[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[జరుగుతున్న దాన్ని నమ్మలేకపోతాడు సమీర్. అత్యంత వేగంగా పరిస్థితులు మారిపోయాయి. రజనీశ్‍కి చెందిన గెస్ట్‌హౌస్‌కి మకాం మారుస్తాడు సమీర్. చాలామంది రచయితలు వచ్చి కథ వినిపిస్తుంటారు. అక్కడక్కడా పాయింట్లు రాసుకుంటాడు సమీర్. తన అసిస్టెంట్లకి సమీర్ బాధ్యతని అప్పజెప్పి రజనీశ్ మరో సినిమా షూటింగ్‍కి వెళ్ళిపోతాడు. ఆ సినిమా పూర్తయ్యాకనే, సమీర్ సినిమా అని అందరూ అంటారు. ఒకరోజు ఓ పెద్దాయన వచ్చి తన పేరు జహీర్ అని అంటాడు. ఆయనను కూర్చోమంటాడు సమీర్. రజనీశ్ ఎలా పనిచేస్తాడో తెలుసా అని ఆయన సమీర్‍ని అడిగితే, మీరెవరని ఆయనని అడుగుతాడు. ఆయనకి కొద్దిగా కోపం వస్తుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని పిలిచి, తానెవరో సమీర్‍కి చెప్పమని అంటాడు. ‘ఈయన జహీర్ గారు. ముంబయిలో పెద్ద పెద్ద దర్శకులకు, హీరోలకు ఈయనే సలహాదారు. ఈయన చెయ్యి పడకుండా ఏ ప్రాజెక్టు పూర్తి కాదు’ అని అతను చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపయ్యాకా, ఆయన చిత్రపరిశ్రమలో ఎలా నడుచుకోవాలో, రజనీశ్ దగ్గర ఎలా ఉండాలో సమీర్‍కి వివరిస్తాడు. తాను నటించబోయే పాత్రని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్తాడు. స్క్రిప్ట్ చదువుతున్నాననీ, అయినా పాత్ర పూర్తిగా అర్థం కావడం లేదని అంటాడు సమీర్. సినిమాలో హీరో పాత్ర నడవడిక గురించి, స్వభావం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. చివరగా ఆయన వెళ్ళబోతుంటే, ఆ ప్రాజెక్టులోంచి పాత హీరో ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసుకోవచ్చా అని సమీర్ ఆయనని అడుగుతాడు. అతనికి కథ అర్థం కాలేదనీ, అందుకే రజనీశ్ పొమ్మనకుండా పొగపెట్టాడనీ చెప్తాడు జహీర్. వెళ్ళేముందుగా ఆయన వెనక్కి తిరిగి హీరోయిన్ సారికని ఒకసారి కలవమని చెప్పి వెళ్ళిపోతాడు. – ఇక చదవండి.]
జో ఫోన్ చేస్తున్నాడు. ఆలోచనలు గుమిగూడుతున్నప్పుడూ, సరైన ఆలోచనలు రానప్పుడు, మనసు బొంగరంలా తిరుగుతున్నప్పుడు, గొంతు బొంగురుపోతున్నప్పుడు, జీవితం ఎందుకో రంగులు మారుతున్నట్లు అనిపించినప్పుడు ఒక ఆత్మీయుని మాట వినాలనిపించటం సహజం. ఎక్కడి నుండో, ఎక్కడికీ, ఎలాగో, ఇలా తన్నుకుంటూ వచ్చి ఇక్కడ వాలిన నాకు ఏం జరగనుందో అనే ఆందోళన సహజం.
“హలో”
“హలో టైగర్!”
ఇది మొదటిసారి వింటున్న టైటిల్.
“జో.. నాతో మామూలుగా మాట్లాడు. ప్లీజ్.”
“ప్రేమ పొంగి అలా అన్నాను. ఎలా ఉన్నావు?”
“బాగున్నాను. సంగతులు తెలిసాయా?”
“ఓ! ఇది నీకు కాదు, గోవాకి సంబరం.”
“భయంగా ఉంది జో.”
“నో. మనం భయపడేవాళ్ళల్లో కాదు, భయపెట్టేవాళ్ళల్లో ఉంటాం. నీలో లేనిది, ఎవరిలో ఉన్నది నాకు చూపించు. నా గిటార్‍ని పగలగొట్టి, మ్యూజిక్‍కి స్వస్తి చెబుతాను.”
“జో..”
“యస్?”
“ఎలా ఉన్నావు?”
“..”
“యస్?”
అతను భావుకుడైనట్లు తెలుస్తోంది.
“జో..”
తేరుకున్నట్లున్నాడు.
“సమీర్, నేను గిటార్ వాయిస్తే నువ్వు డబ్బాల మీద కొట్టేవాడివి.”
“అవును”
“నేను గిటార్ వాయించి, నీ బల్ల మీద కూర్చుని నేనే కొడతున్నాను.”
“ఓ. గిటార్, డ్రమ్స్ రెండూ అక్కడే కూర్చుని వాయించవచ్చు కదా?”
“నువ్వు ఎలా వాయిస్తావో నేను అలా వాయించాలి కదా?”
“ఓ. బన్ తిని పడుకుంటున్నావా లేక కడుపునిండా తింటున్నావా లేదా?”
“జో గురించి ఆలోచన అక్కరలేదు. నీ సంగతి చెప్పు. నీ బొమ్మ ఎప్పుడు చూపిస్తావు?”
“చాలా టైం పడుతుంది. సంతకాలు పెట్టమన్న చోట పెట్టాను.”
“నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అన్నింటికీ అదే ప్రధానం.”
“ఏకంగా హీరో రోల్ వెయ్యాలంటే నమ్మకం కుదరటం లేదు.”
“హీరో ఏంటి? రోల్ ఏంటి? నువ్వు మొదటి నుండి హీరోవే. ఇప్పుడందరికీ అది తెలుస్తుంది. అంతే.”
“హీరోయిజమ్ కరెక్ట్! హీరోలా నటించటం కష్టమేమో! జో, ఇక్కడొక సమస్య ఉంది.”
“ఏంటది?”
“ఇప్పటికే ఇందులో కొంత పని చేస్తున్న హీరోని కాదని నన్ను తీసుకున్నారు.”
“అదే కదా సంచలన వార్త?”
“అది ఓకే. ఎవరిని కదిలించిన నా వెనుక గుసగుసలు. ఎవరూ ఎదురుగా వచ్చి మాట్లాడరు. వీళ్లతో కలసి ఎలా పని చేయాలో అర్థం కావటం లేదు!”
“రేయ్, స్టేజ్ మీద ఆర్కెస్ట్రా ఎలా ఉంటుందో చూసావా?”
“నువ్వే కదా చూపించావు చాలా సార్లు?”
“అది నడిపేవాడు అందరికీ వెన్ను చూపించాల్సిందే.”
“నా మాట వినే వాళ్లెవరు? నాకో బృందం ఏది?”
జో నవ్వాడు. నా స్నేహితుడు సహజంగా భావుకుడు. కానీ చాలా పనికొచ్చే స్నేహితుడు. నాలో ఏదో జారిపోతోందనిపించినప్పుడు తాను జారిపోయి క్రింద పడకుండా పట్టుకుని ఒక వేళ తను పడిపోబోతుంటే నేను పట్టుకోవాలనుకున్నప్పుడు ‘అక్కరలేదు, నాకేం కాదు’ అంటాడు. నవ్వు ఆపాడు.
“బృందం.. ఎవరిది? మనుషులదా? మనుషులతో ఎన్నడూ బృందాలు ఏర్పడవు. చాలా చరిత్ర గడచిపోయింది మనకి. నీకు ఎదురు తిరిగిన నీ జీవితాన్ని ఒకే ఒక్క తోపు తోసి నడుం మీద చెయ్యి పెట్టి ఎదిరించు. ఆలోచనలు జలపాతాలలా జాలువారుతాయి. నక్షత్రాలు చిన్నగా వంగుతాయి. రకరకాల దారులలో పారుతున్న నదులు ఒక దారికి వస్తాయి. నీలోని సింహ గర్జన సమాద్రాన్ని ఛేదిస్తుంది. నిదురిస్తున్న శక్తులన్నీ కలసి బృందగానాన్ని చేస్తాయి. అది నీకు కావలసిన జట్టు. స్వశక్తితో, ఆత్మబలంతో స్వతంత్రంగా నడవగలిగే ప్రతి మానవుడూ కొన్ని వేల బృందాలతో సమానం..”
“నీ మాటల వలన నాకు చాలా ధైర్యం వచ్చింది జో.”
“గుడ్. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మరో మాట..”
“యస్?”
“నువ్వు కొంకణి సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం.. ఇవన్నీ చాలా చదివావు. గిల్లితే చాలు, చాలా మాట్లాడగలవు.”
“అయితే?”
“అవకాశం దొరికింది కదా అని అందులోనివన్నీ వాళ్ళకీ, వీళ్లకి చెప్పటం మొదలు పెట్టవద్దు.”
“అర్థమైంది.”
“లెక్చర్లు ఎవరికి నచ్చవు. ఇష్టం ఉండవు.”
“ఎవరైనా వినాలనుకుంటే?”
“వద్దు. వాళ్లకీ చెప్పవద్దు.”
“ఎందుకని?”
“చెప్పండి అన్నవాడు నిజానికి నటిస్తాడు. వాడికి వినాలని వినాలని ఉండదు.”
“ఓ.”
“ఎవరైనా మాటిమాటికి అడిగినట్లయితే క్లుప్తంగా చెప్పు. సరిపోతుంది అనిపించినప్పుడు ఆపెయ్యి.”
“ఇంకా?”
“జోక్స్‌ని జోక్స్ గానే స్వీకరించు. నవ్వున్నది మాయా ప్రపంచం. నువ్వు జోక్స్ ఎన్నడు వేయటానికి వీలు లేదు.”
“నిజమే, స్క్రీన్ టెస్ట్ టైం లోనే అంతా అర్థమైంది. కావాలని నవ్వే వాళ్ళున్నారు.”
“అమ్మయిలున్నారా?”
“ఉన్నారు. ఎవరో తెలియదు. అలా గుమిగూడి గుడ్లగూబలలా చూస్తూ ఉంటారు.”
“ఎక్‌స్ట్రాలు.”
“అవును.”
“ఎక్‌స్ట్రాలను ఎన్నడూ పట్టించుకోకు. అవునూ, ఇంతకీ నీకు కావలసిన తిండి నీకు దొరుకుతోందా?”
“ఆ సమస్య లేదు.”
“నీకు ఏది కావాలో మొహమాటం లేకుండా చెప్పటం అలవాటు చేస్కో.”
“కరెక్ట్. మనకి అదే చేత కాదు.”
“అలవాటు చేస్కో, అది చాలా అవసరం.”
“అయిపోతుంది, టైం. అంతే.”
“మరో మాట.”
“యస్?”
“డైరెక్టర్‌తో మర్యాదగా ఉండు.”
“ఓకే.”
“ప్రస్తుతానికింతే. మళ్లీ మాట్లాడాతాను.”
జో ఫోన్ పెట్టేసాడు. డ్రైవర్ అప్పటికే వచ్చి నిలుచున్నాడు.
“ఏంటి?” అడిగాను.
“సార్, కార్ రెడీ.”
“దేనికి?”
“జుహు తీసుకొని వెళ్లమన్నారు.”
“జుహు దేనికి?”
“సారిక గారింటికి”
“ఓ. ఇప్పుడే వస్తాను.”
గబగబా రెడీ అయ్యాను. ఎందుకైనా మంచిదని కొద్దిగా పెర్‍ప్యూమ్ వాడాను.
కారెక్కాను. ముంబయి మహానగరంలో ఒక వి.ఐ.పి. ఒక అత్యాధునికమైన కారులో ఒక అతిలోక సుందరి వంటి హీరోయిన్ ఇంటికి వెడుతున్నాడు. కొన్ని కలలు నిజాలైనా కలలు గానే ఉంటాయి. కొన్ని నిజాలు కలలైతే బాగుండుననిపిస్తాయి. కొన్ని కలలు నిజాలు కాగానే మరల మరల ముందరికి రావాలనిపిస్తాయి. కొన్ని కలలు నిజాలు కాగానే సౌందర్యం కోల్పోతాయి. సారిక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. నేను పనికి రానంటుందా? పాత హీరోని వీళ్ళు వద్దన్నా ఈమె సినిమాని వదలలేదు. రజనీశ్ నన్ను చూపు చూడమని ఇక్కడికి పంపిస్తున్నాడా?
ఆలోచనలు ఎప్పుడూ బృందగానమే చేస్తూ ఉంటాయి. కాకపోతే శృతి తప్పుతూ ఉంటాయి. బయట ముంబయి నగరం యావత్తూ పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. నా జీవితం మరో పరుగుకై తనంతట తానే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.
(ఇంకా ఉంది)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.