Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక సైకిల్‌ చాలు

[‘ఒక సైకిల్‌ చాలు’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – కె. సత్యనారాయణ. మూలకథ 1998లో ప్రచురితం.]

బుధవారం:

రోజు బుధవారం కదా, బుధవారం, గురువారం, శుక్రవారం – వారంలో మూడు రోజులు కుసుమకు సైకిల్‌ దొరకదు. ఆమె ఇల్లు బెంగళరులోని పాదరాయపుర, మూడవ క్రాసులో ఉంది. ఆమె సోషియల్‌ స్టడీస్‌ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న మోతిచంద్‌ స్మారక ఉన్నత పాఠశాల బెంగళూరు మరో చివరలోనున్న బసవేశ్వర నగర కాలనీలో ఉంది. ఎన్నో ఎళ్ళ నుంచీ ఆమెకు వారంలో మూడు రోజులు సైకిల్‌ దొరకదు. బుధవారం-గురువారం కూతురు పంకజ సైకల్‌ తీసుకునిపోతే, శుక్రవారం కొడుకు నాగరాజ తీసుకునిపోతాడు. అంతేకాదు, కుసుమ శనివారం హాఫ్‌ డే స్కూలు ముగించుకుని వచ్చిన తరువాత, ఆదివారమంతా సైకిల్‌ నాగరాజ ఆస్తే! లేడీస్‌ సైకిల్‌ అయినా పరవాలేదు, నేనింకా చిన్నపిల్లవాడినే కదా అని పియుసి చదివే వాడి సంజాయిషి! కుసుమ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏ సైకిల్‌ షాపువాళ్ళు నాగరాజుకు అద్దెకు సైకిల్‌ ఇవ్వరు. ఆ విషయం కుసుమకూ తెలుసు. సైకిల్‌కు గాలి కొట్టించడానికో, పంక్చర్‌ వేయించడానికో వెళ్ళినప్పుడంతా వాళ్ళు గొణగడం జరిగేది. “మీ కొడుకు మాత్రం అసాధ్యుడు మేడమ్‌. క్యారియర్‌ లేని సైకిల్‌ ఇచ్చినా సరే, వెనుక మడ్‌గార్డ్‌ మీద, ముందున్న ఫ్రేమ్‌ మీద – ఒకరిని కూర్చోబెట్టుకుని ఒక సైకిల్‌ మీద ముగ్గురు మనుషుల సవారి చేస్తాడు. మొత్తానికి త్రిబుల్‌ రైడ్‌ పార్టీవాడు”.

ఈ మూడు రోజులూ కుసుమ సిటి బస్సులో స్కూలుకు వెళుతుంది. ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఎక్కడెక్కడో చుట్టూ తిరిగి వెళ్ళే బస్సువల్ల ఆమె రోజుకన్నా అరగంట ముందుగానే లేవాలి. బస్సులో జనం శరీరాన్ని తగులుతూ కూర్చోవటం, చెమట కంపువాసన, నోటిని వికారంగా తెరిచి ఆవులించడం, ఏదీ కుసుమకు నచ్చదు. అందువల్ల శనివారం ఉదయం మళ్ళీ దొరికే సైకిల్‌ కోసం గురువారం సాయంత్రం నుంచి కలవరపడుతుంది. శనివారం ఉదయం ఏడుంపావు, ఏడున్నరకు సైకిల్‌ తొక్కుతూ మాగడి రోడ్‌, హొసహళ్ళి, బోరె, వీటన్నిటినీ దాటిపోతున్నప్పుడే ఈమెకు మళ్ళీ నిశ్చింత.

నలుగురున్న వాళ్ళ చిన్న సంసారానికి ఇప్పటికే రెండు సైకిళ్ళు ఉన్నాయి. ఒకటి ఈమెది. ఇంకొకటి భర్త విశ్వనాథానిది. ఆ సైకిల్‌ అతనికి కాకుండా వేరే ఎవరికీ దొరకదు. హొసూరు దగ్గరున్న ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్న అతను బన్నేరుఘట్ట రోడ్డు దగ్గర ఫ్యాక్టరీ బస్సు దొరికేది. పాదరాయపుర నుంచి సైకిల్‌ మీద అక్కడికి వెళ్ళి బస్సెక్కాలి. ఆదివారం విశ్వనాథానికి సెలవు ఉన్నప్పటికీ ఆ రోజు తల్లీ-తండ్రి, చెల్లెలు అంటూ విద్యారణ్యపురకో, మత్తికెరెకో వెళ్ళిపోయేవాడు. ఒకవేళ అతని సైకిల్‌ ఇంట్లో ఉన్నప్పటికీ నాగరాజు వాడేది ఈమె సైకిల్‌నే. “అక్కడ, ఇక్కడ అంటూ నా సైకిల్‌ తీసుకుని వెళ్ళకు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో ఎవరికి తెలుసు” అని తండ్రి కసురుతాడనే భయం నాగరాజకు ఉంది.

ఈ నాగరాజుకున్న భయం కుసుమకు తెలియదా, అయితే ఆమె ఆలోచనే వేరు.

‘తల్లి సైకిల్‌ అని నాగరాజుకు చనువు ఎక్కువ. అయితే తండ్రి సైకిల్‌ క్లీన్‌ చేయమని గద్దిస్తే కొడుకు తండ్రి సైకిల్‌ను మాత్రమే క్లీన్‌ చేస్తాడు. నా సైకిల్‌ను వాడు అంతగా వాడుతాడు కదా, ఒక్కసారైనా తనంతట తానుగా క్లీన్‌ చేస్తాడా, లేదు. వాడినెందుకు అనాలి? వాడి నాన్న కూడా ఎన్నోసార్లు తన సైకిల్‌ను తానే క్లీన్‌ చేసుకుంటారు కదా, అప్పుడు నా సైకిల్‌నూ క్లీన్‌ చేయొచ్చుకదా, ఊహూఁ ముట్టను కూడా ముట్టరు. ఇక పంకజకు చెప్పాలి. పాపం ఆడపిల్ల. అంతేకాకుండా సైకిల్‌ ఎక్కువగా వాడేది నాగరాజే కదా’ ఇదంతా కుసుమ మనసులో అనుకుంటుంది. అంతే, పిల్లలకు మాత్రం కుసుమ సైకిలే గతి.

ఇంకొక సైకిల్‌ కావాలని చాలా రోజుల నుంచీ నాగరాజు-పంకజ వేధిస్తూనే ఉన్నారు. అయితే తల్లితండ్రులకు కొనివ్వడానికి కుదరలేదు. అంతే. భార్యాభర్తలిద్దరినీ అని ప్రయోజనం లేదు. పది, పన్నెండేళ్ళు సర్వీసు ఉన్నప్పటికీ, కుసుమకు ప్రావిడెంట్‌ ఫండ్‌, అదీ ఇదీ అంటూ జీతంలో కోతపడి, చేతికి వచ్చేది ఎనిమిది వందల రూపాయలు మాత్రమే. విశ్వనాథకు వెయ్యిన్ని రెండువందల యాభై. కుసుమకు జీతంలోని అధిక భాగం సైటు వాయిదాలకే పోతాయి. నాగరభావి దగ్గర సైటు కొనుక్కోటంలో భార్యాభర్తలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. హోసూరు రోడ్డులో ఉన్న సోమనహళ్ళి కాలనీ సైటు విషయంలో కుసుమకు అంత ఆసక్తి లేదు. అయితే భర్త “కొనుక్కుందాం, రెండుమూడేళ్ళల్లో ధర ఒకటికి రెండవుతుంది. అప్పుడు అమ్ముకుంటే వచ్చిన లాభంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఉయోగపడవచ్చు. లేకపోతే కనీసం నీకు ఒంటిపేట గొలుసైనా చేయించవచ్చు” అని రకరకాలుగా కుసుమను ప్రేరేపించాడు. ఆమెకూడా ఆశతో అంగీకరించింది. కానీ సైటు విలువ పెరగలేదు, పంచాయితీ క్లియరెన్స్‌ దొరకలేదు, డి.సి. అప్రూవ్‌ రాలేదు. ఇలాంటి సమస్యలు వచ్చి వీళ్ళు కొన్న ధరకు సైతం సైటు కొనేవాళ్ళ గతి కూడా లేకపోయింది. ఈ సైటు ప్రస్తావన వచ్చినపుడు మాత్రం, భార్యాభర్తలిద్దరూ నాలుగున్నర చదరాలున్న వారి వటారం చూరు లేని ఇంటి చూరు కూడా ఎగిరిపోయేలా పోట్లాడుకుంటారు. ఒకట్రెండు రోజులు కోపంతో పరస్పరం మాట్లాడుకోరు. చివరికి విశ్వనాథమే లొంగిపోతాడు. ‘నేనేమైనా కావాలనే చేశానా? చేతికి నాలుగు డబ్బులు అందుతాయని కదా తీసుకున్నది. నేనొక్కడినే కాదుకదా, ఎంతోమంది మనలాగే డబ్బు పోగొట్టుకుంటున్నార’ని అతని మనస్సుకూ, కుసుమ బుద్ధికీ నచ్చజెపుతాడు. వస్తున్న జీతమంతా ఏదో విధంగా సంసారాన్ని నడపటానికే సరిపోతుంది, పెరుగుతున్న పిల్లల సంసారం కదా, ఇంకొక కొత్త సైకిల్‌ అంటే ఎనిమిది వందలో, వెయ్యో కావాలి. ఎవరికి తీసుకోవాలి, కొడుకుకా? కూతురుకా? ఫీజులు చాలా తక్కువ, సీటు సులభంగా దొరుకుతుందని పిల్లలిద్దరినీ దూరంగా ఉన్న కాలేజి-స్కూల్లో చేర్చారు. పిల్లలు అంటున్నది నిజమే, సైకిల్‌ తీసుకుంటే బస్సు ఛార్జీలు మిగల్చవచ్చు. అయితే ముందుగా సైకిల్‌ కొనడానికి డబ్బులు సమకూరాలి కదా! ప్రస్తుతం సైకిల్‌ మాట అటుండనీ, సంవత్సరంలో వచ్చే పండుగలకు చీరలు, బట్టలు లేవు. ఎంతో శ్రమతో ఉగాది, దీపావళికి పిల్లలకు బట్టలు తెస్తే, భార్యభర్తలిద్దరూ మాత్ర వినాయక చవితికి పండుగకు మాత్రమే తమ కోసం కొత్త బట్టలు కొంటారు.

ఇదంతా కథలా మొదటి నుంచి చివరి వరకు మరోసారి సాంగోపాంగంగా గుర్తు చేసుకోవచ్చు తప్ప దాని వల్ల మూడుకాసుల ప్రయోజనం కూడా ఉండదని కుసుమకు బాగా తెలుసు. పుట్టింటి నుంచి కానీ, అత్తింటి నుంచీ కానీ సహాయం అంటూ ఏమీ లేదు. తండ్రి ఉంటే ఆడపిల్లల కష్టసుఖాలకు పరుగెత్తుకు వస్తారని కుసుమ విన్నది. ఎందుకంటే కుసుమకు పద్దెనిమిదేళ్ళు ఉండగానే ఆమె తండ్రి పక్షవాతంతో చనిపోయాడు.

ఇక తల్లి గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది కుసుమ. అమ్మకు సహాయం చేయాలనే కోరిక ఉన్నా సాధ్యం కావాలికదా! పాపం ఆమె ఉన్నదే వదిన దర్బారులో. ఆమెనెందుకు అనాలి. ఉన్నది ఒక్కతే కూతురు. అయినా తాను మాత్రం ఆమెకు ఏం చేసింది? రెండు రోజులు పిల్చుకొచ్చి ‘హాయిగా’ పెట్టుకునే స్థోమత కూడా తనకు లేదు. వేసవి సలవుల్లోనో, దసరా సెలవుల్లోనో తప్పదన్నట్టు వస్తుంది. వదిన పెట్టే చిత్రహింసలు, వయ్యారం, తోడబుట్టినవాడి ఉదాసీనత కథ చెబుతుంది. మా ఇల్లు బట్టలు గుడ్డలు అంచులు చిరిగిపోయి, పరుపులోంచి బయటికి వస్తున్న పత్తి ముక్కలు, తీగమీద ఆరవేసిన సాధారణమైన చీరలు, ఇవన్నీ చూస్తే ఆమె మనస్సు చివుక్కుమంటుంది. ‘ఎన్ని రోజులని ఈ కిరసనాయిల్‌ స్టౌతో తంటాలు పడతావు, ఒక గ్యాస్‌ స్టౌ తీసుకో’మని చెబుతూనే ఉంది. ఇక అన్నయ్య అనే వాడు ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఇంటికి వస్తాడు. తండ్రి తిథి అని చెప్పటానికి, లేదా వినాయక చవితి అని ఇరవైయో-ఇరవై అయిదో ఇవ్వటానికి.

ఇక పెళ్ళి కూడా అంతే. ఈ అన్నయ్య తాను తొందరగా పెళ్ళి చేసుకోవాలనే ఆత్రుతలో నా వివాహాన్ని అధ్వాన్నంగా చేశాడు. విశ్వనాథ మొదట ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీ పరిస్థితి బాగుండ లేదని తన అన్నకు తెలుసనిపిస్తుంది. అయినప్పటికీ పెళ్ళి చేసి చేతులు కడుక్కున్నాడు. పెళ్ళయిన ఆరునెలలకే ఫ్యాక్టరీ మూతబడింది. ఒక సంవత్సరం ఉద్యోగం లేకుండా కాళ్ళరిగేలా తిరిగిన తరువాత చివరికి హోసూరుకు దగ్గర్లో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. విశ్వనాథ తల్లితండ్రులు బాగానే ఉన్నవారు. అయితే ఈయన తల్లికి ముసలి వయస్సులోనూ తనకే అంతా కావాలనే ఆశ. చేతి నుంచి ఒక్క పైసా రాల్చదు. కావాలంటే ఆమె కూతురికి మాత్రం ఎంతో కొంత సహాయం చేస్తుంది. అంతే. మాటల్లో మాత్రం ముత్యాలు కురిపిస్తుంది. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కదా. యువరాజులా, అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాడు. ‘వదినా’ అని ఇప్పటిదాకా ఒక్కసారికూడా నోరార పిలవలేదు. చాలా గొప్పలకు పోయే మనిషి. వాచ్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా ఉన్నాడట. వచ్చిన ప్రతిసారి అది చదవాలి, ఇది చదవాలి, గుండె ధైర్యం పెంచుకోవాలి అని పిల్లలకు బుద్ది చెబుతుంటాడు. ఇన్నిసార్లు వచ్చాడుకదా, ఒక్కసారైనా ఒక మూర పువ్వులుకానీ, పళ్ళు కానీ, బిస్కట్టు కానీ తెచ్చాడా? కేవలం మాటలకే మురిసిపోవాలి. పిల్లలకు ఏమీ అర్థం కాదు. బాబాయి బాబాయి అంటూ పడిచస్తారు. నాగరాజైతే సిగ్గు లేకుండా అతను వచ్చినప్పుడంతా అతని స్కూటర్‌ వెనుక కూర్చుని కొంత దూరం వెళ్ళి వస్తాడు.

పిల్లలంటే అంతే-వాళ్ళకేమైనా సూక్ష్మ జాడ తెసుస్తుందా? వాళ్ళకేమి కావాలి- మరో సైకిల్‌ కావాలి. కొనిస్తే చాలు. అంతే. లేదు లేదు, పిల్లల గురించి అలా అనుకోవడం కూడా తప్పే. ఒరోజు ఇదే నాగరాజు సాయంత్రం కాలేజి నుంచి వచ్చి ముసుగుతన్ని పడుకోలేదా? తలనొప్పని, తలతిరుగుతోందని కాఫీకూడా తాగకుండా, భోజనం చేయమని వేధించినపుడేకదా, ఏడుస్తూ ఏడుస్తూ మనసులో దాచుకున్నదంతా చెప్పాడు. ఇతను వెళ్ళే సిటీ బస్సు కండక్టర్‌ సగం టికెట్టు డబ్బే తీసుకుంటాడట. అయితే టికెట్టు ఇవ్వడట. సీటు ఖాళీగా ఉండి ఇతను కూర్చున్నప్పటికీ, ఇంకెవరైనా ప్రయాణికుడు వచ్చి ఫుల్‌ టికెట్టు తీసుకుంటే కండక్టర్‌ కనుసైగ చేయగానే వీడు సీటు వదిలి లేవాలి. నాగరాజు తండ్రి దగ్గర ఫుల్‌ టికెట్టుకు డబ్బులు తీసుకుని, కొంత మిగుల్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు ఏమైంది? వీడు కూర్చున్న బస్సు సర్కిల్లో ఎడమకు తిరిగే సమయంలో నేను సైకిల్‌ మీద వెళుతూ బస్సుకు అడ్డొచ్చానట. డ్రైవర్‌ ఎంతగా హారన్‌ కొట్టినా నాకు వినిపించనే లేదు, ‘ఎవరీమె, పిచ్చిదానిలా ఉంది, రోడ్డంతా సైకిల్‌ తొక్కుతోంది. ఆమె, ఈమె అంటూ ఏకవచనంతో నీచంగా, నాగరాజు ఎదుటే డ్రైవర్‌ గొణిగాడ’ట. ఇక వీడు సగం టికెట్టు గిరాకి. కండక్టర్‌ దయాదాక్షిణ్యంతో రోజూ బస్సులో తిరిగేవాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. అవమానం భరించలేక, నోరు తెరిచి అడగలేక, ఇంటికి వచ్చి ముసుగుతన్ని పడుకున్నాడు.

పాపం, కుర్రవాడు, పెరిగే వయసు. తల్లితండ్రుల కష్టసుఖాలు తెలిసినా, కుర్రతనం చాపల్యం ఉంటుందికదా! మరో సైకిల్‌ కావాలని అడుగుతాడు. అయితే సహోద్యోగులకైనా అర్థం కావాలికదా? ఈ మోతిచంద్‌ స్కూల్లో తాను చేరి ఎన్నేళ్ళు గడిచాయి? దాదాపు అందరూ అప్పటి నుంచీ కలిసిమెలసి ఉన్నవారే. అందరి కష్టసుఖాలు అందరికీ తెలుసు. అయినా ఆ రోజు నోరి జారి అన్న మాటను పట్టుకుని అందరూ ఇంకా తన గురించే మాట్లాడుకుంటారు కదా.

ఎవరో జగదీశ్‌ హీరేమఠ అట. ధారవాడ ప్రాంతం వాడు. ఎర్రగా అందంగా ఉన్న కుర్రవాడు. బాగా వేయించిన పెసలు చిటపటమన్నట్టు మాట్లాడుతూ స్కూలుకు వచ్చాడు. “మ్యాజిక్‌ చేస్తాను, యక్షిణిని చూపిస్తాను. మాయామంత్రాలు చేయడం నాకు వచ్చు. ఎవరైనా సరే, నేను మాయమంత్రాలు ప్రయోగించగానే వాళ్ళ మనసులో, కలలో ఏమున్నాయో అంతా చెప్పేస్తారు” అని అంటూ నన్ను, మా స్కూలు జవాను జవరప్పను వేదిక మీదికి రమ్మన్నాడు. ఏమి మాయ చేశాడో, ఎప్పుడు ముఖం మీద నల్లటి గుడ్డ వేశాడో దేవుడికే తెలుసు. కళ్ళు మసకబారాయి. మబ్బు కమ్మినట్టు తూగాను. శరీరమంతా ఊగుతూ, తేలుతున్నట్టు. ఎదురుగ్గా చాలామంది తేలుతున్నట్టు, నాన్న కూడా కనిపిస్తూ ఉన్నారు. ఆ పాడు హీరేమఠ అడుగుతున్న ప్రశ్నలకంతా జవాబులు చెబుతూ పదిపదిహేను నిముషాలు వేదిక మీద ఉన్నానట. “ఏమి కావాలి మీకు, మీ జీవితంలో మీకు ఏమి కావాలి?” అని అతను – ప్రస్తుతం నాకు మరో సైకిల్‌ కావాలని నేను పదే పదే చెబుతున్నానట. ఆ రోజు నేను చెప్పిన అదే మాటను పట్టుకుని ఆటపట్టిస్తున్నారు కదా. మ్యాజిక్‌ మ్యాన్‌ సైకిల్‌ ఇప్పిస్తాడా? ఇప్పిస్తాడా? అని తమాషా చేస్తూ ఉంటారు. బుధవారం- గురువారం-శుక్రవారం వచ్చిందంటే చాలు. తాను సైకిల్‌ తీసుకుని రానని అందరికీ తెలుసు. అందరూ ఆ మూడు రోజులు నన్ను ముసురుకుని రెచ్చగొట్టేవారే.

గురువారం:

జీవితమంటే నిట్టూర్పులు వదులుతూ హుష్‌ అని అనుకునే విషయం మాత్రమేనని కుసుమకు గురువారం ఉదయం అనిపించేది. వాళ్ళ వటారం ఉండేది వీధి చివరలోకదా. వీధిలో ఉన్న ఇళ్ళకంతా నీళ్ళు అందిన తరువాతే వారి వటారంలోని సంప్‌ను నింపుతారు. నీళ్ళు వదిలేదే రోజు విడిచి రోజు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఏడు గంటల లోపల ఎప్పుడైనా నీళ్ళు రావచ్చు. సైకిల్‌ లేకపోవటం వల్ల కుసుమ అరగంట ముందుగానే బయలుదేరాలి. అలాంటి సమయంలో నీళ్ళు ఆలస్యంగా వస్తే ఆమె పాలికి దేవుడు, నిట్టూర్పులే గతి. నీళ్ళు పట్టుకుంటూ, పట్టుకుంటూనే ఇంటి పనులు చేసుకుని, భర్తకు, పిల్లలకు భోజనం, టిఫిన్‌ అంతా సిద్ధం చేసి, క్యారియర్‌లో సర్ది, సమయానికి సరిగ్గా రెడీ అయి బస్సు పట్టుకోవడమంటే అదేమైనా సామాన్య విషయమా? ఏడున్నర బస్సు తప్పితే ఎనిమిది ముప్పావు వరకు డైరెక్ట్‌ బస్సు దొరకదు. ఒక రోజు ఆలస్యమైనా స్కూల్లో ఊరుకోరు. అలా మూడు రోజులు ఆలస్యంగా రావటాన్ని గుర్తించి ఒక రోజు సెలవుకు కోత పెడతారు. ఆ స్కూల్లో మెడికల్‌ లీవు కూడా లేదు. క్యాజువల్‌ లీవులూ లేవు. ఉన్నదంతా నెలకొక రోజు ఇచ్చే సెలవు మాత్రమే.

పాడు హడవిడి, నీళ్ళు రావటానికి ముందే మెలకువ వస్తుందని అనుకుని, మెలకువ వచ్చిన కుసుమ గడియారం చూస్తుంది. ఇంకా రెండు గంటలు కూడా కాలేదు. ఒకసారి మెలకువ వస్తే ఇంకెక్కడ నిద్ర? కలలో ఎన్ని సార్లు నీళ్ళు వచ్చి ఆగిపోయినట్టు ఉంటుంది. లేచి పక్కమీద దొర్లుతూ వుంటే విశ్వనాథకు మెలకువ వచ్చేస్తుందని ఆమెకు తెలుసు. వాళ్ళు పడుకునే గదికి తలుపులు లేవు. కేవలం కర్టెన్‌ మాత్రమే. బయట నాగరాజు-పంకజ పడుకుంటారు. మెలకువ వస్తే విశ్వనాథం వదలడు. లేచి కుసుమ దగ్గరికి వచ్చేస్తాడు. ఈమెకు వద్దనడానికి ప్రయత్నించదు. ఎలాగూ ఇంకా నీళ్ళూ రాలేదు. నిద్ర కూడా రాదన్నది ఈమె ఆలోచన. అయినా కుసుమకు బాగా తెలుసు. విశ్వనాథకు తాను నిజంగా కావాలనిపించేది రాత్రి పడుకోవటానికి ముందు అని. ఈమెకు మాత్రం ఆ సమయంలో ఎవరూ వద్దు, ఏమీ వద్దు. తలగడకు తలనిచ్చి, మొద్దులా పడుకుంటుంది. పక్కనే విశ్వనాథ పీడిస్తూనే ఉన్నా తొందర తొందరగా అంతా ముగించి బాధ, భారాన్ని పోగొట్టుకుని హాయిగా పడుకోవటం ఆమెకు ఇష్టం. ఒక రౌండు నిద్రలో గడిపితే మనశ్శరీరాలు అన్నీ తేలికగా అనిపించినపుడు ఈమెకు అతను కావాలనిపిస్తాడు.

పక్కన దుప్పటి కప్పుకుని పడుకున్న భర్తను కుసుమ చూస్తుంది. నిద్రలోనూ ఏమి ఆలోచనో, ఏ కష్టసుఖాల లెక్కలో, నుదుటి మీదంతా ముడుతలు.

అతని తప్పు ఏమిటని కుసుమకు అనిపిస్తుంది. అతను మొదట్లో ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీ నిజానికి మూతపడలేదట. ఒక గుజరాతీ పటేల్‌ నుంచి మరొక కలకత్తా మార్వాడికి ఫ్యాక్టరీ చేతులు మారి, కొత్త యజమాని పాతవాళ్ళనంతా నయవంచనతో ఉద్యోగం నుంచి తీసేసి తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళను నియమించుకున్నాడట. అదే ఫ్యాక్టరీలో కొనసాగివుంటే ఇప్పుడు పదిహేన వందలో, రెండు వేలో జీతం వచ్చేది.

కుసుమ విశ్వనాథాన్ని చూస్తూ, అతని ఒంటి మీద కప్పుకున్న రగ్గును సరిచేస్తుండగా, అదే సమయంలో కొళాయి గర్‌గర్‌మంటు చప్పుడు చేసింది. గురువారం మొదలవుతుంది.

శుక్రవారం:

నీళ్ళు రాకపోయినప్పటికీ, ఈ రోజు శుక్రవారం. కుసుమ చాలా తొందరగా లేవాలి. స్కూలు సంస్థాపకుడు – దివంగత మోతిచంద్‌గారి పుట్టిన రోజు వేడుక జరుపుకునే రోజు. ఆయన కుమారులు ఫంక్షన్‌కు వస్తారు. తండ్రిని పొగడటమే కాకుండా, “మొత్తం బెంగళూరులోనే మన స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలి. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెబితే చాలదు. పిల్లలకు మన సంస్కృతి గురించి చెప్పాలి. అప్పుడప్పుడు క్విజ్‌ పోటీలు పెట్టాలి” అని వాళ్ళు తమ ఉపన్యాసంలో చెబుతారు.

కొడుకు, మోతిచంద్‌గారిలా కాదుకదా అని కుసుమ అప్పుడప్పుడు అనుకుంటుంది. మోతిచంద్‌గారు ఉపాధ్యాయునులను పేర్లకూ మిస్‌ అని చేర్చి పిలిచేవారు. ఎవరి పేరైనా గుర్తుకు రాకపోతే మేడమ్‌ అనేవారు. అయితే ఆయన కొడుకు అలా కాదు. అందరినీ పేర్లతోనే పిలుస్తాడు. ఏకవచనంలోనే పలకరిస్తాడు. సహోద్యోగులు అన్నట్టు, చూడటం మరొక రకంగా సంకోచం కలిగేలా. ఆయన తండ్రి అందరినీ సొంత పిల్లల్లా పలకరించేవారు. అయినా తండ్రి కాలంలో కానీ, కొడుకు కాలంలో కానీ జీతం గురించి పిసినారి బుద్ధి మాత్రం ఒకేలా ఉంది. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒక ఇంక్రిమెంట్‌. మే నెలలో ఇస్తున్నది సగం జీతమే.

కుసుమకు నిజానికి కోపంవచ్చింది. వెనుకటి రోజు సాయంత్రం భర్తకు-పిల్లందరికి చెప్పుకుంది, నీళ్ళు రాకపోయినా తాను లేచి పనులు ముగించుకుని కాస్త ముందుగానే స్కూలుకు వెళ్ళాలని చెప్పింది. ఫంక్షన్‌లో ప్రార్థన చేయించే కార్యక్రమం ఆమెకు అప్పగించారని. అయినా తాను లేచి గబగబా పనులు చేస్తూవుంటే, మిగతా అందరూ హాయిగా పడుకున్నారు. ఆమె కోప్పడిన తరువాతే అందరూ లేచారు. విశ్వనాథే అందరికన్నా తొందరగా లేచాడు గొణుక్కుంటూ. ఆ తరువాత పంకజ, చివరలో నాగరాజు, అన్నీ సర్ది, ఆమె కూడా రెడీ అయి పడుతూ లేస్తూ అన్నట్టు పరుగుతీసి బస్సు పట్టుకుని, ప్రార్థన ముగించి, కూర్చీలో కూర్చున్నప్పుడే ఆమెకు తాను స్కూలుకు వచ్చే హడావుడిలో ఫంక్షన్‌ కోసం తీసిపెట్టుకున్న చక్కటి చీరకు బదులుగా రోజూ స్కూలుకు కట్టుకొచ్చే చీరనే కట్టుకుని వచ్చిందని స్ఫురించింది.

శనివారం:

ఒక విధంగా చూస్తే, ఈ రోజు పిల్లలకు హడావిడి ఎక్కువ, ఆత్రుత ఎక్కువ. పిల్లలిద్దరికీ ఉదయం ఏడుగంటల నలభై అయిదు నిముషాలకు మొదటి పిరియడ్‌. కుసుమకు ఈ రోజు కాస్త నిశ్చింత అనే చెప్పాలి. సైకిల్‌ మీద వెళుతుందికదా, అయిదు-పది నిముషాలు ఆలస్యమైనా పరవాలేదనే అభిప్రాయం ఆమెది. నిజం చెప్పాలంటే సైకిల్‌ మీద వెళ్ళే రోజులలోనే ఆమె కాస్త శ్రద్ధ వహించి అలంకరించుకుంటుంది. ఆమె ముంగురలను అద్ధంలో చాలాసార్లు చూసుకుంటుంది. సరిచేసుకుంటుంది. అలంకారమంతా ముగసిన తరువాత పౌడర్ కాస్త ఎక్కువైందని అనిపిస్తుంది. ఎవరిని అడగాలి? కుసుమ భర్త విశ్వనాథ అప్పటికే వెళ్ళి చాలాసేపు అయింది.

సైకిల్‌ దగ్గరికి వస్తే వెనుక చక్రంలో గాలి తక్కువగా ఉంది. వెనుకటి రోజున, అంటే శుక్రవారం కొడుకు నాగరాజు తీసుకుని వెళ్ళాడు. వాడు గాలి కొట్టించి వుండొచ్చుకదా అని అనుకుంటుంది. వాడికి అందులోనూ డబ్బు మిగల్చాలని ఆశ కావచ్చు.

‘‘ఈ రోజు కేవలం మార్నింగ్‌ స్కూలు కదా మేడమ్‌’’ గాలి కొట్టే సైకిల్‌ షాపు చిన్నపిల్లవాడు కూడా సంతోషంగా అడిగాడు.

మళ్ళీ సైకిల్‌ ఎక్కి ఫెడల్‌ తొక్కడం కుసుమకు ఎంత సంతోషమో! మాగడి క్రాస్‌, హొసహళ్ళి రోడ్డు, అన్నీ ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతూనే ఉన్నాయి. ఆమెకు అవేమీ అర్థం కావు. ఆమెకు, ఆమె-ఆమె సైకిల్‌ సవారి. అంతే. అంత ఏకాగ్రత, అంత తన్మయత ఆమెది. ఎంతంటే సైకిల్‌ తొక్కుతున్న వ్యక్తి తానే అన్నది కూడా తెలియనంతగా. అయినా ఆమె ఆయాసంతో రొప్పుతున్నది మాత్రం ఆమెకు వినిపిస్తుంటుంది.

కన్నడ మూలం: కె. సత్యనారాయణ

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

Exit mobile version