అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని
హృదయాన నింపుకుని
ధీమాగా, పట్టుదలగా, అవిశ్రాంతంగా
సమస్యలపై పోరాటం చేస్తుంటే
తప్పకుండా ఏదో ఒకనాటికి
విజయం నీ స్వంతమవుతుంది నేస్తం!
గాంధీజీ అహింసా సిద్ధాంతంతో..
బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసి
భారతావని లోని ప్రజలకు
స్వేచ్ఛా స్వాతంత్రాలను సిద్ధింపజేయలేదా!?
శాస్త్ర సాంకేతిక రంగాల్లో
వెనుకబడిన దేశాన్ని కాపాడేలా
శాస్త్రవేత్తలైన విక్రం సారాబాయ్,
అబ్దుల్ కలాం వంటి మహనీయులు
సాంకేతిక విప్లవానికి కారణం కాలేదా!?
ఆర్థికంగా, సామాజికంగా దేశం కుంగుబాటుకు గురై
ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నప్పుడు
ప్రపంచీకరణ ఆవశ్యకతను
గుర్తించిన మన పి.వి., మన్మోహన్‌లు
ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు
దేశాన్ని ప్రగతి బాట పట్టించలేదా!?
నాటి నాయకులు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు సైతం..
తొలినాళ్ళలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నవారే!!
క్రమ క్రమంగా ఎదుగుతూ
సమాజానికి దిక్సూచిగా మారి..
ప్రజా ప్రయోజన కార్యక్రమాలను
చేపట్టి ఘన విజయాన్ని సాధించారు!
మొదట చిన్ని విత్తనమే మర్రి వృక్షమైనా..
ఎదిగేకొద్దీ విస్తరించడం దాని నైజం!
ప్రయత్నిస్తే ప్రతి అపజయం దూరమవుతూ..
పూలబాటల వంటి వెలుగుల రహదారులను
చూపిస్తూ మటుమాయమవుతుంది!
ఆశయం మహోన్నతమైనదైతే..
గుండె నిబ్బరం నిను
వీడని తేజస్సై సదా రగులుతుంటే..
అడుగులు సైతం ధీమాగానే పడుతుంటాయి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.