Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిశ్శబ్ద విస్ఫోటనం

[శ్రీ ఎనుగంటి వేణుగోపాల్ రచించిన ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

పేపర్ చదువుతున్న మురళీమోహన్ ఆ న్యూస్‌కి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

“అస్తమానం టీవీనో, సెల్ ఫోనో పట్టుక్కూర్చోవడం కాదు. బాగా చదువు. ఎగ్జామ్స్‌లో మార్కులు కూడా సరిగా రావడం లేదు” అంటూ తండ్రి మందలించినందుకే తొమ్మిదవ తరగతి చదువుతున్న రూప అనే అమ్మాయి చెరువులో దూకి మరణించిందట.

ఆ వార్తకి నిలువెల్లా కదిలిపోయాడు మురళీమోహన్.

తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం ఇంతేనా?  చిన్న వాటికి పెద్ద శిక్ష వేసుకోవడం దేనికి?

తల్లిదండ్రులు తమ పిల్లల బాగు కోసం వారిని మందలించకూడదా? అసలు ఏమవుతోందీ కాలపు పిల్లలకు.

ఇలాంటిదే మరో వార్తకి మురళీమోహన్ షాకయ్యాడు.

“పాఠం చెబుతున్న సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి వెనక బెంచీలో కూర్చుని అల్లరి చేస్తున్నాడని విరూప్ అనే అబ్బాయిని లేపి మందలించిన సారు మీద భౌతికంగా ఓ విద్యార్థి అమానుషంగా దాడికి పాల్పడ్డాడట”

ఎందుకింత క్రమశిక్షణారాహిత్యం? పిల్లల్లో ఇంత నిరసన ధోరణి ఎందుకు ప్రబలిపోతోంది? పెద్దల పట్ల గురువుల పట్ల సంస్కారం కొరవడుతోంది. మానవ సంబంధాలే మంటగలుస్తున్నాయి.

మురళీమోహన్ మనసంతా కరిగినట్టు అదోలా అయిపోయింది. పేపర్‌ని పక్కన పెట్టేసాడు.

ఈ తరం పిల్లల్లో స్వీయ నియంత్రణ కొరవడడం స్పష్టంగా అర్థమవుతోంది. మాట పడని తత్వం, ఎదురు తిరిగే స్వభావం, తానన్నది జరగాలనే నైజం రోజురోజుకూ పేట్రేగిపోతోంది.

ఇలాంటి పెడ ధోరణులన్నీ మానవ సంబంధాల ప్రతిబంధకాలు. యుక్త వయసు పిల్లల ఆలోచనల్ని దారి మళ్ళించాలి. మంచి బాట వైపు నేటి తరాన్ని నడిపించాలి.

పసి హృదయాలు నిత్య యుద్ధక్షేత్రాలుగా మారుతుంటే రేపు అనేది విధ్వంసం అవుతుంది. మానవ సంబంధాల మధ్య నిశ్శబ్ద విస్పోటనం జరుగుతోంది.

చిక్కు ముడిలో చిక్కుకు పోయిన మురళీ మోహన్.. తన సందేహాన్ని చాట్ జీపీటీ ముందుంచాడు.

న్యూరో సైంటిస్ట్ అండ్ కెరియర్ అడ్వైజర్ రూప మనోరమ పేరుని పరిచయం చేసింది చాట్ జీపీటీ.

ఆమె మురళీమోహన్‌ని తన ‘బ్రెయిన్ ట్రైనింగ్ సెంటర్’కి ఆహ్వానించింది. తనతో పాటు టెన్త్ పూర్తై ఇంటర్లోకి అడుగిడబోతున్న తన కొడుకు ఉజ్వల్‌ని వెంట తీసుకుపోయాడు.

జగిత్యాల పట్టణానికి పది కిలోమీటర్ల ఆవల ఉన్న ఆ బ్రెయిన్ ట్రైనింగ్ సెంటర్ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తోంది. సుమారు రెండొందల ఎకరాల స్థలం.

సహజసిద్ధమైన అందంతో చుట్టూ విస్తారమైన మామిడి చెట్లు. అందంగా తీర్చిదిద్దిన ఆకృతిలో పూల తోటలు. ఎటు చూసినా పొందిగ్గా అమర్చిన శిల్పాలు. అక్కడక్కడా తాటాకుల కుటీరాలు. వాటి గోడలపై అందమైన పెయింటింగ్స్ – మురళీమోహన్‌ని సమ్మోహితుడిని చేశాయి!

న్యూరో సైంటిస్ట్ రూప మనోరమ తండ్రీ కొడుకుల్ని తన వెంట తిప్పుతోంది. ప్రకృతి ఒడిలో చెట్ల నీడన బోధన జరుగుతోంది.

మురళీ మోహన్ అది చూసి ఉద్వేగభరితుడు అయ్యాడు. ఉజ్వల్‌కి కూడా ఎంతో బాగా నచ్చిందా ప్రాంతం.

“పిల్లల్ని సిస్టమాటిక్ వేలో పెంచడం ప్రధానం కాదు. జీవిత యుద్ధాల్ని ఎదుర్కునే సైనికులుగా తయారు చేయడం కావాలి.”

“నిజమేనండి. ఎప్పటికైనా సరే వైఫల్యాలను అంగీకరించే పిల్లలే స్ట్రాంగ్‌గా తయారవుతారు” ఒప్పుకున్నాడు మురళి.

“టెక్నాలజీ, ఏఐ, రోబోట్స్ ఇలా ఎంత మోడరేట్ అయినా అవి మనుషులను మాత్రం పూర్తిగా భర్తీ చేయలేవు. భావోద్వేగాలు, కఠిన పరిస్థితులను బట్టి సముచిత నిర్ణయాలను తీసుకోవడం, సామాజికపరంగా సత్సంబంధాలను నిర్మించడం.. ఇవీ ఇప్పటి జనరేషన్‌కి అవసరం.”

“అవునండీ! అన్ని పాఠశాలలు బట్టీ పట్టించడం, ఎగ్జామ్స స్కోర్‌ల పైనే దృష్టి సారిస్తున్నాయి. మా వాడు ఏ సబ్జెక్టులో ఏది అడిగినా తడుముకోకుండా జవాబు చెప్పేస్తాడు. కానీ రోజూ వాడు తాగే హార్లిక్స్‌లో వేసే చక్కెర కిలో ధర చెప్పలేడు.”

“అందుకే పేరెంట్స్ కూడా పిల్లల్ని అన్ని పనుల్లో ఇన్‌వాల్వ్ చేయాలి. రోజూ పిల్లల హృదయాలను ఒకమారైనా స్పృశించాలి”

“ఇంటికి అతిథులు వచ్చినపుడు వాళ్లతో ఎలా మసలుకోవాలో మా అబ్బాయి ఉజ్వల్‌కి తెలియదు. మేము గుర్తు చేస్తూ ఉండాలి. పక్కింటి పిల్లలతో కలిసిపోడు. ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపుతాడు.”

మాట్లాడుతూనే ముందుకు కదిలి పోతున్నారు.

“ఆ చెట్టు నీడన చూడండి. పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, మానవ సంబంధాలను ఎలా పటిష్టం చేసుకోవాలో మా శిక్షకులు నేర్పుతున్నారు. అదొక సెపరేట్ క్లాస్”

“నిజానికి ప్రకృతితో కలిసిమెలిసి అంటే తోటివారితో కలిసిపోయి జీవించేలా జీవన విధానాన్ని మార్చుకోగలగాలి.”

మరొకచోట భావోద్వేగ నైపుణ్యాల శిక్షణ నడుస్తోంది.

“ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, వారికి సహాయ సహకారాలు అందించడం, పరుల పట్ల సానుభూతి చూపడం వంటి నైపుణ్యాలకు కూడా ఇక్కడ మేమిలా సెపరేట్‌గా శిక్షణ ఇస్తాం.”

“చాలా బాగా చెప్పారు. అలాంటి పిల్లలే రేపటి రోజున విలువైన వ్యక్తులుగా ఎదుగుతారు. గొప్ప ప్రయోజకులుగా మారతారు. సమాజంలో మానవ సంబంధాలు బలపడతాయి. అలాంటి మార్పు జరిగితే బాగుండునన్నదే నా తపన.”

ఆమె ఆఫీసు కుటీరంలోకి వచ్చి కూర్చున్నారు. తండ్రి పక్కన నిలబడి తనకి ఎదురుగా ఉన్న ఉజ్వల్‌ని చిరునవ్వుతో అడిగింది న్యూరో సైంటిస్ట్ రూప మనోరమ.

“మా దగ్గర జాయినవుతావా?” అని.

“కొత్త అలవాట్లు,కొత్త విషయాలను నేర్చుకోవడం, మానవ సంబంధాల మెరుగుదల వంటివి నాకెంతో నచ్చాయి. ఈ రోజు నుండి నేనిక్కడే ఉండిపోతాను మేడమ్!” బదులిచ్చాడు ఉజ్వల్ ఉత్సాహంగా.

తన కొడుకు సమాధానానికి మురళీమోహన్ విస్మయం చెందాడు.

చిన్న వయసులోనే అతడి మానసిక పరిణతికి అబ్బురపడింది న్యూరో సైంటిస్ట్ రూప.

ఉజ్వల్ నుండి మాట వెలువడ్డాక గదిలో కాసేపు నిశ్శబ్దం అలుముకుంది. మురళీమోహన్ తన కొడుకు వంకే చూస్తుండి పోయాడు.

రూప మనోరమ చిరునవ్వుతో టేబుల్ డ్రాయర్ తెరిచింది. ఒక ఫైల్ బయటకు తీసింది.

“మురళీ గారూ.. మీకొక విషయం చెప్పాలి” అంది. ఆమె స్వరం మృదువుగా ఉంది. కానీ పలుకుల్లో ఏదో భారంగా ఉంది.

మురళీమోహన్ ఆసక్తిగా ముందుకు వాలాడు.

“ఈ సెంటర్ ఎందుకు మొదలైందో.. తప్పనిసరిగా మీకు తెలియాలి” అంది మళ్ళీ.

ఆయన ఆశ్చర్యపోతూ తల ఊపాడు.

ఆమె నెమ్మదిగా ఫైల్ తెరిచింది.

అందులో ఒక తెల్ల కాగితం మీద భద్రంగా అతికించబడిన పేపర్ కటింగ్ ఉంది. అతడి ముందుకు జరిపింది.

చాలా పాతది. కాస్త మాసినట్టుగా ఉంది.

మురళీమోహన్ వెంటనే ఆ మ్యాటర్‌ని కళ్లతో చదవడం మొదలుపెట్టాడు.

ఒక్కో అక్షరాన్ని మనసు చదువుతుంటే అతని వదనం ఎరుపెక్కిపోతోంది. మనిషి తనలోకి తానే కుంచించుకుపోసాగాడు.

“పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మందలించిన తండ్రి..పదవ తరగతి చదువుతున్న ఆ కొడుకు ఆత్మహత్య.”

మురళీమోహన్ చేతులు ఒక్కసారిగా కంపించాయి. వణుకుతున్న చేతులతో చప్పున ఫైల్ మూసేశాడు. కళ్ళు తడిబారాయి.

ఆ వార్తలో ఉన్న పేరు.. అతని అంతరాత్మకి బాగా తెలుసు. కానీ ఉజ్వల్‌కి తెలియకూడదు. తండ్రి సాధింపుల వలన అన్న చనిపోయాడని..!

ఎవరో తరిమినట్టు.. మురళీమోహన్ గభాలున లేచి నిలబడ్డాడు. అతడిలో నిశ్శబ్ద విస్ఫోటనం!

ఆ తండ్రి భావ సంచలనాన్ని నిశ్శబ్దంగా పరికిస్తోందా న్యూరో సైంటిస్ట్. అతడి మానసిక పరిస్థితి.. డోలాయమాన స్థితిలో ఉందని ఇట్టే పసికట్టింది.

“ఇది.. ఇది..” ఆయనకి మాటలు రావడం లేదు.

గది గోడలు దగ్గరపడుతున్నట్టుగా.. అందులో తన కుంచితత్వం ఇరుక్కుపోయినట్టు.. ఇరుకు ఇరుకుగా అనిపిస్తోంది అతనికి.  ఊపిరి ఆడనట్టు.ఊపిరి పీల్చడం మరచినట్టు.

రూప మనోరమ నెమ్మదిగా అంది.

“ఆ విషాద సంఘటన తర్వాత మీరు మాతో సంప్రదించారు.. గుర్తుందా?”

మురళీమోహన్ కళ్లలో అయోమయం. మనసు అనిశ్చితమయం. అపరాధ భావం.

“ఆ రోజున మీరు అడిగిన ప్రశ్నలే.. ఈ సెంటర్‌కు విత్తనాలు..” అంది మళ్ళీ.

తిరిగి అతను కుర్చీలో కూలబడ్డాడు. ముఖాన్ని తన చేతుల్లో దాచుకున్నాడు.

“అయితే..  ఉజ్వల్..?” అతని స్వరం కెరటంలా విరిగింది.

రూప మనోరమ కిటికీ వైపు చూసింది.

బయట చెట్ల నీడలో పిల్లలు నవ్వుతూ తుళ్ళుతూ అన్నీ ఆదమరిచి కేరింతలు కొడుతున్నారు.

“ఉజ్వల్..  మీకు రెండో అవకాశం! మీ ఈ రెండవ పిల్లవాడిని కూడా అదే విధంగా పెంచుతున్నారు” అంది.

మురళీమోహన్ నెమ్మదిగా తల పైకెత్తాడు.

“కనీసం, ఈసారైనా.. మీరు మార్కులు కాదని.. మనసును కాపాడగలరా?” సూటిగా ప్రశ్నించింది.

ఉజ్వల్ తండ్రి దగ్గరకు వచ్చి అమాయకంగా నిలబడ్డాడు. కుర్రాడి వదనం తెల్లకాగితంలా ఉంది. ఏమీ మాట్లాడలేదు. బేలగా ఉన్నాయి అతని చూపులు.

కేవలం తండ్రి చేతిని పట్టుకున్నాడు.

పాత అపరాధ భావం గుండెని మండిస్తుంటే.. మురళీమోహన్ ఆ పసివాడి చేతిని తిరిగి గట్టిగా పట్టుకున్నాడు.. ఈసారి వదలకుండా..

(అయిపోయింది)

Exit mobile version