[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
అరేబియా సముద్ర జలాల్లో అంజలిక అనే ఓడ స్థిరవేగంతో ప్రయాణం చేస్తోంది. సూర్యాస్తమయ సమయం కావడం వల్ల నీళ్ళ మీద కెంపులూ నీలాలు ముత్యాలు వెదజల్లినట్టు సముద్రం శోభాయమానంగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని తిలకించడానికి కూడా తీరిక లేనట్టు ఓడలో ఉన్న పన్నెండు మంది శాస్త్రవేత్తలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఓడలోని కంట్రోల్ రూంకు పొడవాటి కేబుల్‌తో అనుసంధానమై ఉన్న స్పార్కిల్ అనే రోబోట్ సముద్ర గర్భంలోని చీకటి కుహరంలో దాగున్న రహస్యాల్ని ఫోటోలు వీడియోలు తీసి, అవిశ్రాంతంగా కంప్యూటర్లకు సరఫరా చేస్తోంది. అది రిమోట్‌గా కంట్రోల్ చేయబడే వెహికిల్. దానికి హై డెఫినిషన్ కెమెరాలు, శక్తివంతమైన లైట్లతోపాటు శాంపుల్స్‌ని సంగ్రహించడానికి ఉపయోగపడే రోబోటిక్ చేయి కూడా బిగించబడి ఉంది.
కంప్యూటర్ల ముందు కూచుని స్పార్కిల్ పంపిస్తోన్న వీడియో దృశ్యాల్ని నిశితంగా పరిశీలిస్తున్న శంకరన్ “వావ్.. బ్యూటిఫుల్” అంటూ ఉత్సాహంతో అరిచాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రవేశపెట్టిన నూటపది మీటర్ల పొడవున్న అంజలిక అనే నౌకలో రెండు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రయోగశాలలోని శాస్త్రవేత్తలు అతని అరుపుకి తలలెత్తి శంకరన్ వైపు చూశారు.
“అద్భుత దృశ్యం.. తెల్లటి ఆక్టోపస్‌ల సమూహంతో నిండిన ఈ సీమౌంట్ తెల్లకలువల్తో నిండిన చెరువులా ఎంతందంగా ఉందో చూడండి” అన్నాడు శంకరన్. అందరూ కంప్యూటర్ల స్క్రీన్ల మీదకి దృష్టి సారించారు. నిజమే.. చాలా అందమైన దృశ్యం. కొండ పైనంతా అంగుళం స్థలం కూడా విడవకుండా మల్లెలు మొలిచినట్లు.. మెల్లగా కదుల్తోన్న మల్లెలు..
డాక్టర్ అధీర కుతూహలంతో వచ్చి శంకరన్ పక్కనున్న కుర్చీలో కూచుని కంప్యూటర్ స్క్రీన్ మీదికి దృష్టిని సారించింది. ఆమె మెరైన్ బయాలజిష్ట్.. వయసు నలభై రెండు. నావలో పని చేస్తున్న శాస్త్రవేత్తలందరికీ ఆమె చీఫ్. ఆమెతో పాటు హైడ్రోగ్రాఫర్లు, ఓషన్ ఇంజనీర్లు, మెరైన్ జియాలజిష్టులు, మెరైన్ కెమిష్టులు, జెనెటిక్ ఇంజనీర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు.
కొన్ని వేల ఆక్టోపస్‌లు.. వాటికింద లక్షల తెల్లటి గుడ్లు..
“మనకు కన్పిస్తున్నవన్నీ ఆడ ఆక్టోపస్‌లే. అవి తమ గుడ్లను పొదగడానికి ఈ సీ మౌంట్‌ని ఎన్నుకున్నట్టున్నాయి” అంది అధీర.
“మేడం.. ఒక్కో ఆక్టోపస్ ఎన్ని గుడ్లు పెడ్తుంది?” అని అడిగాడు శంకరన్. అతను కంప్యూటర్ ఇంజనీర్. చెన్నయ్ ఐఐటి నుంచి యంటెక్ పట్టా పొందాడు. కంప్యూటర్లకి సంబంధించిన విషయాల్లో అత్యంత ప్రతిభా సంపన్నుడు.
అధీర ల్యాబ్‌లో ఉన్న మిగతా వాళ్ళ మొహాల వైపు చూసింది. వాళ్ళు కూడా తన జవాబు వినడానికి ఉత్సుకతతో ఉన్నారని అర్థమై, “మీకు ఆక్టోపస్‌లకు సంబంధించిన ఆసక్తి కలిగించే విషయాలు చెప్తాను. ఒక్కో ఆక్టోపస్ తమ స్పీషీస్‌ని బట్టి పదివేల నుంచి లక్ష వరకు గుడ్లను పెడ్తుంది. వాటిని ఆడ ఆక్టోపస్ చాలా భద్రంగా కాపాడుకుంటూ నెలల తరబడి పొదుగుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బైటికి రావడానికి ఆరు నుంచి పదినెలల వరకు సమయం పడ్తుంది. అప్పటివరకు తల్లి ఆక్టోపస్ తిండి తినదు. దానివల్ల శుష్కించిపోయి, పిల్లలన్నీ బైటికొచ్చాక, చివరికి ప్రాణాలు వదుల్తుంది. ఎంత గొప్ప త్యాగమో కదా. మనం మన తల్లులకే కాదు జంతువుల, కీటకాల మాతృమూర్తులకు కూడా తలలు వొంచి నమస్కరించాల్సిందే. మరో విషేషమేమిటంటే అవి జీవితంలో ఒకేసారి గుడ్లుపెడతాయి. తరువాత మరణిస్తాయి” అంది.
తన మాటలకు శంకరన్ మొహంలో రంగులు మారడం గమనించింది. అతనిలో దుఃఖసాగరాలు పోటెత్తుతూ కన్పించాయి. తను చూడకూడదని పక్కకు తిరిగి, కర్చీఫ్‌తో కన్నీళ్ళను తుడుచుకోవడం చూసి, అధీర కొన్ని క్షణాలు వ్యాకులపడింది.
“ఏమైంది? నా మాటలు మిమ్మల్ని ఏమైనా బాధించాయా?” అని అడిగింది.
“లేదు మేడం. మీరు తల్లులు చేసే త్యాగాల గురించి చెప్తుంటే నాకు నా భార్య సెల్వి గుర్తొచ్చింది.”
“భార్య గుర్తొస్తే పెదవుల మీద చిర్నవ్వు కదా మొలవాలి. కన్నీళ్ళెందుకొచ్చాయి?”
“నా భార్య ఇరవైయేళ్ళ క్రితం చనిపోయింది. మా పెళ్ళయిన నాలుగేళ్ళకే తను నాకు దూరమైంది.” అతని కళ్ళు మరోసారి అశ్రుపూరితాలయ్యాయి.
“ఐ యాం సారీ” అంది అధీర. ఆ సమయంలో మరిన్ని వివరాలడిగి అతన్ని బాధ పెట్టడం ఇష్టంలేక అక్కడినుంచి లేచి, తన టేబుల్ దగ్గరకెళ్ళి కూచుంది.
తనూ తనతో పాటు ఈ మిషన్‌లో పని చేస్తున్న మరో నలుగురు శాస్త్రవేత్తలు మాత్రమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఎన్నో యేళ్ళనుంచి పనిచేస్తున్న శాస్తవేత్తలు. మిగతా వాళ్ళని ఇంటర్వ్వూ ద్వారా ప్రత్యేకంగా సెలక్ట్ చేశారు. శంకరన్‌ని కూడా అలా ఎన్నుకోవడం వల్ల అతని వ్యక్తిగత జీవితం గురించి తనకేమీ తెలియదు. చెన్నయ్ సముద్ర తీరం నుంచి అంజలిక నౌక బయల్దేరి రెండు నెలలు. ఈ రెండు నెలల వ్యవధిలో కొత్తగా చేరిన సభ్యుల ఆంతరంగిక విషయాలు తెల్సుకునేంత సాన్నిహిత్యం ఏర్పడలేదు. కానీ శంకరన్ గురించి మాత్రం తెల్సుకోవాలనుకుంది.
అధీర తన పక్కన కూచుని ఉన్నంత సేపు శంకరన్ తీయని అనుభూతికి లోనయ్యాడు. తను భావోద్వేగానికి గురికావడం వల్లే ఆమె లేచి వెళ్ళిపోయినందుకు తన్ను తాను తిట్టుకున్నాడు. ఈ షిప్లో మొదటిసారి అధీరను చూసినప్పటినుంచి అతని గుండె లయ తప్పడం మొదలైంది. నలభై యేళ్ళు దాటినా సన్నగాపొడవుగా జాజిపూల తీగలా ఎంతందంగా ఉందో అనుకోని క్షణం లేదు. తేటనీటి కొలనుల్లాంటి విశాలమైన కళ్ళు, వాటికి అదనపు అందాన్ని చేకూరుస్తున్న కళ్ళద్దాలు. పల్చటి పెదాలు, వాటిమీద అనాయాసంగా కదలాడే సన్నటి నవ్వు, పొడవాటి జడ.. తనకెంతిష్టమో అటువంటి జడ.. తన భార్య సెల్వికి కూడా దట్టమైన పొడవాటి కురులుండేవి. ఆమె పక్కన పడుకుని, ఆ జుట్టుని తన మొహం మీద కప్ప్పుకుంటే ఎంత బావుండేదో.. మేఘాలు తనని కమ్మేసినట్టు..
‘పొడవుగా ఉండే జడంటే అంత పిచ్చేమిటి నీకు?’ అంటూ ముద్దుగా విసుక్కునేది సెల్వి.
స్క్రీన్ మీద సముద్ర గర్భంలో ఏర్పడిన నెర్రలు కన్పిస్తున్నాయి. వాటిలోంచి దట్టమైన నల్లటి పొగలాంటిదేదేదో పైకి చిమ్ముతోంది. అవి సముద్రం అడుగున పేరుకున్న సల్ఫైడ్స్ వల్ల ఏర్పడుతున్న వాయువులని మెరైన్ కెమిష్ట్ చెప్పడం గుర్తొచ్చింది. బసాల్ట్తో ఏర్పడిన పెద్ద పెద్ద గుహల్లాంటివి కన్పిస్తున్నాయి. కొన్ని చీలికల్లోంచి రకరకాల మినరల్స్ కలిసిఉన్న అత్యంత వేడినీటి బుగ్గలు పైకి ఫౌంటెన్లా ఎగజిమ్ముతూ కన్పించాయి. వాటిని హైడ్రోథెర్మల్ వెంట్స్ అంటారని, వాటి ఉష్ణోగత నాలుగు వందల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటుందని తెల్సుకున్నాడు. రకరకాల జలచరాలు, సముద్రజీవులు కన్పిస్తున్నాయి. కానీ వేటిలోనూ అతను ఆసక్తిని కన్పరచలేకపోతున్నాడు. అతని మనసునిండా సెల్వి జ్ఞాపకాలతో పాటు, అధీర నిండిపోయి ఉంది.
రాత్రి ఎనిమిది గంటల సమయం.. అంజలికలోని శాస్త్రవేత్తలు ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ ఉండాలి. అందుకే రెండు షిఫ్టులుగా విడగొట్టి, ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఒక బ్యాచ్, రాత్రి ఎనిమిది నుంచి మరో బ్యాచ్ పనిచేసేలా ఏర్పాటు జరిగింది. మెస్‌లో డిన్నర్ రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు దొరుకుతుంది.
షిఫ్ట్ మారడంతో అధీర భోం చేయడానికి మెస్కెళ్ళింది. ఆమె పన్నెండు గంటలు ఆఫ్ డ్యూటీలో ఉన్నా చీఫ్ కాబట్టి అవసరమైనపుడల్లా ల్యాబ్‌కి వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది.
డిన్నర్ చేశాక డెక్ మీదికెళ్ళి కొంత సమయం గడపడం ఆమెకు అలవాటు.
ఆమె ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వైపు కొద్దిసేపు చూసింది. వెన్నెల డెక్ మీద పర్చుకుని ఉంది. షిప్ కదలడం కోసం ఉపయోగపడే ప్రొపల్షన్ సిస్టమ్ చేస్తున్న శబ్దంతో పాటు ఓడ నీటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్ప్పుడు ఏర్పడే శబ్దం తప్ప చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. ఓడ ముందుభాగానికి అమర్చి ఉన్న లైట్ల కాంతి పడ్తున్న ప్రదేశం తప్ప చుట్టూతా చీకటి ఆవరించి ఉంది. పల్చటి వెన్నెల వెలుగుల్ని మింగేస్తున్న చీకటి..
అధీరకు చిన్నప్పటినుంచి సముద్రమంటే విపరీతమైన ఇష్టం. అమ్మానాన్న సముద్ర స్నానానికని పిల్చుకెళ్ళినపుడల్లా నీటిలో తడవకుండా ఒడ్డున కూచుని సముద్రపు అలల్ని తదేకంగా చూస్తూ గడిపేది.
ఏడో తరగతిలో ఉన్నప్ప్పుడు ‘సముద్రంలో ఏముంటాయి?’ అని వాళ్ళ నాన్నని అడిగింది.
‘సముద్రంలో చేపలు, మొసళ్ళు, తిమింగలాలు ఉంటాయి. సముద్రం లోపల వేడినీటి బుగ్గలు, నదులు, అగ్ని పర్వతాలు కూడా ఉంటాయని చెప్తారు’ అన్నాడు.
‘ఎంత లోతుంటుంది?’ మరో పశ్న వేసింది.
‘రెండు మూడు మైళ్ళ లోతుంటుందేమో. యింకా ఎక్కువ లోతు కూడా ఉండొచ్చు. నాకు సరిగ్గా తెలియదు’ అన్నాడు. స్కూల్లో ఇంగ్లీష్ మాస్టారిగా పని చేస్తున్న అతనికి సముద్రానికి సంబంధించిన జ్ఞానం పెద్దగా లేదు.
‘సముద్రం ఎలా ఏర్పడింది?’ అని అడిగింది.
అతను విసుగ్గా చూసి, ‘నాకు తెలియదు. మీ సైన్స్ టీచర్ని అడుగు’ అన్నాడు.
సమాధానం దొరకని పశ్నలు కావడంతో ఆమెకు కుతూహలం మరింత పెరిగింది. డిగ్రీ చేయడానికి మెరైన్ బయాలజీ కోర్స్‌ని ఎన్నుకున్నప్ప్పుడు అమ్మ కూడా నాన్న అడిగినట్టే ‘నీకెందుకు సముద్రమంటే అంతిష్టం’ అని అడిగింది.
‘అంతరిక్షం ఎన్ని రహస్యాల్ని తనలో పొదువుకుందో అంతకు మించిన రహస్యాలు సముద్రం తనలో దాచుకుని ఉందమ్మా. మనిషి తన మేధోసంపత్తితో అంతరిక్షంలోకి ప్రయాణం చేయగలుగుతున్నాడు. గ్రహాలను, నక్షత్రాలను, గెలాక్సీలను, బ్లాక్‌హోల్స్‌ని శోధించగలుగుతున్నాడు. కానీ అతిలోతైన సముద్రగర్భంలో దాగున్న వింతల్ని పూర్తిగా తెల్సుకోలేకపోతున్నాడు. సముద్రపు అడుగున కొన్ని వేల మీటర్ల లోతున అంధకారంలో, అత్యంత అధిక పీడనాన్ని తట్టుకుంటూ, కొన్ని రకాల జీవరాశులు ఎలా మనుగడ సాగిస్తున్నాయో తెల్సుకోవాలన్న ఉత్సుకత.. సముద్రం లోపల మానవాళికి తెలియని ఎన్నో జీవజాతులున్నాయి. వాటి జీవ వైవిధ్యాన్ని తెల్సుకోవాలన్న కోరిక’ అంది అధీర.
ఆమె కోరుకున్నట్టే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మెరైన్ సైంటిష్ట్గా ఉద్యోగం దొరికింది. తను చిన్నప్పటినుంచి కంటున్న కలను సాకారం చేసుకునే దిశలో ఓషన్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఓడ అంజలికలో చీఫ్ సైంటిష్ట్గా అన్వేషణ జరిపే అవకాశం దొరికింది.
ఓడ స్థిరమైన వేగంతో ముందుకు కదుల్తోంది. చుట్టూ చీకటి తప్ప ఏమీ కన్పించడం లేదు. ఆమెకు ఏదో రహస్యమయ లోకంలోకి ప్రయాణిస్తున్నట్టు అన్పించింది. ఆకాశం వైపుకు తలయెత్తి చూసింది. నక్షత్రాలు ఏ దేవతలో నిర్లక్ష్యంగా పారేసుకున్న వజ్రాల్లా కన్పిస్తున్నాయి. అనంతంగా విస్తరించిన వెండి సరస్సులా పాలపుంత విశ్వాంతరాళంలోని రహాస్యాల్ని గుసగుసలుగా చెప్తున్నట్టు అన్పించింది.
కింద జీవంతో తొణకిసలాడ్తున్న సముద్ర జలాలవైపుకు దష్టి మరల్చింది. సముద్రం మెల్లగా శ్వాసిస్తున్నట్టు.. ఓడమట్టు హల్ని తమ చల్లటి చేతుల్తో స్పృశిస్తున్న చిన్న అలలు చేస్తున్న పల్చటి శబ్దం సముద్రం తన పురా జ్ఞాపకాల్ని జోలపాటలా విన్పిస్తున్నట్టు అన్పించింది.
ఓడకు అమర్చిన సోనార్లు నిశ్శబ్దంగా శబ్ద తరంగాల్ని నీళ్ళ లోతుల్లోకి పంపించి, తిరిగొచ్చే ప్రతిధ్వనుల్ని విశ్లేషించే పనిలో మునిగిఉన్నాయి. అవి అల్ట్రాసోనిక్ శబ్ద తరంగాలు కావడం వల్ల మనుషులు గ్రహించలేరు. కానీ ఆ పరికరాలు చేస్తున్న శబ్దం మాత్రం తనకు లీలగా విన్పిస్తోంది.
అదే సమయంలో అధీరకు మరేదో శబ్దం విన్పించింది. ఓడలో నెలల తరబడి ప్రయాణం చేయడంలో ఎంతో అనుభవమున్న అధీరకు ఆ శబ్దం కొత్తగా, వింతగా అన్పించింది. ఏంటా శబ్దం? ఎక్కడినుంచి వస్తోంది? ఈసారి మరింత శ్రద్ధగా వినడానికి పయత్నించింది. ఆ శబ్దం సముద్రపు లోతుల్లోంచి వస్తున్నట్టుంది. చాలా బలహీనమైన శబ్దం..
దూరంగా.. చాలా దూరంగా.. వూదారంగు కాంతి రేఖ క్షణకాలం మెరిసి మాయమైంది. ఏమిటా కాంతి? ఎక్కడినుంచి వచ్చింది? ఉల్క జారిపడినట్టు.. మళ్ళా తిరిగి కన్పిస్తుందేమోనని అదే దిక్కు వైపు చూసింది. సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత వెల్తురు రేఖ కన్పించింది. అది వూదారంగు ఫౌంటెన్లా నీళ్ళలోంచి పైకి చిమ్ముతున్నట్టనిపించింది.
బయో లూమినిసెన్స్ని ప్రదర్శించే సముద్ర జలచరాల గురించి ఆమెకు తెలుసు. కొన్ని రసాయన చర్యల ద్వారా తమ శరీరంలో సహజంగా కాంతిని ఉత్పత్తి చేసే ప్రక్రియ.. లూసిఫెరిన్ అనే పదార్థం లూసి ఫెరేస్ అనే ఎంజైమ్‌తో ఆక్సీకరణం చెంది కాంతిని విడుదల చేస్తుందని డిగ్రీ పుస్తకాల్లో చదువుకుంది. అలా కాంతిని విడుదల చేసే సముద్ర జీవులన్నీ గుర్తొచ్చాయి.
సముద్రంలో వెయ్యి మీటర్ల లోతున బతికే జలచరాలన్నీ ఎంతో కొంత ఈ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వాటి శరీరంలోంచి వెలువడే కాంతి ఆహార సముపార్జన కోసం, వేటాడటానికి, శతువుల నుంచి రక్షించుకోడానికి, సంతానోత్పత్తి కోసం తోడుని వెతుక్కోడానికి పనికొస్తుంది. కానీ అటువంటి జలచరాల నుంచి వెలువడే కాంతి నీళ్ళలోంచి పైకి కొన్ని మీటర్ల ఎత్తు వరకు వ్యాపించేంత బలంగా ఉండదు. తనకు కన్పించిన కాంతి పుంజం విభిన్నంగా ఉంది. ఎవరో సముద్రం లోపల దాక్కుని శక్తివంతమైన టార్చ్లైట్తో సిగ్నల్ ఇస్తున్నట్టు..
“హలో మేడం.. ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు. నేనొచ్చి ఐదు నిమిషాలైంది. మీ పక్కన నిలబడి ఉన్నా గమనించే స్థితిలో లేరు. ఏమాలోచిస్తున్నారు?” అని విన్పించడంతో ఉలిక్కి పడి తలతిప్పి పక్కకు చూసింది. తనకు సమీపంలో శంకరన్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు.
ఇబ్బందిగా కదుల్తూ “హలో” అంది.
డెక్ రెయిలింగ్‌ని పట్టుకుని, దూరంగా కన్పిస్తున్న అనంతమైన చీకటి కుహరాన్ని చూస్తూ “ఇన్నాళ్ళూ వెల్తురే బావుంటుంది అనుకునేవాణ్ని. చీకటి కూడా అందంగా ఉంటుందని ఈ ప్రయాణంలోనే తెల్సుకున్నాను” అన్నాడు శంకరన్.
అధీర మరలా కాంతి రేఖ కన్పిస్తుందేమోనని అటువైపుకే చూస్తూ పరధ్యానంగా ఉండటంతో, శంకరన్ నొచ్చుకుంటూ “సారీ మేడం.. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాననిపిస్తోంది. వెళ్ళి పడుకుంటాను. గుడ్‌నైట్” అన్నాడు.
“అయ్యో.. అదేమీ లేదు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు” అంటూ శంకరన్ వైపు తిరిగి “ల్యాబ్‌లో అందరూ వింటున్నారని అడగలేదు. ఇప్ప్పుడు చెప్పండి, మీ భార్య సెల్వీ గురించి. తను ఎలా చనిపోయింది?” అని అడిగింది.
శంకరన్ నుంచి ఓ దీర్ఘ నిశ్వాస వెలువడింది. “నా జీవితంలో జరిగిన అతి విషాదకరమైన సంఘటన అదే మేడం. సెల్వీ నాకు ఇంజనీరింగ్‌లో క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నాం. నాలుగేళ్ళు ఎంత ఆనందంగా గడిపామో.. సౌందరరాజన్ పాటలా మధురంగా.. రుక్మిణీ అరండేల్ నాట్యంలా సమ్మోహనంగా.. ఓ రోజు సాయంతం తిరువన్మియూర్ బీచ్‌కెళ్ళి రాతి ఎనిమిది గంటల వరకు అక్కడ ఆహ్లాదంగా గడిపాం. తిరిగి స్కూటర్ మీద యింటికి వెళ్ళే సమయంలో తాగి కారు నడుపుతున్న కుర్రవాళ్ళు యాక్సిడెంట్ చేశారు. స్కూటర్ మీద వెనక సీట్లో కూచుని ఉన్న సెల్వీ ఎగిరి రోడ్డు మధ్యలో పడిపోయింది. తల వెనక భాగంలో బలమైన గాయం కావడంతో నా సెల్వీ హాస్పిటల్లో రెండు రోజులు మత్యువుతో పోరాడి ఓడిపోయింది. నాకూ దెబ్బలు తగిలాయి. ఆ గాయాలు మానిపోయాయి గానీ సెల్వీ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయినందువల్ల ఏర్పడిన గాయం మాత్రం ఇప్పటికీ పచ్చిగానే సలుపుతోంది మేడం” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
“పిల్లలు..” అంటూ మధ్యలోనే ఆపేసింది అధీర.
“లేరు మేడం. ఉన్నా బావుండేది. జీవితం ఇంత నిరర్థకంగా అన్పించేది కాదు. నాకో తోడుండేది. బతకడానికో గమ్యం ఉండేది.”
“ఎందుకు లేరు?”
“సెల్వీ మొదటినుంచి పోరుతూనే ఉండింది మేడం. ఒకరో ఇద్దరో పిల్లల్ని కనాలని తనకెంత కోరికో.. పిల్లలకు అప్పుడే తొందరేమొచ్చింది అంటూ నేనే వాయిదా వేస్తూ వచ్చాను. పిల్లలు కావల్సిందేనని సెల్వీ పట్టుపట్టింది. చనిపోయేనాటికి ఆమె నాలుగు నెలల గర్భవతి.. దురదృష్టం ఆ రోజు కారు రూపంలో తరుముకొస్తుందని వూహించలేదుగా మేడం” అతను మరోసారి కళ్ళు తుడుచుకున్నాడు.
అధీర ఏదో చెప్పబోయేలోపల మరలా సముద్రగర్భం నుంచి బలహీనంగా శబ్దం విన్పించింది. ఈసారి ఆమె చాలా జాగత్తగా ఆ శబ్దాన్ని వినింది. అది గుండె కొట్టుకునే శబ్దంలా అన్పించింది. నీళ్ళ లోపలినుంచి గుండె కొట్టుకునే శబ్దం విన్పించడానికి కారణం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. తనేమైనా భ్రమ పడ్తోందా? లేక నిజంగానే అటువంటి శబ్దం ఎక్కడినుంచో వెలువడుతోందా? ఇప్పటివరకు మానవాళికి తెలియని ఏదైనా సముద్ర జంతువు గుండె చప్ప్పుడా అది? లేకపోతే ఆ వింత జంతువు నోటి ద్వారా చేసే శబ్దం గుండె కొట్టుకునే శబ్దంలా విన్పిస్తోందా? ఏం జంతువై ఉంటుంది? ప్రమాదకరమైన జంతువా? అది సమీపంలో ఉండిఉంటే ఈపాటికి స్పార్కిల్ రోబోట్ కెమెరాలకు అది కన్పించి ఉండాలిగా. అదే జరిగితే ఈపాటికి కంప్యూటర్ ఆపరేటర్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఏదో కొత్త జంతువు కన్పించిందని చెప్పి ఉండేవారుగా.
కొన్ని నిమిషాల వ్యవధి తర్వాత మరోసారి శబ్దం విన్పించింది. లయాత్మకంగా ఉన్న శబ్దం..
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
