[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ట్రాఫిక్ క్లియరవటంతో, ఓ అరగంట తర్వాత ఆస్పత్రికి చేరుతాడు సుందర్. ఆసుపత్రిలో కూడా సుందర్ పోస్టర్లు, ఫ్లెక్సీలు కనబడతాయి. పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళను చూసి తన కోసమేమయినా వచ్చారా అని అనుకుంటాడు సుందర్. ఇంతలో చిత్ర వచ్చి పలకరించి, సుందర్ కోసం చాలా సేపటి నుండి చూస్తున్నానని అంటుంది. డ్రైవర్‍ని కారు పార్క్ చేసుకోమని చెప్పి, జ్యోతిని డిశ్చార్జ్ చేశేసారా అని అడుగుతాడు. ఎప్పుడో చేశేసారని చెప్పి, మీకేందుకు ఆలస్యమైందని అడుగుతుంది. సంభాషణని అక్కడ ఉన్న సమీర్ పోస్టర్ల మీదకి మళ్ళిస్తాడు సుందర్. ఇంతకీ జ్యోతిని ఎక్కడికి తీసుకెళ్దామని చిత్ర అడిగితే నాకేం తెలుసని అంటాడు. ప్రొడ్యూసర్లు ఒప్పుకోలేదు, మా గెస్టుహౌసులో ఉంచడానికి కుదరదని చెప్పానుగా అంటుంది చిత్ర. తన రిసార్ట్సుకి తీసుకువెళ్ళలేనని చెప్తాడు సుందర్. చిత్రకి కోపం వస్తుంది. ఇంతలో కార్వాల్లో సుందర్‍కి ఫోన్ చేసి గేటు దగ్గర సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. స్ట్రెచరా లేక వీల్ చెయిరా, నేను పట్టుకోవాలా అని అడిగితే, అవసరం లేదంటాడు సుందర్. కార్వాల్లో దగ్గర జ్యోతిని ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్తాడు. కాసేపటికి జ్యోతిని బయటకు తీసుకువచ్చి కార్లో కూర్చోబెడుతుంది చిత్ర. సుందర్ కూడా కార్లో కూచోబోతుంటే, అక్కడున్న పోలీసులు వచ్చి ఆ కారు నెంబర్ ఫోటో తీసుకుంటారు. సుందర్‍ని పేరడిగి, ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మధుకర్ గవడె గారున్న చోటకి అని చెప్తాడు. జోవాక్విమ్ తెలుసా అంటే, తెలుసని ఆడిటోరియంలో పరిచయం అనీ చెప్తాడు. అతను జైల్లో ఉన్న సంగతి తెలుసా అని పోలీసు అడిగితే, తెలుసని చెప్తాడు సుందర్. వీలున్నప్పుడు ఒకసారి స్టేషన్‍కి రమ్మని చెప్పి వాళ్లు వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]
కార్వాల్లో తన వద్ద నున్న ఒక్క హాలునీ అద్భుతంగా సర్దేశాడు. బెడ్‍రూమ్ ఏర్పాటు చేసాడు. ఒక సిస్టర్ రెడీగా ఉంది. లోపల అంతా సర్దుకునేందుకు ఆడవాళ్లని వదిలేసి కార్వాల్లోతో ఇవతలకి వచ్చాను.
“చాలా ఖర్చు పెట్టారు” అన్నాను.
“అవసరం నాది” అంటూ అక్కడన్న సోఫాలో కూర్చున్నాడు. ఇతనిలోని నిజాయితీ గొప్పది. అలసిపోయి ఉండడంతో నేనూ ఎదురుగా కూర్చున్నాను.
“ఇంతకీ ఈ లౌంజ్‌లా ఉన్న ప్రాంతం ఎవరికి చెందినది?”, అడిగాను.
“కోర్టు చెప్పలేదు కానీ ప్రస్తుతానికి ఇలా వాడుకుంటున్నాం.”
దూరంగా “రావచ్చా?”, అని వినిపించింది.
మెట్ల మీద గవడె నిలుచునున్నారు.
“ప్లీజ్”, అన్నాను.
మెల్లగా వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు. కార్వాల్లో వినయంగా వంగి “ఎలా ఉన్నారు?” అన్నాడు.
గవడె తల ఆడించి వదిలేసాడు.
“నాకు చెప్పవలసింది..”, గవడే అన్నారు. “..అన్ని ఏర్పాట్లూ చేసే వాడిని. ఇంతకీ ఈ అమ్మయి ఏమంటోంది?” అన్నారు.
“ఈ సమస్యలు ఒక్క రోజులో తీరిపోయేవి కావు.”
“ఇక్కడ ఎన్ని రోజులు?” అడిగారు.
“ఏమో. ఒక నెల తప్పదేమో.”
“మళ్లీ మాట్లాడతాను” అని చెప్పి లేచి వెళ్లిపోయారు.
“ఈయనకి ఇది ఏ మాత్రం ఇష్టం ఉండదు” కార్వాల్లో అన్నాడు.
“కేసు కోర్టులో ఉంది. ఇది కొత్త పరిణామం. తిరిగి లాయర్లతో మాట్లాడతాడు.”
“ఇదంతా ప్రభుత్వం వారి గొడవ కదా? ఈయనకెందుకు?”
“ఈయన ప్రభుత్వం వారి ప్రతినిధి కదా? తప్పదు. ఇదే సమస్య! పైన ఏంజలినా ఉన్నట్లు ఇక్కడ జ్యోతి ఉంటుంది. కేసులో మజా వస్తుంది.”
“హ హా. ఎవరైనా, ఎక్కడైనా, ఎందుకైనా ఉండవచ్చు. ఇది స్వతంత్ర దేశం.”
కార్వాల్లో ఎందుకో ఆలోచనలో పడ్డాడు.
“నిజమే..!”, గంభీరంగా అన్నాడు. “..కానీ అలా ఎందుకు ఉన్నారు అన్న ప్రశ్న ఒక సంఘటన జరిగే సమయంలో న్యాయ పరీక్షలోకి వస్తుంది.”
“బావుంది. లా చదువుకున్నారా?”
“అక్కర్లేదు. పది సార్లు కోర్టు చుట్టూ తిరిగితే చాలు.. అర్థమవుతుంది.”
“పది నేరాలు చేసినా అర్థమైపోతుంది.”
ఎందుకన్నానా అని అనిపించింది. నన్ను జాగ్రత్తగా చూసాడు.
“నేరం అంటే ఏంటి?”, అడిగాడు.
“మరోలా అనుకోకండి. మిమ్మన్ని అనటం లేదు. పరిస్థితుల దృష్ట్యా, కోర్టు వ్యవహారాల విషయం వచ్చేసరికి అలా అన్నాను.”
“నో. నేను బాధపడి అడగటం లేదు. నా ప్రశ్న చిన్నది. సమాధానం వెతుకుతూ, జీవిత కాలం గడిపేసాను.”
“ఎన్ని సమాధానాలు దొరికాయి?”
“అన్నీ ప్రశ్నలే దొరికాయి.”
“ఒక్క గట్టి ప్రశ్న అడగండి.”
“నేలలో నాలుగు పంటలు వేసామనుకోండి.”
“ఓకే.”
“ఒక్కో పంట పండుతున్నప్పుడు అదుగో ఈ నేల ఈ పంటది అంటాం.”
“కరెక్ట్.”
“తరువాత అదే నేలని ఇదిగో ఈ పంట.. ఈ నేల అంటాం.”
“నిజం.”
“నేల ఒకటే.”
“అవును!”
“ఏ రోజైనా దున్నే వాడిదే భూమి.”
“దున్నలేని వాడిది కాదా?”
“కాలం ఒక చోట నిలబడదు. జరుగుతూ పోతుంది. మనం ఎదుగుతున్నాం కాబట్టి కాలం ముందుకు పోతుంది అంటాం. మన నిజ జీవితాలు పురోగమించనప్పుడు కాలంతో పాటు ముందుకు వెళ్లేందుకు నీ తరువాత ఎవరు? అని అడిగినప్పుడు ఇదిగో వీడు, లేదా ఇది నా ప్రతినిధి – మా జోలికి రాకండి అని చెప్పటానికి ఒక సజీవమైన స్వరం అవసరం, పంట వేయలేని పరిస్థితిలో అక్కడ ఇళ్ళు వచ్చాక ఇక పంట గురించి ఎవరు మాట్లాడతారు?”
“కరెక్ట్.”
“అసలు నేరమంటే ఏమిటో చెప్పనా?”
“యస్.”
“ఒకరి ఉనికి కోసం ఒక నవ సజీవ స్వరాన్ని సృష్టించి దాని వెనుక నిలబడి దానిని పోషించి, పాలించి మరింత ముందుకు తీసుకొని వెళ్లలేక పోవటం క్షమించరాని నేరం!”
ఆలోచనలో పడ్డాడు కార్వాల్లో.
“ఆ ఉనికి ఎలాంటిదైనా అది చెయ్యాలా?”
“ధర్మబద్ధమైనప్పుడు ప్రాణాలకు తెగించి అయినా చెయ్యలి.”
జేబు లోంచి ఏదో పాకెట్ తీసి అందులోని దినుసును నోట్లో వేసుకున్నాడు..
“ప్రాణాలు తీసి చెయ్యవచ్చా?”
***
జైలు సూపరింటెండెంట్ నన్ను కూర్చోమని చెప్పి గంటయింది. ఎవరితోనో మొబైల్‌లో మాట్లాడుతునే ఉన్నాడు. రెండోసారి బ్రతిమలాడటం, రెండోసారి చెప్పి చూద్దామనుకోవటం ఎందుకో నాకు చిన్నప్పటి కూడా అలవాటు లేదు. ఏ మాత్రం సహనం లేని వ్యక్తిలా చాలా మంది నన్ను వారి వారి సౌకర్యం కోసం నాకు తెలిసి వర్ణించుకుంటూ వెళుతూ ఉంటారు. నేను చూపించే సహనం అతి తక్కువ మంది చూపించగలరని కొద్దిగా గట్టిగానే నమ్మే మనిషిని నేను! కాకపోతే నా సమాయాన్ని పనికి రాని పనుల దగ్గర వృథా చేసే వాళ్లని నేను కరడుగట్టిన నేరగాళ్లుగా నేను పరిగిణిస్తాను. చాలామందికి నేను సమయాన్ని వృథా చేస్తున్నట్లు కూడా కనిపిస్తాను. అది నిజం కాదు. ఎంతో అమూల్యమైన సమయాన్ని నాతో నేను కలిపి గడుపుతున్నప్పుడు లోకానికి అలా కనిపిస్తాను. ఇలాంటి అధికారులు నన్ను నిరీక్షించమని చెప్పి రెండు మూడు అందలాలు పైకి ఎక్కువ అనుభవం పొందుతారు. నీతో నేను గడిపేందుకు సమయం ఎవరైనా నాకిస్తే అది రెండు మూడు అణుబాంబులు నా చేతికిచ్చినట్లే ! వాటిని జాగ్రత్తగా పొందుపరచుకుంటాను కానీ అనవసరంగా ప్రయోగించను..
“ఐడెంటిటీ కార్డు చూపించగలరా?” అడిగాడు.
జేబు లోంచి తీసి ముందుంచాను. అటు ప్రక్క నిలబడ్డ పోలీసు దానిని బంగారాన్ని పరీక్షించినట్లు పరీక్షించాడు. ఒక రిజిస్టర్‍లో వివరాలు వ్రాసుకున్నాడు.
“మొబైల్ ఇక్కడ పెట్టండి” అన్నాడు.
మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాను. అతను కోపంగా నా ముందరే మరల ఆన్ చేసాడు.
“వెళ్లండి”, అన్నాడు.
ఎందుకలా చేసాడా అనుకున్నాను. నాతో పాటు కానిస్టేబులు నడిచాడు.
“ఇంత చీకటిగా ఉండేంటి?” అడిగాను.
“ఒకప్పుడు ఇది ఒక కోట. పోర్చుగీస్ వారు జైలుగా మార్చారు. చీకటిగానే ఉంటుంది.”
“ మెల్లగా నడు. నాకేమీ కనిపించటం లేదు.”
“మొదటి సారా?”
“జైల్లో ఎవరినైనా చూడాల్సి రావటం ఇదే మొదటిసారి.”
“ఓకే. గోవా కాదు కదా మీది?”
“కాదు.”
“కరెల్ట్. ఈ జైలులో పద్ధతులు దేశంలో ఎక్కడా ఉండవు.”
“చట్టం దేశమంతా ఒకటి కాదా?”
“పుస్తకాలలో ఒకటే.”
“ఓ.”
“ఆగండి.”
అలా అని అక్కడ కుడి ప్రక్క ఏదో రూము లోకి వెళ్లి ఇవతలకి వచ్చాడు.
“పదండి.”
ఇద్దరం ముందరికి నడిచాం. మా ప్రక్కన గదులున్నా అని ఉన్నట్లుగానూ, వాటిల్లో ఎవరైనా ఉన్నట్లు గానూ ఏ మాత్రం తెలియటం లేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఈ కాన్‌స్టేబుల్ కళ్లు తిరిగి ఇక్కడ పడిపోతే నేను బయటకి రావటం దాదాపు అసంభవం. చివరికి ఒక గుడారంలా ఉన్న చోట ఆపాడు. జేబులోంచి ఒక కొవ్వొత్తి తీసాడు. అక్కడున్న ఒక కప్పులో ప్రక్కనే ఉన్న నీటి బాటిల్లోంచి నీరు నింపాడు. కొవ్వొత్తిని అందులో నిలబెట్టాడు.
అంత చీకటిలో కూడా చాలా తేలిగ్గా తాళం తెరిచాడు. ఆ చువ్వల చాటున ఓ మనిషి కనిపిస్తున్నాడు. కానిస్టేబుల్ అగ్గిపుల్ల ముట్టించి కొవ్వొత్తి వెలిగించాడు. అప్పుడు చూసాను జోవాక్విమ్‍ని.
“లోపలికి వెళ్లండి..”, అతను చెప్పాడు, “..ఈ కొవ్వొత్తి వెలుగుతున్న వరకే మీరు మాట్లాడాలి.”
లోపలికి నడిచాను. రష్యాలో జ్యూలను లోపల పెట్టి ఈ విధంగానే చేసేవారు.
“జో.. ఎలా అన్నారు?”
“నాకేం? బాగానే ఉన్నాను.”
“కోర్టులో మళ్లీ ఎప్పుడు?”
“వచ్చే వారం.”
“ఏంటి సమస్య?”
“సమీర్ ఎక్కడన్నాడో కావాలి వాళ్లకి. నాకు తెలియదంటే నమ్మరు. కొడుతున్నారు.”
“బయట పడే దారి?”
“తెలియదు. కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సమీర్ కోసం గాలిస్తున్నారు.”
“ఊఁ.. నీ లాగా ఇంకెవరినైనా విచారిస్తున్నారా?”
“ఇంకో ఇరవై మంది ఉన్నారు. ఆరుగురు అమ్మయిలు కూడా ఉన్నారు.”
“సమీర్‌కు ఈ వార్తలు అందే అవకాశం ఉందా?”
“నేను చెప్పలేను.”
“నా సహాయం?”
కొద్దిగా గోడ వైపు జరిగాడు. గెడ్డం తీసేసినా ఉన్నట్లు చెయ్యి పోనిచ్చాడు. అది అలవాటు మరి.
“రెండు..”, అన్నాడు. “జ్యోతి కోసం గుత్రో, మూన్ ఫ్లవర్, ఫుల్ మూన్, రాష్ కోసం కోర్టాలమ్‍లో జాయసీ ఇలాకా సన్‍షైన్ మనిషి.”
ఆ కొవ్వొత్తి పట్టుకుని కాన్‌స్టేబుల్‌కి ఏదైనా అర్థమైందా అని ఆలోచించేలోపు నా రెండు చేతులూ పట్టుకుని కళ్లు మూసుకున్నాడు జో.
దీర్ఘంగా నిట్టూర్చాడు.
“సార్, అన్ని బండ్లు రహదారుల మీద పోలేవు. అలా అని చక్రాలు లేవనుకోవటం పొరపాటు. చక్రం తిప్పండి.”
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.