Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పచ్చని చెట్టు – కాగితం కథ

[బాలబాలికల కోసం ‘పచ్చని చెట్టు – కాగితం కథ’ అనే బాలగేయం అందిస్తున్నారు శ్రీ దాసరి చంద్రయ్య.]

వేసవి సెలవులు వచ్చెనే
పిల్లల ఆటలు మొదలాయె
ఊరి చెంతన కాలువ ఉంది
కాలువ గట్టున చెట్టొకటుంది

చెలికాళ్ళిద్దరు అచటికి చేరి
కొమ్మకు తాడును కట్టారే
హాయిగా ఊయలూగారే
సంతోషంగా గడిపారే

తమతో తెచ్చిన నోటుబుక్కును
పరపర పరపర చింపారే
ఒకటి రెండు మూడూ అంటూ
పడవలు చకచకా చేశారే

చేసిన పడవలు నీటిలో వదులుతూ
హైలెస్సో లెస్సని ఎగిరారే
పడవలు నీటిలో సాగుతువుంటే
చప్పట్లు చరుస్తూ మురిశారే

చూసిన చెట్టు బాధతో తాను
మెల్లగా మాటలు పలికిందే
“ఆగండి పిల్లలూ ఆగండం”టూ
కాగితాల కథ చెప్పిందే

మా తనువుల్ని నరికితే గాని
పుస్తకమే పురుడోసుకోదురా
జ్ఞానం పంచే కాగితానికి
మా ప్రాణాలు వదులుతామురా

పేపరు వృథాగా మీరు వాడితే
చెట్లను మరిన్ని నరకవలెనుగా
చెట్లు లేకుంటే వానలు తగ్గి
భూములు బీడుగా మారిపోవురా

పాత పేపర్లు పారేయక
వేరుగా వాటిని దాచండి
మళ్లీ వాడే చోటకు ఇచ్చి
చెట్ల ప్రాణాలు కాపాడండి

చెట్టు మాటలు విన్న పిల్లలు
తప్పును తాము తెలుసుకున్నారు
“క్షమించు మర్రి చెట్టూ” అంటూ
చెట్టును కౌగిలించుకున్నారు

“ఇకపై పేపరు వృథా చేయము
చెట్టు ఉసురును మేము తీయము
పాత పుస్తకము మిత్రులకిచ్చి
మళ్లి మళ్ళి వాడేలా చేస్తాం!”

పచ్చని చెట్లే భూమికి ప్రాణము
పచ్చని ప్రకృతి ప్రగతికి ప్రాణము
చెట్టే పక్షికి చక్కని నిలయము
ప్రాణవాయువు నిచ్చే దేవాలయం

Exit mobile version