[లత కందికొండ గారు రచించిన ‘పైళ్ళైన కొత్తల్లో..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“వచ్చేసేరా! మీకోసమే చూస్తున్నాను. ఈ రోజు ఏమిటో చెప్పుకోండి?” ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికొచ్చిన హరీష్‌ని అడిగింది హరిత.
తెల్లమొహం వేసిన హరీష్‌ని చూసి – “నాకు తెలుసు, మీ మగాళ్ళకి ఇలాంటివేం గుర్తుండవని. మనకి పెళ్ళయి ఈ రోజుకి సరిగ్గా నెల అయ్యింది, అందుకే మీకోసం ఈ షర్ట్ తీసుకున్నాను. ఎలా ఉంది?” అనడిగింది.
‘ఏంటీ! తన పెళ్ళై కేవలం నెలరోజులే అయ్యిందా? మరి తనకేంటి, ఎన్నో ఏళ్లు గడిచిపోయినట్లు ఆనిపిస్తోంది?’ అని మనసులో అనుకుంటూ “ అరే! చాలా బాగుంది! ఎంతకి కొన్నావు?” అనడిగేడు.
“నాకు తెలుసు, మీకు నచ్చుతుందని. షాప్ కెళ్ళగానే డిస్ప్లేలో పెట్టిన ఈ షర్ట్ చూసి, చాలా నచ్చి, ఎంతని అడిగితే, ఈ షర్ట్‌కి విడిగా వెలకట్టడం కుదరదని, ఒక చీర చూపించి – 25వేలు పెట్టి ఈ చీర కొన్న వాళ్ళకే మాత్రమే ఆ షర్ట్ ‘బహుమానం’ గా ఇస్తామనీ చెప్పేరు. మీకా షర్ట్ చాలా నప్పుతుందని అనిపించడంతో, ఫ్రీ గా వస్తున్న షర్ట్ ఎందుకు వాడులుకోవాడమని చెప్పి ఈ చీర కొనక తప్పలేదు” అంటూ పక్కనే కుర్చీలో పెట్టిన చీర తీసి చూపించి, సదరు చీర, తనకోసమేదో ‘త్యాగం’ చేసి కొన్నట్లుగా చెప్తూ “త్వరగా ఫ్రెష్ అయి రండి, కేక్ కట్ చేద్దాం” అంటున్న భార్యని, ఏమనాలో తెలియక, రెస్ట్ రూమ్ వైపు నడిచేడు హరీష్.
***
ఆ మర్నాడు –
ఆఫీస్‌లో – లంచ్ టైమ్‌లో కలుసుకున్న తన బాల్యమిత్రుడైన సురేష్‌తో – ముందురోజు హరిత తనకి 25 వేలు బొక్కపెట్టిన ఉదంతమంతా చెప్తూ, “ఈ ఆడాళ్ళంతా పెళ్లయ్యేక ఇలాగే మన పర్స్‌కి కన్నమేస్తారా?” అని అడిగేడు.
అంతా విన్నసురేష్ నవ్వి “నువ్వింకా అదృష్టవంతుడివి. మా ఆవిడ పెళ్ళైన కొత్తలో ‘వారోత్సవాలు’ కూడా చేసుకుంది.” అన్నాడు.
“అంటే..?” అమాయకంగా అడిగేడు హరీష్.
“అంటే.. మా ఆవిడ ఒకరోజు – ఈ రోజు మనకి పెళ్లై సరిగ్గా ‘వారం’ రోజులైంది తెలుసా! అందుకే ‘అమెజాన్’లో మీ కోసమని ఈ షర్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో నా కోసం ఈ చీర, తెప్పించేను. మిమ్మల్ని ‘సర్ప్రైజ్’ చేద్దామని ఈ విషయం మీకు ముందు చెప్పలేదు. బాగున్నాయా?” అంటూ ఎంతో సంబరంగా ఆవిడ గారు కొన్న బట్టలు చూపిస్తూ అడిగింది. బిల్ ఎంతైందని మాత్రం అడగక!” అన్నాడు సురేష్.
“మరి నువ్వేం అనలేదా?” ఆశ్చర్యంగా అడిగేడు హరీష్.
“అది ‘పెళ్ళైన కొత్త’ – ఏమంటాను? చాలా బాగుందనక తప్పలేదు. కొన్నాళ్ళైన తరువాత, నెమ్మదిగా, ఈసారినుండి ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం కాకుండా, మనమే అలా సరదాగా బైటకెళ్ళి కొనుక్కుంటే బాగుంటుంది కదా! ఆన్లైన్లో ఒక్కోసారి మనం ఆర్డర్ ఇచ్చినది ఒకటైతే, వాళ్ళు పంపేది మరొకటవుతుందని నచ్చజెప్పి, ఆ తర్వాత మెల్లిగా మంచి మాటలతో సర్ది చెప్పి, ఆ కార్యక్రమాన్ని, ‘వారం’ నుండి ‘నెల’ కోసారి తీసుకునేలా చేసేను.”
“అంటే, ఈ ‘నెలోత్సవాలు’ నాకు కూడా తప్పవంటావా?” నీరసంగా అడిగేడు హరీష్.
హరీష్ వైపు అదోలా చూసిన సురేష్, వేదాంతిలా నవ్వి, “స్వీయానుభవంతో నీకు కొన్ని విషయాలు చెప్పనా? ఆడవాళ్ళు చీరలు కొనుక్కోవడానికి, ఫలానదంటూ ‘సమయం – సందర్భం’ ఏదీ అక్కర్లేదు. మా ఆవిడైతే – తన ‘దేశభక్తి’ చాటుకోవాలన్నట్లు ‘ఇండిపెండెన్స్ డే’ కీ, ‘రిపబ్లిక్ డే’ కీ కూడా చీరలు కొనుక్కుంటుంది. నువ్వింకా ఈ విషయంలో ‘నెల బాలుడివి’ కాబట్టి చెప్తున్నాను, విను! పెళ్ళి- సంసారం అంటే, ఏదో సర్దుకపోవడం, ఇచ్చిపుచ్చుకోవడమంటారు గానీ, ఇక్కడ సర్దుకుపోవడం, ఇచ్చి పుచ్చుకోవడం లాంటివేవీ ‘సదరు మొగుడిగాడి’ కి ఉండవు, అన్నీ వాడే సర్దుకుని, వాడే – అంటే ఆ మొగుడు గాడే. అంటే ఇక్కడ ‘మనమే’ ఇచ్చుకోవాలి. మనమే సర్దుకు పోవాలి. మనం ఇవ్వకపోతే వాళ్ళే తీసేసుకుంటారు. కాబట్టి, వాళ్ళు అడక్కుండా మనమే ‘సర్వహక్కులూ’ వాళ్లకి ఇచ్చేసి, మాట దక్కించుకోవడం మేలు. చిన్నప్పుడు మనం ‘వేమన’ పద్యాల్లో ‘చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ.. ఇంటిలోని పోరు ఇంతింత గాదయా..’ అని ఓ పద్యం చదువుకున్నాం, గుర్తుందా? అలాగ, ఇంట్లో వాళ్ళ పోరు భరించాలంటే, ఇక్కడ మనకి ‘ఈగో’, ‘తొక్కా, తోలూ’ లాంటివి అడ్డొచ్చి, గొడవ పడినా మనం వాళ్ళతో గెలవలేం. మా ఆవిడా, నేనూ ఎప్పుడూ అలాగే సర్దుకుపోతూంటాం. ఎలాగంటే – ఇటీస్ వెరీ సింపుల్. తప్పు ఇద్దరిలో ఎవరిదైనా, తనతో గొడవ పడలేక, నాదేనని ఒప్పుకుంటాను. మా ఆవిడ నాతో ఏకీభవిస్తుంది. కాబట్టి మా మధ్య ఎలాంటి గొడవలూ జరగడానికి ఆస్కారమే లేదు.
చాలాసార్లు నాకు ఏమనిపిస్తుందో చెప్పానారా? ఈ అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు,’మేరేజ్ బ్యూరో’ ల్లాంటివి కూడా నడిపితే ఎంత బాగుంటుందని. వాళ్ళ పాలసీ ప్రకారం, రెండు వారాల్లో, ఒక్కోసారి 30 రోజుల్లో, వాళ్ళ ద్వారా కుదిరిన అమ్మాయి, మనకి నచ్చకపోతే, కారణాలడక్కుండా, వాళ్ళే వెనక్కి తీసేసుకుంటారు కదా! అని. అయినా నా పిచ్చి గానీ, ఇలాంటి పద్ధతే ఉంటే.. 90 పర్సెంట్ మగాళ్లు సేవ్ అయిపోయేవారు కదా! అందుకే, వాళ్ళకీ తెలుసు, మార్కెటింగ్ టెక్నాలజీ. ‘రిస్క్’ ఎక్కడ ఉంటుందో, వాటి జోలికి వెళ్లరు.
నీకింకో సంగతి చెప్పనా? ఒకరోజు దేవుడు మనలాంటి ఓ భార్యాబాధితుడి మొర విని, ప్రత్యక్షమై, ‘సదరు మనిషి’ మెమొరీ మొత్తం డిలీట్ చేసి, ఆ మనిషిని అడిగాడట ‘నీకు ఏమైనా గుర్తుందా ఇప్పుడు’, అని. వెంటనే అతడు ‘తన భార్య పేరు’ చెప్పేసరికి, సిష్టం అంతా ఫార్మాట్ చేసినా గానీ ‘వైరస్’ మాత్రం వదలలేదంటే, నేను కూడా చేయగలిగిందేమీ లేదంటూ మాయమైపోయేడట.
అయినారా! ‘పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి’ అని ఏదో గొప్పగా అంటారు గానీ, అదంతా ఒట్టిమాట. అగ్నిపర్వతాలు ఎలా బద్దలవుతాయో,, సునామీలు విధ్వంసం ఎలా సృష్టిస్తాయో, తుఫాన్లు వస్తే చెట్లు ఎలా ఊగుతాయో – వాటికి ఎవరూ పాఠాలు నేర్పరు. అవన్నీ సహజసిద్దంగా ఎలా జరిగిపోతాయో – ఈ ‘పెళ్లితంతు’ కూడా అంతే! మగాడికి ఎలాంటి భార్య వస్తుందో, ఆ వచ్చిన భార్య ఎప్పుడు, ఎలా బిహేవ్ చేస్తుందో కూడా ఎవరూ చెప్పలేరు. ‘ప్రమాదాలు’ అలా సహజంగా జరిగిపోతాయంతే!” అంటూ ఓదార్చేడు హరీష్‌ని, నీకిది తప్పదన్నట్లుగా.
***
అంతకు రెండు రోజుల క్రితం –
సురేష్ భార్య – గీత – హరితకి ఫోన్ చేసి, ఇలా ప్రతీ నెలా, కొత్త చీర కొనుక్కుని పండగ చేసుకోవాలని నీకు చెప్పింది నేనేననీ, ఇంకా షాపింగ్‌కి నిన్ను తీసుకెళ్ళింది కూడా నేనేననీ, హరీష్‌కి చెప్తావేమో! పొరబాటున కూడా ఇలాంటి విషయాలు, ఇటు మా ఆయనకీ గానీ, అటు మీ ఆయనకి గానీ తెలియకూడదు. ‘ఇలాంటి విషయాలు మగాళ్ళకి తెలియకూడదనీ, మన రహస్యాలు మన మధ్యలోనే ఉండిపోవాలనీ, నా ‘పెళ్ళైన కొత్త’లో మా అక్క నాకు చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ‘పెళ్ళైన కొత్తలోనే’, మొగుళ్ళని మనం లొంగదీసుకోవాలనీ, లేకపోతే మనల్ని వాళ్ళు పట్టించుకోరనీ మా అక్క నాకప్పుడు అంతగా చెప్పబట్టే, మా ఇంట్లో ఇప్పుడు, అంతా నాదే రాజ్యం అనుకో! నేనేం చెప్పినా సురేష్ కాదనడు తెలుసా!” అంటూ ‘భగవద్గీత’లో కృష్ణుడు, అర్జునుడుకి చెప్పినట్లు ‘గీతోపదేశం’ చేసింది.
హరితకి ‘నెలోత్సవం’ ఎలా జరుపుకోవాలో సలహా ఇచ్చి షాపింగ్ చేయించినది సుధేనని, ఇంకా తక్కిన విషయాల్లో కూడా హరితకి ఎప్పటికప్పుడు ఎలా మసలుకోవాలో కూడా చెప్పి, సదరు సలహాలు ఇచ్చేదీ సుధేననీ – ఇటు హరీష్‌కి గానీ, అటు రమేష్‌కి గానీ – అప్పటికీ, ఇప్పటికీ తెలియదు. ఎప్పటికీ తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య జరిగిన ‘రహస్య ఒప్పందం’ మరి! ఈ విషయం పొరబాటునైనా బయట పడితే సురేష్-హరీష్ ల ‘స్నేహబంధం’ ఏమవుతుందో – ప్చ్! పాపం!
