Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పత్రికల్లో తెలుగు పెరగాలి

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘పత్రికల్లో తెలుగు పెరగాలి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

‘సంపాదకుడు’ అనే మాటను మొదటిసారిగా తెలుగులో వాడుకలోకి తెచ్చినవారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. వందేళ్ళ క్రిందటి మాట. ‘భావకవిత్వం’, ‘రాయలసీమ’ అనే మాటలక్కూడా తండ్రి ఆయనే!

సంపాదకుడు వ్రాసిన దాన్ని సంపాదకీయం అనటం కూడా తెలుగులో అలానే పుట్టింది.

కానీ, ఎడిటర్ అనే మాటని సంపాదకుడు అనటం తెలుగులోనే మొదలు కాలేదు. దాని ‘వెనకటి కత’ పెద్దదే! హిందీ ఇంకా మరికొన్ని ఉత్తరాది భాషల్లో ‘సంపాదక్’ అనే మాట 200 యేళ్లనుంచీ వాడుకలో ఉంది. మనం అదే తీసుకున్నాం.

భారతీయులు పెట్టిన తొలి వార్తాపత్రిక ‘బెంగాలీ గెజిట్’. 1816లో కలకత్తాలో గంగాధర్ భట్టాచార్య దీన్ని మొదలు పెట్టాడు. ఆయనతోనే సంపాదకమహాశయుడనే పేరు మొదలయ్యిందని పత్రికల వెనకటి కత చెప్తోంది. దొడ్డతలంపులకు (ఉదారవాదము) కట్టుబడిన పత్రికగా దాన్ని నడిపాడు. రాజా రామమోహన్ రాయ్ తలంపులకు (సంస్కరణలకు) ఆ పత్రిక అండగా నిలిచింది.

కాబట్టి సంపాదకుడు అనే మాట సంస్కృతంలోంచి తీసుకుని ఎడిటర్ అనే అర్థంలోకి తెచ్చిన హిందీ పదం. దాన్ని మనం అలానే తెలుగులోకీ తెచ్చుకున్నాం. అదే తమిళులైతే ‘ఆచిరియర్’ అంటారు. వాళ్లు తమకంటూ ఓ పేరు పెట్టుకోగలిగారు. మనం ఆ వైపున తలపోయనే లేదు.

చెమటోడ్చి, తెలివిని వాడి, నేర్చిన దానితో సెలగి దేనినైనా దక్కించుకోవటం లేదా దక్కించటాన్ని సంపాదన అంటారు. ఆ సంపాయించిన దాన్నిబట్టి దాని విలువ, నిలుపు, పోడిమి మారుతుంటాయి.

డబ్బు సంపాదించటమే సంపాదకుడి పనైతే ఆ పనిని ఆ పత్రిక సొంతగాడు చేస్తాడు. లేదా పబ్లిషర్, బిజినస్ మేనేజర్లు చేస్తారు. ఒక్క ఎడిటర్నే సంపాదకుడు అనాల్సిన పనిలేదు.

ఆ పత్రికకు లేదా పుస్తకానికి మంచి పేరు సంపాదించటమే పనయితే ఆ పనికి ఎడిటర్, ఫబ్లిషర్, ప్రింటర్‌తో పాటు ఆ పత్రికలో పనిచేసే వారందరు, వారితోపాటు ఆ పత్రికకు వ్రాసే వ్రాయితలు, చిత్రకారులు అందరూ కూటముగా పేరు సంపాదించి పెడతారు. మరి సంపాదకుడు ఒక్కడూ చేసేదేమిటి?

రెండు వందల ఏళ్ల క్రితం ఎడిటర్ అనే పదానికి లేని కొత్త కోపులు చాలా వచ్చాయిప్పుడు! ఎడిటర్ అంటే ‘మార్పులు చేసే పనిముట్టు’ అనే తీరున చూస్తున్నారిప్పుడు.

పత్రికలు, పుస్తకాల (Publishing) ఎడిటర్:

ఇతరులు వ్రాసిన వ్రాతలను చదివి, తప్పులను సరిదిద్ది, వాటిని అచ్చుకు సిద్ధం చేయడం. ఆ పత్రికకు లేదా మీడియా ఛానెల్‌కు పాడి(చట్టప్రకారం)గా పూచిక ఉన్నవాడు ఎడిటర్. పెద్ద పత్రికల్లో ఎడిటర్లు చాలా మంది ఉంటారు. కాబట్టి. చీఫ్ ఎడిటర్ అనే కూకటి సంపాదకుడు తనదీ పూచీ అంటాడు. అలా పూచీదారుడు ఎడిటర్.

సినిమాలు, యూట్యూబ్ వీడియోల ఎడిటర్:

సినిమాలు, యూట్యూబ్ వీడియోలను కూర్చే వ్యక్తిని కూర్పుదారు (ఎడిటర్) అంటారు. వీళ్లు తీసిన వీడియో కణికల్ని (క్లిప్పింగ్స్) ఒక వరుసలో జోడించి, దానికి సంగీతాన్ని, వీలైతే ఏలితెలివి (ఏఐ) సాయంతో కొన్ని సొబగుల్ని కలిపి ఒక పూర్తి సినిమా లేదా వీడియోగా మారుస్తారు. వీళ్లు కూర్పరులే! సంపాదకుడు అనే మాట వీళ్లకు ఏ మాత్రం సరిపోదు.

కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ పనిముట్లలో ఎడిటర్ అనే యాప్ ఒకటుంటుంది. యాప్ అంటే ముందుగానే వ్రాసి పెట్టుకున్న ఒక పనితీరు (ప్రోగ్రామ్)ని అంటి నడుస్తూ పని చేకూర్చేదని. అలా ‘అంటి పనిచేసేది’ కాబట్టి ‘యాప్’ ని ‘అంటిత’ అనీ, అంటితలో ఏదైనా వ్రాసినదాన్ని మార్చటానికి, మెరుగుపరచ టానికి కావలసిన వాటిని చేకూర్చేందుకు ఎడిటర్ అనే ఈ అంటిత సాయపడ్తుంది! కాబట్టి, ఈ కంప్యూటర్ ఎడిటర్ని ‘చేకూరు’ అనవచ్చు.

అందరికి తెలిసినమాటే కొత్త అర్థంలో వాడకం లోకి తెస్తే అదే కొన్నాళ్ళకి నిలిచిపోతుంది. ఈ చేకూరులనే ఎడిటర్లలో వ్రాతని చేకూర్చే టెక్స్ట్ ఎడిటర్, బొమ్మల్ని చేకూర్చే ఫోటో ఎడిటర్ ఇలాంటివి ఉంటాయి.

కంప్యూటర్ చేయాల్సిన పనిని ముందుగానే దానికి దాని నుడుల్లో చెప్పటాన్ని కోడింగ్ అంటారు. కంప్యూటర్ నుడి వేరు. అది మనం మాట్లాడే నుడిలాంటిది కాదు. ఇదొక మినుకు నుడి (సాంకేతిక భాష). దీన్ని ఎప్పటికప్పుడు మార్చటానికి వాడేదాన్ని‘కోడ్ ఎడిటర్’ అంటారు ఇక్కడా సంపాదకుడు అనే మాట సరిపోయేది కాదు.

ఇలా ఎడిటర్లు చాలా ఉన్నాయి. వీటన్నింటికీ పనికొచ్చే ఒకే మాట తెలుగులో దొరికేనా? అది ఎడిటర్ అన్న ఆంగ్ల నుడి కుదిరినంత తేలికగా నప్పేనా? సంస్కృతంలో కుదిరింది కదా.. అనడగొచ్చు. నిక్కంగా చెప్పాలంటే సంపాదకుడు అనే మాట ఏ విధంగానూ ఎడిటర్ అనే పూర్తి తలంపుని ఇవ్వటం లేదు. అది ఒకప్పుడు సరిపోయిందిగానీ ఇప్పుడు పత్రికల క్కూడా సరిపోయేది కాదు.

వందేళ్ళక్రితం గాడిచర్లవారో, ముట్నూరివారో, కాశీనాథుని వారో పనిచేసిన పొద్దుల్లో సంపాదకుడు అనే మాట పుట్టినప్పుడు ఆ పనిని నెత్తికెత్తుకున్నవారికున్న విలువ వేరు.

పత్రిక పెట్టారంటే మంది అందరి మేలు కోరే ఒక నోముగా ఉండేది అప్పట్లో! ఇదిగో ఈ మంచిని చేయటానికి అనేదాన్ని చూపున పెట్టుకుని అందుకోసమే పనిచేసే వాళ్లు. దానికి కావలసిన అన్ని వనరులు సంపాదించేవాడు సంపాదకుడు. అంతేగాని ప్రూఫులు దిద్దేవాడని కాదు!

ఎడిటర్ కీలకమైనవాడు. పత్రికకు కీలకమైన పనిముట్టు కూడా! కీలకం అనేది అచ్చతెలుగు మాట. కీలకం అంటే తంత్రం, ఉపాయం, మర్మం, కిటుకు, మేకు, మంట అని! ఈ అన్నీ సంపాదకుడికి చెందిన మాటలే! సంపాదకీయం కూడా పత్రికకు కీలకం కాబట్టి దాన్ని కీలకీయం అనవచ్చు. మేకులా దిగుతుంది. మంటలా రేగుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు నొక్కి చెప్తుంది.. సంపాదకీయం కాబట్టి!

సరే.. ఇప్పటి పత్రికల తీరుగురించి మనం చర్చించటం, సంపాదకుడు అనే మాటకి సమానమైన తెలుగు మాటని పుట్టించటం వలన ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ లేదు. నేలంతా వాడ్తున్నమాటని గౌరవంగానే తీసుకుందాం!

కానీ, ఆంగ్లపదాలు పూటకొక్కటిగా పుట్టుకొస్తున్నప్పుడు తెలుగులో వ్రాయటానికి ఒక తీరును మనం అందరం కలిసి నిలుపు ఇచ్చుకోవలసి ఉంది. దీని గురించి కొందరైనా ఎదపెడతారని తలంపు.

పోకడంతా ఎరుక మిన్కులతో (శాస్త్ర సాంకేతికత) సాగుతున్నప్పుడు తెలుగును కూడా దానికి తగ్గట్టుగా ఎదిగేలా చేయాల్సిన పని ఉంది. మనం దీని గురించి గట్టిగా తలపోయాలి కూడా!

మనవి కాని కొత్త వాటికి మన నుడిలో మాటలు ఎందుకుంటాయి? జోడైన పలుకు ఏదైనా దొరికితే చక్కగా వాడుకుందాం. దొరకనప్పుడు దగ్గరగా ఉండేది కుదురుతుందేమో చూద్దాం. ఆ కుదిరే పలుకులు మంది అందరికీ తెలిసినవై ఉండాలి. ఎవరికీ తెలీని మాటల్ని తెలుగు పేరుతో తెచ్చేవాళ్లు..! తెలుగుకి కీడే చేస్తున్నారని లెక్క!

అందరికి తెలిసిన దగ్గరి మాటలు లేనప్పుడు ఏం చెయ్యాలి?

లేదు కాబట్టి, మన నుడిని తక్కువ చేసుకోవలసి పనిలేదు.

ఏ పదాన్ని తెలుగులోకి తేవాలనుకుంటున్నామో ఆ పదం అందరికీ తెలిసినదే అయినప్పుడు మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవటంలో తక్కువతనం ఏమీ లేదు.

ఎరుక మిన్కులు (సాంకేతికపదాలు) తెలుగు చేసేందుకు మనం తొందరపడి సంస్కృతాన్ని అండగొని ఇదంతా తెలుగు అనుకోవటం వలనే మనం చాలామార్లు పప్పులో కాలేశాం.

ఇలా అనటం సంస్కృతాన్ని ఏదో అనటం కాదు, ఆ వెదికేదేదో తెలుగులో వెదికే తలంపు చెయ్యలేక పోయామన్నదే అటమట పుట్టించేది.

పొత్తూరి వారు వ్రాసినట్టు శ్రీ ముట్నూరి కృష్టారావుగారు ‘డెమోక్రసీ’ అనే పదాన్ని అలాగే వాడేవారు. దానిని విశేషణంగా వాడవలసి వచ్చినప్పుడు ‘డెమోక్రటిక్’ అన్నారు. మితిమీరిన సంస్కృతీకరణ అన్నది ఆయనప్పుడు లేదు. సరైన తెలుగు మాట కుదరనప్పుడు ఆంగ్లాన్ని అలాగే వాడిన తీరిది.

డెమోక్రసీని మంది ఏలుబడి అనో మన ఏలుబడి అనో కాకుండా ‘ప్రజాస్వామ్యం’ అని సంస్కృతం పలుకు వాడటం వలన తెలుగుకు ఏం ఒరిగింది? ఇప్పుడు అందరూ అదే మాట వాడేస్తున్నారు కాబట్టి కొంచెగాళ్లు (సామాన్యులు) కూడా దాన్ని తెలుసుకోగలిగారు. అదే మాటకి ఇలా ఆనాడే ఒక తెలుగు మాటని పుట్టించుకునే తలంపు చేసినట్టయితే అందరికీ తెలుగే తెలిసేది కదా! ఆ మేరకు తెలుగుకు మంచే జరిగేది కదా! ‘మన ఏలుబడి’ వచ్చి ఉన్నట్టయితే మన తెలుగుకి ఎంత మేలయ్యేదో కదా..!

దానికన్నా ‘రోడ్’ని రోడ్డు అని కార్డ్‌ని కార్డని అజంతం చేసి వాడిన ముట్నూరి కృష్ణారావుగారే ఎక్కువ తెలుగు బత్తులాయన!

‘ఆధిగమించు’ అంటే చదువు, ఎరుకపడు, పొందు, తెలియు అని! దాన్ని మన తెలుగు పత్రికలు మీరి వెళ్ళటం, దాటి వెళ్ళటం అనటాల్లోకి మార్చేశారు. పత్రికల్లోనో సినిమాల్లోనో ఒక మాట పదే పదే వస్తే అది జనం నోళ్ళకు ఎక్కి,. అదే సరయిన మాటగా నిలిచిపోతుంది. ఇప్పుడు మనం మల్లికార్జున రావు అని వ్రాసినా ప్రూఫులు దిద్దేవాళ్లు మల్లిఖార్జున రావనే దిద్దేస్తున్నారు కదా!

‘స్వంత’ అంటే గ్రాంధికం అని ‘సొంత’ అంటే వాడుక మాట అనీ కొందరు అనుకుంటున్నారు. స్వంతం, సొంతం రెండూ స్వతంత్రం అనే సంస్కృతం మాటలోంచి పుట్టినవే! సంస్కృతం పలుకు ఏది వాడినా అది గ్రాంథికమే! అచ్చతెలుగు మాటలే అవి ఒక నాటి వాడుకమాటలు, ఇప్పటికీ వాడుక మాటలు! అచ్చతెలుగు మాటల్ని గ్రాంథికం అనటం సరికాదు

ఇదంతా ప్రతిదానికీ సంస్కృతాన్ని అండగొనటం వలన వచ్చిన తంటా! తొలినాటి నుండీ, సంస్కృతాన్ని తగ్గించుకుందాం అనే పిలుపు ఇవ్వకుండా గ్రాంథిక, వాడుక కదలికలు (ఉద్యమాలు) నడిచాయి. వాడుక భాష కదలికని నెత్తికెత్తు కున్నవారు కూడా మితిమీరిన సంస్కృతం వాడవద్దని, బదులుగా తెలుగు మాటలు వాడాలని పిలుపు ఇవ్వలేదు. ఆ మేరకు ఎలాంటి పనీ మొదలు కాకుండా ఆదిభట్లవారి నాటికే ఆగిపోయింది.

పత్రికల్లో ఏదైనా ఆంగ్లపలుకు వ్రాయల్సివచ్చినప్పుడు తెలుగుమాట కోసం తొలుత వెదికే తలంపు కలగాలన్నదే ఇంత విరివివ్రాత మొత్తుకుంటోంది.

ఫ్లై ఓవర్ అనే మాటని తెలుగులో వ్రాయమంటే చదువు కున్నవాళ్లంతా ‘ఊర్ద్వవారధి’.. ఇలా సంస్కృతంలో వెదకటానికి చూస్తారు. చదువురానివాడు టక్కున ‘పై వంతెన’ అనగలుగుతాడు. అదే తేడా!

తెలుగు మాటల్ని కాపాడుకోవాలని ఇప్పుడు అందరూ అంటున్నారు. తెలుగు మాటలు మాట్లాడకుండా తెలుగుని ఎలా కాపాడతారు..? మనం మాటలాడే వాటిలో నూటికి అరవైకి మించి సంస్కృతం ఉంటోంది. అంతమేర తెలుగు అణగిపోతోంది. దీన్ని సరిచేయకుండా తెలుగుని కాపాడతాననటం సరికాదు!

మన ఈ మాటలన్నీ తెలుగు మాటల వాడకాన్ని పెంచాలని అటు పత్రికలవాళ్లకి, ఇటు వ్రాయితలకీ మొత్తుకోళ్లు చెప్పుకోవటానికే!

Exit mobile version