[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అధీర ఆదేశాల మేరకు ఓడ వెనక్కి మళ్ళి, తూర్పు దిశవైపు వెళ్తుంది. చాలా దూరం ప్రయాణించి ఆ శబ్దం వినిపించిన చోటుకి చేరుకుంటుంది. శబ్దం పది నిమిషాల కొకసారి వినబడుతోంది, వూదా రంగు కాంతి పుంజం పదిహేను నిమిషాల కోసారి కనబడుతోంది. మల్టీ బీమ్ సోనార్స్ పంపిన పింగ్స్ సాయంతో ఆ వెల్తురు 6476 మీటర్ల లోతులో సముద్రం అడుగున ఉన్న గుండ్రటి పెద్ద బంతిలాంటి సోర్స్‌నుంచి వస్తుందని నిర్థారించుకుంటారు. స్పార్కిల్ రోబోట్ 4500 మీటర్ల లోతు వరకే వెళ్ళగలదు కాబట్టి, డీప్‌సీ ఎక్స్‌ప్లోరేషన్ సబ్‌మెర్సిబుల్ టినోసాలో క్రిందకి దిగాలని నిర్ణయిస్తుంది అధీర. అసిమా, శంకరన్ లతో టినోసాలో ప్రవేశిస్తుంది. సముద్రం అడుగుకి టినోసా దిగుతుండగా, అధీరా, అసిమా, శంకరన్‍లు ఆ శబ్దం గురించి, కాంతి గురించి మాట్లాడుకుంటారు. కొన్ని గంటలు ప్రయాణించి ఆ సోర్స్ సమీపానికి చేరుకుంటారు. రెండు వందల మీటర్ల దూరానికి వచ్చకా, విజువల్స్ చూస్తే, బంగారు రంగుతో గ్లోబ్‌ఆకారంలో ఉన్న వస్తువేదో కన్పిస్తుంది. దానికి దగ్గరగా పోనివ్వమంటుంది కెప్టెన్‌ని. సబ్‌మెర్సిబుల్ టినోసా ఆ వింత పదార్థానికి రెండు మీటర్ల ఎడంగా నిలబడుతుంది. గుండ్రంగా బాస్కెట్‌బాల్‌అంత సైజులో బంగారపు రంగులో మెరుస్తున్న ఆ పదార్థం అన్ని వైపులకు వూదా రంగు కాంతిని ప్రసరిస్తోంది. సాఫ్ట్ గ్రిప్పర్స్ ఉన్న రోబోటిక్ హ్యాండ్‌ని ఉపయోగించి గోల్డెన్ గ్లోబ్‌లా కన్పిస్తున్న దాన్ని సేకరించి, సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న బయో కంటైన్‌మెంట్ క్యాప్సూల్‌లో భద్రపరిచారు. క్యాప్సూల్ లోకి తీసుకోగానే దాన్ని గ్రహించినట్టు గోల్డెన్ గ్లోబ్ సంకోచించి మళ్ళా వ్యాకోచిస్తుంది. అధీర, అసిమా కలిసి గోల్డెన్ గ్లోబ్ ద్రవ్యరాశిని ప్రత్యేకమైన పరికరంతో కొలిచే ప్రయత్నం చేస్తారు. చాలా తక్కువ పరిమాణం చూపిస్తుంది. ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి నిజంగానే జీరోపాయింట్ జీరో జీరో వన్ అయితే అది దేన్ని సూచిస్తుందా అని అధీర ఆలోచిస్తుంది. టినోసా పైకి చేరుకుంటుంది. క్రేన్‌తో సబ్‌మెర్సిబుల్‌ని ఓడ డెక్‌మీదికి చేర్చారు. హైపర్ బారిక్ బయో కంటైన్‌మెంట్ క్యాప్సూల్‌లో ఉన్న గోల్డెన్ ఎగ్‌ని జాగ్రత్తగా తీసుకెళ్ళి, ల్యాబొరేటరీలో పెట్టిస్తుంది అధీర. వెంటనే ల్యాబొరేటరీ అంతా కొన్ని క్షణాల సేపు వూదారంగు కాంతితో నిండిపోతుంది. – ఇక చదవండి.]
“మేడం.. మీరో విషయం గమనించారా? సముద్రపు అడుగున ఉన్నప్పుడు ఈ గోల్డెన్ ఎగ్ నుంచి కాంతితో పాటు శబ్దం వెలువడేది కదా. ఇప్పుడా శబ్దం ఆగిపోయింది. కాంతి కూడా అంతటి శక్తివంతంగా వెలువడటం లేదు. కేవలం ఓ మీటర్ దూరానికి పరిమితమయ్యేంతగా బలహీనపడింది” అన్నాడు శంకరన్.
“నిజమే. కారణం ఏమిటో అర్థం కావడం లేదు. సముద్రం అడుగున ఆరువేల ఐదువందల మీటర్ల లోతున ఒత్తిడి దాదాపు 650 బార్లు ఉంటుంది. అంటే తొమ్మిదివేల నాలుగు వందల ఇరవై ఐదు పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ప్రెషర్. మనం దాన్ని ఉంచిన హైపర్‌బారిక్ బయో కంటైన్‌మెంట్ క్యాప్సూల్‌లో కూడా దాదాపు అంతే ఒత్తిడి ఉండేలా, ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దాని స్థానం మారినా దాని ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశంలేదు” అంది అధీర.
“మనకు దాని గుండె కొట్టుకునే శబ్దంలా విన్పించింది. ఇప్పుడు ఆగిపోయిందంటే అదిప్పుడు బతికి లేదేమో మేడం” అన్నాడు శంకరన్.
అధీర ట్రాన్స్‌పరెంట్‌గా ఉన వైపు క్యాప్సూల్ మీద చేయి ఉంచింది. వెంటనే గోల్డెన్ ఎగ్ దాన్ని గ్రహించినట్టు కొద్దిగా సంకోచించింది. చేయి తీసేయగానే వ్యాకోచించి, యథాస్థితికి చేరుకుంది.
“ఇది బతికే ఉంది. అసలు ఈ జీవిలో ఏమేం అవయవాలు ఉన్నాయో పరిశోధిస్తే గాని మనకో అవగాహన ఏర్పడదు” అంది అధీర.
“అంటే మీ ఉద్దేశంలో ఈ జీవిలో గుండె ఉండే అవకాశం లేదంటారా?” అన్నాడు శంకరన్.
“రక్తం లేదా హీమోలింఫ్ ద్రవం శరీరభాగాల్లోకి చేరాలంటే తప్పకుండా గుండెలాంటి అవయవం అవసరం. కానీ అది ఏ రూపంలో ఉందో తెల్సుకోవాలంటే ఈ జీవిని డిసెక్ట్ చేయక తప్పదు. మామూలుగా నీళ్ళలోంచి ఆక్సిజన్‌ని పీల్చుకోడానికి సముద్ర జీవులకు గిల్స్ ఉంటాయి. దీనికి గిల్స్ లేవు. అంటే బహుశా జెల్లీఫిష్, సీ కుకుంబర్స్‌లా ఇది కూడా నేరుగా డిఫ్యూజన్ ద్వారా ఆక్సిజన్‌ని గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ని విడుదల చేస్తుందేమో. అటువంటప్పుడు గుండె ఉండాల్సిన అవసరం లేదు” అంది అధీర.
“మరి గుండె కొట్టుకునే శబ్దంలాంటిది ఈ జీవినుంచి ఎలా వెలువడిందంటారు? అదిప్పుడు ఎందుకు ఆగిపోయిందంటారు?”
“కొన్ని జీవులు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్ని రకాల శబ్దాల్ని పుట్టిస్తాయి. ఈ జీవి కూడా ఏదైనా ప్రమాదంలో ఉండి అటువంటి శబ్దాల్ని వెలువరించిందేమో.”
“ఇప్పుడా శబ్దాలు విన్పించడం లేదంటే ప్రమాదం తొలగిపోయినట్లా?”
అధీరకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అదే సమయంలో గోల్డెన్ ఎగ్‌లో ప్రకంపనలు కన్పించాయి. వూదా రంగు కిరణాలు ల్యాబ్ గోడల మీద రకరకాల ఆకృతుల్ని సృష్టించసాగాయి.
“ఏంటది? ఏంజరుగుతోంది?” అందరూ కంగారు పడుతూ గోల్డెన్ ఎగ్ వైపు, అది చిత్రిస్తున్న క్లిష్టమైన ఆకృతుల వైపు చూడసాగారు.
అధీర కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పింది. “అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.”
“మనతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం దానికేముంది? నాకెందుకో భయమేస్తోంది. దాన్నుంచి వెలువడుతున్న వూదా రంగు కిరణాల వల్ల మనకేమైనా హాని జరుగుతుందేమో. వాటిలో మనకు తెలి యని వైరస్ ఏమైనా ఉండొచ్చు. ప్రస్తుతం గోడమీద పడ్తున్న కాంతి కొంత సమయం తర్వాత మన శరీరాల మీద కూడా పడి, మనలోపల ఏమైనా మార్పులు చేస్తుందేమో” అసిమా ఛటర్జీ కళ్ళు భయంతో విప్పారాయి.
“నేనలా అనుకోను. అది మనకు నష్టం చేయాలనుకుంటే మనం దాన్ని క్యాప్సూల్‌లోకి తీసుకుంటున్న సమయంలోనే చేసి ఉండేది. ఇలా వూదారంగు ఆకృతులను నిర్మించడంలో అది మనకేదో చెప్పాలనుకుంటోంది. మన నుంచి ఏదో కోరుకుంటోంది” అంది అధీర.
“ఏం కోరుకుంటోంది?” శంకరన్ గొంతు కూడా భయంతో వణికింది. “కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో ఇలాంటి ఏలియన్ ఎగ్స్ విధ్వంసం సృష్టించడం, ప్రాణాల్ని హరించడం చూశాం కదా మేడం” అన్నాడు.
“మనకు హాని కలిగించే ఉద్దేశం దానికి ఖచ్చితంగా లేదు. నిరపాయకరమైన జీవి. నేను హామీ ఇస్తున్నాను” అంది అధీర.
అదే సమయంలో గోల్డెన్ ఎగ్‌లో మళ్ళా ప్రకంపనలు కన్పించాయి. వూదా రంగు ఆకృతులు కొత్తవి ప్రత్యక్షమైనాయి.
“మీరన్నది నిజమే. అది మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ ఆకృతుల భాషని డిసైఫర్ చేయడం ఎలా?” అధీరతో అన్నాడు యం.కె. రావు.
మళ్ళా వూదారంగు చిత్రాలు మారిపోయాయి.
“అది మనం మాట్లాడుకుంటున్న మాటలకు స్పందించి, ఆకృతుల్ని ఏర్పాటు చేస్తుంది గమనించారా? అంటే మన భాష దానికి అర్థమౌతోంది. మనం వెలిబుచ్చుతున్న అనుమానాలకు అది సమాధానాలు వూదారంగు చిత్రాల రూపంలో ఇస్తోందనిపిస్తోంది” అన్నాడు యం.కె. రావు.
అతని మాటలు వినగానే శంకరన్ మరింత భయపడిపోయాడు. “సముద్రం అట్టడుగున పడిఉన్న ఈ జీవికి మనం ఎన్నో యేళ్ళు కష్టపడితే గాని పట్టుబడని ఇంగ్లీష్ భాష ఎలా అర్థమౌతోంది మేడం? దీనికేమైనా అతీంద్రియశక్తులు ఉన్నాయేమో? మనం ఏ భాషలో మాట్లాడినా దానికున్న మంత్రశక్తుల వల్ల అర్థం చేసుకుంటుందేమో” అన్నాడు.
మళ్ళా వూదారంగు చిత్రాలు మారి కొత్తవి కన్పించసాగాయి.
“చూశారా నేను ఏం మాట్లాడానో దానికి అర్థమైంది. దానికి సమాధానం చిత్రాల రూపంలో చూపిస్తోంది. తమిళ్‌లో మాట్లాడి చూస్తాను అర్థం చేసుకుంటుందో లేదో” అన్నాడు శంకరన్.
“వూంగలిదమిరుందు ఏన్ శత్తం వరవిల్లరు?” గోల్డెన్ ఎగ్ వైపు చూస్తూ అన్నాడు.
వెంటనే వూదారంగు చిత్రాల్లో మార్పు చోటు చేసుకుంది.
“అమ్మో.. దీనికి తమిళ్ కూడా తెలుసు. ప్రపంచంలోని అన్ని భాషలూ తెల్సినట్టుంది. అదెలా సంభవం? ఇది చాలా డేంజరస్ జీవి అన్పిస్తోంది. మనం దీన్ని సముద్రంలోకి విసిరేయడం మంచిది” అన్నాడు శంకరన్.
అధీర ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.
“ఇంతకూ దాన్ని ఏమడిగారో మొదట మాకు చెప్పండి” అన్నాడు యం.కె. రావు.
“నీ నుంచి ఏ శబ్దమూ రావడం లేదెందుకు? అని అడిగాను. అది సముద్రంలోపల ఉన్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేసి మనల్ని భయపెట్టిందిగా” అన్నాడు శంకరన్.
“భయపెట్టిందా? హెచ్చరించిందా? లేకపోతే బాధతో అరిచిందా?” అంది అసిమా ఛటర్జీ.
“అది సహాయం కోసం అర్థింపు కూడా కావొచ్చు” అన్నాడు యం.కె. రావు.
“అది సముద్రతల్పం మీద ఉన్నప్పుడు శబ్దం చేసి, మనం దాన్ని సంగ్రహించగానే శబ్దం చేయడం ఆపేసిందంటే అర్థం అది ఆశించిన ఫలితం దక్కిందని. అంటే అది శబ్దం చేయడంలో ఉద్దేశం తన ఉనికిని తెలపడంతో పాటు దాన్ని మనం సముద్రం నుంచి బైటికి తీసుకురావాలనే” అంది అధీర.
“అంటే ఎస్‌ఓయస్ సిగల్ అన్నమాట” అన్నాడు నవ్వుతూ యం. కె. రావు.
“ఎందుకు? సముద్రం లోపల దానికేం కష్టం వచ్చింది? అది పుట్టి పెరిగిందే సముద్రం లోపల కదా. ఇదేదో మనం నవ్వుకుని లైట్‌గా తీసుకునే విషయం కాదనిపిస్తోంది. ప్రమాద హెచ్చరికలా అన్పిస్తోంది. ఓ ఇంగ్లీష్ సినిమాలో చూశాను. దయ్యాలు అందమైన స్త్రీ రూపంలో మనుషుల్ని ఆకర్షించి, తర్వాత వాళ్ళను పీక్కు తింటుంటాయి. అలా ఈ వింత జీవి గుండె కొట్టుకునేలాంటి శబ్దంతో మనల్ని ఆకర్షించి, దాన్ని పైకి తెచ్చేలా చేసి, తన రక్త దాహాన్ని తీర్చుకోబోతుందేమో. ఇది గోల్డెన్ ఎగ్ కాదు. గోల్డెన్ డీమన్” అన్నాడు శంకరన్.
“మీరు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అందులో కూడా హారర్ సినిమాలంటే ఇష్టమనుకుంటాను” అంది అధీర.
“కరెక్ట్‌గా గెస్ చేశారు మేడం. నాకు హారర్ నవలలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం” కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాడు శంకరన్.
“ఈ జీవి ఏదో ప్రమాదంలో ఉండి మనకు సంకేతాలు పంపినట్టు అన్పిస్తోంది. అది పంపిస్తున్న వూదారంగు డిజైన్స్‌లో దాగున్న కోడ్‌ని డీకోడ్ చేస్తే తప్ప మనకదేంటో అర్థం కాదు” అంది అధీర.
“అది అన్ని భాషల్ని ఎలా అర్థం చేసుకోగలుగుతోంది? నేను బెంగాలీ భాషలో మాట్లాడిన దానికి కూడా స్పందించింది కదా. శంకరన్ చెప్పినట్టు దీన్లో ఏవో అద్భుత శక్తులు ఉండే అవకాశం ఉంది మేడం. దానికేం ప్రమాదం ఉంటుంది? ఉంటే గింటే దానివల్ల మనకు ప్రమాదం ఉండొచ్చు గానీ” అంది అసిమా ఛటర్జీ.
అధీర కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పింది. “అది మనం మాట్లాడే భాషల్ని అర్థం చేసుకుంటున్నదని అనుకోను. ఇన్నాళ్ళూ సముద్రంలో బతికిన జీవికి అన్ని భాషలు తెలిసి ఉండటం అసంభవం. ఎటొచ్చీ అది మన మనసులో కదులాడుతున్న భావాల్ని అర్థం చేసుకోగలుగుతుందేమో అన్పిస్తోంది” అంది అధీర.
“అంటే మన మెదళ్లో రూపుదిద్దుకున్న ఆలోచనలు మాటల రూపంలో వెలువడకముందే దానికి తెలిసిపోతున్నాయంటారు. అంతేనా? అదైనా ఎలా సంభవం? అటువంటి శక్తిని ఇప్పటివరకు మనుషులు కూడా సాధించలేకపోయారు కదా” అన్నాడు యం.కె. రావు.
“ఆ విషయం గురించి మనం మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అసలు దీనికి బ్రెయిన్ అనేది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏ షేప్‌లో ఉంది? దాని శక్తి సామర్థ్యాలేమిటి? ఇత్యాది విషయాలన్నీ తెలుసుకోవాలి. మొదట దాని కోడ్ లాంగ్వేజ్‌ని డీకోడ్ చేయగలవాళ్ళని సంప్రదించడం అవసరం. అదేం చెప్పదల్చుకుంటోందో అర్థమైతే, మనం దీని విషయంలో ఏం చేయాలో అర్థమౌతుంది” అంది అధీర.
వరుసగా మూడు రోజులు దానిమీద అన్నిరకాల నాన్‌ఇన్వేసివ్ టెష్ట్‌లను జరిపారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో కొంత సమాచారం సేకరించగలిగారు. గోల్డెన్ ఎగ్ కణనిర్మాణం శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు తెల్సిన కణ నిర్మాణాలకంటే విభిన్నంగా ఉంది. అది మూడు రకాల కణాలతో నిర్మితమై ఉంది. షడ్భుజి ఆకారంలో ఉండే ఫొటానిక్ వెసికిల్స్ కొన్ని ఉన్నాయి. క్వాంటం ఎన్‌ట్యాంగిల్‌మెంట్‌కి అవసరమైన ప్రొటీన్లతో కూడిన కణాలు మరికొన్ని ఉన్నాయి. దాని అంతర్గత నిర్మాణం ఫొటానిక్ కంప్యూటర్‌లా పని చేస్తోందని, అది ఎలక్ట్రాన్లకు బదులు కాంతి కణాల్ని వాడుకుంటోందని తెల్సుకున్నారు. మూడో రకం కణాల మధ్య సర్క్యూట్స్ ఉన్నట్టు గమనించారు. వాటితో పాటు కణాలమధ్యలో నల్లటి దారాల్లాంటివి ఉండటాన్ని కూడా గమనించారు.
ఆ రోజు రాత్రి డిన్నర్ చేశాక ఎప్పటికి మల్లె అధీర డెక్ మీదకి వెళ్ళి నిలబడి, మల్లెపూలు చల్లిన చాదర్‌లా కన్పిస్తున్న ఆకాశం వైపు చూస్తూ ఆలోచించసాగింది. సృష్టిలో ఎన్ని రకాల విచిత్ర జీవులున్నాయో.. ముఖ్యంగా సముద్రంలోపల ఎన్ని వింతలు దాగున్నాయో.. ఎటొచ్చీ సముద్రం లోపల బాగా అభివృద్ధి చెందిన బుద్ధిజీవులు కూడా ఉంటాయని గోల్డెన్ ఎగ్‌ని చూశాకే తనకు తెలిసొచ్చింది.
జలచరాల్లో డాల్పిన్స్ అన్నిటికన్నా తెలివగలవని ఇప్పటివరకు మనుషులు నమ్ముతూ వచ్చారు. డాల్ఫిన్స్ మెదడు వాటి శరీర పరిమాణానికి ఉండాల్సిన సైజ్ కంటే నాలుగైదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. మెదడు నిర్మాణం కూడా మానవుల్లో భావోద్వేగాలను అర్థం చేసుకోడానికి అవసరమైన నిర్మాణంతో పోలి ఉంటుంది. అవి అద్దంలో చూసుకుని తమని తాము గుర్తించుకోగలవు. అవి బలమైన బంధాల్ని ఏర్పరచుకుంటాయి. సానుభూతిని చూపిస్తాయి. మనుషులు ప్రమాదంలో ఉంటే గుర్తించి, రక్షించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యేకమైన శబ్దాల ద్వారా వేరే డాల్ఫిన్స్‌తో పలకరించుకుంటాయి కూడా. ఆక్టోపస్‌లు కూడా తెలివిగలవే. అవి మనుషుల మొహాల్ని గుర్తుపట్టగలవు. కానీ డాల్ఫిన్స్‌కానీ ఆక్టోపస్‌లు కానీ ఈ గోల్డెన్ ఎగ్‌లా మనుషుల్తో కమ్యూనికేట్ చేయలేవు. అది పంపిస్తున్న వూదారంగు సంకేతాల్ని అర్థం చేసుకుంటే చాలు, జలచరాల్లో అత్యంత తెలివైన జీవజాతిని కనుక్కున్న గౌరవం తనకు దక్కుతుంది.
“గుడ్ ఈవెనింగ్ మేడం” అని విన్పించడంతో ఆలోచనల్లోంచి బైటపడి శబ్దం వచ్చిన వైపు చూసింది. శంకరన్.. కానీ ఎప్పటికిమల్లే అతని మొహంలో నవ్వు లేదు. విషాదానికి ప్రతిరూపంలా కన్పించాడు.
“ఏమైంది శంకరన్? ఎందుకలా దిగులుగా ఉన్నారు? ఆరోగ్యం బాగోలేదా? ఎనీథింగ్ రాంగ్?” అని అడిగింది.
“ఆరోగ్యానికేం బాగానే ఉంది మేడం. కానీ మనసే..” అంటూ ఆగాడు శంకరన్.
“ఏమైంది మీ మనసుకి?”
“నిన్న రాత్రంతా పీడకలల్తో నిద్రలోంచి చాలాసార్లు లేచి కూచున్నాను మేడం.”
“కలల్లో దయ్యాలు కన్పించాయా? బాగా భయపడ్డారా?” నవ్వుతూ అంది అధీర.
“దయ్యాలు కాదు, గోల్డెన్ ఎగ్‌లు.. వందలు కాదు వేలల్లో సముద్రం మీద తేలుతున్నాయి.”
“బంగారు రంగులో మెరిసిపోతూ అందంగా కన్పించి ఉంటాయిగా. మరి భయమెందుకు వేసింది?”
“వాటిని తినడానికి ఓ జలరాక్షసి వచ్చింది. ఎంత భయంకరంగా ఉందో.. దాన్ని చూసి భయపడ్డాను. పాము పక్షి గుడ్లని తినేసినట్టు ఆ జలరాక్షసి గోల్డెన్ ఎగ్‌లను పిప్పర్‌మెంట్లను చప్పరించినట్టు చప్పరిస్తుంటే అవి ‘మమ్మల్ని కాపాడండి’ అంటూ పెద్దగా ఏడుస్తున్నట్టు కూడా కలొచ్చింది.”
“మీరు ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తారనుకుంటాను.”
“అవును మేడం. చాలా సున్నిత మనస్కుడిని. ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తాను. సెల్వీని అంతగా ప్రేమించాను కాబట్టే ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను.”
“అదేమిటి? ఎవరితోనో ప్రేమలో పడినట్టు చెప్పారుగా. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు కూడా చెప్పారు. సెల్వీని ప్రేమించింది నిజమైతే మరొకరి మీద ప్రేమ పుట్టకూడదు కదా.”
“ఆమెను చూసినపుడల్లా నాకు సెల్వీ గుర్తుకు రాబట్టే ప్రేమలో పడ్డాను మేడం.”
“సర్లెండి. మీ ప్రేమ వ్యవహారం గురించి నాకెందుకు. అది మీ వ్యక్తిగత విషయం. ఇప్పుడు దిగులుగా ఎందుకున్నారో చెప్పండి. రాత్రి వచ్చిన పీడకలల్ని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? అవి గుర్తొస్తుంటే మొహంలో భయం కదలాడాలిగానీ విచారం ఎందుకు?”
“వదిలేయండి మేడం. నిజం చెప్పినా మీరు నమ్మరు” ఉదాసీనంగా అన్నాడు.
“మొదట అదేమిటో చెప్పండి. నమ్మాలో నమ్మకూడదో తర్వాత నిర్ణయించుకుంటాను.”
“గోల్డెన్ ఎగ్ నాతో మాట్లాడుతోంది మేడం” ఏదో రహస్యం చెప్తున్నట్టు గుసగుసలుగా చెప్పాడు.
అధీర వెంటనే అప్రమత్తమైంది. అదేదో సరదాగా తీసుకునే విషయం కాదని ఆమెకనిపించింది.
“మాట్లాడుతోందా? ఏం మాట్లాడుతోంది? ఎందుకలా అన్పిస్తోంది? వివరంగా చెప్పండి” అంది.
“ఉదయం కంప్యూటర్ ముందు కూచుని పని చేస్తున్నా ‘మమ్మల్ని రక్షించండి’ అంటూ గోల్డెన్ ఎగ్‌లు ఏడుస్తూ ప్రాధేయపడ్తున్నట్టు మాటలు విన్పిస్తున్నాయి మేడం. భ్రమ కాదు. నిజంగానే మాటలు విన్పిస్తున్నాయి. విన్పించడమంటే ఫిజికల్‌గా శబ్దం విన్పించడం కాదు. మన మెదడులో రూపుదిద్దుకుంటున్న మాటల్ని గోల్డెన్ ఎగ్ ఎలా తెల్సుకుంటుందో అలాగన్న మాట. నా మెదడు లోపలికి గోల్డెన్ ఎగ్ దూరి మాట్లాడుతున్నట్టు.. సరిగ్గా చెప్పలేకపోతున్నాను మేడం. నాకే చాలా అయోమయంగా ఉంది” అన్నాడు.
అతను చాలా బలహీన మనస్కుడు కావటం వల్ల గోల్డెన్ ఎగ్‌ని చూసిన భయంలో భ్రమలకు లోనవుతున్నాడేమో అన్పించిందామెకు.
కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శంకరన్ “నాకు భయమేస్తోంది మేడం” అన్నాడు.
“భయమెందుకు?”
“నాకు పెద్దపెద్ద నగరాలు, పట్టణాలు కన్పిస్తున్నాయి. రకరకాల పనుల్లో నిమగమైన మనుషులు కన్పిస్తున్నారు. వాళ్ళ మొహాలు అస్పష్టంగా ఉంటున్నాయి. ఏవో గొంతులు విన్పిస్తున్నాయి. అర్థం కాని భాషలో మాట్లాడుకుంటూ.. నవ్వుకుంటూ..”
“అలాంటి కలలు చాలా సహజం. నాక్కూడా కలల్లో అటువంటి దృశ్యాలు కన్పిస్తుంటాయి.”
“కలల్లో కాదు మేడం.. నా మెదళ్ళో.. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏవో పురా జ్ఞాపకాల్లా ఏవేవో దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఎవరెవరివో మాటలు విన్పిస్తున్నాయి. నాకు పిచ్చి పడ్తుందేమోనని భయమేస్తోంది మేడం. స్కిజోఫ్రీనియా అనే మానసికజబ్బులో ఇలాంటి లక్షణాలు కన్పిస్తాయని గూగుల్లో చదివాను” అతని మొహం దిగుల్తో వివర్ణమై కన్పించింది.
“యింకా ఏమేం కన్పిస్తున్నాయి?”
“శిథిలమైపోయిన ఇళ్ళు.. మృతశరీరాలు.. నీళ్ళలో మునిగిపోయిన నగరాలు, పట్టణాలు..”
“ఇదేమీ మానసిక జబ్బుకాదు శంకరన్ గారు. గోల్డెన్ ఎగ్‌కి ఏవో శక్తులుండి ఉంటాయని నమ్మినందువల్ల ఏర్పడుతున్న భ్రమలు.. అంతే. ఓ రెండు రోజులు మీరు ల్యాబొరేటరీలోకి రాకండి. గోల్డెన్ ఎగ్ గురించి ఆలోచించకండి. ఇవన్నీ తగ్గిపోతాయి” అంది అధీర.
“అంతేనంటారా లేకపోతే గోల్డెన్ ఎగ్‌లోంచి వచ్చే వూదారంగు కాంతి నా మెదణ్ణి తన ఆధీనంలోకి తీసుకుందా?”
“ఇంపాజిబుల్. అదే నిజమైతే ల్యాబ్‌లో దానికి సమీపంగా గడిపిన మా అందరి మెదళ్ళు కూడా ప్రభావితం కావాలిగా. థింక్ లాజికల్లీ మిస్టర్ శంకరన్” అంది అధీర.
“నిజమే కదా. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? మీతో మాట్లాడాక నా భయం తగ్గింది మేడం. నాకేమీ మానసిక రుగ్మతలు లేవు. ఐయాం నార్మల్” అన్నాడు.
“మీక్కనిపించిన సెల్వీలాంటి స్త్రీ గురించి ఈ రాత్రి ఆలోచిస్తూ పడుకోండి. పీడకలలు రావు” అంది నవ్వుతూ అధీర.
(ఇంకా ఉంది)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
