Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పగలే వెన్నెల.. జగమే ఊయల..

[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన యం. ధరిత్రీ దేవి.]

రవై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పాట అంటే.. ఘంటసాల, లీల, జిక్కి సుశీల, పి.బి. శ్రీనివాస్, మాధవపెద్ది..! అలా వారు పాడని సినిమా ఉండేది కాదు ఆ రోజుల్లో. మెల్లిగా వారి సరసన ఎస్. జానకిగారి పేరు చేరిపోయింది. దిగ్గజ గాయనిగా ఆమె పేరు ఒక్క తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా మారుమ్రోగిపోయింది.

నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఆకాశవాణి (రేడియో) లో అనుకోకుండా ఓ పాట వినడం జరిగింది. అప్పట్లో రేడియో ఒక చక్కటి ఇంకా అద్భుతమైన ప్రసార సాధనం. వార్తలనూ, సినీ గీతాలను, లలిత సంగీతాన్నీ ఇంకా ఇతర కార్యక్రమాలన్నింటినీ అందులోనే వినేవారు అందరూ. దాదాపు ప్రతీ ఇంట్లో రేడియో ఉండేది. నేనయితే పాటల్ని ఎంతో ఇష్టంగా వినేదాన్ని. అలా అనుకోని విధంగా ఓ రోజు ఓ పాట విన్నాను. అది.. ‘పగలే వెన్నెల.. జగమే ఊయల.. కదిలే ఊహలకే కన్నులుంటే..’

మొదటిసారి వినగానే చాలా బాగా ఉందనిపించింది. అలా అలా చాలాసార్లు ఆ పాట రేడియోలో వినడం వల్ల పాటలోని సాహిత్యమంతా కంఠతా వచ్చేసింది. మొదట గాయని పేరు గుర్తించకపోయినా.. తర్వాత తెలిసింది జానకి గారని! లీలగారు, జిక్కీ గారు, సుశీలమ్మగారు.. వీరి హవా సినీరంగంలో తారస్థాయిలో కొనసాగుతున్న రోజులవి. ఆ ప్రభంజనంలో మెల్లిగా నిలదొక్కుకుని కేవలం తన గాన మాధుర్యం, గాత్రం లోని చాతుర్యంతోనే అనతికాలంలోనే అగ్రస్థాయి గాయనిగా వినుతికెక్కారు జానకిగారు.

‘పగలే వెన్నెల’ పాట నాకు ఎంతగా నచ్చిందంటే ఆ చిన్న వయసులో ఎవరు పాడమన్నా సరే వెంటనే ఆ పాటనే అందుకొని పాడేదాన్ని. పెరిగి పెద్దయ్యాక కూడా ఆ పాటే నా మస్తిష్కంలో పాడడానికి ప్రథమంగా ఉండేది. విన్నవాళ్లు బాగా పాడావని ప్రశంసించడం ఓ అందమైన మరపురాని అనుభవం, అనుభూతి నాకు. ఇన్నేళ్లు గడిచినా పాటలోని ‘లిరిక్స్’ ఏ మాత్రం మరపుకురాకపోవడం మరో విశేషం!

మిగతా గాయనీమణులెందరున్నా జానకిగారి గాత్రం.. స్వరంలోని ఆ విరుపు.. ఆ మాధుర్యం ప్రత్యేకంగా అనిపించేది. పాడిన ప్రతీ పాట దేనికదే భిన్నంగా, విలక్షణంగా ఉండడం గమనార్హం. పదిహేడు భాషల్లో 48 వేల పాటలు పాడిన ఘనత సాధించారంటేనే ఆమె గొప్పదనం విదితమవుతుంది.

‘పగలే వెన్నెల’ పాట తరువాత విన్నపాటల్లో బాగా గుర్తుండిపోయింది ‘నర్తనశాల’ చిత్రంలోని ‘నరవరా ఓ కురువరా’ అన్నది. ఆ పాట వింటున్నప్పుడు ఎవరైనా సరే ఆ ప్రయత్నంగా పాదం కదపక మానరు. హైస్కూలు వార్షికోత్సవాల్లో ఆ పాటకు స్టేజిపై నృత్యం చేసేవారు అమ్మాయిలు!! అంత క్లాసికల్‌గా ఉంటుంది మరి! ఇక వారు పాడిన మిగతా పాటల్లో ఎంతో ప్రాచర్యం పొందినవీ, సుప్రసిద్ధమైనవీ కోకొల్లలు.. వాటిల్లో నాకు బాగా నచ్చినవీ.. అత్యంత ప్రీతిపాత్రమైనవీ.. స్మృతిపథంలో నిలిచిపోయినవీ కొన్ని ప్రస్తావిస్తాను.

‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలో శ్రీదేవిగారికి పాడిన పాట.. ‘సిరిమల్లెపూవా సిరిమల్లెపూవా.. నావాడు ఎవరే నాతోడు ఎవరే.. ఎన్నాళ్లకొస్తాడే..’ అన్నది. అప్పుడే అరవిరిసిన మల్లెపువ్వులా కనిపించే శ్రీదేవి తానే స్వయంగా తెరపై పాడుతున్నట్లుగా ఉంటుంది ఆ పాట వింటుంటే (చూస్తుంటే)! ‘మరో చరిత్ర’లో ‘పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపిపనులకు కోటి దండాలు..’ వింటుంటే ఆ భావ ప్రకటన టీనేజీ అమ్మాయిల ఊహలకూ, కోరికలకూ అద్దం పడుతుంది.

‘శ్రీవారికి ప్రేమలేఖ’లో పెళ్లి చూపులయ్యాక ఓ కన్నెపిల్ల తన మనోభావాల్ని, సందేహాల్ని వ్యక్తపరుస్తూ పాడడం! ‘మనసా, తుళ్లిపడకే.. అతిగా ఆశపడకే.. అతనికి నీవూ నచ్చావో లేదో.. ఆ శుభఘడియ వచ్చేనో లేదో..’ ఎంత సహజమైన, లోతైన భావన! కవి భావన ఎంత దివ్యంగా ఉందో అంతకు మించిన భావవ్యక్తీకరణ ఆ గానంలో ఇమిడిపోయి జానకమ్మ గొంతులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెరపై నటీమణి అభినయానికి అది ఎంతో ఉపకరించిందని నా భావన. అలాగే.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో ఎన్నెన్నో కలలు..’ అన్నది కూడా.

‘జ్యోతి’ చిత్రంలో ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు.. చిన్నారి పాపల్లే నవ్వు..’ అన్న పాట ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు ఆలపించారు. అందులో జానకిగారు పాడరు.. ఆమె నవ్వు మాత్రమే వినిపిస్తుంది. నిజంగా అప్పటికప్పుడు అలా నవ్వడం అనితరసాధ్యమే అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. సుశీలమ్మగారు ఒకానొక సందర్భంలో జానకమ్మగారి నవ్వు గురించి మెచ్చుకుంటూ అలా అలవోకగా పాటలో అంత సహజంగా నవ్వడం జానకికే సాధ్యమని అనడం విన్నాను.

‘సప్తపది’లో ‘నెమలికి నేర్పిన నడకలివే..’ పాట వింటే.. నిజంగా నెమళ్లు పురి విప్పి నాట్యమాడుతాయన్న అనుభూతి కలుగుతుంది ఎవరికైనా! పాత పాటల్లో బాగా ప్రాచుర్యం పొందినది ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట..’ ఆ తరంవాళ్ళలో ఈ పాట విననివాళ్లు బహుశా ఉండరేమో! స్త్రీపురుష బేధం లేకుండా ఎందరో ఈ పాట పాడేవాళ్లు. ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ సాంగ్ అంటే కాదనే వాళ్ళు ఉండరు కూడా.

ఇంకా.. ‘ఓహో ఓహో పావురమా.. వయ్యారి పావురమా.. మా వారి అందాలు నీవైనా తెలుపుమా..’ అంధురాలైన అమ్మాయి హావభావాల్ని తన గొంతులో పలికిస్తూ తెరపై ప్రాణం పోసిన పాట!! ‘కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు.. రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు..’ అంటూ పాడినప్పుడు జయప్రదలో పరకాయ ప్రవేశం చేసిందా అనిపిస్తుంది తెరపై చూసేటప్పుడు. ‘ఆంధ్ర మహావిష్ణు కథ’ లో, ‘వల్లభా ప్రియ వల్లభా.. ఎటనుంటివో.. ప్రియతమా’ అని పాడితే ప్రియుడి కోసం పడే తపన, ఆరాటం ఇట్టే కనిపిస్తాయి ఆ గొంతులో. ‘ఏ తోడు లేరు నాకెవ్వరు లేరు.. పిల్లగాలీ ఆగిపోవే.. చల్లగాలీ తోడు రావే..!’ అనురాగాలు చిత్రంలోని ఈ పాట వింటుంటే ఆ గొంతులోని బాధ కన్నీరు తెప్పించక మానదు.

‘అన్నా, దేవుడు లేడన్నా.. నీ కన్నా దేవుడు లేనే లేడన్నా..’ అంటూ ద్రౌపది చేసే ఆర్తనాదం..; ‘గోవుల్లు నల్లన.. గోధూళి ఎర్రన..’లో పసిపిల్ల గొంతు..! అలాగే మరో చోట వణుకుతున్న గొంతుతో ముసలమ్మలా పాడడం!! అన్నింటినీ మించి మగవాడి గొంతునూ అనుకరించి పాడడం!! ఎంతో మాధుర్యంతో నిండి ఉండే ఆ గాత్రం అలా గాంభీర్యాన్ని సంతరించుకుని బొంగురుగొంతుగా మారడం..! ‘ఔరా’ అనిపించకమానదు.

సహగాయని సుశీలమ్మ గారితో కలిసి పాడినవి, అత్యంత జనాదరణ పొందినవీ, చిరస్థాయిగా నిలిచిపోయినవీ ఉన్నాయి మరి!

‘రాసక్రీడ ఇక చాలు..’ – ‘సంగీత లక్ష్మి’లో తెరపై తల్లీ కూతుళ్లు పాడే ఈ పాట ఆ ఇరువురు దిగ్గజ గాయనీమణులూ పోటీపడి పాడారు. ‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ..’ అని పాడితే నిజంగానే ఇరువురికీ సరి లేరనిపిస్తుంది. ‘శ్రీకృష్ణతులాభారం’లో ‘కరుణించవే తులసిమాతా’ అంటూ పాడినప్పుడు రుక్మిణి గొంతులో మార్దవం, మృదుత్వం సత్యభామకు భిన్నంగా తెలిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ‘పాండవ వనవాసం’లో ఒకే పాటలో రకరకాల రాగాల ప్రయోగాలు చేయడం ఒకెత్తు!

“ఓ వన్నెకాడ.. నిన్ను చూడ..”

“తాళలేరా మదనా..”

“ఉరుకుల పరుగుల దొరా..”

— అంటూ స్వరరాగాలు మారుస్తూ పాడడం చిరస్మరణీయం. అలాగే, ‘మురిపించే మువ్వలు’ లో ‘నీ లీల పాడెద దేవా..’ అన్న పాట సన్నాయి రాగంలో కలిసిపోయిన ఆమె స్వరం ఈనాటికీ.. ఏనాటికీ ఓ అద్భుతమే!! జానకమ్మ గారి పాటల గురించి వ్రాస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ నాలుగైదు పాటల గురించి ప్రస్తావించకుండా ఎవరూ ఉండరన్నది వాస్తవం..! అలా వ్రాస్తే.. అది అసంపూర్ణమే మరి!!

ఇక.. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రమణ్యంగారలతో కలిసి పాడిన యుగళగీతాలు అనేకం.. ఒక్కొక్కటీ ఒక మణిపూసే! ఇంతకీ, చిత్రసీమలో జానకమ్మ పాటల పయనం మొదలైనది MLA చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడిన ‘నీ ఆశా ఆడియాశా.. చేజారే మణిపూస.. లంబాడోళ్ళ రాందాసా..’ పాటతో..! ఇలా ఎన్నని చెప్పను! ఎలా చెప్పను! వేలాది పాటల్లో ఉదహరించినవి మచ్చుకు కొన్ని మాత్రమే!! సుదీర్ఘ సినీ పాటల ప్రయాణంలో జానకమ్మ గారు అందుకున్న అవార్డులు, పొందిన పురస్కారాలు, సత్కారాలు లెక్కలేనన్ని.

సినీ వినీలాకాశంలో మధుర గాయనిగా ఉజ్వలంగా వెలిగిపోయిన జానకిగారి వ్యక్తిగత జీవితం ఆటుపోట్లకు, విషాదాలకూ మినహాయింపేమీ కాదని కొన్ని విశ్లేషణల ద్వారా తెలుస్తుంది. అందులో.. ఆమె కెరీర్ దిగ్విజయంగా సాగడానికి మూలకారకులైన ఆమె జీవితభాగస్వామి రాంప్రసాద్ గారు 1997 లో స్వర్గస్థులు కావడం ఒకటి. అంతవరకూ నుదుటన రూపాయి కాసంత బొట్టుతో కళకళలాడుతూ కనిపించే ఆమె వదనం భర్త మరణంతో కాస్త కళ తప్పినా ఆ పెదాలపై చెరగని చిరునవ్వు ఆ వెలితిని కప్పేసేది. ఆమె మరణానికి ఆరు నెలల ముందు ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ చనిపోవడం కూడా ఆమెకు శరాఘాతమే! అన్నింటినీ ఆత్మస్థైర్యంతోనే ఎదుర్కొని, పాటే తన ప్రపంచంగా ముందుకు సాగారు జానకమ్మ గారు.

‘పగలే వెన్నెల’ అంటూ అశేష జనావళిని అలరించి వెన్నెల వెలుగులు ప్రసరించి జగత్తునే ఊయలగా చేసి అందరి హృదయాల్ని తన పాటలతో ఓలలాడించిన శిష్ట్లా జానకమ్మ గారికి హృదయపూర్వక నివాళి ఇది. ఆమె లేని లోటు సినీ రంగానికే కాదు.. యావత్తు సంగీత ప్రియులందరికీ బాధాకరమే. 88 వసంతాలు చవిచూసిన కోయిలమ్మ ఈ జానకమ్మ దివిని తన ఒకప్పటి సహ గాయనీగాయకులను కలిసి అచట తన గానం కొనసాగిస్తూ ఆ గానామృతంతో ఇక స్వర్గాన అందరినీ అలరిస్తుంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

Exit mobile version