Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరీక్షణ

మయం సాయంత్రం ఆరు గంటలవుతోంది. ఆకాశం కాషాయరంగు సంతరించుకుంది. తుఫాను ముందరి ప్రశాంతత లాగా ఉంది వాతావరణం.

ఆ రాత్రి జరగబోయే ఘోర పరిణామాల గూర్చి ఏ మాత్రం తెలియని అహల్య, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మూడంతస్తుల ఫార్మ్ హవుసు డాబాపై అటు ఇటూ పచార్లు చేస్తూ ఉంది. ఇరవై ఏళ్ళ ఆ అమ్మాయి ఉత్సాహానికి మారుపేరులా లయబద్దంగా ఊగిపోతూ ఆనందంగా సంగీతాన్ని ఆస్వాదిస్తోంది.

అహల్య తండ్రి నాగేశం. అతను ఒక పారిశ్రామికవేత్త. ఆయన ఎంతో ఇష్టపడి ఈ ప్రశాంత వాతావరణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ఫార్మ్ హవుస్‌ని విశ్రాంతికై నిర్మించుకున్నారు.

నగర కాలుష్యానికి చాలా దూరంలో హైవే పక్కన పొలాల మధ్య ఉన్న ఆ ఫార్మ్ హవుసు చాలా ఇష్టం ఆ కుటుంబ సభ్యులందరికీ. కనుచూపు మేరలో ఏ విధమైన నిర్మాణాలు లేవు, కాలుష్యం అసలే లేదు, అక్కడి వాతావరణం అందుకే చాలా ఇష్టం అహల్యకి. ఆ ఫార్మ్ హవుసుకి ఒక వైపు దూరంగా వారి ప్రహారి గోడని తాకుతూ వెళ్ళే నది ఒక ప్రత్యేక ఆకర్షణ.

కాకపోతే ఏ చిన్న వస్తువు కావాలన్నాదగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాలి.

కనీసం కొన్ని పదుల కిలోమీటర్లు వెళితే కానీ అతి దగ్గరగా ఉండే మొదటి గ్రామం రాదు.

హైవే పక్కన ఉన్న వారి స్వంత తోటల తాలూకు మెయిన్ గేటు వద్ద నున్న సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని, తోట మధ్య ఉన్న ఫార్మ్ హవుసుకి చేరుకోవాలంటే, దాదాపు ఒక కిలోమీటర్ దూరం సిమెంట్ రహదారిలో ప్రయాణించి, ఫార్మ్ హవుసు చేరుకోవాలి.

హైవే పక్కగా ఆ తోట చుట్టు రక్షణగా నిర్మించిన రాతి గోడల అవతల ఇంత ప్రపంచం ఉందని రోడ్ పైనుంచి ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు

ఇక అదే హైవే పై తోటలోకి మలుపు తీసుకోకుండా, నేరుగా కాస్త ముందుకు వెళితే ఓ పెద్ద వంతెన వస్తుంది. ఆ వంతెన కింద ఉన్న నది గట్లు తన్నుకుని ప్రవహిస్తు భీతి గొలుపుతోంది.

ఆ నదే వారి భవంతి పైనుంచి కనిపిస్తుంది.

రోడ్ బ్రిడ్జి పై నుంచి ఆ నది చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూ ఉన్నా, దాని ఉధృతికి ఆ వంతెన సగం తెగి పోయింది. అందువల్ల గత రెండు రోజులుగా ఆ హైవే పై రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.

సూర్యుడు అస్తమించబోతున్న సమయం కావటన ఆకాశం చాలా అందంగా ఉంది.

ఆ భవంతికి వెనుక భాగాన కూతవేటు దూరంలో ఆకాశాన్ని చుంబిస్తూ ఉన్న కొండలు, దూరంగా నిండు గర్భిణిలా ప్రవహిస్తున్న నది, గూళ్ళకి వెళుతున్న పక్షులు. మొత్తంగా ఒక అనుభవఙ్జుడైన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలాగా ఉంది అక్కడి వాతావరణం.

పక్షుల అరుపులు, గాలి వీచే చప్పుడు మినహాయించి ప్రశాంతత అలుముకుని ఉంది అక్కడ. ప్రకృతి ఒడిలో ఉన్న ఆ భవంతిలో అహల్య, ఆమె తలితండ్రులు మాత్రమే వచ్చి ఉన్నారు ప్రస్తుతం. వారు వచ్చి ఇంకా నాల్గు రోజులు కూడా కాలేదు.

అహల్య తండ్రి నాగేశం ఆర్థిక పరిస్థితి ఒకప్పటి లాగా లేదు. కొన్ని రోజుల క్రితం వరకు అందరూ అతన్ని చూసి అసూయపడే పరిస్థితి ఉండేది. పట్టిందల్లా బంగారం అయ్యేది ఆయనకి. కానీ ఇదంతా కరోనా లాక్ డవున్ పూర్వం. ఇప్పుడు ఆయన వ్యాపారాలన్నీ కరోనా అనిశ్చితి కారణంగా అగమ్యగోచరంగా తయారయ్యాయి.

ఎటు చూసినా అప్పులు, ఆదాయం చూస్తే నానాటికి తీసికట్టు అన్నట్టు ఉంది. సిబ్బందికి కూర్బోబెట్టి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, అలాగని అన్ని సంవత్సరాల నుంచి తనని నమ్ముకున్న వారికి ఉద్వాసన పలకటానికి మనసు ఒప్పటం లేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకోవటం వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది ఆయనకి. తన వ్యాపార సముదాయ భవనాలకి చెల్లించాల్సిన అద్దెలు, ఇతర ఖర్చులు, జీతాలు ఇవన్నీ ఆయనకి పెద్ద గుదిబండగా తయారు అయ్యాయి.

ఫాం హవుసు ప్రవేశద్వారం వద్ద ఉండే సెక్యూరిటి సిబ్బందికి సైతం జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. అందుకే వారికి ఉద్వాసన పలికి రెండురోజులు అవుతోంది.

ఆర్థిక కారణాల వల్ల ఏర్పడ్డ ఈ అశాంతి నుంచి కాస్త ఉపశమనం కోసం వచ్చారు ఆ కుటుంబ సభ్యులు అక్కడికి.

‘టప్’ మని తనపై పడ్డ చినుకు తాకిడికి పాటల పారవశ్యంలో ఉన్న అహల్య ఉలిక్కి పడి ఆకాశం వంక చూసింది.

అప్పటి దాకా ప్రశాంతంగా తేలికగా ఉన్న ఆకాశం ఎప్పుడు నిండిపోయిందో, నల్లటి మబ్బులతో నిండిపోయింది. చిక్కటి చీకటి తెరలు ఆవరించుకుంటున్నాయి నలుదిక్కులా.

కింద కాంపౌండ్‌లో మేలుజాతి శునకం లియో అరుస్తున్న అరుపులు ఆ నిశ్శబ్ద వాతావరణంలో వికృతంగా వినిపిస్తున్నాయి. ఎడమ కన్ను అసంకల్పితంగా అదిరింది అహల్యకి.

ఏదైనా పెను ఉత్పాతం జరగబోయే ముందు అలా ఎడమ కన్ను అదురుతుందని ఎక్కడో చదివిన మాట గుర్తు వచ్చింది. ఈలోగా కింది నుంచి తల్లి పిలుపు వినిపించింది.

“అహల్యా చీకటి పడుతోంది కిందకి రామ్మా!” తల్లి పిలుపుతో ఊహల్లోంచి బయట పడి మేడ దిగి కిందకి వచ్చేసింది.

***

భోజనాలకు కూర్చున్నారు.

తండ్రిని చూస్తుంటే చాలా బాధగా ఉంది అహల్యకి. ఒక్క సారిగా వృద్ధాప్యం మీద పడ్డట్టు ఉన్నారు ఆయన. ఎక్కువ సమయం మౌనం లోనే గడుపుతున్నాడు.

వెదుక్కుంటూ వెళితే ఆనందం అన్నది బయట ఎక్కడా దొరికేది కాదని, అది మనలోనుంచే సృష్టించుకోవాలని ఆయనకి తెలియంది కాదు. ప్రశాంతత కొరకు అక్కడికి వచ్చారు కానీ అశాంతి తనలోంచి నీటి చెలమలో నీరు ఊరినట్టు ఊరుతుంటే ఎక్కడికి వెళితే మటుకు ప్రశాంతత లభిస్తుంది?

ఉన్న స్థిర చర ఆస్తులను అన్నింటినీ అమ్మేసి, ఉన్న అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ ఏదైనా వ్యాపారం కొత్తగా ఓ కుర్రాడిలా ఉత్సాహంగా ప్రారంభించాలి. అది ఒక్కటే ఆయన ముందున్న పరిష్కారం. అది ఆయనకి ఎందుకో నచ్చటం లేదు. పూలమ్మిన చోట కట్టెలమ్మటం ఎవరికైనా కటువైన పరిష్కారమే కద.

అది ఏమంత సులభంగా జరిగే పని కాదు. తమ ఆస్తులకి సరైన ధర ఇచ్చి కొనే నాథుడు ఈ గడ్డు కాలంలో దొరకడం అంత సులభం కాదు.

లేదూ పరిస్థితులు అనుకూలించే వరకు ఎదురు చూసి, మళ్ళీ అప్పో సొప్పో చేసి ఖాయిలా పడ్డ తన వ్యాపార సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నించుకోవడం ఇంకో పరిష్కారం. ఆయనలోని వ్యాపారవేత్త ఈ రెండో పరిష్కారం వైపే మొగ్గుచూపుతున్నాడు. కళ్ళు తిరిగే ఒక పెద్ద మొత్తం దేవుడు ఏదో ఒక రూపంలో తనకు అందిస్తే తన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది కద అన్న ఆశావహ ధృక్పథం కూడా ఉండుండి కలుగుతోంది ఆయనలో.

ఆయన భావించినట్టే కళ్ళు చెదిరే స్థాయిలోపెద్ద సంపద తమను చేరబోతోంది అని ఆయనకి తెలియదు ఆ క్షణం. ఆ సంపదని అందుకునే క్రమంలో తాను హంతకుడిని అవుతానని ఆయన కలలో కూడా ఊహించి ఉండడు.

***

రాత్రి పదకొండు అవుతోంది.

అసలు నిద్ర పట్టడం లేదు అహల్యకి. తండ్రి పడుతున్న దిగులు ఆమెకి అర్థం అవుతూనే ఉంది. ఎప్పుడు తమ ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయో ఆమెకి అర్థం కావడంలేదు.

బయట పెద్ద వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. పక్కపై ఉండలేక ఆమె లేచి కిటికీ వద్దకొచ్చి నిలబడి కిటికీ అద్దంలోంచి బయటకిచూస్తూ నిలబడింది.

జరగబోయే పెను ఉత్పాతానికి నాందిగానో ఏమో, పెద్ద వెలుగుతో పిడుగు పడింది, పొలాల మధ్య దూరంగా కనిపిస్తున్న ఎత్తైన తాటి చెట్టు క్షణాలలో బూడిద అయింది పిడుగుపాటుకి.

కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూసిన అహల్య కళ్ళు పెద్దవయ్యాయి భయంతో. అసంకల్పితంగా ఆమెకి ఒళ్ళు జలదరించింది. ఈ వర్షం రాత్రి ఏదో భయంకరమైన సంఘటన జరగబోతోంది అని అనిపించింది అహల్యకి. అలా ఎందుకు అనిపించిందంటే ప్రత్యేకమైన కారణమేమి లేదు.

పిడుగు పడిన వెలుగులు సద్దుముణిగిన కాసేపటికి చెవులు చిల్లులు పడేలా భూనభోనంతరాలు దద్దరిల్లేలా మేఘాల ధ్వని వినిపించింది.

ఆమె మనసు ఆందోళనగా ఉంది.

మామూలప్పుడైతే ఆ ఫార్మ్ హవుసు చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ ఇలా ఈ తుఫానులో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సెక్యూరిటీ గార్డులు కూడా లేరు తమ బంగళాకి అన్న సత్యం తెలుసు ఆమెకి.

ఇంతలో ఆమెకి ఓ దృశ్యం కనిపించింది.

ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

తమ భవంతి వైపు ఓ కార్ వస్తూ కనిపించింది సిమెంట్ రోడ్డుపై. హైవే పై వెళ్ళే వ్యక్తులకు, అసలు ఇక్కడ ఒక భవంతి ఉన్న విషయం తెలిసే అవకామే లేదు. హైవే పైనుంచి లోనికి కిలోమీటర్ ప్రయాణించి వస్తేనే తప్ప గుబురుగా ఉన్న తోటల మధ్య ఉన్న తమ భవంతి కనిపించదు. తమ ఆప్తులు, బంధువులు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చే అవకాశం లేదు. రాత్రే అందరితో ఫోన్‌లో మాట్లాడారు కూడా. ఈ వస్తున్నది ఎవరబ్బా?

పెద్ద వర్షం తాలూకు చినుకులు కార్ దీపాల కాంతిలో గాజు ముక్కలు విరిగి ఆకాశం నుంచి పడుతున్నాయా అన్నట్టు కనిపిస్తున్నాయి. క్రమంగా ఆ కార్ భవంతికి దగ్గరయ్యింది. ఫలాన కంపెనీది అని తెలియటం లేదు కానీ అది చాలా ఖరీదైన కార్‌గా పోల్చుకుంది అహల్య. మంచు తెరలు అలుముకున్న కిటికీలోంచి ఆమెకి అస్పష్టంగా కనిపిస్తున్నాయి బయటి దృశ్యాలు.

ఒక దశలో ఆ కార్ మలుపు తీసుకుని, భవంతి ముందు భాగం వైపుకి వెళ్ళింది. అహల్యకి కార్ కనిపించడం లేదు ఇప్పుడు.

తాను కలగానీ కనలేదు కద. ఈ సమయంలో, ఈ వర్షంలో తమ ఇంటికి ఎవరు వస్తారు. ఆశ్చర్యంలో మునిగిపోయింది అహల్య. అందుకే అది నిజం కాదు, తన భ్రమ అని తీర్మానించుకుంది.

ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టు కుంభవృష్టిగా వర్షం కురుస్తూనే ఉంది.

***

జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన లియోతో పాటు, హౌండ్ తరగతికి చెందిన ఇంకో రెండు మేలు జాతి శునకాలు బిగ్గరగా అరవడం వినిపిస్తోంది.

కింద గదిలో లైట్లు వెలిగాయి.

నాగేశం, ఆయన శ్రీమతికి ఇద్దరికి మెలకువ వచ్చింది ఆ శునకాల అరుపులకి.

బయట పోర్టికోలో కారు హారన్ మ్రోగిస్తూ ఉన్నారు ఎవరో.

శునకాల అరుపులు, కారు హారన్ తాలూకు చప్పుడుతో కాసేపు భీబత్సమైన వాతావరణం ఏర్పడింది అక్కడ.

మెయిన్ డోర్ తలుపులు తెరిచి నాగేశం బయట వరండాలోకి అడుగు వేశారు.

బయట పోర్టికోలో ఒక ఖరీదైన కారు ఆగి ఉంది. కారులోని వ్యక్తులని కార్ దిగనీయకుండా ఆ కారు చుట్టు చురుగ్గా తిరుగుతూ అటాక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ మూడు శునకాలు.

నాగేశం వాటిని సముదాయించి “ఎవరదీ” అని అడిగాడు.

కార్ తాలూకు కిటికీ అద్దం కిందకి దించి అందులోంచి తల బయటకి పెట్టి ఒక యువకుడు గ్రీట్ చేశాడు నాగేశం వంక చూస్తూ

“సర్! నేను హైవేపై వెళుతున్నాను. బ్రిడ్జీ మీద ముందుకు వెళదామంటే బ్రిడ్జి కూలిపోయింది. వెనక్కు వెళ్ళాలి అంటె కనీసం ఓ వందా యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఒక డీసెంట్ లాడ్జ్ ఉండే ఊరికి చేరుకోవాలంటే కార్లో అంత పెట్రోల్ కూడా లేదు. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందా?”

అతను అడిగిన విధానంలో సంస్కారం ఉట్టి పడుతోంది. అతన్ని చూడగానే సదభిప్రాయం ఏర్పడుతుంది ఎవరికైనా. అతన్ని అనుమానించాల్సింది ఏమీ కనపడలేదు నాగేశానికి.

“అరెరె అదెంత భాగ్యం! మీరు నిరభ్యంతరంగా ఈ రాత్రి మా ఇంట్లో ఉండవచ్చు. రండి రండి” అంటూ ఆహ్వానించాడు నాగేశం ఆ యువకుడిని.

కార్లో నుంచి దిగటానికి సందేహిస్తున్నాడు ఆ యువకుడు. శునకాలని చూసి కాస్త వెనుకంజ వేస్తున్న ఆ యువకుడిని చూసి చిరునవ్వు నవ్వుతూ, వాటిని కట్టేశాడు నాగేశం.

అతను ఇంటిలోనికి వచ్చేలాంటి అనుకూల వాతావరణం కల్పించాడు, కానీ ఆ నిర్ణయం వల్ల ఒక నిండు ప్రాణం గాల్లో కలిసి పోబోతోంది అని ఎవ్వరూ ఆ క్షణం ఊహించి ఉండరు.

ఆ కుర్రాడు కారు దిగాడు. మాటల మధ్యలో అతని పేరు అనిల్ అని తెలిసింది.

ఈ లోగా ఈ సందడి విని మేడ దిగి అహల్య లోపలి గదినుండి, వాళ్ళ అమ్మ ఇద్దరూ పోర్టికోలోకి వచ్చేశారు. వేళకాని వేళలో వచ్చిన ఆ అతిథి ఎవరైంది అర్థం కాలేదు ఆ అమ్మాయికి.

అనిల్‍ని చూడంగానే ఎవరికైనా మొదటి చూపులోనే సదభిప్రాయం ఏర్పడుతుంది.

ఆరడుగుల ఎత్తు, ఎత్తుకి తగ్గ అందమైన విగ్రహం. తెల్లటి తెలుపు. నుదురుమీద పడుతున్న వంకీలు తిరిగిన జలపాతం లాంటివత్తైన జుత్తు. కోటేరులాంటి ముక్కు. చురుకైన కన్నులు.

ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా అనిల్ నాటకీయంగా నాగేశం దంపతుల పాదాలకి నమస్కారం చేశాడు. అహల్య వంక చూస్తూ చిరునవ్వుతో “సారీ అండీ మిమ్మల్ని అందర్నీ ఇలా వేళ కాని వేళలో ఇబ్బంది పెడుతున్నాను”

“అయ్యో అదేం మాట నాన్నా. మనమంతా మనుషులం. చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు సైతం ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా?”

“ఎక్కడో ఉన్న మా అమ్మానాన్నలు గుర్తు వచ్చారండీ మిమ్మల్ని చూడంగానే” కాస్త ఎమోషనల్‌గా చెప్పాడు అనిల్.

గ్రౌండ్ ఫ్లోర్ లోనే డైనింగ్ హాల్ పక్కగా ఉన్న పెద్ద బెడ్ రూం, సాధారణంగా అతిథులకు ఇస్తుంటారు. అతనికి ఆ గదినే గెస్ట్ రూంగా కేటాయించారు. అతనికి ఆ గది చూపించి ఆ రాత్రి హాయిగా విశ్రాంతి తీస్కోమని చెప్పారు.

అతను కార్లో నుంచి మూడు పెద్ద పెద్ద సూట్ కేసులు దింపాడు.

తలా ఒక చేయి వేసి అతని సూట్ కేసులని గెస్ట్ రూంలోకి చేర్చారు. అతన్ని సేద తీరమని చెపుతూ “ఎప్పుడనంగా భోంచేశావో నాన్నా! కాస్త అన్నం తింటావా?” ఆప్యాయంగా పరామర్శించారు ఆవిడ.

“థాంక్స్ అమ్మా! నాకు ఆకలిగా ఏమీ లేదు. బాగా రాత్రయిపోయింది కద. మీరేమి అనుకోనంటే, కాస్త వేడి పాలు ఒక గ్లాసెడు ఇవ్వండి చాలు తాగి పడుకుంటాను” అన్నాడు ఆ యువకుడు.

“అయ్యో అదేం భాగ్యం. నువ్వు కాళ్ళు మొహం కడుక్కుని సేద తీరు బాబు. నేను ఈ లోగా పాలు వేడిచేసి తీస్కుని వస్తాను” ఆవిడ చెప్పారు.

అహల్య అందరివంక చూసి ’గుడ్ నైట్’ అని చెప్పేసి తిరిగి మేడ మీదకి వెళ్ళిపోయింది.

బయట నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. ఉండుండి మెరుపులు, ఉరుములు వాతావరణాన్ని భయానకంగా మారుస్తున్నాయి.

ఎక్కడో మరో పిడుగు పడిన ధ్వని వినిపించింది. ఆ మోతకి ఒక్కసారిగా ప్రపంచం అంతా స్తంభించిపోయిన అనుభూతి. కాసేపు నిశ్శబ్దం.

తిరిగి మళ్ళీ వర్షం చప్పుడు వినిపించడం మొదలయింది

వంట గదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్‌పై పాలగిన్నె పెట్టి ఆవిడ పాలు కాస్తున్నంత సేపు నాగేశం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు నిశ్శబ్దంగా. ఆయన మౌనానిని ప్రత్యేక కారణం లేదు.

ఓ అయిదు నిమిషాలలో ఆవిడ పాల గ్లాస్ తీస్కుని, అనిల్ గది తలుపుపై మృదువుగా ‘టక్ టక్’ మని చప్పుడు చేసి లోనికి ప్రవేశించింది.

మరి కాసేపట్లో ఆవిడ తిరిగి వచ్చింది డైనింగ్ టేబుల్ వద్దకు. ఆవిడ కళ్ళలో ఒక ఉద్వేగం.

మాటల్లో చెప్పటానికి వీలు లేని ఏదో గుర్తు తెలియని భావాల పరంపర ఆమె వదనంలో.

గది బయటకు వచ్చే వరకు నింపాదిగా వచ్చిన ఆవిడ నడక తన వెనుకే తలుపు మూసేసి, డైనింగ్ టేబుల్ వద్దకు వడి వడిగా వచ్చేసింది.

ఆవిడ వంక చూస్తూ నాగేశం “ఇక పడుకుందామా” అన్నాడు

ఆవిడ ఆయన పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ ఆయన చెవిలో గుస గుసగా చెప్పడం మొదలెట్టారు.

ఆవిడ కళ్ళలో ఒక విచిత్రమైన మెరుపు.

మొదట యథాలాపంగా వినడం మొదలెట్టిన నాగేశం ఆమె మాటలకి చివ్వున తలెత్తారు. ఆయన వదనం అంతా స్వేదంతో తడిసి పోయింది.

పెదాలు వణకడం మొదలెట్టాయి.

‘తప్పుకద. అలా చేయవచ్చునా. తప్పుకద’ ఆయన గొణిగారు.

***

ఆ రాత్రి సరిగ్గా మూడు గంటల సమయంలో ఆ బంగ్లా నుంచి రెండు కార్లు బయలు దేరాయి. ఒకటి అనిల్ కారు. ఇంకోటి నాగేశం కారు.

అనిల్ కారులో అనిల్ కూర్చుని ఉన్నాడు కానీ డ్రైవింగ్ సీట్లో కాదు. ముందరి సీట్లో విగతజీవుడిగా కూర్చుని ఉన్నాడు. ఆ కారుని డ్రైవ్ చేస్తున్నది నాగేశం.

వెనుకే నాగేశం కార్‍ని డ్రైవ్ చేస్తున్నది ఆయన శ్రీమతి. ఆ రెండు కార్లు విరిగిపోయిన బ్రిడ్జ్ వంక నెమ్మదిగా వెళుతున్నాయి. మొదట నాగేశం నడుపుతున్న కారు. ఆ వెనుకే ఆయన శ్రీమతి నడుపుతున్న కారు.

ఇవేవి తెలియని అహల్య ప్రశాంతంగా నిద్రపోతోంది మేడ మీద గదిలో.

మూడు శునకాలు జాగ్రత్తగా ఆ భవంతిని కాపాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాయి.

***

ఓ పాఠకుడా, అసలేం జరిగిందో తెల్సుకోవాలంటే ఒక మూడు గంటలు వెనక్కు వెళ్ళాలి.

డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న నాగేశం పక్కన కూర్చుంటూ విభ్రాంతితో చెప్పింది ఆవిడ

“ఏమండి నేను గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి మంచం మీద కూర్చుని తన సూట్‍కేసు తెరిచి ఉంచుకుని అందులో ఏదో సర్దుకుంటు ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి ఏ మాత్రం తడబడలేదు. ఆ సూట్ కేసు మూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ సూటుకేసు నిండా బంగారు బిస్కట్లు ఉన్నాయండి.

‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాయించిన సంపదమ్మా ఇదంతా. ఇంకా ఈ రెండు సూట్‍కేసులలో కూడా విలువైన ఆభరణాలు, ధనం ఉన్నాయ’ని అమాయకంగా చేప్పేశాడు

అతను ముంబాయిలో వ్యాపారాలు అన్నీ కట్టేసి, తన స్వగ్రామానికి వెళుతున్నాడట. వాళ్ళ నాన్నగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట. ఈ కుర్రాడు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి సాయంగా ఉండటానికి వెళుతున్నాడట..

నాకైతే అదంతా ఏమీ నమ్మబుద్ది అవటం లేదు. ఈ కుర్రాడు పెద్ద దొంగ అనిపిస్తోంది. ఎక్కడో పెద్ద దోపిడీ చేసి దోచుకున్న ధనాన్ని ఈ మూడు సూట్ కేసులనిండా తీస్కువెళుతున్నాడు అనిపిస్తోంది. నన్ను చూడంగానే ఏదో కథ చెబుతున్నాడు అనిపిస్తోంది.

నేను ఇచ్చిన పాల గ్లాస్ అందుకుని పాలు త్రాగుతూ హాయిగా కబుర్లు చెప్పాడు.

అతను పాలు త్రాగినంత సేపట్లో నా మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుందండీ.

మన కష్టాలన్నీ తీరిపోయే ఏకైక అవకాశం ఇది.

అతను మన అదృష్టం కొద్దీ మన ఇంటి గడపతొక్కి వచ్చాడు. అతనెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. అతను మన ఇంటికి వచ్చినట్టు కూడా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు.

పైగా వాడో పెద్ద దొంగ వెధవ అనిపిస్తోంది. ఇంకో గంటా రెండు గంటలు గడిచాక నెమ్మదిగా మనం అతని గదిలోకి వెళ్ళి అతన్ని హతమారుద్దాం. ఆ తరువాత గట్లు తెగి పారుతున్న నదిలోకి అతన్ని అతని కారుతో సహా తోసేద్దాం. అతను కార్ ప్రమాదంలో చనిపోయాడనుకుంటారు ఎవరైనా. ఈ సంపద యావత్తు మన స్వంతమవుతుంది.

ఒకే ఒక్క సారి నీతి, న్యాయం, ధర్మం అనే మాటలు పక్కన పెట్టేద్దాం. పైగా వాడు ఏదో మహాత్ముడు అయినా కాకపోయే. వాడో పెద్ద గజదొంగ. అలాంటి వాడిని హతమార్చటం తప్పే కాదు. మనలాంటి మంచి వాళ్ళ దగ్గర ధనం ఉంటే సద్వినియోగం అవుతుంది. మనం ఇన్నాళ్ళు ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నామో ఆ భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన మన కష్టాలని తీర్చటానికి ఈ అవకాశం కల్పించాడు.

ఇక మన కష్టాలు అన్నీ తీరిపోతాయి.

మీకు ఎలాగు మంచి పేరు ఉంది. మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అతనెవరో బాటసారి. అతనిపాటికి అతను ఎక్కడికో బయలుదేరాడు. కారు నడుపుకుంటు అలాగే ముందుకు వెళ్ళి తెలియక కూలిపోయిన బ్రిడ్జి మీద నుంచి కార్‌తో సహా నదిలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

అతను మనింటికి వచ్చినట్టు, ఇక్కడ ఇలా ఆశ్రయం పొందినట్టు ఫాలాక్షుడికి కూడా తెలియదు ఈ చీకటి రాత్రి.

మన కష్టాలు కడతేరేందుకు ఇలా అదృష్టం మన తలుపుతట్టి వచ్చినట్టు నేను భావిస్తున్నాను.

మీరు మీనం మేషం లెక్కపెట్టుకుంటూ ఉంటే తెల్లారి పోతుంది. ఏమి చేసినా మనం ఇంకో గంటా రెండు గంటల్లో మన ప్లాన్ అమలు చేయాలి”

—-

అనుకున్న ప్రకారం అనిల్‍ని స్టీరింగ్ ముందు కూర్చోబెట్టి కార్ డోర్ వేసేశాడు నాగేశం. కార్‍ని న్యూట్రల్ గేర్‍లో ఉంచాడు.

జరుగుతున్న ఘోరాన్ని మెరుపులు ఉరుములతో నిండిన ఆకాశం చూస్తూ ఉంది. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.

తెగి పోయి పిల్లర్ మీద నుంచి ఏటవాలుగా జారే బండలాగ ఉన్న రోడ్డు అంచున కారుని తీసుకుని వచ్చి నిలబెట్టాడు. న్యూట్రల్ గేర్లో ఉన్న ఆ కార్‌ని కొద్దిగా తోసేస్తే, ఓ ఇరవై అడుగులు దొర్లుకుంటూ వెళ్ళి, వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి పడిపోతుంది.

ఒక సారి చుట్టూ చూశాడు నాగేశం.

ఆ నిశీధిలో తమను ఎవ్వరూ చూసే అవకాశం లేదని ఆయనకి తెలుసు.

కానీ ఆయనకి తెలియదు, మనలోని మనస్సు భగవత్ స్వరూపం అని అన్నిటికీ సాక్షంగా చూసే అవకాశాన్ని భగవంతుడు ఆ రూపంగా పొందుతున్నాడని. అంతే కాదు, ఎవ్వరూ చూడలేదు అనుకున్న సమయాలలో కూడా భగవంతుని ప్రతిరూపాలైన పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయని ఆయనకి తెలియదు. ఈ పాటి జ్ఞానం అందరికీ ఉంటే ప్రపంచంలో ఇన్ని నేరాలే జరగవు కద.

ఆధ్యాత్మిక విద్య కరువై, స్వార్థమే ప్రధానం అనుకునే ప్రవృత్తే ప్రతి నేరానికి కారణం. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. తనను ఎవ్వరూ చూడటం లేదని ఒకసారి నిర్ధారించుకున్న పిమ్మట, నెమ్మదిగా శ్రీమతి వంక చూశాడు. ఆమె ఆయనకి గొడుగు పట్టి ఉంది. తమ కారుని దూరంగా రివర్స్ చేసి ఉంచింది అప్పటికే.

ఇప్పుడు వారి ప్రణాళికలో చివరి అంకానికి రంగం సిద్ధం అయ్యింది.

ఎప్పుడో చదివిన శ్రీశ్రీ కవితలో పంక్తులు గుర్తు వచ్చాయి ఆయనకి. ఆయన పెదాలు ఉఛ్చరిస్తున్నాయి

ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా ఓ మహర్షి

ధైర్యాన్ని కూడగట్టుకుని, విరిగిపోయి ఏటవాలుగా ఉన్న బ్రిడ్జి రోడ్డుపై కార్‍ని వెనుకనుండి తోయటం మొదలెట్టాడు.

రోడ్డుపై ఉన్న తెల్లని గీత వెంబడి నెమ్మదిగా జారడం మొదలెట్టింది కారు.

విగతజీవుడిగా ఉన్న అనిల్ దేహం నిమిత్తమాత్రలా స్టీరింగ్ ముందు కూర్చునున్న భంగిమలో శూన్యంలోకి చూస్తోంది.

లిప్తపాటులో మెరిసిన మెరుపు కాంతిలో అతని కుడి చెంప మీద చెవి పక్కగా ఉన్న బఠానిగింజ అంత మచ్చ చూశాడు నాగేశం.

ఆ పుట్టు మచ్చ ఒక క్షణం పాటు అతనిలో ఏదో అలజడి రేపింది. అది క్షణకాలం మాత్రమే.

అతనికి చాలా అశాంతిగా ఉంది. కార్ అప్పటికే వారి అధీనంనుంచి దాటి పోయింది.

వాలు వెంబడి దొర్లుకుంటూ దబ్బుమని చప్పుడు చేస్తూ నీళ్ళలో పడటం, వేగంగ ప్రవహిస్తున్న ప్రవాహంలో కొట్టుకుని పోవడం క్షణంలో జరిగాయి.

వాతావరణం మరింత భయంకరంగా మారింది. వర్షం హోరు పెరిగింది.

తమ ప్రణాళికలోని ఈ చివరి అంకపు ఈ దృశ్యాన్ని అ మసక చీకటిలో చూసి, ఒక క్షణం ఆలస్యం చేయకుండా వెనుదిరిగారు ఆ దంపతులు.

***

వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. కార్ వాళ్ళ కాంపౌండ్ వాల్ వద్దకు వచ్చేసింది.

కార్ హెడ్‍లైట్స్ కాంతిలో కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ ఒక సారి గతుక్కుమన్నారు.

గేట్లు బార్లా తెరచి ఉన్నాయి.

వారికి బాగా గుర్తు తాము బ్రిడ్జి దిశగా వెళ్ళేటప్పుడు గేట్లు మూసి వెళ్ళారు. మరి ఇప్పుడు గేట్లు ఎందుకు తెరచి ఉన్నాయి?

కార్ గేట్లు దాటి తమ ఫార్మ్ హవుసు తాలూకు సిమెంట్ రోడ్డు మీదకి తెచ్చాడు నాగేశం.

కారాపి, వెళ్ళి గేట్లు మూసేసి మళ్ళీ కార్ నడపటం ప్రారంభించాడు.

వారిద్దరిని ఆశ్చర్య పరుస్తూ ఎదురుగా ఇంకో వాహనం తాలూకు హెడ్‍లైట్లు కనిపించాయి. అది ఎవరిదయింది అర్థం కాలేదు మొదట.

ఆ వాహనం క్రమంగా దగ్గరయింది. అప్పుడు అర్థం అయింది వారికి అది పోలీస్ పెట్రోలింగ్ వాహనం అని. దానిపై నీలం ఎరుపు రంగు దీపాలు వెలిగి ఆరుతూ వింత శబ్దాలు చేస్తూ ఒక విధమైన భీతిని కల్గిస్తున్నాయి.

ఎదురుగా వచ్చిన ఆ వాహనం వారి పక్కగా వచ్చి ఆగింది.

పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వాహనం దిగి నాగేశం పక్కగా వచ్చి నిలబడి గ్రీట్ చేశాడు.

“మీ అబ్బాయిని గ్రీట్ చేద్దామని వచ్చాము, క్షేమంగా చేరాడా ఇల్లు?”

“అబ్బాయి ఏమిటి?” నాగేశానికి అసలేం అర్థం కాలేదు. వాళ్ళబ్బాయి తన ఆరవ ఏట హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో తప్పిపోయి దాదాపు ఇరవై ఏళ్ళవుతోంది.

ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పుకుపోతున్నాడు

“నిన్న రాత్రి హైవే పై చెక్ పోస్ట్ వద్ద కనిపించి మీ చిరునామా ఇప్పించుకున్నాడు నా వద్ద. ఎప్పుడో ఇరవై ఏళ్ళనాడు తన ఆరో ఏట తప్పి పోయిన మీ అబ్బాయి ఇప్పుడు ఇంత పెద్దవాడై వచ్చాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావటం అంటే ఇదే కద. మీ వాడు భలే మాటకారి సర్. ఇప్పుడు ముంబాయిలో చాలా పెద్ద బిజినెస్‌మేన్ మీ వాడు.

నేను ఇటు వేపు పెట్రోలింగ్‌కి వచ్చాను. ఎలానూ ఇంత దాకా వచ్చాను కద. మీ అందర్నీ కలిసి మీరు ఎలా ఆనందపడుతున్నారో చూద్దాం అని వచ్చాను. మీ వాడు తెల్లవారే దాకా మీకు అసలు విషయం చెప్పకుండా సర్‍ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాడట. ………..”

ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూనే ఉన్నాడు.

నోట మాట పెగలడం లేదు నాగేశం దంపతులకి.

దూరంగా మేలు జాతి శునకాలు బిగ్గరగా అరుస్తూ ఉన్నాయి.

వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది.

(రష్యన్ ఏకాంకి నాటిక ‘లిథువేనియా’ ప్రేరణగా)

సమాప్తం

Exit mobile version