[శ్రీమతి సుష్మ త్రిపాఠీ రచించిన ‘షాలిని’ అనే హిందీ కథని ‘నిర్ణయాత్మక రాత్రి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
సైకియాట్రిస్ట్ డా. సత్య ప్రయాణిస్తున్న కారు, ‘కచ్చే మన్ రుగ్ణాలయ్’ అన్న హాస్పటల్ బోర్డు స్పష్టంగా కనిపిస్తున్న రోడ్డులోకి వచ్చింది. ఆమె తనలో తానే, ‘ఈ హాస్పిటల్‌కి ఆ పేరు సరిగ్గా కుదిరింది. కచ్చే మన్ అంటే ఉండాల్సినంత మానసిక బలం లేకపోవడం’ అని అనుకుంది. మళ్ళీ వెంటనే, ‘ఆఁ, కాదు, కాదు, ఎవరైనా తమకు చేసిన ద్రోహాన్ని లేదా మనసుకు కలిగించిన గాయాన్ని భరించేంత బలమైన మానసిక శక్తి అయితే తప్పక ఉండాలి’ అనుకుంది. ఇంతలో కారు హాస్పటల్ గేట్ ముందు ఆగింది. ఆమెకి స్వాగతం చెప్పడానికి అక్కడి ప్రముఖులు డా. చిన్మయ్ స్వామి నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకుని పరిచయాలు చేసుకున్నారు. ఆ తర్వాత, ఇద్దరూ వెళ్లి ఆఫీసు పక్కనే ఉన్న గదిలోని సోఫాలో కూర్చున్నారు.
మానసికంగా దెబ్బతిన్న మహిళలను తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడంలో డా. సత్య ప్రసిద్ధి చెందింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చాలా మంది మహిళలు పూర్తిగా ఆరోగ్యకరమైన జీవితాలను గడపడంలో ఆమె చేసిన కృషి ఎంతగానే విజయవంతమైంది. ఈ రోజు, ఇక్కడికి ఆమె, ప్రత్యేకంగా, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ‘షాలిని’ కోసం వచ్చింది.
డా. చిన్మయ్ ఆమెకి కేస్ ఫైల్ అందిస్తూ, “రండి, మీకు పేషంట్‌ని పరిచయం చేస్తాను” అంటూ అన్నాడు. మొదటి పేజీలో ఉన్న షాలిని ఫోటో చూసి, ‘ఓహ్, ఎంత అమాయకంగా ఉంది’ అని అనుకుంది డా. సత్య. షాలిని గదికి వెళ్ళి చూస్తే, ఆమె – రెండుగా విరిగిన ఓ కర్రపుల్ల ముక్కలని దగ్గరికి చేరుస్తూ, నొక్కిపెడుతూ “అతుక్కోండి, విడిపోవద్దు, పడిపోవద్దు” అని అంటోంది. ఆమె చేయి వదిలేయగనే పై ముక్క కింద పడిపోతోంది. పైకి తీయడం, మళ్ళీ కలిపేందుకు ప్రయత్నించడం, అవే మాటలు అనడం – పదే పదే చేస్తోందామె. ఇదే విధంగా, ఆమె విరిగిన వస్తువులను అతికించేందుకు ప్రయత్నిస్తూంటుందని, విఫలమై ఉద్విగ్నతతో గట్టి గట్టిగా అరుస్తుందని, ఏడుస్తుందని డా. చిన్మయ్ చెప్పాడు. ఆ తర్వాత కాళ్ళూ చేతులూ నేలకి కొట్టుకుని గాయాలు చేసుకుంటుదని చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికి శాంతించి, హాస్పటల్‍లోనే ఏదో ఓ మూలకి వెళ్ళి గంటల పాటు కదలకుందా కూర్చుంటుందని చెప్పాడాయన. ఆ సమయంలో ఆమె రెప్ప వేయడని, ఏదీ తినదూ, తాగదు అని చెప్పాడు.
డా. సత్య ఆఫీసు గదిలో కూర్చుని షాలిని కేస్ ఫైల్ క్షుణ్ణంగా చదివింది. అందులోని వివరాల ప్రకారం ఓ రోజు షాలిని భర్త పవన్, తన మామగారికి ఫోన్ చేసి వీలైనంత త్వరగా తన ఇంటికి రమ్మని చెప్పాడు. మర్నాడే షాలిని తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చారు. అప్పుడు షాలిని నిద్రపోతోంది. తల్లి ఆమె దగ్గరకు వెళ్ళి, తల నిమిరి, మెల్లగా “షాలినీ” అని పిల్చింది. షాలిని నిద్రలోనే ఏదో గొణిగింది కానీ లేవలేదు. పవన్ తన చేతి గడియారం కేసి చూస్తూ, “ఇంకో గంట తర్వాతే లేస్తుంది.” అన్నాడు. “అసలు విషయం ఏంటి అల్లుడు గారూ? అమ్మాయి ఆరోగ్యంగానే ఉందా? ఎందుకు ఇంత హఠాత్తుగా రమ్మన్నారు మమ్మల్ని?” అని షాలిని తండ్రి పవన్‌ని అడిగాడు. ఇటీవలి కాలంలో, షాలిని అలసిపోయేంతవరకూ రోదిస్తూనే ఉంటోందని, రాత్రి పూట నిద్రపోవడం లేదని, అందుకే నిద్ర మాత్రలు ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు పవన్. షాలిని తల్లిదండ్రులు విస్తుపోయారు. “ఏం జరిగింది? అమ్మాయి ఇలా ఎందుకు తయారైంది?” అని షాలిని అమ్మానాన్న అడిగారు. వాళ్ళపై నుంచి చూపులు తప్పించి, “వచ్చారుగా, మీరే కనుక్కోండి” అన్నాడు. షాలిని తల్లి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏదో తప్పు జరిగిందనీ, దాని పరిణామమే ఇదని ఆమె గ్రహించింది. “అయ్యో, తల్లీ, షాలినీ, చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్మావే.. ఆ శక్తే నిన్ను ఇప్పటికి నడిపిస్తోంది కదా. ఎంత మర్యాదగా పద్ధతిగా ఉండేదానివి?నీకేమైందమ్మా?” అంటూ ఏడ్వసాగింది. అప్పుడే షాలిని ఏదో గొణుగుతూ నిద్ర లేచింది. ఎదురుగా అమ్మానాన్నలని చూసి, ఒక్కసారిగా ఏడవసాగింది. ఆమెను శాంతింపజేయడానికి తల్లిదండ్రులు గట్టిగా ప్రయత్నించారు. చివరకు ఏడుపు ఆపి, రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది షాలిని. అమ్మానాన్నలు ఎన్ని ప్రశ్నలు వేసినా షాలిని జవాబు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. షాలిని తల్లి, “మనవడు ఏడి బాబూ?” అంటూ పవన్‍ని అడిగింది. షాలిని, పవన్‍లకు ఐదేళ్ళ కొడుకు. వాడి పేరు కిరీట్. ఓ వారం క్రితం కిరీట్‌ని వాళ్ళ నానమ్మ వాళ్ళింటికి పంపానని చెప్పాడు పవన్. షాలిని, పవన్‍ల వివాహం జరిగి ఏడేళ్ళయింది. వాళ్ళది అన్యోన్య దాంపత్యమని అందరూ భావించేవారు. కిరీట్ పుట్టాకా, రెండు కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి. కిరీట్ నాయనమ్మా తాతయ్యలు రెండు గంటల దూరంలో ఉంటారు. వాళ్ళు తరచూ వచ్చి వెళ్తుంటారు. కిరీట్ అంటే నానమ్మకి బాగా ముద్దు. కిరీట్‌ని పంపించకుండా ఉండాల్సింది, ఇక్కడ ఉంటే షాలిని మనసుకి కాస్త ఊరటగా ఉందేదని షాలిని తండ్రి అన్నాడు. పిల్లాడు ఈ పరిస్థితిలో తల్లి దగ్గర ఉండడం మంచిది కాదని, అమ్మని ఇలా చూసి బాధపడతాడని, అందుకే పంపేశానని చెప్తాడు పవన్.
“మీరు ఏదైనా దాస్తున్నారా? షాలినికి ఏమయింది? అసలు ఎన్నాళ్ళ నుండి ఇలా జరుగుతోంది?” అని షాలిని అమ్మ అడిగింది పవన్‌ని.
“ఒక నెల రోజుల నుండి”
“ఆ విషయం ఇప్పుడా చెప్పేది?” అన్నారు షాలిని తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి.
“మొదట్లో, ఆమె ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేది, తరువాత నిశ్శబ్దంగా ఉంటోంది. ప్రతిరోజూ నేను ఈరోజు గొడవలు ముగుస్తాయని అనుకునేవాడిని, కానీ మరుసటి రోజు ఆమె అర్థరహితంగా అనిపించే విషయాలపై మళ్ళీ అరుస్తూ గొడవ ప్రారంభిస్తుంది. పరిస్థితిని నేను చక్కదిద్దగలనని అనుకున్నాను, కానీ అదుపు తప్పింది, అందుకే మీ అందరికీ కబురు చేసాను.” తాపీగా చెప్పాడు పవన్.
సాయంత్రానికి పవన్ తల్లిదండ్రులు కిరీట్‌ని తీసుకుని ఇంటికి వచ్చారు. షాలిని తల్లి – కళ్ళలో నీళ్ళు తిరుగుతూండగా మనవడిని హత్తుకుంది. వాడి తాత ప్రేమగా వాడి తలపై కొట్టాడు. తమలో తాము సంప్రదించుకున్న తర్వాత, నలుగురు తల్లిదండ్రులు – షాలిని విషయంలో మానసిక వైద్యుడిని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. మొదట, వారు ఆమెను నగరంలోని వృద్ధ వైద్యుడు డాక్టర్ కృష్ణకాంత్ వద్దకు తీసుకెళ్లారు. షాలిని పరిస్థితి చూసి, ఆమెను ‘కచ్చే మన్ రుగ్ణాలయ్’కి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. అప్పటి నుండి షాలిని అక్కడే ఉంది. సంవత్సరం తర్వాత కూడా ఆమె పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఆమె తల్లిదండ్రులు, పవన్, అత్తగారు, మామగారు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆమెను చూడటానికి వస్తారు. డాక్టర్ సత్య గురించి వాళ్ళకు చెప్పింది డాక్టర్ కృష్ణకాంత్. షాలిని తండ్రి ఒక రోజు ఒక దుకాణంలో డా. కృష్ణకాంత్‌ని కలిసారు. ఆయన షాలిని గురించి అడిగగా, ఎటువంటి మెరుగుదల లేదని షాలిని తండ్రి చెప్పాడు. అప్పుడు డా. కృష్ణకాంత్ ఆగ్రాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సత్య గురించి చెప్పాడు.
షాలిని తల్లిదండ్రులు డాక్టర్ సత్యను వేడుకున్నారు, కానీ చివరికి ఆమె రోగిని ముందుగా చూసి ఏ సంగతి చెప్తానని షరతు విధించింది. “నేను సరైనదేనని భావిస్తేనే కేసును స్వీకరిస్తాను.” అంది. డాక్టర్ సత్య అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఆ తర్వాత, ఆమె ఆగ్రాకు తిరిగి వచ్చింది. షాలిని తల్లిదండ్రులు ఆమెను మళ్ళీ కలిసారు. మాటల మధ్యలో, వారు తమ మనవడు కిరీట్ ఫోటో చూడటానికి డాక్టర్ సత్యకు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ షాలినిది. డాక్టర్ సత్య ఆసక్తిగా స్క్రీన్‌ను తిప్పి చూసి, అనేక వీడియో క్లిప్‌లు మరియు ఆ జంట గత ఫోటోల రీల్‌లను చూశారు. ఎక్కడా ఒక్క అసహ్యకరమైన వ్యక్తీకరణ కూడా లేకుండా, ప్రతిదీ అద్భుతంగా మరియు ప్రేమగా కనిపించింది. షాలిని తల్లిదండ్రులు మరియు ఆమె అత్తమామల ప్రకారం, షాలినీ పవన్‌లు సంతోషంగా ఉన్న జంట.
డాక్టర్ సత్య – షాలినిని ఆగ్రా లోని తన ఆసుపత్రికి తీసుకురమ్మని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. షాలిని తండ్రి మధ్యతరగతి కుటుంబీకుడు, అయినప్పటికీ అతను ఎంత ఖర్చులనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. “మీరు సరైనదని భావించేది చేయండి. నా కుమార్తె ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నాడు. కచ్చే మన్ ఆసుపత్రిలో అవసరమైన అన్ని పత్రాలను పూర్తి చేసిన తర్వాత, షాలినిని ఆగ్రాకు తీసుకువచ్చారు. ఆమెను దూకుడుగా ఉండే రోగుల నుండి దూరంగా ఉంచారు.
***
డాక్టర్ సత్య షాలినిని కలిసి ఆమెతో మాట్లాడేది, ఆమె ఏమీ అనదు, కానీ ఆమె ఏదైనా చెబితే, “ఏదీ కనెక్ట్ కాలేదు” అని చెప్పేది. డాక్టర్ సత్య ఎప్పుడూ సిసి టివి ద్వారా షాలినిని గమనిస్తూనే ఉండేది. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఆమె తన మొబైల్ ద్వారా షాలినిని చూస్తూనే ఉండేది. షాలిని తనకు దొరికిన వేటినైనా జోడించడానికి ప్రయత్నిస్తూనే ఉండేది – చిరిగిన కాగితం, చిరిగిన ప్యాడ్ పేజీ, మందుల రాపర్లు మొదలైనవి. అది అతుక్కోకకపోతే, నిరాశతో ఏడుస్తూ అరవడం మొదలుపెట్టేది. చేతులూ కాళ్ళూ కొట్టుకోవడం ద్వారా తనను తాను గాయపరచుకునేది. తర్వాత మందు ఇచ్చే వరకు, ఆమె గంటల తరబడి నిశ్శబ్దంగా ఒకే చోట కూర్చుంటుంది, రెప్పవేయకుండా.
ఆసుపత్రులలో, రోగులకు హాని కలిగించే వస్తువులను దూరంగా ఉంచుతారు. ఒక రోజు, పనమ్మాయి ఆసుపత్రి గదులను, కారిడార్‌ని శుభ్రం చేస్తోంది. అన్ని గదుల నుండి చెత్తను తీస్తున్నారు. చెత్తలో రెండు ముక్కలుగా ఉన్న గాజు గ్లాసును షాలిని చూసింది. ఆమె ఆ రెండు ముక్కలను తీసుకొని వాటిలో జోడించడానికి కూర్చుంది. అప్పుడే, డాక్టర్ సత్య వచ్చింది. షాలిని చేతుల్లో విరిగిన గాజు గ్లాసు ముక్కలని ఆమె చూసింది. ఆ గాజు గ్లాసు వల్ల షాలిని గాయపడవచ్చని ఆమె భయపడింది. కానీ షాలిని ముఖం చూడగానే, ఆమె నిశ్శబ్దంగా దాని వైపు చూసింది. మొదటిసారి ఆమె ముఖం భిన్నంగా అనిపించింది. షాలిని రెండు గాజు గ్లాసు ముక్కలను దగ్గరకి చేసి చూస్తోంది, ఆమె ముఖంలో కొంచెం సంతృప్తి కనిపించింది. గాజు గ్లాసు బాగా పగిలినప్పటికీ, ఆ రెండు ముక్కలని దగ్గరకి చేసి, చూసినప్పుడు పగులు కనిపించడం లేదని డాక్టర్ సత్య గమనించింది. అప్పుడు, షాలిని గాజు గ్లాసును నేలపై ఉంచి, బోర్లా పడుకుని, దానినే చూడసాగింది.
అకస్మాత్తుగా, ఆమె “ఇది పూర్తిగా అతుక్కోలేదు! పగులు ఉంది! అది ఉండకూడదు!” అని అరిచింది, గట్టిగా ఏడవసాగింది. తనని తాను కొట్టుకోవడం ప్రారంభించింది. సిబ్బంది వచ్చి ఆమెను తన గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చారు. డాక్టర్ సత్య తనలో తాను ఆలోచించుకుని షాలినిని తన ఇంట్లోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రి అధికారులతోనూ, ఆమె సంరక్షకుడి అనుమతితో, ఆమె షాలినిని తన ఇంటికి తీసుకువచ్చింది. ఆమె ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. ఆమె తన ఇంట్లో చాలా మంది రోగులకు చికిత్స చేసి వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బాగుచేసింది.
డాక్టర్ సత్య మొదటి నుంచీ తెలివైన అమ్మాయి. ఆమె పజిల్స్‌ని, సుడోకులను చాలా త్వరగా సాల్వ్ చేయగలదు. ఆమె పెద్దయ్యాక, ఇంటి సమస్యలను, బయటి సమస్యలను త్వరగా పరిష్కరించగలదని పెద్దలు అనుకునేవారు. మనస్తత్వశాస్త్రంపై ఆమెకున్న ఆసక్తి ఆమెను దానిని తన వృత్తిగా ఎంచుకునేలా చేసింది. ఆమెకు ఒక కుమార్తె మాత్రమే ఉంది. ఆమె ఒక సంవత్సరం క్రితం వివాహం చేసుకుని తన భర్తతో కలిసి అత్తమామల వద్ద ఉంటోంది. డాక్టర్ సత్య ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంది. ఆ ఇల్లు మూడు అంతస్తుల ఇల్లు, విశాలమైన స్థలం, ఒక వైపు తోట, మరో వైపు సర్వెంట్ క్వార్టర్స్ మరియు కార్ పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఆమె బావగారూ, తోడికోడలు మధ్య అంతస్తులో ఉంటారు. వారికి ఓ మనవడు (కూతురి కొడుకు), ఓ మనవరాలు (కొడుకు కూతురు) ఉన్నారు. వాళ్ళు సెలవుల్లో ఇక్కడికి వస్తుంటారు. డాక్టర్ సత్య తన భర్తతో పై అంతస్తులో ఉంటుంది. షాలిని అక్కడే ఒక గదిలో వసతి కల్పించారు. సత్య అత్తమామలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటారు. ఇద్దరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు. వాళ్ళు తమ పనులు తాము చేసుకుంటాఉర్. డాక్టర్ సత్య ఇంటి పనులకు ఒక సహాయకురాలిని నియమించుకుంది. ఆమెకి జీతం పెంచి, షాలిని పనులు చూడడం, ఆమెని గమనించుకుంటూ ఉండే బాధ్యతని అప్పగించింది. షాలిని గది పక్కన గ్రిల్ తలుపు ఉంది. చెక్క తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది మరియు గ్రిల్ తలుపు మూసి ఉంటుంది; బయటి నుండి లాక్ చేయబడి ఉండటం వలన లోపలి నుండి తెరవడం కష్టం. ఈ విధంగా, షాలినిని బయటి నుండి పర్యవేక్షించవచ్చు. డాక్టర్ సత్య ఇంట్లో ఉన్నప్పుడల్లా, ఆమె ప్రతిరోజూ షాలినికి ఒక విరిగిన వస్తువును సరిచేయమని ఇచ్చేది. ఆమె చాలా ఏకాగ్రతతో ఆ వస్తువును సరిచేయడానికి ప్రయత్నించేది. ఆమె ముఖంలో విజయం మరియు వైఫల్యాన్ని విశ్లేషించేది. దాన్ని సరిచేసిన తర్వాత ఆమె ముఖంలో కొద్దిగా సంతృప్తి కనిపిస్తుంది, కానీ దాన్ని సరిచేసినట్లు చూసిన తర్వాత, ఆమె అరుస్తూ, ఇది మునుపటిలా ఉండదని చెబుతుంది మరియు ఆమె ఈ ప్రక్రియను పునరావృతం చేస్తూనే ఉంటుంది.
***
రోజులు గడిచాయి. సత్య ఇంట్లోని మంచి ఆహారం, చక్కని వాతావరణం షాలిని రూపంలోనూ, ప్రవరనలోనూ స్పష్టంగా ప్రతిబింబించాయి. ఒక రోజు, డాక్టర్ సత్య ఒక పూలకుండీ అడుగున ఉన్న బేస్ (మట్టి పళ్ళెం) కొద్దిగా విరిగిపోయి ఉండటాన్ని గమనించింది, మామూలుగా చూస్తే బేస్ విరిగిపోయినట్లు కనిపించలేదు. పూలకుండీ క్రింద నుంచి ఆ మట్టి పళ్ళేన్ని తీసి, దాన్ని సరిచేయమని షాలినికి చెప్పింది సత్య. ఆమె రెండు చేతులతో బేస్‌ను పరిశీలించి, దానిని తలక్రిందులుగా చేసి, పూలకుండీని బేస్‌పై చాలాసార్లు ఉంచింది. చివరికి అది సరిపోయేటప్పుడు, పగులు కనిపించలేదు. డాక్టర్ సత్య చప్పట్లు కొట్టి, “ఇది బాగుపడింది! వావ్, ఇది అతుక్కుంది!” అని చెప్పి పూలకుండీని ఎత్తి షాలిని చేతికి అందకుండా దూరంగా ఉంచింది. ఆమె చాలా సేపు నిశ్శబ్దంగా దాని వైపు చూస్తూ, ఏడుపు లేదా అరుపులు లేకుండా అక్కడే నిద్రపోయింది. ఆమె ఒక పరిష్కారం కనుగొన్నట్లు అనిపించింది. ఈ విధంగా, ప్రతిరోజూ సత్య షాలినికి విరిగిన వస్తువు ఏదో ఒకటి ఇచ్చేది, షాలిని దానిని సరిచేస్తుంది, పగులు కనబడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు, సరిచేయమంటూ ఓ విరిగిన కప్పుని షాలినికి ఇచ్చారు. అది చాలా యాదృచ్ఛికంగా విరిగిపోయింది. ఆమె దాన్ని సరిచేసింది, అయినా అన్ని పగుళ్ళు స్పష్టంగా కనిపించాయి. వాటిని చూపిస్తూ, ముఖంలో విచారం వ్యక్తమవుతుండగా, “ఇది మళ్ళీ ఎలా బాగవుతుంది?” అని అడిగింది షాలిని. “విరిగిన వస్తువు లేదా చెదిరిన నమ్మకం!” అంటూ మామూలు మనిషిలా పలికింది షాలిని. డాక్టర్ సత్య ఆమె ముఖ కవళికలను పరిశీలిస్తోంది.
“వస్తువులు నిర్జీవమైనవి. వాటిపై ఎవరికీ నియంత్రణ ఉండదు. అయితే, నమ్మకం అనేది ఒక మానసిక ప్రక్రియ. జీవులకు పడిలేచే గుణం, కోలుకునే సామర్థ్యం ఉంటాయి. నమ్మకాన్ని వమ్ము చేసిన వారు, వారు తెలియక తప్పు చేసి ఉంటే, భవిష్యత్తులో దానిని పునరావృతం చేయకపోతే క్షమించవచ్చు” అని డా. సత్య బదులిచ్చి, అక్కడ్నించి వెళ్ళిపోయింది. సహాయకురాలు షాలినిని ఆమె గదిలోకి తీసుకువెళ్ళింది. షాలిని ఏదో ఆలోచనలో లీనమైపోయింది. రాత్రి భోజనం తర్వాత, డాక్టర్ సత్య, షాలిని బాల్కనీలో కుర్చీలలో కూర్చున్నారు. షాలిని ఉన్నట్టుంది, “మీరు మీకంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి – నమ్మకాన్ని వమ్ము చేస్తే ఏం చేయాలి?” అని అడిగింది. డాక్టర్ సత్య చిరునవ్వుతో – “సహజంగానే, విశ్వాసం విచ్ఛిన్నం కావడం వల్ల కలిగే దుఃఖం చాలా బాధాకరమైనది, కానీ అది మన స్వంత జీవితాల కంటే తక్కువ విలువైనది. మనం మన ఆనందాలను, మన శ్వాసలను పూర్తిగా వేరొకరికి ఇచ్చాము. కానీ అలా జరగకూడదు. మన విలువను అర్థం చేసుకోని వాళ్ళకి మన ఉనికిని అప్పగించినట్లయితే, అది మనల్ని మనం అవమానించుకున్నట్లే అవుతుంది.” అని చెప్పింది. నేటి ప్రపంచంలో, జీవిత భాగస్వామి లేదా పిల్లలైనా, మానసికంగా, శారీరకంగా ఎవరిపైనా ఆధారపడకూడదు. ఎందుకంటే గుడ్డిగా నమ్మగలిగే నిజాయితీపరులు, సద్గుణవంతులు కొరత చాలా ఉంది.
డాక్టర్ సత్య చెప్పే ప్రతి మాటను షాలిని శ్రద్ధగా విన్నది. డాక్టర్ గుడ్‌నైట్ చెప్పి తన బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయింది. కానీ షాలినికి అది ఏం శుభరాత్రి? ఆమె జీవితంలో సూర్యోదయం కానున్నది. అలానే కూర్చుండిపోయింది షాలిని. బాధాకరమైన సంఘటన ఆమె కళ్ళ ముందు సినిమాలాగా కదలాడింది. తేడా ఏమిటంటే ఈరోజు విలపించడం లేదా కన్నీళ్లు లేవు.
***
పవన్ టూర్ నుండి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. అతను తరచుగా కొన్ని రోజుల చిన్న ప్రయాణాలు చేసేవాడు, సాధారణంగా మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే. ఈసారి, అతను పూర్తి వారం తర్వాత తిరిగి వచ్చాడు. గతంలో, అతను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు ఫోన్ చేసి, ప్రతిదీ వివరంగా వివరించేవాడు. ఈసారి, అతను పని గురించి మాత్రమే మాట్లాడాడు, కేవలం సమాచారం మాత్రమే. “చాలా పని ఉంది” అని చెప్పి, ఫోన్ కట్ చేశాడు. షాలిని దానిని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు, పవన్ బిజీగా ఉన్నాడని అనుకుంది. అతను ఆ రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చాడు. షాలిని సంతోషంగా, అతనికి ఇష్టమైన భోజనం సిద్ధం చేస్తోంది. కిరీట్ నిద్రపోయాడు. ఆమె టేబుల్ మీద కూర గిన్నె పెట్టడానికి వెళ్ళింది. పవన్ ఫోన్ టేబుల్ మీద ఉంది. ఫోన్ స్క్రీన్ మీద ఒక ఇమెయిల్ సందేశం మెరిసింది, చూసింది. అది ఆమెకు నచ్చలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వారు కలిసి తిన్నారు. నిద్రించడానికి సిద్ధం అయి మంచం మీద పడుకున్నారు. షాలిని తన చేతిని పవన్ చేతిపై వేసింది. పవన్ స్పందించలేదు. మరుసటి క్షణం, ఆమెకు వీపు తిప్పి, “నేను వారం మొత్తం అలసిపోయాను. నాకు నిద్ర వస్తోంది” అని అన్నాడు. షాలినికి అది నచ్చలేదు. పవన్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దగ్గర్లో ఉంచిన ఫోన్‌లో ఏదో శబ్దం వచ్చింది. ఆమె అయిష్టంగానే ఫోన్ ఎత్తింది, స్క్రీన్ మీద కొత్త మెయిల్ కనిపించింది. ఆమె దాన్ని తెరిచి చదువుతుండగా, తాను గాలిలో నిలబడి ఉన్నట్లు, క్రిందా పైనా, చుట్టూ ఏమీ లేనట్టు అనిపించింది. ఈరోజు వచ్చిన మొదటి మెయిల్‌లో – వారిద్దరూ ఒకరితో ఒకరు ఎలా గడుపుతున్నారో – రాయబడింది. మెయిల్ చదువుతున్న కొద్దీ షాలిని హృదయంలో రక్తం ఇంకిపోతున్నట్లు అనిపించింది. పవన్ ఆమెను చాలా ప్రేమపూర్వకమైన మాటలతో సంబోధించాడు. “నువ్వు లేకుండా నేను జీవించలేను”. “ఈరోజు నీ ఫోటో చూశాను, ఎందుకంత బాధగా ఉన్నావు. నువ్వు విచారంగా ఉంటే నేను చూడలేను. నేను చనిపోతాను. “నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది. నీతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా జీవితంలో అందమైన క్షణాలు.”.. ఇలా ఉన్నాయి ఆ మెయిల్‍లో.
పవన్‍కి మెలకువ వచ్చింది. భార్య చేతుల్లో తన ఫోన్ చూసి, గబుక్కున ముందుకి దూకి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ షాలిని అలా చేయనివ్వలేదు, అవతలి గదిలోకి వెళ్లి లోపలి నుండి తలుపు లాక్ చేసింది. ఆమె మిగతా అన్ని మెయిల్స్ కూడా చదివింది. తన భర్తపై ఆమెకున్న నమ్మకం, వివాహ పవిత్ర బంధం ఆమెను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. బయటి నుండి పవన్ తలుపు తెరవమని అడుగుతున్నాడు. ఆమె ఇంకేమీ చదవలేక మెసేజ్ బాక్స్‌ను తనిఖీ చేయడం ప్రారంభించింది. మొదట, ఆమె పైకి క్రిందికి చూసింది. మధ్యలో, ఆమె ఒక నగల దుకాణానికి ఐదు లక్షల రూపాయల చెల్లింపును చూసింది, కానీ ఇన్ని సంవత్సరాలలో, ఆమె ఒక నగల వ్యాపారి ముఖం కూడా చూడలేదు. ధన్‌తేరాస్ నాడు కూడా, వారు చవకైన గృహోపకరణాలను మాత్రమే కొనుగోలు చేసేవారు. చాలా చెల్లింపులు మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు మొదలైన వాటికి చేయబడ్డాయి. అకస్మాత్తుగా, ఆమెలో పూర్తిగా అంకితభావంతో ఉన్న భార్య మేల్కొంది. ఆమె తలుపు తెరిచి, ఫోన్ వైపు చూపిస్తూ, “ఇదంతా ఏమిటి?” అని అడిగింది.
“అలాంటిదేమీ కాదు.” అంటూ బదులిచ్చాడు పవన్.
అతని ముఖం స్పష్టమైన అబద్ధాన్ని చూపించింది. రాత్రంతా గొడవ. సంభాషణ కొనసాగింది. అతను రాసిన దానికి వివరణ ఇవ్వమని ఆమె డిమాండ్ చేస్తూనే ఉంది. అతను ఆమెను అర్థంలేని వివరణలతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు, కానీ నిజాయితీ నిండిన, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. షాలిని ప్రశ్నల వర్షం తట్టుకోలేక, నిషాతో తన ప్రేమను ఒప్పుకున్నాడు. ఈ అవమానంతో, ద్రోహంతో ఆమె క్రుంగిపోయింది.
పవన్ ఉదయం తొందరగా ఇంటి నుండి బయపడేవాడు, రాత్రి భోజనం తర్వాత ఆలస్యంగా తిరిగి వచ్చి పడుకునేవాడు. షాలిని మళ్ళీ అదే విషయాలను లేవనెత్తుతూ, ఆమె ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ ఉండేది. పవన్ గతంలో నిషాతో తన ప్రేమ వ్యవహారం ఒప్పుకున్నాడు. కానీ నిషాతో తమ రహస్యం బయట పడిందని చెప్పినప్పుడు, నిషా అతనితో మాట్లాడటం మానేసింది. నిషా స్వేచ్ఛాజీవి. వివాహమైన ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకుంది, ఎందుకంటే ఆమె పరిమితులు లేని జీవితాన్ని గడపాలని కోరుకుంది. అమ్మానాన్నల దగ్గరకి కూడా ఆమె చాలా రోజులకి వెళ్ళేది. పవన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉండటంతో, ఆమె తరచుగా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది, అందుకే పవన్ ఆమెను కలిశాడు. నిషా తన పనిలో నైపుణ్యం కలిగి ఉంది మరియు ఆమె సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంది.
ఆ గొడవ ఒక వారం పాటు కొనసాగింది, కొన్నిసార్లు చర్చల ద్వారా సయోధ్య గురించి చర్చ జరిగేది.
పవన్ తన తప్పును హృదయపూర్వకంగా గ్రహించి నిజమైన పశ్చాత్తాపం చూపించాలని షాలిని కోరుకుంది.
కానీ పవన్ ఏదో ఒకటి మాట్లాడేవాడు, అది పరిస్థితిని మరింత దిగజార్చేది. మొదట్లో, పవన్ షాలిని పాదాలను పట్టుకుని, “నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు” అని అన్నాడు. అవి కేవలం మాటలు, క్షమాపణ కాదు. ఇప్పుడు, గొడవల్లో కొన్ని తిట్లు కూడా చేరుతున్నాయి. ఒకరోజు, షాలిని పవన్‌తో, “మన కోరికలను ఒక వేశ్యపై త్యాగం చేసి భవిష్యత్తు కోసం మనం దాచుకున్న డబ్బును వృథా చేశావు” అని అంది. షాలిని ఈ మాటలు అనీ అనగానే “నువ్వే వేశ్యవి” అని కఠినంగా అన్నాడు పవన్. ఇది విన్న షాలిని ఆశ్చర్యపోయింది. తరువాత, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. నిషాను వేశ్య అనడానికి బదులుగా, తననే నమ్ముకున్న భార్యను వేశ్య అన్నాడు. పోరాటం ఎంత తీవ్రమైనదైనా, ఎవరూ అలాంటి విషయాన్ని సమర్థించరు.
అది విని ఆమె భావోద్వేగం కోల్పోయి చేష్టలుడిగి నేలపై కూర్చుంది. ఆమె వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఆమె హృదయంలో, కుటుంబం విడిపోకూడదని ఆమె కోరుకుంది. పవన్ వైఖరి సామరస్యపూర్వకంగా ఉంది, కానీ అతను తాను తప్పు చేసానని అంగీకరించకపోవడం, భవిష్యత్తులో అతను మళ్ళీ అదే తప్పు చేయగలడని నిరూపించింది. అతని మాటలలో లేదా ప్రవర్తనలో ఏదైనా తప్పు చేసినట్లు అనిపించలేదు షాలినికి. చిన్న వాదనని, అతను పెద్ద గొడవగా మార్చేశాడు. ఎందుకు గొడవ పడుతున్నావని ఆమె అడిగినప్పుడు, గొడవ పడుతున్నది నువ్వే అని అంటాడు. “నీ నుండి సమాధానం కోరే హక్కు నాకు ఉంది. నువ్వు ఎందుకు సమాధానం చెప్పవు? నాతో పెద్ద గొడవ ఎందుకు ప్రారంభిస్తున్నావ్?” అంది షాలిని. పవన్ తెగింపు స్పష్టంగా కనిపించింది. పశ్చాత్తాపం జాడే లేదు.
***
మర్నాడు ఉదయం డాక్టర్ సత్య తన గదికి వచ్చింది. షాలిని రాత్రంతా నిద్రపోలేదని ఆమె సిసి టివీలో చూసింది. గత రాత్రి నిర్ణయాత్మక రాత్రి అని ఆమె సరిగ్గా ఊహించింది. షాలినికి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత, “నువ్వు ఎవరితో ఇంటికి వెళ్లాలనుకుంటున్నావు, నీ భర్తతోనా లేక నీ తల్లిదండ్రులతోనా?” అని అడిగింది. “నా తల్లిదండ్రులతో, నా బిడ్డ కిరీట్‌తో” అని షాలిని దృఢంగా సమాధానం ఇచ్చింది. కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈరోజు, డాక్టర్ సత్య మరొక రోగిని సాధారణ జీవితానికి మళ్ళించడంలో విజయం సాధించింది.
హిందీ మూలం: శ్రీమతి సుష్మ త్రిపాఠీ
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
