Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వూదారంగు సముద్రం-6

[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గోల్డెన్ ఎగ్ సృష్టించిన పాటర్న్స్ అన్నింటిని ఫోటోలు తీసి పెట్టుకుంది అధీర. వాటిని అమెరికాలోనూ, ఇండియాలోను ఉన్న పేరెన్నికగల క్రిప్టాలజిస్టులకి చూపించి అర్థం కనుక్కోవాలనుకుంటుంది. వాళ్ళు చాలా సమయం తీసుకుంటారని, పైగా ఒకే పాటర్న్‌ని వేరువేరుగా వివరించి తికమకపెట్టచ్చని అంటుంది అసిమా. అదేం చెప్పాలనుకుంటుందో అర్థమైతే తప్ప, మనం ఏం చేయాలో స్పష్టత రాదంటుంది అధీర. తాను ప్రయత్నించి చూస్తానంటుంది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మేధ. సరేనని, దానికి ఆ పాటర్న్స్ అన్నీ ఫీడ్ చేస్తారు. కాసేపటి తర్వాత, ఆ పాటర్న్స్ అర్థం ‘ప్లీజ్ సేవ్ మీ’ అని చెప్తుంది మేధ. ఆ పాటర్న్స్‌లో దాని బాధ కూడా మిళితమై ఉందని అంటుంది. తన బృందంతో కలిసి అధీర గోల్డెన్ ఎగ్ వద్దకు వెళ్ళి, దేని నుంచి రక్షించాలని అడుగుతుంది. అప్పుడు గోల్డెన్ ఎగ్ గోడ మీద ఊదా రంగు పాటర్న్స్‌తో, తనలో ఏదో ప్రవేశించి, తన కణజాలాన్ని తినేస్తోందని, దాన్నుంచి తనని రక్షించాలని సమాధానమిస్తుంది. అధీర, ఇతరులు అడిగిన ప్రశ్నలకు బదులు చెప్తూ, తమ జాతిలో తానొక్కటే బతికి ఉన్నట్టు చెబుతుంది. గోల్డెన్ ఎగ్ తన మేధస్సుని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మేధకి బదిలీ చేసి, మేధ స్వరంలో జవాబులు చెప్తుంది. తన మెదడులోని నాడీకణజాలం సహాయంతో దాని మెదడులోని నాడీకణజాలంతో అనుసంధానమయ్యానని చెప్తుంది. తనకి శరీరంలో ప్రతి చోటా మెదడు ఉందని చెబుతుంది. వాళ్ళు చేయదలచిన పని వల్ల తన ప్రాణాల కేమీ ప్రమాదం ఉండదని, నిశ్చింతగా చేయమని చెప్తుంది. గోల్డెన్ ఎగ్‌కి ఓ పేరు పెడదామనుకుంటారు. తంగం అని శంకరన్ సూచిస్తాడు. ఆ పేరు ఎవరికీ నచ్చదు. అందరూ అక్కడ్నించి వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]

రాత్రి పదిగంటల సమయం. అధీర డెక్‌ మీద నిలబడి ఉందన్నమాటేగానీ ఆమె ఎప్పటికి మల్లే నల్లటి కురుల్లో సన్నజాజులు తురిమినట్టు కన్పిస్తున్న అందమైన ఆకాశాన్ని వీక్షించడం లేదు. గోల్డెన్‌ ఎగ్‌ గురించిన ఆలోచనల్లో నిమగమై ఉంది. అది మేధ సహాయంతో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి. కొన్నికోట్ల సంవత్సరాలుగా సముద్రంలో నివాసం ఉంటున్న జాతి అని కదా చెప్పింది. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆ జీవి ఆవిర్భవించి ఉంటుంది? తను ప్రమాదంలో ఉన్నానని, రక్షించమని మనుషులకు సిగల్స్‌ పంపేంత తెలివితేటలు దానికెలా వచ్చాయి? అది మనుషుల మాటల్ని మెదడు సంకేతాలతో ఎలా అర్థం చేసుకోగలుగుతుంది? ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మేధను ఎలా ప్రభావితం చేయగలిగింది? ఎన్ని ప్రశ్నలో.. సమాధానం దొరకని ప్రశ్నలు.

ఆమెకు యం. కె. రావు ఇచ్చిన సలహా గుర్తొచ్చింది. అత్యంత తెలివిగల ఇటువంటి జలచర జీవరాశి ఒకటి ఉందని ప్రపంచానికి తెలియదు. తమ ల్యాబ్‌లో ఉన్న గోల్డెన్‌ ఎగ్‌కి సంబంధించిన సమాచారం ప్రపంచ శాస్త్రవేత్తలకు అందిస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి కదా అని రావు వెలిబుచ్చిన అభిప్రాయం. కానీ పేరు కోసం అలా చేయడం తనకిష్టం లేదు. ఒక్కసారి ఇటువంటి జీవి ఉందని తెలిసిందా రకరకాల ప్రయోగాలతో దాని బతుకుని నాశనం చేస్తారు. అది తనను కాపాడమని కదా సిగల్స్‌ పంపించింది. కాపాడి మళ్ళా దాని స్థానంలో సముద్రం లోపల వదిలేయడమే తన కర్తవ్యం. అటువంటి జీవిని సముద్రగర్భం లోపల చూసినట్టు, పట్టుకోబోతే తప్పించుకున్నట్టు మాత్రం సైన్స్‌ మేగజిన్స్‌కి ఆర్టికల్‌ రాసి పంపిస్తుంది. అంతే. దాన్ని కంటెయినర్‌లో పైకి తెచ్చినట్టు, అది తమ మాటల్ని అర్థం చేసుకుని బదులిచ్చినట్టు మాత్రం ఎవ్వరికీ చెప్పదు. దాని ఉనికికి ప్రమాదం రానివ్వదు.

“గుడ్‌ ఈవెనింగ్‌ మేడం” అని విన్పిస్తే ఆలోచనల్లోంచి బైటపడింది. శంకరన్‌.. ఈ మధ్య శంకరన్‌ ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతున్నట్టు ఆమెకు అర్థమౌతోంది. తను డెక్‌ మీద ఉన్నప్పుడు కావాలనే వచ్చి పలకరిస్తున్నాడు.

“ఏంటిలా వచ్చారు? నిద్ర పట్టడం లేదా?” అని అడిగింది.

“నిద్ర పోవాలంటే భయమేస్తోంది మేడం” అన్నాడు శంకరన్‌.

“మళ్ళా పీడకలలు వస్తున్నాయా?”

“అవి కలల్లా అన్పించడం లేదు. ఎదురుగా తెరమీద నిజంగా కదుల్తున్న దృశ్యాల్లా అన్పిస్తున్నాయి. కలలు చాలా మటుకు సింబాలిక్‌గా, సర్రియలిస్టిక్‌గా, ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. సిస్టమాటిక్‌గా ఉండవు. కానీ నాకొస్తున్న కలలు సినిమా చూస్తున్నంత స్పష్టంగా, ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టనిపిస్తోంది.”

“మీ లేటెష్ట్‌ కలల గురించి చెప్పండి.”

“క్రమానుగతంగా ఏర్పడిన నాగరికత.. మనుషుల మధ్య అనుబంధాలు.. బతుకుతెరువు కోసం చేస్తున్న రకరకాల పనులు.. వాళ్ళ మధ్య ఏదో భాషలో జరుగుతున్న సంభాషణలు.. పుట్టుకలు .. చావులు..”

“అవేవీ పీడకలలు కావే.”

“ప్రతి ప్రారంభానికి ఓ ముగింపు కన్పిస్తోంది మేడం. అది చాలా భయానకంగా ఉంటోంది.”

“ఏమిటా ముగింపు?”

“ప్రళయం.. భూమ్మీద ఉన్న జీవరాశి మొత్తం నాశనమైపోతున్న దృశ్యాలు.. జల ప్రళయంలో అంతా మునిగిపోయినట్టు.. భూకంపాలతో కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోయినట్టు.. ఆకాశంలోంచి భూమి పైకి దూసుకొచ్చిన గ్రహశకలాల వల్ల వూళ్ళకు వూళ్ళు తుడిచిపెట్టుకు పోయినట్టు..”

అధీర అతని వైపు సాలోచనగా చూసింది.

“ఇదే కల రిపీటెడ్‌గా వస్తోందా?”

“లేదు మేడం.. మరో కలలో వేరే రకం నాగరికత.. ఓ కలలో కన్పించిన దానికి భిన్నంగా కన్పిస్తున్న మనుషులు.. కొత్త రకం జంతువులు.. వేరుగా ధ్వనిస్తున్న భాష.. ఆ కల చివర్లో కూడా కన్పించింది ప్రళయమే. అగ్ని పర్వతాల విస్ఫోటనం.. సునామీలు.. యుద్ధాలు.. గుర్రపుడెక్కల చప్పుడు.. కరవాలాల ఖణేల్‌మనే శబ్దాలు.. తెగిపడిన తలలు.. నెత్తుటి ప్రవాహాలు..” శంకరన్‌ మధ్యలో ఆపేశాడు.

శంకరన్‌కు వస్తున్న కలలకు గోల్డెన్‌ ఎగ్‌కి ఏదో సంబంధం ఉందని అధీరకు అన్పించింది. ఏమిటా సంబంధం? నిజంగానే గోల్డెన్‌ ఎగ్గే దీనికి కారణమా లేక అది తన అపోహ మాత్రమేనా.. ఇదేదో తెల్సుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అనుకుంది.

“నాకేమీ మతి భ్రమించడం లేదు కదా.. చాలా యేళ్ళ తర్వాత నాక్కనిపించిన సెల్వీలాంటి స్త్రీతో నా మనసులోని మాట చెప్పకముందే పిచ్చివాడినైపోతే ఎలా మేడం” దిగులుగా అన్నాడు శంకరన్‌.

“ఆమె ఎక్కడుందో నాకు చెప్పండి. మీ తరఫున నేను చెప్తానులెండి” నవ్వుతూ అంది.

“ఏం ప్రయోజనం మేడం? పిచ్చివాణ్ణి ఎవరు ప్రేమిస్తారు? ఎవరు పెళ్ళి చేసుకుంటారు?”

“అటువంటి పరిస్థితి దాపురించే అవకాశమే లేదు. ఇంతకూ ఆ మరో సెల్వీ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పండి. అటువంటి స్త్రీ నాకు తారసపడితే మీ తరఫున రాయబారం నడుపుతాను.”

“ఎక్కడుందో చెప్పలేను మేడం. ఎలా ఉంటుందో చెప్తాను. నాకు పొడవాటి జుట్టంటే ఇష్టం. సెల్వీకి చాలా పొడవైన దట్టమైన జుట్టు ఉండేది. ఆమె కళ్ళు విశాలంగా, అరచేయంత వెడల్పుగా ఉండేవి. పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వు వేలాడుతూ ఉండేది. మీ నవ్వులానే చాలా అందమైన చిరునవ్వు మేడం. మీ అంత ఎత్తే ఉండేది. ఎంత నాజూగ్గా ఉండేదో మీకు మల్లేనే.. సన్నజాజి పువ్వులా ఉండేది. నేను నలుపే. కానీ సెల్వీది మీలా పాల రంగంటే నమ్మండి.”

“కొంపదీసి నేను కాదు కదా” భృకుటిని ముడివేస్తూ అంది. అలా అడుగుతుందని వూహించని శంకరన్‌ కంగారు పడ్డాడు.

“అయ్యో మీరు కాదు మేడం.. మీలా ఉన్న మరో స్త్రీ” తడబడుతూ అన్నాడు.

“నాలానా లేక చనిపోయిన మీ భార్య సెల్వీలానా?”

“మీరు కూడా సెల్వీలా ఉంటారు. అందుకే మీ పోలికల్తో ఉన్న స్త్రీ అన్నాను” తప్పు చేసి దొరికిపోయిన వాడిలా తలొంచుకుని సమాధానమిచ్చాడు.

“నన్ను ప్రేమించేలాంటి పొరపాటు మాత్రం చేయకండి. నాకు ఈ ప్రేమలూ పెళ్ళిళ్ళ మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం నేను గడుపుతున్న ఈ ఒంటరి జీవితమే నాకిష్టం. నా జీవితంలో మరొకరికి ప్రవేశం నిషిద్ధం. అర్థమైందనుకుంటాను” అధీర గొంతు పదునుగా ధ్వనించింది.

శంకరన్‌ నిశ్శబ్దంగా నిలబడ్డాడు తప్ప నోరు విప్పలేదు.

అధీర అక్కడినుంచి వెళ్ళబోతూ ఆగి “మీతో ఓ రహస్యం పంచుకోవాలి. ఒకవేళ మీరు నిజంగానే నన్ను ఇష్టపడుతూ, చెప్పడానికి జంకుతూ ఉంటే, చెప్తాను వినండి. నన్ను ఇష్టపడి, ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలని కోరుకున్న మగవాళ్ళలో మీ నెంబర్‌ ఇరవై నాలుగు” అనేసి వెళ్ళిపోయింది.

రాత్రి పదకొండు దాటినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఏవేవో జ్ఞాపకాలు.. తన జీవితంలో తారసపడి, ప్రేమిస్తున్నానంటూ వెంటబడిన మగవాళ్ళెందరో.. డిగ్రీలో కల్యాణ్‌.. చాలా అందగాడు. అతని ప్రేమలో నిజాయతీ ఉందనిపించేది. నిఖార్సయిన ప్రేమికుడు. ఆ ప్రేమను ఆస్వాదించేకొద్దీ అందులోని మధురిమ అనుభవంలోకి రాసాగింది. ఎటొచ్చీ కల్యాణ్‌ కోరుకునే శారీరక సంబంధానికి తను విముఖంగా ఉండేది. ‘పెళ్ళి చేసుకోబోయే ప్రేమికులం కాబట్టి ఆ అనుభవం తప్పేమీ కాదు’ అనేవాడు. తనకు పెళ్ళి ఇష్టంలేదని చెప్పింది.

‘పెళ్ళి చేసుకోకుండా జీవితాంతం కుమారిగానే ఉండిపోతావా?’ అన్నాడు.

‘పెళ్ళీ పిల్లలు లాంటి భవబంధాలు నాకొద్దు. స్వేచ్ఛాజీవిలా బతకాలనుకొంటున్నా’ అంది.

‘బంధాలు వద్దనుకొంటున్నావు. సుఖాల్ని ఎందుకు కాదనుకొంటున్నావు?’ అన్నాడు.

‘సుఖాలని నువ్వు వేటిని అనుకొంటున్నావో నా ఉద్దేశంలో అవి సుఖాలు కాకపోవచ్చుగా’ అంది.

‘స్త్రీ పురుష కలయికలో దొరికే సుఖం కోసమేగా ప్రతి మనిషీ వెంపర్లాడతాడు. దాన్ని కాదనుకోవడం మూర్ఖత్వం’ అన్నాడు.

‘నాలో ఎప్పుడూ అటువంటి కోరికే కలగలేదు’ అంది.

‘మరెందుకు ప్రేమించినట్లు నటించావు? ఇన్ని రోజులు నీవెంట పిచ్చోడిలా ఎందుకు తిప్పుకున్నావు?’ కోపంగా అరిచాడు.

‘నేను నటించలేదు. నిన్ను నిజంగానే ప్రేమించాను’ అంది తను.

‘మరి ప్రేమిస్తే పెళ్ళెందుకు వద్దంటున్నావు? శారీరకంగా దగ్గర కావడానికి ఎందుకు తిరస్కరిస్తున్నావు?’ అన్నాడు.

‘ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలని, లేదా శరీర సుఖం ఇవ్వాలని నాకు తెలియదు. ప్రేమ ఓ దివ్యమైన అనుభూతి.. దానికి ఈ తుచ్ఛమైన సెక్స్‌తో ఎందుకు ముడిపెడతావు?’ తను కూడా కోపంగానే అంది.

‘ఓసారి డాక్టర్‌ దగ్గరకెళ్ళి చెక్‌ చేయించుకో. హార్మోనల్‌ డిఫెక్ట్‌ ఉందేమో. నువ్వు లెస్బియన్‌ ఏమోనని నా అనుమానం. మగవాళ్ళ జీవితాలతో ఆడుకోకు’ అనేసి విసురుగా వెళ్ళిపోయాడు.

అతడు మళ్ళా తన జీవితంలోకి తొంగి చూడలేదు. ఆ తర్వాత కూడా తన వెంట ఎంతమంది మగవాళ్ళు పడ్డారో.. ఓషన్‌ బయాలజిష్ట్‌ అయ్యాక తన ధ్యాసంతా సముద్ర జీవరాశుల మీద కేంద్రీకృతమైంది. యవ్వనంలో ఉన్నప్పుడు మత్తుగా అన్పించిన ప్రేమ కూడా ఇప్పుడు తన జిజ్ఞాస ముందు పేలవంగా అన్పించసాగింది. సముద్రపు లోతుల్ని శోధించాలన్న జిజ్ఞాస.. సముద్రగర్భంలో దాగున్న రహస్యాల్ని వెలికి తీయాలన్న జిజ్ఞాస.. తను సైంటిస్ట్‌గా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాక కూడా తనతో పాటు పనిచేసే కొంతమంది పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్‌ చేశారు. వాళ్ళను మృదువుగా తిరస్కరించింది. ప్రేమ పేరుతో దగ్గర కావాలని ప్రయత్నించిన వాళ్ళతో తనకు ప్రేమ మీద నమ్మకం లేదని ముందుగానే చెప్పేసింది. ఇప్పుడు శంకరన్‌ వాలకం చూస్తుంటే తన మీద ఏవో ఆశలు పెంచుకుంటున్నట్టు అన్పిస్తోంది. అవి ముదరకముందే మొగ్గలోనే తుంచేయడం మంచిదనుకుంది.

మరో అరగంట నిద్ర కోసం తన్నుకులాడాక మాగన్నుగా నిద్ర పట్టింది. కల.. విస్తరించిన మహా నగరాలు.. ప్రశాంతంగా పారుతున్న నదిలా కదులుతున్న జన సందోహం.. పచ్చని పొలాలు.. నీటి చెలమలు.. ధాన్యపురాశులు.. వెచ్చని నెగడు చుట్టూతా వలయాకారంలో తిరుగుతూ మగువలు పాదాల్ని లయబద్దంగా కదుపుతున్నారు.. నక్షత్ర్రాల ధూళి నేల రాలుతున్నట్టు గాల్లో శబ్ద తరంగాల్ని జాలువారుస్తున్న పాట.. అర్థం కాని ఏదో భాష.. కానీ భావం అర్థమౌతోంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ మంచు తుఫాను.. నగరాల్ని ముంచెత్తిన మంచు వర్షం.. దట్టంగా పేరుకుపోయిన మంచు చరియల కింద సమాధులైన జీవరాశులు.. మునిగిపోయి శిధిలమైపోయిన నగరాలు, పట్టణాలు.. వెంటనే మరో కల.. పరవళ్ళు తొక్కుతూ పారుతున్న ఒంటరి నది.. అందులో తుళ్ళుతూ దుముకుతూ జలచరాలు.. మెల్లగా నదిని ఆశ్రయించి బతకడానికి వచ్చిన మనుషులు.. నది ఒడ్డున వెలసిన నివాసగృహాలు… ఇప్పుడు దృశ్యం మారింది. నది ఒడ్డున వెలసిన పట్టణాలు.. పడవల్లో ప్రయాణం.. వ్యాపారాలు.. నగరాలుగా విస్తరించి.. జలప్రళయంలో లుప్తమై.. నీళ్ళ అడుగున శిధిలమై..

తన చుట్టూ నీళ్ళు.. తన పైన కొన్ని వందల మీటర్ల వరకు విస్తరించి ఉన్న జలరాశి.. తనని మింగేయబోతున్న జల రాక్షసి.. వూపిరాడటం లేదు.. ప్రాణం పోయేలా ఉంది. అధీరకు అధాట్టున మెలకువొచ్చింది. గదిలో ఏసీ పని చేస్తున్నా ఒళ్ళంతా చెమటలు.. చుట్టూ భయం భయంగా చూసించి. నీళ్ళు ఏమీ లేవు. కొన్ని నిమిషాల తర్వాత అధీర స్థిమితపడింది. ఆమెకు శంకరన్‌ గుర్తొచ్చాడు. అతను చెప్పిన కలల్లాంటివే తనకూ వచ్చాయి. ఇద్దరు విభిన్న వ్యక్తులకు ఒకేరకమైన కలలు రావడం ఎలా సంభవం? బహుశా రెండు రోజుల క్రితం చదివిన వార్త తాలూకు ప్రభావమేమో అని కూడా అన్పించింది.

రెండ్రోజుల క్రితం ఇంటర్నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుంటే ఓ వార్త కంటపడింది. తన వృత్తికి సంబంధించిన అంశం కాబట్టి ఆసక్తిగా చదివింది. ఈస్ట్‌ అంటార్కిటికాలో ఓ మైలు మందాన పేరుకుపోయిఉన్న మంచు కింద పురాతన పట్టణం ఆనవాళ్ళు కన్పించాయి. మూడున్నరకోట్ల సంవత్సరాల క్రితం నాటి కట్టడాలు.. నివాస గృహాలు.. రోడ్లు.. పన్నెండు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించిన నదీ పరివాహకప్రాంతం.. వేగంగా కదిలే హిమఖండాలు భూమి ఉపరితలం మీదున్న నిర్మాణాల్ని ధ్వంసం చేసుకుంటూ ప్రవహిస్తాయి. కానీ ఈ ప్రాంతంలో హిమానీ నదాలు మెల్లగా ప్రవహించడం వల్ల, పురాతన నిర్మాణాల్ని టైం క్యాప్సూల్‌లో భద్రపరిచినట్టు మంచు సమాధుల కింద దాచి ఉంచాయి. మంచుతో కప్పబడకముందు చాలా కాలం క్రితం అంటార్కిటికా పచ్చటి చెట్ల సముదాయాలతో, అడవుల్తో నిండి ఉండేదనడానికి నిదర్శనం శాస్త్రవేత్తలు కనుగొన్న మంచుతో కప్పబడిఉన్న ఈ పురాతన పట్టణం. అలా ఎన్ని పట్టణాలు, ఎన్ని నగరాలు, ఎన్ని నాగరీకతలు కాలగర్భంలో కలిసిపోయాయో పరిశోధించి తెల్సుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆ వార్త సారాంశం.

ఆ వార్త ప్రభావం తన మెదళ్ళో నిక్షిప్తమై ఉండటం వల్ల మంచుతుఫానులో నాశనమైన నగరాలు కలలో కన్పించి ఉంటాయనిపించింది. లేదా శంకరన్‌ తనకొస్తున్న కలల గురించి చెప్పడం వల్ల కూడా అటువంటి కల వచ్చి ఉంటుందేమో అన్పించింది. ఇవి కాకుండా మరేదైనా కారణం ఉందా? శంకరన్‌ భయపడినట్టు గోల్డెన్‌ ఎగ్‌ శంకరన్‌ మెదడుతో పాటు తన మెదడ్ని కూడా స్వాధీనంలోకి తీసుకుని స్వప్నాల్ని సృష్టిస్తోందా? ఒకవేళ అదే నిజమైతే దానివల్ల గోల్డెన్‌ ఎగ్‌కి ఒనగూడే లాభం ఏమిటి? ఎందుకో ఆ ఆలోచన అర్ధరహితంగా అన్పించింది. దీనికి సరైన సమాధానం గోల్డెన్‌ ఎగ్‌ మాత్రమే ఇవ్వగలదు. రేపు దీని గురించి అడిగి కనుక్కోవాలనుకుంది.

***

గోల్డెన్‌ ఎగ్‌ శరీరంలో నివాసం ఏర్పర్చుకుని, దాన్ని కొద్దికొద్దిగా తినేస్తున్న పరాన్నజీవినుంచి దాన్ని రక్షించడానికి అంజలిక ఓడలో ఉన్న శాస్త్రవేత్తలందరూ సమాయత్తమౌతున్నారు. గోల్డెన్‌ ఎగ్‌ని కోసి, దాన్లోపల దాగున్న శత్రువుని బైటికితీయాలి. కానీ అలా చేయాలంటే ఎన్ని అనుమానాలో.. ఎన్ని భయాలో.. ఓ స్టీల్‌ ట్రేలో సముద్రపునీళ్ళు వేసి, దాన్లో గోల్డెన్‌ ఎగ్‌ని పెట్టి ఆపరేషన్‌ చేయాలేమో అనే అనుమానం.. నీళ్ళలోంచి బైటికి తీస్తే చచ్చిపోతుందేమోనని భయం.. కానీ సముద్రంలో దాదాపు ఆరువేల ఐదువందల మీటర్ల లోతున ఉన్న పీడనాన్ని స్టీల్‌ ట్రేలో ఎక్కడినుంచి తీసుకురాగలరు? అంత పీడనం లేకపోతే గోల్డెన్‌ ఎగ్‌ బతగ్గలుగుతుందా?

అధీరలో కూడా ఇవే ప్రశ్నలు పడగలు విప్పి నిలబడ్డాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాన్ని రక్షించే ప్రయత్నంలో ఏమైనా ప్రమాదం జరిగితే తన్ను తాను క్షమించుకోలేదు.

సడన్‌గా మేధ నుంచి మాటలు రాసాగాయి. “సముద్రం లోపలే కాదు నేలపైన కూడా బతగ్గల జీవులం మేము. నాకేమీ ప్రమాదం వాటిల్లదు. మీరు చేయాలనుకున్న ఆపరేషన్‌ని నిస్సంకోచంగా చేయండి” అంది మేధ. తన మనసులో చెలరేగుతున్న భయాల్ని గ్రహించి, గోల్డెన్‌ ఎగ్‌ సమాధానం చెప్పిందని అధీరకు అర్థమైంది.

“ఉభయచరజీవుల ఉనికి భూమ్మీదకూడా కన్పిస్తుంది. కానీ మీ జాతి ఎప్పుడూ భూమ్మీద కన్పించిన దాఖలాలు లేవు. అసలు సముద్రంలో కూడా నీలాంటి జీవరాశి ఉన్నట్టు మాకెవ్వరికీ తెలియదు” అంది అధీర.

“మేము నీళ్ళ బయట కూడా బతగ్గల జీవులం అని చెప్పాను తప్ప ఉభయచర జీవులమని చెప్పలేదు. మేము చలించలేము. దేన్నయినా అంటి పెట్టుకుని బతుకుతాం. నీళ్ళలో ఉన్నప్పుడు మా శరీరంలోని ప్రతి కణం శ్వాసించినట్టే, భూమ్మీద వదిలేసినా కణాలు శ్వాసిస్తాయి” అంది మేధ.

“మరి పీడనం సంగతేమిటి?”

“పీడనం లేకపోతే ఏమౌతుంది? మా శరీరాల వ్యాకోచిస్తాయి. అంతే.”

అధీరకు నిన్న రాత్రి తనకొచ్చిన కలలు గుర్తొచ్చాయి. వాటి గురించి అడగాలనుకుంది. ఒకవేళ ఆ కలలకు, గోల్డెన్‌ఎగ్‌కి సంబంధం లేకపోతేనో.. అడగాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో మళ్ళా మేధ ద్వారా సమాధానం లభించింది.

“నా మెమోరీలో ఉన్న దృశ్యాలే మీరు చూసింది. మా కణాల్లో మెమోరీ కణాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా జరిగిన సంఘటనలన్నీ మాలో నిక్షిప్తమై ఉన్నాయి. సముద్రాలు ఆవిర్భవించినప్పటినుంచి మేము జీవించి ఉన్నాం. ఎన్నో నాగరికతలు పరిఢవిల్లడం, చివరికి పరిసమాప్తం కావడం మాకు తెలుసు. మళ్ళా కొత్తగా నాగరికతలు పుట్టుకురావడం.. ప్రళయాలు ముంచుకువచ్చి వినాశనం జరగడం.. ఇవన్నీ నా మెమోరీలో భద్రపరచబడి ఉన్నాయి.”

అధీర గోల్డెన్‌ ఎగ్‌ వైపు అనుమానంగా చూసింది.

“నేను చెప్తున్నది నిజం” అంది మేధ.

“అదెలా సంభవం? అంటే నీవయసెంత? ఎన్ని సంవత్సరాలనుంచి శ్వాసిస్తున్నావు? సముద్రాలు ఆవిర్భవించి దాదాపు నాలుగు బిలియన్‌ సంవత్సరాలు. అప్పటినుంచి నువ్వు బతికే ఉన్నావా? మీ జాతికి మరణం లేదా?” అంది అధీర.

“మాకూ మరణం ఉంది. కానీ మా శరీరంలో ఉన్న మెమోరీ కణాలకు మరణం లేదు. మాలో పునరుత్పత్తి జరిగినప్పుడు మా మెమోరీ కణాలు కొన్ని మా సంతానానికి అందజేయబడ్తాయి. అప్పటినుంచి జరిగిన సంఘటనల్ని ఆ కణాలు రికార్డు చేస్తుంటాయి.”

“అంటే నాలుగు బిలియన్‌ సంవత్సరాలనుంచి ఇప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ నీ మెమోరీ కణాల్లో భద్రంగా ఉన్నాయంటావు. అవునా?”

“అవును.”

“నమ్మశక్యంగా లేదు. ఇదేదో మాయాజాలంలా అన్పిస్తోంది. ఐనా సముద్రంలో అట్టడుగున దేనికో అంటుకుని స్థిరంగా ఉన్న మీ జీవరాశికి భూమి ఉపరితలం మీద ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది?” అని అడిగింది అసిమా ఛటర్జీ.

“మా శరీరాలు మెమోరీ కణాల్ని విసర్జిస్తాయి. అవి నీటి ఉపరితలం మీదికి చేరుకుని. దృశ్యాల్ని జ్ఞాపకాల రూపంలో తమలో భద్రపర్చుకుంటూ ఉంటాయి. కొన్ని తిరిగొచ్చి మా శరీరాలకు అతుక్కుంటాయి.”

“నీ శరీరంలోంచి విసర్జించబడిన మెమోరీ కణాలు మళ్ళా వెతుక్కుంటూ నీ దగ్గరకే వచ్చి అతుక్కుంటాయా? వాటికేమైనా దివ్యదృష్టి ఉందా ఏమిటి?” అంది అసిమా ఛటర్జీ.

“దివ్యదృష్టి లేదు. మెమోరీ ఉంది. దానివల్లనే అది సాధ్యపడ్తుంది.”

అధీరకు మరో అనుమానం వచ్చింది. “తిరిగొచ్చిన కణాలు కొన్ని సంఘటనల్ని రికార్డు చేయలేవుగా. అప్పుడెలా?”

“భూమి ఉపరితలం మీద జరిగేవే సంఘటనలని మీరు నమ్ముతున్నారు. సముద్రం లోపల మీరూహించని సంఘటనలు నిరంతరం జరుగుతుంటాయి. వాటిని రికార్డు చేయాలిగా. మెమోరీ కణాలు తమలో భద్రపరచబడి ఉన్న దృశ్యాల్ని పంచుకుంటాయి. దానివల్ల అన్ని మెమోరీ కణాల్లో ఉన్న జ్ఞాపకాలు సమానంగా ఉంటాయి” అంది మేధ.

“ఇదేదో జానపద కథలా ఉంది మేడం” అన్నాడు శంకరన్‌.

“మీకు నమ్మశక్యంగాని అద్భుతాలు, రహస్యాలు సముద్రం లోపల చాలా ఉన్నాయి. మీరు వాటిని పూర్తిగా శోధించి తెల్సుకోవడం అసంభవం. దానికి మనుషుల జీవితకాలం సరిపోదు” అంది మేధ.

ట్రేని సముద్రపు నీటితో నింపి, దానిలోపల గోల్డెన్‌ ఎగ్‌ని పెట్టి, అధీర స్కాల్‌పెల్‌తో దాన్ని మధ్యకు రెండుగా కోసింది. గోధుమ రంగులో మెరుస్తున్న కణాలని అతుక్కుని మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉన్న సన్నటి దారాల్లాంటి జీవులు కన్పించాయి. వాటిని చాకచక్యంగా వేరు చేసి, ఓ టెస్ట్‌ట్యూబ్‌లో వేసింది. గోల్డెన్‌ ఎగ్‌ని పొరలు పొరలుగా విడదీసి, దానిలోపల స్థావరం ఏర్పర్చుకుని ఉన్న పరాన్నజీవులన్నిటిని ఏరి, టెష్ట్‌ట్యూబ్‌లో భద్రపర్చింది.

ఇనుప రజనుని అయస్కాంతం ఆకర్షించినట్టు, విడిపోయిఉన్న భాగాలన్నీ కల్సుకుని, గోల్డెన్‌ ఎగ్‌ తన పూర్వ రూపాన్ని సంతరించుకోవడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూశారు.

(ఇంకా ఉంది)

Exit mobile version