[కోవెల సుప్రసన్నాచార్య గారు వ్రాసిన ‘పాండిచ్చేరి గీతాలు – పన్నెండు’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ధూళిపాళ అరుణ.]
విశ్వచరిత్రలో శ్రీ అరవిందుల వారి జన్మ సార్థకం, శాశ్వతం. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, చేతనల వేదికగా పృథ్విపై వారు దివ్యమైన శాశ్వతత్వాన్ని పొందారు. 19, 20 శతాబ్దాలలో భారతీయ పునరుజ్జీవన చైతన్యంలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని ప్రదర్శించిన కవి యోగి శ్రీ అరవిందులు. ఆధునిక ప్రపంచానికి దివ్య జీవన ప్రస్థానాన్ని మార్గదర్శనం చేయించి, ఆధ్యాత్మిక చింతనలోను, సాహితీ సౌగంధ్యం లోను తమ ప్రభావాన్ని ముద్రించిన మహనీయులు వారు.
అతి చిన్న వయస్సులోనే ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఇంగ్లాండుకు వెళ్లి పాశ్చాత్య విద్యా పాండిత్యాన్ని సంపాదించారు. విదేశీయుల రాజ్యాంగ నిర్మాణాలను, రాజకీయాలను అవగాహన చేసుకున్నారు. పదునాలుగు సంవత్సరాల వయస్సునుండే ఆంగ్లభాషలో కవిత్వ నిర్మాణాన్ని చేపట్టారు. స్వదేశానికి తిరిగివచ్చిన అరవిందులు పరాధీనతలో ఉన్న భారతజాతి స్థితికి దుఃఖించి భరతమాత దాస్యశృంఖలాలను తెంచడంతో పాటు అంతర్గతంగా జాతి జనులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని కూడా కల్పించడానికి సంకల్పించడం భారతజాతి మహద్భాగ్యం. ఒక జాతి వేయేండ్లు పారతంత్య్రంలో మ్రగ్గి తిరిగి జాగరణ పొందిన వేళలో ఉద్భవించిన మహాపురుషుల్లో అరవిందులు విశిష్టులు.
స్వాతంత్ర్య విప్లవయోధునిగా మాత్రమే కాకుండా మానసిక పరిణతితో, ఈశ్వరాదేశ కారణంగా ఉన్నత సంకల్పంతో పాండిచ్చేరి చేరుకున్నారు. 1910లో అక్కడ స్థిరపడిన తరువాత అరవిందులు స్థాపించిన శ్రీ అరబిందో ఆశ్రమం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. బాహ్య జగత్తుతో సంబంధాలు తగ్గించుకొని చివరి 24 సంవత్సరాలు ఏకాంతవాసం చేసి విజ్ఞానమయ భూమికలో ఆధునిక ప్రపంచానికి దివ్యస్ఫూర్తిని కలిగించారు.
‘ది మదర్’ గా ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ – ఇండియన్ ఆధ్యాత్మిక గురువైన మిర్రా అల్ఫాసా శ్రీ అరవిందుల వారిని తమ ఆధ్యాత్మిక గురువుగా భావించారు. 1920 తరువాత ఆశ్రమ నిర్వహణా బాధ్యతలను ఆమె స్వీకరించారు. ప్రాచీన ఆశ్రమాలకు కొంత భిన్నంగా విలక్షణయుతంగా నిర్వహింపబడుతూ ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని జనులకు అనుభూతి పరం చేస్తున్న సంస్థ. ‘మాతృశ్రీ’ గా పిలువబడే అల్ఫాసా ‘ఆరోవిల్’ పేరిట విశిష్టమైన వాస్తు శిల్ప పద్ధతిలో దేశ విదేశీయులను ఆకర్షించే ఒక అంతర్జాతీయ నగర నిర్మాణం చేశారు.
శ్రీ అరవిందుల సాధనా మార్గం దేశ సరిహద్దులను దాటి ప్రపంచాన్ని ఆకర్షించింది. దేశ, ఖండాంతరాల నుండి పాండిచ్చేరికి చేరుకునే జనులు లౌకిక జీవన సాఫల్యతను పొందుతూనే ఆధ్యాత్మిక మార్గం వైపుగా పయనించే సర్వ చైతన్యానికి సంసిద్ధులయ్యారు. ఈశ్వరారాధనాశీలురుగా కార్యోన్ముఖులయ్యారు. వారి జీవనమంతా యోగమార్గంగా దివ్యాదివ్య చైతన్యాలకు సంగమస్థలి అయ్యింది.
“మనం గడిచిపోయిన ఉదయాలకు చెందినవాళ్ళం కాదు. భవిష్యత్తు మధ్యాహ్నాలకు చెందినవాళ్ళం” అని భవిషత్తును స్వప్నించిన పరమయోగి పుంగవులు శ్రీ అరవిందులు.
ఆచార్యులు సుప్రసన్న గారు 1974 జనవరిలో మాతృశ్రీ స్వర్గస్థురాలైన కొద్ది రోజులకే పాండిచ్చేరికి వెళ్లి అరవిందాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఒక్కరోజులో గడిపిన అలౌకికానుభూతి ఆయనను మధురోహలలో నింపింది. ఆ అనుభవాల నెమరువేత ఈ గీతాల రచనకు పురికొల్పింది. పాండిచ్చేరి యాత్ర ప్రారంభం నుండి అక్కడ పొందిన ఆయన అనుభవాలన్నీ ఒక క్రమపద్ధతిలో పన్నెండు గీతాలుగా ఆవిష్కృతమయ్యాయి. కవి అనుభూతి ప్రాధాన్యంగా ఆయా సన్నివేశాలు రసవత్తరంగా చిత్రించబడ్డాయి. లౌకిక పరమైన యాత్రగా స్ఫురిస్తూనే అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణంగా విశిష్టంగా సాగుతుంది. భౌతిక జగత్తు ఆధారంగా వ్యష్టి చైతన్యం నుండి సమష్టి చైతన్యం వైపుగా పురోగమించడమే మానవ జీవన లక్ష్యమని ఈ కావ్యం స్పష్టీకరిస్తుంది.
ఇందులోని పన్నెండు గీతాలు మానవ శరీరంలో వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రంలోని పన్నెండు దళాలకు ప్రతీకలు. జీవశక్తిని నిరంతరం నిలిపి ఉంచే స్థానం అనాహతం. ఈ చక్రాధిష్టాన దేవత ‘వామదేవి’ రెండు ముఖాలతో, శ్యామల వర్ణంలో, పన్నెండుమంది యోగినులచేత సేవించబడుతుంది.
లలితా సహస్రనామాల్లో జగన్మాత
“అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా..”
అని వర్ణించబడింది.
పన్నెండు దళాలు పన్నెండు మాసాలకు ప్రతీకలుగా కాలచక్రాన్ని సూచిస్తాయి. సంఖ్యాపరంగా దీనికి సూచనగా సకల జీవరాశుల యెడల నిస్వార్థ ప్రేమైకతత్త్వ భావనను ఆకాంక్షిస్తూ సుప్రసన్నగారు తత్త్వగీతాలను వెలువరించారు.
ఒక బ్రాహ్మీ ముహూర్తాన రైలులో ఇరవైమందితో కలిసి పాండిచ్చేరికి చేరుకొని భూపాల రాగ స్వరమాధుర్యాన్ని ఆలకిస్తూ వ్యక్తావ్యక్త భావజలధిలో మునిగిన కవి..
“ఎదురుగా పూల అంగడి, కోరికల సంగడి
ఆ చంద్రచాంద్రీ రుచి వెదజల్లే పుష్పలావికల కళ్ళు
అమోఘ అనుభవాన్ని త్రావి మత్తెక్కిన పూల ఇంద్రచాపాలు
ఎంత ఆకర్షణ- ఇదీ ఈశ్వర పూజా ద్రవ్యమే”
అంటూ ఉన్నత చేతన అవరోహణను, భౌమ చేతన అధిరోహణను లిప్తకాలం పాటు దృశ్యమానం చేసుకున్న అనుభూతిని ఆస్వాదిస్తారు.
సాధకునికి ఈశ్వర సమర్పణ భావన అత్యావశ్యకం. ప్రతీ అనుభవాన్ని, కర్మను పరమేశ్వరార్పణ గావించినప్పుడే ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. మొదటి కవితలో పూల అంగడిలో తనను ఆకర్షించిన పుష్ప పరిమళాల మత్తును, కోరికల సాంగత్యాన్ని వీడి, వాటిని ఈశ్వర పూజాద్రవ్యాలుగా భావించిన కవి తన సాధనలో ప్రథమ సోపానాన్ని అధిరోహించాడు.
“ఈ పూలకు అతిథి మృత్యువు
ఈ రేకులు విప్పేసి తొడుక్కుంటాయి
ఇంతకన్నా అందమైన బంగారు రేకుల్ని”
ప్రతీ జీవికీ మరణం ఆహ్వానించదగిన పరిణామమే. ఎవరూ దీనికి అతీతులు కారు. అది దుఃఖహేతువు కూడా కాదు. శిథిలమైన దేహం నుండి
విడివడిన ఆత్మ ఆనందమయ స్థితిని చేరుకుంటుంది. నూతన శోభను చేకూర్చుకుంటుంది. తమను తాము ఈశ్వరార్పణ చేసుకున్నప్పుడు ఇంతకు మించిన అవ్యక్తానంద తీరాన్ని సాధకుడు చేరుకుంటాడు.
“వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో పరాణి।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ॥”
(భగవద్గీత 2-22)
కట్టుకున్న వస్త్రాలు చిరిగిపోయినప్పుడు మానవుడు కొత్త వస్త్రాలను ధరిస్తున్నాడు. అట్లాగే క్షయించిన దేహాన్ని విడిచిన ఆత్మ నూతనత్వాన్ని పొందుతున్నది. అందువల్ల మృత్యువును కూడా అనుభూతిపరమైనదన్నది కవి విశిష్ట భావన.
సాధకుని చిత్తైకాగ్రతకు అవరోధాన్ని కలిగించే ఆసురీశక్తులు అనేకంగా ఉంటాయి. ఉన్మనీ భూమికలో లోతైన సత్యం గోచరించనంతవరకు చిత్తభ్రమణం కలుగుతూనే ఉంటుంది. కార్యాకార్యాలను, వాటి ఫలితాలను ఈశ్వారార్పణ గావించిన సాధకుడు ఉన్మనీ భూమికలోని స్థిరమైన, పరిపూర్ణమైన సత్యాన్ని సాక్షాత్కరింప జేసుకుంటాడు.
“పరిచ్ఛిన్నమైన సత్యానికి ఎంత వెకిలితనం
హిరణ్మయమైన ఆ తెర కనిపించనే లేదు..”
అవధిని కనుగొనలేని స్థితిలో స్వచ్ఛమైన సత్యం మరుగునపడింది. జీవితానికి కావలసినదేదో గ్రహించనప్పుడు ఉన్నతమైన భూమికకు చేరుకోవడం కష్టం. మాయామోహాన్ని వీడడమే సరియైన కర్తవ్యం.
“హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపిహితం ముఖమ్..”
(ఈశావ్యాసోపనిషత్తు-15)
సత్యం యొక్క ముఖం తేజస్సుతో నిండి ఉంది. ఆ కాంతి తెర తొలగినప్పుడే సత్యము యొక్క స్వస్వరూపాన్ని దర్శించగలం. అరవిందాశ్రమంలో సుప్రసన్న గారు జీవనమే యోగంగా భావించి, ఆత్మచైతన్య స్వరూపులై, దివ్యజీవన పరిణామానికి సిద్ధంగా ఉన్నటువంటి సాధకులను దర్శించారు.
కవి కూడా ఇక్కడ సాధకుడైనాడు. ఆయనలో అంతరస్థ చైతన్యం విప్పారడం ఆరంభమైంది. ఆయన దృష్టి సృష్టి చేతనం వైపు మళ్లింది. శివకేశవాభేదమైన సృష్టి ఆకాశం నుండి ఆరంభమై, శబ్దం జనించి
మంత్రంగా రూపొందుతుందని, ఒకే ఒక్క సంకల్పం చేత భూమిపై అన్ని దశల జీవులు ఉద్భవిస్తున్నారని, ద్యావా పృథువులు- పురుషుడు, ప్రకృతీ- శివశక్తులు సృష్టికి హేతువులైనట్లు, అరవిందుడు- మాతృశ్రీలు సర్వశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, మనశ్శాంతిని కలిగించే గాయత్రీ, పంచదశీ మంత్రాలకు ప్రతీకలుగా భాసిస్తున్నట్టు భావించారు. సర్వశాంతికి నిలయంగా, యోగసాధనకు మార్గంగా అనేకులైన సాధకులకు…
“రోదసిలో వెలిగే చంద్రకాంత పీఠాన/రెండు రాజహంసలు, ఆనంద మీమాంసలు..” గా ఆ ఇరువురు చైతన్యదీప్తులై ప్రసరిస్తున్నారు. ‘ర్యాలీ’ లో ఒకే విగ్రహంలో ముందు వెనుకలుగా రెండురూపాలలో కనిపించే జగన్మోహిని, కేశవస్వామిల వలె అద్వైతంగా జడ వస్తువులలో పరిణామక్రమ చైతన్య పరీమళాన్ని వ్యాపింపజేస్తున్నారు. అక్కడ ఉన్నవారంతా రాబోయే సమష్టి చేతనాయుగానికి వారధులు.
ఒక సందర్భంలో మాతృశ్రీ..
“Without him I exist not.
Without me he is in unmanifest”
(వారు లేనిది నాకు ఉనికి లేదు. నేను లేనిదీ వారు అభివ్యక్తి కారు) అనడం వారిరువురి అభేదాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుపుతుంది.
“వినీల గగనం నడిబొడ్డున కౌస్తుభరత్నం వెలిగి
అఖండమైన కాలం రెండు చేతులు జోడించే వేళ
..ఇంత అల్పమైన స్థలం ఈశ్వరుడెన్నుకున్న ప్రయోగశాల/ దివ్యాదివ్య లోకాల సంగమ బిందువు, అభేద్యసేతువు.. అపూర్వమైన చైతన్యం అక్కడ మమ్మెల్ల ముంచి..”
అది పరమేశ్వరుడు తనకై తాను ఎంచుకున్న చిన్న ప్రయోగశాల. చిరునవ్వుల పలకరింపులు, అశరీర స్పందనలు. నిష్కల్మషమైన ఏకాగ్రచిత్తంతో తపోనిధులుగా సత్యలోకాన్ని దర్శిస్తున్న యోగులు.
దివ్యాదివ్యలోకాలకు కేంద్రబిందువై అభేద్య సేతువుగా గోచరిస్తున్నది. మానుష భావ సౌందర్యం అక్కడ సాక్షాత్కరిస్తున్నది. ఆ ఆనందహేలలో కవి..
“తను మన ఉన్మనస్సమష్టి సంపుటి
ఉద్గమించు అనూహ్య రాగానికి ఇది పునాది..”
“ఈ ద్వీపం నిండా జ్యోతిర్వృక్షాల పచ్చని కాంతులు
ఈ కోట మీద ఆసురీ శక్తులను చెండాడే సైనికులు..”
అంటూ విశ్వభావాన్ని కూర్చుకున్న ఉన్నత శిఖరంపై తన్మయులయ్యారు. భౌతిక చేతనత్వాన్ని దివ్య చేతనత్వంతో అనుసంధానించడానికి శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దడం ఆశ్రమంలో మరో విశిష్టత.
“దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః”
“శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం”
ఆశ్రమవాసులు నెరపే వ్యాయామక్రీడల వల్ల శరీరం ఉక్కుగా మారి శమ దమ సాధన సులభ సాధ్యమై మనసు రజతమై తళతళలాడుతూ ఆత్మ బంగారంలా ప్రకాశిస్తుంది. అరిషడ్వర్గాలు, ఇంద్రియాలు మొదలైన స్థిరచిత్త నిరోధక ఆసురీశక్తులను అంతశ్శుద్ధి, ఆత్మచైతన్య పరివర్తకులైన సాధకులు చీల్చిచెండాడుతుండగా ఉన్నత భూమిక మానస గోచరమవుతున్నది.
శ్రీ అరవిందుల ‘సావిత్రి’ ఒక మార్మిక మహాకావ్యంగా 24,000 పంక్తులతో మహా పద్యకావ్యంగా ఆవిష్కరించబడింది. ఈ గ్రంథం రాయడానికి వారికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. ఆచార్య సుప్రసన్నగారు శ్రీ అరవిందుల ‘సావిత్రి’ని పదకొండవ గీతంలో అద్భుతావహంగా వర్ణిస్తూ..
“అర్ధ శతాబ్దం మాటల బంగారాన్ని మూర్తి కట్టించేందుకు
సుషుప్తి పొందిన భూతాల మధ్య మేల్కొన్నవాడి శిల్పకౌశలం” అని,
“త్రై కాలిక విశ్వచైతన్య వికాసం సంక్షిప్తీకరించిన మహావాక్యం” అని ఆ శిల్పకౌశలంలో పరవశులవుతారు.
అనంతాంధకారం నుండి ఉషస్సులోకి ప్రవేశింపజేయడానికి ‘సావిత్రి’లో అరవిందులు రాసిన ప్రారంభవాక్యం..
“It was the hour before Gods awake”
(అది దేవతలింకా మేల్కాంచని ఘడియ)
దీనిని 21 పర్యాయాలు మార్చి మార్చి చివరకు దీనిని స్థిరీకరించారు అరవిందులు. మనసులో ఎన్నో అంతస్థులు దాటిన తర్వాత లభించే స్థితప్రజ్ఞ లక్షణానికి ఇది తార్కాణం.
వేదాల్లో ‘త్రిసప్త సమిధః’ అంటే 7×3=21 గూఢమైన విశేష సంఖ్యార్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 భూతాలు, మనస్సుతో కలిపి మొత్తం 21. సావిత్రి గ్రంథంలోని ప్రతీ పదం అరవిందుల ఆధ్యాత్మిక అనుభూతి రహస్యం. ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో నిత్య పారాయణ చేస్తే సూర్యతేజస్సు మనలను రక్షిస్తుంది. దీనిని వివరిస్తూ..
“సవితృ దీప్తి సాక్షాత్కరించిన మాలా మహా మంత్రం
వ్యక్తావ్యక్త వాగ్దేవత చూపించిన విశ్వరూపం”
అంటారు. అంతటి మహత్తర శక్తి కలిగిన గ్రంథరాజం సావిత్రి.
“దక్షిణామూర్తి హస్తంలో వెలిగే వీణ/ఆయన సావిత్రి/
సత్య శివ శాంతముల త్రిపుటి – అది సౌందర్యం”
వీణాధరుడైన దక్షిణామూర్తి జ్ఞానముద్రతో ప్రశాంతంగా దర్శనమిస్తాడు. ఇది యోగ విద్యకు, నాద బ్రహ్మకు ప్రతీక. మానవుని అంతరాత్మను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లి ఆనందాన్ని వెదజల్లే స్వరూపం. అరవిందుల ‘సావిత్రి’ కూడా పూర్ణ యోగ ప్రతిపాదన, మహామానవ ఆవిర్భావం, భౌతిక-ఆధ్యాత్మిక శక్తుల సమన్వయంగా యోగ మార్గంలో సత్యం, శివం, శాంతం అనే మూడింటి త్రిపుటిగా ఆత్మ సౌందర్యాన్ని ప్రత్యక్షీభూతం కావిస్తుంది.
“ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః॥”
(శ్రీ దక్షిణామూర్తి స్తుతి-5)
ఓంకారమనే ప్రణవమంత్రానికి అర్థ స్వరూపుడు శుద్ధ జ్ఞానమూర్తి, నిర్మల స్వరూపుడు, పరమ శాంతమూర్తి దక్షిణామూర్తి.
“బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాజ్ఞిర్వికల్పం పునః
మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం..”
(దక్షిణామూర్తి అష్టకం-2)
నిద్రలో స్వప్నంలా తనలో నుండి తనను సృష్టించుకున్న ప్రపంచం తిరిగి తనలోనే లీనమవుతుంది. అజ్ఞానం తొలగిన సాధకులు ఈ మాయాశక్తి నుండి బయటపడి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు.
జ్ఞానానికి, విద్యకు, యోగానికి అధిదేవతగా కొలువబడే దక్షిణామూర్తి పరమశివుని అవతారం. దక్షిణామూర్తి రూపాలలో వీణాధర దక్షిణామూర్తి రూపం ఒకటి. ఆయన ధరించిన వీణ, జ్ఞాన యోగ కారకం.
అరవిందులు వెలువరించిన ‘సావిత్రి’ కూడా విశ్వజ్ఞానానికి, పరమయోగానికి ఆధారమని, మహత్త్వ పూర్ణమైన ‘సావిత్రి’ కావ్యాన్ని “ఆత్మ హననోద్యుక్త వర్తమానానికి ప్రాణం నిలిపే దీపస్తంభంగా” శ్లాఘించారు సుప్రసన్నగారు. అరవిందుల ఆశ్రమం ఆయనకు విశ్వరూప దర్శనం చేయించింది. విజ్ఞానమయ భూమికను చేరేందుకు తోవను నిర్దేశించింది.
చివరగా ఆశ్రమ పరిసరాలన్నీ కవి కళ్ళల్లో కరిగిపోయాయి.
“రుక్మిణితో జగన్నాథుడు తిరిగి కుండినకు వెళుతున్నట్లు/ కిరణాలను వెంబడించి సూర్యజ్యోతి పృథ్వికి దిగివచ్చినట్లు/..” ఆయనకు తోచింది.
రుక్మిణీ దేవి ఆత్మ చైతన్యానికి ప్రతీక, శ్రీకృష్ణుడు పరమాత్మ. ఆత్మ పరమాత్మలో సమ్మిళితమై ఉన్మనీ భూమికకు (కుండిన) సాగుతున్నట్లు చిత్తమూ, అహంకారమూ, మనస్సూ, బుద్ధి నాలుగు స్తంభాలుగా దేవాలయ శిఖరం స్ఫురించింది. అక్కడే కవి కాషాయాలు, కమండలాలు, గడ్డాలు, ఉపన్యాసాలు లేని తపస్సమాధిలోనున్న ఆధునిక వశిష్ఠాశ్రమాన్ని దృశ్యమానం చేసుకున్నారు. కామధేనువు వలె అంతర్హిత గాఢానుభూతిని హృదయంలో లయించుకున్నారు.
“రాత్రి పూర్వయామాన గాలిలో నిండిన సామగానం
నానా భావసంకులమైన నగరాన్ని దాటివచ్చే నాకు
అమలినంగా, అపస్వర రహితంగా వినబడింది
మనస్సునుండి అతీత మనస్సు దాకా
ప్రణవం కట్టిన సంగీత నిశ్శ్రేణిక”
గాలిలో నిండిన సామవేద గానం కవికి స్వచ్ఛంగా, సుస్వరంగా వినిపించసాగింది. అది కేవలం మాధుర్యాన్ని అందించడమే కాక మనస్సును రాగరంజితం చేసి అతీతమనస్సు వైపు కొనిపోవడానికి ఓంకార నాదమయమైన సోపానశ్రేణి. అనుభూతి పూర్వక తాదాత్మ్యం హృదయాన్ని ఆవరించింది. భౌతిక జీవయాత్రలోనే ఆధ్యాత్మిక జీవనయానానికి, వ్యష్టి నుండి సమష్టి చేతన పురోగమనానికి మార్గనిర్దేశం చేసింది. తొలిగీతాలలో కల్లోలానికి భిన్నంగా కవిలో కలిగిన మార్పును సూచిస్తూ ఈ కావ్యం ముగుస్తుంది.
భారతీయుల ఆత్మను మేల్కొల్పి విశ్వమానవ పరంపరలో సముచితస్థానాన్ని కల్పించిన యోగి, మహాకవి, ద్రష్ట అరవిందులు. ఆధ్యాత్మిక అనుభూతి దశలో ఈశ్వర సర్వ సమర్పణ భావన వల్ల పరిపూర్ణ
అద్వైత దర్శనం వైపుగా ప్రజలను జాగృతం చేసిన మహోన్నత మూర్తి. ఇది వైయక్తిక మోక్షసాధనను ప్రేరేపించేది కాదు. దివ్య చైతన్యం కిందకు దిగిరావడం, ఇంతదాకా సాగివచ్చిన విశ్వ చైతన్యం ఉన్నతభూమి వైపుకు సాగుతూ అవరోహణారోహణ శ్రేణుల ద్వారా విజ్ఞానభూమికను చేరుకునే పథ నిర్దేశం చేసేది.
దేశ, భాషలకు అతీతంగా ఈశ్వర చైతన్య విలాసంలో లీనమవుతున్న ఆశ్రమవాసుల నిర్వికార చిత్తవృత్తిని దర్శించిన సుప్రసన్నాచార్యులు గారు ‘జీవితమంతా యోగమే’ అన్న అరవిందులవారి వినూత్నలోకంలో అవ్యక్తానుభూతి పరవశులై అంతరాన్వేషణకు సంసిద్ధులయ్యారు.
ధూళిపాళ అరుణగారు అధ్యాపకురాలిగా పనిచేసారు. తెలుగు ఎమ్.ఏ., టిపిటి చేశారు. 25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం గడించి, స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్‌గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 28 మందిని ఇంటర్వ్యూలు చేశారు.
ప్రచురణలు: ‘జ్ఞాపకాల సంతకం’ తొలి కవితా సంపుటి. ‘మిగిలేవి గురుతులే’ తొలి కథా సంపుటి. ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం, మయూఖ ముఖాముఖి (సాహితీవేత్తల ఇంటర్వ్యూల సంకలనం), చేతనాశిల్పం (కవితా సంపుటి), మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం ఇతర ముద్రిత గ్రంథాలు. ఫోన్: 8712342323
