Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఊరు.. బాల్యం..

[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘ఊరు.. బాల్యం..’ అనే రచనని అందిస్తున్నాము.]

“తారలు పువ్వుల వలె తోచె సౌందర్య దర్శనం, శైశవ మంటాను.. హిమ కాంతి బింబం సిత పుష్ప గుంచంగా వీక్షించే మదురోహమే శైశవమంటాను..” అన్నారు ప్రముఖ కవి గింజల నర్సింహా రెడ్డి గారు, తన ‘శక్తిధార’ కవితా సంపుటిలో.

ఊరు, బాల్యం ఈ రెండు ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన దృశ్య కావ్యాలు.. వాటిని ఎప్పుడు వీక్షించినా బోలెడన్ని కబుర్లు, జ్ఞాపకాలతో మస్తిష్కం అత్యంత ఉల్లాసంగా ఉంటుంది. బాల్యాన్ని మెచ్యూరిటీ వచ్చాక రాస్తే ఎలా ఉంటుందో.. అలా, అక్కడక్కడ మీకు అనిపించవచ్చు.. ఊహ తెలియని బాల్యంలో కొన్ని సంగతులు ఎంత ఆలోచించినా అర్థం కావు, జ్ఞాపకం ఉండవు. కానీ కొన్ని సంఘటనలు మస్తిష్కంలో నాటుకుపోతాయి..

అమ్మ సృష్టిలో అద్భుతమైన ఆవిష్కరణ. మనిషి పుట్టుకకు మూల కారణం. నవ మాసాలు మోసి కన్న ఆ తల్లికి ఎమోషనల్, సైకలాజికల్ బంధం తన బిడ్డ పట్ల ఉంటుంది. ఒక పిల్లి పిల్లను ఏమైనా అంటే ఆ పిల్లి కోపంగా చూస్తుంది, అదే కుక్క పిల్లను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తే ఆ కుక్క గుర్రుమంటుంది. నోరు లేని మూగ జీవాలకే పేగు ప్రేమ అంతగా ఉంటే మనుషులకు ఎంత ఉండాలి. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుంటే ఒక సమస్య. వాళ్ళ కోసం పూజలు పునస్కారాలు చేయడం సహజం. ముఖ్యంగా ఊర్లల్లో పిల్లలు పుట్టకుంటే చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో టార్చర్ పెడుతారు.

నాన్న.. ప్రతి ఇంటిలో నాన్న పాత్ర సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. అందుకే తెలివైన అమ్మ పిల్లల అవసరాలకు, బయటి వ్యవహారాల విషయాలలో నాన్నను అడిగి చెపుతాననీ అంటుంది. నిజానికి అమ్మ నిర్ణయానికి నాన్న నో ఆనడు. అమ్మ ఇంటిపట్టున ఉండాలి.. వండిపెట్టాలి.. అత్త మామలను, ఆడపడుచులను, మరదులను చూసుకోవాలి అన్న పాత తరం ఆచారాలను పాటించాలన్న లౌకికం అమ్మకు ఉంటే నాన్న అమ్మ చేతిలో కీలుబొమ్మే. ఈ చిన్న లాజిక్ తెలియక ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని చక్కబెట్టుకున్న వాళ్ళూ ఉన్నారు. కుటుంబాలలో మేల్ డామినేషన్ అనేది తరతరాలుగా వస్తుంది. కట్ చేస్తే..

గోదావరి జిల్లాల్లోని, ఒక ఊరులో కోడి కూసింది. ఊరు మేల్కొంది. చెట్ల మీద ఉన్న పక్షులు కూస్తూ, తమ పిల్లలతో ఆడుకుంటున్నాయి. ఇంకా చీకటిగానే ఉంది. రాత్రి మంచుతో, మల్లె మొగ్గల మోము విప్పారింది. పందిరిని అల్లుకున్న చిక్కుడు పాదులో ఆకులు మంచు బిందువులను కప్పుకొని ఊపిరి పీల్చుకుంటున్నాయి. బీర, సొరకాయ తీగల శరీరాలు మంచుతో వళ్ళంతా తడిచి, చల్లగా వీచే గాలితో ముడుచుకుపోతున్నాయి. ఏదో తెలియని తన్మయత్వంతో, ఆకులు తలలాడిస్తున్నాయి. మనుషులు, జంతువుల మాదిరిగానే, వాటికీ జీవం ఉంది. జీవితమూ ఉంది, పుట్టుక, చావూ అన్నీ ఉన్నాయి.

మగవాళ్ళు పొలం వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నారు. ఆడవాళ్ళు గేదెల పాలు పిండేందుకు సిద్ధం అవుతున్నారు. సంవత్సరానికి రెండు పంటలు పాడి గేదెలతో ప్రతి ఇల్లూ కళకళలాడుతూ ఉంటుంది.

మెల్ల మెల్లగా చీకటి తెరలు తెరుచుకుంటున్నాయి. తూర్పున ఆకాశం సిందూరం పూసుకుంది, దానికి కొంచెం దూరంలో నెలరాజు వెలుగును కోల్పోయి, నిష్క్రమించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆకాశాన్ని పరుచుకున్న ఆ సిందూరం లోనుంచి భానుడు తన మరుసటి రోజుని ప్రారంభించాడు. అప్పుడే నిద్ర లేచిన పిల్లలు ఇంటి బయటకు వచ్చారు, చిక్కుడు పాదులో ఆకులపై పడిన మంచు బిందువులపై కిరణాలు పడి పచ్చని ఆకుపై వెండి ముత్యమై మెరుస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన పసి హృదయాలు ఆనందంతో కేరింతలు కొట్టాయి. ఆ వెండి ముత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చల్లని గాలి ముఖాలకు తలుగుతుంటే ఆనందం విప్పారింది.

అక్కడి నుంచి పరుగెత్తుకెళ్ళి, వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఒడిలో తల దాచుకుని, నిమిషమయ్యాక కిరోసిన్ స్టౌవ్ పై కాస్తున్న పాల గిన్నె వంక చూస్తూనే, అప్రయత్నంగా కళ్ళు స్టౌవ్ పక్కన పడిన అగ్గిపుల్లలపై పడింది. అప్పట్లో అగ్గిపెట్టెలు. మొదటగా గులాబి బొమ్మ ఉన్నవి, ఆ తరువాత త్రీ మాంగోస్.. ఆ తరువాత షిప్.. ఇలాంటి రకాలు అందుబాటులో ఉండేవి. అమ్మ ఒడిలో నుంచి చేతిని కిందికి పెట్టి,ఆ పుల్లలు ఏరుకునీ ఒక్క ఉదుటున పెరట్లోనికి పరిగెత్తింది పసితనం. మామూలుగా గోదావరి జిల్లాల భూములు, నల్ల రేగడి భూములు. చిన్న కట్టె పుల్లతో నేలను తవ్వి, ఆ చిన్న చేతిలో పట్టినంత మట్టిని సేకరించి, ఒక బండరాయి మీద ఆ మట్టిని ఉంచి, ఆపై నీళ్ళతో తడిపి చిన్న చిన్న ఉండలుగా చుట్టి, ఆ ఉండలను అరచేతితో అద్ది, రూపాయి బిళ్ళ షేపులో తయారు చేసి, మద్యలో వాడేసిన అగ్గి పుల్లలను గుచ్చడం.. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్న సినిమా వాల్ పోస్టర్ ముక్కలను రూపాయి బిళ్ళ షేపులో కట్ చేసి, తడిగా ఉన్న ఆ మట్టి బిళ్ళలపై అతుకు పెట్టి కొంచెం సేపు ఎండలో ఆరబెడితే చాలు.. ఆ తరువాత అగ్గిపుల్లను వేళ్ళతో పట్టుకొని, బొంగరంలా తిప్పి, బండలపై వదిలితే, అది తిరిగేంత సేపు కళ్ళల్లో రంగుల రాట్నం ఎక్కి ప్రపంచ యాత్ర చేసినంత అద్బుత ఫీలింగ్. మట్టి చేతులను కడుగుతూ, అమ్మకు వచ్చిన కోపం, నా అమాయకపు నవ్వుతో పటాపంచలైయ్యింది.

తాతయ్య ఊరి నుంచి వస్తూ తాటాకు బుట్టలో తెచ్చిన కట్టె బొమ్మలు.. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు, బంగినపల్లి మామిడి పండ్లు, పెద్ద రసాలు, చిన్న రసాలు, కొబ్బరి మామిడి పండ్లు అందరికీ సమానంగా పంచిన జ్ఞాపకం.. పండుగలప్పుడు జరిగే తీర్థాలు.. అంటే చిన్నపాటి ఫెటే.. అంటే ఎగ్జిబిషన్ లాంటిది. అక్కడ దొరికే జీళ్ళు, మామిడి తాండ్ర, తాటి తాండ్రల రుచి అద్భుతం. అక్కడ దొరికే చక్కెర కేళీ, అమృత పాణి అరటి పండ్లు.. ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది. తాతయ్య ధోవతీ లాగి అల్లరి. కొంచెం ఉప్పు, కొంచెం కారం కలిపి, చింతపండు రేకలను, దానిలో అద్ది, ఉప్పు, కారం చింతపండుకి పట్టించి, ఒక ముద్దగా చేసి, కట్టెపుల్లను కుచ్చి, లాలిపాప్‌లా తయారు చేసి, చప్పరిస్తూ ఉంటే ఆ పిల్లలు స్వర్గం అంచులకు ఎందుకు వెళ్ళరు..

పొడువుగా కోసి, వాటి మీద ఉప్పు కారం చల్లి అమ్మ నాన్నకు ఇచ్చిన కొబ్బరి మామిడి పండ్లు నాకూ కావాలని పట్టుపట్టి, ఎంత వారించినా వినకుండా తిని, ఏడ్చిన క్షణాలు, మళ్ళీ వస్తాయా!

వేసవి సెలవుల్లో ఆడుకున్న గూటీ బిళ్ళ గోళీలాటలు, ఆడపిల్లలతో అష్టాచమ్మా, పామూ నిచ్చెన, చదరంగం ఆటలు తిరిగి ఆడగలమా.. సాయంత్రాలు కోసిన మల్లె మొగ్గలను మాలగ అల్లి తడి బట్టతో కప్పి, తెల్లవారక విచ్చుకున్న పువ్వులు, పెట్టుకోవాలంటే, పెద్దవాళ్ళ పర్మీషన్ కోసం ఎదురు చూడాల్సిందే – ముఖ్యంగా పదహారు నుంచి ఇరవై అయిదు ఏళ్ళు వయసు ఉన్న అమ్మాయిలు.

తన కొడుకు, స్కూలు నుంచి వస్తూ, సంతోషంతో చేయి ఊపితే, వీధిలో బదులీయలేని, కట్టుబాట్లతో కాపురం చేసే తల్లులు.. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే, మొహమాటంతో, సరిగ్గా తింటారో లేదో అని, వండిన వంటలను, అన్ని గిన్నెల్లోకి సదిరి, అతిథి ముందు పెట్టి, తాను వంటింటి తలుపు వెనుక వినయంగా ఉంటుంది ఆ ఇల్లాలు..

సంక్రాంతికి కొత్త బట్టలు, భోగి పళ్ళు, పులిహోర, బొబ్బట్లు, జంతికలు, బూరెలు, పరమాన్నం మొదలైన వంటకాలు.. బంధువుల, పేరంటాళ్ళ హడావిడిలు. ఊర్లో టూరింగ్ టాకీస్‌లో సినిమా వంద రోజులు ఆడాల్సిందే. అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే సంబురాలు.. ఊర్లో పండుగ వాతావరణం..

పెరుగుతున్న విపరీత ధోరణులు తరిగిపోతున్న సామాజిక విలువలు.. స్వార్థం, వంచన, మోసం, విచ్చలవిడితనం.. వీటన్నింటికీ దూరంగా కల్మషం ఎరుగని, ఆ అమాయక జీవితాలు, ఆ ఊర్లు, ఆ బాల్యం జ్ఞాపకం వస్తే.. ఆనందం కలుగుతుంది.

ఆ గోల్డెన్ డేస్‌ని తలుచుకుంటూ మనసు పొందే ప్రశాంతత ఎన్ని సంవత్సరాలు అయినా  అలాగే పరిమళిస్తుంది.

Exit mobile version