[ఇటీవల కన్ను మూసిన గాయని యస్. జానకి గారికి నివాళిగా ‘పాటల కోయిల స్మృతిలో..’ అనే రచన అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]
కోయిల వసంత ఋతువులో మాత్రమే పాడుతుంది. కానీ ఈ పాటల కోయిల అన్ని ఋతువులలోనూ పాడుతుంది. ఆమే మధుర గాయని యస్. జానకి. ఆమె అసలు పేరు శిష్ట్లా జానకి. కోయిల కూ.. అంటుంటే పిల్లలు కూడా పోటీగా కూ.. అంటూ ఉంటారు. మళ్ళీ కోయిల కూ..అంటే కవ్విస్తున్నట్లు మళ్ళీ కూ.. అంటూ ఉంటారు. ఇది బాల్యంలో మనందరికీ అనుభవైకవేద్యమే! అలాగే రేడియో లోనో, టి.వీ., లోనో జానకి పాట వస్తుంటే అభిమానులు కూడా అసంకల్పితంగా గొంతు కలిపి పాడుతూ ఉంటారు కోయిలతో పాడుతున్నట్లుగానే!.
జానకిని చిత్రసీమకు పరిచయం చేసింది సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. ఆమె మొదటి పాటే ఘంటసాలతో పాడాల్సి వచ్చింది. ఘంటసాల అప్పటికి పాపులర్ గాయకుడు. ‘ఎం.యల్.ఏ.’ (1957) చిత్రంలో “నీ ఆశా అడియాశా చేజారే మణిపూస, లంబాడోళ్ళ రాందాసా..” అనేది. ఈ సినిమాలో సావిత్రి చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఆ సంవత్సరం విడుదల అయిన మాయాబజార్, సువర్ణ సుందరి వంటి చిత్రాల ప్రభంజనానికి యం.ఎల్.ఏ., చిత్రం వెనుకబడి పోయింది. ఇప్పుడు చూడగలిగే అవకాశం వస్తే సువర్ణావకాశమే!
‘బావామరదళ్ళు’ (1961) లో ఆరుద్ర రచించిన పాట “నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నేవేళా..” అనేది రెండుసార్లు వస్తుంది. ఒకసారి సంతోషంగా, రెండోసారి విషాదంగా. పాట సాహిత్యంలో ఎలాంటి మార్పు లేదు. భావప్రకటన లోనే ఆ తేడాలు చూపించాలి. సంతోషంతో పాడే పాటను జానకి, విషాదంతో పాడే పాటను ఘంటసాల గానం చేసారు. రెండూ పాపులర్ అయ్యాయి. జానకి స్వరంలో వింటుంటే నీలి మేఘాలలో, గాలి కెరటాలతో పాటు మన మనసు కూడా తేలిపోతూ ఉన్నట్లు ఉంటుంది. అదే సంవత్సరం వచ్చిన ‘ఋష్యశృంగ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ఆమె గానం చేసిన “అందాలు చిందే దీపం అల చందమామ రూపం..” అనే పాట కూడ ప్రాచుర్యం పొందింది.
‘లవకుశ’ (1963) లో ఎవరెవరు పాడారో కూడా ఆలోచన పోనంతగా ప్రాచుర్యం పొందాయి పాటలన్నీ. అందులో “విరిసే చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నులా..” అనే పాట జానకి పాడారు. శ్రీరాముడు రాజు అయ్యాడన్న సంతోషంతో అంతఃపురంలో దాసీలు అందరూ పాడుకునేది అది. ఈ పాటలో నర్తకి సుకుమారి అభినయించింది. అదే సంవత్సరం విడుదల అయిన ‘నర్తనశాల’ లో ఊర్వశి పాడే “నరవరా ఓ కురువరా..” పాట పెద్ద హిట్. ఊర్వశిగా పద్మినీ ప్రియదర్శిని నర్తించింది. ఇంకా బృహన్నల ఉత్తరకు నాట్యం నేర్పే సన్నివేశంలో చేసే వినాయక ప్రార్థన “జయ గణనాయక విఘ్న వినాయక, భయ హర శుభకర గజముఖ గణపతి..”ను ఘంటసాల, జానకి గానం చేశారు. ఈ గీతంలో జానకి గళం ఎలా పరవళ్ళు తొక్కిందో విజయలక్ష్మి పాదం అంతే వేగంగా కదం తొక్కింది. తర్వాత నాట్య విద్యాభ్యాసం పూర్తి అయింది అని ఒక ప్రదర్శన ఇస్తుంది ఉత్తర. ఆ సన్నివేశంలో “సలలిత రాగసుధారస..” పాటను బాలమురళి, బెంగుళూరు లత పాడారు. కానీ ఈ సన్నివేశంలో మొదటి పాటనే పెడితే బాగుండేది అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఉంటుంది జానకీ ఘంటసాల గార్ల యుగళం.
1964లో వచ్చిన ‘పూజాఫలము’ లో జానకి గానం చేసినవి నాలుగు గీతాలు ఉన్నాయి. “పగలే వెన్నెల.. జగమే ఊయల..” కథతో చాల సంబంధం ఉన్న గీతం అది. నాయకుడికి మతి స్థిమితం తప్పటానికి, మళ్ళీ మామూలుగా అవటానికి కారణం అయిన గీతం అది. “శివ దీక్షా పరురాలను రా..” అని యల్.విజయలక్ష్మి అభినయించే జావళి, “మంచి దినము నేడే..”, “మదనా మనసాయెరా..” అనేవి కూడా గానం చేశారు. అన్నీ మధురగీతాలే!
‘పాండవ వనవాసం’ (1965) లో సౌగంధికా పుష్పాల కోసం భీముడు కుబేరుడి అలకాపురికి వెళతాడు. దాన్ని కామరూపులైన యక్ష రాక్షసులు రక్షిస్తూ ఉంటారు. అక్కడ యక్షిణులు రకరకాలైన రూపాలు ధరించి భీమసేనుడిని కవ్విస్తూ ఉంటారు. ఆ సన్నివేశంలో “ఓ వన్నెకాడ, నిన్ను చూసి నా మేను పులకించెరా..”, “ఉరుకుల పరుగుల దొరా మగసిరి కిది తగదురా..”, “తాళలేరా మదనా..” అనే మూడు బిట్లు గల పాట ఉంటుంది. ఈ మూడు బిట్లు జానకి గానం చేయగా, వివిధ రూపాలలో రాజసులోచన నర్తిస్తుంది. ఈ పాట కూడా పాపులర్ అయింది. ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ’ (1966) లో సుశీల, లీల వంటి సీనియర్ గాయనీమణులు ఉన్నా కథా నాయిక పాటలన్నీ జానకే పాడారు. “వల్లభా, ప్రియ వల్లభా..”, “కుశలమా, ఎట నుంటివో ప్రియతమా..”పాటలు ప్రాచుర్యం పొందాయి. అలాగే ‘ఆరాధన’ (1976) లో కూడా నాయిక కు జానకి చేతే పాడించారు. ఇలాంటివి ఎన్నో!
‘సిరిసంపదలు’ (1962) చిత్రంలో “ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలీ..” అనే పాట ఒకటి ఉన్నది. ఆ పాటను ఘంటసాల, జానకి పాడారు.. ఏ.యన్.ఆర్., సావిత్రి మీద చిత్రీకరించారు. ఆ చిత్రం నాటికి మహానటి సావిత్రి టాప్ హీరోయిన్గా ఉన్నారు. నేపధ్య గాయనిగా జానకి అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నారు. “ఈ జానకి ఏమిటండీ! ఈ పాట మళ్ళీ సుశీల చేత పాడించండి. నాకు సుశీల గొంతు అయితేనే బాగుంటుంది” అని చెప్పారు సావిత్రి. “తప్పమ్మా! అలా చేయకూడదు. అలా మళ్ళీ పాడిస్తే సింగర్స్‌ను చిన్నబుచ్చినట్లు ఉంటుంది” అని సర్ది చెప్పారు దర్శకుడు. సావిత్రి కూడా అర్థం చేసుకుని సరే నన్నారు. అప్పటి నుంచీ జానకి సావిత్రికి పాడటానికి ఇష్టపడలేదు.. తెలుగులో ఆ పాట తప్ప మళ్ళీ సావిత్రికి పాడలేదు జానకి.
యస్. జానకిని గుర్తు చేసుకునే టప్పుడు పి. సుశీల కూడా అసంకల్పితంగా గుర్తు వస్తారు. ఇద్దరూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటి వారు. “నాకు సంగీత సరస్వతి ఎలా ఉంటుందో తెలియదు. సుశీల గారిని చూసినప్పుడల్లా ఇలాగే ఉంటుందేమో! అనిపిస్తుంది” అని చెప్పేవారు జానకి.
‘భక్త ప్రహ్లాద’ (1967) లో ప్రహ్లాదుడి పాత్రకు సుశీల, అతడి తల్లి లీలావతి పాత్రకు జానకి పాడారు. “కనులకు వెలుగువు నీవే కాదా! కనబడు చీకటి మాయే కాదా!” పాటలో ఇద్దరూ కలసి పాడారు. ఆ గీతాలన్నీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ‘కంచుకోట’ (1967) లో కూడా మరొక పాట ఉన్నది. మహారాజు గారి కొలువులో “సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర.. సుర వైభవాన భాసుర కీర్తి లోనా..” అని రాజనర్తకి (యల్.విజయలక్ష్మి) పాడితే, “సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా.. సిరిలోన గానీ, మగసిరిలోన గానీ..” అని రాజుగారి సోదరుడి ప్రేయసి (జయశ్రీ) పాడుతుంది. రాజనర్తకికి సుశీల, సోదరుడి ప్రేయసికి జానకి నేపథ్య గీతం పాడారు. ఇద్దరూ ఒకరికొకరు ధీటుగా, ధాటీగా సరిలేరు మాకెవ్వరూ అన్నట్లే పాడారు.
ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో చాలా పాటలు వచ్చాయి. “ఎవరను కున్నావే ఏమనుకున్నావే..” (అగ్గిపిడుగు), “నిండు పున్నమి నెల, పండె తీయని కల..” (ఋణానుబంధం), “వెలుగే కరువాయే, బ్రతుకే బరువాయె..” (పల్నాటి యుద్ధం), “కరుణించవే తులసి మాతా..” (శ్రీకృష్ణ తులాభారం), “పాటకు రాగాలు కోటి కానీ పల్లవి మాత్రం ఒకటే..” (రాముడే దేవుడు), “తెలిసెనులే ప్రియరసికా..” (దానవీర శూర కర్ణ), “ఆరనీకుమా ఈ దీపం..” (కార్తీక దీపం) వంటివి ఎన్నో ఉన్నాయి.
కొన్నేళ్ళ క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో (పేరు గుర్తు లేదు) పి.సుశీల, యస్. జానకి లతో ఇంటర్వ్యూ వేశారు. ఒకే ప్రశ్నకు ఇద్దరూ సమాధానం ఇచ్చారు. “మీ ఫేవరేట్ సింగర్స్ ఎవరు?” అని అడిగితే, “నార్త్‌లో లతా, రఫీ, సౌత్‌లో అందరూ ఇష్టమే!” అని చెప్పారు సుశీల. “నార్త్‌లో రఫీ, లతా, పర్వీన్ సుల్తానా, సౌత్‌లో ఘంటసాల, బాల మురళీ” అని చెప్పారు జానకి.
“ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. మీ విజయాల వెనక మీ భర్తల ప్రోత్సాహం ఎలా ఉంది?” అన్న ప్రశ్నకు సమాధానంగా, “ఈ విషయంలో మా ఆయన ఆపోజిట్. ఆయనకి లతా పాటలంటే పిచ్చి. రోజూ నా ముందు ఆమెను పొగడటం, కంపేర్ చేయటం”. “అయ్యో! అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఈయన మాత్రం నన్ను ఎందుకు మెచ్చుకోరు?” అనుకునే దాన్ని. నేను కూడా లతా అంత గొప్ప సింగర్ కావాలని అలా అంటున్నారు అని తర్వాత అర్థం అయింది” అని చెప్పారు సుశీల. జానకి మాత్రం “అయన పెళ్లి చేసుకున్నదే నా పాట చూసి. నేను ఇప్పటికీ పాడగలుగుతున్నానంటే ఆయన సపోర్ట్ వల్లనే!” అన్నారు.
“ఈ పాట నేను పాడినట్లయితే బాగుండేది అనిపించిన సందర్భం ఏమిటి?” అని అడిగితే, “ఇన్ని వేల పాటలు పాడిన తర్వాత ఇంకా అలా అనుకోవటం స్వార్థం అనిపించుకుంటుంది” అన్నారు సుశీల. “అలా ఎప్పుడూ అనుకోలేదు. అన్ని రకాల పాటలూ పాడాను. ఇక మిగిలిపోయిందేదీ లేదు” అని సమాధాన మిచ్చారు జానకి.
జానకి పాటలు గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అయిదు తరాల నటీమణులకు తన స్వరాన్ని అందించారు. 90 వ దశకంలో సుహాసినికి సుశీల, విజయశాంతికి జానకి చాలాకాలం పాటు నేపథ్య గానాన్ని అందించారు. ఆ ఇద్దరు నటీమణులకు వచ్చిన పేరుప్రఖ్యాతులలో సగం ఈ గాయనీమణులకు కూడా చెందుతుంది అని చెప్పవచ్చు. కే.విశ్వనాద్ గారి దర్శకత్వంలో సంగీత నాట్యాలు నేపథ్యంగా వచ్చిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, శ్రుతిలయలు వంటి చిత్రాలన్నిటిలో జానకి పాట తప్పనిసరిగా ఉంటుంది.
ఇటీవల కాలంలో పాత సినిమాల మీద పుస్తకాలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వాటన్నిటికీ ఆద్యుడు ప్రముఖ కధారచయిత భ.రా.గో (భమిడిపాటి రామ గోపాలం) అని చెప్పవచ్చు 1997-98 ప్రాంతాల్లో ఆయన దినపత్రికలకు ఒక ప్రకటన ఇచ్చారు. పాత సినిమా పాటల సంకలనం ఒకటి తీసుకురాబోతున్నట్లు అభిమానుల దగ్గర ఉన్న ఫోటోలు, వ్యాసాలు వంటివి పంపించమని, వాడుకున్న తర్వాత తిరిగి ఇస్తానని చెప్పారు. అలా నా దగ్గర ఉన్న పాత సినిమా ఫోటోలు, వ్యాసాలు పంపాను. అప్పటికి ఆయనకు 75 సంవత్సరాలు. నాకు మూడు పదుల వయసు కూడా నిండలేదు. నా దగ్గర పాటల వివరాలు రాసిన లెటర్ చూసి “ఇంత పిన్న వయసులో మీకున్న పరిజ్ఞానానికి ఆశ్చర్యానందాలకు లోనయ్యాను” అని రిప్లై ఇచ్చారు. ‘నూట పదహార్లు’ పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు. అది పాపులర్ అవటంతో ‘మరో నూటపదహార్లు’ పేరుతో మరో సంకలనం, నటి, గాయని భానుమతి కన్నుమూసిన సందర్భంగా ‘మహా మహిళ’ అనే స్మృతి సంచిక, సుశీలకు పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా ‘అభినందన సంచిక’ తీసుకువచ్చారు. వాటన్నిటికీ నా సేకరణలో ఉన్న ఇంటర్వ్యూలు, ఫోటోలు, వ్యాసాలు ఇచ్చాను. పుస్తకాలతో పాటు సుశీల పాటలతో కూడా సి.డి. లను కూడా కాంప్లిమెంటరీ కాపీలుగా పంపారు. “ఆరోగ్యం సహకరిస్తే గాయని యస్. జానకి గురించి కూడా ఒక సంకలనం తీసుకురావాలని ఉన్నది. మొదటగా నీకే చెబుతున్నాను” అన్నారు ఫోన్ చేసి. ఆ కోరిక తీరకుండానే తర్వాత వారం రోజులకే కన్నుమూశారు భ.రా.గో.. ఇప్పుడు ఎవరైనా తీసుకువస్తారేమో చూద్దాం!.. ఏది ఏమైనా యస్. జానకి గానం ప్రతిరోజూ మనం వింటూనే ఉంటాము. వసంతం ఉన్నంత వరకూ కోయిల పాడుతూనే ఉంటుంది. జనం సినిమాలు చూస్తున్నంత కాలం ఈ పాటల కోయిల పాటలను కూడా వింటూనే ఉంటారు.
(తెలుగు తప్ప వేరే భాషా చిత్రాలు చూసే అలవాటు లేదు నాకు. అందువల్ల వేరే భాషలలోని జానకి పాటలను గురించి ప్రస్తావించటం లేదు).
Photos Courtesy: Internet
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
