[శ్రీ రాజశేఖర్ కలికి రచించిన ‘పగిలిన అద్దం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“పెళ్ళి ఫోటోలో నా నవ్వు ముఖం చూసుకున్న ప్రతిసారి అది నేనేనా అని ఆశ్చర్యం వేస్తుందే.”
సుమిత్ర ముందున్న కాఫీ కప్పులో చక్కెర ఎప్పుడో కరిగిపోయింది, కానీ ఆమె స్పూను తిప్పుతూనే ఉంది. ఎదురుగా కూర్చున్న ఆమె స్నేహితురాలు జయ సానుభూతిగా వింటోంది.
“రఘుకి రోజూ ఆఫీసు పనితో పాటు, రాత్రి పన్నెండు దాకా అమెరికా వాళ్ళతో మీటింగులు. వారాంతం వస్తే వాళ్ళమ్మతో గంటలపాటు ఫోన్లో ఉంటాడు, లేకుంటే స్నేహితుల్ని కలవడానికి వెళ్ళిపోతాడు. అతగాడికి టైముకి కాఫీ, మూడు పూటల భోజనం, ఇస్త్రీ చేసిన బట్టలు అందితే చాలు. నాకేం కావాలో, నేనెలా ఉన్నానో అడిగి సంవత్సరాలైంది. ఒక సరసం గాని, సినిమా షికార్లు గాని, ఏమీ లేవు. పెళ్లయిన మొదట్లో తప్పితే, నవ్వుతూ మాట్లాడుకున్న రోజే గుర్తులేదు. మనిషి అతికీ అతకనట్లు ఉంటాడు. నేను బలవంతంగా మాట్లాడిస్తే, పొడి పొడిగా జవాబిస్తాడు. నేనా నాలుగు గోడల మధ్య బందీ అయిన ఒక పని మనిషిని, అంతే.”
సుమిత్ర కళ్ళలో కన్నీటి పొరలు తెగడానికి సంసిద్ధంగా ఉన్న చెరువు గట్లలా కనిపిస్తున్నాయి. జయ సుమిత్ర ఎడమ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఓదార్చుతున్నట్లుగా.
“సుమీ, అభీ వెళ్లిపోయాక నువ్వు మరీ ఎక్కువ ఒంటరితనం ఫీలవుతున్నావే. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి.”
“ఏం చెయ్యనే? చదువు మధ్యలో ఆపి మరీ పెళ్లి చేశారు. పెళ్లయిన సంవత్సరానికే అభీ పుట్టాడు. ఇన్నేళ్లు నా జీవితం వంటగదికే పరిమితమైపోయింది. డిగ్రీ లేదు. ఈ వయసులో, నేనుండే మానసిక స్థితిలో కొత్తగా ఏం చెయ్యగలను? ఆ మధ్య ఒక వృద్ధాశ్రమంలో వాలంటీరింగ్ చేసి, సాయంత్రానికి కాళ్ళ నొప్పులతో అలసిపోయాను.”
‘బియాండ్ కాఫీ’ షాప్ ఎప్పటిలానే నిండా కస్టమర్లతో కోలాహలంగా ఉంది. కౌంటర్ వెనుక నుంచి బుస్సుమంటున్న కాఫీ మిషన్ వైపు కాస్త చిరాకుగా చూసింది సుమిత్ర.
“అతగాడికి పిల్లల్ని పెంచడం రాదు. మరీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. కొంచెం కూడా క్రమశిక్షణ లేకుంటే, ఉన్న ఒక్క కొడుకు ఏమైపోతాడోనన్న ధ్యాస కూడా లేదు. ఈ రోజుల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, డ్రగ్స్ ప్రభావంతో పిల్లలెలా ఉన్నారు? మంచీ చెడూ చెప్పకపోతే ఎట్లా? అభీని చూస్తే జాలేస్తుంది. చాలా లావెక్కాడు. రఘు వాడికి అడిగినంత డబ్బులు ఇచ్చేస్తాడు. వాడు ఏమేం కొని తినేవాడో? రూమంతా చాకోలెట్ కవర్లు, ‘రెడ్ బుల్’ టిన్నులు. వాడి మనసులో ఏముందో తెలియదు. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ గదిలో కూర్చుని తలుపు గడియ పెట్టేసేవాడు. ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో ఏమో?” ఆమె గొంతు పూర్తిగా బొంగురు పోయింది.
పక్క టేబుల్ మీద ఒక జంట తెగ నవ్వుతున్నారు. అది చూసి సుమిత్ర విరక్తిగా నవ్వింది.
“జయా, ఈ రోజెందుకో నా మనసుని తొలిచేస్తున్న ఇంకో విషయం చెప్పుకోవాలనుంది.”
చెప్పమన్నట్లు తల ఊపింది జయ.
“రఘు నెలకోసారి పనిమీద ప్రయాణమని మూడు నాలుగు రోజులు వెళ్ళిపోతాడు. ఫోన్లో ఒక ఆఫీస్ కొలీగ్ అమ్మాయితో చాలా సేపు మాట్లాడుతుంటాడు. అడిగితే కళ్ళెగరేస్తాడు. నన్ను మాత్రం ఎప్పుడూ దగ్గర తీయడు. ఏదో ఎఫైర్ నడిపిస్తున్నాడని నా అనుమానం.”
జయ కనుబొమ్మలు ముడిపడ్డాయి. “ఏం మాట్లాడుతున్నావే? మీరిద్దరూ నాకు పదేళ్ల నుంచి తెలుసు. నీకేమో ప్రతి చిన్న విషయానికి పట్టరాని కోపం. రఘుకి పని పిచ్చి. చాలా మంది మగాళ్లలా అతనికి కూడా మనసు విప్పి ప్రేమాభిమానాలు వ్యక్తపరచడం చేతకాదు. అభీ పెంపకంలో మీకు భేదాభిప్రాయాలు వున్నాయి. ఇద్దరూ కలిసి ఏదైనా పార్టీకి వస్తే, మీ ఎడమొఖం పెడమొఖం అందరికీ కనబడుతుంది. ఇలాంటి సమస్యలు సాధారణం. కానీ రఘు మీద అనుమానమేంటి కొత్తగా? మీ ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది, జాగ్రత్త!”
“ఏమోనే. ఎక్కువ ఆలోచిస్తున్నానేమోనని నాక్కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, కాని కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను. చిన్నప్పటి అనుభవాలతో మగవాళ్లని నమ్మలేకున్నాను. మా పెదనాన్న అక్రమ సంబంధం వల్ల కుటుంబం పరువు పోయి, తాతయ్య చనిపోయారు.”
సుమిత్ర రెండు నిమిషాల మౌనం తర్వాత ఒక పెద్ద నిట్టూర్పుతో, ఎంతో నిస్సహాయంగా అంది. “మా నాన్న నాకేం కావాలో కూడా తెలియని వయసులో పెళ్లి చేసి వదిలించుకున్నాడు. ఆయన పోయాక అమ్మని వచ్చి మాతో ఉండమంటే, ఆవిడకేమో కూతురింట్లో ఉండడం నామోషీ. ఈ ఒంటరితనం భరించలేకున్నానే.”
***
రఘు శనివారం రాత్రి తన డెస్క్ ముందు కూర్చున్నాడు. ఆ వారం ఆఫీసులో జరిగిన ఒక సెమినార్‌లో ‘ఎక్స్‌ప్రెసివ్ రైటింగ్’ అనే ప్రక్రియ గురించి చెప్పారు. వాళ్లిచ్చిన్న ప్రశ్నని మరోసారి చూసుకున్నాడు.
“మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తికి ఒక ఉత్తరం రాయండి. మీ అసలైన భావోద్వేగాలన్నింటినీ ఏమాత్రం దాచుకోకుండా అందులో వెళ్లగక్కండి. ఈ ఉత్తరాన్ని మీరు ఎవరికీ పంపించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీకోసం!”
ఇలా చేస్తే మనసు తేలిక పడుతుందని వాళ్ళిచ్చిన ప్రోద్బలంతో అతను రాయడం ప్రారంభించాడు.
“డియర్ సుమిత్రా,
ఈ రోజు కూడా ఇంట్లో మళ్ళీ అదే బాగోతం. పనిమనిషిని తిట్టడంతో మొదలు పెట్టి, తిప్పి తిప్పి నా మీద పడ్డావు. నీ ఎత్తిపొడుపు మాటలు కత్తులు విసిరినట్టు వుంటాయి. పది నిమిషాలు ప్రశాంతంగా పేపర్ చదువుకోలేక పోయాను.
అసలు తప్పెక్కడ జరిగింది? మంచి కట్నం, మంచి కుటుంబం, పిల్ల ఆణిముత్యమని ఏవేవో చెప్పి, నాకు చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరగానే మనకి పెళ్లి చేశారు. అప్పుడు నువ్వొక చిన్న పిల్లవి. వంటావార్పు కూడా రాదు. నీతో ఈ భాష తెలియని ఊరిలో ఎన్ని కష్టాలు పడ్డాను?
నాకు చేతనైనంత వరకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను. ఓపిగ్గా పనులన్నీ నేర్పించాను. బెంగుళూరంతా తిప్పాను. రిలీజైన ప్రతి తెలుగు, హిందీ సినిమాకి తీసుకెళ్ళాను. అభీ డెలివరీ అప్పుడు ఏవేవో సమస్యలతో రక్తం బాగా పోతే, అత్తమ్మతో పాటు, నేను కూడా దగ్గరుండి చూసుకున్నాను. తర్వాత నువ్వు ఇంకో బిడ్డ వద్దంటే ఒప్పుకున్నాను, నీ కష్టం మళ్ళీ చూడలేక.
ఇంత చేసినా, ఈ రోజు నా మీద అనుమానం. కంపెనీ ప్రయాణం మీద ఉన్నప్పుడు సమయం సందర్భం లేకుండా వీడియో కాల్స్ చేస్తావు, నేనెక్కడున్నానో ఏం చేస్తున్నానో చూసేందుకు. ఆడవాళ్లతో మాట్లాడితే పెద్ద తప్పన్నట్లు ప్రశ్నిస్తావు. ఆఫీసులో కొలీగ్స్‌తో మాట్లాడకుంటే పనులెలా జరుగుతాయి? జీతాలెలా వస్తాయి?
నీ తలనొప్పికి తోడు, ఈ ఐటీ ఉద్యోగం ఒకటి నా బతుక్కి. ఎప్పుడూ ఒక ప్రెజర్ కుక్కర్‌లో ఉన్నట్టే. అందరూ నా సీటు కోసం గద్దల్లా కాచుకొని ఉంటారు. అమెరికాలో ఉండే మా మేనేజ్‌మెంట్‌కి ఏవేవో చాడీలు చెబుతూనే ఉంటారు. చిన్న తప్పు జరిగితే నా ఉనికికే ప్రమాదం. ఇలాంటి ఉద్యోగాల్లో ఒకసారి చెడ్డ పేరొస్తే, తిరిగి మరో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఈ విషయం నీకూ చెప్పాను.
గొడ్డు చాకిరీ చేసి ఇంటికొస్తే, ఇక్కడో యుద్ధభూమి సిద్ధంగా ఉంచుతావు. మగాడిగా, సంపాదించే వాడిగా, కాస్త గౌరవం ఆశించడం తప్పా? మా అమ్మని చూడు. ఇద్దరు బిడ్డల్ని ఎంత చక్కగా పెంచింది? ఏ రోజు గొంతు పెంచి ఒక్క మాట అనలేదు. మాకెంతో స్వేచ్ఛనిచ్చింది. నాన్న తాగుడు మనిషైనా, సహనంతో మార్చుకుంది. ఈ వయసులో కూడా అన్ని పనులు తనే చేసుకుంటుంది.
నీకేమో నోరు తెరిస్తే ఆవేశం. ఏ సంభాషణ మొదలెట్టినా, అది ఒక గొడవై తీరుతుంది. అందుకే నేను చాలావరకు మౌనంగానే ఉండిపోతాను. నీ నోటి దురుసుకి సొంత అమ్మ కూడా ఒక నెలకు మించి మన ఇంట్లో ఉండలేక పోయింది. ఇప్పుడు తిరిగి రమ్మంటే ఏదో ఒక సాకు చెప్పి దాటేస్తోంది. అది నీ తలకెక్కిందా?
ఒకసారి అభీ ముందే ప్లేట్లు విసిరేసి నన్ను కొట్టినంత పని చేశావు. ఎదిగే పిల్లవాడు ఏమనుకుంటాడో, ఏమి నేర్చుకుంటాడో అన్న ఇంగితజ్ఞానం లేదా? అదేమంటే, సర్దడం పేరుతో వాడి రూమంతా తనిఖీ చేస్తావు. వాడికిది చెప్పు, అది చెప్పు, టీచర్లతో మాట్లాడు, సోషల్ మీడియా చెక్ చెయ్యి, డబ్బులివ్వడం తగ్గించు అని నా బుర్ర తింటావు. ఇలానా పిల్లల్ని పెంచేది? రేయింబవళ్లు వాణ్ణి చిరాకు పెడితే ఎలా?
అభీ.. వాణ్ణి తలుచుకుంటే నాకే దిగులేస్తుంది. మనిద్దరికీ పూర్తిగా దూరమైపోయాడు. వాడి కళ్ళలో నేనంటే గౌరవం కనబడదు, ఒక భయం, అసహ్య భావం కనిపిస్తుంది. పాపం, మన ఇద్దరి మధ్య చిక్కుకుని నలిగిపోయాడు. ఎలాగో చివరికి ఈ నరక కూపం నుంచి బయట పడ్డాడు.
నాకేం చేయాలో పాలుపోవడం లేదు. ఒక్కసారైనా ఇంటి గుమ్మం దాటి లోపలికి రాగానే అందమైన నవ్వుతో పలకరించి, ప్రేమగా ఓ కప్పు కాఫీ ఇచ్చే ఆ పాత సుమిత్రని చూడాలని ఉంది.
ఇట్లు, నీ భర్త రఘు.”
***
అభిరామ్ తన కంప్యూటర్ బ్యాగుని ఒళ్ళో ఒడిసిపట్టుకుని కూర్చున్నాడు. గోడల మీద స్ఫూర్తి వాక్యాలతో ఉన్న పోస్టర్లను మార్చి మార్చి చూస్తున్నాడు.
డాక్టర్ గ్రేస్ ముఖం మీద చిరునవ్వుతో పలకరించారు. “అభీ, మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం. మనం ఇక్కడ మాట్లాడేదంతా మన మధ్యే ఉంటుంది. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ, నిన్ను తప్పు పట్టడం గాని, విమర్శించడం గాని జరగదు. నువ్వు నిస్సంకోచంగా మాట్లాడవచ్చు.”
సరేనన్నట్టు తల ఊపాడు అభిరామ్. సైకోథెరపీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇంటర్నెట్లో చదివాడు. ఒక కొలీగ్ ద్వారా డాక్టర్ గ్రేస్ ముంబయిలో మంచి పేరున్న ‘బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ సైకాలజీ’ స్పెషలిస్ట్ అని తెలుసుకుని, ఆమె గురించి చదివి, కలవడానికి వచ్చాడు.
“ఓకే, గుడ్! నువ్వు ఒక సైకాలజిస్టుని కన్సల్ట్ చేయాలని ఎందుకు అనుకున్నావు?”
అభిరామ్ గది ఒక మూల వైపు చూస్తూ, మాటల కోసం వెతుక్కుంటున్నాడు. గొంతు కొంచెం తడబడింది.
“మేడమ్, నా మీద నాకు నమ్మకం పోతోంది. స్నేహితులందరూ కెరీర్, డేటింగ్ గురించి మాట్లాడుతుంటే, నాకు మాత్రం లోపల ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. మొన్న ఆఫీసులో మా మేనేజర్ ఒక మీటింగ్ పూర్తయిన తర్వాత, రూమ్ తలుపు గట్టిగా వేసి వెళ్ళారు. ఆ చిన్న విషయానికే నాకు చెమటలు పట్టాయి. ఆయన నా మీద కోపంగా ఉన్నారని, నేను చేసిన పనిలో ఏదో పెద్ద తప్పుందని, నన్ను తీసేస్తారని ఫిక్స్ అయిపోయాను. ఆ రోజంతా సరిగ్గా పని చేయలేక పోయాను.”
అభిరామ్ గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది.
“ఎవరైనా రోడ్డుమీదనో, షాపులోనో ఫోన్లో గట్టిగా అరుస్తున్నా, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్లు, చేతులు వణుకుతాయి. నాకేమీ సంబంధం లేకపోయినా, నేనేదో తప్పు చేసినట్లు ఫీలింగ్. ఎదుటివాళ్లు నవ్వుతూ ఉంటేనే కాస్త ప్రశాంతంగా ఉండగలను. వాళ్ల ముఖం కొంచెం సీరియస్‌గా మారినా, నేను భయానికి లోనవుతాను. అసలు నేనెందుకు ఇంత సున్నితంగా తయారయ్యానో నాకు అర్థం కావడం లేదు.”
“అభీ, చిన్నప్పటి నుంచి ఇలాగే అనిపించేదా? ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? నీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటి?”
ఈ ప్రశ్న వినగానే అభిరామ్ ముఖంలో శూన్యం ఆవహించింది. కాసేపు ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ ఉండిపోయాడు.
“మేడమ్, ఇంట్లో వాతావరణం.. అంటే.. ఒక తుఫానులో ఇరుక్కుపోయినట్లుగా ఉండేది. మా అమ్మ, నాన్న ఎప్పుడూ ఒక మాట మీద ఉండరు. నాన్న ఒకటంటే, అమ్మ దానికి విరుద్ధంగా ఇంకేదో అంటుంది. ఎప్పుడేం తగువు జరుగుతుందో, ఏ పిడుగు నా మీద పడుతుందోనని భయం భయంగా ఉండేది. నేను చిన్నప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారని అడిగేవాణ్ణి. అమ్మేమో ‘అంతా నా ఖర్మ’ అనేది. నాన్న వైరాగ్యంగా నవ్వేవాడు. ఏం చేయాలో తెలియక నా గదిలో ఏడుస్తూ కూర్చునేవాణ్ణి.”
తన బాల్యాన్ని తవ్వుతున్న కొద్దీ, అతడి ముఖంలో బాధ, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి డాక్టర్ గ్రేస్‌కి.
“అప్పుడప్పుడూ ఆ గొడవలంతా నా వల్లేనేమో అనిపించేది, మేడమ్. ఆ ఒత్తిడిలో చాకోలెట్లు ఎక్కువ తినేవాణ్ణి. రెడ్ బుల్ తాగేవాణ్ణి. పళ్ళు పాడైపోయి, ఒక పంటికి రూట్ కెనాల్ చెయ్యాల్సి వచ్చింది. కొన్ని రోజులు రహస్యంగా డ్రగ్స్ తీసుకున్నాను. ఒకసారి అమ్మ ‘పందిలా తయారవుతున్నావు’ అని నన్ను తిట్టి, ‘అంతా నీ వల్లే’ అని నాన్న మీద పడి రక్కేసి, ప్లేట్లు గోడకేసి విసిరి పగలగొట్టింది. ఆరోజు ఆత్మహత్య చేసుకుందామని మా బిల్డింగ్ డాబా మీదకి వెళ్లాను. అక్కడ నీళ్ల పైపు రిపేరు చేస్తున్న ఒకతను అనుమానంగా చూస్తే, తిరిగి వచ్చేశాను.”
ఆ మాట అంటూ, అభిరామ్ కన్నీరు ఆపుకోలేక పోయాడు. డాక్టర్‌కి కనిపిస్తే ఏమనుకుంటుందోనని చివ్వున తల తిప్పుకున్నాడు. డాక్టర్ గ్రేస్ టిష్యూ డబ్బాని అందిస్తూ, “అభీ, నువ్వు చాలా ఏళ్లుగా మోస్తున్న భారమిది. తనివితీరా ఏడిస్తే మనసు తేలికపడుతుంది” అన్నారు.
అభిరామ్ టిష్యూ తీసుకున్నాడు. దాన్ని మడిచాడు. మళ్ళీ మళ్ళీ మడిచాడు. “మేడమ్, డిగ్రీ మా సిటీలోనే చేశాను కాబట్టి హాస్టల్లో చేరలేదు. ఆర్నెల్ల కిందటే మొదటిసారి ఇల్లు వదిలి, ఉద్యోగం కోసం ముంబయి వచ్చాను. ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉన్నా, ఆ చేదు జ్ఞాపకాల నీడలు నా వెంటే వస్తున్నట్లు అనిపిస్తోంది.”
అలా, వారి సంభాషణ ఒక యాభై నిమిషాల పాటు సాగింది.
“కీలకమైన విషయాలు చెప్పావు, అభీ. నీ ఆత్మవిశ్వాసం తగ్గడానికి, భయాలకు, నువ్వు పెరిగిన వాతావరణమే కారణమని స్పష్టంగా తెలుస్తున్నది. ఏ క్షణంలో ఏ గొడవ జరుగుతుందో తెలియని అస్థిరత నిన్ను ఎప్పుడూ ఒక అప్రమత్త స్థితిలో ఉంచింది. ఇందులో నీ తప్పేమీ లేదు. తరువాతి సెషన్లలో దీని మీద దృష్టి పెడదాం.”
ఆ మాటలు అభిరామ్‌కి ఎంతో ఊరటనిచ్చాయి. అతను తన బ్యాగు మీద పట్టు సడలించాడు. తలెత్తి డాక్టర్ కళ్ళలోకి నేరుగా చూశాడు. ఆ చూపులో ఒక చిన్న ఆశ కనిపించింది.
***
అభిరామ్ వెళ్లిన చాలా సేపటి వరకు డాక్టర్ గ్రేస్ కిటికీ నుండి బయటకు చూస్తూ ఉండిపోయారు. ఆవిడ క్లినిక్‌కి ఈ మధ్య ఇలాంటి కేసులు రావడం చాలా ఎక్కువైంది. మానసిక ఒత్తిడి పెంచే ఆధునిక ఉద్యోగాలు, పెరిగిన సంపాదనలు, చిన్నవైన కుటుంబాలు. ఒకే కప్పు కింద ఉంటూ కూడా, మనసు విప్పి మాట్లాడుకోని మనుషులు. ఒక తరం అనుభవించిన మానసిక సమస్యలను నయం చేసుకోకపోతే, అవి ఆస్తుల్లా తరువాతి తరానికి వారసత్వంగా వస్తాయనేందుకు అభిరామ్ ఒక సజీవ సాక్ష్యం.
అభిరామ్ తన సమస్యను గుర్తించి సైకోథెరపీ సహాయం కోరడం ఒక మంచి పరిణామం. కానీ ఒక సైకాలజిస్ట్‌గా ఆవిడ మనసును వేధిస్తున్న ప్రశ్న ఇంకొకటి ఉంది. రఘుకి, సుమిత్రకి ఒక మానసిక పరిణతి రాకముందే వాళ్ల పెద్దవాళ్లు పెళ్లి చేశారు. వాళ్లు కూడా పిల్లల పెంపకంలో ఓనమాలు నేర్చుకోకుండా తల్లిదండ్రులయ్యారు. కాస్త మెచ్యూరిటీ ఉండి, డెలివరీ తర్వాత సుమిత్ర అనుభవించిన మానసిక మార్పులను రఘు గమనించి వారిద్దరూ కలిసి ‘కపుల్ థెరపీ’ తీసుకుని ఉంటే.. అభిరామ్ బాల్యం ఇంతలా ఛిన్నాభిన్నం అయ్యేది కాదు కదా!
విరిగిన ఎముకని శస్త్రచికిత్సతో మళ్లీ అతికించవచ్చు, కానీ పగిలిన అద్దాన్ని ఎప్పటికీ పూర్తిగా సరిచేయలేము. ఎంత జాగ్రత్తగా అతికించినా ఆ పగుళ్ళ గీతలు ఉండిపోతాయి. అభిరామ్ తన మానసిక గాయాల నుంచి కోలుకోవడానికి ఎంతో ఓపిక, ప్రేమ, వృత్తిపరమైన సహాయం అవసరం. అతని కళ్ళలో కనిపించిన ఆ చిన్న ఆశే ఆమెకు స్ఫూర్తి!
నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరి పైరు గాలి నా తొలి శ్వాస. చిన్నప్పటి నుంచి దొరికిన ప్రతి పుస్తకం చదవడంతో పాటు, కవితలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, ఏవి తోచితే అవి రాయడం అలవాటు. వరంగల్లులో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనూ ఈ సృజన కొనసాగింది. కవితలూ, వ్యాసాలూ, హాస్యరచనలూ పత్రికల్లో వెలుగు చూశాయి. కొన్ని నాటకాలు రాసి, వాటికి వేదికపై ప్రాణం పోశాను కూడా. తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టాక, ‘కోడ్’ లైన్లు పెరిగాయి, కవిత పంక్తులు తగ్గాయి. కలం ఎక్కడో మూల నిద్రపోయింది. ముప్పై సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ మేల్కొంది. నా కథలు, కవితలు ముఖ్యంగా సమకాలీన సమాజం, నగర జీవన విధానాలు, ఐటీ ఉద్యోగాలు, మానసిక సమస్యలు, మరియు కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగుతాయి.
