Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరుద్యోగ భారతం

రెక్కాడితే గానీ డొక్కాడని
అయ్య అమ్మా
తాము తిన్నా తినకపోయినా
నా కడుపారా బువ్వ బెట్టి
సదూకుంటే సక్కగుంటది బతుకని
బడి కంపి, పట్నం పంపి
పడరాని పాట్లెన్నో
పడుతూనే లేస్తూనే
ఆరుగాలం చెమటోడ్చి
ఈతి బాధలు ఎన్నో ఓర్చి
సదివించిరి నన్ను
సక్కగుండరా కొడుకా అని..

డిగ్రీలు చేతికొచ్చే
డిప్లొమోలూ చేరిపోయే పేరు పక్కన
నిరుద్యోగ భారతంలో
ఉద్యోగ పర్వమేదీ
కానరాక కలతచెంది
కన్నీళ్లతో కడుపునిండక
కూలి కెళితె, నాలి కెళితె
వేలకొద్దీ నా తమ్ములు
నాకంటే ముందే హాజరయ్యారక్కడ

పోటీ ప్రపంచంలో
ముందు వరుసలో నేనుండాలని
రాత్రనకా పగలనకా
నిదురయినా లేకుండా
చదివిందే చదివితిని
పలుమార్లు
పలుఏండ్లు..

అప్పుచేసి పైకం తెచ్చి
కోచింగ్ సెంటర్ల
చుట్టూ తిరిగి తిరిగి
వాళ్ళు చెప్పిందంతా
బుర్ర లోకి తోసేసి
వాళ్లు తోమిన తోముడికి
బక్కచిక్కి బిక్కముఖంతో
బేజారెత్తిపోతి..

ఉద్యోగ ప్రకటనలకై
ఎదురుచూస్తిని
చకోర పక్షిలా
ఊపిరంతా బిగబట్టి..

మండువేసవిలో
మలయమారుతంలా
ఎండిన గుండెలపై
పన్నీటి జల్లుల్లా
వచ్చేసాయోచ్చేశాయ్
కొన్ని ఉద్యోగ ప్రకటనలు..

సాలుకంతా వస్తయని
అయ్య దాచిన
తిండిగింజలు తెగనమ్మి
దరఖాస్తులు నింపాను
గంపెడంతా ఆశతో..

తిండిలేదు నిదురలేదు
దినమంతా చదువే
రేయంతా చదువే
చదువే చదువు
చదువే చదువు
చదువు చదువు చదువు
పిచ్చెక్కి పోయేలా
ప్రాణమంతా వదిలేలా
చదువే చదువు
పరీక్షలు రాశాను
పానమంతా ఉగ్గబట్టి

మూన్నెళ్లకి వచ్చాయి
పరీక్షల ఫలితాలు..
అదురుతున్న గుండెలతో
నా నెంబరు వెతుక్కున్నా
అదిగదిగో
ఆహా.. ఒహో..
క్షణకాలం గుండాగి
తిరిగి కొట్టుకుంది
లబ్ డబ్ అని
మేనంతా కంపనలే
ఏదో తెలియని
ఉద్వేగం, ఉన్మాదం, ఉత్సాహం
ఉప్పో౦గాయి నాలో ఏక కాలంలో
మొత్తానికి పాస్ అయ్యాను
పొయినా ప్రాణమంతా లేచొచ్చే
అమ్మ అయ్యల ఆనందం
గుండెల నుండి ఎగజిమ్మి
కన్నీరై జాలువారాయి
ఇన్నేళ్లు పడిన కష్టాలకు
ముగింపు పలికే సమయం వచ్చిందని
మనసు సంబురాలు చేసింది.

ముఖాముఖి ఇంటర్వ్యూలు లేవు
ప్లేసింగ్‌తో అప్పాయింట్మెంట్
లెటర్ రాగానే ఉద్యోగంలో
చేరిపోవటమే..
కలలకు కాళ్ళొచ్చాయ్
ఊహలకు రెక్కలొచ్చాయ్
మది ఆనంద తాండవం ఆడింది
సన్నాయి పాట పాడింది..

మూడు రోజులకు వచ్చిందా వార్త!
ఎక్కడో ఎవరో
పరీక్ష పేపరును ముందుగానే
లీకు చేశారని
పరీక్షలన్నీ రద్దు చేశారని
గుండె బద్దలయింది
మనసు అచేతనమయింది
చెలియలికట్టను దాటుతున్న
ఆవేశం ఆగ్రహం ఆక్రోశం ఒక పక్క,
నిలువునా ముంచెత్తుతున్న
నిరాశ నిస్పృహ నిర్వేదం మరో పక్క
ఏమిచేయాలో తెలియని స్థితి
కళ్లు నిరంతర కన్నీటి ప్రవాహంలో
మునిగిపోతున్నాయ్
వేదన అరణ్యరోదనయింది

మనసు వికలమై
గుండె శకలమై
అంపశయ్య పై పడిపోతున్న అనుభూతి
నన్ను నేనే చంపుకోవాలన్నంత కసి
పిచ్చివాడినై పోతున్నాను
క్షణక్షణానికి..
కమిటీ లన్నారు
విచారణ అన్నారు
అరెస్టులు డిస్మిస్లు
ఏవేవో అంటున్నారు
రాజకీయ పార్టీలన్నీ
ఒకరిపై ఒకరు
బురదజల్లుకుంటున్నారు
నువ్వే కారణం అంటే
నువ్వే కారణం అంటూ
మీడియాలో పరస్పర దూషణలు

ఎవరికి కావాలి
నిరుద్యోగుల వ్యథ
ఎవరికి పట్టింది
మా కన్నీటి గాథ
ఇంతలోనే
నేస్తుడొకడు
పరుగుపరుగున వచ్చాడు
మా సోపతిగాడు మల్లేసు
ఉరేసుకొని చచ్చాడంటూ..
వాడు చెపుతూనే వున్నాడు
నాకేమి వినపడటం లేదు
కళ్లన్నీ మసకబారుతున్నాయి
గుండెల్లో దడ
ప్రాణం పోతుందా అన్నట్లు
మనసంతా బరువెక్కింది
ఒళ్ళంతా చెమట్లు
దిగచెమట్లు.. ఒకటే చెమట్లు
తల తిరుగుతుంది
చుట్టు ఉన్న దేమి
కనపడటం లేదు
నా.. కేదో.. అయిపొతుంది..
శరీరం తూలి
కింద
ప.. డి.. పో..

Exit mobile version