Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘పిరదౌసి’ పద్యశిల్పం

[జాషువ గారి జయంతి సందర్భంగా ‘పిరదౌసి’ కావ్యాన్ని విశ్లేషిస్తున్నారు శ్రీ కొమ్మవరపు విల్సన్‌రావు.]

ఒక అక్షర శిల్పి ఆత్మగౌరవానికి, అహంకారపూరిత అధికార గర్వానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంఘర్షణకు జాషువ ‘పిరదౌసి’ కావ్యం అద్దం పడుతుంది.

జూలై 1993లో హేమలతా లవణం గారి ద్వారా నాలుగవ ముద్రణగా వచ్చిన ‘పిరదౌసి’ కావ్యంలోనూ, విశాలాంధ్ర ప్రచురణల సంస్థ వారు ప్రచురించిన జాషువ రచనలు రెండవ సంపుటంలోనూ ‘పిరదౌసి’ కావ్యం మూడు భాగాలుగానే ఉంది. కానీ, మనసు ఫౌండేషన్ వారు ప్రచురించిన జాషువ సర్వలభ్య రచనల సంకలనంలో ఈ కావ్యం నాలుగు భాగాలుగా ముద్రింపబడి ఉంది. అంటే మూడవ భాగాన్ని రెండుగా విభజించి నాలుగు భాగాలుగా చేశారు. మనసు ఫౌండేషన్ ముద్రణ ప్రకారం ఈ నాలుగవ భాగంలో చోటుచేసుకున్న నలభై ఒక్క పద్యాలలో పద్నాలుగు కంద పద్యాలు, పదకొండు తేటగీతి, మిగతావి ఉత్పలమాల, శార్దూలం, సీస పద్యాలు, చంపకమాల మొదలైనవి ఉన్నాయి.

ముఖ్యంగా ఈ కావ్యంలోని నాలుగవ భాగం (చతుర్ధాశ్వాసం) కథా గమనంలో అత్యంత కీలకమైనది. సామాజిక ప్రయోజనం ఆశించి, సాధారణ మానవుడి ఆలోచనకు అందనంత ఎత్తులో కవితాత్మక బింబాలను సృష్టిస్తూ, పాఠకుల గుండెల్లో సరికొత్త ఆలోచనల చైతన్యాన్ని రగిలించిన ఈ పద్నాలుగు కంద పద్యాల కథా రసాన్ని వరుస క్రమంలో ఆవిష్కరించడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

పూర్వరంగంలోకి వెళితే, పారశీక కవులలో అత్యంత శ్రేష్ఠుడైన పిరదౌసి కవిని గజనీ మహమ్మదు పిలిపించి, షానామా(రాజుల చరిత్ర) అనే గ్రంథాన్ని రాసి నాకు అంకితమిస్తే, నువ్వు రాసే ప్రతి పద్యానికి ఒక బంగారు దీనారము చొప్పున ఇస్తాను అని రాజు వాగ్దానం చేశాడు. అందుకు కవి అంగీకరించాడు, గ్రంథ రచనను ప్రారంభించాడు. ముప్పై సంవత్సరాల పాటు కష్టపడి, అరవై వేల పద్యాలతో ఆ గ్రంథాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజసభలో అందరి ముందు దానిని చదివి వినిపించాడు. అక్కడి కవులు, పండితులు అతని కవితా నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. పిరదౌసి ఆ గ్రంథాన్ని రాజుకు సమర్పించి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

అయితే, ఆ అరవై వేల పద్యాలకు బంగారు నాణేలు ఇస్తానన్న రాజుగారు..తన భటులచే వెండి నాణేలను పంపించడంతో వాటిని తిరస్కరిస్తూ, రాజుగారి లోభత్వాన్ని నిందిస్తూ పిరదౌసి పద్యాలు రాసి రాజుగారికి పంపిస్తాడు. దీనితో గజనీ మహమ్మదు తీవ్ర ఆగ్రహానికి లోనై, ఆ కవిని పట్టుకుని చంపేయమని తన భటులను ఆజ్ఞాపించాడు. విషయం తెలుసుకున్న పిరదౌసి తన భార్యాపిల్లలతో కలిసి గజనీ నగరాన్ని విడిచి, తన సొంత ఊరైన తూసు పట్టణానికి వెళ్ళి తలదాచుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నో కష్టాలు పడుతూ అడవులను దాటి, కొన్ని రోజులకు పారశీక దేశం చేరుకుని అక్కడ నివసించసాగాడు.

తనను విమర్శిస్తూ పిరదౌసి రాసిన పద్యాలను చదివి తీవ్ర ఆగ్రహానికి లోనైన సుల్తాన్ ఆజ్ఞతో, క్రూరమైన సైన్యం కవిని బంధించడానికి కదిలిన తీరుతో ఈ నాలుగవ భాగపు కథా ఘట్టం ప్రారంభమవుతుంది.

సుల్తాన్ గజనీ మహమ్మదు ఆగ్రహానికి గురైన పిరదౌసి సకుటుంబంగా దేశం విడిచి వెళ్ళడం, ఆ తర్వాత సుల్తాన్ పశ్చాత్తాపపడి ధనాన్ని పంపడం, కానీ ఆ ధనం చేరేసరికే కవి శవం స్మశానానికి తరలిపోవడం వంటి అత్యంత రసవత్తరమైన, విషాదభరితమైన ఘట్టాల పద్యాలు ఇందులో చదవవచ్చు.

అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ కావ్యంలోని నాలుగవ ఆశ్వాసంలో కంద పద్యానికి జాషువ ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది. సాధారణంగా సుదీర్ఘమైన వర్ణనలకు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం వంటి పెద్ద వృత్త పద్యాలు పనికొస్తాయి. కానీ, కథలో వేగాన్ని పెంచాలన్నా, ఒక నాటకీయమైన మలుపును లేదా ఆకస్మికమైన సంఘటనను చకచకా వివరించాలన్నా కంద పద్యం అత్యంత అనుకూలమైనది. ఈ ఆశ్వాసంలో కథ అత్యంత వేగంగా, నాటకీయమైన మలుపులతో సాగుతుంది. ఇటువంటి ఉద్వేగభరిత ఘట్టాలను నడిపించడానికి మహాకవి జాషువ కంద పద్యం అనే ఛందోరూపాన్ని అమితమైన ప్రాధాన్యతతో ఎంచుకున్నారనిపిస్తుంది.

‘కంద పద్యము రాయని కవి కవే కాదు’ అనే నానుడిని సార్థకం చేస్తూ, అనవసరమైన సుదీర్ఘ వర్ణనలకు తావులేకుండా, కథలోని ఆవేదనను, ఆక్రోశాన్ని సూటిగా పాఠకుల మనసులకు హత్తుకునేలా చేయడానికి కంద పద్యం ఎంతో దోహదపడింది. రాజుగారి క్రూరమైన ఆజ్ఞ, సైన్యం కదలడం, కవి పలాయనం, కుమార్తె నిరసన వంటి వేగవంతమైన సంఘటనలను కేవలం నాలుగు పాదాల చిన్న కంద పద్యంలో ఇమడ్చడం వల్ల కథకు ఒక అద్భుతమైన నడక, నాటకీయత లభించాయి. జాషువ ఇక్కడ సుల్తాన్ ఆగ్రహం, కవి పలాయనం, రాజు పశ్చాత్తాపం వంటి నాటకీయ ఘట్టాలను వేగంగా నడిపించడానికి, అలాగే కవి ఆత్మఘోషను సూటిగా గుండెలకు హత్తుకునేలా చెప్పడానికి కంద పద్యాలను ఎంచుకుని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది.

తీవ్ర ఆగ్రహానికి లోనైన సుల్తాన్ ఆజ్ఞతో క్రూరమైన సైన్యం కవిని బంధించడానికి కదిలిన తీరుతో ఈ ఘట్టం ప్రారంభమవుతుంది. మొదటి పద్యం చూడండి:

అట గజనీ సులతానుని
భటాళి పిరదౌసి కవిని బట్టుకొనుటకై
చటుల కరవాలకరముం
గుటిలముఖం బగుచు గదలె గుఱ్ఱాలపయిన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.414)

రాజుగారి క్రోధాగ్నిని భరిస్తూ, చేతుల్లో కదులుతున్న భయంకరమైన కత్తులతో, ముసుగు ముఖాలతో రాజభటులు కొండలు కోనలు దాటుకుంటూ కవిని వేటాడటానికి బయలుదేరారు. ఈ పద్యంలోని ‘ట’కార ప్రాస భటుల క్రూరత్వాన్ని కళ్లకు కడుతుంది.

ఇలా ఉగ్రరూపంతో కదిలిన సామ్రాజ్య సైన్యం, నిరాయుధుడైన కవి నివసించే ఆ నిరుపేద గృహాన్ని చుట్టుముట్టినప్పుడు అక్కడి సామాన్య ప్రజలు పొందిన ఆవేదన తర్వాతి పద్యంలో హృదయాల్ని కదిలిస్తుంది:

ఒక పేదవానిఁ జంపుట
కకటా, అశ్వికదళంబులా! యని పౌరు
ల్చకితులయి చూడఁ జనిక్ర
మ్ముకొనిరి తచ్చూన్యగేహమును రాజభటుల్
(జాషువ సర్వలభ్య రచనలు పు.414)

ఈ పద్యంలో మహాకవి గుర్రం జాషువ నిరంకుశ అధికార అహంకారానికి, నిరుపేద అక్షర శిల్పి ఆత్మగౌరవానికి మధ్య గల వైరుధ్యాన్ని అత్యంత నాటకీయమైన శిల్పంతో ఆవిష్కరించారు. వాగ్దాన భంగాన్ని నిరసిస్తూ పద్యాలు రాసినందుకు గాను, ఆయుధం లేని ఒక పేద కవిని అంతమొందించడానికి సామ్రాజ్యపు అశ్వదళాలు తరలిరావడం చూసి నగర పౌరులు భయాశ్చర్యాలతో ‘అకటా!’ అంటూ ముక్కున వేలేసుకుంటారు; ఆ మూగ నిరసనలోనే పాలకుల పిరికితనం, దౌర్జన్యం బోనులో నిలబడతాయి. ఇక ‘క్రమ్ముకొనిరి తచ్చూన్యగేహమును రాజభటుల్’ అంటూ కవి పద్యాన్ని ముగించిన తీరు ఒక అద్భుత తాత్విక శిఖరం. ముప్పై ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించిన ఆ సత్కవి సంపాదించుకున్నది ఒక్క ‘అక్షరం’ తప్ప దాచుకోవడానికి భౌతిక సంపదలు ఏమీ లేవు కనుకనే అది కేవలం మట్టి గోడలు మిగిలిన ‘శూన్య గేహము’ అయ్యింది. కవిని బంధించి చంపడానికి ఉరకలెత్తుతూ వచ్చిన రాజభటులు ఆయుధాలతో ముట్టడించగలిగింది ఆ భౌతిక శూన్యాన్ని మాత్రమే తప్ప, కవి సృష్టించిన అమరమైన అక్షర సంపదను కాదు. అక్షరం అనేది ప్రజల గుండెల్లో, ఆలోచనల్లో నిలిచే చిరంజీవి; దానిని ఏ సామ్రాజ్యపు సైన్యమూ దోచుకోలేదు, కొల్లగొట్టలేదు. చివరికి అధికార గర్వాన్ని వెక్కిరిస్తూ మిగిలిన ఆ శూన్య గృహమే, అక్షర తేజం ముందు నిరంకుశ పాలన ఎంతటి నిస్సహాయమైనదో నిరూపించే సజీవ సాక్ష్యంగా నిలిచింది.

అయితే, రాజభటులు ఇల్లు ముట్టడించే సమయానికే పిరదౌసి తన కుటుంబంతో కలిసి అడవుల పాలు కాగా, సత్కవిని ప్రకృతి మరియు దైవశక్తి కలిసి ఎలా కాపాడాయో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది:

పిరదౌసి యీశ్వరస్తుతి
నెఱపిన వనభూమి శత్రునేత్రంబులకున్
మఱుఁగుపడియెనొ మరేమొ,
యరిదళములు తొలగి నడచె నపమార్గమునన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.414)

దైవభక్తి కలిగిన ఆ సత్కవి నిరంతరం సాగించిన ఈశ్వర ప్రార్థన ప్రభావం వల్లనో ఏమో కానీ, ఆయన దాక్కున్న ఆ దట్టమైన వనభూమి శత్రువుల కళ్లకు కనబడకుండా మరుగున పడిపోయింది. దానితో ఆ రాజభటుల దళాలు కవి ఉన్న దారిని కనిపెట్టలేక తప్పుదారి పట్టి వేరే మార్గంలో వెళ్ళిపోయాయి. ప్రకృతి, భగవంతుడు కలిసి సత్కవిని కాపాడిన విధానం ఇందులో అద్భుతంగా ఆవిష్కృతమైంది.

ఇలా అడవుల్లో తప్పించుకున్న కవిని ఎలాగైనా బంధించాలనే కక్షతో, సుల్తాన్ తన అధికార గర్వాన్ని ప్రదర్శిస్తూ జారీ చేసిన తదుపరి క్రూరమైన ఆజ్ఞా పరంపర ఈ పద్యంలో వ్యక్తమవుతుంది:

పిరదౌసికవికి నెవ్వడు
శరణం బిడు నతడు నాకు శాత్రవుడగు నం
చురు కార్పణ్య మెలర్పగ
ఫరమానా లిచ్చి చాటబనిచె నృపులకున్
(జాషువ సర్వలభ్య రచనలు పు.445)

పిరదౌసికి ఎవరైనా సరే ఆశ్రయం ఇస్తే, వారు తనకు శత్రువులవుతారని సుల్తాన్ ప్రకటించాడు. తన మనసులోని ఈర్ష్యాద్వేషాలను ప్రదర్శిస్తూ, సామంత రాజులందరికీ హెచ్చరికలు పంపుతూ ఆజ్ఞాపత్రాలను జారీ చేసి దేశమంతటా చాటింపు వేయించాడు. ఒక రాజు ఒక కవిపై ఇంతటి కక్షను పెంచుకోవడంలోని నీచత్వాన్ని జాషువ ఇందులో సూటిగా ఎండగట్టారు.

ఈ భయానక చాటింపులను విన్న తర్వాత, రాజ్యంలో కేవలం క్రూరత్వమే కాకుండా ధర్మాన్ని ఆలోచించే బుద్ధిమంతులు కూడా ఉన్నారని నిరూపిస్తూ, సామంత రాజుల అంతఃపురాలలో జరిగిన సదుద్దేశపూర్వక ఆలోచనలు ఈ క్రింది పద్యంలో చోటుచేసుకున్నాయి:

సామంత భూమిపాలుర
లో మంచియుఁ జెడ్డ నింత లోదలఁచు లస
ద్ధీమంతులు కొంద రది విని
సామోక్తుల వ్రాసి రిట్లు సందేశంబుల్
(జాషువ సర్వలభ్య రచనలు పు.445)

ఆ సామంత రాజులలో మంచి చెడులను వివేచించగల బుద్ధి కుశలత కలిగిన కొందరు పండితులు, రాజుగారి ఆజ్ఞను విని ఎంతగానో నొచ్చుకున్నారు. ఒక గొప్ప కవిని ఇలా వేధించడం తగదని భావించి, సుల్తాన్ మనసును మార్చడం కోసం ఎంతో శాంతియుతమైన, హితవు పలికే మంచి మాటలతో కూడిన సందేశాలను రాసి ఆయనకు పంపించారు.

ఆ సామంత రాజులు సుల్తాన్ గజనీ మహమ్మదుకు పంపిన ఆ పవిత్ర సందేశాలలోని మొదటి ముఖ్యమైన, నిష్కర్షమైన హెచ్చరిక ఈ పద్యంలో ప్రతిధ్వనిస్తుంది:

కవి శాశ్వతుఁ డుర్వర నా
రవితారముగా వసించు రాజా! మీరో
కవితాకన్యకు పతు లా
రవితారముగా సహింతురా యపకీర్తుల్
(జాషువ సర్వలభ్య రచనలు పు.446)

“ఓ రాజా, ఈ భూమిపై కవి ఎప్పుడూ శాశ్వతుడు, సూర్యచంద్రులు ఉన్నంత కాలం అతని కీర్తి నిలిచే ఉంటుంది. కానీ మీరు కేవలం కవితాకన్యను పోషించాల్సిన ప్రభువులు మాత్రమే. ఒకవేళ మీరు ఆ కవిని అన్యాయంగా వేధిస్తే, లోకంలో మీకు మిగిలే ఆ శాశ్వత అపకీర్తిని మీరు సహించగలరా?” అని వారు రాజును నిలదీశారు. అధికారం తాత్కాలికమని, అక్షరం శాశ్వతమని గుర్తు చేసిన ఘట్టం ఇది.

అధికార తాత్కాలికతను గుర్తు చేసిన సామంత ప్రభువులు, ఆ తర్వాత పద్యంలో రాజుగారికి ఆయన చేసిన వాగ్దాన భంగాన్ని, లోభత్వాన్ని ఎంతో తార్కికంగా ప్రశ్నిస్తారు:

షానామా గ్రంథంబునను
భూనాయక, మేలిరత్నములు గలవు గదా!
వానికి నై యఱువది వే
ల్దీనారము లీయ వెనుక దీయుట తగవే?
(జాషువ సర్వలభ్య రచనలు పు.446)

“ఓ రాజా, పిరదౌసి రాసిన ఆ షానామా అనే గ్రంథంలో మేలిరకపు రత్నాల్లాంటి అమూల్యమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి కదా, అలాంటి గొప్ప గ్రంథానికి గాను మీరు ముందుగా వాగ్దానం చేసిన అరవై వేల బంగారు నాణేలను ఇవ్వడానికి ఇప్పుడు వెనుకడుగు వేయడం ఏమాత్రం తగదు” అని వారు రాజు యొక్క లోభత్వాన్ని నిరసించారు. కవిత్వానికి ఉన్న విలువను గుర్తు చేస్తూ, రాజుగారు చేసిన వాగ్దాన భంగాన్ని వారు తప్పుబట్టారు.

రాజధర్మాన్ని, కళల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని హెచ్చరిస్తూ, కవిత్వం ద్వారా రాజుకు లభించే శాశ్వతమైన కీర్తిని వివరిస్తూ సాగిన ఆ హితోపదేశ స్రవంతిలోని ముగింపు భావం ఈ పద్యంలో ఎంతో రమ్యంగా ఆవిష్కరించబడింది:

మీరు కళాపోషకులను
కీరితిఁ బోనాడఁ దగదు, కృతికన్యక బం
గారంబు మణులు గురిసెడు
క్ష్మారాజ్యవధూటికన్న, జక్కనిదిగదా?
(జాషువ సర్వలభ్య రచనలు పు.446)

“ఓ రాజా, సమాజంలో మీకు కళాపోషకులు అనే మంచి కీర్తి ఉంది. దానిని ఇలాంటి పనుల వల్ల పోగొట్టుకోవద్దు. పిరదౌసి మీకు అంకితమిచ్చిన ఆ గ్రంథం, బంగారాన్ని, రత్నాలను కురిపించే మీ రాజ్యలక్ష్మి కంటే కూడా ఎంతో అందమైనది, గొప్పది” అని వారు సుల్తాన్ మనసుకు నచ్చజెప్పారు. కవిత్వం ద్వారా రాజుకు లభించే శాశ్వతమైన గౌరవాన్ని గుర్తు చేస్తూ, లోభత్వాన్ని వీడాలని హితవు పలికారు.

ధర్మాన్ని ప్రబోధించిన ఆ వివేకవంతమైన మాటలు సుల్తాన్ అంతఃకరణను తాకగా, ఆయనలోని అహంకారం కరిగి పశ్చాత్తాపంతో కూడిన మానసిక స్థితిని అనుభవించిన నాటకీయ మార్పు ఈ క్రింది పద్యంలో వ్యక్తమవుతుంది:

ఆ వాక్యములు ధరాపతి
భావమునకు నచ్చి క్రోధభారచ్యుతుడై
కేవల పండితహోష్టిం
దావర్షత్రయము గడపెదా నస్థిరతన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.447)

ఆ హితబోధ మాటలు చక్రవర్తి మనసుకు ఎంతో నచ్చాయి. దాంతో ఆయన మనసును కమ్మేసిన అంతటి తీవ్రమైన కోపపు భారం ఒక్కసారిగా తొలగిపోయింది. ఆ తర్వాత ఆయన కేవలం విద్వాంసులు, కవులతో కూడిన సభలలో గడుపుతూ, తాను ఒక సత్కవికి అన్యాయం చేశాననే పశ్చాత్తాపంతో, మానసిక అస్థిరతతో మూడు సంవత్సరాలు గడిపాడు.

రాజులో వచ్చిన ఈ ఆత్మావలోకనం ఒక నిశ్చయానికి దారితీయగా, ఒకనాడు తెల్లవారుజామున చీకట్లు తొలగి వెలుగులు వస్తున్న ఆ ప్రశాంత సమయాన రాజుగారి మనసులో కలిగిన సద్బుద్ధి ఈ పద్యంలో చిత్రించబడింది:

ఒక వాసరముఖమున నిం
చుకయించుక కన్ను విచ్చి సూర్యుని కిరణ
ప్రకరముల ప్రాఙ్ముఖంబున
వికసించెడు వేళఁ గాకి ప్రేలెడువేళన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.447)

ఒక రోజు ఉదయాన్నే సూర్యుని కిరణాల సమూహాలు తూర్పు దిక్కున మెల్లమెల్లగా కన్నులు విచ్చుకుంటూ లోకాన్ని వికసింపజేస్తున్న ఆ మధురమైన వేళ, సుల్తాన్ మనసును కమ్మేసిన అజ్ఞానపు చీకట్లు కూడా తొలగిపోయి, కవి ఋణాన్ని తీర్చుకోవాలనే ఒక సద్బుద్ధి ఆయనలో ఉదయించింది.

అయితే, రాజుగారు పశ్చాత్తాపంతో ధనాన్ని పంపినప్పటికీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోగా, కవి కుమార్తె పలికిన ఆక్రోశం రాజు హృదయాన్ని ఎలా కలచివేసిందో ఈ క్రింది పద్యం రూపకాలంకారంతో ఆవిష్కరిస్తుంది:

ప్రత్యక్షరమున నశ్రుల్
ప్రత్యక్షము సేయుచున్న పద్యయుగము పె
న్వాత్య యగుచుఁ గలచెన్ భూ
పత్యగ్రణిహృదయ మనెడు వనజాకరమున్
(జాషువ సర్వలభ్య రచనలు పు.448)

పిరదౌసి కుమార్తె తిరస్కారంతో పాటు, ఆ కవి రాసిన పద్యాల్లోని ప్రతి అక్షరంలోనూ కన్నీళ్లు ప్రత్యక్షమవుతున్నట్లుగా ఉన్న పద్యాలు ఒక పెద్ద సుడిగాలిలా మారిపోయాయి. ఆ సుడిగాలి, ప్రభువులలో శ్రేష్ఠుడైన ఆ గజనీ మహమ్మదు హృదయమనే పద్మవనాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసి కలచివేసింది.

కవిత్వం యొక్క శక్తి రాజు యొక్క అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది.

రాజభటులు ఆ బంగారు నాణ్యాల రాశిని తీసుకుని వెళ్లే సమయానికి, ఆ అక్షర శిల్పి తన జీవిత చరమాంకంలో అనుభవించిన శారీరక, మానసిక క్షోభ తర్వాతి పద్యంలో ఎంతో కరుణరసార్ద్రంగా వర్ణించబడింది.

అట పిరదౌసికవియు న
ప్పటి కొక యేఁడాది నుండి పరిపూర్ణజరన్
జటులామయపీడితుఁడై
కటకట బడుచుండె బేదకాపురపు సిరిన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.448)

అప్పటికే ఆ మహాకవి సంవత్సరం కాలంగా వృద్ధాప్యంతోను, భయంకరమైన రోగ బాధలతోను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు నిరుపేద కాపురంలో అనుభవిస్తున్న దరిద్రం నడుమ ఆయన అనుభవిస్తున్న కష్టాలను చూసి ‘కటకట’ అంటూ జాషువ ఎంతో ఆర్ద్రంగా ఆవేదన చెందారు.

ఈ దైన్య స్థితిలోనే కవి ప్రాణాలు విడవగా, తండ్రి శవాన్ని స్మశానానికి తరలిస్తున్న వేళ ఆ యవ్వనవతి అయిన కుమార్తె నోట వచ్చిన హృదయవిదారకమైన ఆత్మగౌరవ ప్రస్తావన ఈ పద్యంలో కొండలను సైతం కరిగిస్తుంది. ఎలాగో చూడండి

కులగిరులు గరఁగి పోయెడు
పలుకులు దైన్యంబు చిందిపడఁ బలికె నొగిన్
చెలువమున వెలయు కవిసుత
యెలఁబ్రాయపుటింపు విడని మృదుకంఠార్తిన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.448)

ఎంతో అందమైన రూపం కలిగిన, ఇంకా లేత యవ్వనపు నిగారింపు వీడని ఆ కవి కుమార్తె, తన మృదువైన కంఠంలో నుంచి వస్తున్న తీవ్రమైన దుఃఖంతో, దైన్యం చిందేలా పలికిన ఆ మాటలు వింటే పెద్ద పెద్ద కొండలు కూడా కరిగిపోతాయి. తన తండ్రిని జీవితాంతం ఏడిపించిన ఆ ధనాన్ని నిరాకరిస్తూ ఆమె పలికిన పలుకులు వినేవారి గుండెలను పిండేశాయి.

ఒక సత్కవి ఆత్మగౌరవం ముందు సామ్రాజ్యపు నిధి తలవంచగా, ఆ ఘోరమైన వార్త విన్న సుల్తాన్ పశ్చాత్తాపంతో చేసిన ఆఖరి సార్థక ప్రయత్నంతో ఈ చారిత్రాత్మక ఘట్టం ముగుస్తుంది:

అని పశ్చాత్తప్తుండై
వనరి, యతనిపేరఁ దూసు పట్టణమునఁ జ
క్కనిసత్రశాల గట్టిం
చె నవాబుడు కవిఋణంబు చెల్లింపంగన్
(జాషువ సర్వలభ్య రచనలు పు.448)

కవి కుమార్తె ఆ ధనాన్ని తిరస్కరించిందని, కవి శవం స్మశానానికి వెళ్ళిపోయిందనే వార్త వినగానే సుల్తాన్ ఎంతగానో పశ్చాత్తాపపడి తీవ్రంగా దుఃఖిస్తూ, ఆ మహాకవి ఋణాన్ని తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.

అందుకోసం ఆ ధనంతో పిరదౌసి సొంత ఊరైన తూసు పట్టణంలో ఆయన పేరు మీద ఒక చక్కని సత్రంను కట్టించాడు. అధికారం చివరికి అక్షరం ముందు తలవంచిన తీరుతో కథ ముగుస్తుంది.

నేటి ఆధునిక సమాజానికి, కాలమాన పరిస్థితులకు జాషువ ‘పిరదౌసి’ కావ్యంలోని నాలుగవ ఆశ్వాసంలోని కంద పద్యాలు ఎంతో ప్రయోజనకరంగా, దిక్సూచిలా ఉపయోగపడుతున్నాయి.

భౌతికమైన సంపద, తాత్కాలికమైన అధికారం కంటే అక్షర రూపమైన జ్ఞానమే శాశ్వతమైనదని ఈ కావ్యం నిరూపిస్తుంది. సమాజంలో కళాకారులకు, సృజనకారులకు లభించాల్సిన కనీస గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని గుర్తించడంలో పాలకులు లేదా సమాజం విఫలమైతే, చరిత్ర వారిని ఎన్నటికీ క్షమించదనే పరమ సత్యాన్ని జాషువ నాడు నొక్కి చెప్పారు. కవిత్వం కేవలం ప్రభువుల భోగభాగ్యాలను కీర్తించడానికి మాత్రమే కాదు, అది సమాజంలో ఒక చైతన్యాన్ని, పశ్చాత్తాపాన్ని రగిలించే ఒక అమోఘమైన ఆయుధమని నిరూపించడంలో జాషువా గారి దూరదృష్టి అనన్యసామాన్యమైనది. రాజులు, సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా, కవి రాసిన అక్షరం సూర్యచంద్రులు ఉన్నంత కాలం నిలిచే ఉంటుందనే సామాజిక సత్యాన్ని ఎంతో ఉదాత్తంగా, కవితాత్మకంగా పాఠకులకు అందించి సమాజంలో ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకువచ్చారు మహాకవి గుర్రం జాషువా.

***

జాషువ సర్వలభ్య రచనలు
రచన: జాషువా
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, మనసు ఫౌండేషన్
పేజీలు: 1660
వెల: ₹ 600/-
ప్రతులకు:
సాహితీ బుక్స్, విజయవాడ
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Jashuva-Compendum-available-works-Gurram/dp/B0DQLBJNHJ

Exit mobile version