[శ్రీ సలీం వ్రాసిన ‘వూదారంగు సముద్రం’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము.]
[గోల్డెన్ ఎగ్‌ని దాని స్థానంలో వదిలిపెట్టి, అందరూ వచ్చేస్తారు. అధీర తన గదికి వెళ్ళకుండా నేరుగా ల్యాబ్ లోకి వెడుతుంది. గోల్డెన్ ఎగ్ పరిమాణంలో ఉన్న ఓ గాజు గోళాన్ని బయోకంటెయినర్‌లో ఉంది, దాని లోపల అమర్చిన బ్యాటర్ లైట్ ద్వారా అది వెలుగులు చిందించడం చూసి తృప్తిచెంది తన గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. ఎనిమిదిగంటలకి ఎప్పటిలానే డైనింగ్ ప్లేస్‌లో బ్రేక్‌ఫాస్ట్ వడ్దించుకుని ఓ బల్ల మీద కూర్చుని తింటూ ఉంటుంది. ఆమెకు కొద్దిదూరంలో యం. కె. రావు కూచుని ఉంటాడు. అదే సమయంలో శంకరన్ అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చీఫ్ అని ఆమెను పలకరిస్తాడు. ఆమె చీఫ్ హోదా పోయిందని, ఆమెని సస్పెండ్ చేశారని హేళనగా అంటాడు రావు. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాకా, అధీర తన గదికి వెళ్ళిపోతుంది. ఆమె వెనుకే శంకరన్ కూడా వెళ్తాడు. నాకో సాయం చేస్తారా అని అడుగుతుంది. తప్పకుండా చేస్తానంటాడు. ఏం అడుగుతానో తెలుసుకోకుండానే తప్పకుండా చేస్తానని ఎలా అంటారని అడిగితే, ఆమె కోసం తానేమైనా చేయడానికి సిద్ధమని అంటాడు శంకరన్. ఇందులో రిస్క్ ఉందనీ, ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉందని అంటుంది. పర్వాలేదంటాడు. ఈత వచ్చా అని అడిగితే, తాను స్విమ్మింగ్‍లో ఛాంపియన్‌ని అని అంటాడు. మద్రాసు సముద్ర తీరంలో ఈదిన అనుభవం ఉందని చెప్తాడు. తన ప్రణాళిక వివరిస్తుంది అధీర. ఓ గంట తర్వాత ఓ మోటర్ బోట్ ఆంజలిక షిప్‌కి సమాంతరంగా వచ్చి, అదే వేగంతో ప్రయాణిస్తుంది. అందుకో ఓ వ్యక్తి అధీరకి ఫోన్ చేసి తన పేరు విష్వక్ అనీ, తనని డైరక్టర్ గారు పంపించారనీ, షిప్‌ని ఆపించమని చెప్తాడు. అంజలిక ఓడ ఆగిపోయాక విష్వక్ అందులోకి ప్రవేశించి, అధీర దగ్గరకొచ్చి కంటెయినర్ క్యాప్సూల్‌ని తనకి అప్పగించమంటాడు. అది ల్యాబ్‍లో ఉందనీ, బరువుగా ఉంటుందనీ, మీరొక్కరే మోయలేరని చెప్తుంది. విష్వక్ పరవాలేదంటాడు. తాను ఎటువంటి రిస్క్ తీసుకోలేనని చెప్పి, శంకరన్‌ని పిలిచి, ఇద్దరినీ చెరో వైపు పట్టుకుని కంటెయినర్‌ని బోట్‍లోకి ఎక్కించమంటుంది. విష్వక్ కంటెయినర్‌ని ఒక చివర పట్టుకుని ముందు నడుస్తుంటే అతని వెనక శంకరన్ మరో చివర పట్టుకుని నడుస్తాడు. శంకరన్ షిప్ మీద నుంచి ఓ కాలు తీసి మోటార్ బోట్ బోర్డింగ్ దగ్గర పెట్టబోతూ అదుపుతప్పి పెద్దగా అరుస్తూ నీళ్ళలోకి పడిపోతాడు. అలా పడ్తున్న సమయంలో కంటెయినర్‌ని బలంగా పట్టుకుని ఉండటం వల్ల అది విష్వక్ చేతిలోంచి విడిపోయి పూర్తిగా శంకరన్ చేతిలోకి వచ్చేస్తుంది. అది బరువుగా ఉండటం వల్ల శంకరన్ దాంతోపాటు జారిపోయి నీళ్ళలో పడిపోతాడు. జరిగిందేమిటో అర్థం కాక విస్తుపోతాడు విష్వక్. కాపాడమని అధీర అరవడంతో, సిబ్బంది లైఫ్ జాకెట్‌ని శంకరన్ వైపు విసురుతారు. దాని సాయంతో అతను నీటిపై తేలుతూ ఉంటాడు. బయోకంటెయినర్‌ని ఎంత వెతికినా దొరకదు. డైరక్టర్ ఛార్జ్‌షీట్ ఇస్తాడు. తన తప్పేమీ లేదని జవాబిస్తుందామె. ఓడలోని సిబ్బంది కూడా అధీరకి అనుకూలంగానే సాక్ష్యం చెప్తారు. ఆమె మీద మోపిన అభియోగాలు రుజువు కాకపోవడం వల్ల సస్పెన్షన్‌ని ఎత్తివేసి, అధీరను గోవాలోని డోనాపాలాలో ఉన్న హెడ్ క్వార్టర్స్‌కి బదిలే చేస్తారు. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, తద్వారా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఆస్తి నష్టం కారణం చూపుతూ శంకరన్‌ని ఉద్యోగం లోంచి తీసేస్తారు. ఓ ఆదివారం సాయంత్రం అధీర సౌత్ గోవా లోని పాలోలెం బీచ్‌లో కూర్చుని సూర్యాస్తమయ దృశ్యాన్ని చూస్తూంటుంది అధీర. అక్కడున్న ప్రేమికులను చూస్తుంటే, ప్రేమిస్తున్నానంటూ డిగ్రీలో తన వెంటబడిన కల్యాణ్ గుర్తొస్తాడామెకు. – ఇక చదవండి.]
“గుడ్ ఈవెనింగ్ చీఫ్” అని విన్పిస్తే చప్పున తల తిప్పి చూసింది.
ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు శంకరన్.
“మిస్టర్ శంకరన్.. మీరా? ఇట్స్ ఎ ప్లెజంట్ సర్‌పైజ్ర్. రండి ఇక్కడ కూచుందురు గానీ. ఇంతకూ మా గోవాలో ఏం చేస్తున్నారు? సైట్ సీయింగ్‌కి వచ్చారా?” అతన్ని చాలా రోజుల తర్వాత చూసిన సంతోషంతో ఎక్జయిట్ అవుతూ అడిగింది.
శంకరన్ ఆమెకు కొద్దిగా ఎడంగా ఇసుకలో కూచుంటూ “మీ గోవాకి టూరిష్ట్‌గా తప్ప మరోలా రాకూడదా మేడం? నిషిద్ధమా?” అన్నాడు.
“అయ్యో.. గోవా మీద ఇష్టంతో మా గోవా అన్నాను గానీ ఇది అందరికీ నచ్చే మన గోవానే. ఇంతకూ మీరు టూరిష్ట్‌గా రాలేదన్న మాట. ఏం పని మీద వచ్చారు?” అని అడిగింది.
“ఇక్కడ పర్సిస్టెంట్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది మేడం. అందులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నాను.”
“ఓ.. మంచి శుభవార్త చెప్పారు. నా వల్ల మీ ఉద్యోగం పోయిందని ఎంత బాధపడేదాన్నో.. యిక నుంచి ఆ గిల్ట్‌ని సముద్రంలో కలిపేస్తాను” అంటూ నవ్వింది.
“నేను చెప్పానుగా మేడం సాఫ్ట్‌వేర్‌లో నైపుణ్యం ఉన్నవాళ్ళకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందని” అన్నాడు శంకరన్.
“అవును. మీరలా చెప్పడం నాకు గుర్తుంది. అది నా సంతృప్తి కోసం చెప్పారేమో అనే అనుమానంతో గిల్ట్‌లోకి వెళ్ళిపోయాను.”
“గిల్ట్ ఎందుకు మేడం? అత్యంత అరుదైన ఓ సముద్ర మేధోజీవిని ఎంతో రిస్క్ తీసుకుని కాపాడినందుకు మనం గర్వపడాలి.”
“బాగా ప్లాన్ చేసి, పకడ్బందీగా ఆచరణలో పెట్టామని అనుకున్నాను గానీ, చిన్న పొరపాటు జరిగింది. దానివల్ల మనం చేసిన పని బైటపడిపోతుందేమోనని భయంగా ఉంది” అంది అధీర.
“మనమేం పొరపాటు చేశాం?”
“కంటెయినర్‌లో గాజు గోళం ఉంచి నీళ్ళలోకి జారవిడిచాం కదా. మా డైరెక్టర్ దాన్ని వెతికే పనిని ముమ్మరం చేయిస్తున్నాడు. సబ్‌మెర్సిబుల్ టినోసాలో ఓ బృందం వెళ్ళి వెతుకుతోంది. ఎప్పటికైనా కంటెయినర్ వాళ్ళ కళ్ళపడ్తుంది. అప్పుడు మనం ఆడిన నాటకం బైటపడ్తుంది” అధీర దిగులుగా అంది.
“మీరు నిశ్చింతగా ఉండండి మేడం. నేనుండగా మీరు సమస్యల్లో ఇరుక్కునే పని చేస్తానా? వాళ్ళకు కంటెయినర్ దొరికినా అందులో గాజు గోళం ఉండదు” అన్నాడు శంకరన్.
ఆ మాటలు వినగానే అధీర ఉత్తేజితురాలైంది.
“ఏం చేశారో చెప్పండి” ఉద్విగంగా అడిగింది.
“నేను కంటెయినర్‌తో సహా నీళ్ళలోకి పడగానే కొంత లోతుకెళ్ళిపోయాను కదా. అక్కడే కంటెయినర్ మూత తీసి, గాజు గోళాన్ని బైట పడేశాక, కంటెయినర్ని వదిలేశాను.”
“హమ్మయ్య.. గుండెల మీదనుంచి పెద్ద బరువేదో తొలగిపోయినట్టుంది. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. థ్యాంక్యూ వెరీమచ్. మీకు రుణపడిపోయాను” సంతోషంగా అంది.
“రుణం తీర్చుకునే మార్గాలు చాలా ఉంటాయి మేడం” అన్నాడు శంకరన్.
“సరే. ఏం చేస్తే మీ రుణం తీరుతుందో చెప్పండి.”
“కొద్దిగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.”
“అబ్బో.. అంత తీరిక లేదు. మీరే చెప్పండి.”
“సమయం వచ్చినపుడు చెప్తాను మేడం.”
“సరే మీ ఇష్టం. ఇంతకూ ఎన్నాళ్ళయింది ఉద్యోగంలో చేరి?”
“దాదాపు నెలయింది.”
“నేను గోవాకు వచ్చి కూడా నెలే. మీ చెన్నరులో బోలెడు సాఫ్ట్‌వేర్ కంపెనీలుండగా గోవాలో పనెందుకు వెతుక్కున్నారు?”
“ఇష్టమైనవాళ్ళు ఎక్కడుంటే మనక్కూడా అక్కడే ఉండాలనిపిస్తుంది కదా మేడం” అన్నాడు.
అధీరకు ఆ మాటల్లోని ఆంతర్యం అర్థం కావడానికి కొన్ని సెకన్లు పట్టింది.
“ఇష్టమైన వాళ్ళంటే ఎవరు? కొంపదీసి నేనా? లేకపోతే మరెవరైనా ఉన్నారా?”
“మీరు తప్ప నాకెవరున్నారు మేడం?” అస్తమిస్తున్న సూర్యుని వైపు చూస్తూ అన్నాడు శంకరన్.
“నామీద అలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నానా?”
“ఇష్టపడింది మనసు కదా మేడం. అది నామాటే వినదు యింక మీ మాట ఏం వింటుంది?”
అధీర కొన్ని నిమిషాల సేపు నిశ్శబ్దంగా తనకిష్టమైన సూర్యాస్తమయాన్ని చూడటంలో మునిగిపోయింది. శంకరన్ కూడా ఆమెను కదిలించకుండా ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు.
బీచ్‌లో లైట్లు వెలగడంతో ఒక్కసారిగా వెల్తురు వెల్లువలా ముంచెత్తింది.
శంకరన్ ఆ అవకాశాన్ని జారవిడువదల్చుకోలేదు. గోవాలో ఉద్యోగం వెతుక్కుందే అధీరకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతో కదా..
“నా కోరికను మన్నించి నాజీవితంలోకి భాగస్వామిగా వస్తారన్న ఆశతోనే గోవాకు వచ్చాను మేడం” అన్నాడు.
“భాగస్వామిగా అంటే..?”
“కలిసి ప్రయాణించడం.. చివర వరకూ తోడుగా ఉండటం.”
“దానికి పెళ్ళెందుకు? మంచి స్నేహితులుగా కూడా ఉండొచ్చుగా. మీకు తెలుసుగా. నాకు స్త్రీ పురుషుల సమాగమంలో ఎటువంటి ఆసక్తి లేదు. నాకు స్వతంత్రంగా ఉండటం ఇష్టం. నన్నెవరూ శాసించకూడదు. నా స్పేస్‌లోకి ఎవ్వరూ రాకూడదు. నా పనులకు అడ్డుపడకూడదు.”
“పెళ్ళి చేసుకున్నా మీరు కోరుకున్నట్టే మీ స్వాతంత్య్రానికి అడ్డురాను మేడం. మీకు ఇష్టం లేని పని ఏమీ చేయను. ఇద్దరం ఒకే యింట్లో బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉండిపోదాం.”
“వద్దు. పెళ్ళి మగవాడికి కొన్ని అధికారాలను కట్టబెడ్తుంది. పెళ్ళికి ముందు మగవాడు చేసే బాసలన్నీ పెళ్ళయ్యాక తుచ తప్పకుండా పాటిస్తాడన్న గ్యారంటీ లేదు. ఆ మోసపూరిత తత్వం మగవాడి జీన్స్‌లోనే ఉంది” అంది అధీర.
“సరే మేడం. మీరు కోరుకున్నట్టే పెళ్ళి వద్దు. కానీ ఒకే చోట కలిసుందాం.. ఇద్దరు ఆత్మీయుల్లా..”
“మనం విడివిడిగా ఉంటూ కూడా ఫ్రెండ్స్‌లా ఉండొచ్చుగా.”
“ఉండొచ్చు. కానీ కలిసి ఒకే చోట ఉందామనడంలో నా స్వార్థం ఉంది మేడం.”
“ఏంటా స్వార్థం?”
“మీరు ఇన్‌స్టిట్యూట్ నుంచి యింటికి వచ్చినప్పటినుంచి, మళ్ళా ఉదయం తిరిగి పనికి వెళ్ళేవరకు నా కళ్ళెదురుగా ఉంటారుగా. దేవత ఎదురుగా ఉంటే భక్తుడికి కలిగే పారవశ్యం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా” అన్నాడు శంకరన్.
“నేను మామూలు మనిషినే. దేవతను చేయకండి. ఒకే యింట్లో ఉందాం. కానీ పడుకునేది ఒకే గదిలో కాదు. అందుకు మీరు సమ్మతిస్తే మీ ప్రపోజల్‌ని ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు.”
“నా తపస్సుకు మెచ్చి దేవత కరుణించి వరమిచ్చినంత సంతోషంగా ఉంది మేడం” అత్యంత ఆనందానుభూతికి లోనవుతూ అన్నాడు శంకరన్.
“నా కండిషన్స్ అన్నీ గుర్తున్నాయిగా.”
“కలలో కూడా మర్చిపోను మేడం. మీ అభీష్టాలకు విరుద్ధంగా ప్రవర్తించి, మీ సాన్నిధ్యాన్ని దూరం చేసుకోవాలనుకోను.”
“గుడ్. రేపే మీరుంటున్న గదిని ఖాళీ చేసి, నా క్వార్టర్‌కి వచ్చేయండి” అంది అధీర.
“రేపటివరకు ఎందుకు మేడం.. ఇంకోగంటలో వచ్చేస్తే మీకేమైనా అభ్యంతరమా?” అన్నాడు.
అధీర పెద్దగా నవ్వింది. తెరలు తెరలుగా నవ్వింది. అలలు అలలుగా నవ్వింది. “ఎందుకంత తొందర?” అంది నవ్వుతూనే.
“మీ మనసు మారిపోతుందేమోనని భయం” అన్నాడు శంకరన్.
“అంత చంచలమైన మనసు కాదులెండి. స్ట్రాంగ్ మైండ్ అండ్ స్ట్రాంగ్ విల్‌పవర్” అంది.
“గంటలో వచ్చేస్తాను” అంటూ శంకరన్ హుషారుగా లేచి నిలబడ్డాడు.
“నా క్వార్టర్ ఎక్కడో, నెంబర్ ఎంతో చెప్పేవరకైనా ఆగరా?”
“నాకు తెలుసు మేడం. దేవుడు కొలువుండే గుడి ఎక్కడో భక్తుడికి చెప్పక్కరలేదు. ఎప్పుడో వెతుక్కుని ఉంటాడు. నెల్రోజుల క్రితమే” అంటూ నవ్వాడు.
“మరో కొత్త కండిషన్.. ఈ దేవుడూ దేవత భక్తుడు లాంటి ఫ్లాటరింగ్ పదాలు వాడటం మానేయాలి” లేచి నిలబడుతూ అంది అధీర.
“యిక్కడే మరికొద్దిసేపుంటే కొత్త కొత్త కండిషన్లు పుట్టుకొచ్చేలా ఉన్నాయి మేడం” అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఉరకలెత్తే నదిలా వెళ్ళిపోతున్న శంకరన్ వైపు చూస్తూ మెల్లగా నవ్వుకుంది అధీర.
(సమాప్తం)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.
