[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అధీర గోల్డెన్ ఎగ్ గురించి పై అధికారులకి తెలియజేయకపోవడం, దాన్ని శాశ్వతంగా రక్షించాలని ప్రయత్నించడం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఎం.కె.రావుకి నచ్చవు. పరాన్నజీవుల నుంచి గోల్డెన్ ఎగ్‌ని రక్షించే ప్రయత్నం చేయాలని అధీర అంటే, అది మన పని కాదు, కొత్త స్పీషిస్ కనిపిస్తే ఆ సమాచారాన్ని ఇన్‌స్టిట్యూట్‌కి అందజేయాలని వాదిస్తాడు రావు. గోల్డెన్ ఎగ్‌కి నష్టం కలిగిస్తున్న పేరసైట్‌కి విరుగుడు కనుక్కున్నాకా, అప్పుడు గోల్డెన్ ఎగ్ జీన్స్‌లో మార్పులు చేసి, దాన్ని సముద్ర గర్భంలో వదిలేస్తాననీ; ఓ కొత్త స్పీషీస్ జీవి కన్పించిందని చెప్తాను తప్ప, దాన్ని క్యాప్సూల్‌లో తెచ్చుకున్న విషయం గాని, దాని అసాధారణమైన జ్ఞాపకశక్తి గురించి గాని, అది స్పందించిన విషయంగాని చెప్పనంటుంది అధీర. ఆమెతో విభేదిస్తాడు రావు. గోల్డెన్‌ఎగ్‌శరీరంలోంచి తీసిన పేరసైట్ల శాంపుళ్ళను ప్రపంచంలో పేరెన్నికగన్న బయోల్యాబ్స్‌కి పంపిస్తుంది. వాటి రిపోర్టు వచ్చాక, వాటి ప్రకారం ఏం చేయాలో అర్థం చేసుకుని, మెరైన్ జెనెటిక్ ఇంజనీర్ సుధాంశుతో కలిసి పనిచేసి, ఓ ఎంజైమ్‌ని కనుక్కుంటుంది. గోల్డెన్ ఎగ్ డిఎన్‌ఎ లో మార్పులు చేస్తారు. ఫలితంగా మళ్ళీ ఎప్పుడైనా ఆ పేరసైట్ గోల్డెన్ ఎగ్ శరీరంలోకి ప్రవేశిస్తే ఆ ఎంజైమ్ విడుదలై, అది నశిస్తుంది. ఇన్‍స్టిట్యూట్‌కి ఇవన్నీ తెలియకుండా ఉండడం కోసం సిబ్బందికి తగిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ రాత్రి డెక్ మీద ఉన్నప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ నుంచి వాట్సప్ కాల్ వస్తుంది. ఆయన అధీరపై వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నిస్తాడు. ఆమెను చీఫ్‌గా తొలగిస్తున్నట్టు చెప్పి, మర్నాడు ఓ స్పెషల్ బోట్‌ని పంపిస్తాననీ, వెంటనే వచ్చి తనని కలవాలని చెప్తాడు. అధీర అప్రమత్తమవుతుంది. శంకరన్, అసీమా, మేధలతో కల్సి సబ్‍మెర్సిబుల్‍లో వెళ్ళి, గోల్డెన్ ఎగ్ ఎక్కడైతే దొరికిందో, ఆ స్థలానికి చేరి దాన్ని అక్కడ వదిలేస్తుంది. మేధ ద్వారా గోల్డెన్ ఎగ్ సిబ్బందికీ, అధీరకి కృతజ్ఞతలు చెబుతుంది. ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని ఆదేశిస్తుంది అధీర. – ఇక చదవండి.]
సబ్‌మెర్సిబుల్ టినోసా వూర్థ్వముఖంగా ప్రయాణం మొదలెట్టింది. సముద్ర ఉపరితలానికి చేరుకున్నాక అంజలిక వైపుకు ప్రయాణించింది. సబ్‌మెర్సిబుల్ ఓడను చేరుకునేటప్పడికి సమయం ఉదయం ఆరు గంటలు దాటి పది నిముషాలు.
అధీర తన గదికి వెళ్ళకుండా నేరుగా ల్యాబ్‌లోకి ప్రవేశించింది.
బయోకంటైన్‌మెంట్ క్యాప్సూల్‌లో గోల్డెన్ ఎగ్ ఎంత సైజుందో అంతే సైజున్న గాజు గోళాన్ని పెట్టి, దానిలోపల బ్యాటరీతో వెలిగే లైట్‌ని ఏర్పాటు చేసింది. లైట్ గాజు గోళం గోడలమీద పడి అది బంగారు రంగు గ్లోబ్‌లా వెలిగిపోతోంది. సంతృప్తిగా తల పంకించి, తన గదికెళ్ళి, ఎనిమిది వరకు విశ్రాంతి తీసుకుంది.
ఎప్పటికిమల్లే సరిగ్గా ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్ వడ్డించుకుని, ఓ టేబుల్ దగ్గర కూచుని మెల్లగా తినసాగింది. ఆమెకు కొద్దిదూరంలో యం. కె. రావు కూచుని ఉన్నాడు. అతను తన వైపే చూస్తున్నాడని అర్థమైనా, తెలియనట్టే తల వొంచుకుని బ్రేక్‌ఫాస్ట్ తినడంలో నిమగమైంది.
అదే సమయంలో “గుడ్‌మార్నింగ్ చీఫ్” అంటూ శంకరన్ తన ప్లేట్‌తో వచ్చి ఆమె పక్కన కూచున్నాడు.
“ఇంకెక్కడి చీఫ్ హోదా? మీ మేడం సస్పెండ్ అయిపోయిందిగా. ఇకనుంచి అంజలిక షిప్‌కి చీఫ్ సైంటిష్ట్‌ని నేనే” వంకరగా నవ్వుతూ అన్నాడు యం.కె,రావు.
“మా మేడం సస్పెండ్ అయ్యారని మీకెవరు చెప్పారు? అయినా సస్పెండ్ అయ్యేంత తప్పు మేడం ఏం చేశారని?” కోపంగా అడిగాడు శంకరన్. తను ప్రేమిస్తున్న యువతిని రావు చులకనగా మాట్లాడటం అతనికి నచ్చలేదు.
“గోల్డెన్ ఎగ్ దొరికిన విషయాన్ని ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకు చెప్పకుండా దాచిపెడ్తే సస్పెండ్ చేయకుండా వూరుకుంటారా? సస్పెండే చేస్తారో ఉద్యోగంలోంచి పీకేసి ఇంటికే పంపిస్తారో తొందర్లోనే తెలుస్తుంది” అన్నాడు రావు.
“సస్పెండ్ ఆర్డర్ చేతికొచ్చేవరకు నేనే ఈ షిప్‌కి చీఫ్ అనే విషయం రావు గారికి తెలియదనుకుంటాను. అయినా నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవడం తప్ప ఇటువంటి సస్పెన్షన్ బెదిరింపులకు ఎప్పుడూ భయపడింది లేదు” శంకరన్‌తో అంటున్నట్టే అని రావు వైపు నిరసనగా చూసింది.
“ఆర్డర్ చేతికి రావడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. ఓ గంటలోపలే అందుతుంది వేచి చూడండి” అన్నాడు రావు ఎగతాళిగా నవ్వుతూ.
అధీర ఏమీ మాట్లాడలేదు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం పూర్తి చేసి, డైనింగ్ రూం నుంచి బైటికి నడిచింది. ఆమె వెనకే శంకరన్ కూడా వెళ్ళాడు.
“నాకో సాయం చేస్తారా?” అని అడిగింది అధీర.
“తప్పకుండా చేస్తాను మేడం” అన్నాడు శంకరన్.
“అదేమిటి? ఏం సాయం కోరబోతున్నానో తెలుసుకోకుండానే చేస్తానంటున్నారు” నవ్వుతూ అంది.
“మీ కోసం ఏమైనా చేస్తాను మేడం.”
“అందులో రిస్క్ ఉంది. పర్వాలేదా?”
“అన్నింటికంటే పెద్ద రిస్క్ ప్రాణంతో చెలగాటమేగా. పర్వాలేదు. మీ కోసం ప్రాణమైనా..” అంటూ శంకరన్ మధ్యలోనే ఆపేశాడు.
“ఇప్పుడు నాకర్థమైంది. మీకెవరో సెల్వీలాంటి స్త్రీ ఎదురుపడిందని చెప్పారుగా. ఆ స్త్రీని నేనేనన్నమాట.” శంకరన్ ఏమీ మాట్లాడకుండా తలవొంచుకుని నిలబడ్డాడు.
“ప్రేమించడం ఏమీ తల వొంచుకునేంత నేరం కాదు. అయినా మీ ప్రాణాలకేమీ ప్రమాదం రానివ్వను. కానీ తర్వాత మీ పైన ఇన్‌స్టిట్యూట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.”
“నేను కంప్యూటర్ నాలెడ్జ్‌లో ఎక్స్‌పర్ట్‌ని మేడం. ఉద్యోగంలోంచి తీసేసినా పర్వాలేదు. నన్ను వెతుక్కుంటూ ఉద్యోగాలొస్తాయి.”
“మీకు మీ మీదున్న కాన్ఫిడెన్స్‌కి హ్యాట్సాఫ్. ఇంతకూ మీకు ఈతకొట్టడం వచ్చా?”
“ఈత కొట్టడంలో ఛాంపియన్ని మేడం” ఉత్సాహంగా అన్నాడు.
“సముద్రంలో ఎప్పుడైనా ఈత కొట్టారా?”
“నేను చెన్నయ్ వాసినన్న విషయం మర్చిపోయినట్టున్నారు. సముద్రంలో చేపలా ఈదుకుంటూ పోగలను. ఇప్పుడు ఉన్నపళంగా సముద్రంలోకి దూకెయ్యమంటారా? ఈత కొట్టడంలో నా నైపుణ్యం ఏమిటో మీకు తెలియాలిగా” అన్నాడు శంకరన్.
“ఇప్పుడు కాదు.. సమయం వచ్చినపుడు దూకితే చాలు” అంటూ ఏం చేయాలో అతనికి మాత్రమే విన్పించేలా మెల్లగా చెప్పింది.
“ఓస్.. ఇంతేనా.. చూస్తూ ఉండండి. ఎంత బాగా నటిస్తానో” అన్నాడు.
ఇద్దరూ ఏమీ ఎరగనట్లే తమ తమ పనుల్లో నిమగమైనారు.
మరో గంట తర్వాత ఓ మోటార్‌బోట్ అంజలిక షిప్‌కి సమీపంగా వచ్చి, దాంతో పాటు సమాంతరంగా అదే వేగంతో ప్రయాణించసాగింది. దాన్లో ఉన్న వ్యక్తి అధీరకు ఫోన్ చేసి, “మేడం.. నా పేరు విష్వక్. డైరెక్టర్ గారు మిమ్మల్ని పిల్చుకు రమ్మని నన్ను పంపించారు. షిప్‌ని ఆపించండి” అన్నాడు.
అంజలిక ఓడ ఆగిపోయాక విష్వక్ అందులోకి ప్రవేశించి, అధీర దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
“కంటెయినర్ క్యాప్సూల్ ఎక్కడుంది? దాన్ని నాకప్పగించండి” అన్నాడు.
“బయోకంటైన్‌మెంట్ క్యాప్యూల్ ల్యాబొరేటరీలో ఉంది. అది చాలా బరువుంది. మీరొక్కరూ హ్యాండిల్ చేయలేరు” అంది అధీర.
“పర్వాలేదు మేడం. ఎంత బరువున్నా మోయగలను. ల్యాబ్‌కి పదండి” అన్నాడు విష్వక్.
“సారీ. నేను అటువంటి రిస్క్ తీసుకోలేను. చాలా ముఖ్యమైన స్పెసిమెన్ అందులో ఉంది. పొరపాటున అది మీ చేతుల్లోంచి జారి కిందపడితే ప్రమాదం” అంటూ శంకరన్ వైపు తిరిగి, “మిస్టర్ శంకరన్.. కంటెయినర్‌ని మోటార్‌బోట్‌లోకి చేర్చడంలో మిస్టర్ విష్వక్‌కి సాయం చేయండి. ఇద్దరూ చెరో వైపు పట్టుకుంటే సులభంగా దాన్ని మోయగలరు. భద్రంగా కూడా ఉంటుంది” అంది.
“ష్యూర్ మేడం” అంటూ శంకరన్ లేచి నిలబడ్డాడు. విష్వక్ ఆమె మాటకు ఎదురుచెప్పలేకపోయాడు. ముగ్గురూ ల్యాబ్‌లోకి ప్రవేశించారు. కంటెయినర్‌ని ఒకవైపు శంకరన్, మరో వైపు విష్వక్ పట్టుకుని లేపారు.
“ఇదేమీ మోయలేనంత బరువుగా లేదు మేడం. నేనొక్కడ్ని చాలు” మెల్లగా నడుస్తూ అన్నాడు విష్వక్.
“అది నిజమే అయినా మరింత జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదుగా” వాళ్ళ పక్కన కొద్దిగా ఎడంగా నడుస్తూ అంది అధీర. విష్వక్ కంటెయినర్‌ని ఒక చివర పట్టుకుని ముందు నడుస్తుంటే అతని వెనక శంకరన్ మరో చివర పట్టుకుని నడుస్తున్నాడు. షిప్‌లోంచి మోటార్ బోట్‌లోకి వెళ్ళాల్సి వచ్చినపుడు మొదట విష్వక్ మోటార్‌బోట్ మీద కాలుపెట్టి నిలబడ్డాడు. శంకరన్ షిప్ మీదనుంచి ఓ కాలు తీసి మోటార్ బోట్ బోర్డింగ్ దగ్గర పెట్టబోతూ అదుపుతప్పి పెద్దగా అరుస్తూ నీళ్ళలోకి పడిపోయాడు. అలా పడ్తున్న సమయంలో కంటెయినర్‌ని బలంగా పట్టుకుని ఉండటం వల్ల అది విష్వక్ చేతిలోంచి విడిపోయి పూర్తిగా శంకరన్ చేతిలోకి వచ్చేసింది. అది బరువుగా ఉండటం వల్ల శంకరన్ దాంతోపాటు జారిపోయి నీళ్ళలో పడిపోయాడు.
విష్వక్‌కి జరిగిందేమిటో అర్థం కాక విస్తుపోయి నిలబడ్డాడు.
అధీర “శంకరన్ నీళ్ళలో పడిపోయాడు. కాపాడండి” అంటూ పెద్దగా అరుస్తూ షిప్ లోపలికి పరుగెత్తింది. డెక్ పైనుంచి లైఫ్ జాకెట్‌ని శంకరన్ వైపుకి విసిరారు. అది అతనున్న స్థానానికి కొంత అవతలగా పడటంతో శంకరన్ ఈదుకుంటూ వెళ్ళి లైఫ్ జాకెట్‌ని అందుకుని, దాన్ని తొడుక్కున్నాడు. దాని సహాయంతో అతను ఈత కొట్టకుండానే నీళ్ళ పైన తేలుతూ కన్పించాడు. విష్వక్ వెంటనే అప్రమత్తమై మోటార్ బోట్‌ని శంకరన్‌కి సమీపంగా తీసుకెళ్ళి అతన్ని లోపలికి లాక్కున్నాడు. నీళ్ళలో పడిపోయిన కంటెయినర్‌ని వెతకడం కోసం శతవిధాలా ప్రయత్నంచినా దాని జాడ కన్పించలేదు. ఓడకు అమర్చి ఉన్న సోనార్ల వల్ల కంటెయినర్ ఎంత అడుక్కి చేరుకుందో తెలియకపోవడం వల్ల స్పార్కిల్ రోబోట్ సాయంతో వెతకసాగారు. అది పడిపోయిన ప్రదేశంలో నేరుగా కిందికి జారకుండా ఓషన్ కరెంట్స్ వల్ల పక్కలకు నెట్టబడే అవకాశం ఉంది కాబట్టి ఐదువందల మీటర్ల రేడియస్‌లో గంటల తరబడి స్పార్కిల్‌కున్న శక్తివంతమైన లైట్లు, హై డెఫినిషన్ కెమెరాల సాయంతో వెతికారు. అయినా అది ఎక్కడుందో తెలియలేదు.
“స్పార్కిల్ రోబోట్ కెమేరాలకు అందడం లేదంటే కంటెయినర్ నాలుగువేల ఐదు వందల మీటర్ల కన్నా మరింత లోతుకి దిగబడిఉంటుంది. సబ్‌మెర్సిబుల్ టినోసాలో వెళ్ళి వెదకడమొక్కటే మార్గం. నేనూ అసిమా ఛటర్జీ వెళ్ళి వెతుకుతాం” అంది అధీర.
అదే సమయంలో డైరెక్టర్ నుంచి ఫోనొచ్చింది. “కంటెయినర్ ఎలా సముద్రంలో పడిపోయింది? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు?” అతను కోపంగా అడిగాడు.
“తప్పు మా అఫిషియల్స్‌ది కాదు. శంకరన్ పట్టుకున్నంత బలంగా మీరు పంపిన విష్వక్ పట్టుకుని ఉంటే అది అతని చేతుల్లోంచి జారిపోయేది కాదు. శంకరన్‌తో పాటు అది నీళ్ళలో పడిపోవడానికి కారణం అదే సర్” అంది అధీర.
“సరిగ్గా వెతికారా? ఎంత వెతికినా ఎందుకు లొకేట్ చేయలేకపోతున్నారు? అదేమీ అదైశ్యమైపోయి ఉండదుగా. అది నీళ్ళలో మునిగిన ప్రాంతం తెలుసు. పడి కూడా కొన్ని గంటలేగా అయింది. మరి ఏమైపోయినట్టు?” డైరెక్టర్ అసహనంగా అరిచాడు.
“అది మన స్పార్కిల్‌కి అందనంత లోతున ఉండి ఉంటుంది సర్. నేను సబ్‌మెర్సిబుల్‌లో వెళ్ళి వెతుకుదాం అనుకుంటున్నా” అంది అధీర.
“వద్దు. ఆ పనిని యం.కె. రావు గారికి అప్పగించాను. మీరు విష్వక్‌తో పాటు వచ్చి నన్ను కల్సుకోండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ” కటువుగా అని ఫోన్ కట్ చేశాడు.
అధీర తనలో తను మెల్లగా నవ్వుకుంది.
మోటార్ బోట్‌లోంచి షిప్‌లోకొచ్చిన శంకరన్‌తో “ఆర్ యూ ఆల్‌రైట్?” అని అడిగింది.
“యస్ మేడం” అన్నాడతను పొడి తువ్వాలుతో వొంటిని తుడుచుకుంటూ. “సారీ మేడం. నాకు చాలా గిల్టీగా ఉంది. కంటెయినర్‌ని కాపాడలేకపోయాను. పట్టు తప్పింది. నా తప్పే” అన్నాడు.
“కొన్ని ప్రమాదాలు అలా జరిగిపోతాయి. అవి మన కంట్రోల్‌లో ఉండవు. డోంట్ ఫీల్ బ్యాడ్. యు డిడ్ వాట్ బెష్ట్ యూ కెన్ డూ” అంటూ అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని, మోటార్ బోట్‌లోకి ఎక్కింది.
***
అధీరకు చార్జ్‌షీట్ ఇచ్చారు. అందులో ముఖ్యమైన అభియోగం అసాధారణమైన తెలివితేటలు గల ఓ కొత్త సముద్ర జీవిని పట్టుకుని, ఇన్‌స్టిట్యూట్‌కి తెలియబర్చకుండా దానిమీద రకరకాల ప్రయోగాలు చేసి, ఆ ప్రయోగఫలితాల్ని కూడా ప్రపంచానికి వెల్లడి చేయకుండా దాచి పెట్టిందని. రెండో అభియోగం ఆ సముద్ర జీవి భద్రపరచబడిఉన్న కంటెయినర్‌ని ఇన్‌స్టిట్యూట్‌కి అందచేసే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి. అది సముద్రంపాలు కావడానికి కారణమైందని. ఆమె మీద మోపబడిన అభియోగాల దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆమెను సస్పెండ్ చేశారు.
అధీర వ్రాతపూర్వకంగా వాటికి సమాధానం ఇచ్చింది. “నామీద మోపబడిన అభియోగాలన్నీ నిరాధారమైనవి. సముద్రగర్భంలో మాకు కొత్త స్పీషీస్‌కి చెందిన రెండు జీవులు కన్పించాయి. వాటిలో ఒకటి బంగారు రంగులో మెరుస్తూ కన్పించిన గోల్డెన్ ఎగ్. ఆ స్పీషీస్‌కి సంబంధించి అదొక్కటే దొరికింది. రెండో స్పీషీస్ దారం ఆకారంలో ఉన్న పరాన్న జీవులు. వీటిని చాలా సంఖ్యలో మేము సేకరించగలిగాం. ఇవి మన శాస్త్రవేత్తలకు తెలియని కొత్త రకం పాలీకీట్ పురుగులు కావడంతో మొదట వాటిమీద పరిశోధనలు చేయడం మొదలెట్టాను. ఛాలెంజర్ డీప్ ఎక్స్‌పెడిషన్‌లో వాళ్ళకు కన్పించి, దొరక్కుండా తప్పించుకున్న స్పీషీస్ అనే అనుమానం రావడంతో వాటిమీద మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ స్పీషీస్ గురించి మీకు సమాచారంతో పాటు శాంపుల్స్‌ని కూడా అందచేశాను. మీ అనుమతితో ప్రపంచంలో పేరెన్నికగన్న మరికొన్ని బయో ల్యాబొరేటరీలకు వాటి శాంపుల్స్‌ని పంపించాను. అదంతా సానుకూలపడ్డాక, గోల్డెన్ ఎగ్ గురించి ప్రాథమికంగా కొన్ని పరిశోధనలు చేశాక, ఆ సమాచారాన్ని మీకు అందించాలనుకుంటున్న తరుణంలో మీరు నన్ను సస్పెండ్ చేయడం, నన్ను అంజలిక షిప్ చీఫ్ సైంటిష్ట్ పదవి నుంచి తొలగించడం జరిగాయి. మీరు అభియోగపత్రంలో రాసినట్టు గోల్డెన్ ఎగ్ మీద నేను పరిశోధనలేమీ చేయలేదు. దాని స్వభావం గురించి కానీ, జీవన శైలి గురించి కానీ ఏమీ తెల్సుకోకముందే మీరు నన్ను పదవీచ్యుతురాలిని చేశారు. ఇక గోల్డెన్ ఎగ్‌ని భద్రపరచిన కంటెయినర్ సముద్రంలోకి జారిపడిపోవడంలో నా ప్రమేయం ఏముందో అర్థం కావడం లేదు. దాన్ని షిప్ నుంచి మోటార్ బోట్‌లోకి చేర్చడం కోసం మిస్టర్ శంకరన్, మిస్టర్ విష్వక్ మోసుకుంటూ తీసుకొస్తున్న సమయంలో శంకరన్ జారి పడిపోయాడు. నేను కేవలం ప్రేక్షకురాలిగా మిగిలిపోయిన సందర్భంలో జరిగిన దుర్ఘటన అది. దానికి నన్ను బాధ్యురాలిని చేయడం అన్యాయం. నా మీద కావాలనే కొంతమంది కక్ష కట్టుకుని లేనిపోని అభాండాలతో నా పైన కంప్లెయింట్ చేసి ఉంటారని మనవి చేస్తున్నాను. నన్ను చీఫ్ సైంటిష్ట్‌గా తొలగిస్తే ఆ పదవి తమకు దక్కుతుందన్న దుర్బుద్ధితో ఎవరో చేసి ఉంటారనిపిస్తోంది. మీరు అంజలికలో నాతో పాటు పనిచేసిన వాళ్ళని ఎంక్వయిరీ చేస్తే నిజానిజాలు తెలుస్తాయి” అని రాసి, డైరెక్టర్‌కి పంపించింది.
అంజలిక ఓడలోని శాస్త్రవేత్తల్ని, సిబ్బందిని ఎవర్ని అడిగినా డాక్టర్ రావు తప్ప మిగతా అందరూ అధీర చెప్పిందే నిజమని, రావు గారు చెప్తున్నదే కట్టుకథ అని నొక్కి వక్కాణించారు.
ఓడలో తనతో పాటు పనిచేసిన శాస్త్రవేత్తలు, సిబ్బంది తనకు మాటిచ్చిన ప్రకారం డైరెక్టర్ గారి విచారణలో తనకు అనుకూలంగా చెప్పినందుకు అధీర చాలా సంతోషపడింది.
ఆమె మీద మోపిన అభియోగాలు రుజువు కాకపోవడం వల్ల సస్పెన్షన్‌ని ఎత్తివేసి, అధీరను గోవాలోని డోనాపాలాలో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌కి బదిలీ చేశారు.
టెంపరరీ బేసిస్ మీద కంప్యూటర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలోకి తీసుకున్న శంకరన్‌ని, ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, తద్వారా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఆస్తి నష్టం కారణం చూపుతూ ఉద్యోగంలోంచి తొలగించారు.
మళ్ళా ఉద్యోగంలో చేరినందుకు అధీరకు సంతోషంగా ఉన్నా, ఓ భయం మాత్రం వెంటాడసాగింది. సముద్రగర్భాన్ని శోధించే క్రమంలో ఎప్పటికైనా కంటైనర్ వాళ్ళకు దొరికే అవకాశం ఉంది. అందులో ఉన్నది గోల్డెన్ ఎగ్ అనబడే సముద్ర జీవి కాదని, లెడ్‌బ్యాటరీతో నడిచే లైట్ లోపల పెట్టిఉన్న ఓ గాజుగోళమని తెలిసిపోతుంది. అప్పుడు తప్పకుండా దానివెనుక ఉన్నది తనే అని అర్థమైపోతుంది. గోల్డెన్ ఎగ్ ఉనికిని రహస్యంగా ఉంచడం కోసమే ఇదంతా తను చేసిన విషయం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తనకు శిక్ష తప్పదు. శిక్ష పడినా పర్వాలేదనిపించింది. ఓ అద్భుతమైన, అసాధారణమైన తెలివితేటలు గల సముద్ర జీవిని కాపాడిన సంతృప్తి ఈ జీవితానికి చాలనుకుంది.
***
ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయం.. సౌత్ గోవాలోని పాలోలెం బీచ్ టూరిష్టులతో సందడిగా ఉంది. అధీరకు గోవాలో ఉన్న బీచ్‌లన్నిటిలోకి ఆ బీచ్ అంటే చాలా ఇష్టం. ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున అర్ధచంద్రాకారంగా కన్పించే బీచ్ అది. దాదాపు రెండు వందల మీటర్ల లోపలి వరకు వెళ్ళినా నీళ్ళు మనిషి నడుం వరకే లోతు ఉంటాయి. ఈత కొట్టేవాళ్ళకు, కయాకింగ్ చేసేవాళ్ళకు చాలా అనువైన బీచ్ కావడం వల్ల ఆదివారం రోజు టూరిష్ట్‌ల సందడి ఎక్కువగానే ఉంటుంది. బీచ్ నుంచి కొద్ది దూరంలో వరసగా తాటిచెట్లు.. యాత్రీకుల వసతి కోసం నిర్మించిన రంగు రంగుల వసతిగృహాలు కన్పిస్తున్నాయి. అక్కడినుంచి పడవల్లో కొంతమంది బట్టర్‌ఫ్లై బీచ్‌కి, డాల్ఫిన్స్‌ని చూడటానికి వెళ్తుంటారు.
అధీరకు అక్కడి సూర్యాస్తమయం చూడటమంటే మరీ ఇష్టం.. దూరంగా ఉన్న రెండు కొండల మధ్య సూర్యుడు అస్తమించే దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూసినా మొదటిసారి చూస్తున్నంత కొత్తగా, అద్భుతంగా అన్పిస్తుంది.
ఆమెకు అనాయాసంగానే గోల్డెన్ ఎగ్ గుర్తొచ్చింది. ఈ పాటికి ప్రత్యుత్పత్తి జరిగి, మరికొన్ని గోల్డెన్ ఎగ్స్ పుట్టి ఉంటాయనిపించింది. తమకు దొరికిన గోల్డెన్ ఎగ్ అన్నీ చనిపోయాక మిగిలిన చివరి జీవి కాబట్టి దాన్ని మళ్ళా సముద్రం లోపలికి వదిలేసింది కానీ లేకపోతే అటువంటి అద్భుత సృష్టి గురించి ప్రపంచ మానవాళి దృష్టికి తెచ్చి ఉండేది. ఎంత వద్దనుకున్నా ఓ వైపు ఆ గిల్ట్ బాధిస్తోంది. శాస్త్రవేత్తగా తన ధర్మాన్ని తను సరిగ్గా నిర్వర్తించలేదు. మానవత్వం ఉన్న మనిషిగానే స్పందించింది.
శంకరన్ కూడా గుర్తొచ్చాడు. పాపం తన వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మరో ఉద్యోగం దొరికిందో లేదో.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో.. తన పర్సనల్ ఫోన్ నెంబర్ అడిగినా తను ఇవ్వలేదు. తనకు ప్రశాంతంగా బతకడం ఇష్టం. తన వృత్తికి సంబంధించిన విషయాలు తప్ప ఉబుసుపోక కబుర్లు అస్సలు ఇష్టం ఉండదు.
బీచ్‌లో కబుర్లాడుకుంటూ నడుస్తున్న జంటల్ని చూస్తే ఆమెకెంత ఆశ్చర్యమో.. ఏం మాట్లాడుకుంటారు? విసుగు పుట్టదా? అద్భుతమైన వెలుగుతో నిండిన వాళ్ళ మొహాలు చూస్తే అలా అన్పించడం లేదు. మాటల్ని మకరందంలా గ్రోలుతూ ఆస్వాదిస్తున్నట్టే అన్పిస్తోంది.
డిగ్రీలో ప్రేమిస్తున్నానంటూ వెంటబడిన కల్యాణ్ గుర్తొచ్చాడు. తను కూడా ప్రేమించింది. కానీ తను దేన్నయితే ప్రేమ అనుకుందో కళ్యాణ్ ఉద్దేశంలో అది ప్రేమ కాదు. ప్రేమంటే శారీరకంగా దగ్గరకావడం.. ప్రేమంటే పెళ్ళి చేసుకుని, కాపురం చేయడం.. ప్రేమంటే పిల్లల్ని కని, వాళ్ళని పెంచి పెద్ద చేయడం.. తనకెందుకో మొదట్నుంచి అవేవీ ఇష్టం ఉండవు. ప్రేమ రెండు హృదయాలకు సంబంధించింది కదా.. ఈ శరీరాల కలయికతో దానికేమిటి సంబంధం?
(ముగింపు వచ్చే వారం)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
