Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదబంధం♦

[నరేష్ నున్నా గారు రచించిన ‘పదబంధం’ అనే కవితని అందిస్తున్నాము.]

అనగా అనగా అనదగ్గ మన కథలో అగణిత దూరాభారాల అవతల, అగోచర దిగంతాల అంచున, అసందర్భ ఆగామి ముహూర్తాలు ఆగం చేస్తున్న అమ్మ పురిటినొప్పుల ప్రసూతి గదికి నడిచాను, అనేకానేక కాలిజాడలన్నీ ఏకమైన ఒకే ఒక నెమరువేతల బాట మీద. మంత్రసాని ఇరుకు గది గోడ బీటల్లోంచి మొండిగా మొలుచుకొచ్చిన పచ్చిమొక్క. చెదల చెక్కదూలానికి నూలుపోగుతో అమ్మ నడినెత్తిన కట్టిన కాలపు కత్తి వాదర చివర జారని చెమటచుక్క. జారిపోయిన ఉమ్మనీటిలో ఉక్కిరిబిక్కిరై అమ్మకి నేను ఉపద్రవాన్ని అయినప్పుడు వినిపించిన ఊపిరిగానం నువ్వు – ‘అమ్మ కడుపు చల్లగా బ్రతకరా బ్రతకరా పచ్చగా’.

**

ప్రణవనాదాల ప్రాణదానాల ఊపిరిగానం అంటే గుర్తొస్తోంది, నీది అతి సమృద్ధ మేళన రాగం, జంత్రగాత్ర సప్తస్వర మణిప్రవాళానికి అనువైన తాళం, ఆనంద తానం. పియానో మెట్ల మధ్య గులాబి రేకులు ఇరుక్కొని పెల్లుబికిన అనూహ్య మూర్ఛనల ఉద్వేగ గమకం. జీవధారల స్తన్యమిచ్చిన రేపటి జన్యు రాగం నిన్నటి జనని అవ్వడమే అధివాస్తవిక అభాస.

**

అప్పటి నా అనాకృత ఆకాశాలలో anachronous నక్షత్రం నువ్వు. నన్ను మోస్తున్న చూలింత సోలింతల కలలో సోదె నువ్వు. కానీ, అదృష్ట అదృశ్య అశరీరవాణివి! అంతేనా, అనామికవు కూడా. అవును నీకప్పుడు పేరు లేదు – నాకే లేదసలు. చలనం లేని పిండాన్ని కదా, పిర్ర మీద ఒక్కటిచ్చుకున్నప్పుడే తలకిందులై వేలాడిన కేర్ కేర్ కేరింతల వెక్కిళ్ల గుక్కపట్టానట. అది నలుపు – తెలుపుల సంధి, చీకటి – వెలుగుల హద్దు. ఆ అవును – కాదు సందిగ్ధని దాటిన ముప్పై ఏళ్లకి నన్ను ‘నాన్నా..!’ అని పిలిచి కదా నన్ను కన్నావు మళ్లీ, నా కన్నమ్మా.
– ‘పునరపి జననం.. పునరపి.. పునరపి..’

**

శ్వాస వ్యాకరణాలు వల్లె వేయకముందే చివికిన లిపిలో నానిన విఫలాక్షరం నాది. మూసేసిన పుస్తకంలో మర్చిపోయిన బుక్ మార్క్ నేను. నామ్ కే వాస్తే నామవాచకాన్ని. నానార్థాల నిఘంటువులో దిక్కూమొక్కూలేని అభేద్య పదాన్ని, రంగు రుచి కరువైన అభావాల ఒట్టి déjà vu ని. వాడుక జార్చిన శకటరేఫం.. నేతిబీరకాయ మాటవరసలో మహాప్రాణం.. వాక్యాంతాన తప్ప ఉనికి ఉండని విరామచిహ్నం! హల్లుల హళ్లికి అచ్చులంటిన చవిటిపదం నేను.
ఆ పొడిమాట పొత్తిళ్ళకి నీ పాలబుగ్గల చొంగ అంటాకే కదా కవిత్వమయ్యింది.

**

ఇల్లు పీకి పందిరేసే సుముఖ్ మునుపులా లేడు. ‘సంధ్యా జీవులం, సందేహ భావులం, ప్రశ్నలే, ప్రశ్నలే. జవాబులు సంతృప్తి పరచవు’ అన్నట్టు చేతలకి తగ్గి మాటలకి ఎదిగాడు ఏడేళ్లకే. అడిగే మబ్బుకి చెప్పే ఉరుములే కదా లోకువ. చెబుతున్న కొద్దీ, మెరుపు మిషతో పెడచెవిన పెడ్తున్న కొద్దీ పెరుగుతున్నాయి మొట్టికాయ వడగళ్ల తెంపులేని ప్రశ్నలు.
పరుగున వచ్చి గోడ వంకే చూస్తుంటే, ‘గోడలను పగులగొట్టడమే..’ వాడి పని కాబోలనుకుంటున్నానా, ‘ఆ ఫొటోలో నువ్వే కదా, భలే ఉన్నావ్’ అన్నాడు, చిన్ననాటి నీ ఫొటోని తదేకంగా చూస్తూ.
ఆ సాక్షాత్కార సమయం – అతిమానుషం, అందివచ్చిన సందర్భం – అద్వైతం! నిన్న నేడుగా నిట్టనిలువున చీలిన కాలం నిశ్చలించింది. లోలకం నిలిచిపోయింది. మొఖాన మొక్కట్లు, కనిపించే కవళికలు, పంచుకున్న రక్తం, పెంచుకున్న బంధంగా తోచే తరాల అంతరం చెదిరిపోయింది. నేను – నువ్వుల ద్వంద్వం చప్పున తేలిపోయింది.
బాలవాక్కులో సత్యశోధనమ్.. క్రాంతదర్శనమ్!
అప్పుడది వెల్ల వెలిసిన గోపి రంగు గోడ కాదు, వర్ణావర్ణాల మాయాదర్పణం! లోకం చూడలేని, బుద్ధి నమ్మలేని సర్రియల్ సత్యావిష్కరణల యవనిక.
నీ జన్మ నక్షత్రదోషంతో నాన్నకి గండమనే గత్తరలో మురికి నూనెలో ముఖావలోకనం – ఎంత నవ్వులాట!

**

కుడి ఎడమల తేడాలూ లేని బింబాబింబాలం. కాలపట్టకం నుంచి పరావర్తనమైన ఒకే కాంతి కిరణాలం. విస్ఫోటనానంతర విశ్వసృష్టిలో పుట్టిన క్వాంటమ్ జంట కణాలం. జన్యు మెట్ల DNA నిచ్చెనలో ఎదురుబొదురు వెదురుకర్రలం. వేర్వేరని వేరు చేయలేని తల్లివేరు – పిల్లవేరు మనం.
నదీ గర్భం- ప్రవాహ గర్వం! ప్రవాహం లేకపోతే అది ఎండిన లోయ. గర్భాన్ని తీసేస్తే ఇది దిక్కులేని మేట.
Palindrome ముందు నుంచి నడిస్తే నువ్వు, వెనక్కి తిరిగితే నేను. పుటలు ఎటు తిప్పినా ఒకటే మన కథన ద్వ్యర్థి కావ్యం!
మన మధ్య మాటలాట ఎప్పుడూ ఓ వెంట్రిలాక్విజం.

**

దక్షిణ మహాసముద్రపు ఝంఝామారుతాల ఆస్ట్రేలియాలో నువ్వు. వాయుగుండాల వానలప్పుడు తప్ప ఆ సందడే తెలియని దక్కన్ పీఠభూమిలో నేను.
శీతలంగాలి నీ ముంగిట్లో చలి తోరణాలు కడితే, నన్ను నైరుతి పవనాలు చుట్టచుడతాయి. చైత్రం నీపై మైత్రిపరాగాలు చల్లితే, గ్రీష్మం నా మీద చెమటకాయల కాపుకాస్తుంది. ఇక్కడ తేనీరు ఎంత తేరగా చల్లారుతుందో, అక్కడ సాయంత్రం కూడా అంతే వేగంగా ముసురుకుంటుంది.
అంకెలకు అందని తొలి సంజె చలికి కుంపట్లు వణుకుతాయి. చిల్లుపడిన అంటార్కటికా ఆకాశం నుంచి మధ్యాహ్నపు సూదులు గుచ్చుతాయి. సాయంత్రాల దక్షిణం గాలి చిరుచినుకుల దీవెనౌతుంది – మెహర్బానీ మెల్బోర్న్ ఒక్క రోజులో ఇచ్చేస్తుందట కదా నాల్గు ఋతువులు సదా. అందుకే తొమ్మిది కాలమండలాల ఎంతెంత దూరాలు -దిక్కులు చూడని, నైసర్గికాలు పట్టని, కురచ కొలతలకి అందని ఆరారు కాలాల, పన్నెండు మాసాల అదే ఒక్క రోజు, virtual తత్ క్షణాల ఒకేఒక్క ఘడియ.

**

నీ ఇంటి పెరటిలో వెయ్యికొమ్మల వసువర్ణ వనస్పతి కడుపున కాయకాచింది. మేడిమొక్కకి అంటుకట్టిన లేత రెమ్మ చివురులేసింది.
సీమంతపు పాపిడిలా తీసిన పాదులు అంకురానికి ఆయత్తమయ్యాయన్న నీ FaceTime చాటింపు – అరవై ఏళ్ల మన అనగా అనగా కథకి సరికొత్త జోడింపు.
‘ఆనందం అర్ణవమైతే.. అనురాగం అంబరమైతే -’
నవజాతపు నగవులు
నవమాసాల నడకలు

క్రొన్నెత్తుటి చారిక
మూడో నెంబర్ హెచ్చరిక

వేవిళ్ళ వేసట
అతడే నీ బాసట

పులుపు మామిళ్ల బులుపు
చలిమిడి పాకంలో జీడిపలుకు
మూల ధాతువు నుంచి మూడో పదం! నయా నైఘంటిక చేర్పు ఎలాంటిదో తెలియదు. ‘తెలియకపోవడం’లో లయ తెలుసుకునేది ఎలాగో పుట్టకముందే నేర్పావు నువ్వు.
మందులేసుకో.. డైట్ చూసుకో.. నాలుగడులు వెయ్యి.. పుంజీడు గుంజిళ్లు తియ్యి.. అంటూనే కదా సూక్తి సుధలు చెప్పేదానివి.. అలకల ఆనలు పెట్టేదానివి
ఇప్పుడు బహువచనమై బరువయ్యింది నీ గొంతు
‘నిద్రపో నాన్నా..’ అంటావు, ఇద్దరం కంటున్న ఉమ్మడి కల కోసం.
అప్పుడెప్పుడో మంత్రసాని మరుపు.. పిక్కటిల్లిన అమ్మ అరుపు.. బిక్కబోయిన నాకు జోలలా నీ పిలుపు – ఆనక కోలాహలాల కొనసాగింపులో నా కొత్త పేరు:
‘తాతయ్య!’
~
♦నేను – నా పింకితల్లి

Exit mobile version