[మణి గారి ‘పంచ భౌతికం’ అనే కథని అందిస్తున్నాము.]
ఆతను తలుపు తట్టాడు “టక్! టక్! టక్..”, అంటూ
లోపల నుంచి “ఎవరది” గట్టిగా అన్నాను.
“నేనే!”
“నేనే! అంటే?”
“నేనే!.. అంతా వ్యాపించి వుంటాను.. నీలోనూ!!..”
అతని మాటలు ఏమీ నాకు వినిపించటం లేదు.
“నువ్వు ఎవరివి అయినా, తలుపు తీయడానికి కుదరనంత బిజీగా వున్నాను!” అన్నాను.
ఒకటే ఆటలు, పాటలు. తీరిక లేకుండా వుంది. ఈ హడావిడిలో తలుపు దగ్గరకి కూడా వెళ్ళడం కష్టం..!
“ఊ!..”
వెళ్ళిపోయాడు అతను.
***
అతను మళ్ళీ వచ్చాడు. తలుపు తట్టాడు.
“టక్! టక్! టక్!..”
“ఎవరది?..”
“నేనే!”
“నేనే అంటే.”
“నేనే! ..అంతటా వుంటాను. నీలోనూ..!”
అతని మాటలు నాకు స్పష్టంగా వినిపించటం లేదు. వినిపించుకోవాలనీ, అనుకోలేదు.
“నేను చాలా బిజీగా వున్నాను! చదువులు, హోం వర్క్లు, పరీక్షలు!.. కలలు, కోరికలు,! ఎక్కడ!..తీరిక లేదు!”
“ఊ..!”
అతను వెళ్ళిపోయాడు.
***
అతను! మళ్ళీ తలుపు తట్టాడు,
“టక్!టక్! టక్!..”
“ఎవరది..?”
“నేనే!..”
“నేనే అంటే?..” అడిగానే కానీ అతని మాటలు వినలేదు!
“నేనే!.. అంతటా విస్తరించి వుంటాను. నీలోనూ..!”
“క్షణం కూడా తీరిక లేదు. పిల్లలు, సంసారం, బాధ్యతలు!..”
“ఊ!” అతను వెళ్ళిపోయాడు.
***
అతను! మళ్ళీ వచ్చాడు. తలుపు తట్టాడు.
“టక్! టక్! టక్!..” అంటూ
“ఎవరది..?”
“నేనే!..”
“నేనే, అంటే..?”
“నేనే!.. అంతటా వుంటాను. నీలోనూ!..”
నాకు అతని మాటలు వినపడలేదు. వినిపించుకోలేదు కూడా.
“బిజీగా వున్నాను. ఎక్కడ?! ఖాళీ, అవుతేగా!?. ఒకదాని తర్వాత ఒకటి, ఎప్పుడూ ఏదో ఒక పని! అలిసిపోయినా, పరిగెట్టక తప్పటం లేదు. తలుపు తీసేటంత తీరిక లేదు!..”
“ఊ!”
తల వంచుకొని, వెళ్ళిపోయాడు.
***
అతను కాస్త కూడా విసుగు లేకుండా, వస్తూనే వున్నాడు.
వచ్చినప్పుడు అతను చెప్తాడు “నేను..”, అంటూ ఏమి చెప్పాడో, ఎప్పుడూ వినలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తాడు. కానీ, నాకు ఎప్పుడూ, అతని మాటలు సరిగా వినిపించ లేదు. వినిపించుకోలేదు.
నా చుట్టూ, పనులు, బాధ్యతలు, బంధాలు. వినేటంత, ఓర్పు, ఓపిక లేవు. ఆసక్తీ, కూడా లేదు.
అతను అలా వస్తూనే వున్నాడు! నేను తలుపు తీయకపోయినా, అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతూనే వున్నాడు.
‘ఎవరు అతను?! ఎప్పుడూ తలుపు తడ్తాడు. కాస్త కూడా విసుక్కోడు!. అతనిని చూడాలి ఒక్క సారైనా!.. కానీ, పనులతో అలసి పోయాను. తలుపు తీయడానికి కూడా, శక్తి లేనట్లు అయిపోయింది. బంధాలు, బరువులు, బాధ్యతలు, కలతలు, కన్నీళ్ళు, సుఖాలు., సంతోషాలు.. అన్నిటితోనూ, అలసిపోయాను. శరీరంలో కూడా పటుత్వం తగ్గింది. అయినా సరే తలుపు తీయాలి!!..’ అనుకుంటూ వున్నాను.
***
అతనేలా వుంది. తలుపు శబ్దం అవుతోంది
“టక్! టక్! టక్!..”
నెమ్మదిగా శక్తిని కూడతీసుకొని లేచాను, తలుపు తీయడానికి.!..
ముందుకు నడుస్తున్న, నా కాలికి అడ్డు తగిలి, పడబోయి తమాయించుకున్నాను.
చూద్దునుకదా.. ‘ఎన్ని సామానులు!! అడుగు వేయడానికి కూడా లేకుండా.. ఇన్ని పరుచుకున్నానా?!’ ఆశ్చర్యపోయాను.
“చాలా అడ్డుగా వున్నాయి. ఇవన్నీ పక్కకి పెట్టి, దారి చెసుకొవడానికి, సమయం పట్టేలా వుంది. ఎంత సేపని, వేచి వుంటావు?.. మళ్ళీ వస్తావా పోనీ!? నాకూ నిన్నూ చూడాలని వుంది.” అంటూనే
“ఎప్పుడూ తలుపు తట్టేది నువ్వేగా???” ఆగి, ఆగి అన్నాను. అలసటతో కూడిన, భారం నా గొంతులో!
“ఊ..!..”
“విసుగు లేకుండా వస్తున్నావు!..”
“ఊ.!..”
“ఎందుకు..?..”
“నువ్వు తలుపు తీస్తావని!..”
“సరే!.. మళ్ళీ వస్తావా, పోనీ!..”
“ఊ..”
***
ఈసారి నేను, అన్ని పనులు ముగించుకొని, కొన్ని తెగించుకొని, అతని రాకకి ఎదురు చూడ సాగాను. తలుపు దగ్గరే, కూర్చున్నాను.
అతనేలా వుంది.
“టక్! టక్! టక్!..”
తలుపు తీయబోతున్న, నన్ను, పిలుస్తూ వెనక నించి శబ్దాలు! ఏప్పుడూ ఏదో ఒక పని! ఒకసారి వెనకకి చూసాను.
‘పనులు ఎప్పుడూ వుండెవే. కాస్త కూడా విశ్రాంతి లేకుండా, చేస్తూనే వున్నాను. తలుపు తీసి, ఒకసారి అతను ఎవరో తెలుసు కుంటే కాని, నాకు స్థిమితం వుండదు. కుతూహలాన్ని ఆపుకోలేక పోతున్నాను!..’ అనుకుంటూ తలుపు తీసాను.
ఎదురుగా కాంతిపుంజం! కాంతులు వెదజల్లుతూ! నిర్ఘాంత పోయాను.
“ఇంత సేపూ తలుపు తట్టింది ఎవరు?..”
“నేనే!..” మాటలు వినిపించాయి
గొంతు గుర్తుపట్టాను. అతనే!
అయినా అడిగాను.
“నువ్వేనా?..”
“నేనే!..”
“కనిపించటం లేదు!??..”
“ఎదురుగా వున్నాను!..”
“ఏది? నాకు ఎదురుగా కాంతిపుంజం, మాత్రమే వుంది..??”
“నేనే!..”
“నీకు రూపం లేదా..?”
“నేను అంతటా వుంటాను. నీలోనూ వున్నాను!!!.. ఇదివరకే చెప్పానుగా! ఎప్పుడూ చెప్తూనే వున్నాను!..”
“నాకు వినపడలేదు!..” వినిపించుకోలేదు అని తెలిస్తే కోపం వస్తుందా, అనుకుంటూ, ఆలోచిస్తూ, అన్నా.
“చాలా సార్లు చెప్పాను!..”
“నాతో ఏమి పని..?”
అతను మాట్లాడలేదు.
“ఈ కాంతిని ఇప్పుడే చూస్తున్నాను. ఇది వరకూ ఎప్పుడూ చూడలేదు!!”
“తలుపు తెరిస్తే, చూసేదానివి..!”
నా తప్పులాగ, అతను మాట్లాడడం నచ్చలేదు నాకు..
“పనుల ఒత్తిడిలో, కుదరలేదు.” నన్ను నేను వెనకేసుకు వస్తూ, అన్నాను
“కానీ నాతో నేకేమిటి పని..?” వెదజల్లుతున్న కాంతులని విస్మయంగా చూస్తూ అన్నాను మళ్ళీ.
“చెప్పానుగా, నీలో వుంటాను అని. నువ్వు గుర్తించలేదు. తలుపు తీస్తే గుర్తించేదానివి”
ఏమిటీ వెలుగు? ఇంతకాలం వెలుగు చూడని నాకు, ఎదురుగా వున్న వెలుగుల కాంతులకి, సద్దుకుపోవడానికి సమయం పట్టింది. కళ్ళు చిట్లించి చూస్తున్నాను. ఒకసారి వెనకకి చూసాను.
వెనకకి చూస్తూ, ఒక అడుగు వెనకకి, వేసాను.
‘ఏమిటి? ఇంత చీకట్ల లోనా, నేను ఇంతకాలం వున్నది?!. ఎన్ని సామానులు వ్యర్థంగా అంతా పరిచి వున్నాయి! మోపులా ఒక దాని మీద ఒకటి. అంతా అవే! చీకటిని ఎక్కువ చేస్తూ!..’
బయట వెలుగులు చూసాక, లోపల చీకటి, మరీ భయపెడుతూ వుంది.
చల్లగా గాలి, శరీరమంతా పీల్చుకుంటోంది. అందుకే ఒక్క సారి ఒళ్ళంతా విచ్చుకున్నట్లు అయింది.
శరీరంలో ప్రతీ అణువు, గాలి పీల్చుకుంటున్నట్లు అనిపించిది. శరిరం తేలిక అయి, తేలిపోతున్నట్లు అనిపించింది. తెలియని ఆనందం!.
లోపల గాలి ఆడక ఇబ్బంది పడ్డ నాకు, ఒక్కసారి చెరసాల నుంచి బయటపడ్డట్లు అనిపించింది.
నాకు ఆ అనుభూతి బాగుంది కాని,.. అతని మాటలు అర్థం కావటం లేదు.
కానీ, వెలుగులు మాత్రం విస్మయ పరుస్తూనే వున్నాయి.
వెలుగులతో పాటు చల్లని గాలులు!.. పైన మేఘాలు లేకుండా ఆకాశం, ప్రశాంతంగా వుంది. తలుపు తీసి బయటకి అడుగు పెట్టిన నా కాళ్ళని, మెత్తగా పలకరిస్తూ మట్టి.
ఆ అనుభూతి, కొత్తగా వుంది.
“నువ్వు, ఈ కాంతి!.. నాలోనా?” ఆశ్చర్యంగా ఆలొచన లోంచి బయటకి వచ్చి అన్నాను..
“నేనే, కాదు ఈ గాలి, ఈ నేల, ఈ ఆకాశం, దూరంగా.. చూస్తున్నావా???.. ప్రవహిస్తున్న నది!!!.. అదీను.. అన్నీ, ఈ పంచభూతాలు, నీలో నూ వున్నాయి. తలుపు తీసేక, నువ్వు, ఇప్పుడు చూస్తున్నది, అంతా హద్దులు లేని అనంతం!.., ఆనందం!..సత్యము. నిత్యము.!.. బయటకి వస్తే, అర్ధమవుతుంది.”.. వుండి, వుండి, నెమ్మదిగా అన్నాడు.
మళ్ళీ అన్నాడు, చాలా కరుణతో, “నీ చుట్టూ, తలుపులు!..గోడలు!..అందుకే గుర్తించ లేదు..”
“అవును! చీకటి తప్ప, ఏమి చూడలేనంతగా ఎన్ని గోడలు??! నేను కూడా కదలలేనన్ని, గోడలు. అన్నీ గోడలే”..
తలుపు తీసి బయట నిలబడ్డ నేను, మళ్ళీ, వెనుకకి చూసాను, ఇంటి వైపు.. ఇంట్లో, చీకట్లు!..
గోడల మధ్య, సామానుల మధ్య, ఇరుకుగా, గాలి కూడా లేకుండా,.. చీకట్లు!!
తెరిచిన తలుపుల్లోంచి, సన్నటి వెలుగులు, ఇరుకుల లోంచే, చోటు చేసుకుంటూ, ఇంటి లోపలకి ప్రసరిస్తున్నాయి. వెనకకి, వెళ్ళాలంటే, భయం వేసింది. బయటకి చూసాను. భూమి, ఆకాశం కలపడానికి అన్నట్లు, పరిగెడుతున్న మైదానం!!.. చెట్లు.. మొక్కలు.. పూలు.. రకరకాల పూలు!.. ఎక్కడ చూసినా వెలుగులు సందడి!.. దూరంగా పిలుస్తూ, కనిపిస్తున్న, నది!.. ఎక్కడా హద్దులూ లేవు! అడ్డులూ లేవు!
అంత కాలం, నన్ను ఆవహించిన, అలసట మాయమైంది. కొత్త శక్తి, ఏదో నాలో ప్రవేశించినట్లు అనిపించింది. ఏదో తెలియని సంతోషం.
“ఏమిటీ ఈ సంతోషం? ఇంతగా గాలి పీల్చిందీ లేదు, ఎప్పుడూ!! ఎన్నో పనులు, బాధ్యతలు, తిరిక ఎక్కడది?!.. ఊపిరి పీల్చుకోలేనంత ఒత్తిడులు..!.”.. నాకు, తెలియకుండానే నా నోట్లోంచి వచ్చాయి మాటలు..
“ఊ!..”
“కడుపు నిండా గాలి పీల్చుకుంటున్నాను. అంతులేని ఆనందం!.. ఎంత ప్రశాంతత!.. కొత్త శక్తి, అలుపు రానివ్వటంలేదు!..”
“నెమ్మదిగా అర్ధమవుతోంది నాకు. ఈ గాలి, వెలుగులు, నీరు, ఆకాశం, భూమి, వీటన్నిటికీ, వాటి అందాలకి, ఈ సంతోషాలకి,.. చుట్టూ గోడలు కట్టుకొని, నాకు నేనే దూరమయ్యాను..”
”ఊ!..”. అతను ఊ కొడుతున్నాడు, నా మాటలకి.
“కానీ ఇల్లు, నాకు రక్షణ అనుకున్నాను. ఇంటికి, గోడలు అవసరం కదా.! నా ఆశలు, ఆశయాలు, కలలు,కన్నీళ్ళూ, బాంధవ్యాలు, బాధ్యతలు.. అన్నీ ఇంటిలోనేగా పదిలంగా దాచింది. కాస్త కూడా తీరిక లేకుండా, వాటి కోసమేగా కష్టపడింది, కష్టపడుతున్నది. అవసరానికి కొన్ని, ఆనందానికంటూ కొన్ని, రక్షణకంటూ కొన్ని, రేపటి కోసం కొన్ని, ఇంకో రేపటి కోసం కొన్ని, ఏన్ని చేరవేసాను!? వాటిని వదిలివేయలేను గదా..”
అతను మౌనంగా వుండి పోయాడు.
నువ్వు, వెలుగులకి దూరం అయ్యావు, ఊపిరి కూడా పీల్చు కోలేక పోయావు. సూర్యుడు, గాలీ, నీరు, ఆకాశం, భూమి, వీటన్నిటినికీ,.. నీలోని వాటిని గుర్తిస్తే, కలిగే ఆనందాలకి, అనుభూతులకీ, నీకు నువ్వే, అడ్డు పెట్టుకున్నావు. ఎంత కోల్పోయావు?.. అనిపించటం లేదా?.. ఎన్ని ప్రశ్నలు..!.. ఎన్ని సమాధానాలు..! అంతర్మథనం?!..ఆలోచిస్తున్నాను.
నేను ఇంతకాలం రక్షిస్తున్న వాటిని, వెనక్కి తిరిగి చూస్తున్నాను!..
కనిపిస్తున్న చీకట్లు, చీకట్లలలో దారి చేసుకుంటూ, లోపలకి, చొచ్చుకు పోతున్న వెలుగులు!!
ఆనందం కోసమో, రక్షణ కోసమో, విలువయినవి అనో, వ్యర్థంగా పరుచుకున్నవి, పదిల పరుచుకున్నవి!.. అన్నీ ఆ వెలుగుల్లో, వెలవెలపోతున్నాయి.
వెనక, చూస్తున్న కొలదీ, అన్నీ, నన్ను వెక్కిరిస్తున్నట్లే వుంది. ఒక్కసారి, ఎంతో అవమానంగా అనిపించింది.
ఇతను, ఎవ్వరు అయినా సరే, నన్ను అవమానించే హక్కు లేదు. ఒక్కసారి వెల్లుబికి వచ్చింది కోపం.
అంతా వింటున్నాడా అతను? ఎక్కడ?! కనిపించడే?..
తలుపులు వేసి, నా ప్రపంచం లోకి నేను వెళ్ళి పోదామని అనిపించింది. ఇంతలో చల్లగాలి, మేఘాలని చెదరగొట్టినట్లు నా కోపాన్ని చెదర గొట్టింది.
‘అతనేం చేసాడు?..ఎప్పుడు తలుపు తడుతూనే వున్నాడు. నాకు చెపుదామని! అతని ఉనికిని, తెలియపరుద్దామని! నేనే కదా, అతన్ని అజ్ఞానంతో వెళ్ళ గొట్టింది. అతను మాట్లాడేది కూడా ఎప్పుడూ వినలేదు.’ అనుకుంటూ, నెమ్మదిగా శాంతించాను.
‘ఇప్పుడయినా, మించిపోయింది లేదు ఈ తలుపులు, గోడలు అన్నీ పగలగొట్టేస్తాను’, అనుకుంటూ మళ్ళీ వెనకకి చూసాను, నేను.
తెరిచిన తలుపుల లోంచి వెలుగులు, అంతా వ్యాపిస్తూ, చీకట్లని తరిమి కొడుతూన్నాయి. నన్ను ఇన్నాళ్ళు కదలనివ్వని, కలవరపెట్టిన పనులు, వెలుగుల్లో, పక్షులలా ఎగిరి పోయాయి.
అర్థమవుతోంది నాకు.. నెమ్మదిగా బలాన్ని ఉపయోగించి, గోడలని పగల గొట్టాను ‘వీటి అవసరం నాకు లేదు, హద్దులు లేని ప్రపంచం చూసాక!..’ అనుకుంటూ.
గోడలు తలుపులు లేకపోతే, ఏ అడ్డూ లేకపోయే సరికి, ఎంత విశాలంగా వుంది!. ఎంత వెలుగులు నింపుకుంది!
ఆ గాలిలో, వెలుగులో, నేల మీద నేను, ఆకాశం లోకి చూస్తూ నిల్చున్నాను, చీకటిని జయించిన ఉదయంలా, నిలకడగా,
దృఢంగా, నిబ్బరంగా, స్థిరంగా నిల్చున్నాను!.. నేల లోకి నా పాదాలని గట్టిగా ఆనించి. ఆ అనంతం లోకి చూస్తున్నాను..
అతను ఎక్కడ?..
అతను, మాయమయ్యాడా?!.. వ్యాపిస్తున్న, ఈ వెలుగులలో కలసి పోయే వుంటాడు. ‘మాటలతో, పని ఏముంది ఇంక!, అనుకున్నాడేమొ?!..’.
అవును కదా! మాటలతో పని ఏముంది. అంతా, బాగా అవగతం అవుతుంటే.
నా బయటా, నా లోపలా విస్తరిస్తున్న వెలుగులతో, నేను వెలుగు కిరణంలా, ప్రకాశిస్తున్నాను.
అడ్డులు లేకపోయేసరికి, నా వద్దకి పలకరిస్తూ, చేరింది నది, “నేనూ నీ లో వున్నాను” అంటూ.
ఇప్పుడు, నన్ను పిలిచే ప్రమేయం లేకుండా, నేల, గాలి, నీరు, ఆకాశం,.. వెలుగు కిరణాలు.. అన్నీ నాలోకి ప్రవహిస్తూన్నాయి.
నన్ను పిలిచే అవసరం ఏముంది?!.. ఏం అడ్డులు వున్నాయి?! ఏం హద్దులు వున్నాయి??!!
నాలో ప్రవహిస్తున్న వాటిని, గుర్తు పట్టడం, ఇప్పుడు నాకు కష్టం అవటం లేదు. నాలోనూ, బయటా, అవి, ప్రవహిస్తూంటే వాటిని చూస్తున్నాను, అలౌకికమయిన, అనుభూతికి, లోనవుతూ.
నన్ను నేను, కొత్తగా అవిష్కరించుకుంటూ, పంచ భౌతికమై, అనంతం లోకి అడుగు పెట్టాను.
అనంతమై, మైమరిచాను!.