[1966 లో అనురూపా సంస్థ నిర్మించిన ‘పల్నాటి యుద్ధము’ చిత్రం షష్టిపూర్తి సందర్భంగా ఆ సినిమాను విశ్లేషిస్తున్నారు శ్రీ ఆచారం షణ్ముఖాచారి.]
బలమైన కథ, పటుత్వంగల కథనం, ఉత్తమ నటన, కర్ణపేయమైన సంగీతం, మనసును హత్తుకోగల సన్నివేశాలు, మంచి ఛాయాగ్రహణం వంటి దినుసులు సమపాళ్ళలో కలిస్తే ప్రేక్షకుని మనోఫలకం మీద చెరగని ముద్రవేయగల సినిమాలు వస్తాయి. అటువంటి కోవకు చెందిన చిత్రమే అనురూపా ఫిలిమ్స్ వారు గుత్తా రామినీడు దర్శకత్వంలో నిర్మించిన “పల్నాటి యుద్ధము” చారిత్రాత్మక చిత్రం. మహాభారత గాధను పోలిన “పల్నాటి వీరచరిత్ర” తెలుగువారికి సొంతం. ఇరవయ్యో శతాబ్దంలో జాతిపిత మహాత్మా గాంధి వంటి మహనీయులు శాంతి, ఆహింసలను ప్రబోధించి, విశ్వశాంతికి, విశ్వమానవ కల్యాణానికి తమజీవితాలనే అంకితం చేస్తే, ఎప్పుడో పన్నెండో శతాబ్దంలోనే అంటరానితనాన్ని రూపుమాపి, సర్వమత సిద్ధాంతాన్ని పాటించి, మానవ శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితంచేసిన మహాపురుషుడు పల్నాటి బ్రహ్మనాయుడు. అతడు చేపట్టిన పవిత్ర ఉద్యమాన్ని, వర్ణాశ్రమ ధర్మాల పేరుతో పల్నాడు విచ్ఛేదనానికి నాయకురాలు నాగమ్మ కారణభూతురాలు అవుతుంది. పశుబలంకంటే సిద్ధాంత బలమే గొప్పదని నిరూపించిన ‘పల్నాటి యుద్ధము’ సినిమా 18, ఫిబ్రవరి 1966 న విడుదలై విజయం సాధించింది. అరవైఏళ్ళు పూర్తిచేసుకున్న ఈ షష్టిపూర్తి సినిమా విశేషాలు కొన్ని.
తెలుగులో తొలి పల్నాటి యుద్ధం సినిమా.. 1947
తెలుగులో వచ్చిన తొలి చారిత్రాత్మక చిత్రంగా ‘పల్నాటి యుద్ధం’ చరిత్ర పుటలకెక్కింది. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ఈ చిత్రాన్ని సారథి ఫిలిమ్స్ బ్యానర్‌పై కాకుండా తన భార్య శారదాంబ పేరిట శారదా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ‘మాలపిల్ల’ సినిమా తర్వాత అన్నదమ్ముల కలహాలకు దారితీసిన పల్నాటి వీరచరితను తెరకెక్కించాలని రామబ్రహ్మానికి కోరికగా వుండేది. ఈ చిత్రానికి న్యూటోన్ స్టూడియోకు చెందిన జితేన్ బెనర్జీ, దిన్షా టెహరానీ భాగస్వాములు. వీరిద్దరూ ఈ సినిమాకు వరసగా ఛాయాగ్రహణం, శబ్దగ్రహణం శాఖలను నిర్వహించారు. సినిమా పదిశాతం తయారయిందో లేదో, రామబ్రహ్మం పక్షవాతంతో మంచానపడ్డారు. ఆ తరవాత నిర్మాణ బాధ్యతలు రామబ్రహ్మం బావమరది కోగంటి వెంకట సుబ్బారావు చేపట్టారు. అప్పట్లో ఎల్.వి.ప్రసాద్ ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం అస్వస్థతతో ‘పల్నాటి యుద్ధం’ చిత్ర దర్శకత్వ భారం ప్రసాద్ మీద మోపబడింది. కాటూరి జగన్మోహనరావు ప్రసాద్‌కు ఈ సినిమా నిర్మాణంలో సహకారమందించారు. కారెంపూడి దేవాలయంలో భద్రపరచిన ఆ రోజుల్లో వాడిన ఆయుధాలకు నకళ్ళు తయారు చేయించి ఈ సినిమాలో వాడారు. సినిమా విడుదలకు ముందే 1946 అక్టోబరులో రామబ్రహ్మం కాలం చేయడంతో సినిమాను రామబ్రహ్మం దంపతుల స్మృతికి అంకితమిచ్చారు. రామబ్రహ్మం మరణించాక ఆ సంస్థ ఆర్ధికంగా చితికిపోవడంతో ఎల్. వి. ప్రసాద్ బొంబాయిలో తనకున్న పలుకుబడి నుపయోగించి మరాఠీలో వచ్చిన ‘చందారావు మోరే’ అనే చారిత్రాత్మక సినిమాలోని దృశ్యాలను సంపాదించి, యుద్ధ సన్నివేశాలకు వాటిని అనుసంధానించారు. అలా సినిమాను తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. అటు అక్కినేనికి, ఇటు ఘంటసాలకు ‘పల్నాటి యుద్ధం’ కేవలం ఐదవ సినిమా కావడం విశేషం. రామబ్రహం బ్రహ్మనాయుడు పాత్రను తొలుత నాగయ్యకు ఇవ్వజూపారు. నాగయ్య వాహినీ వారి చిత్రాలతోబాటు, తన స్వంత సంస్థ సినిమా నిర్మాణాలలో తలమునకలుగా వుండడంతో ఆ పాత్ర గోవిందరాజుల సుబ్బారావుకు దక్కింది. ఇందులో అక్కినేని తన పాటలను తానే పాడుకున్నారు. ఈ చిత్రం దేశ స్వాతంత్ర్యానంతరం 24, సెప్టెంబరు 1947న విడుదలై జయభేరి మ్రోగించింది. ఇందులో నాగమ్మగా కన్నాంబ, నలగామరాజుగా శ్రీవత్స, నరసింహరాజుగా లింగమూర్త్రి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, మాంచాలగా యస్. వరలక్ష్మి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
1966 ‘పల్నాటి యుద్ధము’ చిత్ర కథ
పల్నాటి చరిత్ర ప్రతి తెలుగుపౌరుడు తెలుసుకోవాలి. పల్నాడుకు రాజధాని గురజాల. ఆ పల్నాటి సీమ అనుగురాజు కుమారుడు నలగామరాజు (గుమ్మడి) పాలనలో వుంది. నలగామరాజు సవతి తల్లి విద్యాలదేవి (హేమలత). ఆమె ఇద్దరు కుమారులు నరసింహరాజు (రాజనాల), మలిదేవుడు (బాలయ్య). అనుగురాజు కాలం నుంచీ వీరవైష్ణవుడైన బ్రహ్మనాయుడు (యన్.టి.రామారావు) ఆ రాజ్యానికి మహామంత్రి. బ్రహ్మనాయుడి భార్య ఐతాంబ (అంజలీదేవి). వీరికి లేకలేక కలిగిన సంతానం బాలచంద్రుడు (హరనాథ్). బ్రహ్మనాయుడు సర్వమానవ సమానత్వానికి, అహింసాతత్వానికి, శాంతి స్థాపనకు కట్టుబడిన వ్యక్తి. ఆ రోజుల్లో హరిజనులకు ఆలయ ప్రవేశం లేదు. అలాంటిది బ్రహ్మనాయుడు హరిజనులకు మాచెర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రవేశం కలిపిస్తాడు. అంతేకాదు హరిజన వర్ణానికి చెందిన కన్నమనాయుని (మిక్కిలినేని) సైన్యాధిపతిగా నియమిస్తాడు. రేఖాంబ(ఛాయాదేవి) కన్నమనాయుని భార్య.
బాలచంద్రుని జాతకం పరీక్షించిన జ్యోతిష్యులు, అతడి వలన పల్నాడు నాశనం కానుందని చెబుతారు. పల్నాడు రాజ్య సుస్థిరతే ముఖ్యమని భావించిన బ్రహ్మనాయుడు, బాలచంద్రుని చంపించమని వేగులను పురమాయిస్తాడు. కానీ, సైన్యాధ్యక్షుడు కన్నమనాయుడు ఆ బాలుని కాపాడి, అతడి సంరక్షణను చంద్రమ్మకు అప్పగించి రహస్యంగా పెంచుతాడు. పల్నాడు సీమ వరదలకు అల్లకల్లోమవుతుంది. బ్రహ్మనాయుడు ప్రజలనందరినీ కాపాడి, వారికి స్థానిక దేవాలయాలలో, సత్రాలలో వసతి ఏర్పాటు చేస్తాడు. బ్రహ్మనాయుని చేత గతంలో పరాభావింపబడిన గోపమంత్రి (కె.వి.యస్.శర్మ) కక్ష సాధించే పథకరచన చేస్తాడు. చిట్టగామాలపాడు గ్రామంలో నివసించే నాగమ్మ (భానుమతి) అనే ధనవంతురాలిని గోపమంత్రి ఆశ్రయించి నలగామరాజు వద్ద మూడురోజుల పాటు రాజ్యాధికారాన్ని నిర్వహించే వరం స్వీకరింపజేస్తాడు. ఆమె రాజ్యాధికారంతో నలగామరాజు మనసు మార్చివేస్తుంది. అందుకు కినుక వహించిన బ్రహ్మన్న తన మంత్రి పదవిని వదలుకుంటాడు. తల్లి కోరిన విధంగా నలగామరాజు మాచెర్ల రాజ్యాన్ని తమ్ముడు మలిదేవుని పరం చేస్తాడు. బ్రహ్మనాయుడు మలిదేవుని పక్షం వహిస్తాడు. కొమ్మరాజు (ముక్కామల) పుత్రుడు అలరాజు (కాంతారావు)కు నలగామరాజు కూతురు పేరిందేవి (వాసంతి) తో వివాహానికి నాగమ్మ ఏర్పాట్లు చేస్తుంది. పెళ్లి సందర్భంగా గురజాలలో కోడిపందేలు జరుగుతాయి. ఆ కపట కోడిపందెంలో మలిదేవరాజు, బ్రహ్మనాయుడు ఓడిపోయి ఏడు సంవత్సరాల అరణ్యవాస శిక్షకు వెళ్తారు. శ్రీశైలరాజు సాయంతో బ్రహ్మన్న వీరమాదపి నిర్మాణం చేస్తాడు. కన్నమనాయుడు బాలచంద్రుని బ్రహ్మన్న వద్దకు తీసుకొని వస్తాడు. కన్నమనాయుడు కూతురు మాంచాల(జమున)తో బాలచంద్రుని వివాహం జరుగుతుంది. అరణ్యవాసానంతరం మలిదేవుడు అలరాజును రాయబారిగా నలగామరాజు వద్దకు పంపగా, నాగమ్మ ప్రోద్బలంతో నరసింహరాజు అతనికి విషమిచ్చి చంపిస్తాడు. పేరిందేవి సతీసహగమనం చేస్తుంది. దానితో మలిదేవుడు, బ్రహ్మన్న కారంపూడిలో నలగామరాజుతో యుద్ధం చేస్తారు. మాంచాల తన భర్త బాలచంద్రుని కూడా యుద్ధానికి పంపుతుంది. యుద్ధంలో అందరూ హతులౌతారు. చివరికి బ్రహ్మనాయుయుడు, నలగామరాజు, కన్నమనాయుడు, నాగమ్మ మాత్రమే మిగులుతారు. క్షుద్ర రాజకీయం మీద విరక్తి చెందిన బ్రహ్మనాయుడు రాజ్యాన్ని విడిచి గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది.
చిత్ర విశిష్టతలు
పల్నాటి వీర చరిత్రకు, మహాభారత కథకు భావస్వారూప్యాన్ని గమనించవచ్చు. భారతంలో సుయోధనుని పాత్ర నలగామరాజుకు అతికినట్లు సరిపోతుంది. నాయకురాలు నాగమ్మ పాత్ర శకునికి, ధర్మరాజు పాత్ర మలిదేవునికి, అభిమన్యుని పాత్ర బాలచంద్రునికి సరిపోయేలావుంటుంది. ఇక కృష్ణుడి పాత్రకు బ్రహ్మనాయుడి పాత్రకు సారూప్యముంది. భారతంలో మాయాజూదంలో పాండవులు రాజ్యాన్ని కోల్పోతే, పల్నాటి చరిత్రలో కపట కోడిపందెంలో ఓడి మలిదేవుడు రాజ్యభ్రష్టుడయ్యాడు. అక్కడ కృష్ణుడు సంధికొస్తే, ఇక్కడ అలరాజు సంధి చేసి విఫలమౌతాడు. పాండవులు పన్నెండేళ్ళు అడవులపాలైతే, మలిదేవుడు ఏడు సంవత్సరాలు అడవిపాలవుతాడు. అలాంటి విశిష్ట కథను అనురూపా ఫిలిమ్స్ బ్యానర్ మీద టి. హనుమంతరావు, యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరి, దగ్గుపాటి సూర్యనారాయణ కలిసి నిర్మించారు. సదాశివబ్రహ్మం, కొడాలి గోపాలరావులు సంభాషణలు రాయగా గుత్తా రామినీడు దర్శకత్వం వహించారు. ఇందులో యన్టీఆర్, భానుమతి పోటీపడి నటించారు. నాయకురాలు నాగమ్మగా భానుమతి తనకుతానే సాటి అని నిరూపించుకుంది. పన్నెండవ శతాబ్దపు కథను దృష్టిలో వుంచుకొని అలనాటి జానుతెలుగు భాషనే ఉపయోగిస్తూ సదాశివబ్రహ్మం సంభాషణలు రాయడం విశేషం. పులుపుల శివయ్య రచించిన ప్రసిద్ధ పల్నాటి గేయాన్ని బి. గోపాలం ఆలపించగా టైటిల్స్‌లో వాడుకున్నారు. ఈ పాట సినిమా ఆరంభానికి ముందే ప్రేక్షకుణ్ణి ఒక రకమైన భావావేశంలోనికి తీసుకొని వెళ్తుంది. చిత్రం చివర కూడా ఇదే పాట లోని చరణాలు వినిపింపజేయడం దర్శకుని ప్రతిభకు అద్దం పడుతుంది. ఈ సినిమాకు ప్రాంతీయ చిత్రాల విభాగంలో ‘జాతీయ స్థాయి ఉత్తమచిత్రం’ బహుమతి లభించింది. అలాగే నాగమ్మగా నటించిన భానుమతికి కూడా రాష్ట్రపతి బహుమతి లభించింది. తొలి విడుదలలో ఈ సినిమా డెబ్భై రోజులే ఆడినా, రిపీట్ రన్ లో విడుదలైన అన్నిచోట్లా విజయవంతగా ఆడి మంచి వసూళ్లు నమోదు చేసింది.
రాజేశ్వరరావు సంగీత సాహిత్య సౌరభం
ఈ చిత్రంలో ఘంటసాలతోబాటు నేపధ్య గాయనీ గాయకులు సుశీల, జానకి, స్వర్ణలత, వసంత, బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం, బి.గోపాలం పాటలు, పద్యాలు పాడడం విశేషం. ఇందులో మల్లాది రామకృష్ణశాస్త్రి ఆరు పాటలు రాయగా గుర్రం జాషువా పన్నెండు పద్యాలు రాయడం కూడా విశేషమే. సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా మల్లాది రామకృష్ణశాస్త్రి, జాషువా వంటి సాహిత్య స్రష్టలు ఈ సినిమాకు పనిచేయడం కూడా విశేషమే. బాలచంద్రుడు పుట్టిన సందర్భంగా స్వర్ణలత, వసంత బృందం ఆలపించే మల్లాది రామకృష్ణశాస్త్రి గీతం “వెలుగొచ్చెనే లేత వెలుగొచ్చెనే కలవారి లోగిలికి కళ వచ్చెనే, పండు తెలిజేజె సిగపూవు దిగివచ్చెనే” పాటను స్వరకల్పన చేస్తున్నప్పుడు “తెలిజేజె” అంటే అర్థం తెలియక దర్శకుడు మల్లాది వారిని అడిగారట. “తెలిజేజె” అంటే శివుడని, “సిగపూవు” అంటే శివుని సిగలో అలంకారమై వుండే నెలవంక అని, వెరసి బాలచంద్రుడు ఉదయించాడని అర్థం చెప్పుకొచ్చారట మల్లాది. ఈపాట చివరిలో “జాను తెనుగూ మ్రోగు వీరగీతాలకూ… నీ పేరే పల్లవి కావాలి” అంటూ బాలచంద్రునికి దీవెనలందించడం మల్లాది ప్రతిభ. అంతటి గొప్ప సాహిత్యం ఈ చిత్రంలో పరిమళించడం నిజమైన విశేషం.
మల్లాది రచించిన మరో గీతం “జయ శంభో శివశంకరా-జగదీశా స్వయంభో ప్రభో” గీతంలో నాగమ్మ శివభక్తి తత్పరత, సామాజిక చింతన, దేశభక్తి ద్యోతకమవుతుంది. ఈ గీతం చివర “మా పలనాడు కాపాడుమా” అంటూ ముగించడం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. భానుమతి హంసధ్వని రాగంలో ఈ పాటను ఆలపించి అభినయించారు. టైటిల్స్‌లో వినపడే బి. గోపాలం పాడిన పులుపుల శివయ్య గీతం “శాతవాహన తెలుగు-చక్రవర్తుల శౌర్యమిదె బ్రాహ్మ్యమిదె”లో పల్నాటి వీరకథను క్లుప్తంగా తెలియజేస్తుంది. ఆరుద్ర విరచిత “తీయని తొలిరేయి ఇది తిరిగిరాని రేయి“ పాటను కాంతారావు, వాసంతిలపై చిత్రీకరించారు. దాశరథి గీతం “ఒక మేఘం వచ్చింది-నా చంద్రుని దాచినది”ను సుశీల, జానకి ఆలపించగా జమున, వాసంతిలపై చిత్రీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తిని ఉద్దీపింపజేయడానికి, దేశక్షేమంకోసం ప్రజలను ఉత్తేజితుల్ని చేయడానికి ఇటువంటి సినిమాలు ఎంతగానో దోహదపడుతాయి. గూడవల్లి రామబ్రహ్మం సినిమాతో పోల్చుకోకుండా చూస్తే ఈ చిత్రం ఒక గొప్ప చారిత్రాత్మక కళాఖండం.
ఆచారం షణ్ముఖాచారి
జననం: 1949
చదువు : B.Sc (Ag), MA, CAIIB, CRB
వృత్తి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయ అధికారిగా, ఆంధ్రా బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా
ఉద్యోగ విరమణ: 2009
ప్రవృత్తి: సీనియర్ సినీ జర్నలిస్టుగా ఈనాడు సంస్థ వారి సితార సినీ వారపత్రిక, చతుర, తెలుగు వెలుగు పత్రికలకు 2022 వరకు స్వచ్ఛంద సేవలు
సాంస్కృతిక రంగం : సాహిత్య సంగీత సమాఖ్య (రి ) కు 2014 నుండి 2020 వరకు – శ్రీ రావి కొండలరావు గారు దివంగతులైన తరువాత ఆ సమాఖ్య కు ప్రస్తుత అధ్యక్షుడిగా
సినీ పుస్తక సంకలన కర్తగా : (1) పల్లవించవా నా గొంతులో మకుటంతో పద్మవిభూషణ్ బాలు గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ
(2) ఆమని పాడవే మకుటంతో పద్మవిభూషణ్ ఇళయరాజా గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ
సంగీత కార్యక్రమాలు: కాకినాడలో వరుసగా ఐదు సంవత్సరాలు ఘంటసాల, శోభన్ బాబు జయంతి, వర్ధంతి సందర్భంగా సంగీత విభావరుల నిర్వహణ.
రవీంద్ర భారతి లో చందమామ పాటల కార్యక్రమ నిర్వహణ
ప్రభుత్వ సత్కారాలు: ఉత్తమ బ్యాంకర్ గా 11 సార్లు ప్రభుత్వ సత్కారం

