Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూచే పూల లోన-64

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[జో, సమీర్ చేస్తున్న షోని చూస్తున్న ఓ పెద్దాయన జో ప్రతిభని మెచ్చుకుని – ఆ బొమ్మని తనకిచ్చేయమని జో ని అడుగుతాడు. అది బొమ్మ కాదని, సమీర్ అని చెబితే, మీరు నమ్మించారు, నేను నమ్మలేనట్టు నటించాను అంటాడాయన. కొన్ని క్షణాల తరువాత – నాతో పని చేస్తావా? – అని సమీర్‍ని అడుగుతాడాయన. ఏం పని అంటే, తన కార్డు తీసి ఇస్తాడు. దాని మీద రజనీశ్ అని ఉంటుంది. ఆయన పేరు మోసిన సినీదర్శకుడు. తొందరలేదు, ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెప్పి ఆయన వెళ్లిపోతాడు. ముంబయి వెళ్ళి సినిమాల్లో ప్రయత్నించమనీ, తనని వదలద్దని చెప్తాడు జో. జో ప్రోత్సాహం మీద, ముంబయి చేరి, ఆయన స్టూడియోలో రజనీశ్ గారి ఆఫీసుకి వెళ్తాడు. ఆయనప్పుడు అక్కడ లేడు. ఇంకో చోట మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతుంటే, అక్కడేమయినా ఉన్నాడేమోననుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడవాళ్ళు ఉచిత సలహాలు చెప్పి పంపేస్తారు. తనకిచ్చిన కార్డు లోని నెంబర్‍కి ఫోన్ చేస్తాడు సమీర్. రజనీశ్ సెక్రటరీ మాట్లాడి, మూడో యూనిట్ దగ్గరకి రమ్మని చెప్తాడు. అక్కడున్న ఓ వ్యక్తిని మూడో యూనిట్ ఎక్కడాని అడిగితే, అలా వెళ్ళు.. ముందుకు వెళ్ళు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడతను. – ఇక చదవండి.]

లా వెళుతూనే పోయాను. చివరికి నేను చేరుకోవలసిన చోటుకి చేరుకున్నాను. దేనినో జరుగుతున్నట్లు జరిపించి కెమెరాలో బంధించి చీకటి చేసి తెర మీద జరుగుతున్నట్లు చూపించి మాయ చేసి ఓ ప్రపంచాన్ని తయారు చేసి ఏ రంగంలోని వారైనా ఈ రంగు పులుముకుంటే తప్ప ఘనుడు కాడు అని చాటి ఒప్పించటం జనాలకు అలవాటు చేసిన ఒక మాయాపురి ఎదురుగా ఉంది. చిన్నగా నెట్టి, తలుపు తోసుకుని లోపలికి వెళ్లాను.

గోల గోలగా ఉంది. ఈలలు వినిపిస్తున్నాయి. హీరోకీ, హీరోయిన్ రంగులు అద్దుతున్నారు. ఈ సెట్‌లో చాలా మంది ఉన్నారు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. రజనీశ్ గారు ఎక్కడా కనిపించటం లేదు. బిగ్గరగా ఏదో సంగీతం వినిపిస్తోంది. హీరోకి ఎంతో నమ్రతతో సీన్ చెబుతున్నాడు ఒకడు. గోడకి ఆనుకుని ఇద్దరు నాలాగా అంతా చూస్తున్నారు. ఎందుకైనా మంచిదని వాళ్ల ప్రక్కన నిలుచున్నాను. నన్ను క్రిందా మీదా చూసారు వాళ్లు. ఒకడు నా భుజం తట్టాడు.

“ఏం కావాలి?” అడిగాడు.

“సార్‌ని కలవాలి.”

“ఏ సారు?”

“రజనీశ్.”

“ఆయన కలవడు.”

“ఆయనే రమ్మన్నాడు.”

జాగ్రత్తగా చూసాడు.

“సరే గానీ అలా గోడకి ఆనుకోకు. వీపు మొత్తం ఆ రంగు – ఏంటి? నల్ల రంగు అంటుకుపోతుంది.”

నాకు ఆ సంగతి తెలియదు. చూసుకున్నాను. అలాంటిదేదీ లేదు.

ఆ లైట్ల మధ్య లోంచి రజనీశ్ టీషర్ట్, జీన్స్, కాప్ లో వస్తూ కనిపించారు. హాలు మొత్తం నిశ్శబ్దం అయింది.

“రెడీ”, ఎవరో అరిచారు.

ఓ ఈల మ్రోగింది. హీరోయిన్ అటు తిరిగి నిలబడి ఉంది.

“మ్యూజిక్” అన్నాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్.

ఇప్పుడు చక్కని సంగీతం ప్రారంభం అయింది. ట్రాలీ ముందుకు వెళుతోంది.

“పొజిషన్”, అన్నాడు అతను.

ఒకసారి రజనీశ్ వైపు తిరిగాడు. ఆయన తల ఆడించాడు. “లైట్”, గట్టిగా అరిచాడు.

లైట్‌లో అసలు సీన్ అర్థమైంది. హీరోయిన్ ఎవరి కోసమో ఎదురు చూస్తోంది.

“కెమెరా.”

“యాక్షన్.”

ఇక్కడి నుండి హీరో అలా మెల్లగా నడుస్తూ వెళుతున్నాడు.

“కట్.”

ఈ డైరెక్టర్ కట్ అంటున్నాడు కానీ సమస్య ఏంటో చెప్పటం లేదు.

హీరో మరల నడచుకుంటూ వెళ్లాడు. రజనీశ్ అసిస్టెంట్ డైరెక్టర్ వైపు చూసాడు. అతను అక్కడికి వెళ్లి ఏదో చెప్పాడు. అతను మరల ప్రయత్నించాడు.

“కట్.”

“సీన్ చెప్పలేదా?”, చిన్నగా అడిగారు రజనీశ్.

“చెప్పాం సార్.”

“ఏం చెప్పారు? అమ్మాయి అటు తిరిగి నిలబడుతుంది, మీరెళ్లి వీపు మీద తట్టాలి. అంతేనా? కమ్యూనికేషన్‌లో సమస్య.”

ఇంతలోనే ఏదో అయిపోయినట్లు ఇద్దరికీ మరల మేక్ అప్. మరల అద్దాలు, అద్దటాలు, దిద్దటాలు.

“మీరు చెప్పాలి సార్, లేదా ఒక్కసారి చేసి చూపించాలి సార్.”

“నేను చేసి చూపిస్తే నాకు చెప్పటం చేత కాలేదని అర్థం. చెప్పటం చేత కాలేదంటే నాకు చెయ్యటం కూడా కూడా చేత కాలేదు. అంతే. కులీ..”

ఆ హీరో పేరు కుల్‌దీప్ అని నాకు తెలుసు. ఇలా పిలిస్తే ఎలా?

అతను వచ్చాడు.

“ఎక్కడో చూసిన అద్భుతం ఒక్కసారిగా చాలా కాలం తరువాత కనిపిస్తే ఎలా వెళతారు?”

“ఒక్క పరుగున..”

చెయ్యి అడ్డం పెట్టాడు.

“నో. అదా కాదా అని ఆలోచించరా?”

“ఒకే.”

“ఎలా వెళతారు?”

“మెల్లగా, అనుమానంతో వెళ్లాలి.”

“అనుమానం అని నాకు ఎలా తెలియాలి?”

అక్కడ అందరూ చేతులు కట్టుకున్నారు. బహుశా రజనీశ్ ఈ ప్రక్రియ బాగా నోటెడ్ అని అర్థమవుతోంది.

“ఇక్కడ ఒక క్లోజ్ షాట్ సార్”, అన్నాడు అసిస్టెంట్.

“కరెక్ట్. చెప్పు కులీ..”

అతను ముఖం చిట్లించాడు.

“కరెక్ట్. అది అనుమానమే. కానీ మరో విషయం కలవాలి.”

ఎవరూ మాట్లాడలేదు. హీరోయిన్ ఏపిల్ తింటోంది. ఆమెకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. అటు చూసాడాయన.

“ఆవిడెవరు?” అన్నాడు. సెట్లో పూర్తిగా నిశ్శబ్దం కమ్ముకుంది. సగం కొరికిన ఏపిల్ సగంలోనే ఆగిపోయింది. గబగబా లేచి అన్నీ దులుపుకుని ఇక్కడికి వచ్చేసింది.

“సారీ సర్.”

“తిన్నది ఏపిలే కదా?”

“అవును.”

“సారీ ఎందుకు?”

తల వంచుకుంది.

“టేక్” మెల్లగా అన్నాడు.

సీన్ మొదలయింది. ఈసారి మెల్లగా, కొద్దిగా బరువుగా నడిచాడు కులీ. కెమెరాలో చూస్తున్నాడు డైరెక్టర్.

“కట్.”

కులీ వెనక్కొచ్చాడు.

“సార్.”

“అనుమానం ఒకటే కాదు.”

“సార్.”

“అనుమానంతో పాటు ఆశ కూడా కనిపించాలి.”

మరల టేక్ అవుతోంది. నా ప్రక్కన ఉన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.

“ఒరేయ్, నటన, కెమెరా అంటే ఏమో అనుకున్నాం. ఇది మరో లోకం.”

“మనం చెక్క లాంటి వాళ్ళం. అక్కడ సాన పెట్టేస్తున్నాడు, ఏకంగా.”

“అవునూ, హీరో గారు ఎందుకు బిగుసుకుపోతున్నాడు?”

“మనోళ్ళు ఎంత సేపూ కళ్ళు ఆర్పకు, చిట్లించకు అని చెబుతారు కానీ ఏది చేస్తే విషయం ముందుకు వెళుతున్నదన్నది చెప్పరు. ఇక్కడ ఎంత హాయిగా ఉందో చూడు.”

“ఆ కళ్లార్పద్దు అన్నది ఈయన చెప్పటం లేదు.”

“అవున్రా, సహజంగా జరిగేదాన్ని దేనినీ గొప్పవాళ్లు వద్దనరు. చేతకాని వాళ్ళకే ఈ సమస్యలు.”

మరల సీన్ లోకి వచ్చాడు హీరో.

ఈసారి కెమెరాలో చాలా బాగా కనిపిస్తోంది. హీరోయిన్ నాలుగడుగులు దూరంగా ఉన్నదనుకున్నప్పుడు ఆగాడు. తల కొద్దిగా ఎడమ వైపుకు వంచాడు.

డైరక్టర్ ఏదైనా చెబుతాడా అని చూస్తున్నాడు. అతనేమీ మాట్లాడటం లేదు.

కళ్ళు పెద్దవి చేసాడు.

“కట్.”

అందరూ చుట్టూతా మూగారు.

“కళ్ళు పెద్దవి చేసారు, గుడ్. ఆశ కనిపించాలి. ఎలా?”

ఆలోచిస్తున్నాడు కూలీ.

“రాస్కో..!” అన్నాడు రజనీశ్, “..ఇక్కడ కట్ షాట్. అమ్మాయి దిష్టి బొమ్మ కాదు. ఎవరొస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎవరైతే బాగుండు అనే ఆలోచనలు ఆమెలో రావాలి. ఆ క్లోజ్ ప్లాట్ దీనికి తగలాలి.” అసిస్టెంట్ వ్రాసుకుంటున్నాడు.

“ఏపిల్ ఉందా అయిపోయిందా?”

అమ్మయి విసుగ్గా చూసింది.

“కళ్ళు మూసుకొని చేతిలో ఏదో పెట్టి తినమంటే ఏం చేస్తావు?”

“వాసన చూసి చేతితో తడుముకుని కొరికి చూస్తాను.”

“అది ఏపిల్ అని తెలిసాక ఏం చేస్తావు?”

“ఆనందిస్తాను.”

“కరెక్ట్, వెనుకగా వస్తున్న ఇతను నీకు కావలసిన వాడే అని అర్థమయ్యాక ఏం చేస్తావు?”

కళ్ళు మూసుకుని ఒక్కసారి తెరిచింది.

“టేక్”, అన్నాడు డైరెక్టర్.

మరల హీరో అటుగా ఎంతో ఆత్మవిశ్వాసంతో బయలుదేరాడు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. కళ్ళ మధ్య విన్యాసాన్ని చూపిస్తూ ముందరికి అడుగులు వేశాడు. ఆమె జడని విప్పార్చి చూసినట్లు కెమెరా చెబుతోంది. ఇతని క్లోజఫ్ చాలా బాగా కనిపిస్తోంది. అమ్మయి క్లోజప్‍లో చాలా భాగా అభినయించింది. కులీ తల కొద్దిగా ఎడమ వైపుకు వంచాడు.

“కట్.”

మరల అందరూ మూగారు.

కులీ చేతులు కట్టుకున్నాడు. అతనిలో ఏదో ఇంకా బాగా చెయ్యాలనే ఆదుర్దా కనిపిస్తోంది. ఒక స్టైల్, ఒక శైలిని అందించాలని ఉంది.

రజనీశ్ కెమెరాలో క్లోజ్ పాట్ చూపించాడు.

“చిరునవ్వు నవ్వు.”

అతను చిరునవ్వు నవ్వాడు.

“చిరునవ్వు చూపించే ముందు పెదవులు కదుపుతారు కదా. అలా కదిపి ఆపెయ్యి. చిరునవ్వు రానీయకు.”

కొద్ది సేపు ఆలోచించాడు. తల ఎడమ వైపు వంచి కళ్ళు పెద్దవి చేసి కొద్దిగా పెదవులను తెరిచాడు.

ముందరకి కదిలాడు కులీ. సీన్ చాలా బాగా వస్తోంది. మ్యూజిక్ చక్కగా ఉంది. అమ్మాయి హావభావాలు గొప్పగా ఉన్నాయి. కులీ అక్కడి దాకా వెళ్లి కళ్లు పెద్దవి చేస్తునే తల ఎడమ వైపుకు వంచాడు. పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఏ సంవాదం లేకుండా విషయం అర్థమవుతోంది..

“కట్.”

అందరూ దగ్గరికి వచ్చారు.

“ఇద్దరు ఒకే ముగింపు ఇవ్వాలి. ఎలా?”

అందరూ ఒకళ్ళ మోహలొకళ్ళు చూసుకున్నారు.

“శ్వాసతో చెప్పాలి!” అన్నాను.

రజనీశ్ కుర్చీ లోంచి లేచి ఇటు తిరిగాడు. నన్ను చూసి, గుర్తుపట్టి నోరు తెరిచాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. కళ్ళు పెద్దవి చేసి రెండు చేతులూ నడుము మీద పెట్టుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version