Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరి‘మితి’

[అశ్వని పెమ్మరాజు గారు రచించిన – పరి‘మితి’ – అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఏంటి సుబ్బులు ఇవాళ చీర సింగారించావు..”అంటూ నవ్వింది సరళ.

“పిన్నీ,  ఎన్నిసార్లు చెప్పా లక్ష్మీ అని పిలు..” అంది బుంగమూతి పెడుతూ సుబ్బలక్ష్మి.

“అదేంటీ సుబ్బులు నీకు చక్కగా మా అమ్మ పేరు పెట్టుకుంది మా అక్క స్వచ్ఛమైన తెనుగు పేరు.. ఇంతకీ చీర కట్టావు, పెళ్లికి పోతున్నావా? జర మాకు చెప్పు..”అంది

“అబ్బా పిన్నీ, ఆఫీసులో ‘ఎత్నిక్ డే’. ఇప్పుడు నా చీరకట్టు వెనక కథ వచ్చాకా చెప్తా..” అని తూనీగ లాగా పరిగెత్తింది.

***

రాత్రి ఇంటికి వచ్చాక “ఏమేవ్ సుబ్బులు అదేదో ఇథనాల్ మెంతోల్ డే అయ్యిందా?” అంది పిన్ని నవ్వుతూ.

“గొప్ప పేరు పెట్టావ్.. ఇంకా నయం మిథైల్ ఆల్కహాల్ అనలేదు.. ఎంతైనా నీ కెమిస్ట్రీ టీచర్ భాష పోదుగా☺ ☺. అది ‘ఎత్నిక్ డే’. అంటే సంప్రదాయ దుస్తులను ధరించి కార్యాలయంకి యేగవలెను..” అంది నాటకీయంగా.

“అలా అని ముందే చెప్తే కచ్చ పోసి మడి చీర కట్టేదాన్నిగా నీకు” అంది పిన్ని.

“ఓయమ్మో అదొక్కటే తక్కువ. ఇవాళ ఆఫీస్ ఏంటో ఫ్యాషన్ షో లాగా అయిపోయింది. జనాలు పని చేసింది తక్కువ, అటు ఇటు తిరుగుడు ఎక్కువ.. అసలే లాగు చొక్కాలకి అలవాటు పడ్డ ఆడ మగ ఈ బట్టలతో చేసిన విన్యాసాలు చెప్పలేము. ఆడపిల్లలకి చీర, ఓణీ మాట దేవుడెరుగు.. తిన్నగా చుడిదార్ మీద చున్నీ వేసుకుని ఉండడం రాదు.. ఆ దెబ్బకి మా ఆఫీస్‌లో నేల తుడిచే పని ఉంటే ఒట్టు..” అంది పిన్ని కేసి చూస్తూ.

“అయ్యో ఏంటి ఆపాటి చున్నీకేనా.. ఈ లెక్కన ఏడు గజాల చీరలు ఇస్తే తన్నుకుని బోర్లా పడతారేమో?” అంది పిన్ని.

“ఆగు అసలు విన్యాసాలు ఇంకా ఉన్నాయి.. కొంతమంది చీర కట్టుకుని వచ్చాం అనుకుని చుట్టుకు వచ్చారు.. అసలే చీర సింగారం కొత్త ఆయే దీనికి తోడు షిఫాను, సిల్కు చీరలు కడితే నిలవాలి.. దానికి సాయం ఊరగాయ జాడికి వాసం కట్టినట్టు అన్ని పిన్నులు పెట్టి, అవి సర్దుకోవడం కోసం సగం రోజు వాష్ రూమ్ లోనే గడిపేశారు. దీనికి తోడు మేకప్ చెరగకూడదు అని దిద్దుబాట్లు.. వీటికి తోడు ఇన్స్టా రీల్స్ కోసం రకరకాల భంగిమలో ఫోటోలు.. వెరసి అందాల పోటీలకి ఆఖరి అంకంలో ఉన్నట్టు ఉంది ఇవాళ..” అంది లక్ష్మి.

“అంతేలే ఏదో వీలు చాలు అని ఈ లాగు చొక్కాలుకి అలవాటు పడిపోయారు.. ఏదైనా చీరకట్టులో వుండే అందం వేరు.. లంగా ఓణీలో వుండే సొగసు వేరు.. చీకి గుడ్డలు అదీ మోకాలు పైకి.. బిగుతుగా ఊపిరి ఆడనట్టు వుండే గుడ్డలు వేసుకోవడం దేనికి? మళ్ళీ మొహమాటంగా కిందకి లాక్కోవడం దేనికి? పిచ్చి ముదురుతోంది పిల్లలకి.. దానికి తోడు మొహానికి ఇంత పూత పుయ్యాలి.. పొరపాటున జుట్టు దువ్వుకుని జడ వేసుకునే అలవాటే లేదాయే.. గుడిలో పునకాల వేళ విరబోసినట్టు జుట్టు, మళ్ళీ దానికి బోలెడు చిత్రవిచిత్రమైన వర్ణాలు వెరసి పిచ్చుక గూడు లాగా.. ఏ మాటకి ఆ మాటే మగ పిల్లలు బంగారు కొండలు.. ఇలాంటి వాటికి దూరంగా ఉంటారుగా” అంది పిన్ని.

“హే.. ఏమి మాట్లాడుతున్నావు పిన్నీ, వాళ్ళు ఇంకో రెండు ఆకులు ఎక్కువే చదివారు.. మొత్తం రామరాజు, భీమరాజు, సోంరాజు వాళ్ళ బ్రాండ్ పంచెలు అన్ని మా ఆఫీస్ లోనే కనిపించాయి. ఉత్తప్పుడు లుంగీలు కూడా కట్టరు. కొంపల్లో చిన్న నిక్కర్లు వేసుకు తిరుగుతారు. ఒకేసారి పంచె అది కూడా లుంగీ డాన్స్‍లో షారుఖ్ లాగా కట్టి, అది కాళ్ళకి అడ్డం పడుతోంది అని పైకి కట్టలేక, అది జారిపోతుందేమో అని భయం భయంగా సర్దుకుంటూ వాళ్ళ తిప్పలు. పాపం ఆడపిల్లల ముందు ఎక్కడ పరువు పోతుందో అని తంటాలు పడుతూ ఉంటే.. అసలు మాములు నవ్వులు కాదు.. ఇంక ఫోటో సెషన్స్.. ఇన్స్టాలో అప్‌లోడ్స్.. టాకింగ్‌లు సైటింగులు ఆనక సెట్టింగులు, సిట్టింగులు.. అంత అమాయకులు ఎవ్వరు లేరక్కడ.”

“బావుంది సుబ్బులు, మీ కార్పొరేట్‌లో పాశ్చత్య సంస్కృతి యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నా.. మధ్య మధ్యలో మన సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తోందో తెలియదు. ఆఫీస్‌లోనే కాదు ఇళ్లలో కూడా అంతే. పూజలు పద్ధతులు మొక్కుబడిగా లాగించేస్తున్నారు. మరి కొందరు స్టేటస్‌లు పెట్టుకోడానికే పూజలు, పండగలు చేస్తున్నారు. భక్తి దేవుడు మీద కాదు ఫోటోల మీద, లైకుల మీద.. సనాతన ధర్మం మీద నమ్మకంతో అర్థం చేసుకుని ఆచరించిన రోజు వాటి ప్రయోజనం కలుగుతుంది.” అంది పిన్ని.

“నిజమే పిన్నీ, చాలా విషయాల్లో ఇలాగే జరుగుతోంది జనాలు గుడ్డిగా ఆచరిస్తున్నారు.. పాపం ప్రవచనకర్తలు మంచి ఉద్దేశంతో చెప్పినా దానిని వక్రంగా అర్థాలు లాగి అడ్డంగా యూట్యూబ్‌లో అడ్డదిడ్డంగా ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక వీడియోలు పెడుతుంటే ఏవి సరైనవో తెలియక అన్ని ప్రయోగాలు చేసుకుని పీకల మీద తెచ్చుకుంటున్న అమాయకులు ఎందరో ఉన్నారు.”

“హా, నిజమే చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేసాక అందరూ ఫోటోగ్రాపర్‍లే, అందరూ యూట్యూబుర్లే. అసలు ఏవి పెట్టొచ్చు సామాజిక మాధ్యమాల్లో ఏది పెట్టకూడదు అనే ఇంగితం లేకుండా పోయింది.. ఫోన్ తోనే జీవితం. చుట్టూ వున్న వారు ఉన్నారా పోయారని అక్కర్లేదు.. ఫోన్ తోనే లోకం. కళ్ళు తెరుస్తూనే ఫోన్, రెప్పలు పడడానికి ఫోన్.. ఒక్కోసారి ఫోన్ ఒక వ్యసనంగా మారి రెప్ప వెయ్యడం కూడా మర్చిపోతున్నారా అని అనిపిస్తుంది.. త్వరలో మందు, మాదకద్రవ్యాల నుండి తప్పించడానికి రిహాబ్ సెంటర్లు వచ్చినట్టు వీటికి కూడా వస్తాయి.. ఏదైనా శృతి మించితే కొంప ముంచుతుంది. మన వంతు ప్రయత్నం కాస్త ఫోన్ వాడకం తగ్గించి చుట్టూ వున్న మనుషులతో, పుస్తకాలతో సావాసం చేద్దాం ఏమంటావ్..” అంది పిన్ని.

“పిన్ని మాట సుగ్రీవాజ్ఞ.. ఇప్పటి నుండి రోజులో కనీసం రెండు గంటలు ఫోన్‌కి విడాకులు ఇస్తున్నా” అంటూ ఫోన్ పక్కన పెట్టేసింది సుబ్బులు.

Exit mobile version