Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వూదారంగు సముద్రం-7

[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రాత్రి అధీర డెక్ మీద నిల్చుని గోల్డెన్ ఎగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు, కానీ జవాబులు లేవు. శంకరన్ వచ్చి పలకరిస్తాడు. తను డెక్ మీద ఉన్నప్పుడు అతను కావాలనే వచ్చి పలకరిస్తున్నాడని గ్రహిస్తుంది అధీర.  సెల్వీ మళ్ళీ గుర్తొచ్చిందా అని అడుగుతుంది. కాదంటాడు. కొంపదీసి తనను ప్రేమిస్తున్నాడా అని అడిగి, తన తనకు ప్రేమ, పెళ్ళి కుదరవని, తన గతం చెబుతుంది. తనకు వింత వింత కలలు వస్తున్నాయనీ, అవెంటో, ఎందుకొస్తున్నాయో అర్థం కావడం లేదంటూ ఆ కలల గురించి వివరిస్తాడు శంకరన్. వాటి గురించి మాట్లాడుకుని, ఎవరి గదుల్లోకి వారు వెళ్తారు. అధీరకి కూడా అలాంటి కలే వస్తుంది. వీటికి జవాబు గోల్డెన్ ఎగ్ మాత్రమే చెప్పగలదని తలుస్తుంది. మర్నాడు ఉదయం గోల్డెన్ ఎగ్ ఉన్న ట్రే ముందు నిలబడగానే, అది మేధ ద్వారా, అధీర సందేహాలన్నీ తీరుస్తుంది. తనని రక్షించే ప్రయత్నం చేయమంటుంది. గోల్డెన్ ఎగ్‌ని కోసి, దానిలో ఉన్న పరాన్న జీవులని వేరు చేస్తుంది. తర్వాత విడిపోయి ఉన్న భాగాలన్నీ కలుసుకుని, గోల్డెన్‌ఎగ్‌ తన పూర్వ రూపాన్ని సంతరించుకోవడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. – ఇక చదవండి.]

తిరిగి దాన్ని హైపర్‌బారిక్‌ బయో కంటైన్‌మెంట్‌ క్యాప్సూల్‌లోకి మార్చాక, “ఇప్పుడు దీన్ని సముద్రంలోకి వదిలేయవచ్చేమో కదా మేడం” అన్నాడు శంకరన్‌.

“అలా చేస్తే, ఇంతకష్టపడి దాన్ని పరాన్న జీవినుంచి రక్షించిన దానికి ఫలితం ఏముంటుంది?” అంది అధీర.

“ప్రస్తుతం దానికేమీ ప్రమాదం లేదు కదా” అన్నాడు శంకరన్‌.

“సముద్రం లోపలికి వదిలాక, ఆ పరాన్న జీవులు మళ్ళా దీని శరీరంలోకి ప్రవేశించి, హాని చేయవని గ్యారంటీ ఏముంది? మనం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి” అంది అధీర.

“అంటే ఏం చేయాలని మీ ఉద్దేశం?” అని అడిగింది అసిమా ఛటర్జీ.

“మొదట ఆ పరాన్నజీవుల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ గోల్డెన్‌ ఎగ్‌లానే ఆ పరాన్నజీవి కూడా మనకెవరికీ తెలియని స్పీషీస్‌. గోల్డెన్‌ ఎగ్‌ని దాని బారినుంచి శాశ్వతంగా రక్షించాలంటే దాని లైఫ్‌ సైకిల్‌ని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం” అంది అధీర.

“మీరు ఏం చేయదల్చుకుంటున్నారో నాకర్థం కావడం లేదు” కొద్దిగా విసుగ్గా అన్నాడు రావు.

అతనికి అధీర నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం నచ్చడం లేదు.  ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియని స్పీషీస్‌ని గుర్తించినపుడు మొదట ఇన్‌స్టిట్యూట్‌కి తెలియబర్చాలి. దాన్ని క్యాప్సూల్‌‌లో భద్రపరచి, మరిన్ని ప్రయోగాల కోసం, మరింత అవగాహన కోసం వాళ్ళకు అందచేయాలి. తను ఆమెకంటే బాగా సీనియర్‌. అలా చేయమని తను సలహా ఇచ్చినా చేయలేదన్న కోపం..

“ఈ పరాన్నజీవికి ఏదైతే నచ్చదో, దేన్ని ముట్టకోవడానికి భయపడి దూరంగా జరుగుతుందో అటువంటి కెమికల్‌ని కనుక్కోవాలి. గోల్డెన్‌ ఎగ్‌ జీన్స్‌లో మార్పులు చేసి, పరాన్నజీవి లోపలికి ప్రవేశించడానికి  ప్రయత్నించినపుడల్లా ఆ కెమికల్‌ విడుదలయ్యేలా చేయాలి. అప్పుడు దాని జోలికి పరాన్నజీవి పోదు.  గోల్డెన్‌ ఎగ్‌ ప్రశాంతంగా పునరుత్పత్తి ద్వారా తన జాతిని పెంచుకునే అవకాశం లభిస్తుంది. జీన్స్‌ని మ్యుటేట్‌ చేస్తాం కాబట్టి దాని సంతానంలో కూడా ఈ రక్షణ ప్రక్రియ పని చేస్తూ ఉంటుంది” అంది అధీర.

“అదంతా మన పని కాదు. కొత్త స్పీషీస్‌ కన్పిస్తే ఆ సమాచారాన్ని మనం ఇన్‌స్టిట్యూట్‌కి తెలియచేయాలి. దాన్ని పట్టుకోగలిగితే ఆ శాంపిల్‌ని వాళ్ళకు అప్పగించాలి. దాంతో ఏం చేసుకోవాలో, ఏయే ప్ర యోగాలు చేసుకోవాలో వాళ్ళిష్టం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గోల్డెన్‌ ఎగ్‌ గురించి, దాని శరీరంలో దొరికిన పేరసైట్‌ గురించి మన పై అధికారులకు సమాచారం ఇవ్వండి. ఆ శాంపుల్స్‌ని వాళ్ళకు అందచేసే ఏర్పాటు చేయండి” అన్నాడు రావు.

“మీరు కోరినట్టే పేరసైట్‌ గురించి వాళ్ళకు తెలియబరుస్తాను. వాటి శాంపిల్స్‌ని కూడా పంపుతాను. ఈ పరాన్నజీవికి సంబంధించిన పూర్తి సమాచారం నాక్కూడా కావాలి. గోల్డెన్‌ ఎగ్‌ని కాపాడటంలో ఆ పరిజ్ఞానం సహాయపడుతుంది.”

“గోల్డెన్‌ ఎగ్‌ గురించి ఇన్‌స్టిట్యూట్‌కి చెప్పరా?”

“ఇప్పుడే చెప్పను. దానికి నష్టం కలిగిస్తున్న పేరసైట్‌కి విరుగుడు కనుక్కన్నాక, గోల్డెన్‌ ఎగ్‌ జీన్స్‌లో మార్పులు చేశాక, దాన్ని తిరిగి సముద్రగర్భంలో వదిలేశాక అప్పుడు చెప్తాను. ఓ కొత్త స్పీషీస్‌ జీవి కన్పించిందని చెప్తాను తప్ప, దాన్ని క్యాప్సూల్‌లో తెచ్చుకున్న విషయం చెప్పను. దానికున్న అసాధారణమైన జ్ఞాపకశక్తి గురించి చెప్పను. అది మన భావాల్ని అర్థం చేసుకుని, స్పందించిన విషయం చెప్పను.”

“ఎందుకు చెప్పరు? అది మనకప్పగించిన బాధ్యతల ఉల్లంఘన కిందికి రాదా? మీరు తప్పు చేస్తున్నారు. ఈ విషయంలో నేను మిమ్మల్ని సపోర్ట్‌ చేయను” కోపంగా అన్నాడు రావు.

“నేను చేస్తున్నది ఇన్‌స్టిట్యూషన్‌ దృష్టిలో తప్పని నాకు తెలుసు. కానీ చేయక తప్పదు. గోల్డెన్‌ ఎగ్‌ మనకు సిగల్‌ పంపించింది దాన్ని మనం కాపాడతామన్న ఆశతో.”

“పేరసైట్‌ నుంచి కాపాడాంగా. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్‌కి చేరవేయడం మన బాధ్యత.”

“అలా చేస్తే దాని గతి ఏమౌతుందో మీకు తెలియదా? దానిలోని ప్రతి కణాన్ని ముక్కలు చేసి, అందులో ఏం ఉందోనని పరిశోధిస్తారు. మెమోరీ కణాల్లో నిక్షిప్తమై ఉన్న దృశ్యాల్ని తెల్సుకోడానికి ప్రయత్నిస్తారు.”

“మంచిదేగా. సముద్ర గర్భంలోని చీకటి కుహరంలో దాగున్న రహస్యాలు సమస్త మానవాళికి తెలియాలిగా” అన్నాడు రావు.

“తెలియకపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంటేనే బావుంటాయి. గోల్డెన్‌ ఎగ్‌ ఉనికిని కూడా రహస్యంగా ఉంచడమే మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ గోల్డెన్‌ ఎగ్‌ ప్రాణాన్ని బలిపెట్టలేను. ఇది చాలా రేర్‌ స్పీషీస్‌. దాన్లో బతికున్న చివరి జీవి మన దగ్గరున్న గోల్డెన్‌ ఎగ్‌. దీనికి మన మనోభావాల్ని అర్థం చేసుకుని, తిరిగి సమాధానం చెప్పే శక్తి ఎలా వచ్చిందో కనుక్కోవడం కోసం ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఏకమై దీని శరీరాన్ని ముక్కలుగా చేసి చూస్తారు. అలా కానివ్వను. దీన్ని నేను కాపాడి తీరుతాను. లెట్‌ వాట్‌ మే కమ్” దృఢనిశ్చయంతో అంది అధీర.

“చివరి జీవి ఎందుకవుతుంది? అది ల్యాబ్‌లో ఉన్న పరిస్థితుల్లో కూడా పునరుత్పత్తి చేయగలిగితే గోల్డెన్‌ ఎగ్‌లాంటి మరిన్ని జీవులు పుట్టుకొస్తాయిగా.”

“అది ఇక్కడి పరిస్థితుల్లో కూడా పునరుత్పత్తి చేయగలుగుతుందో లేదో మనకు తెలియదు కదా.”

“ఎందుకు చేయలేదు? సెల్ఫ్‌ ఫెర్టిలైజేషన్‌ చేసుకోగలదని చెప్పిందిగా.”

అధీర ఏదో చెప్పేలోపల మేధ గొంతు విన్పించింది. “లేదు. నేనిక్కడ పునరుత్పత్తి చేయలేను. సముద్రగర్భంలోపల వదిలేస్తేనే సెల్ఫ్‌ ఫెర్టిలైజేషన్‌ సాధ్యపడ్తుంది.”

“విన్నారుగా. నేను ఇన్‌స్టిట్యూషన్‌ నియమాలకు కోసమని ఓ అరుదైన స్పీషీస్‌ని బలిపెట్టలేను” అంది అధీర.

“నేను మీతో విభేదించి తీరుతాను” అన్నాడు రావు.

“ఈ షిప్‌కి నేనే చీఫ్‌నన్న విషయం మర్చిపోయారా? నా నిర్ణయమే తుది నిర్ణయం. నాతో విభేదింఛడం ఓషన్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ షిప్‌ నియమాలకు విరుద్ధమని మీకు తెలియదా?” అంది అధీర.

సమాధానమేమీ చెప్పకుండా యం. కె. రావు అక్కడినుంచి విసురుగా వెళ్ళిపోయాడు.

***

గోల్డెన్‌ ఎగ్‌ శరీరంలోంచి తీసిన పేరసైట్ల శాంపుళ్ళను ప్రపంచంలో పేరెన్నికగన్న బయోల్యాబ్స్‌కి పంపించింది అధీర. తమకప్పగించిన ఓషన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ పనిని పర్యవేక్షించే బాధ్యతను అసిమా ఛటర్జీకి అప్పగించింది. తన పూర్తి సమయం పేరసైట్ల మీద పరిశోధనలు చేయడానికే వినియోగించసాగింది. 1960 జనవరిలో స్విస్‌ ఓషనోగ్రాఫర్‌ జాక్వెస్‌ పికార్డ్‌ అమెరికన్‌ నేవీ లెఫ్టినెంట్‌ డాన్‌ వాల్ష్‌తో కలిసి ఛాలెంజర్‌ డీప్‌ని శోధించారు. జాక్వెస్‌ పికార్డ్‌ తయారుచేసిన బాథ్‌ఐస్కఫె ‘ట్రీఎస్ట్‌’లో ప్రయాణించి 10,916 మీటర్ల లోతుకి చేరుకోగలిగారు. సముద్రంలోని అత్యంత లోతు ప్రదేశాలకు చేరుకోడానికి ఉపయోగపడే సబ్‌మెర్సిబుల్‌ వాహనం ‘బాథ్‌ఐస్కఫె’. గోళాకారంలో ఉండే పెద్ద క్యాబిన్‌, దానిపైన ఇంధనంతో నిండిఉన్న ఫ్లోట్‌ ఫర్‌ బయోన్సీ బాథ్‌ఐస్కఫెలో ముఖ్య భాగాలు. ఆ ఎక్స్‌పెడిషన్‌లో 10,906 మీటర్ల లోతున కొత్త స్పీషీస్‌కి చెందిన పాలీకీట్‌ పేరసైట్‌ పురుగులు కన్పించాయి. అవి సెంటీమీటర్‌ పొడవున దారాల్లా కదుల్తున్నాయి. వాళ్ళు పాలీకీట్‌ పురుగుల్ని పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ అవి చిక్కకుండా తప్పించుకున్నాయి. అందువల్ల వాటి గురించి మరింత లోతుగా పరిశోధించే అవకాశాన్ని శాస్త్రవేత్తలు కోల్పోయారు. అధీరకు గోల్డెన్‌ ఎగ్‌ లోపల దొరికిన పురుగులు అవే కావచ్చన్న అనుమానం వచ్చింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఛాలెంజర్‌ డీప్‌ ఎక్స్‌పెడిషన్‌లో కన్పించిన కొత్త స్పీషీస్‌కి చెందిన పురుగులు ఇవేనని అమెరికన్‌ శాస్తవేత్తలు నిర్ధారించారు. అధీర చేసిన ప్రయోగాల వల్ల పాలీకీట్‌ పురుగులకు సంబంధించిన మరింత సమాచారం తెల్సింది. అవి గోల్డెన్‌ ఎగ్‌లా హెర్మాఫ్రోడైటిక్‌ కాదు. వాటిల్లో సెక్స్‌ అవయవాలు వేరుగా ఉంటాయి. వాటి గొనాడ్స్‌ నుంచి పునరుత్పత్తి కణాలైన గేమెట్స్‌ శరీరంలోకి విసర్జించబడ్తాయి. అవి పూర్తిగా అభివృద్ధి చెందాక, అడల్ట్‌ పాలీకీట్‌ శరీరం పగిలిపోయి, అవి నీళ్ళలోకి నెట్టివేయబడ్తాయి. అడల్ట్‌ పాలీకీట్‌ చనిపోతుంది. పాలీకీట్‌ శరీరంలోని ఏ ఎంజైమ్ స్రవించడం వల్ల దాని శరీరం ఉబ్బిపోయి రెండుగా చీలిపోతుందో, దాన్ని తెల్సుకోడానికి అధీర, మెరైన్‌ జెనెటిక్‌ ఇంజనీర్‌ సుధాంశుతో కలిసి విస్తృతంగా పరిశోధనలు చేసింది. చివరికి ఆ ఎంజైమ్ ఏమిటో కనుక్కోవడంలో వాళ్ళిద్దరూ విజయం సాధించారు. గోల్డెన్‌ ఎగ్‌ డిఎన్‌ఏలో మార్పులు చేయడం ద్వారా దాన్లో పాలీకీట్‌ పురుగుల నుంచి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలీకీట్‌ పురుగులు గోల్డెన్‌ ఎగ్‌ శరీరంలోకి ప్రవేశించడానికి  ప్రయత్నిస్తే  దాని కణాలు ఆ ఎంజైమ్‌ని విడుదల చేస్తాయి. వెంటనే పాలీకీట్‌ పురుగు శరీరం ఉబ్బిపోయి  రెండుగా చీలిపోయి, మరణిస్తుంది.

అధీరకు చాలా సంతోషమనిపించింది. ఓ అసాధ్యమనుకున్న కార్యాన్ని తను సాధించగలిగింది. గోల్డెన్‌ ఎగ్‌ యిక ప్రశాంతంగా బతగ్గలుగుతుంది. పునరుత్పత్తి ద్వారా తన స్పీషీస్‌ని పెంచుకోగలుగుతుంది.

శంకరన్‌ని, అసిమా ఛటర్జీని పిలిచి చెప్పింది. “రేపే ఈ గోల్డెన్‌ ఎగ్‌ని సముద్రంలో దాని పూర్వస్థానంలో వదిలేసి వద్దాం. ఇది సముద్రంలో ఉన్నప్పటి ఫోటోలని, వీడియోలని భద్రపరచండి. మన ల్యాబ్‌లో దాన్ని ఇన్ని రోజులు కాపాడిన ఆనవాళ్ళు ఏమైనా సరే వాటిని ఎవ్వరికీ కన్పించకుండా తుడిపేయండి. ఛాలెంజర్‌ డీప్‌ ఎక్స్‌పెడిషన్‌ వాళ్ళు చెప్పినట్టే మనం కూడా ‘ఏదో కొత్త స్పీషీస్‌ కన్పించింది. దాన్ని పట్టుకోడానికి ప్రయత్నించి విఫలమైనాం’ అని చెబ్దాం” అంది.

రాత్రి డిన్నర్‌ చేశాక కొద్దిసేపు డెక్‌ మీద పచార్లు చేసి, రూంకెళ్ళి పడుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఫోన్‌ మోగింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ చీఫ్‌ నుంచి వాట్సప్‌ కాల్‌.. ఎప్పుడూ లేంది నేరుగా డైరెక్టర్‌ నుంచే ఫోన్‌ రావడంతో అధీర కంగారు పడుతూ, లేచి కూచుని “హలో సర్‌” అంది.

“మీరు రూల్స్‌కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని నాకు కంప్లెయింట్‌ వచ్చింది. ముఖ్యమైన విషయాల్లో ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న మీ పై అధికార్లను సంప్రదించకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మీ మీద అభియోగం. దీనికి మీ సంజాయిషీ ఏమిటి?” డైరెక్టర్‌ గొంతులోని అసహనం స్పష్టంగా తెలుస్తోంది.

అధీరకు వెంటనే అది గోల్డెన్‌ ఎగ్‌కి సంబంధించిన వ్యవహారమేనని అర్థమైంది. కంప్లెయింట్‌ ఎవరు చేసి ఉంటారో కూడా అర్థమైంది. యం.కె. రావు తన మీద అక్కసుతో డైరెక్టర్‌ గారికి అంతా చెప్పేసి ఉంటాడు. అయినా ముందే బైటపడటం విజ్ఞత కాదనుకుని, “ఏమైంది సర్‌? రూల్స్‌కి విరుద్ధంగా నేనేం చేశాను? ఎవరు నామీద కంప్లెయింట్‌ చేశారు?” అని అడిగింది.

“ఎవరు కంప్లెయింట్‌ చేశారనేది అప్రస్తుతం. మీకు సముద్ర గర్భంలో గోల్డెన్‌ ఎగ్‌లా కన్పించే అన్నోన్‌ స్పీషీస్‌ దొరికిందట కదా. దాన్ని కంటెయినర్లో తెచ్చుకుని ల్యాబ్‌లో దానిమీద ఏవో ప్రయోగాలు చేస్తున్నారట కదా. మీమీద శాఖాపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. రేపు మీ షిప్‌ ఉన్న చోటకి మోటార్‌బోట్‌లో ఓ అసిస్టెంట్‌ని పంపిస్తున్నాను. గోల్డెన్‌ ఎగ్‌ ఉన్న కంటెయినర్‌ని తీసుకుని మీరు కూడా వచ్చేయండి. యూ ఆర్‌ నో మోర్‌ ఇన్‌చార్జ్‌ ఆఫ్‌ ద షిప్‌ అంజలిక. ఏ చార్జ్‌షీట్‌ ఈజ్‌ వెయిటింగ్‌ ఫర్‌ యూ హియర్‌” అనేసి ఫోన్‌ కట్‌ చేశాడు.

అధీర వెంటనే అప్రమత్తమైంది. రేపు మోటార్‌బోట్‌ వచ్చేలోపల గోల్డెన్‌ ఎగ్‌ని సముద్ర గర్బంలో దాచిపెట్టాలి. నైట్‌ డ్రెస్‌ని తీసేసి, సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించడానికి వీలుగా ఉండే డ్రెస్‌ వేసుకుంది. అసిమా ఛటర్జీని, శంకరన్‌ని ల్యాబొరేటరీ గదిలోకి రమ్మని ఫోన్‌ చేసి చెప్పింది.

శంకరన్‌ మారు మాట్లాడకుండా “యస్‌ మేడం. గివ్‌ మీ ఫైవ్‌ మినిట్స్‌” అన్నాడు. కానీ అసిమా ఛటర్జీ మాత్రం ప్రశ్నలతో విసిగించింది. “ఏమైంది మేడం? ఎనీథింగ్‌ సీరియస్‌?” అని అడిగింది. “యస్‌. సంథింగ్‌ అర్జెంట్‌” అంది అధీర. “రేపుదయం చూసుకోవచ్చు కదా మేడం. బాగా నిద్ర వస్తోంది. వొళ్ళంతా అలసిపోయినట్టుంది. పోనీ నేను లేకుండా  మేనేజ్‌ చేయగలరా?” అంది.

అధీరకు అసహనంతో పాటు కోపం కూడా వచ్చింది. “ఐదు నిమిషాల్లో మీరు ల్యాబ్‌లో ఉండాలి. నో మోర్‌ ఎక్స్‌క్యూజెస్‌” అనేసి, డీప్‌ సీ ఎక్స్‌ప్లొరేషన్‌ సబ్‌మెర్సిబుల్‌ టినోసాని నడిపే సబ్‌మైరైనర్స్‌ ఇద్దరినీ సముద్రంలోపలికి వెళ్ళడానికి తయారుగా ఉండమని హెచ్చరించింది. “టినోసాని సిద్ధం చేయడానికి మీకు ఎంత సమయం అవసరమౌతుంది?” అని అడిగింది.

“అరగంట సమయం చాలు మేడం” అన్నాడు చీఫ్‌ సబ్‌మెరైనర్‌.

“గుడ్‌.. దాదాపు ఏడు వేల మీటర్ల లోతుకి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యూయల్‌ సరిచూసుకోండి” అంది.

గోల్డెన్‌ ఎగ్‌ని తీసుకురావడానికి టినోసాలో వెళ్ళినపుడు దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టింది. పైకి రావడానికి కూడా దాదాపు అంతే సమయం పట్టింది. అంటే తొమ్మిది గంటల సమయం. రేపుదయం ఏడుగంటల లోపల తిరిగి షిప్‌లోకి చేరుకోవచ్చు. డైరెక్టర్‌ పంపే మోటార్‌బోట్‌ తమ షిప్‌ని చేరుకోడానికి చాలా సమయం పడ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మోటార్‌ బోట్‌ ఉదయం ఏడు లోపల వచ్చే అవకాశం లేదు.

అధీర శబ్దం చేయకుండా నడుస్తూ యం.కె. రావు విశ్రమించే గదిని చేరుకుని, తలుపుకి చెవి ఆనించి, ఏమైనా శబ్దాలు విన్పిస్తాయేమోనని ఎదురుచూసింది. లోపల నిశ్శబ్దం తప్ప ఎటువంటి అలికిడి విన్పించలేదు. యం.కె. రావు తన నిద్ర విషయంలో ఖచ్చితమైన సమయాలు పాటిస్తాడని ఆమెకు తెలుసు. పదింటికి పడుకుని ఉదయం ఆరింటికల్లా లేస్తాడు. సరిగ్గా ఎనిమిదింటికి మెస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాడు. అతను ఉదయం లేచాక కాలకృత్యాలు తీర్చుకుని, బైటికొచ్చేలోపల, తను పని ముగించుకుని తిరిగొచ్చేయకపోతే చాలా ప్రమాదం. మళ్ళా డైరెక్టర్‌కి ఫోన్‌ చేసి, జరిగిందంతా చెప్పేస్తాడు.

అధీర ల్యాబ్‌లోకి వెళ్ళే సమయానికే అక్కడ అసిమాఛటర్జీ, శంకరన్‌ ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

“మనం గోల్డెన్‌ఎగ్‌ని సేకరించిన విషయం, దానిమీద జరిపిన ప్రయోగాల గురించి డైరెక్టర్‌గారికి ఎవరో కంప్లెయింట్‌ చేశారు. వెంటనే మనం దాన్ని సముద్రం లోపల యథాస్థానంలో వదిలిరాకపోతే ప్రమాదం. టినోసా సిద్ధంగా ఉంది. బయల్దేరండి” అంటూ గోల్డెన్‌ ఎగ్‌ భద్రంగా ఉన్న హైపర్‌బారిక్‌ బయో కంటైన్‌మెంట్‌ క్యాప్యూల్‌ని రెండు చేతుల్తో ఎత్తి పట్టుకుంది. అది బరువుగా ఉంది. ఆమె ఇబ్బంది పడటం చూసి శంకరన్‌ ఆమెకు సాయం చేశాడు.

ముగ్గురూ మేధతో కలిసి, టినోసాని సమీపించారు. అప్పటికే సబ్‌మెర్సిబుల్‌ నేవిగేటర్స్‌ ఇద్దరూ సన్నద్ధంగా ఉన్నారు. అందరూ వర్తులాకారంలో ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్ళాక ద్వారాన్ని మూసేసి, క్రేన్‌ సహాయంతో టినోసాని నీళ్ళలోకి దింపారు. కొంత దూరం ముందుకు ప్రయాణించాక, టినోసా నీళ్ళ లోపలికి ప్రయాణించసాగింది.

అధీర అబ్జర్వేషన్‌ డోమ్ దగ్గర నిలబడి, కర్వడ్‌ గ్లాస్‌ మీద ప్రొజెక్ట్‌ అవుతున్న సముద్రగర్భ స్థలాకృతిని, మ్యాపింగ్‌‌ని తెలిపే బాతిమెట్రిక్‌ డేటాని పర్యవేక్షించసాగింది.

“వేగం స్థిరంగా ఉంది మేడం. బైటి పీడనం నలభై ఎనిమిది మెగాపాస్కల్స్‌ ఉంది. అదింకా పెరుగుతోంది” అన్నాడు అసిస్టెంట్‌ నేవిగేటర్‌.

అధీర సబ్‌మెర్సిబుల్‌ చుట్టూ ఆవరించి ఉన్న దట్టమైన చీకట్లోకి చూడసాగింది. ద్రవాకారంలోకి మారిపోయినట్టు కన్పిస్తున్న చీకటి..

సబ్‌మెర్సిబుల్‌ నీటిని చీల్చుకుంటూ వెళ్ళే దోవలో నల్లటి తెరలు తెరలుగా కదుల్తున్న చీకటి.. కొన్ని గంటల ప్రయాణం తర్వాత, “మనం చేరుకోవాల్సిన టార్గెట్‌ ఆరువందల మీటర్ల దూరంలో ఉంది” అంటూ చీఫ్‌ నేవిగేటర్‌ గొంతు విన్పించడంతో అధీర తల తిప్పి అతని వైపు చూసింది.

“మనం గోల్డెన్‌ ఎగ్‌ని ఎక్కడినుంచి తీసుకొచ్చామో సరిగ్గా అక్కడికే వెళ్తున్నామా?” అని అడిగింది.

“యస్‌ మేడం. అదే స్పాట్‌కి ప్రస్తుతం ఐదువందలయాభై మీటర్ల దూరంలో ఉన్నాం” అన్నాడతను.

మరికొంత సమయం తర్వాత స్క్రీన్‌ మీద సముద్ర తల్పం కన్పించసాగింది.

“బాగా దగ్గరికి తీసుకెళ్ళండి” అంది అధీర.

సబ్‌మెర్సిబుల్‌ మరికొంత కిందికి కదిలి, పక్కకు ప్రయాణించి, ఆగిపోయింది.

ఆ ప్రదేశమంతా సిల్ట్‌తో కప్పబడి ఉంది. రోబోటిక్‌ హ్యాండ్‌ సహాయంతో అక్కడ పేరుకుపోయి ఉన్న  సెడిమెంట్స్‌ని తొలగించాక,  గోల్డెన్‌ ఎగ్‌ని  సాఫ్ట్‌ గ్రిప్పర్స్‌ ఉన్న రోబోటిక్‌ హ్యాండ్‌ సహాయంతో క్యాప్సూల్‌ నుంచి బైటికి తీసి, దాన్ని జాగ్రత్తగా సముద్ర తల్పం మీద దాని పూర్వస్థానంలో ఉంచారు. గోల్డెన్‌ ఎగ్‌ వూదారంగు కాంతిని వెదజల్లుతూ ఒకసారి సంకోచించి, మళ్ళా వ్యాకోచించింది.

మేధ తన మెటాలిక్‌ గొంతుతో కాకుండా సున్నితమైన గొంతుతో పలికింది, “నా ప్రాణాన్ని కాపాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా జాతి అంతరించకుండా రక్షించి మహోపకారం చేసిన మీకు కృతజ్ఞతలు. నా మెమోరీ కణాల్లో మీ అందరి పేర్లూ, రూపాలు ముద్రించబడిఉన్నాయి. అవి కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మా సంతతిలోని మెమోరీ కణాల్లో నిక్షిప్తమై ఉంటాయి. మా జాతిని కాపాడటానికి అధీర చేసిన సాహసం మేము ఎన్నటికీ మరిచిపోము.”

ఎప్పుడూ లేనిది, ఆ మాటలు వినగానే అధీర భావోద్వేగానికి లోనయింది. ఆమె కళ్ళలో చప్పున నీళ్ళూరాయి.

“గోల్డెన్‌ ఎగ్‌ని వదిలేసి వెళ్తున్నందుకా ఆ కన్నీళ్ళు?” అన్నాడు శంకరన్‌.

“దానికి గోల్డెన్‌ ఎగ్‌ అని పేరు పెట్టి తప్పు చేశాం. అది ఎగ్‌ కాదు. సంపూర్ణంగా ఎదిగిన జీవి.  నాకైతే ఇన్నాళ్ళూ కలిసున్న ఓ స్నేహితుడి నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు అన్పిస్తోంది. దానికి మనలాంటి రూపం లేదు. కానీ మిగతా విషయాల్లో అది మనలానే స్పందించే జీవి. నా జీవితం ధన్యమైంది. మన ఆలోచనల్ని అర్థం చేసుకుని, మనతో సంభాషించే సముద్రజీవిని చూశానన్న తృప్తి.. ఈ విషయం ఎవరికై నా  చెప్పినా ఎవ్వరూ నమ్మరు” అంది అసిమా ఛటర్జీ.

“మనం ఎవ్వరికీ చెప్పం. ఈ రహస్యం మనలోనే సమాధి అయిపోవాలి” అంది అధీర.

(ఇంకా ఉంది)

Exit mobile version