[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘పక్షుల ప్రపంచం’ అనే దీర్ఘకవితని అందిస్తున్నాము.]
పిక సంతతి
ప్రియ కుహు కుహూ స్వనులు
ప్రకృతిని కీర్తించే కలధ్వనులు!
రామ చిలుకల
రహి గొలిపే సద్దులు
సేవించిన స్వాదు ఫలాల
రుచిని వర్ణించే సుద్దులు!
మనోహరంగా పురి విప్పి
నర్తించే మయూరముల
పియు పియూ రవాలు
కృష్ణుని కృపాదృతికి,
సొగసైన ఆకృతికీ
తామే అర్హులమైనట్లు
సగర్వంగా చాటి చెప్పే రావాలు!
తళుకుల సొబగుల
బుల్ బుల్ పిట్టల రవళులు
వీనులకు విందునందించే
శ్రావ్య శబ్దాల తరగలు!
పాల పిట్టల
చాక్ చాక్, జార్ జార్ ఘోషణలు
తమ దర్శనం శుభ ప్రదమంటూ
గొప్పగా చాటే భాషణలు!
చిరర్ చిరర్, ట్రీ ట్రీ అంటూ సాగే
పచ్చ పిట్టల
సంగీతమయ గీతులు
అనితరసాధ్యమైన విధంగా
గూటినల్లే నైపుణ్యము,
అందరినీ ఆకర్శించే సౌందర్యమూ
తమ సొంతమని
ఘనంగా తెలిపే స్వర రీతులు!
మైనాల సవ్వడులు
ప్రకృతిని తాము కూడా
వర్ణ భరితము, రాగ యుక్తమూ
చేస్తున్నామంటూ
తమ ఉనికిని ఉగ్గడించే నుడులు!
నైటింగేల్ గానాలు
తన గళ మాధుర్యాన్ని,
తన ఆహ్లాదాన్నీ
అందరికీ పంచే తీయని స్వానాలు!
పావురాల గుట్రుకల అలికిడులు
సర్వ మతాలయాలను సందర్శిస్తూ
సంచరిస్తున్న తామే
సమైక్యతకు శాంతికీ
చిహ్నలమని ప్రకటించే
మాటల మైవడులు!
గుండె లోతుల్లో మార్మోగుతున్న
ఊర పిచ్చుకల దయనీయ ఉద్ఘోషలు
వారి గూడులను,
మనుగడనూ కూల్చిన
మహానగరీకరణ దారుణాలను
వివరించే
గోడుల నిర్ఘోషలు !
విభిన్న స్వర గతుల ద్వారా
తమ మనః స్థితిని,
పరిసరాల పరిస్థితినీ
ఎరుక పరచే పక్షులు
స్వర భాషా దక్షులు!
తమ ప్రాంతీయ ఆధిపత్యాన్ని,
ప్రమాదాల హెచ్చరికలను,
చెలిమి కలిమి అభ్యర్థనలను,
ఆక్రందనలను
వేదనలను,
హ్లాదనలనూ,
అనేక విధాల భావాలనూ
గళ రవాల ద్వారా వ్యక్త పరచే
విహగ జాతులు
స్వర విద్యా విశారదులు!
స్వేచ్ఛకు
శ్రమైక జీవన సౌందర్యానికీ
నిత్య కృషీవలత్వానికి,
చాలినంతనే సంపాదించుకునే
చారు తత్వానికీ
పక్షులు సాక్షులు!
సహజ సంగీత విద్వాంసులైన
పలు తెగల
విశ్వ వ్యాప్త విహంగాలకు ,
చూపరులను
మంత్ర ముగ్ధులను చేయగల
సోయగాల హొరంగుల పతంగాలకు,
కనువిందు జేసే
మేలిమి రూపాల
వర్ణ వైవిధ్యాల విహగములకు,
సంకుచిత భావనల హద్దులు
శత్రుత్వాన్ని పోషించే సరిహద్దులూ లేని ద్విజములకు
జేజేలు!
వేవేలు!
చిన్ని దేహంలో
కొండంత ఆత్మ బలాన్ని నింపుకుని
మానవ అఘాయిత్యాలను
ప్రకృతి వైపరీత్యాలనూ సహిస్తూ
రెక్కల కష్టంతో
తృప్తిగా జీవిస్తూ
తమ రూపులతో
పాటల తీపులతో
అందరినీ అలరిస్తూ
యథేఛ్ఛగా, హాయిగా విహరించే
గగనచరులను
పంజరంలో బంధించి బాధించి
వినోదించే
క్రూర స్థాయికి
మనిషితనం పడిపోవడం దారుణం!
స్వీయ ఆహ్లాదం కోసం
పక్షుల సుఖ సంతోషాలను,
స్వతంత్రతనూ హరించేటంతటి
ఘోరంగా
మనిషి గుణం చెడిపోవడం
హీనం! అత్యంత హీనం!
