Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెద్దల సంరక్షణ – సమాజం

[మంగుళూరులో వైద్యవృత్తిలో ఉన్న డా. శ్రీనివాస కక్కిలాయగారు కన్నడంలో రచించిన ‘ఆరోగ్య ఆశయ’ నుంచి ఈ వ్యాసం స్వీకరించబడింది. సీనియర్ సిటిజెన్స్ ఆరోగ్య అవసరాల గురించి, వారిపట్ల ఆధునిక వ్యస్త సమాజం తీసుకోవాల్సిన బాధ్యత గురించి విస్తృత చర్చ జరగవలసి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ వ్యాసం లోని విషయం అవసరమైనదనిపించి అనువదించి అందిస్తున్నారు శ్రీమతి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి.]

సమకాలీన పెంపకాల కష్టసుఖాలను రెండిటినీ అనుభవించేవారు మన పెద్దలు. గత నాలుగైదు దశాబ్దాలలో జరిగిన వైద్య, సాంకేతిక, సామాజిక, ఆర్థిక ప్రగతుల వలన ఆయురారోగ్య వృద్ధి సుఖం ఒక వైపు, గ్లోబలైజేషన్ వెల్లువలో సామాజిక -కౌటుంబిక సంబంధాల శీఘ్రపతనం వలన  కష్టాలు ఇంకోవైపు.

విశ్వస్తర గణాంకాల ప్రకారం, 2002లో ప్రపంచంలో 60 ఏళ్ళు దాటినవారి సంఖ్య 11 శాతం. అంటే దాదాపు 80 కోట్లు. ఇది 2030 నాటికి 16 శాతం అంటే 137 కోట్లు కానుంది. మన దేశంలో ప్రస్తుతం 60 దాటినవారు దాదాపు 10 కోట్ల మందున్నారు. 2030 నాటికి 19 కోట్లు కానున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం, భారతీయుల సగటు ఆయుర్దాయం గత దశాబ్దంలో ఐదేళ్ళు పెరిగింది. 2001-05లో 63 ఏళ్ళుగా ఉన్నది 2001-15 నాటికి 68కి పెరిగింది. 1947 తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ.

విశ్వస్తర గణాంకాల ప్రకారం, పెద్ద వయసు వారి ఆర్థిక స్థితిగతి, ఆరోగ్య రక్షణ, శిక్షణ, వృత్తి మరియు అనుకూలకరమైన వాతావరణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వెల్ఫేర్ ఇండెక్స్‌లో 91 దేశాల్లో స్వీడన్ మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 73వ స్థానంలో ఉంది. వీటిలో మొత్తం 100 పాయింట్లకు మన దేశము కేవలం 35 పాయింట్లనే గెలుచుకోగలదు. అంటే వరిష్ఠ పౌరుల యోగక్షేమాలు చూడడంలో మనము చాలా వెనుకబడిఉన్నాము.

వయసు పెరిగే కొద్దీ దేహంలో అంగాలు అరిగిపోతాయి. వాటి క్రియాశీలత బలహీనమవుతుంది. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం, మతిమరుపు, శ్వాసకోశ సమస్యలు, ఎముకల అరుగుదల, దైహిక సమతుల్యతలో సమస్యలు, చూపు మరియు వినికిడి సమస్యలు, దంతాలు మరియు చిగుళ్ళ ఇబ్బందులు, రకరకాల ఇన్‌ఫెక్షన్స్, పెద్దవారిలో సహజమే. వివిధ కష్టాలవల్ల లేదా వయోసహజంగానూ మానసికసమస్యలు కూడా వారికి కలుగవచ్చు. వీటన్నిటి చికిత్సలు ఖర్చుతో కూడినవి కావడం, పెద్ద వారిలో చాలా మందికి స్వంత ఆదాయం లేకపోవడం, ఆరోగ్య బీమాలు దొరకకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకసౌకర్యాలు లేకపోవడం మొదలైనవి మరింతగా కష్టాలకు గురి చేస్తాయి.

పెద్దవయసు స్త్రీల కష్టాలు మరింత ఎక్కువ. ఆ పాత తరం భార్యాభర్తల మధ్య వయస్సు తేడా కూడా ఎక్కువ. స్త్రీల ఆయుర్దాయం కూడా ఎక్కువ. అందువల్ల 60 శాతం పెద్ద వయసు స్త్రీలు భర్తను కోల్పోయిన వారుంటారు. పెద్ద వయసు పురుషులలో 50 శాతం మంది అక్షరాస్యులుంటే, స్త్రీలలో కేవలం 20 శాతం మాత్రమే అక్షరాస్యులు. 40 శాతం పెద్ద వయసు పురుషులు సంపాదనాపరులై ఉంటే, కేవలం 19 శాతం పెద్ద వయసు స్త్రీలు మాత్రమే (నగరాలలో 3 శాతం) సంపాదనాపరులై ఉంటారు. ఎక్కువ మంది పెద్ద వయసు స్త్రీలు ఆస్తి, సంపద, గౌరవం లేకుండా బ్రతుకుతున్నారనేది కఠినమైన సత్యం. అలాగే పెద్ద వయసు స్త్రీలలో సగానికి పైగా మంది పిల్లలపై ఆధారపడి జీవిస్తుంటారు.

నేటి కొత్త ఆర్థికత, కొత్త తరం వారు, కొత్త జీవన విలువలు పెద్ద వయసు వారికి ఛ్హాలెంజ్ గా ఉంటున్నాయి. చదువుకున్న పిల్లల చదువు రాని కన్నవాళ్ళు; మహానగరాలకూ విదేశాలకూ వలస పోయిన చిన్నవారు, పల్లెల్లోనే నిల్చిపోయిన పెద్దవారు; బీదరికంలోనే బతుకీడుస్తున్న పోషకులు, సిరిసంపదలలోకి అడుగిడిన పిల్లలు; పాత ఆచారాలను విడువలేని పాతతరం, కొత్త పద్ధతులలో ఒదిగి పోవాల్సిన కొత్తతరం – ఇది ఈనాటి వాస్తవం. ఆనాటి ఉమ్మడి కుటుంబాలకు పెద్దతలలు గౌరవాన్వితమైన ప్రతిష్ఠ అయితే, ఈనాటి చిన్న కుటుంబాలకు పెద్దవారు భారమవడం కనిపిస్తుంది. అలా కాకున్నా, చదువుకున్న పిల్లలు దూరాలకు సాగిపోయినప్పుడు కన్నవాళ్ళు వెనక ఉండిపోవడం అనివార్యమైపోతుంది. చుట్టపక్కాలు, సమాజం చేసే వ్యాఖ్యానాల వల్ల కలిగే బాధలు అదనం.

ఒకానొక పెద్ద పారిశ్రామికవేత్త పల్లెలో ఒంటరిగా ఉన్న తన తల్లిని నగరంలో తన బంగళాలో వచ్చి ఉండమని బలవంతం చేసేవాడు. తల్లి అందుకొప్పుకోకుండా, “నేనెందుకు నీ దగ్గరికొచ్చి ఉండాలి? నీవు, నీ భార్య  పొద్దున్నే ఇల్లు వదిల్తే రాత్రి పొద్దుపోయాక తిరిగొస్తారు. నీ పిల్లలు కాలేజీ – పాఠం అని వాళ్ళంతకు వాళ్ళుంటారు. నా పల్లెటూరింట్లో పనివాళ్ళున్నారు. ఇరుగుపొరుగున్నారు. పశువులూ, దూడలూ, కోళ్ళూ ఉన్నాయి. పూల చెట్లున్నాయి. తోట ఉంది. అందర్నీ చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను. నాకు అదే మంచిది. అత్యవసరంగా ఏదైనా సహాయం కోరే పరిస్థితి వస్తే దానికి మాత్రం ఏదైనా ఏర్పాటు చేయి. అంతే చాలు.” అనేది. తొంభై నిండిన నిండు జీవితం చివరివరకూ తన పల్లెటూరింట్లోనే గడిపిందామె.

విదేశాల్లో ఉన్నవాడొకడు హైస్కూలుకొచ్చిన తన పిల్లలను స్వదేశానికి పంపాడు. నగరంలో ఒక ఫ్లాట్ కొని, ఎదురుగా ఉన్న స్కూల్లో వాళ్ళని చేర్పించాడు. వారితో పాటు ఉండి వండి పెట్టడానికి పల్లె నుంచి తన తల్లిదండ్రులను తీసుకొచ్చాడు. ఒక్క కొడుకు మాట కాదనలేక ఫ్లాట్‌కు వచ్చి చేరిన పెద్దవారు కొన్ని నెలల్లోనే బాగా డీలా పడ్డారు. కొడుకు బలవంతం మీద పొలము, ఇల్లు అమ్మి ఫ్లాట్‌లో శాశ్వత బందీలైనారు. రెండే సంవత్సరాల్లో రక్తపోటు ఎక్కువై మెదడులో రక్తస్రావం వల్ల తల్లి కాలం చేశారు. తర్వాత 8 నెలల్లో మతిమరుపు ఎక్కువై మంచం పట్టి తండ్రి కూడా మరణించారు.

ఈ సంగతులు అందరికీ అన్వయిస్తాయి అని చెప్పలేకపోయినా వీటివల్ల కొన్ని విషయాలు గ్రహించవచ్చు. పెద్దవారికి తమ జీవనం ఎలా గడుపుకోవాలనే విషయం వారికే విడిచిపెట్టడం మంచిది. కుటుంబంలోని ఇతరులతో కలిసి జీవించడం కుదరనప్పుడు, వారికిష్టమైన ఇంట్లోనో, వృద్ధాశ్రమాలలోనో వాళ్ళుండడానికి వీలుండాలి. పెద్దవాళ్ళు ఈ మూడింటిలో ఎక్కడ సుఖంగా ఉంటారో అనే విషయం గురించి కొన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ స్పష్టమైన జవాబింకా దొరకడం లేదు. ఇచ్ఛానుసారం ఒంటరిగా ఉండేవారు లేదా వృద్ధాశ్రమాల్లో ఉండేవారు సంతోషంగా ఉండొచ్చు, అనివార్య పరిస్థితులలో పిల్లలతో కలిసి ఉండేవారూ సంతోషంగా ఉండొచ్చు లేదా ఈ మూడు సందర్భాల్లోనూ అసంతృప్తితో ఉండొచ్చు.

పెద్దవాళ్ళు తమ ఊరిలో, తమ ఇంట్లోనే ఉండాలనుకుంటే తగిన ఏర్పాట్లనన్నిటినీ చేయడం మంచిది. గ్రౌండ్ ఫ్లోర్ లోనే అన్ని వసతులనూ ఏర్పరచడం, నేల మీద జారకుండా ఉండేలా ఫ్లోర్ నాణ్యతను మెరుగుపరచడం, పట్టుకొనేందుకు ఏదైనా ఆధారం ఉండేలా గోడల మీద అవసరమైన చోట్ల రాడ్స్, హేండిల్స్ ను ఏర్పాటు చేయడం, శౌచాలయాన్ని దగ్గరలో ఏర్పాటు చేయడం, ఇంట్లో తగినంత వెలుతురు ఉండేలా చూడడం, విద్యుత్ పరికరాలను, స్విచ్ బోర్డులను, ఫోన్ లను చేతికందే దూరంలో పెట్టించడం మొదలైన వసతులు చేసి ఇవ్వడం ద్వారా వారి జీవనయానం సులభతరం అయ్యేలా చేయవచ్చు. వారి ఆందోళనను తగ్గించడానికి అనుక్షణం వారి కాంటాక్ట్‌కి దొరికేలా ఉండడం చాలా ముఖ్యము. దూరంగా నివసిస్తూ, అప్పుడప్పుడు వారిని కలిసే వీలు లేని పక్షంలో క్రమం తప్పకుండా వారిని ఫోన్‌తో కాంటాక్ట్‌లో ఉండాలి. దానికి  ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొనవచ్చు.  వైద్యులు, కావలసిన చోటికి తీసుకెళ్ళగల వాహన చోదకులు, రోజువారీ పనులలో సహాయం చేయగల పనివారు సదా వారికి దొరికేట్టు ఏర్పాటు చేయాలి. మతిమరుపు వంటి మెదడు వైఫల్యాలున్న వారిని, ఇతర జబ్బులున్నవారిని ఎప్పటికప్పుడు యోగక్షేమాలు విచారించే మనుష్యులను ఏర్పాటు చేయాలి. వృద్ధాశ్రమాల్లో ఉండాలనుకునేవారు అధికారిక నమోదు ఉన్న, సురక్షితమైన సంస్థల గురించి తెలుసుకొని చేరాలి.

కుటుంబం వల్ల నిర్లక్ష్యం చేయబడినటువంటి లేదా హింసకు గురైనటువంటి పెద్దవాళ్ళ రక్షణకోసం The Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 అనే చట్టం అమలులో ఉంది. సొంత ఆదాయం లేని పెద్దవాళ్ళు తమ పిల్లలు/మనవల ద్వారా లేదా తమ ఆస్తికి వారసులైనటువంటి వారి ద్వారా రూ. 10,000 వరకు నిర్వహణ మొత్తాన్ని పొందగలిగేలా ఈ చట్టంలో అవకాశముంది. section 24 ప్రకారం బాధ్యులైన వారు పెద్దవారి బాధ్యతను తొలగించుకోవాలని ప్రయత్నిస్తే వారికి మూడు నెలలు జైలుశిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధింపబడుతుంది. section 23 ప్రకారం బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చి ఆస్తిని పొందినవారు హామీ నెరవేర్చకపోతే, ఆస్తిని తిరిగి తీసుకునే అవకాశం పెద్దవాళ్ళకు ఉంటుంది. ఈ చట్టం కింద, పెద్దవాళ్ళ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రతి ఒక సబ్ డివిజన్  ఆఫీస్ లోనూ అసిస్టెంట్  కమీషనర్ నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.

స్వాతంత్ర్యం లభించకముందున్న దుస్థితిలో చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు, ఏ అవకాశాలు పొందని ఆ తరం ఇప్పుడు పెద్దవయసులో ఉన్నారు. వారి శేషజీవితం మిగిలిన కొన్ని సంవత్సరాలు సుఖమయమూ, సురక్షితమూ అయ్యేలా గ్యారంటీ ఇవ్వాల్సినది ఆధునిక భారతం యొక్క బాధ్యత. పాత – కొత్త తరాల పేచీలలో చిక్కి వేదనకు గురయ్యే పెద్దవాళ్ళకు ప్రభుత్వమే సకలసౌభాగ్యాలు సమకూర్చాల్సి ఉంటుంది.

కన్నడ మూలం: శ్రీనివాస కక్కిలాయ
అనువాదం: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

Exit mobile version