Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వూదారంగు సముద్రం-5

[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గోల్డెన్ ఎగ్ సముద్రం అడుగున ఉన్నప్పుడు కాంతితో పాటు శబ్దం వెలువడేదనీ, ఇప్పుడు శబ్దం వెలువడం లేదనీ, కాంతి కూడా మందగించిందనీ అధీరతో చెప్తాడు శంకరన్. దాని స్థానం మారిన దానికి అనువుగా ఉండే ఏర్పాట్లు చేసినా, దాని ప్రవర్తనలో తేడా ఎందుకు వచ్చిందో అధీరకి అర్థం కాదు. ఒకవేళ అది బ్రతికిలేదేమో అని అంటాడు శంకరన్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన వైపు క్యాప్సూల్‌ మీద అధీర చేయి ఉంచగానే గోల్డెన్‌ ఎగ్‌ దాన్ని గ్రహించి, సంకోచించి, వ్యాకోచిస్తుంది. దాంతో అది బతికే ఉందని తెలుస్తుంది. ఈ జీవిలో ఏయే అవయవాలున్నాయో పరిశీలించాలని అంటుంది అధీర. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే  గోల్డెన్ ఎగ్ లోంచి రకరకాల ఆకృతులు వెలువడి ల్యాబ్ గోడల మీద కనబడసాగాయి. వాటిని చూసి, అది తమకేదో చెప్పాలని అనుకుంటోందని అంటుంది అధీర. అసిమా ఛటర్జీ భయపడుతుంది. అది తమకు హాని చేయదని నమ్మకంగా చెప్తుంది అధీర. మళ్ళీ కొత్త ఆకృతులు కనబడతాయి. తమ మాటలకు అది స్పందిస్తోందని అంటాడు యం.కె. రావు. ఈసారి శంకరన్ భయపడతాడు. దానికేమయినా మంత్రశక్తులున్నాయోమో అంటాడు. మళ్ళీ కొత్త ఆకృతులు వెలువరిస్తుంది గోల్డెన్ ఎగ్. ఈసారి తమిళంలో మాట్లాడి అది తన మాటలు అర్థం చేసుకుంటుందో లేదో చూస్తనంటాడు. దానికి తమిళంలో ఏదో చెప్తాడు. వెంటనే వూదా రంగు చిత్రాల్లో మార్పులు వస్తాయి. అది ప్రమాదకరమైన జీవి అనీ, వెంటనే దాన్ని సముద్రంలో పారేయమని అంటాడు. అసలు దానికి తమిళంలో ఏం చెప్పారని అడుగుతుది అధీర. ఏ శభ్దము ఎందుకు రావడం లేదని అడిగానని చెప్తాడు. అందరూ మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. రాత్రి డిన్నర్ చేశాక, అధీర వెళ్ళి డెక్ మీద నిల్చుంటుంది. కాసేపటికి శంకరన్ వచ్చి పలకరిస్తాడు. తనకి  పీడకలలు వస్తున్నాయనీ, గోల్డెన్ ఎగ్ తన మెదడులోకి దూరి, తనని కాపాడమని చెప్తున్నట్టు అనిపిస్తోందని అంటాడు. తనకి వస్తున్న ఇతర కలల గురించి చెప్తాడు. తనకి కనిపించిన సెల్వీ లాంటి స్త్రీ గురించి ఆలోచిస్తూ పడుకుంటే, పీడకలలు రావని చెప్తుంది అధీర. – ఇక చదవండి.]

ల్యాబొరేటరీ గోడల మీద గోల్డెన్‌ ఎగ్‌ వూదారంగు కాంతితో చిత్రాల్ని నిర్మిస్తున్నప్పుడే వాటిని ఫోటోలు తీసి పెట్టుకుంది అధీర.

“ఎటువంటి మాటలకు రెస్పాన్స్‌గా గోల్డెన్‌ ఎగ్‌ ఏ ప్యాటర్న్‌‌తో స్పందించిందో తెలియచేస్తూ. అమెరికాలో, ఇండియాలో పేరెన్నికగన్న క్రిప్టాలజిష్ట్‌లకు వాటిని పంపించాలనుకుంటున్నాను. వాళ్ళనుంచి వచ్చే డిసైఫర్డ్‌ మెసేజెస్‌ చూశాకే గోల్డెన్‌ ఎగ్‌ మనకు ఏం చెప్పాలనుకుంటుందో, మన నుంచి ఏం ఆశిస్తుందో తెలుస్తుంది” అంది అధీర.

“వాళ్ళు చాలా సమయం తీసుకుంటారు మేడం. ఒకే ప్యాటర్న్‌ని వేర్వేరుగా డిసైఫర్‌ చేసే అవకాశం కూడా ఉంది. అవి మనల్ని కన్‌ఫ్యూజ్‌ చేయవచ్చు” అంది అసిమా ఛటర్జీ.

“మనకంత సమయం లేదు. గోల్డెన్‌ ఎగ్‌ మనతో ఏం చెప్పాలనుకుంటుందో అర్థమైతే తప్ప మనం దీంతో ఎలా వ్యవహరించాలనే విషయంలో స్పష్టత ఏర్పడదు” అంది అధీర.

“నేను ప్రయత్నించి చూడనా?” అంది మేధ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.

“నీకు సీక్రెట్‌ కోడ్స్‌ని డీకోడ్‌ చేయడం కూడా వచ్చా?” అని అడిగింది అసిమా ఛటర్జీ.

“మేడం.. మీరు నన్ను అవమానిస్తున్నారు. ప్రపంచంలోకెల్లా ప్రతిభావంతులైన క్రిప్టాలజిష్ట్‌లనుకుని, నమ్మి అధీర మేడం ఎవరి సహాయమైతే కోరాలనుకుంటుందో, వాళ్ళ కన్నా నేను మేధావిని”

అలా అడిగినందుకు కోపం వచ్చిందనడానికి గుర్తుగా మేధ గొంతులో వచ్చిన మార్పుని అందరూ గమనించారు.

“తవ్వకాల్లో దొరికిన పురాతన శిలాఫలకాల మీద ఉన్న ప్రాచీన లిపిని అర్థం చేసుకోవడంలో ఆర్కి యాలజిష్ట్‌లు, లింగ్విస్ట్‌లు ఏఐల సహాయం తీసుకుంటున్నారని తెలుసు కానీ జామెట్రికల్‌ ప్యాటర్న్స్‌లో దాగున్న కోడెడ్‌ లాంగ్వేజ్‌ని డీకోడ్‌ చేసే సామర్థ్యం వాటికుందని నాకిప్పటివరకు తెలియదు” అంది అపాలజెటిక్‌గా అసిమా ఛటర్జీ.

“మేధ చెప్పింది నిజం. మనం దాని శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేశాం” అంటూ అధీర మేధ వైపు తిరిగి “సారీ మేధా. గోల్డెన్‌ ఎగ్‌ చిత్రించిన ప్యాటర్న్స్ అన్నింటిని నీకు ఫీడ్‌ చేయిస్తాను. ఎన్నిటిని డీకోడ్‌ చేయగలవో చూడు” అంది.

“ఒకదాన్ని డీకోడ్‌ చేయగలిగితే చాలు మేడం. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి” అంది మేధ.

“శంకరన్‌ గారూ.. క్రిప్టాలజిష్ట్‌లకు పంపాలనుకున్న ప్యాటర్న్‌లన్నీ మేధకు సప్లయ్ చేయండి” అంది అధీర.

అరగంట తర్వాత మేధ గొంతు విన్పించింది. “మేడం.. వూదారంగు ఆకృతుల్లో సగానికి పైగా ఒకేలా ఉన్నాయి. గోల్డెన్‌ ఎగ్‌ ఆ ఆకృతుల్ని పదేపదే పంపించి ఉంటుందనిపిస్తుంది. దాన్ని డీకోడ్‌ చేయగలిగాను.”

అధీర ఒక్కంగలో మేధని సమీపించి, “ఏంటది? గోల్డెన్‌ ఎగ్‌ అదే మెసేజ్‌ని రిపీటెడ్‌గా పంపించిందంటే అర్థం అది చాలా ముఖ్యమైన మెసేజ్‌ అయి ఉండాలి” అంది.

“అవును మేడం. నేను డీకోడ్‌ చేసిన ఆ మెసేజ్‌ అర్థం ‘ప్లీజ్‌ సేవ్‌ మీ’. అదే మెసేజ్‌ని పదేపదే పంపిస్తున్నదంటే అర్థం గోల్డెన్‌ ఎగ్‌ ఏదో ఆపదలో ఉంది. అది తక్షణ సహాయం కోసం అర్థిస్తోంది. మీరు దాని మెసేజ్‌ని అర్థం చేసుకోలేకపోతున్నందుకు కలుగుతున్న అసహనంతో పాటు దేనివల్లనో అది అనుభవిస్తున్న బాధ కూడా ఆ మెసేజెస్‌లో మిళితమై ఉంది” అంది మేధ.

“దేన్నుంచి రక్షించమని అడుగుతుందో అర్థమైతేనే కదా మనమేదైనా చేయగలం? అది పడ్తున్న బాధేమిటో దానిక్కారణమేమిటో తెలియకుండా ఏం చేయగలం?” అంది అధీర.”నన్ను కూడా ల్యాబ్‌లోకి తీసుకెళ్ళండి మేడం. ఇదే ప్రశ్నని మీరు గోల్డెన్‌ ఎగ్‌ని అడగండి. అది వూదా రంగు ఆకృతులతో ఇచ్చే సమాధానాన్ని నేను డీకోడ్‌ చేసి మీకు చెప్తాను” అంది మేధ.

“మేడం.. నాకొచ్చిన కలల గురించి మీకు చెప్పాను గుర్తుందా? కొన్ని వందల గోల్డెన్‌ ఎగ్‌లు ‘రక్షించండి’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్తున్నట్టు వచ్చిన కల. ఇప్పుడర్థమైందా? అది కల కాదు. నిజంగానే గోల్డెన్‌ ఎగ్‌ తన వూదా రంగు కిరణాల్ని నా మెదళ్లోకి పంపించి, మనకర్థమయ్యే భాషలో చెప్పి ఉంటుంది” అన్నాడు శంకరన్‌.

అధీరకు అతను చెప్తున్న దాన్లో నిజముందేమోనని ఓ క్షణం అన్పించింది. కానీ లాజికల్‌గా ఆలోచిస్తే అది కేవలం అతని భ్రమ అయి ఉండొచ్చనిపించింది. ఒకవేళ గోల్డెన్‌ ఎగ్‌ ఒకరి మెదళ్లోకి దూరి తన మెసేజెస్‌ అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే అది తన మెదళ్లోకి కదా దూరాలి. అయినా అదెలా సాధ్యపడ్తుంది? మనిషి మెదళ్ళలోకి దూరి సంభాషించడం అసంభవం. కానీ వెంటనే మరో ఆలోచన కూడా వచ్చింది. మనుషుల మెదళ్ళలోని భావాల్ని అర్థం చేసుకుని, వాటికి సమాధానాల్ని ప్యాటర్న్‌ల రూపంలో పంపగలిగిన దానికి అది కూడా సాధ్యమేనేమోనని.

అధీర తన సహ శాస్త్రవేత్తలతో కలిసి, మేధని తీసుకుని ల్యాబొరేటరీలోకి ప్రవేశించింది. వాళ్ళు లోపలికి రావడాన్ని గుర్తించినదానికి గుర్తుగా గోల్డెన్‌ ఎగ్‌ క్షణకాలం సంకోచించి, వ్యాకోచించింది.

“నువ్వు రక్షించమని అడుగుతున్నావన్న విషయం మాకర్థమైంది. ఇంతకూ దేన్నుంచి నిన్ను రక్షించాలి? దేని వల్ల నీకు ప్రమాదం ఏర్పడింది?” అని అడిగింది అధీర.

గోల్డెన్‌ ఎగ్‌ ల్యాబ్‌ గోడల మీద వూదారంగు చిత్రాలతో సమాధానమిచ్చింది.

మేధ ఆ ప్యాటర్న్‌లను విశ్లేషించాక చెప్పింది. “నాకు తెలియదు. నాలోకి ఏదో ప్రవేశించింది. నా ప్రతి కణం మధ్యలో అది నివాసం ఏర్పర్చుకుంది. అది ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలియదు. విపరీతమైన బాధను అనుభవిస్తున్నాను. నన్ను దాన్నుంచి రక్షించండి. దాన్ని నాలోంచి తీసేయండి.”

అధీర మళ్ళీ ప్రశ్నించింది. “నీలోకి ప్రవేశించింది బ్యాక్టీరీయా వైరస్‌లాంటి జీవినా?”

మేధ సమాధానం చెప్పింది.

“తెలియదు. బ్యాక్టీరియా వైరస్‌లంటే ఏమిటో తెలియదు.”

“అది లోపలికి ప్రవేశించి ఏం చేస్తుంది?”

“కణజాలాన్ని మెల్లమెల్లగా తినేస్తుంది.”

“నీతో పాటు సముద్రంలోపల ఉన్న మీ జాతి జీవుల్లో కూడా ప్రవేశించిందా?”

“అవును. ప్రవేశించింది.”

“మరి నీతో పాటు వాటిని కూడా రక్షించాల్సిన అవసరం ఉంది కదా.”

“లేదు.”

“ఎందుకు లేదు.”

“ఏవీ బతికి లేవు. అన్నిటినీ తినేసింది. నేనే మిగిలున్నాను. దాన్ని బైటికి తీయకపోతే నన్ను కూడా తినేస్తుంది. నన్ను రక్షించండి. మా జాతి జీవరాశిలో బతికున్న చివరి జీవిని నేను. నేను చనిపోతే కొన్ని కోట్ల సంవత్సరాలుగా సముద్రంలో నివాసముంటున్న మా జాతి ఆనవాళ్ళు లేకుండా మాయమైపోతుంది.” అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి గోల్డెన్‌ ఎగ్‌ వూదా రంగు చిత్రాల్ని గీయడం లేదన్న విషయం అధీర గమనించి, ఆశ్చర్యంగా మేధ వైపు చూసింది.

“నువ్వు వూదారంగు ప్యాటర్న్స్‌ని డీకోడ్‌ చేసి కదా సమాధానాలు చెప్పాలి. నేనడిగేవాటికి నేరుగా నువ్వే సమాధానాలు చెప్తున్నావేమిటి?” అని అడిగింది.

“నాలో ఏదో జరిగింది మేడం. అదేమిటో నాకర్థం కావడం లేదు. నేను ఎవరి ఆధీనంలోకో వెళ్ళి పోయినట్లనిపిస్తోంది. నా మేధస్సులోకి ఎవరో దూరి వాళ్ళ మాటల్ని నా ద్వారా విన్పిస్తున్నట్టనిపిస్తోంది” అంది మేధ.

“మేడం.. మనం గోల్డెన్‌ ఎగ్‌ ఇస్తున్న సమాధానాల మీద దృష్టిని కేంద్రీకరించడం వల్ల ఓ విషయాన్ని గమనించలేకపోయాం. మేధ గొంతులో తేడాని గుర్తించారా? మనకు పరిచితమైన మేధ గొంతు కాదది. ఇట్‌ వాస్‌ మోర్‌ హ్యూమన్‌” అన్నాడు శంకరన్‌.

“నిజమే. మేధ వాయిస్‌ చాలా తేడాగా ఉండింది” అంది అసిమా ఛటర్జీ.

అధీర గోల్డెన్‌ ఎగ్‌ వైపు తిరిగి, “వూదా రంగు ప్యాటర్న్‌ల కోడ్‌ భాషలో చెప్పకుండా నేరుగా మేధ ద్వారా మాట్లాడింది నువ్వేనా?” అని అడిగింది.

“నేనే. అలా చేయడం వల్ల మీకు సులభంగా అర్థమౌతుందని” మళ్ళా మేధ నుంచే సమాధానం వచ్చింది.

“ఎలా చేయగలిగావు?”

“నా మెదడులోని నాడీకణజాలం సహాయంతో దాని మెదడులోని నాడీకణజాలంతో అనుసంధానమైనాను.”

“అంటే తన మెదడులోని న్యూరాన్స్‌తో మేధలో ఉన్న ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ని ప్రభావితం చేసిందన్న మాట” అన్నాడు యం. కె. రావు.

“అలా చేయడం నీకెలా సాధ్యపడింది?” అడిగింది అధీర.

“ఏమో తెలియదు.”

“అసలు నీ మెదడు నీ శరీరంలో ఏ భాగంలో ఉంది?”

“ప్రతి చోటా ఉంది.”

“అర్ధమయ్యేలా చెప్పు.”

“నా ప్రతి కణంలో ఉంది.” మేధనుంచి వెలువడిన ఆ మాటలు విన్న శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి గోల్డెన్‌ ఎగ్‌ వైపు చూశారు.

“ప్రతి కణంలోనా? ఆ లెక్కన నీకు ఎన్ని మెదళ్ళు ఉన్నట్టు?” శంకరన్‌ అడిగాడు.

“కొన్ని వేల మెదళ్ళు. అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి.”

“నీ శరీరంలోపల ఉండి నిన్ను తినేస్తున్నదేమిటో తెల్సుకోవాలంటే నిన్ను తెరిచి చూడాల్సి వస్తుంది. దానివల్ల నీకు ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు” అంది అధీర.

“నా శరీరాన్ని రెండు ముక్కలు చేసినా ప్రాణం పోదు. ఎన్ని ముక్కలు చేసినా ప్రాణం పోదు. దాని క్కారణం ప్రతి కణం ఒంటరిగా కూడా ప్రాణంతో మనగలుగుతుంది. అందుకేగా యింకా బతికే ఉన్నాను. నన్ను తినేస్తున్నదేదో నా చివరి కణాన్ని తినేవరకు బతికే ఉంటాను. మీరు చేయాలనుకున్నది చేయండి. నన్ను రక్షించండి” మేధ నుంచి సమాధానం వచ్చింది.

“నీ శరీరం చిన్న చిన్న ముక్కలుగా విభజించబడ్డాక అవి వేర్వేరు జీవులుగా బతుకుతాయా?” యం.కె. రావు అడిగాడు.

“అవన్నీ కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. అలా కలవడానికి అవకాశం లేనపుడే స్వతంత్రంగా బతుకుతాయి.”

“భలే ఉంది. భారతంలో చదివినట్టు గుర్తు. జరాసంధుడి శరీరాన్ని రెండుగా చీల్చినా, అవి మళ్ళా అతుక్కుంటాయని. ఈ గోల్డెన్‌ ఎగ్‌ జలచర జరాసంధుడన్న మాట. ఇంతకూ నువ్వు మగా ఆడా?” అని అడిగాడు శంకరన్‌.

“రెండూను” అంటూ సమాధానమొచ్చింది.

“అదెలా సంభవం? మీలో ఆడా మగా అంటూ వేర్వేరుగా ఉండవా?” ఆశ్చర్యపోతూ అడిగాడు శంకరన్‌.

దానికి జవాబు మళ్ళా అధీరనే చెప్పింది. “వాటిని హెర్మాఫ్రోడైట్స్‌ అంటారు మిస్టర్‌ శంకరన్‌. స్టార్‌ ఫిషెస్‌, సీ అర్చిన్స్‌లాంటివి ద్విలింగ అమరికను కలిగి ఉంటాయి. అంటే స్త్రీ పురుష జననేంద్రియాలు కలిగి ఉంటాయి. పునరుత్పత్తి చేయాలంటే మరో దాంతో సంపర్కం చెందాల్సిన అవసరం ఉండదు.”

“ఎందుకలా?”

“కొన్ని జీవరాశులు చురుగ్గా కదల్లేవు. కొన్ని ఒకేచోట అతుక్కుని, నిశ్చలంగా ఉంటాయి. అటువంటివాటికి సంతానోత్పత్తి చేయడానికి ఆపోజిట్‌ సెక్స్‌ పార్టనర్‌ దొరకడం కష్టమౌతుంది. ఆ సమస్యకు పరిష్కారమే హెర్మాఫ్రోడైట్‌ జీవులు. అవి ఒకే సమయంలో ఆడ, మగ పాత్రల్ని పోషించగలవు.”

“నాకో అనుమానం మేడం. ఈ గోల్డెన్‌ ఎగ్‌ తనొక్కటే బతికున్నట్టు చెప్తుంది కదా. దీన్ని రక్షించి మనం సముద్రంలో వదిలేసినా ఇదొక్కటే పునరుత్పత్తి చేయగలుగుతుందా?” శంకరన్‌ మరో ప్రశ్నని సంధించాడు.

దానికి మేధ నుంచి సమాధానం లభించింది. “మేము సెల్ప్‌ ఫెర్టిలైజేషన్‌ చేసుకోగలం.”

అధీర ల్యాబ్‌ నుంచి బైటికి వచ్చాక, మిగతా శాస్త్రవేత్తల వైపు ‘ఏం చేద్దాం?’ అన్నట్టు చూసింది.’

‘ఆపరేషన్‌ చేసి, దాని శరీరంలో దాగున్న ఆ విలన్‌ని బైటికి తీయడమే పరిష్కారం” అన్నాడు యం.కె. రావు.

“దాన్ని ఆపరేషన్‌ టేబుల్‌ మీదకి తీసుకురాగలం. సముద్రంలోపల అది ఎంత టెంపరేచర్‌లో ఉందో దాన్ని కూడా అందించగలం. కానీ అంతటి ఒత్తిడిని ఎలా సృష్టించగలం? ఆ ఒత్తిడే లేకపోతే అది బతుకుతుందో చస్తుందో కూడా మనకు తెలియదు కదా” అంది అసిమా ఛటర్జీ.

“నిజమే. ఆ విషయం నిర్థారించుకోకుండా తొందరపడటం మంచిది కాదు. రేపు గోల్డెన్‌ ఎగ్‌ని కలిసినపుడు అడుగుదాం” అంది అధీర.

“మేడం. దాన్ని పదేపదే గోల్డెన్‌ ఎగ్‌ అనేబదులు మంచి పేరు పెడ్తే బావుంటుందని నా అభిప్రాయం” అన్నాడు శంకరన్‌.

అధీర నవ్వుతూ “అదేదో మీరే సూచించండి” అంది.”మనం దీన్ని తంగం అని పిలుద్దాం. తంగం అంటే మా తమిళ్‌లో బంగారం అని అర్థం” అన్నా డు శంకరన్‌.

“చెత్తగా ఉంది. కావాలంటే మీరే అలా పిల్చుకోండి. మేము గోల్డెన్‌ ఎగ్‌ అనే పిలుస్తాం” విసురుగా అని అక్కడినుంచి వెళ్ళిపోయింది అసిమా ఛటర్జీ.

“ఆ మేడం గారికి తమిళ్‌ అంటే వ్యతిరేకత ఉన్నట్టుంది. తమిళ్‌, తెలుగు భాషలు పక్కపక్కనేగా ఉంటున్నాయి. మీరేమంటారు మేడం” శంకరన్‌ అధీరను అడిగాడు.

“నాకూ నచ్చలేదు. తమిళ భాషంటే ఇష్టం లేకపోవడం కాదు మిస్టర్‌ శంకరన్‌. పిలవడానికి అందమైన పేరుంటే బావుంటుంది కదా” అంటూ అధీర కూడా అక్కడినుంచి వెళ్ళిపోయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version