[మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘పరమ పావన మూర్తి.. శరణు శరణు శివయ్య!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
‘ఓం నమఃశ్శివాయ’
పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తే
పరవశంతో అనుగ్రహించే పావనమూర్తి
నీ లీలలు అనంతానంతాలు!
అసురుడైన రావణుడి హృదయాన్ని ఆకట్టుకుని
శివతాండవ స్తోత్రం పఠించ గలిగే శక్తిని ప్రసాదించిన బోళామూర్తివి!
మార్కండేయుడు భక్తితో వేడితే
మృత్యువుని సైతం తప్పించిన మహిమాన్వితుడవి!
పగలు రాత్రి వేటాడి జంతువేది చిక్కక అలసి
నీ సమక్షంలో నిలిచిన కన్నప్ప సహనాన్ని పరీక్షించి
ఆఖరికి కన్నులని సైతం అర్పించబోతున్న కన్నప్పని
సంరక్షించి ముక్తిని,మోక్షాన్ని సిద్దిపజేసిన
పరమేశ్వరుడవి.. దేవాదిదేవుడవి!
‘శివానందలహరి’ని ఆదిశంకరాచార్యులకి ఉపదేశించి
ఆధ్యాత్మిక వాతావరణం విశ్వమంతా
విరాజిల్లేలా చేసిన భక్తసులభుడవి!
శివలింగంపై రాగి చెంబుతో జలాభిషేకం చేస్తే..
జనులకి కనకధారల సిరులను కురిపించి
మురిపించే నీ మహిమలు అనంతానంతాలు!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
