Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పంచభూత తత్త్వ ప్రదీప్తి – ‘పంచవటి’

[ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారి పద్యకృతి ‘పంచవటి’ పై సమీక్ష అందిస్తున్నారు శ్రీ విహారి.]

చార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారు ‘సారస్వత భాస్కర’ బిరుదాంకితులు. భాస్కరుడు, భాస్కరాచార్యులు వలెనే ఈ మహాదయులూ గణిత, ఖగోళశాస్త్ర, వైజానికాంశాల్లో, ఆధునిక సాంకేతిక వాఙ్మయ అధ్యయన, పరిశీలన, పరిశోధన, బోధనల్లోనూ ప్రయోగశీలిగా విశ్వవినుతిని గడించినవారే. అదనంగా సాహిత్యంలో – ప్రత్యేకించి పద్యప్రక్రియలో – వీరు కవితావార్థికి గడలు వెట్టినవారు. విద్వత్కవిశేఖరులు, ప్రౌఢచోవిభవాఢ్యులు. అజో – విభో- కందాళం ఫౌండేషన్‌ కార్యశీలిగా – సాహిత్య వికాససేవకు దీక్షాకంకణులైనవారు. ప్రతి సంవత్సరం- నాటకాభ్యుదయానికి, ఉద్గ్రంథ ప్రచురణకు, సాహిత్య ప్రతిభామూర్తుల పురస్కారాలకు అనితరసాధ్యమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న మానవీయులు, తెలుగు సంస్కృతి పరిపోషకులు.

విద్వత్కవిగా ఆచార్యులవారు పంచభూతతత్త్వం ఆధారంగా – సాంప్రదాయిక, ఆధునిక వైజ్ఞానికాంశాల మేళవింపుతో – ఐదు తారావళుల్ని విరచించి ప్రచురించారు. అవి – ‘1.పావకవృత్త తారావళి, 2. సుజల వృత్త తారావళి 3. వసుంధరా వృత్త తారావళి. 4. అంతరిక్ష వృత్త తారావళి, 5. సమీర వృత్త తారావళి. ఈ ఐదు తారావళుల ఏకసంపుటిగా వచ్చింది ‘పంచవటి’.

తారావళి తెలుగు సాహిత్యంలో అంతగా ప్రాచుర్యంలో లేని పద్యప్రక్రియ. దీనిలో 27 పద్యాలూ 27 నక్షత్రాలు! చివర ఒక అంకితపద్యం వుంటుంది.

పావకవృత్త తారావళి:

అగ్ని స్వరూపస్వభావాల ఆవిష్కరణ. ‘అగ్నిమీళేపురోహితమ్‌’ అన్న ‘ఋగ్వేద ప్రథమోక్త సూక్త మహితు’ని ఆరాధన. అగ్ని అంతరంగ తత్త్వం, దాని చిత్రణ. ఇది జగత్‌ చైతన్యానికి ఆధారభూతమైన ప్రాధాన్యం ప్రశంస- ప్రతిపద్యంలో రసోదంచితంగా జాలువారింది. మొదటి పద్యం ఇలా వచ్చింది.

‘ఋగ్వేద ప్రథమోక్త సూక్తమహితున్‌ పృథ్వీ జగద్బాంధవున్‌
దిగ్వాసోనిటలస్థ వైభవు హృదాదిత్య ప్రభారాశి వి
శ్వగ్వాయూజ్జ్వల మూర్తిత స్సకల జీవక్షేత్ర చిచ్ఛక్తి ఋ
త్విగ్వర్యార్చితు సన్నుతింతు నెడదన్‌ త్రేతాగ్ని రూపాన్వితున్‌.’

త్రేతాగ్ని స్వరూపుడంటే – ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నుల తేజం. అలాగే, అగ్నిసంబంధీకుడు సూర్యుని సర్వాంతర్యామి తత్వాన్ని కూడా ఈ ‘త్రేతాగ్ని’ తత్వానికి అనుసంధానిస్తూ సూర్యుని ఉదయ, మధ్యాహ్న, అస్తమయ స్థితుల్నీ ప్రస్తావించారు – ఈ తారావళికి తమ ‘మిత్రవ్యాఖ్య’ గ్రంథాన్ని వ్రాసిన డా॥నాగరాజ్యలక్ష్మిగారు. ఆచార్యులవారి కవిత్వమంతా ప్రౌఢసమాసభరితమైన, కవితామయమైన అగ్నితేజస్సంతా చదువరిని అంతర్ముఖీనుని చేసేస్తుంది. కవిత్వం స్ఫూర్తిమంతం కావాలంటే, కవి గుండెలోనూ ఆ ‘కీల’ మండుతూ వుండాల్సిందే. అప్పుడే కావ్య శిల్పనిర్మాణ కౌశలం పదవాక్య గాంభీర్యంలో వెలుగుల్ని కురిపిస్తుంది. ఆచార్యులవారి చిత్త ‘శుచి’ వలన కావ్యంలో వారి శాస్త్రదృష్టీ, లోకదృష్టీ కూడా స్పష్టంగా వెల్లడైనాయి.

‘కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినం
గలడంచున్‌ భగవంతు నున్కి బహుళాఖ్యానానుసంధాతమై
వెలుగొందున్‌, మఱి నీవు లేని స్థలమీ విశ్వాన నెందైన సం
కలితంబౌనొక చిత్తగించగ మహాకాలాగ్ని భట్టారకా!’

పద్యం ఎత్తుగడలోనే పోతన మహాశయుడు సత్యనారాయణుడయి సాక్షాత్కరిస్తాడు. సంబోధనలో ‘మహాకాలాగ్ని భట్టారకా’ అన్నారు అగ్నిని. ఇది ‘కాలనిర్ణేత సూర్యభగవానుని ప్రేరకుడు అగ్ని అని నిరూపించిన అర్ధవంతమైన సంబోధన’ అని ఈ గ్రంథానికి వ్యాఖ్యాన గ్రంథం రాసిన ఆచార్య నాగరాజ్యలక్ష్మిగారు ప్రశంసించారు.

అసలీ పావకవృత్త తారావళిలోని అన్ని పద్యాల్లో – ఆచార్యులవారు ప్రయోగించిన అగ్ని సంబోధనలు – ఒక్కొక్కటీ ఒక్కొక్క వ్యాఖ్యాన వ్యాసానికి సరిపడేలా భాసిస్తున్నాయి. అవి ఏవి అంటే – 1. త్రేతాగ్ని.. 2. జీవాగ్ని.. 3. దివ్యాగ్ని.. 4. జ్ఞానాగ్ని 5. ప్రాణాగ్ని.. 6. హృద్యాగ్ని.. 7. సిద్ధాగ్ని..8. విస్తారాగ్ని.. 9. దాక్షిణ్యాగ్ని.. 10. హోమాగ్ని.. 11. దివ్యాగ్ని.. 12. మహాకాలాగ్ని.. 13. వైశ్వానరాగ్ని 14. బృహద్దీపాగ్ని.. 15. బృహద్భానుడు 16. ఏకాగ్ని.. 17. స్ఫీతార్చిష్మంతుడు 18. మహితాదర్శ స్వరూపోజ్జ్వలుడు.. ఇలా, అగ్ని విరాట్‌ రూపాన్ని స్తుతించారు.

ఉత్తమ కవిత్వానికి ప్రాణం – వస్తువుని భావబంధురంగా, శిల్పభరితంగా ఆవిష్కరించటం. ఇందుకు కవిత్వ సామగ్రి కావాలి. ఆ పరికరాల్ని ఉపయోగించుకోగల నైపుణి కూడా కావాలి. ఆపై అసలు సిసలైన కావ్యకళామూర్తిని రూపొందించవలెననే సంవేదనాత్మక అంతఃకరణ కావాలి. ఇన్నింటి వెలుపలి ఆకృతిగా రూపొందుతుంది కావ్యం! ఇన్నింటినీ ‘అంతర్యాగం’తో సాధించుకున్న ఉపాసకులు ఆచార్య సత్యనారాయణగారు. వారి ఆశయం దొడ్డది. వారి కావ్య ప్రయోజన లక్ష్యం – పద్యాన్ని నిఖార్సయిన రీతిలో రసస్ఫోరకం కావిస్తూ ఈనాటి సహృదయ సామాజికులకు కూడా ఆర్ష విజ్ఞాన, ఆధునికశాస్త్ర, సాంకేతిక జ్ఞాన వితరణ జరపాలని! ఇదంతా ఆచార్యులవారి ‘నిగృహీతి’ లక్షణం. ‘నిగృహీతి’ పదిమందికి తన నూత్న ప్రయోగాన్ని విదితం చేయాలనే వాంఛితం. ఈ తారావళిలోని ప్రతిపద్యమూ – దేనికది ఒక రసకలశం వంటిదే. సమీక్షావ్యాసం కనుక స్థాలీపులాకన్యాయంగా ఉదాహరణలకే నా రచన పరిమితం.

సుజల వృత్త తారావళి:

జలం అంటేనే జీవనం. మానవ జీవనానికి ఆధారాలైన పంచభూతాల్లో విశేష ప్రాధాన్యం కలిగినది జలం. అందునా – ఆచార్యులవారి తారావళి మకుటం – ‘సు’ జలవృత్తం! కనుక, ఆ తత్త్వవిచారమంతా వారి సహజ పాండిత్యోద్భవమైన ప్రౌఢశైలిలో సాక్షాత్కరించింది.

‘తిరుగేలేని విశేష సంస్కృతు లహో! తీరంబులన్‌ పుట్టి వి
స్తరిలున్‌ నేటి కనేక నాగరిక సప్తద్వీప దేశంబులన్‌
వర కూలంకష లెందుకాలిడిన నా ప్రాంతం బగున్‌ పావనం
బరయన్‌ మానవజాతి వృద్ధికి ప్రవాహశ్రేణులే సాక్ష్యముల్‌’

ఇది 13వ పద్యం. జలతీరాల్లోనే మానవ సంస్కృతి, నాగరికతలు విలసిల్లాయనేది చారిత్రక, భౌతిక వాస్తవం. ఈ పద్యంలో ఆ అభ్యుదయానికి హేతువైన ప్రవాహ శ్రేణుల్ని ప్రస్తుతించారు కవి. 12వ పద్యంలో కూడా ఈ సుజల విశిష్టతల్నే-

‘జలసంశోభిత తీరభూముల మహాసామ్రాజ్యముల్‌ లెస్సగా
విలసిల్లెన్‌, తెగటారె, వర్తక బృహద్విద్యా వివృద్ధుల్‌ ప్రవ
ర్తిలె పుణ్యాలయ సిద్ధ సంస్కృతులు నుద్దీపించె మాకెల్ల నీ
యలఘుశ్రీ జలవాహినుల్‌ వసుధ దివ్యారామముల్‌ నిర్ఘరీ!’

అంటూ కొనియాడారు. పద్యం చదవగానే- నైలునదీ నాగరికత, సింధునదీ నాగరికతలు పఠిత మేధను పునర్వీక్షణలో పడేస్తాయి. కవిత్వంలో భావన ప్రాధాన్యం దృష్ట్యా వెంటనే – ‘కారే రాజులు, రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతింబొందరే..’ అన్న పోతన మహాశయుని పద్యస్ఫురణ రసహృదయుని నాలుకకు ‘రుచి’ నందిస్తుంది.

సుజల ప్రాభవాన్ని మౌలిక తత్త్వ విచారంతోనూ, శాస్త్ర విజ్ఞాన పురోగతితోనూ అనుసంధానిస్తూ – కవి అనేక ‘జీవన’ సౌభాగ్యాల్ని ప్రస్తావిస్తూ ఈ కావ్యోన్నతిని అద్రిసదృశం చేశారు.

వసుంధరావృత్త తారావళి:

ఈ కావ్య ప్రారంభ పద్యంలోనే భూమి ప్రాధాన్యానికీ, ఘనతకూ కైమోడుస్తూ, కవి – ‘సర్వోత్కృష్ట జని ప్రపూరితము..’ అన్నారు. అంటే సర్వశ్రేష్టమైన పుట్టుకలచే నిండివున్నది – అని. ఈ పుట్టుకల్లో మానవులూ, జంతువులూ, పక్షులూ, క్రిమికీటకాదులే కాక, చెట్టుపుట్టలూ, కొండలూ బండలూ, నదీనదాలూ అన్నీ ఉన్నాయి. అంతేగాక, భూమిలోపల ఖనిజాలూ ఖనులూ.. ఇలా ఎన్నెన్నో.. అందుకనే, ‘బహుధా సంపూర్ణతా ధామమున్‌’ అనేశారు కవి. ఆ విశేష పుట్టుకల వివరాలన్నీ వరుసగా ఒక్కొక్క పద్యంలో వర్ణింపబడినాయి.

కవిత్వంలో ‘అపూర్వత’దీ ఒక భూమికే. అలాగే, లౌకికా లౌకిక సౌందర్య రసస్ఫోరకంగా పద్యాన్ని రంగరించటమూ ఉత్తమ కవి ఆశయమే కనుక, ఈ కావ్యమంతా ఈ ఈ సొబగుల్ని సంతరించుకున్నది.

ఉత్తమ కవి తన సామాజిక బాధ్యతను విస్మరించడు. ఆచార్యులవారిఈ బాధ్యత స్వీకృతి, శుభ్రవాంఛితం – ఎంత స్ఫాటికస్వచ్ఛంగా వెలికి వచ్చాయో ఈ క్రింది పద్యం కొట్టవచ్చినట్టు చూపుతోంది.

‘మనుజుల్‌ మూర్ఖులు భూగ్రహంబు తమ సామ్రాజ్యంబుగా నెంచుచున్‌
వనరుల్‌ సర్వము స్వార్థలబ్ధికయి విధ్వంసంబు గావించి జీ
వ నిరాధారగ భూమి కెగ్గొసగు నవ్వారిన్‌ నిరోధింప దు
ర్జన శిక్షాస్మృతి నేర్పరించవలె సర్వప్రాణి సంరక్షకై’

ఈనాటి మానవులకు అత్యుత్తమమైన, అత్యంతావశ్యకమైన భూమి క్షేమం గురించి ఇంతా -అంతా – చెప్పి అంకితపద్యంలో ‘‘వివిధ భాషల నెందరో విస్తరించి/చెప్పిరీ వసుంధర ఠేవ నొప్పుమీర/నేనెరింగిన నా తల్లినేల ఘనత/పొందుపరచితి కొంత ఈ పొత్తమందు’’ అని కవి తమ వినయస్వాంతాన్ని మన ముందుంచారు. ఆచార్య అప్పాజోస్యులవారు నిజానికి కవిత్వ, పాండిత్య పారదృశ్యులు. అయినా, పద్యరచనా విధానంలో కనిపించే ‘ఘనాఘన’ ప్రౌఢి వేరు, వ్యక్తిత్వ దీధితిలోని నిరాడంబరత వేరు. అదే వారి అంతఃకరణ శుద్ధి ప్రత్యేకత.

అంతరిక్షవృత్త తారావళి:

ఇది ధ్రువాంతరిక్షం సరసన కావ్యధ్రువం. అంతరిక్షం అనంతం కదా. ఆ అనంతతత్త్వాన్ని ప్రతిపద్యంలోనూ ఆలోచనీయంగా, రమణీయ కవిత్వశైలిలో విశదీకరించారు కవి.

‘శ్రీకాశప్రద సర్వతోముఖ హవక్రీడాభిరామంబు, న
స్తోక శ్రీకర సూర్యమండలుల కాద్యోపాంత ధామంబునున్‌
ప్రాకామ్యాద్భుత మంతరిక్షము, బృహత్‌ బ్రహ్మాండ సంయుక్తమున్‌
శ్లోకింతున్‌ విమలాత్మమున్‌ రుచిర వాచోయుక్తి సంసిద్ధికిన్‌’

అంతరిక్షాన్ని నుతిస్తున్నారు కవి. కావ్యారంభమే ఒక ఉదాత్త రమణీయమైన భావ సౌందర్యంతో, నూత్న విశేషణ వైభవంతో అలరారుతోంది. అంతరిక్షం ‘శ్రీకాశప్రదం’, ‘సర్వతోముఖ హవక్రీడాభిరామం’ ‘బృహత్‌ బ్రహ్మాండ సంయుక్తం’ ‘విమలాత్మకం’. అంతేకాదు. మరొక శిఖరాయమానంగా ‘ప్రాకామ్యాద్భుతం’గా కూడా ఉన్నది. అలాంటి అంతరిక్షాన్ని ‘రుచిరవాచోయుక్తి సంసిద్ధి’కి ప్రార్థించారు.

కావ్యమంతా వస్తుక్రమోన్మీలన శిల్పంతో అలరారుతోంది. అప్పాజోస్యులవారు పద్యవిద్యావిరించి కనుక, వారి కవిత్వ స్పర్శ ప్రతి అక్షరాన్నీ వర్ణశోభితం చేసింది. అంతేగాక – ప్రతి పద్యంలోనూ వైజ్ఞానికాంశాలూ, ఆధునిక సాంకేతిక విశేషాలూ – గంభీరంగా, నిబిడంగా ప్రయుక్తమై, కవిజ్ఞాన శేవధి పట్ల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

ఈ తారావళిలో ప్రత్యేకంగా చదువరుల దృష్టిని ఆకర్షించి, ఉత్సుకతని రేకెత్తించే రెండు ప్రధాన వైజ్ఞానికాంశాలు గల పద్యాలు ఉన్నాయి. (అవి 18,20). అటు పురాణాల్లో ప్రాచుర్యమైన సూర్యచంద్ర గ్రహణస్థితినీ, ఇటు ఖగోళవిజ్ఞాన ప్రామాణిక సూత్రాలననుసరించి అవి ఏర్పడే తీరుని గురించీ వివరించాయి ఈ పద్యాలు.

అంతరిక్ష వృత్త తారావళిలో అతివిస్తరమూ, అనూనావృతము, అగణ్యమూ అయిన గగనం నైరూప్య చిత్రణనూ, మనకు అక్షిగోచరమవుతున్న సకల భౌతిక విశేషాల్నీ – కవితామయంగా ఆవిష్కరించారు కవి. భానుగ్రహకూటమి, నక్షత్ర సంబంధబాంధవ్యాలు, చలన గమన పయన రీతులూ .. వంటి ఎన్నో వైజ్ఞానికాంశాల్ని అర్థస్ఫూర్తి సాంద్రతతో చెప్పారు కవి.

అంతరిక్ష తారావళి సోపజ్ఞమైన స్వతంత్రకృతిగా సాహితీలోకంలో ప్రతిష్ఠాత్మక కావ్యంగా గుర్తింపబడుతుంది, కీర్తింపబడుతుంది. సర్వోత్కృష్ట కావ్యగుణౌన్నత్యమే దీనికి కారణం.

సమీరవృత్త తారావళి :

‘భౌమప్రాణి కగత్యమై విపుల సంవ్యాప్త స్వరాణ్మూర్తి యై
భూమీవృత్త తనుత్రమై రవికరోద్భూతోష్ణ సంరోధనున్‌
శ్యామశ్రీ నవ మేఘ వృష్టులకు నాద్యంత ప్రభున్‌ సిద్ధ వా
గ్భూమ ప్రౌఢకి ప్రస్తుతింతు హృది సౌగుణ్యున్‌ జగత్ప్రాణునిన్‌’

మొదటి పద్యం ఎత్తుగడలోనే భూమిపై నివసించే ప్రాణికి అత్యంతా గత్యమై, సర్వత్రావ్యాప్తమై, వర్షాలకు మొదలూ తుదీ అయిన వాయువు ప్రాధాన్యాన్ని ప్రౌఢంగా వర్ణించారు కవి. ఆ తర్వాతి పద్యాల్లో వరుసగా – సమీరగుణతతినీ, జగత్ప్రాణుని తత్త్వాన్నీ క్రమవికాస విధానంలో దృశ్యీకరించారు. వీటిలో వాయుపీడనం, వాతావరణ ప్రభావంలో సమీరుని ప్రాధాన్యం అగ్నిమైత్రి వంటి అనేక సాంకేతికాంశాలు వచ్చాయి. చివరికి ‘వసుధ సౌభాగ్య ప్రదాతృడు’గా ‘జీవశ్రీకరుడు’గా విశ్వచేతనకు అసలైన ‘ధీరోదాత్త సత్త్వ’ స్వరూపుడుగా వాయువుని కవితామయుని చేశారు ఆచార్యులవారు.

~~

పంచభూత స్వరూప, స్వభావ, ప్రాధాన్య విశేషాల్ని సాంకేతిక, శాస్త్ర విశేషాల అనుసంధానంతో ఉన్నతీకరించిన – ఆచార్యులవారి – ఐదు తారావళులూ – దేని కది ఒక ఉదాత్త రసవత్కావ్యం. వాటి ఏకసంపుటిగా ‘పంచవటి’ ఆచార్యులవారి కవిత్వ ప్రౌఢమికూ, వస్తుశిల్ప వైశిష్ట్యానికీ ఎత్తిన వైజయంతిక! పద్యప్రియులకు అవశ్యపఠనీయం!!

***

పంచవటి (పంచభూతాల తారావళులు)
రచన: ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
పేజీలు: 291
వెల: ₹ 400.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
~
అజో-విభొ-కందాళం ఫౌండేషన్
3-3-24/1ఎ, మొదటి అంతస్తు
ఎక్‌బొటె హౌస్, వైశ్య హాస్టల్ ఎదురుగా,
కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ – 500027
ఫోన్ : 040-40179673
~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/anchavatipanchabhutha-tharavalulu?

Exit mobile version