Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-54

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సుందర్, మాధవ్ మాట్లాడుకుంటూ భూగృహం మెట్లు దిగుతుంటారు. తాను ఓ చక్రవ్యూహంలో ఇరుక్కుపోలేదు కదా అని అనుకుంటాడు సుందర్. ఆ మెట్ల దారిలో ఓ మలుపు దగ్గర కూర్చుని ఇద్దరూ నీళ్ళు తాగుతారు. ఇంతకీ నువ్వు నాతో కేవలం జ్యోతికి నచ్చజెప్పమని అడగడానికి వచ్చావా లేక దానితో ఇంకేదైనా పని ఉందా లేక ఎవరైనా పురమాయించారా అని అడుగుతాడు సుందర్. మరే పనీ లేదూ, తనకి అవసరమూ లేదంటాడు మాధవ్. మరయితే అర్జీ పెట్టుకుని తరువాత కలుస్తానని చెప్పి వెళ్ళిపోయుండచ్చు కదా అని అడుగుతాడు సుందర్. మాధవ్ ఆలోచనలో పడతాడు. కాసేపాగి, మీ రచనలు, మీ ఆలోచనలు ఒక పట్టాన అర్థం కావు అంటూ సుందర్ రచనలపై తన అభిప్రాయాన్ని వివరిస్తాడు. అర్థమయ్యేందుకు ఏమీ లేదంటూ, తనతో వస్తూ మాధవ్ ఇంత రిస్క్ తీసుకోవడానికి కారణం అది కాకపోవచ్చని అంటాడు సుందర్. నిజంగానే తాను సుందర్‍కి దగ్గరవాలని వచ్చానని చెప్తాడు మాధవ్. కాసేపయ్యాకా, ఆ రోజు అడవిలో జ్యోతికి, తనకి మధ్య ఏం జరిగిందో వివరంగా చెప్తాడు. జ్యోతి కోరిక మేరకు ఆమె చెప్పినప్పుడల్లా ఫోటోలు తీశానని అంటాడు. తన మీద ఓ మెరుపు మెరుస్తుంది, ఫొటో తియ్యి అని జ్యోతి చెప్పిందని; అయితే మెరుపు మెరిసే లోపు తాను ఫొటో తీయలేకపోయానంటాడు మాధవ్. ‘సరే, ఈసారి నేను ఐదు లెక్కబెడతాను. ఐదు అనే సరికి మెరుపు మెరుస్తుంది, ఫోటో తీయమని చెప్పింది జ్యోతి. మెరుపు మెరిసినప్పుడు ఫొటో తీశాను, తను రెండు చేతులు పైకి చాచి ఆకాశం కేసి చూసున్నప్పుడు వాన మొదలయింది..’ అంటూ చెప్పడం ఆపుతాడు మాధవ్. – ఇక చదవండి.]

మామూలుగా ఏదైనా భూగృహం లోకి అలా వెళ్లిపోతూ ఉంటే చెమట్లు పడుతూ ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడి నుండో ఒక్కసారిగా చల్లగాలులు వీస్తూ ఉన్నాయి.

నేను, మాధవ్ మెల్లగా మరి కొన్ని మెట్లు దిగాం.

“ఆ తరువాత ఏం జరిగింది?”, అడిగాను.

“జ్యోతి చెబుతున్న ఆ మాటలకి పూర్తిగా తికమక పడుతూ వచ్చాను. కొద్దిగా కాదు, చాలా భయం వేసింది. ఈ అమ్మాయి ఒక్కొక్కసారి ఇలా ప్రవర్తిస్తుంది. మిగతా సమయాలలో మామూలు మనిషిగా కనిపిస్తుంది.”

“ఒక్క క్షణం మాధవ్, నాకు అర్థం కానిది ఈ విషయం. ఎలాగూ ప్రస్తుతం మనం చికిత్స కోసమే ప్రయాణం కట్టాం. ఈ పాతాళ భైరవి లోకి వెళ్లి ఇద్దరం బయటకు వస్తామో రామో. అదలా ఉంచు. ఈ విచిత్రమైన ప్రవర్తన ఎప్పుడుంటుంది? అంటే నీ అనుభవంలో చెబుతావా?”

“ఊహించలేం సార్. మానసిక శాస్త్రం బాగా అవగాహన ఉన్నవారు తప్ప చెప్పలేరు. ఆమె దేనికి ప్రతిక్రియ చూపిస్తుంది అనేది ఊహకి అందనిది. మేమిద్దరం ఎందరితోనో కలసి తిరిగే వాళ్లం. పార్టీలకని వెళ్లాం, పబ్స్‌లో కూర్చున్నాం. అంతా బాగానే ఉండేది. ఎందుకో ఎవరినో పట్టుకుని తిట్టేది. ఒకరిద్దరిని కొట్టటానికి కూడా వెళ్లింది. తాగి ఉందనకుని ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ఆమె ఏ రోజూ తాగలేదు. నాకు ఒక అనుమానం వచ్చేది..”

“ఏంటది?”

“మనికి కనిపించేది ఒకటి, ఈమెకు కనిపించేది మరొకటి.”

ఆగిపోయాను.

“కరెక్ట్ మాధవ్. కానీ అది అన్ని వేళలా కాదు.”

“అవును. మన వద్ద ఉన్న కెమెరాకి మనం వాడుతున్న లెన్స్ వల్ల మరేదో కనిపించవచ్చు. నేను తప్పు చేసానో రైట్ చేసానో చెప్పలేను కానీ నా సబ్జెక్ట్ కోసమో లేక కుతూహలం కోసమో నేను జ్యోతిని కెమెరా వాడుకున్నాను. ఫలితం అనుభవించాను.”

వ్యవహారం ఇప్పుడర్థమవుతోంది. చిత్ర కూడా జ్యోతిని తన ప్రయోజనాలకు వాడుకుంది. కానీ తను కెమెరా మనిషి కాదు.

ఇతను తన పనితో అందరి పనితనాన్నీ ముడిపెట్టగల సమర్థుడు. చాలా సార్లు నాకు తెలియకుండానే నేను నా వృత్తిలో కొంతమందిని వెతుకుతూ వచ్చాను. ఎన్నో పనులను ఎన్నో విధాలుగా చేయగలిగిన వాళ్ళు ఈ భూమి మీద అరుదు. అన్ని చేసినా, చేయగలిగినా వారి అసలు సిసలు వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. మాధవ్‌లో ఒక విశేష లక్షణం కనిపించింది.

“ఇంత ఆ అడవిలో ఏం జరిగింది? తరువాత వివరం చెప్పు.”

“ఆమె అలా నవ్వుతూ ఏదో సినిమాలో లాగే రెండు చేతులూ ఆకాశం వైపు పెట్టి నేను అది, నేను ఇది అంటుండగా జారి పడి పైకి చూసాను. ఎందుకైనా మంచిదని కెమెరా తీసి వరసగా చాలా స్నాప్స్ తీసాను. అది నే చేసిన పిచ్చి పని.”

“పిచ్చి పని ఎందుకైంది? అది నీ వృత్తి, నీలాంటి వారికి ఎవరికైనా అది అరుదైన అవకాశం.”

“నిజమే. కానీ ఫొటోలే నా జీవితానికి బరువైపోయాయి.”

“ఓ. సరిగ్గా రాలేదా?”

మాధవ్ ఆ ప్రక్కగా ఉన్న గోడ మీదకి అనుకున్నారు. బరువుగా నిట్టూర్చాడు.

“ఈ గోడ మీద చెవి పెట్టి వినండి”, అన్నాడు.

దగ్గరగా వెళ్లి చెవి ఆన్చాను. హోరు గాలి యొక్క శబ్దం వినిపిస్తోంది.

మాధవ్ మరింత దగ్గరగా ఆనుకుని విన్నాడు.

“దగ్గరలోనే సమద్రం ఉన్నట్లుంది”, అన్నాడు.

“అంటే మనం సముద్రంలోకి దిగుతున్నామా?”

“ఏమో, ఇంతకీ ఫొటోల గురించి చెబుతానుండండి. జ్యోతి ఈ లోకం లోకి వచ్చి నా కెమెరా లాక్కుంది. ‘ఫొటోలు ఎందుకు తీసావు?’ అడిగింది.

‘ఇదేంటి? ఇలా చాలా తీసాను కదా?’

‘ఇప్పుడెందుకు తీసావు?’

‘ఏమైందని?’

‘నీకు తెలియదు. ఇలాంటప్పుడు తియ్యకూడదు.’

దాన్ని బట్టి ఈ అమ్మాయికి అప్పుడప్పుడు ఒక వింత పరివర్తనం జరుగుతుందని అర్థమైపోయింది.

‘జ్యోతీ.. నాకు నీ గురించి తెలియాలి’, అన్నాను.

గట్టిగా నవ్వి కెమెరాను నేలపై కొట్టబోయి ఆగింది. అందులోంచి డిజిటల్ కార్డు తీసి తన బాగ్‌లో వేసుకుంది.

‘ఏం తెలియాలి?’

‘ఇలాంటప్పుడు.. అని అన్నావు. అవి ఏమిటి? ఏదో రహస్యం ఉంది, చెప్పు.’

‘ఏం లేదు. మనం ఇలా ఒంటరిగా తిరుగుతున్నాప్పుడు’

‘ఇలా చాలా తిరిగాం’

‘పద పోదాం’

‘కార్డ్ ఇచ్చేయి..!’

‘నో.. పద. ఇక్కడ ఎక్కువ సేవు వద్దు. సమస్యలుడవచ్చు.’

‘ఎటువంటివి?’

చెయ్యి పెట్టుకుని లాక్కుని పోతుంది.

‘ముందు పద’

‘మనం ఎటు వెళ్లాలి?’

‘పద.’

అలా లాక్కుంటూ ఏదో దారంతా తనకే తెలిసిన దానిలా లాక్కుని పోయింది. చివరికి ఇద్దరం ఒక రోడ్డు ఎక్కాం.. మా ముందర నుండి ఒక టాటా సుమో దూసుకుంటూ వెళ్లిపోయింది. ఇంతలోనే మరో సుమో వచ్చి కొద్దిగా ముందరకి వెళ్లి ఆగింది. జ్యోతి నా చెయ్యి వదిలేసి అటు పరుగు వేసింది. నేను అక్కడికి చేరుకునే లోపలే జ్యోతి ఆ  బండి ఎక్కి చెయ్యి చూపించింది. వాళ్లు నన్ను చూసి కూడా ఆగలేదు. రయ్‌మంటూ పారిపోయారు.

ఒక వారం రోజుల తరవాత కార్వాల్లో నా రూమ్‌కి వచ్చాడు.

‘మనం అర్జంట్‌గా గవడె గారి దగ్గరికి వెళ్లాలి’, అన్నాడు.

‘ఎందుకు?’

‘ముందర బండి ఎక్కు’ అన్నాడు.

బండి ఎక్కి కొంత దూరం వెళ్లాక రెండు సార్లు అడిగాను.

‘ఏం లేదు. పోలీసులు వచ్చారు. గవడె గారు మాట్లాడుతున్నారు.’

‘నాతో ఏంటి పని?’

కార్వాల్లో బండి ఆపి హెల్మెట్ తీసాడు.

‘బాస్ నీతో బీర్ తాగిపోవాలని వచ్చారు పోలీసులు. నీతో పనేంటి అంటావు. నీతోనే పని. నిన్ను అరెస్ట్ చేస్తారు.’

‘మరి నేను పారిపోతే?’

‘నీ వల్ల కాదు. గవడె గారు నచ్చచెబుతారు. గోవాలో ఎన్నడూ పారిపోయే పనులు చెయ్యకూడదు.’

కార్వాల్లో నిజంగానే చాలా మంచి వ్యక్తి. ఆలోచించాను.

‘పద’ అన్నాను.

గవడె గారింట్లో ఆయన అప్పటికే ఏవో డ్రింక్స్ తెప్పించి వాళ్లని సముదాయిస్తున్నట్లున్నారు. కార్వాల్లో చెప్పినట్లు నన్ను కంపెనీ కోసం పిలిస్తే ఎంత బాగుండేది. తలుపు దగ్గరే నిలుచున్నాను.

సి.ఐ. నన్ను గట్టిగానే చూసాడు.

‘కమ్..!’ అన్నారు గవడె గారు, ‘..ఇతనే మాధవ్.’

సీ.ఐ. గ్లాసు ఖాళీ చేసాడు. నాతో పనైపోతే మళ్లీ అది దొరకదేమోనన్నట్లు మీసాలు తుడుచుకుని ‘ఊఁ..’ అన్నాడు. ఓ పెద్ద కవరు తీసారు.

‘ఈ ఫొటోలు తీసింది నువ్వేనా?’

ఎక్కడో మోసం ఉందనిపించింది ముందర. మొదటి ఫొటోలో జ్యోతి మాములుగా ఉంది. చిరునవ్వుతో ఉంది. రెండో ఫొటోలో కేవలం మొహం వరకూ ఉంది. కళ్ళు మూసుకుని ఉంది. వాన నీళ్లు చెంపల మీదుగా కారుతున్నాయి. గొప్ప అనుభూతి లోంచి తేరుకోవాలని లేనట్లు కనిపిస్తోంది. మూడవ ఫొటో చూసేసరికి నా చుట్టుతా ఒక కొండచిలువను చుట్టి దాని తెరచుకున్న నోటిని కళ్ళ ముందు చూసినట్లయింది.

జ్యోతి రెండు చేతులో ఆకాశం వైపు చాచి ఉంది.

ఆశ్చర్యం ఏమిటంటే దాదాపు ట్రిక్ ఫొటోగ్రఫీలా అనిపించింది. ఒంటి మీద బట్టలు ఉన్నాయా తెలియదు, లేవో తెలియదు. ప్రకృతిలో కలసిపోయిన ప్రతి చెట్టూ, పుట్టా, ఆకూ, పువ్వూ అన్నీ జ్యోతి ఒక శిల్పంగా మారిన వైనం ఎదురుగా ఉంది.

‘ఫొటో నాది. ప్రింట్ నాది కాదు’ అన్నాను.

అతను ఏదో రిపోర్ట్ చేపించారు.

‘ఈ డిజిటల్ కార్డ్ నీదేనా?’

 ‘అవును.’

‘ఐతే రెండూ నీవే.’

‘సార్. నేను ఆ అమ్మాయిని బట్టలు లేకుండా తియ్యలేదు. అది అలా జరగలేదు. ఇది ఎవరో ఇలా మార్చారు. నాకు సంబంధం లేదు.’

‘నో’, అని వినిపించింది. జ్యోతి వచ్చి నిలబడింది. తన చూపుడు వేలును నా వైపు కత్తి చూపించినట్లు చూపించింది. ‘ఈ ప్రింట్స్ నా సమక్షంలోనే తీయించారు. నువ్వు నన్ను మోసం చేసావు. సార్, అరెస్ట్ హిమ్!’ అంది.

‘నేనే తప్పు చేయలేదు’ అన్నాను.

ఈ కవరు క్రింద మరో కవర్ ఉంది. అది ఎందుకో అతను తెరవటం లేదు గవడె గారు కూడా అది చూసినట్లు లేదు.

‘మీ ఇద్దరు లవర్సా?’, అతను అడిగాడు.

జ్యోతి వైపు చూసాను. తను నా వైపు చూసినట్లు లేదు.

‘నాకు సమాధానం కావాలి.’

నేను ఏమి మాట్లాడలేదు.

‘ఓకే. గోవాకి జల్సా చెయ్యాటానికి వచ్చారా?’

‘నేను ఫోటోగ్రఫీ పని మీద వచ్చాను.’

‘నువ్వు?’

జ్యోతి చేతులు కట్టుకుంది.

‘నేను డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం వచ్చాను. మంచి మిత్రుడనుకున్నాను. ఇలాంటి పని చేసి వ్యాపారం చేస్తాడనుకోలేదు.’

గవాడె గారు దగ్గారు.

‘జ్యోతీ..’ అన్నారు, ‘ఒక్క మాట చెప్పు. అమ్మాయిలు చాలా మంది కెమెరాలు ముందు స్వతంత్రంగా ఎన్నో పోసుల్లో నిలబడతారు. బలవంతం అనేది బుజువు చెయ్యగలవా?’

‘అందరు అలాంటి వారు కారు సార్. అమాయకంగా డ్రగ్గింగ్‌కు లోనవుతారు.’

సి.ఐ. నన్ను చాలా సీరియస్‍గా చూసాడు.

‘ఇందులో మార్ఫింగ్, ఫొటోషాప్ లేదు మాధవ్, అన్నీ టెస్ట్ చేయించాము. మాయ మాటలతో అమ్మాయిని అడవిలోకి తీసుకుని వెళ్లావు. అవునా?’

‘నో’

‘ఏ డ్రగ్స్ వాడారు? అసలు అపరాధం అక్కడుంది’.

‘ఏదీ వాడలేదు. నన్ను నమ్మండి. ఈ అమ్మాయికి ఒక మానసికమైన సమస్య ఉంది..’

జ్యోతి వాంప్‌లా నవ్వింది. తల అటూ ఇటూ ఊపింది.

సి.ఐ. నిలబడ్డాడు.

‘నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాను. అది నిజమైనా తప్పు నీదే!’

‘అది అప్పుడప్పుడు వచ్చే సమస్య, కావాలంటే డాక్టర్‌ని అడగండి.’

‘అమ్మాయిని బలవంతం చేసావు మాధవ్.’

‘నో. ఈ అమ్మాయి..’

అప్పటి వరకు తెరవని కవర్ తీసాడు సి.ఐ. అందులోంచి ప్రింట్ మెల్లగా ఇవతలకి లాగాడు.

అది అతనికి మాత్రమే కనిపించేలా పట్టుకున్నాడు. నేను ముందరికి వస్తుంటే ఆపాడు. జ్యోతి కళ్ళు మూసుకుని రెండు చేతులూ మొహం మీద పెట్టుకుంది..”

(ఇంకా ఉంది)

Exit mobile version