమే కదా?” అడిగేను ఒక చోట విసుగ్గా.
“అందరూ మనుషులే. కానీ వేర్వేరు కులాలు. ఇది మా కులానికి చెందినది” నిర్మొహమాటంగా చెప్పాడక్కడి అబ్బాయి.
చేసేది లేక మావాడితో అన్నాను “ఒక పని చేద్దాం. ఇక్కడ రాత్రికి వుండవద్దు. ముందు దర్శనం చేసుకుందాం. తరువాత ఆలోచిద్దాం. అంతగా వుండాలనిపిస్తే రాత్రికి కారులో పడుకుందాం” అన్నాను. ఇక్కడే కొన్నాళ్ళు గడపానుకున్న వాడిని ఇక్కడ వుండాలనిపించటం లేదు. నాలా, ఎంతమంది గుడికి రావటమే మానుకునివుంటారు? ఆలోచన చుట్టూ వున్న గుంపులు గుంపుల మనుషులను చూస్తూంటే అణగిపోయింది.
“అంత పరిస్థితి రాకపోవచ్చు. నాకు తెలిసినవాడున్నాడన్నాను కదా, వాడికి ఫోన్ చేశాను. ఎత్తలేదు. చూసి చేస్తాడు. వాడు కాల్ చేసేదాకా ఏం చేయాలా?, అని అలోచిస్తున్నాను” అన్నాడు.
అప్పటికే ఎందుకో, నా మనసులో ఏదో తెలియని భావన కదలుతోంది. ఎంత ఉత్సాహంగా వచ్చానో ఆ ఉత్సాహం నీరుకారిపోతోంది.
“ఒక పని చేద్దాం. ముందుగా దర్శనానికి వెళ్డాం. ఈలోగా మీ ఫ్రెండ్ ఫోన్ వస్తే, తరువాత ఏం చేయాలో ఆలోచించవచ్చు” అన్నాను.
“గుడ్ ఐడియా” అన్నాడు. కారును ఒక పక్కకు పార్క్ చేశాడు.
మందిరం ఏవైపుందో కనుక్కుని ఆ వైపు వెళ్ళాము.
దారిలో అనేక దుకాణాలున్నాయి. దుకాణాల్లో అధిక దుకాణాల్లో, ముఖ్యంగా పూలు అమ్మే దుకాణాల్లో ముస్లిములుండటం కనిపించింది. ఇలా ఒకరిపై ఒకరు ఆర్థికంగా ఆధారపడే వ్యవస్థలో పరస్పర ద్వేషాలేమిటి? హింస ఏమిటి? అనిపించింది.
అంతలో నా చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.
మా బంధువుల పెళ్ళిలో వంట చేస్తున్నవారిలో ఒక ముస్లిం కనిపించాడు. వెంటనే అందరూ అభ్యంతరం లేవనెత్తారు.
“ఆవునుకోసి తినేవాడు చేసేవంటను ఎలా తింటాం?” అన్నారు.
వెంటనే, ఆ ముస్లిం అబ్బాయిని పంపించేశారు.
కానీ, ఇక్కడ అవే ఆవు మాంసం తినే చేతులు కట్టే పూలమాలలు దేవుడికి అర్పిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అసలు అలాంటి ఆలోచనలే లేవు. సమాజం అభివృద్ధి చెందుతున్నట్టేనా?
“చూడు, ముస్లిముల షాపులు. వాళ్ళ మసీదులు, దర్గాల దగ్గర హిందువుల దుకాణాలుంటాయా? వుండవు. అక్కడ కూడా మనవాళ్ళే కొనేవాళ్ళు. హలీం నుంచి అగరొత్తులదాకా అమ్మేవాళ్ళు వాళ్ళే, కొనేవాళ్ళం మనమే” కసిగా అన్నాడు నా ఫ్రెండు.
విచిత్రంగా వాడివైపు చూశాను.
ఈ దేశంలో, కులం, ప్రాంతం ఆధారంగా ఎన్ని విభేదాలున్నా, దైవం అన్నిటినీ మరపించే శక్తిగా వుండేది. కానీ, ఇప్పుడు, దైవం కూడా భారతీయ సమాజాన్ని విడదీసే ఒక శక్తి అయింది. దైవంపై విశ్వాసం సడలటంతో, ఆ స్థానాన్ని ద్వేషం ఆక్రమించినట్టుంది. నా కళ్ళముందు మతం మారమన్నవాడు కదిలాడు. ఫేస్బుక్లో, ఇతర సోషల్ మీడియాల్లో, హిందువులే, వాళ్ళ దేవుళ్ళనూ, ధర్మాన్నీ, సంస్కృతీ, సాంప్రదాయాలనూ హేళన చేయటం, దూషించటం గుర్తుకు వచ్చింది.
ఎందుకో, మనం తెలిసో, తెలియకుండానే, మనం నుంచున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామో, ఇంకా నమ్మకం ఉన్న ఆ కొద్దిమందినీ, గుడి అన్నా, దైవ దర్శనం అన్నా విముఖత కలిగించి?
అంతా మారిపోయింది.
మందిరం వెళ్ళేముందు పాత కాలంలో కట్టిన మంటపం వుండేది. ఆ మంటపంపైన నేను చూసిన ఒక సొగసుగత్తె శిల్పంలో కళ్ళు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి. అక్కడి నృత్యం చేసే భంగిమలు నాట్యశాస్త్రానికి బొమ్మలతో కూడిన పాఠ్యపుస్తకాలలాంటివి.
కానీ, ఇప్పుడు, చిన్నప్పుడు సినిమా టికెట్ల కిటికీల దగ్గర స్టీలు రాడ్లతో కట్టేటువంటి వరుసలున్నాయి.
‘ధర్మదర్శనానికి దారి’ అన్న బోర్డ్ కనిపించింది బాణం గుర్తుతో.
“గుడికి వెళ్ళేందుకు స్తంభాల మంటపం ఉండాలి” అయోమయంగా అక్కడ నుంచున్న సెక్యూరిటీ గార్డును ప్రశ్నించాను.
ఓ పెద్ద గేట్ వైపు చూపించాడు. “ఇప్పుడాదారి మూసేశారండీ. ఇప్పుడిదేదారి. అది వీఐపీల దారి. అయినా ఇప్పుడు ధర్మదర్శనం కుదరదండీ.. టికెట్ల దర్శనాలు, పూజలు, సాయంత్రం అయిదుగంటల దాకా ఉన్నాయి. అయిదు గంటలకు లోపలకు వదలుతారండీ. ఆరునుంచి నుంచీ ఏడు వరకూ ధర్మ దర్శనం అండీ. ఏడులోపల దర్శనం కాకపోతే, మళ్ళీ తొమ్మిది దాకా ఆగాలి. ఇవాళ్ళ చాలా రష్ వుందండీ. అందులో ఇవాళ్ళ శుక్రవారం కదా.. ప్రత్యేక పూజలున్నాయండి. శుక్ర, శని, ఆది సోమ మీరు ముందుగా అనుకోకుండా రావద్దండి. మీరు ఇప్పుడు వెళ్ళి క్యూ కాంప్లెక్స్‌లో నిలబడితే, మీకు ఆరుగంటల ధర్మదర్శనం దొరకవచ్చండి.” గబగబా చెప్పాడు.
అప్పటికే క్యూ బయటివరకూ ఉంది.
“మనం రేపు ఉదయం నాలుగు గంటలకు వద్దాం. అప్పుడింత రష్ ఉండదు” నా మిత్రుడితో అన్నాను.
అది విని సెక్యూరిటీ గార్డ్ నవ్వాడు. “మీది టికెట్ దర్శనం అయితేనే నాలుగునుంచి వుంటుందండి. ధర్మదర్శనం ఉదయం ఏడు నుంచే ఆరంభం అండీ. అదీ తొమ్మిదిలోపల అవకపోతే, పన్నెండు దాకా క్యూలో వుండాలండి.”
నాకు నోట మాట రాలేదు. ఎందుకో దేవుడిని ప్రజలకు దూరం చేస్తున్నారన్న భావన మదిలో కదలాడింది. డబ్బుతో టికెట్ కొనకుండా దైవ దర్శనం చేసుకోవటం ఇంత కష్టమా?
ముందు దర్శనం డబ్బుపై ఆధారపడేట్టు చేశారు. ఆపై ధర్మ దర్శనం కఠినం చేస్తున్నారు. దర్శనం కావాలంటే డబ్బు కట్టాలి. అది గుడికి ఆదాయం. కానీ, డబ్బుకట్టలేని సామాన్యుడు దర్శనం చేసుకోలేడు. ఇంటెర్నెట్ తెలియనివాడు రూం బుక్ చేసుకోలేడు. వాడికి సత్రం దూరం. డబ్బు లేని వాడికి దైవం దూరం. వెరసి నమ్మకం ఉన్నవారు గుడికి దూరం. ఎందుకంటే, ఈ ధర్మాన్ని రక్షించింది, రక్షిస్తున్నది, రక్షించేది సంపన్నులు, విద్యావంతులు కాదు. సామాన్య ప్రజలే.
తాత్కాలిక లాభాల కోసం శాశ్వతాన్ని దూరం చేసుకోవటం అంటే ఇదే!!
మసీదులో టికెట్లు లేవు. క్యూలు లేవు. తోపులాటలు లేవు. ఎంతమందైనా, ఎలాంటి సమస్యవుండదు. చర్చ్‌లో టికెట్లు లేవు. క్యూలు లేవు. తోపులాటలు లేవు. ఆద్యంతాలు లేని, అణువణువులో భగవంతుడిని దర్శించే సనాతన ధర్మంలో టికెట్లు, క్యూలూ, తోపులాటలు!!!
దైవం పేరిట డబ్బులు సంపాదించే దుస్థితి రాకూడదనే, పూర్వకాలంలో రాజులు గుడికి మాన్యాలిచ్చేవారు. ధనవంతులు దానాలిచ్చేవారు. కానీ, ఇప్పుడు దైవంతో ప్రభుత్వమే వ్యాపారం చేస్తోంది. గుడి భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దేవుడి ధనం దోపిడీ అవుతోంది. దైవ భావన అదృశ్యమైపోతోంది. మనసు బాధతో వికలమైపోయింది.
ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పుస్తకాలు రాసినా ఏం లాభం, ధర్మానికి వెన్నుపూస అయిన గుడి వ్యాపారస్థలం అయిన తరువాత? దైవానికీ, మనిషికీ నడుమ వ్యాపారం అడ్డు నిలబడిన తరువాత, దేవుడు టికెట్ కొని చూసే వస్తువు అవుతాడు తప్పించి దైవం కాడు?
“డబ్బు దర్శన టికెట్లేమేమున్నాయి?” అడిగాడు నా మిత్రుడు.
‘తినటానికేమున్నాయి?’ అని హోటల్లో అడిగినట్టనిపించింది. ఏదో వస్తువుకోంటూ, అన్నిటి ధరలు అడుగుతున్నట్టనిపించింది.
చివరికి దైవ దర్శనం రేట్ బట్టి నాణ్యత ఆధారపడే వస్తువయిందా?
“సార్, టికెట్ దర్శనాలు చాలా ఉన్నాయి. పూజలున్నాయి. అక్కడ బోర్డు, టైమింగులతో సహా ఉంది.” ఆ వైపు చూపించాడు సెక్యూరిటీ గార్డ్.
అక్కడ పెద్ద బోర్డుంది. బోర్డుమీద ఏయే దర్శనానికి ఎంత టికెట్, ఏ టైమ్‌లో దర్శనమవుతుంది అన్న వివరాలున్నాయి.
దుకాణాల ముందుండే వస్తువుల ధరల బోర్డులా వుందది.
“త్వరగా దర్శనం అయిపోతుంది. అయిదువేల రూపాయల టికెట్ తీసుకుందామా? ఇంకో గంటలో దర్శనం ఆరంభమవుతుంది.”
నేను వద్దనేలోగా, నా సమాధానం కోసం చూడకుండా కౌంటర్ దగ్గర క్యూలో నిలబడ్డాడు.
డబ్బులతో టికెట్ కొని దర్శనం చేయటం నాకు ఇష్టం లేదు. ఇదొకరకమయిన వివక్ష. అందరికీ సమానమయిన దర్శనం కావాలి. కానీ, డబ్బును బట్టి, గర్భగుడి దర్శనం, లేకపోతే, వరండా దర్శనం, ఫ్రీ దర్శనమయితే, వాకిలి దర్శనం.. ఎందుకో, దిగులుగా, బాధగా అనిపించింది.
ఒక గంట తరువాత ముఖం వ్రేళ్ళాడేసుకుని వచ్చాడు.
“ఈ క్యూ ఎల్లుండికట. ఇవాళ్ళ రేపు టికెట్లయిపోయాయి”
“మనం వెళ్ళి ఆ ధర్మదర్శనం క్యూలో నిలుచుందాం. ఎప్పుడు దర్శనం అయితే అప్పుడు చేసుకుందాం. ఎలాగో మనకు వుండేందుకు గదిలేదు. మరో పని లేదు. కొందామంటే, డబ్బులున్నా టికెట్లు లేవు. ఇంత దూరం వచ్చాం, అధర్మ దర్శనం ఎందుకు, ధర్మదర్శనమే చేసుకుందాం” అన్నాను నవ్వుతూ. అతని స్పందన కోసం ఎదురుచూడకుండా ధర్మదర్శనం క్యూ వైపు నడిచాను.
నా వెనుక ఏదో గొణుక్కుంటూ వచ్చాడు నా ఫ్రెండ్.
స్టీల్ రాడ్ల నడుమ నిలచి తమ అస్తిత్వాన్ని కోల్పోయిన అశేష ప్రజానీక సముద్రంలో మిళితమై నా అస్తిత్వాన్ని కోల్పోయాను.
అక్కడ అన్ని రకాలవాళ్ళు, ఎన్నెన్నో ప్రాంతాలవాళ్ళు ఉన్నారు. తమలో తాము చర్చించుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు. బాధలు చెప్పుకుంటున్నారు. అనుభవాలు పంచుకుంటున్నారు.
వాళ్ళ మాటలు మధ్య మధ్యలో వినిపిస్తున్నాయి.
“ఈ గేట్ అయిదుగంటలకు తెరుస్తారు. అయిదు నుంచి ఆరు దాకా కంపార్ట్మెంట్లో కూర్చోవాలి. ఆరుకి వదలుతారు. ఏడుకల్లా దర్శనమైపోతుంది. “
జనసమూహంలో ఎవ్వరూ ఇలా ఇంతసేపు ఎదురుచూడటం పట్ల ఆశ్చర్యం చూపటం లేదు. నిరసన లేదు. ఈ ఎదురుచూడటం సర్వసాధారణం అన్నట్టుగా ఉన్నారు. ఇంత సమయం ఇలా వ్యర్థమైపోతున్నదన్న బాధ లేదు. దైవదర్శనం అన్న భావన వాళ్ళను దూరదూర ప్రాంతాలనుంచి అనేక వ్యయప్రయాసలకోర్చి, ఎదురుచూపులకు సిధ్ధం చేసింది. ఏ కష్టమయినా లెక్కచేయనట్టు చేసింది.
కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజాః!
కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః!!
కాలం పంచభూతాలను జీర్ణం చేసుకుంటుంది. కాలం సృష్టిని సంహరిస్తుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో కాలం మేల్కొనివుంటుంది. కాలాన్ని దాటి ఎవరూ ముందుకు వెళ్ళలేరు.
ఆ కాలాన్ని ఎన్నెన్ని రకాలుగా వృథా చేస్తున్నా, ఆ ధ్యాసనే లేదు మనిషికి. చివరికి దైవ దర్శనం కూడా కాలాన్ని వృథా చేసే ఒక సాధనమైపోయింది. కాలమే దైవం. ఆ దైవాన్ని మనిషి దైవంగా గుర్తించటమే లేదు. మనిషి దైవంగా గుర్తించిన దానిపై కూడా ధ్యాస లేదు.
తన సంసారము, తన అనుభవాలు, తన బాధలు, తన ఆలోచనలు తప్ప మరొకటి పట్టిలేదు.
“నేను మొన్న తిరుపతికెళ్ళిన. రెండుగంటల్లో దర్శనమైపోయింది. మూడొందలు టికెట్ తీసిన దోస్తుకు మూడు గంటలు పట్టింది” అల్ప సంతోషంతో చెప్తున్నారెవరో.
“అమ్మాయి పెళ్ళయితే వస్తానని మొక్కుకున్న”. ఇంకెవరివో మాటలు.
“మన గుళ్ళలో వేరే మతంవాళ్ళు ఎందుకు పనిచేయాలి? వాళ్ళ పవిత్ర స్థలాలలో మనకు ఉద్యోగాలిస్తారా? ఇంకెవరిదో వాదన.
“రామజన్మభూమిలో ఎంత రష్ ఉన్నా గంటలో దర్శనమై పోతుంది. మన దగ్గరే ఈ గంటల తరబడి ఎదురుచూపులు. వీఐపీ దర్శనాలను బ్యాన్ చేయాలి. టికెట్ల పూజల వాళ్ళ కోసం మనల్ని ఆపవద్దు. అప్పుడు త్వరగా దర్శనం అయిపోతుంది”. వాళ్ళు, మనం అన్న భావన సమాజంలో ఎక్కడయినా ఏదో రకంగా సమర్థించవచ్చు. కానీ, దైవం దగ్గరే ఈ భేద భావన.. విషాదం తూఫానవుతోంది.
“తిరుపతిలో మజ్జిగ ఇస్తారు. పాలు ఇస్తారు. పెరుగన్నం, పులిహోరలిస్తారు. ఇక్కడా ఇన్నిన్ని డబ్బులు సంపాదిస్తున్నారు కానీ, ఏమీ ఫెసిలిటీలు లేవు”.
చర్చలు సాగిపోతున్నాయి.
“గవర్నమెంటుకి డబ్బులు మన గుళ్ళనుంచే వస్తున్నాయి. కానీ, గవర్నమెంటు ముందు వెనుక చూడకుండా కూలగొట్టేది మన గుళ్ళే. వేరేవాళ్ళ పవిత్ర స్థలాలుంటే పథకాలు మారుస్తారు కానీ, వాటినేమనరు”.
“అసలు మన గుళ్ళముందు కొబ్బరి అమ్మేవాడినుంచి కాఫీ టీలు అమ్మేవాడివరకూ అందరూ తురకలే. మన గుళ్ళల్లో వాళ్ళెందుకు?”
వాళ్ళ సంభాషణలు వింటూ నుంచున్నాను. ఎంత సమయం వ్యర్థంగా గడచిపోతున్నదన్న ఆలోచన నన్ను వదలటం లేదు. ముఖ్యంగా క్రితంసారి అనుభవంతో పోల్చటంతో ఈ అనుభవం మరింత బాధాకరంగా అనిపిస్తున్నది.
కాలం మారుతుంది. కాలంతో పాటూ అన్నీ మారతాయి. మార్పు సహజం. కానీ, కొన్ని తాత్కాలికమైనవి, కొన్ని శాశ్వతమైనవి మౌలిక విలువలుంటాయి. తాత్కాలికాలే మారేవి. శాశ్వతాలు మారవు. కానీ, ఇక్కడ దైవ దర్శనమనే ఒక అత్యంత ఆధ్యాత్మికము, అలౌకికమూ, మార్మికమూ అయిన ప్రక్రియ, ఒక మామూలు చర్యగా, దానిలోని అత్యంత పవిత్రమూ, మార్మికమూ, ఆధ్యాత్మికమూ అయిన అంశం జాడ కూడా లేకుండా అయిపోవటం జీర్ణించుకోవటం కష్టంగా వుంది.
మంత్రంలో శబ్దం మిగిలి అర్థం పోయినట్టే, దైవంలో డబ్బు మాత్రమే మిగిలి మిగతావన్నీ అదృశ్యమైపోవటం, ప్రాణాన్ని వదలిన శరీరాన్ని పోషిస్తున్నట్టుంది.
ఇంతలో అయిదయిందేమో, ఏవో గొలుసులు తీస్తున్న శబ్దాలు వినిపించాయి. ఒక సముద్రం హోరులాంటి హోరు అలలు అలలుగా వినిపించింది.
అప్పుడర్థమయింది. క్యూ నుంచి లోపల ఎదురు చూసే సెల్ లోకి మనుషులను వదలుతున్నారని. గొలుసులు తీసి తలుపులు తెరవగానే, గేట్లు తెరవగానే దూకే నది నీటి హోరుతో, అడ్డు తొలగగానే, ఒకదాన్నొకటి తోసుకుంటూ, తొక్కుకుంటూ పరుగులిడే పశువుల్లాగా మనుషులు పశువులై, తమ ఎదురుగా వున్నది మనుషులు కాదన్న రీతిలో తామే ముందు పోవాలన్న దృఢ సంకల్పంతో దూసుకుంటూ, తోసుకుంటూ పరుగులారంభించారు అరుస్తూ..
నేను ఒక వైపు ఒదిగి, ఒడ్డున నుంచుని పొంగుతూ, త్రుళ్ళుతూ ప్రవహించే నదినీటిని చూస్తున్నట్టు మనుషులను చూస్తూ నుంచున్నాను.
“ఇట్లయితే ఈ జన్మకు మనకు దర్శనం కాదు, పద” అని ఒక్క తోపుతో నన్ను ప్రవహించే నీళ్ళల్లోకి తోసేశాడు నా మిత్రుడు.
ఒక్క సెకనులో, నేను, ప్రవహించే నీటిలో ఒక బిందువునయి నా అస్తిత్వాన్ని కోల్పోయాను. నీరెటు ప్రవహిస్తే ఆ వైపు వెళ్ళాను.
ఇంత చేసి అన్ని వైపులా ఇనుప సీకులతో ఒక బోనులా కట్టిన సెల్ అనబడు దానిలోకి చేరాము. మేము లోపలకు రాగానే సెల్ తలుపులు వేసేశాడు. ఇంకా ఎంతో మంది ఆ వైపు మిగిలిపోయారు.
“అన్నా, అమ్మ ఆడనుంది. నన్ను రానీయన్నా” బ్రతిమిలాడుతున్నారెవరో.
“మీ అమ్మను కూడా నీ దగ్గరకు పంపిస్తా” తలరాతలు రాసే బ్రహ్మ కూడా అంత అథారిటీతో చెప్పడు.
ఇంకా ఎవరెవరో అతడిని బ్రతిమిలాడుతూనే ఉన్నారు. ఎవరెంత ప్రార్ధించినా కరగని శిలలా తన పని చేసేసి వెళ్ళిపోయాడతడు.
కాస్సెపటికి సద్దుమణిగింది.
మళ్ళీ మాటల్లో పడ్డారు. కొందరు పక్కలు పరిచారు. ఇంకొందరు ఏదో ఆటలో పడ్డారు. ఎవరి ప్రపంచం వారిదై పోయింది.
“ఇక్కడ నయం, గంటా గంటన్నరలో వదులుతారు. తిరుపతిలోనైతే కనీసం మూడుగంటలు పడుతుంది మామూలు రోజుల్లో. రష్ ఉన్నప్పుడయితే ఒకోసారి పది, ఇరవై గంటలు కూడా పడుతుంది.”
నా ఫ్రెండు చుట్టూ ఉన్నవారితో మాటల్లో పడ్డాడు. నేను చుట్టూ చూశాను.
మేమున్న సెల్ లాంటివే ఇంకెన్నో కనిపించాయి. అన్నిటి నిండా మనుషులు క్రిక్కిరిసి ఉన్నారు. ఎలాగయితే సముద్రం నీటిలో ఒక బిందువు మొత్తం సముద్రం నీటికి ప్రతినిధియో, అలా మా సెల్ మిగతా సెల్ లన్నింటికీ ప్రాతినిథ్యం వహిస్తుంది.
ఎందుకో మనసంతా చేదుగా అయిపోయింది.
అవి కారాగారాల్లో ఖైదీలనుంచే సెల్ లలా అనిపించాయి. పశువులను బంధించే సెల్ లలా అనిపించాయి.
ఈ మానవ సమూహంలో, ఈ బందీఖానాలో ఏదీ దైవ భావన? ఏదీ భక్తి భావన? గుడికి చెందిన మనిషి అటువైపు రాగానే, విడుదల సమయం వచ్చేసిందన్న ఆత్రంతో, ఆశతో మనుషులు కేకలు పెడుతున్నారు. “ఇంకెంత సేపు?” అని అడుగుతున్నారు. వాడటు వెళ్ళగానే మళ్ళీ కబుర్లలో పడుతున్నారు.
ఎంత వద్దనుకున్నా మనుషులు కనబడటంలేదు నాకు అక్కడ. వాళ్ళకది రొటీన్‌లా ఉంది. కానీ, ఒక గౌరవం, అభిమానం లేకుండా, తమని జైళ్ళలో బంధించినట్టు బంధించి గంటలు, గంటలు ఎదురుచూసేట్టు చేసినా దాన్ని స్వీకరించటం జీర్ణించుకోలేకపోతున్నాను. ‘దైవ భావన’ మనిషికి ఆత్మ బలం కావాలి. ఆత్మ విశ్వాసం కావాలి. ఆత్మను హతం చేసేది కాకూడదు.
డబ్బును బట్టి దేవుడు దర్శనమివ్వటం అస్సలు స్వీకరించలేకపోతున్నాను.
దైవ దర్శనంలోని సున్నితమైన అనుభూతిని నశింపచేస్తున్నారు. పశువులాంటి మనిషి, తనలోని మానవత్వాన్ని గుర్తించి , అసలైన మనిషిగా ఎదిగేట్టు చేసే దైవం పేరిట, మనిషిని పశువులా మార్చటాన్ని ఆమోదించలేకపోతున్నాను.
ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆధ్యాత్మిక భావననూ, ఆలోచననూ కలిగించే వాతావరణం ఎక్కడా కనిపించటంలేదు.
ఎందుకిలా? ఏమిటిదంతా?
గుడికి రావటమనేది వ్యక్తిత్వ వికాసానికి సోపానం. అసలా భావన ఏది? బయట వ్యాపారం ఆకాశ హర్మ్యాలుగా ఎదుగుతోంది. లోపల కూడా వ్యాపారమేనా? వ్యాపారం కోసం మనుషులను పశువులుగా చేసేందుకు సైతం వెనుదీయటంలేదా?
ఒకప్పుడు గుడి, పాఠశాల, వైద్యశాల, నృత్యవేదిక, ఆధ్యాత్మిక చర్చల వేదిక.. మనిషి అభివృద్ధికి దోహదం చేసేది మందిరం. మందిరం ఆధారంగా ఊళ్ళు వెలిశాయి. నగరాలు నిర్మితమయ్యాయి. మందిరాం కేంద్రబిందువుగా ఎదిగింది సంస్కృతి. మందిరం కోసం ప్రాణాలు విడిచారు వీరులు. మందిరంలో దైవం శత్రువు చేతికి చిక్కి వారి పవిత్ర స్థలాలో మెట్లపై ముక్కలుగా నిలవకూడదని, దైవం గౌరవం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. అవకాశం దొరకగానే విరిగిన గుడి స్థానే ఇంకా పెద్ద గుడి నిర్మించారు.
ఇదంతా దైవంతో వ్యాపారం చేయటానికా? దైవాన్ని టికెట్టు పెట్టి ప్రదర్శించే వస్తువు చేయటానికా?
ఇంతలో తలుపులు తెరిచారు.
మళ్ళీ సముద్ర ఘోష వినిపించింది.
తలుపు చిన్నదిగా వుంది. మనుషులు అధికంగా ఉన్నారు. అందరూ ఒకేసారి తలుపువైపు పరుగెత్తుకు వచ్చారు.
ఉరుకులు పరుగులుగా వస్తున్న అనంత పాథోరాశికి ప్రవహించేందుకు ఒక చిన్న గేటు పెడితే, మొత్తం ఒత్తిడి బయటకు ప్రవహించే మార్గం దగ్గరే వుంటుంది.
ఆ మానవ ప్రవాహంలో భాగమైపోయాము. తలుపు దగ్గర మహా ఒత్తిడి. మగలేదు, ఆడలేదు, ముసలిలేదు, పిల్లలు లేదు, ఒకరినొకరు దాటి ముందుకు పోవాలన్న ఆత్రమే. సుళ్లు తిరిగే ప్రవాహంలో ఒకదాన్నొకటి రాసుకుంటూ పక్కకు తోసేసి ముందుకుపోయే నీటి బిందువుల్లా మనుషులు తోసేసుకుంటున్నారు. అసలు ఆ క్షణంలో అక్కడున్నది మనుషులనిపించటంలేదు. వెనుకనుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ, ముందున్న మానవగోడను చీల్చుకుంటూ, పట్టుతప్పి క్రిందపడకుండా చూసుకుంటూ, ముందుకు పోవటంలో, ప్రాణాలను కాపాడుకోవటం, ముందుకు సాగటంపై ఉన్న శ్రద్ధ దైవంపై ఎలా ఉంటుంది?
ఇంతలో, నా వెనుకనుంచి, ఎవరో, నన్ను పూర్తి శక్తితో పక్కకు తోసి, ఒక కాలు మోపే స్థలంలేని చోట స్థలం సాధించాడు.
కోపంగా అతనివైపు చూశాను. అతడేమీ పట్టనట్టున్నాడు. నేను గమనించలేదు. నా ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె అతని తాలూకు కాబోలు, నన్ను తోసి ఆమెని చేరాడతడు.
ఇక అక్కడినుంచీ, ప్రవాహంలో అణువునై ప్రవహించటం తప్ప నా అంతటనేను కదలలేను, మెదలలేను, పెదవివిప్పి పలికలేను అన్నట్టయింది నా పరిస్థితి.
రాను, రాను నదిలో ఉపనదులొచ్చి చేరినట్టు, ఏవైపునుంచో, మానవ ప్రవాహం వచ్చి మా ప్రవాహంలో చేరుతోంది. లేక మేమే ఆ ప్రవాహంలో కలుస్తున్నామో.. ఒత్తిడి పెరుగుతోంది. రాపిడి పెరుగుతోంది. మనుషుల్లో ఆత్రం పెరుగుతోంది.
ఎదుటి వాడిని అదృశ్యంచేసి తానే ముందుపోవాలన్న ఆత్రం అందరిలో కనిపిస్తున్నది.
ఎందుకు ఆత్రం?
విగ్రహం ఎక్కడికీ పోదు. పోయేదల్లా మనిషే. ఓపిక పడితే అందరికీ దర్శనం అవుతుంది. కానీ, ఈ ఆత్రంలో, ఈ తోపులాటల్లో ఎవ్వరికీ సరిగా దర్శనం అయ్యే వీలులేదు.
అయినా, ఇంత తోసుకుంటూ, తన్నుకుంటూ, తొక్కుకుంటూ ఆత్రంగా పోయేది కొన్ని సెకనులు కనిపించీ కనబడని దర్శనం కోసమేనా?
ఏ శక్తి, ఈ అస్పష్ట అర సెకను దర్శనం కోసం ఇంతమందిని ఇంతదూరం తీసుకువస్తున్నది? ఇంత సమయం ఎదురుచూసేట్టు చేస్తున్నది?
ఆలోచనలు తెగటంలేదు.
ఆలోచిస్తూనే నెమ్మదిగా దైవ విగ్రహానికి దగ్గరవుతున్నాను.
ఏదో నిర్లిప్తత నన్ను ఆవహించింది.
గుడి అన్నది కేవలం దైవ దర్శనం కోసమే కాదు.
గోడలపైని శిల్పాలను చూసే తీరిక, ఈ తోపుళ్ళలో ఏది? అసలు, ఏవీ ఆ చిత్రాలు?
శిల్పాలు చెప్పాలనుకుంటున్న రహస్యాల ఆలోచననే లేని పరిస్థితులు ఇప్పుడున్నాయి. ప్రతి స్తంభంపై చెక్కిన ఆ రమణీమణులు, ఆ పూసల దారాలు, ఆ హారాలు, నృత్య భంగిమలు, వాటిల్లో నిక్షిప్తమైన నిగూఢరహస్యాలు.. ఏవి?
మందిరానికి రావటమన్నది మనిషి తనని తాను తెలుసుకునే ప్రక్రియలో భాగం. దేవాలయం ఒక విద్యాలయం. కళా వేదిక. అది ధార్మిక ఆలోచనల నిలయం. తనని తాను తెలుసుకుంటూ, తనలోని భగవంతుడి గురించిన స్పృహనూ, చైతన్యాన్నీ కలిగించే పరమ పవిత్ర ధామం దేవాలయం.
ఆలోచనల్లోంచి తేరుకున్నాను.
ఎదురుగా దైవ విగ్రహం!!
విగ్రహం కూడా మారింది.
నేను విగ్రహం వైపు సరిగా చూసేలోగా డబ్బు టికెట్ వాళ్ళెవరో అడ్డొచ్చారు. వారు కదలలేదు. నేను కదలుతూనే ఉన్నాను. నాపై ఒత్తిడి అలాంటిది.
నా వెనుకనుంచి ఒక పెద్ద కేక అలలాగా ఎగసిపదింది.
“అడ్డు జరగమనండి”.
దేవాలయానికి చెందినవారు ధర్మదర్శనం వారికి అడ్దున్నవారిని కదలమన్నారు. వారు వినిపించనట్టే నుంచుని ఉన్నారు.
వెనుకనుంచి కేకలు పెరిగాయి.
ఒకప్పుడు సినిమా టికెట్ క్యూలో, ఎవరైనా పక్కనుంచి దూరితే వెనుక నుంచి ఇలాగే అరిచేవారు.
గుడి వ్యక్తి వారిపై అరిచాడు.
వారు కదిలారు.
ఇప్పుడు నాకు దర్శనమవుతుంది. ఊపిరి బిగబట్టాను.
వాళ్ళు కదలుతున్నారు అయిష్టంగా..
సరిగ్గా నాకు దర్శనమయ్యే సమయానికి దేవాలయం మనిషి, “ వెనకవాళ్ళు చూడొద్దా? నువ్విక్కడే ఆగిపోతే ఎలాగ? కదులు..” అరిచాడు.
నేనాయన వైపు చూడకుండా విగ్రహం వైపు చూశాను. నన్ను భుజం పట్టుకుని ముందుకు తోశాడు.
నేను ఖాళీ చేసిన స్థలం లోకి, రంధ్రంలోకి నీరు దూకి నింపేసినట్టు మనుషులు వచ్చేశారు.
నేను దించిన తల ఎత్తలేదు.
“దర్శనం బాగా అయిందా? నాకు బాగా అయింది” అన్నాడు నా ఫ్రెండు నా వెనకే వస్తూ..
నేను మాట్లాడలేదు. దర్శనం బాగా అవటం అంటే? నా కళ్ళముందు గతం అనుభవం నిలచింది.
బయట కూడా బోలెడంతమంది ఉన్నారు.
“అదేం క్యూ?”
పెద్దగా జనం తొక్కిసలాడుతున్న వైపు చూపించి.
“అది ప్రసాదం క్యూ” చెప్పారెవరో.
నేను ఎటూచూడలేదు. తిన్నగా బయటకు నడిచాను.
బయట అంతా హడావిడిగా ఉంది. దుకాణాల్లో జనం. రోడ్డుపై జనం. కాఫీ షాపుల్లో జనం. టికెట్ క్యూలో జనం. దర్శనం క్యూల్లో జనం.
“గుడి ఒక పెద్ద వ్యాపారమైపోయింది. ప్రతి గుడిలో దర్శనం టికెట్లు రూపంలో దోచేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వాలే చేయటం బాధాకరం” నా స్నేహితుడన్నాడు.
“ఇక ఈ రాత్రికి ఇక్కడ వుండద్దు. వెళ్ళిపోదాం” అన్నాను.
“అదేమిటి, నాకేవో కాంపౌండ్ వాల్ పై ఉన్న కళ చూపిస్తానన్నావు?” అడిగాడు.
“కాంపౌండ్ వాల్ దాకా వెళ్ళలేము. కాంపౌండ్ వాల్ కనబడకుండా ఎదురుచూసే బందిఖానాల్లాంటి సెల్లు కట్టారు” నిర్లిప్తంగా చెప్పాను.
నా మనసులో తుఫానులు చెలరేగుతున్నాయి.
ఇది కేవలం డబ్బు దోపిడి మాత్రమే కాదు.
ఇది ప్రజలను తమ సంస్కృతికి, గతానికి, పూర్వీకుల కళా వైభవానికి దూరం చేయటం. ఇది ప్రజలకు తమ వైభవోపేతమైన ఆధ్యాత్మిక సంపదకు దూరం చేయటం.
తమ చరిత్రకు, వారసత్వానికీ దూరం చేయటం..
డబ్బు దోపిడీకి గురయితే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, సంస్కృతిని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని, ఆలయమనే భావనకు మౌలికమైన దైవ భావనలు దోపిడీకి గురయితే తిరిగి సాధించటం కుదరదు. అస్తిత్వమే నాశనమై పోతుంది. ప్రాణం లేని శరీరం మిగులుతుంది. గుడిలోని విగ్రహం, ఏదో ప్రదర్శనశాలలో టికెట్ పెట్టి దర్శించే వస్తువయిపోతుంది. విగ్రహం మిగులుతుంది. దైవత్వ భావన అదృశ్యమైపోతుంది.
ఒకవేళ ఇలాంటి పరిస్థితులలో నేనీ మందిరానికి మొదటిసారి వచ్చివుంటే, నా జీవితంపై ఈ మందిరం ప్రభావం చూపించేదా?
అందుకే, ఇప్పటి యువతకు మందిరం ఒక పిక్నిక్ స్పాట్ అయింది. ప్రేయసితో వారాంతంలో వచ్చిగడిపే రొమాంటిక్ స్థలమయింది.
“అసలు మన గుడులు వ్యాపార కేంద్రాలుగా మారటానికి మన ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం దృష్టిలో ఇది సంపాదనకొక సాధనం. అందుకే, భక్తి ఉందా, తత్వంపై అవగాహన ఉందా అన్నది చూడకుండా తమకు నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లని కార్యనిర్వహణాధికారుల్లా నియమిస్తున్నది ప్రభుత్వం. వారికీ, గుడి ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తే అంత గొప్ప. అందుకే..” మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు నా ఫ్రెండ్.
అతని మాటలు వినగానే నాకో ఆలోచన వచ్చింది. అవును, భక్తి లేనివాడు, నమ్మకంలేనివాడు, ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు దేవాలయ నిర్వహణాధికారి అయితే, పరిస్థితులు ఇలాగే వుంటాయి. దేవాలయ నిర్వహణ భక్తులకే అప్పచెప్పితే?????
దేవాలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రమే తప్ప, వ్యాపార కేంద్రం కాదన్న అవగాహన ఉన్న వారికే దేవాలయ బాధ్యతలు అప్పచెప్పితే..
“గుడిలో ఎందుకు రామయ్యా నిను విడుదల చేస్తాం రావయ్యా”
పాట మ్రోగుతోంది..
నిజమే, రామయ్యను కాదు గుడినుంచి విడుదల చేయాల్సింది, దైవాన్ని వ్యాపారవస్తువుగా మార్చిన ప్రభుత్వాల కబంధ హస్తాలనుంచి దైవాన్ని విముక్తుడిని చేయాలి. అవును రాముడిని గుడినుంచి బయటకు తీసుకువచ్చి ప్రజలనడుమ నిలపాలి. ప్రజల హృదయాల్లోని రాముడిని వారు ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా, స్వేచ్ఛగా కలవగలగాలి.
రామయ్య గుడినుంచి విడుదల కావాలి. ప్రజల మధ్యకు రావాలి. ప్రజల హృదయాల్లో ధార్మిక భావనలు నిలపాలి.
చీకటిని చీలుస్తూ కారు వెలుతురువైపు దూసుకుపోతోంది.
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
