Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వూదారంగు సముద్రం-2

[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సముద్ర జలాలలో పరిశోధనకై అంజలిక అనే ఓడలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుంటారు అధీర, ఆమె నాయకత్వంలోని ఇతర శాస్త్రవేత్తలు. ఓ పొడవాటి కేబుల్‌తో ఓడకి అనుసంధానమై ఉన్న స్కార్పిల్ అనే రోబోట్ సముద్రపు లోతుల్లోని రహస్యాలను ఫోటోలు తీసి కంప్యూటర్లకు అందిస్తుంది. దానికి అమర్చిన రొబోటిక్ హ్యాండ్ అవసరమైన శాంపుల్స్‌ని కలెక్ట్ చేస్తుంది. కొన్ని వేల అక్టోపస్‌లు లక్షలాది గుడ్లు పెట్టే అపురూపమైన దృశ్యాన్ని చూసి శంకరన్ అనే కంప్యూటర్ ఇంజనీర్ అబ్బురపడితే, వాటి గురించి వివరిస్తుంది అధీర. తల్లి అక్టోపస్‌లు చేసే త్యాగం గురించి చెప్పినప్పుడు, శంకరన్‌కి, చనిపోయిన తన భార్య గుర్తొచ్చి బాధపడతాడు. ఆ సమయంలో మరిన్ని వివరాలు అడిగి అతన్ని బాధపెట్టడం ఇష్టం లేక, ఊరుకుంటుంది అధీర. రాత్రి డిన్నర్ చేసి, డెక్ పైకి వెళ్ళి నిలుచున్న అధీరకి తన బాల్యం, సముద్రంపై తనకి ఇష్టం ఏర్పడం గుర్తొస్తాయి. ఇంతలో ఆమెకు ఓ వింత శబ్దం వినిపిస్తుంది. చాలా బలహీనమైన ఆ ఆ శబ్దం సముద్రపు లోతుల్లోంచి వస్తున్నట్టుంది. అదే సమయంలో చాలా దూరంగా ఓ వూదారంగు కాంతిరేఖ క్షణకాలం మెరిసి మాయమావుతుంది. ఆ కాంతి ఏమిటా అని తనలో తాను తర్కించుకుంటుంది అధీర. ఐదు నిమిషాల ముందు వచ్చి అక్కడే నిలబడ్డ శంకరన్‌ని ఆమె గమనించదు. అతను ఆమె ధ్యాసని భగ్నం చేసి, ఏమాలోచిస్తున్నారని అడిగితే, హాయ్ అని పలకరించి మళ్ళీ అదే పరధ్యానంలో ఉండిపోతే, అతను నొచ్చుకుని వెళ్ళిపోబోతాడు. ఆమె అతన్ని ఆపి, అతని భార్య ఎలా చనిపోయింది చెప్పమంటుంది. శంకరన్ తన గతం గురించి చెప్తాడు. ఆమె బదులివ్వబోయేంతలో ఆ బలహీనమైన శబ్దం మళ్ళీ వినబడుతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వినబడుతుంది. – ఇక చదవండి.]

శంకరన్ వైపు తిరిగి “ఇప్పుడు మీకేమైనా శబ్దం విన్పించిందా? చాలా లో డెసిబెల్స్ శబ్దం?” అని అడిగింది.

“ఏం శబ్దం?” ఆమె అడుగుతున్నదేమిటో అర్థం కాక ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.

“గుండె కొట్టుకుంటున్నట్టు శబ్దం.”

‘మీతో మాట్లాడుతుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటున్న శబ్దం నాకు విన్పిస్తోంది మేడం’ అని మనసులో అనుకుని, పైకి మాత్రం “లేదు మేడం. నాకు అటువంటి శబ్దమేదీ విన్పించలేదే” అన్నాడు.

తనకు విన్పించిన శబ్దం అతనికెందుకు విన్పించలేదో ఆమెకు అర్థం కాలేదు. అతనికి సముద్ర ప్రయాణం కొత్త. తనకున్న ఎన్నో యేళ్ళ అనుభవంతో రాత్రుళ్ళు డెక్ మీద నిలబడితే విన్పించే శబ్దాల గురించిన అవగాహన ఉంది. వాటికి భిన్నంగా ఏ శబ్దం విన్పించినా తను గుర్తు పట్టగలదు. కానీ శంకరన్‌కి ఆ శబ్దాలన్నీ కలగలిసిపోయి విన్పిస్తూ ఉండటం వల్ల దాన్ని ప్రత్యేకంగా గుర్తించలేకపోతున్నాడు అనుకుంది.

అతను దాని గురించి మరిన్ని ప్రశ్నలు అడక్కుండా డైవర్ట్ చేయడం కోసం “మరి ఇన్నేళ్ళూ ఒంటరిగా ఎందుకున్నారు? మరో పెళ్ళి చేసుకోవాల్సింది” అంది.

“సెల్వీని మర్చిపోలేక ఓ పదేళ్ళు గడిపేశాను మేడం. సెల్వీలాంటి స్త్రీ కోసం వెతకడంలో మరో పదేళ్ళు గడిచిపోయాయి.”

“అటువంటి ఎవరూ ఎదురుపడలేదా?”

“ఈ మధ్యనే కలిసింది మేడం. ఆమెను చూస్తే చాలు నాకు సెల్వీనే గుర్తుకు వస్తోంది. ఆమె ఒప్పుకుంటే పెళ్ళి చేసుకోవాలని ఉంది.”

“మరి ఆలస్యం దేనికి? చెప్పలేకపోయారా?”

“తిరస్కరణ భయం వల్ల చెప్పలేకపోతున్నాను.”

అధీర మెత్తగా నవ్వింది. “భలేవారే మీరు. అందులో భయపడటానికి ఏముంది? మీ మనసులో మాట బైట పెట్టాక ఆమెక్కూడా ఇష్టమైతే పెళ్ళికి ఓకే అంటుంది. లేకపోతే తనకిష్టం లేదని చెప్తుంది. సో సింపుల్. మన ఎక్స్‌ప్లోరేషన్ పూర్తయ్యాక వెళ్ళి ఆమెతో చెప్పండి” అంది.

ఆమె మాట్లాడుతూ ఉంది గానీ మళ్ళా విన్పించే శబ్దం కోసం, దూరంగా కన్పించే కాంతి పుంజం కోసం అప్రమత్తంగా ఎదురుచూస్తోంది.

“మీరేమీ అనుకోనంటే ఓ మాటడగనా?” అన్నాడు.

“అడగండి.”

“మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు?”

“అవసరం అన్పించలేదు. భర్తా పిల్లలూ.. వాళ్ళకు కేటాయించేంత సమయం నా దగ్గరలేదు.”

“మీరెవర్నయినా ప్రేమించారా?”

“ఆ.. ప్రేమించాను. ప్రాణంలా.. కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డాను” అంటూ నవ్వింది.

“ఎవరా అదృష్టవంతుడు? మరి అతన్నే ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? మోసం చేశాడా?”

“నేను ప్రేమించింది సముద్రాన్ని. సముద్రం కూడా నన్ను ప్రేమించింది” అంటూ నవ్వింది. శంకరనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రెణ్నిమిషాలు మౌనంగా ఉన్నాక “వెళ్తాను మేడం” అన్నాడు.

“సరే. నేను మరి కొద్దిసేపుంటాను” అంది అధీర.

అతను వెళ్ళిపోయాక ఎంత సేపు ఎదురుచూసినా శబ్దం విన్పించలేదు. కాంతిపుంజం కూడా కన్పి౦చలేదు.

సమయం పది కావొస్తూ ఉండటంతో ఆమె కిందికి దిగి తన గదిలోకెళ్ళి పడుకుంది. నిద్ర రావడం లేదు. అదే శబ్దం చెవుల్లో గింగురుమంటోంది. తనక్కనిపించిన వూదారంగు కాంతి పుంజానికి, విన్పించిన గుండె చప్పుడు లాంటి శబ్దానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించింది. శబ్దం ఓడకు అతి సమీపంగా ఉన్నట్టు విన్పించింది. కానీ కాంతిపుంజం చాలా దూరంలో కన్పించింది కాబట్టి ఆ రెండూ వేర్వేరు కావొచ్చనిపించింది.

ఆ వెంటనే ఆమెకు సముద్ర గర్భంలో ఏర్పడిన శబ్ద తరంగాలు అన్ని వైపులకు ఎలా వ్యాపిస్తాయో గుర్తుకొచ్చింది. సముద్రంలో ఏర్పడే సౌండ్ ఫిక్సింగ్ అండ్ రేంజింగ్ ఛానెల్ ద్వారా శబ్దం కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు నీళ్ళలో ప్రయాణించగలదు. కొన్ని తిమింగలాలు ఈ ఛానెల్ ద్వారానే తక్కువ ఫ్రీక్వెనీ కాల్స్ ద్వారా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమింగలాలతో సంభాషించుకుంటాయని చదివిన విషయం కూడా గుర్తొచ్చింది. అంటే ఆ శబ్దం కూడా కాంతి పుంజం వెదజల్లుతున్న ప్రాణి లేదా పదార్థం నుంచే వెలువడుతూ ఉండొచ్చనుకుంది.

రేపు ఎట్లాగయినా ఆ రహస్యాన్ని ఛేదించాలని బలంగా నిర్ణయించుకుంది.

***

మరునాడు ఉదయం అధీర కంట్రోల్ రూంకి చేరుకునేటప్పడికే శంకరన్ కంప్యూటర్ ముందు కూచుని స్క్రీన్ మీద కన్పిస్తున్న దృశ్యాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

అధీరను చూడగానే “గుడ్మానింగ్ మేడం” అని నవ్వుతూ విష్ చేశాడు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆమె మొహం అలజడిగా ఉన్నట్టు అన్పించింది.

ఆమె గంటగంటకూ డెక్ మీదికి వెళ్ళి రావడం గమనించాడు.

“మేడం.. ఎనీథింగ్ రాంగ్ ?” అని అడిగాడు.

“నథింగ్.. నిన్న రాత్రి ఎనిమిది నుంచి పది వరకు మన సోనార్స్ గ్రహించిన శబ్దాల్లో కొత్తగానో వింతగానో అన్పించినవేమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేసి చెప్పండి” అంది.

శంకరన్ కంప్యూటర్లో సేవ్ అయి ఉన్న నిన్నటి డేటాని పరిశీలిస్తుంటే అధీర కూడా అతని పక్కన కూచుని సోనార్స్ రికార్డ్ చేసిన శబ్దాల్ని జాగ్రత్తగా వినసాగింది.

రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చాలా బలహీనమైన గుండె చప్పుడులాంటి శబ్దం విన్పించింది. అదే శబ్దం మరో పదినిమిషాల తర్వాత విన్పించింది. ఆ తర్వాత మళ్ళీ విన్పించలేదు.

“ఆ శబ్దం ఏ సోర్స్ నుంచి వస్తుందో కనుక్కొడానికి డేటాని ఎనలైజ్ చేశారా?”

“తెలియడం లేదు మేడం. సోర్స్ దాదాపు ఆరు వందల కిలో మీటర్ల దూరంలో ఉందని మాత్రం రికార్డయింది” అన్నాడు శంకరన్.

అధీర మరోసారి డెక్ మీదికెళ్ళి నిలబడింది. ఓ అరగంట సేపు ఎదురుచూసినా ఆ శబ్దం విన్పించ లేదు. నిన్న రాత్రి ఎనిమిదీ నలభైకి విన్పించిన శబ్దం ఇప్పుడెందుకు విన్పించడం లేదు అని ఆలోచిస్తున్నంతలో శంకరన్ నుంచి ఫోనొచ్చింది.

“మేడం.. మీరోసారి కంట్రోల్ రూంకి రావాలి” అతని గొంతు శాటిల్లైట్ ఫోన్‌లో ఉద్విగ్నంగా విన్పిచింది.

అధీర కిందికి వెళ్ళేటప్పడికి అందరూ కంప్యూటర్ స్క్రీన్లకు కళ్ళను అతికించి ఏదో అద్భుతం దృశ్య మానమైనట్టు చూస్తున్నారు.

ఆమె శంకరన్ పక్కనున్న కుర్చీలో కూచుని స్క్రీన్ వైపు చూసింది. గుట్టలు గుట్టలుగా దాదాపు ఆరడుగుల పొడవున్న తెల్లటి గొట్టాల్లాంటి ఆకారాలు.. చివర ఎర్రటి కుచ్చులు కిరీటాల్లా కన్పిస్తున్నాయి. అవేమిటో అధీరకు తెలుసు, మొదటిసారి సముద్రంలోపల అత్యంత లోతులో మనగలిగే జీవ వైవిధ్యాన్ని చూస్తున్నవాళ్ళకి అవి వింతగా, అందంగా, అద్భుతంగా కన్పించడం సహజం అనుకుందామె.

“మేడం.. ఇవేం మొక్కలు? వాటి పక్కనే ఉన్న హైడ్రోథెర్మల్ వెంట్ నుంచి ఎంత వేగంగా వేడి నీరు చిమ్ముతుందో చూశారా? అంత వేడిలో ఆ మొక్కలు ఎలా బతగ్గలుగుతున్నాయి? ఇది ఎవ్వరికీ తెలియని కొత్త జీవజాతి మొక్కలా ఉంది. శాంపిల్ని కలెక్ట్ చేయమంటారా?” అని అడిగాడు శంకరన్,

“అవసరం లేదు. అది నాకు తెల్సిన జీవే. శాస్త్రవేత్తలు వీటి గురించి 1977లోనే కనుక్కున్నారు. వీటిని ‘జయంట్ ట్యూబ్ వార్మ్స్’ అంటారు. ఇవి ‘రిఫ్టియా పాలీకీట్స్’ జాతికి చెందిన జీవులు. ఇవి మొక్కలు కాదు. జంతువులే. ఎటొచ్చీ వీటికి కళ్ళు, నోరు, కడుపు ఉండవు” అంది అధీర.

ఏదో కొత్త రకం జీవజాతికి చెందిన ప్రాణి కన్పించిందని విని, మెరైన్ కెమిస్ట్ యం.కె.రావుతో పాటు మెరైన్ జియాలజిప్ట్ అసిమా ఛటర్జీ కూడా లాబ్ నుంచి కంట్రోల్ రూంలోకి వచ్చారు.

“నోరు లేకుండా గట్ లేకుండా ఇవి ఆహారాన్ని ఎలా తీసుకుంటాయి మేడం” అని అడిగింది మరో కంప్యూటర్ ఇంజనీర్ మహిత.

దానికి సమాధానం యం.కె. రావు చెప్పాడు. “హైడ్రోథెర్మల్ వెంట్స్ ఉన్న చోటనే ఈ ట్యూబ్ వార్మ్స్ కాలనీలు ఏర్పర్చుకుని బతుకుతాయి. తెల్లగా పొడవుగా కన్పిస్తున్న ట్యూబ్ ఉంది కదా. అది కైటిన్ అనే పదార్థంతో తయారౌతుంది. ఈ వార్మ్స్ నుంచి వచ్చే స్రావాలే ట్యూబులుగా ఏర్పడి వాటికి రక్షణ కవచంలా పని చేస్తాయి. మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారుచేసుకున్నట్టే ఈ జీవులు కీమోసింథసిస్ ద్వారా తమక్కావల్సిన న్యూట్రియెంట్స్‌ని పొందుతాయి.”

“సార్.. మాకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్ప మెరైన్ లైఫ్ గురించి ఏమీ తెలియదు. మాకర్థమయ్యేలా చెప్పండి” అన్నాడు శంకరన్.

“హైడ్రోథెర్మల్ వెంట్స్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్‌తో పాటు మరికొన్ని కెమికల్స్ వెలువడుతుంటాయి. వార్మ్స్ టిష్యూల్లో ఉన్న బ్యాక్టీరియా ఈ కెమికల్స్ నుంచి కార్బోహైడ్రేట్స్‌ని తయారుచేసి, వీటికి ఆహారంగా అందిస్తాయి” అన్నాడు రావు.

అసిమా ఛటర్జీ కూడా వాటి గురించి తనకు తెలుసునని చెప్పింది. “తమ సంతానోత్పత్తి కోసం ఈ జీవులు నీళ్ళలోకి స్పెరంని, ఎగ్స్‌ని వదిలిపెడ్తాయి. అవి ఫెర్టిలైజ్ అయి ఏర్పడిన లార్వాలు హైడ్రోథెర్మల్ వెంట్స్ కన్పించేవరకు ప్రయాణించి, అక్కడి రాళ్ళకు అతుక్కుని పెరుగుతాయి” అంది.

“ఎన్ని రకాల జీవజాతులో కదా.. ఎంత వైవిధ్యమో.. కొన్ని మన వూహకు కూడా అందనంత బతుకు పోరాటం చేస్తుంటాయి” అంది మహిత.

“వీటి గురించి మీకు మరో వింత చెప్తాను. ఇవి పుట్టినప్పుడు వీటికి నోరు, గట్ రెండూ ఉంటాయి నోటి ద్వారా బ్యాక్టీరియాని లోపలికి తీసుకుంటాయి. వీటికి యుక్తవయసు వచ్చేటప్పడికి నోరు, గట్ మాయమైపోతాయి” అంది అధీర.

“ఐతే శాంపుల్ తీయాల్సిన అవసరం లేదంటారు” అన్నాడు శంకరన్.

“తీయండి. నేను వాటిమీద మరికొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను. వాటికి సంబంధించిన కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది కదా” అన్నాడు రావు.

స్పార్కిల్‌ని ఉపయోగించి దానికున్న రోబోటిక్ చేయి సహాయంతో బాగా ఎదిగిన ట్యూబ్ వామ్స్‌తో పాటు పిల్ల ట్యూబ్ వామ్స్‌ని కూడా సంగ్రహించి, ల్యాబొరేటరీలోకి పంపించారు.

అధీర మనసంతా నిన్న రాత్రి కన్పించిన కాంతి పుంజం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆమె మళ్ళా రాత్రి కావడం కోసం ఎదురుచూస్తోంది. శబ్దం విన్పించకున్నా ఎంత దూరంలో ఉన్నా కాంతి పుంజమైతే కన్పి౦చాలిగా.

ఎనిమిదింటికి డిన్నర్‌కి వెళ్ళాలనిపించలేదు. నేరుగా డెక్ మీదికెళ్ళి నిలబడింది. నిన్న కాంతి పుంజం కన్పించిన వైపే కాకుండా మిగతా వైపుల కూడా నిశితంగా చూడసాగింది.

పది నిమిషాలు కాకముందే శంకరన్ కూడా డెక్ మీదికి వచ్చాడు.

“మళ్ళా ఆ శబ్దం విన్పిస్తుందేమోనని చూస్తున్నారా? దాని కోసమేనా డిన్నర్ కూడా చేయకుండా పైకి వచ్చారు?” అన్నాడు.

“నిన్న రాత్రి చాలా దూరంలో నేనో కాంతి పుంజాన్ని చూశాను. సముద్రంలోంచి పైకి ఎగజిమ్మిన వూదారంగు కాంతిపుంజం. అది మళ్ళా కన్పిస్తుందేమోనని చూస్తున్నా. దేన్నుంచయితే గుండె కొట్టుకునే శబ్దంలాంటిది విన్పించిందో, కాంతి కూడా దాన్నుంచే వెలువడుతూ ఉండొచ్చని నా అనుమానం” అంది.

“ఏదో ప్రదేశంలో సముద్రంలోంచి వింత శబ్దాలు వెలువడుతున్నాయని, అవి ఎక్కడినుంచి వస్తున్నాయో ఇప్పటికీ రహస్యంగానే ఉందని ఎక్కడో చదివాను మేడం. మీరు విన్న శబ్దం కూడా అటువంటిదేనేమో” అన్నాడు శంకరన్.

“పందొమ్మిది వందల తొంభై ఏడులో పసిఫిక్ మహాసముద్ర గర్భంలోంచి వింత శబ్దం రావడం గమనించారు. కొన్ని వేల కిలోమీటర్ల వరకు విన్పించేంత పెద్ద శబ్దం.. దానికి ‘ది బ్లూప్’ అని పేరు పెట్టారు. మేఘాలు గర్జించినట్టు, బండరాళ్ళేవో దొర్లుతున్నట్టు విన్పిస్తున్న భయంకరమైన ఆ శబ్దం దేన్నుంచి వస్తుందో చాలా యేళ్ళ వరకు కనుక్కోలేకపోయారు. ఆ రహస్యాన్ని శాస్త్రవేత్తలు తర్వాత కాలంలో ఛేదించారు” అంటూ అధీర ఇంకేదో చెప్పబోతుంటే శంకరన్ అడ్డొస్తూ “కొన్ని వందల టెంటకిల్స్ ఉన్న సముద్ర జంతువేదో బాధతో అరుస్తున్న శబ్దమని చాలామంది అనుకున్నారట కదా మేడం” అన్నాడు.

“అవును. కానీ అది నిజం కాదు, అటువంటి జంతువేదీ సముద్రంలో లేదు. అతి పెద్ద గ్లేసియర్ నుంచి ఐస్‌బర్గ్ విడివడుతున్నప్పుడు ఏర్పడిన శబ్దమని శాస్త్రవేత్తలు తేల్చేశారు. కానీ మరో చోట సముద్ర గర్భంలోంచి వస్తున్న శబ్దం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది” అంది అధీర.

“ఏ సముద్రంలో మేడం? ఎటువంటి శబ్దం?” శంకరన్ ఆసక్తిగా అడిగాడు.

“పందొమ్మిదివందల తొంభై ఒకటిలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ మొదటిసారి ఫసిఫిక్ మహాసముద్రంలోంచి వస్తున్న ఈ శబ్దాన్ని రికార్డ్ చేసింది. అది ఇప్పటికీ విన్పిస్తూనే ఉంది. ఎవరో ఏడుస్తున్నట్టు.. ఆ ఏడుపు క్షణక్షణానికి పెద్దదవుతున్నట్టు.. కొన్ని క్షణాలు మాత్రమే విన్పించి ఆగిపోయే శబ్దం.. అందుకే దానికి ‘ది అప్‌స్వీప్’ అని పేరు పెట్టారు. ఇప్పటికీ దాని సోర్స్ ఏమిటో రహస్యంగానే మిగిలిపోయింది. కానీ వింతగా ఆ శబ్దం వసంత రుతువు, శరదృతువుల్లో చాలా ఎక్కువగా విన్పించడాన్ని గమనించారు.”

కొన్ని క్షణాల విరామం తర్వాత శంకరన్ అన్నాడు. “మేడం.. మీరు విన్న శబ్దం గురించి కూడా నిర్ధారించుకుని ప్రపంచానికి తెలియచేస్తే మీ పేరు చరిత్రపుటల్లో లిఖించబడ్తుంది కదా.”

“శబ్దమేదో వస్తుందని ప్రపంచానికి చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆ రహస్యాన్ని ఛేదిస్తేనేగా తృప్తి” అంది అధీర.

ఆమెకు చప్పున ఏదో ఆలోచన తట్టింది. “నిన్న ఎనిమిది నలభై నిమిషాలకు, తర్వాత మరో పదినిమిషాల విరామం తర్వాత విన్పించిన శబ్దం ఆ తర్వాత ఎందుకు విన్పించలేదో మొదట మనం తెల్సుకోవాలి. పదండి మనం కమాండ్ సెంటర్ బ్రిడ్జ్ రూంకి వెళ్తాం” అంది.

ఫస్ట్ న్యావిగేషన్ ఆఫీసర్ దగ్గరకెళ్ళి “నిన్న రాత్రి ఎనిమిది నుంచి ఇప్పటివరకు ఓడ ప్రయాణించిన రూట్ చూపించండి” అంది.

కంప్యూటర్ స్క్రీన్ మీద కన్పిస్తున్న ఓడ రూట్ మ్యాప్‌ని నిశితంగా పరిశీలించింది. పశ్చిమదిశగా ప్రయాణిస్తున్న ఓడ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు దక్షిణదిశగా ప్రయాణించి మళ్ళా అక్కడినుంచి పశ్చిమ దిశకు మళ్ళింది.

“ఎందుకు రెండు గంటలు దక్షిణదిశగా ప్రయాణించాల్సి వచ్చింది?” అని అడిగింది.

“పశ్చిమదిశలో మనం వెళ్తున్న దారిలో చాలా పెద్ద గ్లేసియర్ ఉన్నట్టు హల్మీద ఏర్పాటు చేసిన మల్టీబీమ్ సోనార్ సిస్టం పంపిన పింగ్స్ ద్వారా తెల్సింది. అందుకే దక్షిణ దిశగా కొంత దూరం ప్రయాణించి, మళ్ళా పశ్చిమ దిశకు మళ్ళించాం” అన్నాడు.

అధీరకు ఏం జరిగిందో అర్థమైపోయింది. దక్షిణదిశగా రెండుగంటలు ప్రయాణించిన ఓడ అన్‌నోన్ సోర్స్ నుంచి వస్తున్న శబ్దం లీలగానైనా విన్పించేంత దూరానికి చేరుకుంది. మళ్ళా పశ్చిమదిశగా ప్రయాణించడంతో ఆ శబ్దాన్ని అందుకోలేకపోయింది.

“మన అంజలిక ఎంత స్పీడ్‌తో ప్రయాణిస్తోంది?” అని అడిగింది.

“పన్నెండు నాటికల్ మైల్స్” అన్నాడు.

“నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర నుంచి ఇప్పటివరకు స్పీడ్‌లో హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా?”

“లేవు. స్థిరమైన వేగంతో ప్రయాణిస్తున్నాం” అన్నాడు.

అధీర మనసులోనే లెక్క వేసుకుంది. ఇప్పుడు సమయం ఎనిమిదిన్నర. అంటే ఆ స్పాట్ నుంచి ఇరవై నాలుగు గంటలు ప్రయాణించింది. అంటే 288 నాటికల్ మైల్స్. అంటే 534 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే గాని ఆ స్పాట్‌ను చేరుకోలేరు.

కెప్టన్‌ను సమీపించి అతనికి విషయం వివరించింది. “నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు షిప్ ఏ ప్రాంతంలో ఉందో అక్కడికి వెళ్ళాలి. షిప్‌ని వెనక్కి తిప్పండి” అంది.

(ఇంకా ఉంది)

Exit mobile version