[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఓ పెద్దలారా.. ఆలోచించండి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నాటి బాల్యం.. అనంతమైన ఆటపాటల మయం!
నేటి బాల్యం.. చరవాణి ఆటపాటల వీక్షణలే సమస్తం!
నాడు..
తల్లిదండ్రులు పిల్లల యోగక్షేమాలు
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ
తప్పొప్పులు సరిచేస్తూ
సదా స్ఫూర్తిని నింపుతూ
జీవన సత్యాలు ఎన్నో బోధిస్తూ పెంచేవారు!
నేడు..
తల్లిదండ్రులు తామున్న బిజీ షెడ్యూల్‌కు అనుగుణంగా
పిల్లలని సంరక్షించుకుంటూ వంతుల వారీగా తోడుంటూ
సకల సౌకర్యాలు డబ్బులు పెట్టి సమకూర్చుతూ
ఆధునిక ఆర్భాటాల హంగులతో పెంచుతున్నారు!
బాల్యం..
భగవంతుడు ప్రసాదించిన
ఓ అద్భుతమైన వరం!
జీవితాలను సమున్నతంగా మార్చే
తొలి ప్రేరణల శుభ అడుగుల మయం!
ఓ పెద్దలారా.. ఒక్కసారి ఆలోచించండి..
ర్యాంకుల వెంట పిల్లలనుని పరిగెత్తిస్తూ,
నిద్రాహారాలను సైతం పిల్లలు
మరిచేలా బట్టి చదువులు చదివిస్తూ ,
వారి జీవితాలను చిత్రవిచిత్రాలకు గురి చేయకండి!
జ్ఞానాన్ని నిండిన చదువులతో పాటు
శారీరక శ్రమతో కూడిన ఆటలు
మనస్సులని రంజింపజేసే
హాయైన చిట్టి పొట్టి పాటలు నేర్పిస్తూ..
బాల్యం స్వేచ్చగా ఎదిగేలా రెక్కలనివ్వండి!
‘నేటి బాలలే రేపటిపౌరులు’ అని గ్రహించి
రేపటి నవ్య సమాజ సృష్టికర్తలను
జ్ఞానవంతులుగా తీర్చిదిద్దండి!
ఝాన్సీ లక్ష్మీబాయ్,శివాజీ,
వివేకానందుడు, రుద్రమదేవి, రవీంద్రుడు,
అబ్దుల్ కలాం, నేతాజీ, సర్ సి.వి.రామన్
వంటి మహనీయులు నడయాడిన
ఈ పుణ్యభూమిలో రేపటి ఘనచరిత్రను
లిఖించబోయే ఉన్నతులని ఉదయింపజేయండి!
ధైర్యసాహాసాలే ఉత్తమ విలువలే
ప్రామాణికంగా పసిడి
బాల్యాన్ని వికసింపజేయండి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
