కడుపున నా బాబు పడ్డాడు
ఆశల తోరణాలు
ఆనాడే కట్టాను
ఎదుగుతున్న వాడిని చూసి
ప్రేమ పునాదులు త్రవ్వాను
చదువు కుంటానమ్మా అనటం విని
ఆనంద హర్మ్యాలకి
నా చెమటను ధారపోసా!
ఆ నదిలో వాడు
సంతోష తరంగాలలో
మునిగి తేలుతూ
విద్యకు తిలోదకాలిచ్చి
పనికిరానివాడిలా
నా ముందు నిలబడ్డప్పుడు
భవిష్యత్తును
వానజల్లు తుడిచేసింది
నా కోరిక, కష్టం
ఆదిలోనే పెరగని మొక్కలా
మిగిలిపోయింది
నా అనుభవం
మీకో గుణపాఠం కావాలి
కొడుకులున్న తల్లులూ
తస్మాత్ జాగ్రత్త!
అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100.
శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల ‘విలువల లోగిలి’ ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు’ సీరియల్ అందులోనే వచ్చింది.