Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెద్ద కీ.. చిన్న కీ

[బాలబాలికల కోసం ‘పెద్ద కీ.. చిన్న కీ’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

ప్రథమ్ సుజన, ప్రసాద్‌ల ముద్దు బిడ్డడు. ఆరేళ్ళ అమాయకుడే కాదు, అసాధ్యుడు కూడా. అక్క రచనతో కలిసి ఆడుకోవటమేకాదు, విపరీతమైన అల్లరి కూడా చేస్తాడు. ఈ కాలం పిల్లలకి తగ్గట్లే అమోఘమైన తెలివితేటలు.

పక్క ఇంట్లో వుండే సుజన తల్లి విమలకీ, సుజన అక్క నీలిమకీ కూడా వీడంటే చాలా ముద్దు. వీడూ అమ్మా నాన్నా మీద అలిగినప్పుడూ, వాళ్ళేమన్నా తనడిగింది కొనివ్వనప్పుడూ పెద్దమ్మనీ, అమ్మమ్మనీ ఆశ్రయిస్తాడు అక్కడ వీడి గారాబం ఇంకా సాగుతుంది గనుక.

సుజనకి ఇంటి తాళాలూ, బీరువా తాళాలూ వగైరా ఇంట్లో వున్న తాళాలకన్నింటికీ మరో తాళం చెవి తయారు చేయించి గుర్తుగా ఒక చోట పెట్టటం అలవాటు. వాటి అవసరం ఎప్పుడన్నా పడి, పిల్లల్ని తెమ్మన్నప్పుడు వాళ్ళకి తెలియటం కోసం రోజూ వాడే తాళం చెవిని పెద్ద కీ అనీ, దాచి పెట్టిన మరో తాళం చెవిని చిన్న కీ అని చెప్పేది.

ప్రసాద్‌కి వేరే ఊరు బదిలీ అయింది. పిల్లల చదువుల కోసం సుజన వున్న ఊళ్ళోనే వుండిపోవాల్సి వచ్చింది. రెండు సంసారాలూ, రాకపోకల ఖర్చులు ఎక్కువయ్యాయి. జీతం సర్దుకుని వాడాల్సిన పరిస్ధితి. పిల్లలకి అన్ని సంగతులూ అర్థం కావు కదా. కావాల్సిన వస్తువుల కోసం పేచీ పెట్టటమే తెలుసు.

ఒకసారి ప్రథమ్ ఏదో ఆట వస్తువు కావాలని అమ్మని అడిగాడు. అమ్మ చెప్పే సాకులన్నీ చెప్పింది. తర్వాత కొనిస్తానంది. పుట్టిన రోజుకి కొంటానంది. అలా ఎన్ని చెప్పినా వాడు వినకపోతే, అసలు సంగతులు పిల్లలకి కూడా తెలియాలని నెమ్మదిగా చెప్పింది. “నాన్న ఒక ఊళ్ళో, మనం ఒక ఊళ్ళో వున్నాం కదా, మీకోసం నాన్న వారానికి ఒకసారి ఈ ఊరు వచ్చి వెళ్తున్నారు కదా, మరి అక్కడ నాన్న వుండటానికి ఇంటి అద్దె, ఇంకా రోజూ అనేక ఖర్చులుంటాయి కదా. మీ పరీక్షలు కాగానే మనం కూడా ఆ ఊరు వెళ్ళి పోదాము. అప్పుడు కొంచెం ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు నువ్వడిగినవన్నీ కొనిస్తాను, అప్పటిదాకా వేధించకు”, అని చెప్పింది.

ప్రథమ్ ఆలోచించాడు. అమ్మ చెప్పిన మాటలు అన్నీ అర్థం కాకపోయినా, అమ్మ దగ్గర డబ్బులు ఎక్కువ లేవని తెలిసింది. మరి తన బొమ్మ కావాలంటే ఏం చెయ్యాలి. ఆలోచిస్తే ఐడియా తట్టకపోదు కదా. వచ్చేసింది ఐడియా.

“అమ్మా, పోనీలే, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్విప్పుడు కొనద్దులే. చిన్న కీ వాడతాను” అన్నాడు. వాడి మాటలు సుజనకి అర్థం కాలేదు.

“చిన్న కీ వాడటమేంటిరా. దానితో డబ్బులెలా వస్తాయి? బీరువాలో లేవు” అన్నది.

“బీరువా కీ కాదమ్మా, పెద్ద కీ నాన్న తీసుకెళ్ళినప్పుడు నువ్వు చిన్న కీ వాడతావు కదా. అలాగే, నువ్వు పెద్ద కీ వి. నీ దగ్గర డబ్బులు లేకపోతే చిన్న కీ.. అదే పెద్దమ్మ దగ్గర తీసుకుంటా. ఏ కీ అయినా తాళం తియ్యచ్చని నువ్వే చెప్పావుగా. మన పెద్దమ్మే కదా. మన డబ్బులయితే ఏమిటి పెద్దమ్మ డబ్బులయితే ఏమిటి. పైగా పెద్దమ్మ నేనడిగితే ఏమీ కాదనదు..” అంటూ తుర్రుమన్నాడు.

తను చెప్పిన పెద్ద కీ, చిన్న కీని ప్రథమ్ ఉపయోగించుకున్న విధానానికి ఆశ్చర్యపోయింది సుజన.

Exit mobile version