Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-28

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కింద లౌంజ్‍లో తన కోసం ఎవరో ఎదురుచూస్తున్నారని తెలిసి, సుందర్ గది నుంచి లౌంజ్‌కి వస్తాడు. అక్కడ తన కోసం కూర్చుని ఉన్న మధుకర్ కనిపిస్తారు. ఆయనని సుందర్ పలకరింగానే, కాస్త నడుద్దామని బయటకు తీసుకెళ్తారు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఏంటిలా వచ్చారని సుందర్ అడిగితే, చిత్ర కలిసిందని అంటారు మధుకర్. చిత్ర ద్వారా జ్యోతి తెలిసిందని, జ్యోతి గీసిన అగ్రహారం బొమ్మని ఏంజలినా ముందు ఉంచానని చెప్తారు. రాత్రిపూట ఏంజలీనా ఆ బొమ్మలో రంగులు నింపుతోందని అంటారు. ఆవిడ ఆరోగ్యంగానే ఉందాని అడుగుతాడు సుందర్. ఉందని చెప్పి, ఆ బొమ్మ చూసినప్పటినుంచి ఆవిడలో ఏవో వింత కదలికలు మొదలయ్యాయని అంటారు మధుకర్. అలా నడుస్తూ వాళ్ళిద్దరూ కృష్ణప్రసాద్ గారి తోట దాకా వస్తారు. కృష్ణప్రసాద్ గారు వీళ్ళని చూసి, పలకరిస్తారు. ఆయన, మధుకర్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ముగ్గురూ తోటలోకి నడుస్తారు. ఒకచోట ఓ చిత్రమైన పువ్వుని చూసిన సుందర్ ఆగిపోతాడు. దాన్ని ముట్టుకోవద్దని కృష్ణప్రసాద్ హెచ్చరిస్తారు. ఎందుకని సుందర్ అడిగితే, పువ్వే కాదు, మొక్క యావత్తు విషమేనని అంటారు. మరి ఇక్కడ పెంచడం ఎందకని అడిగితే, ఆ విషంతో చాలా పనులుంటాయని మధుకర్ అంటారు. మీకు ఇందులోనూ ప్రవేశం ఉందా అని సుందర్ అడిగితే, దాని పేరు గ్లోరియాసా లిలీ అని చెప్పి, ఆ పువ్వుని కొన్ని వందల ఏళ్ల క్రితం జంతువులను, మనుషులను చంపేందుకు వాడేవారని ఆయన చెబుతారు. దాన్ని తెలుగులో అగ్నిశిక అంటారని చెబుతూ దాని ఇతర ఉపయోగాలను చెప్తారు కృష్ణప్రసాద్. మధుకర్, సుందర్ మెల్లగా నడుస్తుంటే, కృష్ణప్రసాద్ ముందుకు వెళ్ళిపోతారు. తనకి రకరకాల ఆలోచనల వల్ల నిద్రపట్టడం లేదని మధుకర్ అంటే, అక్కుడున్న ఓ చక్కటి పువ్వును కోసిచ్చి, దాన్ని వాసన చూడమంటాడు సుందర్. అది మంచి పువ్వని, దాన్ని అమ్మాయిలు పెట్టుకునే విధానాన్ని బట్టి వాళ్ళు వివాహానికి సిద్ధామా లేక వివాహం నిశ్చయమైందో చెప్పవచ్చని అంటారు మధుకర్. సమీర్ మరల కలిసాడా అని సుందర్‍ని అడుగుతారు. లేదంటాడు. కార్వాల్లో ఏదైనా మాట్లాడాడా అని అడిగితే, జవాబివ్వక ఊరుకుంటాడు సుందర్. ఇక చదవండి.]

చాలా సార్లు అనుకున్నాను – ‘నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడ ఏం చేస్తున్నాను’ అని. కానీ దానికి సమాధానం నాకు సవాలు మీద సవాలు విసురుతూనే ఉంది. చేతనైతే ఈ ప్రదేశాన్ని పూర్తిగా అర్ధం చేసుకోమంటోంది. ఈ గాలి ఈ నేల ఇప్పటివి కావు. నా డైరీలో అన్న సంగతులనూ భద్ర పరుస్తునే వస్తున్నాను. అర్థమైనది అర్థం కానిది చాలా ఉంది. కదంబ రాజుల పరిపాలనలో అర్భుతమైన యంత్రాంగం, మంత్రాంగం – రెండు కనిపిస్తున్నాయి. పంచశబ్ద ఉపాసన అన్నది సామాన్యమైనది కాదు. మరో చోట సప్త ధాతువుల ప్రసంగం గురించి శిలాశాసనాలలో చదివాను. ఇది ఏమై ఉంటుందీ అని శోధించగా ‘త్రిషధస్థా సప్తధాతుః పంచ జాతా వర్ధయంతీ’ అన్న ఋగ్వేదంలోని మాట ఎందుకో స్ఫురించింది..

పాంచభౌతికమైన ఈ సృష్టి యావత్తూ పంచకోశాలతో, పంచ శబ్దములతో కూడియున్నదా? వీటికి ఈ సప్తధాతువులతో ఏంటి పని? ఏంటి ఈ సుప్తధాతువులు?

హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత భూవరాహస్వామి ఒక శిఖరం మీద కూర్చుని సేద తీరినప్పుడు రెండు భుజాల మీదుగా స్వేద బిందువులు జాలువారి రెండు నదులుగా మారాయన్నది ఒక పురాణ గాథ! ఆ నదులే తుంగ, భద్ర అనే నదులు. ఈ రెండూ కలసి తుంగభద్రగా ప్రవహించటం చూస్తున్నాము. అలా కలిసి ప్రవహించిన ప్రదేశం పురాతనమైన హంపీ ప్రాంతం. ఇదే రామాయణ కాలానికి కిష్కింధగా చెప్తారు. ఈ ప్రాంతం లోనే ఎత్తైన ఒక శిఖరం మీద ఒక శివాలయం, మాతంగ ముని ఆశ్రమం, అలాగే వారాహి, చండీ ఉపాసనకు సంబంధించిన ఆలయాలు శిథిలావస్థలో మనం చూడవచ్చు. శాక్తేయ ఉపాసనలో వారాహి, చండీ ఉపాసనలు కనిపిస్తాయి. తంత్ర విద్యలో పేరు మోసినవి కూడా! తంత్రవిద్య శబ్దాన్ని, కోణాల స్వరూపాలనీ అనుసంధానం చేసి శక్తిని ఆహ్వనించి ఆ ప్రదేశాన్ని వశపరచుకనే ఒక మార్గాన్ని సూచిస్తుంది. పంచశబ్ద ఆవాహన అనగానే మామాలుగా శివ పంచాక్షరీ విద్యగా మనకు అర్థమైనప్పటికీ అది అంత మాత్రమే కాదు. కిష్కింధ – ఆ పేరుతో సాగిన కాండలో సుగ్రీవుడు వానర వీరులకు అనన్య సామాన్యమైన భౌగోళిక విజ్ఞానాన్ని అందజేశాడు. ఈ రోజుకీ హంపీ, ఆనెగొంది (అప్పటి అంగదుని సామ్రాజ్యం), తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని కొండలను జాగ్రత్త పరిశీలిస్తే అక్కడి రాళ్లల్లో దాగి ఉన్న శబ్దం, దానితో అక్కడి ఏర్పడిన భవన సముదాయాల నిర్మాణం లోని విజ్ఞానంతో అన్వయం, కొలతలు, శత్రువులను నిరోధించే మార్గాలు ఒక జీవితకాలపు అధ్యయనానికి ఏర్పడే విషయాలు..

ఈ అంశాలు కర్ణాటక, కేరళ, గుజరాత్ సముద్ర తీరాలలోని ఎన్నో ప్రాంతాలలో మనకి తారసపడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడొక వైపరీత్యం ఉంది. కొర్‍టెమ్ అగ్రహారం ఎలా ఉండేదో ఊహించే అవసరం లేకుండా జ్యోతి దాని అందమైన చిత్రాన్ని అందించింది.

కుండోదరి మహామాయ ఆలయం అక్కడ ఇప్పటికీ ఉండనే ఉంది. దశ మహ విద్యలు, నిత్య దేవినుల ఉపాసన, శ్రీవిద్యోపాసన, శ్రీచక్ర ఆరాధన, లలిత, రాజరాజేశ్వరి, యోగ సాధన – ఇవన్నీ సనాతనమైన సాధనలోని అద్భుతాలనటంలో అతిశయోక్తి లేదు. కానీ ఇవి సామూహికంగా సాధించేవి కావు. అక్కడక్కడ ఒక ఆశ్రమంలోనో, అగ్రహరం లోనో ప్రబలంగా మనకు దొరుకుతాయి. కాకపోతే చాలా కఠినమైన నియమాలతో కలిగినవి!

చరిత్రలో అడవులలో ఉంటూ ఉపాసన చేస్తూ రాజులకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో తోడ్పడే రాజగురువులు, మహర్షులు లేకపోలేదు. ఆ కోణంలో ఆలోచిస్తే శక్తిని తాత్వికంగా సంపాదించకోవటం సామూహికం కాకపోవటం ఒక చర్చనీయాంశమైన అంశం.

సామూహికంగా మార్చినప్పుడు అది పనిచేయదు. మరి ఏంటి మార్గం? భూపాలుడు (రాజు) అందుచేత ధర్మపరాయణుడై ఆ విధమైన సహాయానికి యోగ్యుడై ఉండవలసిన అవసరం ఏర్పడింది. రాజు కేవలం భుజబలంతో సార్వభౌముడు కాడు. విద్యా వినయ సంపన్నుడు కావాలి. శస్త్ర విద్య, శాస్త్ర విద్య కలవాలంటే రాజ గురువు, రాజగురువు స్థానంలో ఉండేవారి లాలన, పోషణ, నిర్భయులైన ఉపాధ్యాయుల వ్యవస్థ తప్పక ఉండి తీరాలి..

పరుల నుండి కాపాడుకునే ప్రక్రియలలో ఈ విద్యలు ఎంతో పనికి వచ్చాయని చెప్పాల్సి ఉంది. కానీ పరులను చితకబాది ఆక్రమణలు చేసేందుకు ఎన్నడూ వీటిని వాడలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. సముద్ర తీరంలో ఉంటున్నప్పుడు పాశ్చాత్యుల ఆక్రమణలను ఆపేందుకు ఇవి ఉపయోగపడ్డాయా?

ఈ ఆలోచనల సరళి అలా సాగిపోతోంది. కలం డైరీలో ఆ పేజీ దగ్గర పెట్టి డైరీ మూసేసి అలా చుట్టూతా చూసాను. మొన్ననే కృష్ణప్రసాద్ గారు ఇచ్చిన ఒక మందారం మొక్క అలా బాల్కనీలో ఓ కుండీలో పెట్టి ఉంచాను. మందారం గురించి ఆయిన చెబుతుంటే చిత్రమైన ఆలోచనలు వచ్చాయి. ఈ పువ్వు ఐదు రేకులతోను, నాలుగు రేకులతోనూ వికసించటం చూస్తాం. ఐదు రేకుల మందారాన్ని ఎక్కువగా తంత్ర విద్యలో వాడతారు. బెంగాల్ ప్రాంతంలో ఎర్ర మందారాలను నవరాత్రులలో అమ్మవారికి సమర్పిస్తారు. ఒక కన్యను అలంకరించి గర్భగుడి ముందర కూర్చోపెట్టి నాలుక మీద బీజాక్షరాలను దిద్ది ఆ నాలుక పలువురికీ కనిపించేలా ఉంచమని మధ్యమావతి రాగం (స రి మ ప ని) అయిదు స్వరాలతో అయిదు వాయిద్యాలతో మారుమ్రోగిస్తూ ఈ పూలతో పూజ చేస్తారు. ‘పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ’ అనేవి ప్రత్యేకంగా పలుకుతారు.

పంచలోహాలతో చేసిన పంచపాత్రలో అయిదు మందారాలను అలా ఉంచేస్తారు. ఫాబీనాచీ సీరీస్ గణిత శాస్త్రంలో ఎంతో ఆసక్తికరమైనది. ఇది చరాణి, స్థావరాణి – రెండింటిటి ఆస్తిత్వాలనీ గణితం ద్వారా నిర్దేశిస్తుంది. మందారం లోని రేకుల స్వరూపం ఈ గణితానికి మూలం..

ఇవన్నీ కృష్ణప్రసాద్ గారు చెబుతుంటే అలా ఓ ముద్ద మందారాన్ని పట్టుకుని వింటూ నిలబడ్డాను. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. స్త్రీని పరదేవతగా కొలవటం సంప్రదాయం. స్త్రీని కామించటం, మోహించటం ఒక చరిత్ర! స్త్రీని శక్తిగా కాంక్షించి ఉపాసించి ఉపయోగించటం కూడా ఒక విధానమేనా?

మందారం ఎంత అంతమైనది? మందార మకరందం ఎంత తీయనిది? దీని తైలం ఎంత గొప్పది?

పంచపాత్ర లోని ఆ రోజు మందారాలను పూజ తరువాత తీసి ఒక దారంలో చుట్టి పూజించిన కన్యను శిరస్సు మీద అలంకరిస్తారు. ఆ తరువాత ఆ పూలు వాడిపోయేవరకూ ఆ కన్య భవిష్యత్తును దర్శిస్తుంది. ఆమె చెప్పినవన్నీ తిరిగి తీరతాయన్నది ప్రజలమైన విశ్వాసం! అంతే కాదు. ఆ రోజు నుండీ ఐదు రోజుల వరకూ ఆమెకు అతీంద్రీయ శక్తులు లభిస్తాయన్నది నానుడి.

కన్యకు నెలవారి జరిగే ప్రకృతి సహజమైన ప్రక్రియకు ఐదు రోజుల నిలయం ఉన్నది. కామాఖ్య ఆలయంలో ఈ కాలంలో ఉన్న కన్యను ఇదే రీతిలో పూజించి మందారాలను వాడి తంత్రవిద్యను బలోపేతం చేసుకున్న ఖ్యాతి కలదు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉన్నది. విదేశీయులు ఈ విద్యల గురించి పలు రకాలుగా ఆలోచించారు. తొలుత పట్టించుకోలేదు. తరువాత ఇందులో ఏదో ఉంది అని అనుకుని మెల్లగా అనునయిస్తూ నేర్చుకునే ప్రయత్నం చేశారు. దీనికి బలమైన కారణం ఉంది.

ఈ విద్యలు కేవలం భరత భూమికే  పరిమితం కావు. దురాక్రమణలను సాగించిన ప్రతి విదేశీయుడు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఉన్న విద్యలను అధ్యయనం చేసే ప్రయత్నం చేసాడు. కొన్ని తెలుసుకున్నాడు, కొంత నవ్వుకున్నాడు, కొంత తెలియక వదిలేసాడు, కొన్నింటిని వాడుకునే ప్రయత్నం చేసాడు..

1787 లో గోవాలో పింటో క్రాంతి అనే ఘట్టంలో దాదాపుగా ఇదే జరిగింది. ఈ క్రాంతిలో అగ్రహరంతో ముడిబడ్డ విద్యావేత్తలు పాల్గొనటం విశేషం! గోవాలోని ప్రజలు ఆ ప్రాంతం మీద గల దేశభక్తి ఈ క్రాంతిలో బయటకు వస్తుంది. ఆ సంఘర్షణ అగ్రహారపు విద్య ఎంతగా పాటు పడిందో చూస్తే ఆలోచనలు ఎక్కడికో పరుగులు తీస్తాయి. ఇదంతా క్షుద్ర విద్య కాదు. కాకపోతే జన్మభూమి అనేది ప్రకృతికి చెందినది. ప్రకృతి అనుకూలించాలి అంటే సహజమైన ప్రాకృతికపరమైన శక్తిని ఉపాసించి దానిని దాని ద్వారానే కాపాడుకోవాలనే ఒక విధానం అది. దీనినే 1875లో ఈ ఘట్టాన్ని వర్ణించిన చరిత్రకారులు చాలా చక్కగా చిత్రీకరించారు. బాల్కనీలో ఉన్న మందారం మొక్కలు చూస్తూ మరల డైరీలో వ్రాసుకుంటూ పోతున్నాను. ఆ మందారం వెనుక నీలి రంగు సముద్రం చరిత్రను నీటి మీది గీతలా దాటేస్తోంది. ఆసియా ఖండం లోని ఎన్నో దేశాలకు ఈ పుష్పం ఎంతో ప్రధానం..

బెల్ మ్రోగింది.

“కమిన్”, గట్టిగా అన్నాను. ఈ రిసార్ట్స్‌కు సంబంధించిన వాళ్ళైతే లోపలికి వస్తారు. కాని పక్షంలో మరల బెల్ కొడతారు. అలాగే జరిగింది.

లేచి హాల్లో లైట్లు వేసి తలుపు తెరిచాను.

చిత్ర నిలుచునున్నది. రెండు అడుగుల దూరంలో జ్యోతి కనిపిస్తోంది.

“నేనొక్కతినే ఐతే లోపలికొచ్చేస్తాను. మీరేమీ అనుకోరని నాకు తెలుసు. కానీ నాతో జ్యోతి ఉంది.”

“ఓ. జ్యోతికి మటుకు ఎందుకు కొత్త?”

“కొత్త కాదు”

“మరి?”

జ్యోతి వైపు జాగ్రత్తగా చూసాను. కళ్లు ఆర్పకుండా నన్ను చూస్తోంది. చిత్ర గొంతు సవరించుకుంది.

“లోపలికి రండి” అన్నాను.

“కాదు..!” చిత్ర మాటలు తడబడుతున్నాయి, “..ఆఁ.. ఏం లేదు, లోపల ఏదైనా తరహా.. అంటే..!”

“అరే! ఎవరూ లేరు. కమాన్..”

“నో.. సారీ.. జ్యోతి ఒక మాట అన్నది”

“ఏంటది?”

“లోపల ఏదైనా తరహా మందారం మొక్క ఉంటే..”

ఆశ్చర్యం వేసింది,

“ఊ.. ఉంటే?”

“ఉంటే తను రాలేదు!”

“ఎందుకని?”

“చెప్పలేను.”

“ఓ. అవునా.. ఉన్నట్లు ఎందుకనిపించింది?”

“తనే ఇందాక ఆగిపోయి నన్ను అడిగింది.”

(ఇంకా ఉంది)

Exit mobile version