[మణి గారు రచించిన ‘నిరీక్షణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నీ కోసమే నా నిరీక్షణ!
గడిచినవి, క్షణాలో, యుగాలో తెలియదు.
నీకోసం అలంకరించుకున్న
నా ఆభరణాలు అలంకారాలు
కళా విహీనమై రాలిపోతున్నాయి!
నీ ముందు
పాడాలనుకున్న పాట కోసం
నేను చేరవేసుకున్న పదాలన్నీ
ఎప్పుడు చెరిగిపోయాయో తెలియదు!
నాలో వికారాలు ఏవీ నీ కంట పడకూడదని
నేను కప్పుకున్న
ఆచ్ఛాదాలన్నీ ఒక్కొక్కటీ నాకే తెలియకుండా
తొలగిపోతూంటే,
అసహాయంగా సిగ్గుతో, అవమానంతో,
తల వంచుకుంటాను.
నా గురించి
నాకన్న నీకే ఎక్కువ తెలుసు అని తెలిసాక,
నిన్ను ఆకర్షించడానికి నేను చే సే ప్రయత్నాలు ,
అర్థరహితం, అవివేకం అని తెలుస్తూంటే,
ఏమి చేయాలో తెలియని అయోమయంతో
నన్ను నేను నిశ్శబ్దంలో బంధించుకుంటాను!!
ఎప్పటికైనా ఈ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ
నిన్ను నువ్వు వ్యక్తీకరించుకుని,
నా చేయి పట్టుకుని నడిపిస్తే,
నీ చేతిలో రెల్లు పిల్లనగ్రోవినై,
నీ గొంతులోని మధుర రాగాలని,
నా గుండెలో నింపుకుని,
ఈ విశ్వం అంతా విస్తరింప చేసి,
ఆ మాధుర్యంతో,
అన్నిటిని పులకరింప చేయాలని ఆశ.
అందుకే అనంతం లాంటి
ఈ నిశ్శబ్దంలో నీకోసం
ఎదురు చూస్తూ వుంటాను.
